కిటికీలో అతను

ఒకప్పుడు 
గదిలో ఉన్నంత సేపూ అతను 
నన్ను ఆకాశంగా  మార్చేవాడు 
కారు మేఘం లా కమ్మి
మెరుపుల్ని కాటుకలా దిద్ది 
ఇంద్ర ధనుస్సుని పైట గా బహూకరించి 
జల జలా కురిసే చినుకుల్ని 
బుగ్గలపై కెంపుల్లా అద్ది-
ఓహ్!
అతను నన్ను 
పూల మైదానంగా మార్చే వాడు 
సుతారంగా తాకిన చోటల్లా 
అతని పెదవుల పుప్పొడి- 
మేమిద్దరం ఒకరినొకరం 
పున్నాగ తీగలై అల్లుకున్న వేళ
మందహాసాల్లో విరిసిన మరుమల్లె లెన్నో- 
మా జిగిబిగి  బంధంలో 
చిక్కుకుని నలిగే శరీరాల దాపున  
వణికే నరాలెన్నో –
గదిలో ఉన్నంత సేపూ అతను 
నన్ను లాలించి
మైమరపించి  
మురిపించే వాడు 
ఇప్పుడతను-
గది దాటి 
మది దాటి 
ప్రేమైక హృది దాటి 
సైబర్ కిటికీ లో కూరుకు పోయేడు 
కిటికీ బయట- 
మొలిచిన
విషపు కోరల్లో
రక్తమోడుతూ 
వేళ్ళాడుతున్న 
నా హృదయం
అతనిలోని
రాక్షసుడు స్ఖలించిన
అచేతన
నిస్సహాయ
స్వప్నం
అతను నిష్కర్ష గా
విదిలించిన
అపురూప బంధం
చివరి ఆనవాలైనా
మిగలని
టెక్నాలజీ ప్రపంచం లో
“స్మార్ట్” ఫోనై
పరకాయ ప్రవేశించిన
అతనికి
మెరుపు మైదానాల్ని వీక్షించే నేత్రాలేవి?
మరుమల్లెల్ని  ఆఘ్రాణించే నిముషాలేవి?
అరచేతి 
స్వర్గం కోసం 
అంగలార్చే చోట  
మిగిలినవల్లా-
వెక్కిళ్లు తెల్లార్చే
నిద్ర లేని రాత్రుళ్లు  
తిప్పుకునే ముఖాల చాటున
మాటా మంతీలేని రోజులు 
ఇప్పుడు అతను-
గదిలోనూ లేడు 
మదిలోనూ  లేడు 
*

కె. గీత

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు