కథలో జ్ఞాపకాలను ఏకరువు బెట్టడం వేరు. జ్ఞాపకాల ధారనే కధా నిర్మాణంగా చేపట్టడం వేరు. పాత్రల గతం నుంచి జ్ఞాపకాలను ఒలిచి ఆయా పాత్రలు నేరుగా narrator పాత్రకు వినిపించడం , మధ్య మధ్యలో narrator జోక్యం చేసుకుంటూ ఉండటం, ఆ జోక్యం ఆ నిర్దిష్ట దశలో పాఠకులకు వచ్చే సందేహాలనూ ఉత్సుకతనూ అద్దం పట్టడం — ఇదీ ఈ విధానపు ప్రత్యేకత.అలా అని ఇది ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ కీ, చైతన్య శ్రవంతి విధానానికీ చెందింది కాదు. ఆఫ్రో అమెరికన్ రచయిత్రులు వారి కథల్లో వారి జాతి చరిత్రకు చెందిన వివిధ ఘట్టాల చిత్రణ కోసం వాడిన పునర్జ్ఞాపకాల సమాహారం (rememory టెక్నిక్)కు దగ్గరగా ఉన్న టెక్నిక్. ఘటనల్నీ వాటి తాలూకు మనుషుల్నీ పేర్లనీ ముఖాలనీ తరచి తరచి గుర్తుచేసుకుని ఏకరువు పెట్టే విధానం టోనీ మారిసన్ మొదలుబెట్టింది.అక్కడి నుంచి ఎంతోమంది ఆఫ్రోఅమెరికెన్ కధా రచయిత్రులు ఆ రచనా విధానాన్ని వ్యాపింపజేశారు. June Jordan మాటల్లో ఇది ” turning the face of history to your face” అవుతుంది.
మనకు కూడా దళిత కథలలో తరచూ ఈ టెక్నిక్ కనబడుతుంది. ఎండపల్లి భారతి రాసిన’ ఎదారి బతుకులు’ కథల సంపుటిలోని చాలా కధలు ఈ నిర్మాణ పద్ధతిలో కనిపిస్తాయి.వాటిలో ఒకటీ రెండు కథల్ని పరిశీలించి ఈ కధా విధానాన్ని బయటికి తీద్దాం. తన కధల్నీ కధావిధానాన్నీ ఏకరువుపెడుతూ భారతి ఇలా అంది.”కంటికి కనిపించని ఎన్నో కష్టాలూ, ఇష్టాలూ ఉంటాయి.బయటికి చెప్పుకోలేని ఇష్టాలూ , వెతలూ కుంగదీస్తాయి మనిషినైనా,గుంపునైనా.ఆ గేపకాల గంటే ఈ కతలు” . గ్రామీణ పేద దళిత స్త్రీలు తమ రోజువారీ జీవితంలో తమ ‘జతగత్తెలతోనో బిడ్డలతోనో చుట్టాలతోనో ‘ పంచుకునే ఆ ‘గేపకాల’ సరళిలో ఈ కధలు రూపుదిద్దుకున్నాయి. ఆయా పాత్రలు తమ జీవితంలోని మలుపుల్ని గుర్తుతెచ్చుకునే పద్ధతే ఈ కథల నిర్మాణంగా అమరింది.
పల్లె దళిత స్త్రీల కోణం నుంచి, ‘కులాన్ని బట్టి,చదువును బట్టి, జరుగుబాటును బట్టి, నడవడికను బట్టి, రకరకాల ఒడిదుడుకుల్లో మన బతుకులు సాగిపోయే’ తీరును ఈ కధలు చిత్రిస్తాయి.’ నగవూ, ఏడుపు, కోపమూ తాపమూ, కుళ్ళబోత్తనమూ, కనికరమూ…ఇట్ల మనిషి బతుకులో ‘ అడుగుకొక మలుపు అంటుంది ఎండపల్లి భారతి.ఆ మలుపుల్ని గుర్తుకు తెచ్చుకోవటమే ఈమె దృష్టిలో కధానిర్మాణం.ఆ క్రమంలో చిత్తూరు జిల్లా పల్లె దళిత ‘బాస’ తో పలుకుబడితో, సామెతల్తో, నుడికారంతో, పల్లె పాటల్తో సాగుతుంది కథనం.
ఇందులో’ అవ్వ తలపులు’ అనే కధ ఉంది. అవ్వ పేరు లచ్చుమవ్వ.లచ్చుమవ్వ జ్ఞాపకాల్ని ,కధ చెప్పే దళిత బాలిక లచ్చుమవ్వ తనకెలా గుర్తు తెచ్చుకుంటూ చెప్పిందో పాఠకులకు చేరవేస్తుంది.తన యవ్వనంలో అందరి పల్లె దళిత పడుచుల్లా తానుకూడా రెడ్డి భూస్వాముల కామానికీ, క్రౌర్యానికీ , కుట్రలకీ , పెత్తనానికీ
ఎలా బలై పోయిందో గుర్తుచేసుకుంటూ చెబుతుంది లచ్చవ్వ.కధ చెప్పే నేరేటర్ లచ్చవ్వకు మనవరాలు. ఇద్దరూ తిరణాలకి పోతూ వుంటారు. వెళ్లే దారిలో కనిపించే ఒక్కక్క ప్రదేశాన్ని చూడటం, ఆ యాప్రదేశాల్లో తనకు గతంలో ఎదురైన అవమానకర ఘటనలతో పాటు, ఆనందకర ఘటనల్నీ జ్ఞాపకం చేసుకుని చెబుతుంది లచ్చవ్వ.అందులో భాగంగా ఆయా ఘటనలకు చెందిన పాత్రాల్నీ, వారి తీరుతెన్నుల్నీ, మాటల్నీ, చర్యల్నీ పూసగుచ్చినట్లు చెబుతుంది.
