కళ్యాణం కమనీయం!

“గయ్స్, మీకందరికీ ఒక స్వీట్ న్యూస్!” అన్న వరుణ్ మాటలకి అప్పటివరకు సిజ్లింగ్ బ్రౌనిని కొంచెం కొంచెంగా ఆస్వాదిస్తూ తింటున్న నేను వరుణ్ వైపు తాపీగా చూసాను చెప్పబోయే విషయం ముందే అర్ధమైనట్టుగా. మరి క్లోజ్ ఫ్రెండ్సకు ఆమాత్రం విషయాలు మిగిలిన వారికంటే ముందే తెలుస్తాయి కదా.

మా లంచ్ గ్యాంగ్ మాత్రం ఏమైవుంటుందో అన్నటుగా వరుణ్ వైపు చూసారు.

“ఫైనల్లీ వీ ఆర్ గెట్టింగ్ మారీడ్!!” జాను చేతిని సుతారంగా పట్టుకుని చిరు దరహాసంతో అన్నాడు వరుణ్.

“వావ్!! ఇట్స్ ఆ బిగ్ న్యూస్!! కాంగ్రాట్యులేషన్స్ బ్రో!!”

“రేయ్ మామా! పార్టీ ఎక్కడా??”

“జాను నాకెప్పుడో తెలుసు మీఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అథర్ అని! దిల్కుష్ అయ్యింది పో!”

అలా గ్యాంగులో ప్రతిఒక్కరు తమకు తోచిన విధంగా అభినందిస్తుంటే వరుణ్ ఆకాశంలో చందమామలాగా వెలిగిపోతున్నాడు. ఆ చందమామలో దాగివున్న కుందేలు పిల్లలా జాను అతని సంతోష ప్రపంచంలో ఒదిగిపోయింది.

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే భలే ముచ్చటేసింది నాకు. ఇప్పుడనే కాదు, ఎప్పుడూ అలానే అనిపిస్తూవుంటుంది. బి.టెక్ రోజుల్లో చిగురించిన స్నేహం మాది. ఎప్పుడు,ఎలా కలిసామో గుర్తులేదు. కానీ బి.టెక్ పూర్తయ్యేసరికి ఒకరికొకరం బాగా అలవాటుపడిపోయాం. క్యాంపస్ సెలెక్షన్స్ పుణ్యమా అని ఒకే కంపెనీలో జాబ్స్ అవ్వడం వలన మా స్నేహం మరికాస్త బలపడింది.

అలా మా ముగ్గురి స్నేహం జాను,వరుణ్ ల నడుమ మొదట్లో ఇష్టంగా ఆ తరువాత ప్రేమగా పరిణితి చెందింది. వాళ్ళ ఇద్దరి ఇష్టాలు,అలవాట్లు ఒకేలా ఉండేవి. వాళ్ళ ప్రేమకి ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అంత భరోసా వాళ్ళపైన.అంతకన్నా ఎక్కువ నమ్మకం వాళ్ళ పెంపకంపైనా. ఇప్పుడు వాళ్ళ ఏడు ఏళ్ళ ప్రేమ ఏడు అడుగుల బంధంలా మారబోతోంది.

“మీకందరికీ ఇదే మా పెళ్లి ఆహ్వానం. అందరు మన గ్యాంగ్ వాట్సాప్ గ్రూప్ చూడండి” వరుణ్ మాటలకి ఆలోచనల సుడి నుండి ప్రస్తుతంలోకి తేరుకున్నాను. మొబైల్ స్క్రీన్ పైన ఆఫీస్ బడ్డిస్ గ్రూపులో మెసేజ్ అని కనిపించింది.

ఓపెన్ చేశా. జాహ్నవి వెడ్స్ వరుణ్ – ‘నాతి చరామి’ ఈ- వెడ్డింగ్ ఇన్విటేషన్ అని లింక్ ఉంది. ఈ మధ్యన ఈ-ఇన్విటేషన్స్ కొత్తేమి కాదు. లింక్ క్లిక్ చేసాను. ఇన్విటేషన్ బాగుంది. మొత్తం మూడు పేజీలు. మామూలు ఇన్విటేషన్ ఏ కదా అని అనుకునేంతలో చివరి పేజీలోని అక్షారాలు నా కంట పడ్డాయి.

‘మీ రాక మాకెంతో విలువైనది. మీ ఆశీస్సులు మాకు వెలకట్టలేని కానుకలు. మీ సంతృప్తి కోసం మాకు పెళ్లి కానుకలు ఇవ్వదలచినచో, మీకు తోచిన పద్ధతిలో ఈ క్రింది NGOలకు డొనేట్ చేయగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.’

‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరున రెండు NGO వెబ్సైట్స్ లింక్స్ ఉన్నాయి. చాలా అర్థవంతమైన ఆలోచనగా అనిపించింది. అందరూ కూడా వీరి ఆలోచనను మెచ్చుకున్నారు.

“మా ఈ కొత్త ప్రయత్నం అందరికి ఎలా చేరువవుతుందో అన్న ఒక అనుమానం ఉండేది. ఇప్పుడు మొత్తం గాయబ్. చాలా హ్యాపీగా వుంది. ఈ ఇన్విటేషన్ కేవలం టీజర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ హై!” రెట్టింపు ఉత్సహాంతో అన్నాడు వరుణ్.

అందరితో పాటు నేను కూడా వరుణ్ వైపు అర్థంకాన్నటు చూసా. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కొన్ని సీక్రెట్స్ తెలియవేమో.

“మిగతాది నేను చెప్తాను” అని జాను అందుకుంది. వాళ్ళ మనసులో ఉన్న ప్లాన్ చెప్పింది.

ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం.

“మరి ఇంట్లో దీనికి ఒప్పుకున్నారా?” నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ ఆతృతగా అడిగా.

“మా ప్రేమనైతే తేలికగా ఒప్పించగలిగాం కానీ ఈ ప్లాన్ ని ఒప్పించడానికి మాత్రం కొంచెం కష్టపడ్డాం. మొత్తానికి ఎలాగైతేనేం పెద్ద మనసు చేసి అందరూ ఒప్పుకున్నారు.”

“సూపర్ ఐడియా…టూ గుడ్!!” ఉత్సాహంగా అన్నాడు శ్రీధర్.

“ఆలోచన బాగుంది. మరి దీన్ని ఎలా అమలు చేద్దామని?” అడిగాడు ధీరజ్.

“ఇవన్నీ జరుగుతాయా? ఏదో సినిమాల్లో తప్పితే..” అనుమానంగా అన్నాడు రామ్.

“అవన్నీ సరే కానీ పెళ్ళికి డ్రెస్ కోడ్ ఏంటి? మెనులో  బొబ్బట్లూ , ఉలవచారు ఉన్నాయా?” ప్రీతీదేమో తిండిగోల.

“అమ్మో…ఎన్ని ప్రశ్నలో…వాటికి కొంచెం కళ్లెం వేయండి ప్లీజ్!! అన్నిటికి మా దగ్గర సమాధానాలు వున్నాయి. కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి వుంది. అసలు ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సహాయసహకారాలు మాకు కావాలి. ఇట్స్ ఔర్ సిన్సియర్ రిక్వెస్ట్!” అన్నాడు వరుణ్.

“ఓహ్! తప్పకుండా వీ ఆల్ ఆర్ రెడీ!!” ఒక్కసారిగా అందరం అన్నాం.

వరుణ్ ,జానుల ఆనందం మిన్నునంటింది అప్పుడు ఆ క్షణాన.