‘ఆ వయసులో గుద్దితే పగిలేటిగా వుండేదాన్ని లేమే’ అని తన యవ్వన దశలో తానెలావుందీ పరిచయం జేస్తుంది అవ్వ. ఇప్పటికీ ఒంటినిండా వెండినగలతో చిగురించిన చింతమానులా వుండే లచ్చుమవ్వను జూసి పల్లెలోని తనవాళ్ళు, ” ఏమే ముసిలీ, నీకేమి గుద్దలో గోరోజనం వుందేమే!” అని అంటారని మనవరాలు మనతో చెబుతుంది. దారిలో మొదటిగా కనిపించే చింతమానును చూసి చిన్నప్పుడు తన జతగాడయిన పుల్లిగాడు తననెలా ఉడికించి ఎడిపించేవాడో చెబుతుంది అవ్వ. ఆ తరవాత మొరంకయ్యకాడ కొచ్చినప్పుడు ఆ కయ్యలో రంగారెడ్డి తనని ఎన్ని తిప్పలుబెట్టిందీ, అతన్నుంచి తానెలా తప్పుకుందీ చెబుతుంది.పెళ్లమంటే భయపడే ఆ రెడ్డిని, “ఓప్పా , నీ కమ్మలూ వద్దూ , నువ్వూ వద్దు. ఇంకెబ్బుడు గాని ఇట్లా చేస్తే నీ పెండ్లానికి చెప్పేస్తా” అని దడిపించి తప్పించుకుంది.
అసలు ఘటన వరదారెడ్డి ఎదురైనప్పుడు గుర్తొస్తుంది.పచ్చి బాలింతగా ఉన్న లచ్చుమవ్వ మధ్యాన్నం పొలంపనినుంచి ఇంటికెళ్లి బిడ్డకు పాలిచ్చి తిరిగి పొలమొచ్చేటప్పుడు చేరుకుతోటలో కాపు కాసి తనమీద పడతాడు వరదారెడ్డి.’సామీ పచ్చిఒల్లు సామీ’ అని ఏడ్చినా వదలడు వరదారెడ్డి. పొలంలో జనం, ఏమయ్యిందే అట్టుండావని అడిగితే, ‘జారి పడిపోతిని’ అని చెబుతుంది బాధను దిగమింగి. ఆ తరవాత గడ్డి కోసేటప్పుడు బుచ్చన్న చేతిలో పరాభావం వివరిస్తుంది.
ఇలా ఈ కధంతా లచ్చుమవ్వ బతుకులోని జ్ఞాపకాల ధారగా పాఠకుల ముందుకొస్తుంది. ఎంతోమంది దళిత లచ్చుమవ్వల దుఃఖ చరిత్రను కళ్ళకు కడుతుంది.
కుట్టేవానికి మెట్టు కరువు, అనే కథలో కొండమ్మ జ్ఞాపకాలు కంటతడిపెట్టిస్తాయి. నిత్యం చెప్పులు కుట్టే తన పెనిమిటి తనకోసం చెప్పులు చేసుకుని ఊళ్ళోకేళితే రెడ్డి చేతిలో ఎదురైన పరాభవం బాధాకర జ్ఞాపకంగా మిగిలిపోతుంది కొండమ్మకి.’ మా ఇంటికాడికి మెట్లేసుకొని వస్తవురా మాదిగ నాకొడకా’ అన్న రెడ్డి మాట తనను టోలుస్తూ ఉంటుంది.తాను దగ్గరి బంధువులతో దాన్ని పంచుకోవటమే ఈ కధ. ‘తడిక తోసింది ఎవరు’ కథలో మరో అవ్వ మరో జ్ఞాపకాన్ని పంచుకుంటుంది.ఊళ్ళో రెడ్లు మాదిగల మీద దొంగతనం మోపి తమ మగ వాళ్ళను బట్టలిప్పి కొట్టిన వైనాన్నీ, ఆడవాళ్లు వెళ్లి విడిచి పెట్టమని విలపించిన తీరునీ, చివరికి ఎవరో నాయకుడొచ్చి విడిపించిన ఉదంతాన్నీ చెబుతుంది అవ్వ.” తడిక తోసింది ఎవర్రా అంటే ఆలి లేనోడే అంటారే , అట్ల ఎవురు తప్పు చేసినా మాదిగోళ్ల మిందికే వచ్చేది.ఏం చేసేది బుజ్జమ్మా, వాళ్లంతా రెడ్లు, మనం బయపడాల” అని కధ ముగించింది అవ్వ.
ఇలా నొక్కిపెట్టుకున్న అవమానాల్నీ అనుభవాల్నీ పరాభావాల్నీ జ్ఞాపకాలుగా వర్ణించి చెప్పే పద్ధతిని భారతి అలవోకగా వంటబట్టించుకుంది. చుట్టూ జనాన్ని కూర్చోబెట్టుకుని పాత్రలు చెప్పిన గతం తాలూకు కబుర్ల మూట గా ఈ కధా కథనం ఉంది.మొదలైన కథలోపలే మరోకధ మొదలయ్యే పేదరాసి పెద్దమ్మ కథల విధానమిది.
*
Add comment