“పదండి పదండి..స్టేటస్ మీటింగ్ కు ప్రిపేర్ అవ్వాలి. వీళ్ళ పెళ్ళిసందడి ప్లాన్ ముచ్చట్లు మొదలుపెడితే ఇప్పట్లో తేలేది కాదు. ఈ వీకెండ్ తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం” అంటూ రామ్ తన చేతికున్న వాచ్ చూస్తూ లేచాడు. మాటల్లో పడి లంచ్ టైం అయిపోయిందన్న సంగతే మర్చిపోయాం. బద్దకంగా లేచి కాంటీన్ నుంచి బయలుదేరాం.

******************************************************************************

సరిగ్గా సాయంత్రం ఐందిటికి గంట కొట్టినట్టుగా నా డెస్క్ దగ్గరకి వచ్చింది జాను.

“కాఫీ బ్రేక్ ప్లీజ్!”

“కూర్చోవే కాబోయే పెళ్లికూతురా! నాతో మాటైనా చెప్పకుండా ఎంత పెద్ద ప్లాన్ వేశారు ఇద్దరు కలిసి…అమ్మ దొంగా!” ఆటపట్టిస్తున్నటుగా అడిగా.

“సారీ బేబీ ! మా ప్లాన్ వర్కౌట్ అవుతుందన్న నమ్మకం మొదట్లో మాకు అస్సలు లేదు. మన కొత్త రకం ఆలోచనలను పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటారో అన్న భయం. కొంచెం టైం తీసుకున్న మా దృక్పధాన్ని ఏకీభవించారు. వాళ్ళు ఓకే అన్నాకనే మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందుకే నీకు ముందుగా చెప్పలేదు” బుంగమూతి పెట్టి అంది.

“అదంతా సరే కానీ, ఎప్పుడు అనిపించింది ఇలా పెళ్లి చేసుకోవాలని?” జాను మాటల ప్రవాహానికి ఆనకట్ట వేస్తున్నటుగా అడిగింది మాన్సి. వరుణ్, నేను రేసైకిల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఇద్దామని మొదట్లో అనుకున్నాం. అసలు కార్డ్స్యే లేకుండా ఈ-ఇన్విటేషన్స్ అయితే ఇంకా బాగుంటుందనిపించింది. అవసరానికి కావలసినన్ని రేసైకిల్డ్ కార్డ్స్ ని మాత్రమే ఆర్డర్ చేసాం. అలా వెడ్డింగ్ కార్డ్స్ తో మొదలైన ఆ చిన్ని ఆలోచనే ఇవ్వాళ మీకు చెప్పిన వెడ్డింగ్ ప్లాన్.

“వ్వాహ్ ! వ్వాహ్! క్యా ఐడియా హై మేడంజీ…ఫిదా హోగయే హై హమ్” అన్నా. ముగ్గురం నవ్వుకున్నాం.

“బేబీ, ఇప్పుడైనా కాఫీకి వెల్దామా లేక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలాంటివి వున్నా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అంటూ చైర్లో కూర్చున్న నన్ను లేవదీసింది జాను. కాంటీన్లో కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు ఇంకాసేపు మాట్లాడుకున్నాం.

******************************************************************************

ఈ రోజుకి సరిగ్గా నెల రోజుల క్రితం వరుణ్ జాను తమ పెళ్లి శుభవార్త చెప్పిన రోజు. ఈ నెలన్నాళ్ళు ఎలా గడిచాయో గుర్తులేదు. ఆఫీస్ సమయం మినహా ఖాళీ సమయాల్లో వెడ్డింగ్ ప్లానెర్స్ మల్లె అందరం పెళ్లి పనులని చర్చించేవాళ్ళం. మీటింగ్స్, స్టేటస్ కాల్స్ అంటూ అదేదో పెద్ద ప్రోజెక్టులాగా మాకు టాస్క్స్ పురమాయించాడు రామ్. అతని సారథ్యంలోనే పెళ్లి ప్లానింగ్ మొత్తం చేసాం. పెళ్లి ఇంకో వారంలో వుంది. ఈరోజు చట్నీస్ లో వెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు వరుణ్, జాను.

బేషుగ్గా భోజనాలు ముగించాం.డెసర్ట్ రావడానికి ఇంకాస్త సమయం వుంది.

ఇంతలో, “వీళ్ళ వెడ్డింగ్ ప్లానింగ్ ఏమో కానీ, నేను మాత్రం ఈవెంట్ ప్లానింగ్ లో ఎక్స్పర్ట్ అయిపోయా…” అంటూ నవ్వాడు రామ్.

“అమ్మో రామ్! నువ్వుగాని మేనేజర్ అయితే నేను మాత్రం నీకింద పని చేయను” వాపోయింది ప్రీతి. అందరం నవ్వాము.

“మీ అందరి ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మీ అందరి సహాయమే లేకుంటే అనుకున్న పనులన్ని ఇంత త్వరగా పూర్తి అయ్యేవి కావు” అన్నాడు వరుణ్. జాను చెమ్మగిల్లిన కళ్ళు చెప్పకనే తన అంతరంగాన్ని వెలిబుచ్చాయి.

మా అందరి మాటల ప్రవాహం మరికాసేపు కొనసాగింది.

“హౌ ఆర్ యు ఫీలింగ్ జాను?” మాటల మధ్యలో అడిగా.

“ఇట్స్ మిక్స్డ్. చాలా హాపీగా ఉంది. అంతే టెన్షన్గా కూడా ఉంది”

“హ్మ్మ్ …”

“డోంట్ వర్రీ జాను! ఎవిరీథింగ్ విల్ బి ఫైన్” అనునయంగా అన్నాడు వరుణ్ జాను వైపు చూస్తూ.

“ఎక్కువ అలోచించి టెన్షన్ పడకే…చూడు మెహం ఎలా వాడిపోయిందో! అసలే పెళ్లి కూడా దగ్గరపడుతోంది” అన్నా.

“అప్పుడు ప్రీతి చేసే బ్రైడల్ మేకప్ టచ్ అప్స్ ఎక్కువైపోతాయి జాను. తరువాత మేము గుర్తుపట్టలేకపోతే మా తప్పు కాదు…ఆలోచించుకో” నవ్వుతూ అన్నాడు ధీరజ్.

ధీరజ్ వైవు గుర్రుగా చూసింది ప్రీతి. ఇంతలో మేము ఆర్డర్ చేసిన డెసర్ట్ రానే వచ్చింది. క్యారట్ హల్వా విత్ ఐస్ క్రీం తో బోలెడు నవ్వులను జత చేసి పార్టీని ముగించాము.

******************************************************************************

ట్రింగ్…ట్రింగ్…మొబైల్ మ్రోగింది. మగతగా దాని వైపు చూసా. మాన్సి కాలింగ్ అని కనిపించింది.

“హలో…” బద్దకంగా అన్నాను.

“హే రమ్య!! ౦1:౦౦కి నిన్ను పికప్ చేసుకుంటాను. రెడీగా వుండు”

నేను ఏదో చెప్పబోయేలోపే లైన్ కట్ అయ్యింది. బిజీగా ఉన్నటుంది. పెళ్లి ఫ్లవర్ డెకొరేషన్ మాన్సి ఒప్పుకుంది. హైదరాబాద్ శివార్లలో తనకు తెలిసిన రైతుల మార్కెట్ నుంచి పూలను తెప్పిస్తోంది. చెప్పినట్టే ౦1:౦౦ కల్లా వచ్చింది. ఇద్దరం లంచ్ కానిచ్చి కైలాష్ రిసోర్ట్స్కు చేరేటప్పటికి సాయంత్రం ౦4:౦౦ అయ్యింది.

హైదరాబాద్ నుండి సుమారు 50 కి.మీ దూరంలో వుంది కైలాష్ రిసార్ట్స్. కొబ్బరి తోటల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో వుంది అది. కార్ దిగగానే ఎక్కడినుంచో వస్తున్న పిల్లగాలులు మనసుకి స్వాంతనను తెచ్చాయి. చుట్టూరా కనుచూపుమేర వరకు వున్న పచ్చదనం నగరంలో కనుమరుగైన రంగునేదో పరిచయం చేసింది. అలా కాసేపు లాన్ లో తిరిగాను. మాన్సి కార్ పార్క్ చేసి వచ్చింది. ఇద్దరం కలిసి పెళ్లి మండపం వైపు నడిచాము. అక్కడ అప్పటికే మా గ్యాంగ్ మొత్తం హడావుడి చేస్తున్నారు. రిసార్ట్ సిబ్బంది చేత నేలపైన పరుపులు, కార్పెట్స్, షామియానాలు వేయిస్తున్నారు.

“హే రమ్య..రా. రా.. నీతో ఒక పని వుంది” నన్ను చూస్తూనే రామ్ హడావుడిగా వచ్చి ఏదో చెప్పబోయాడు.

“జానునీ కలిసి ఇప్పుడే వచ్చేస్తా… ” అని అక్కడ్నుంచి తుర్రుమన్నాను.

నేనెలాగో తప్పించుకున్నా కానీ మాన్సి రామ్ చేతిలో ఇరుక్కుపోయింది. మాన్సీకి కన్నుగీటి రిసార్ట్ రూమ్స్ వైపు నడిచా. సోఫాలో కూర్చుని ప్రీతి చేత మెహేంది పెట్టించుకుంటోంది జాను.

నన్ను చూస్తూనే, “హే బేబీ! ఏంటి ఇంత ఆలస్యంగానా రావడం?” బుంగమూతి పెట్టి లేవబోయింది. ప్రీతి మెహేంది చెరిగిపోతుందని వారించేసరికి సోఫాలో కూలబడింది.

“సో సారీ పెళ్లికూతురా! అన్నిపనులు పూర్తిచేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇప్పుడు వచేసాగా…” అన్నాను బుజ్జగిస్తూ.

జాను వాళ్ళ పేరెంట్స్ పెళ్లి పనులతో తలమునకలై వున్నారు. జాను వాళ్ళ దగ్గరి చుట్టాలు, వరుణ్ తరపు వాళ్ళందరూ రాత్రికల్లా వచ్చేస్తారని మాటల మధ్య తెలిసింది.

“జానూ ఇంతకీ నీ పెళ్లి చీర ఏదోయ్?” ఆత్రుతగా అడిగా.

“ఆ రెడ్ కలర్ బ్యాగులో వుంది చూడు.”

ఆ పెళ్లి చీరకు ఒక ప్రత్యేకత వుంది. దానికున్న వయసు సుమారు 70 సంవత్సరాలు. జానూ వాళ్ళ నాన్నమ్మగారి పెళ్లి నాటి తొమ్మిది గజాల కంచిపట్టు చీర. ముదురు ఆకుపచ్చ రంగుకు అతికినట్టున్న వెడల్పాటి జరీ బోర్డర్. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వుంది.

“ఎంత బావుందో!!” చీర మడతలను సవరిస్తూ అన్నా. “అవును బేబీ ! నాకెంతో ఇష్టమైన చీర ఇది. చిన్నప్పుడు నాన్నమ్మ ఎప్పుడు బీరువా తలుపు తెరిచినా, ఈ చీర కావాలని గొడవ చేసేదాన్ని. అందుకేనేమో అంత మందిమి మనుమరాళ్ళం వున్నా తన పెళ్లి చీర నాకే చెందాలని తన విల్లులో రాసింది. ఇది కట్టుకుంటే నాన్నమ్మ నన్ను ఆశీర్వదించినట్టే…” చెమర్చిన కళ్ళతో అంది జాను. అదే విధంగా పెళ్ళికి పెట్టుకోబోయే నగలు కూడా వాళ్ళ అమ్మ పెళ్లినాటివి. మర్చిపోయిన నిన్నటి జ్ఞపకాలను ఈ పెళ్లి ద్వారా గుర్తుచేసుకుంటూ ఆ క్షణాలను అనుభవించడంలోని అంతర్లీనమైన ఆనందం మాటల్లో చెప్పలేనిదేమో.

అలా మా మాటల ప్రవాహంలో సమయం గడిచిపోయింది. ఇంతలో మాన్సి కూడా వచ్చింది. జానుతో ఇంకాసేపు గడిపి ఆ తరువాత ఆ గ్యాంగ్ దగ్గరకు వెళ్ళాము.

చీకటి పడే సమయానికి ఇరుతరపు వారి రాక మొదలైంది. పెళ్లిసందడి ఇంకొంచెం ఊపందుకుంది. అనుకున్న విధంగా పెళ్లి పనులన్నీసజావుగా సాగిపోతున్నాయి. ముహూర్తానికి ఇంకొద్ది గంటలు మాత్రమే ఉంది.

మొబైల్ అలారమ్ ఉదయం ౦6:౩౦ చెవిలో జోరీగలా మ్రోగింది. ఎప్పటిలా కాకుండా ఈరోజు హుషారుగా లేచి కూర్చున్నా. నేను,ప్రీతి,మాన్సి ఒకే గదిలో పడుకున్నాం. మాన్సి ఇంకా నిద్రపోతోంది. ప్రీతి కనిపించలేదు. జానునీ రెడీ చేయడానికి వెళ్లినట్లుంది. లేచి కిటికీ దగ్గరకెళ్ళి నిలుచున్నాను. అలుపెరుగక ఎటు పరుగెడుతుందో తెలియని సిటీ వాతావరణానికి నేటి వేకువ కొంచెం కొత్తగా, మనసుకు హాయిగా తోచింది. అక్కడ్నుంచి చూస్తే ఆరుబయట వేసిన పెళ్లిపందిరి, షామియానాలు కనిపిస్తున్నాయి. హరివిల్లులోని రంగుల కలియక మల్లె వుంది పూల తోరణాలతో ముస్తాబైన పందిరి. వ్రేలాడే కొబ్బరి ఆకు తోరణాలు అప్పుడప్పుడు వీచే పిల్లగాలికి లయబద్దంగా ఊగుతున్నాయి. అలా వాటిని చూస్తూ ఉండిపోయా. కొంతసేపటికి మాన్సి నిద్రలేచింది. ఇద్దరం రెడీ అయ్యి జాను గదికి వెళ్ళాము.

పెళ్లి ముస్తాబులో భలే మెరిసిపోతోంది జాను. కూతుర్ని చూసి మురిసిపోతున్నారు జాను వాళ్ళ అమ్మ. కూతురి బుగ్గన చుక్కను పెట్టి కాసేపు తనివితీరా చూసుకుని ఎవరో తనని పిలిస్తే పరుగులాంటి నడకతో మండపం వైపు వెళ్లిపోయారు. పెళ్లిమండపం వద్ద జనాలు కొద్దీ కొద్దిగా పోగవుతున్నారు.

“హేయ్, ఇక్కడ చూడండి!!” అన్న ధీరజ్ గొంతుకి గదిలో ఉన్న మేము తన వైపు చూసాము.

క్లిక్…క్లిక్…క్లిక్…తన కెమెరాలో కొన్ని స్నాప్స్ తీసేసాడు.

“ముందే చెప్పొచ్చుగా…మంచి స్టిల్స్ ఇచ్చేవాళ్ళం…” అంది మాన్సి చీర సర్దుకుంటూ.

“హహ్హ.. తీస్తా…తీస్తా…కానీ, పెళ్లి అయినా తరువాతే” అంటూ ఇంకొన్ని స్నాప్స్ తీసి మిగతావాళ్ళని కవర్ చేయడానికి వెళ్ళిపోయాడు ధీరజ్. ఈ పెళ్ళికి విడియోగ్రాఫేర్ తనే మరి.

కాసేపటికి పెళ్లి తంతు మొదలైంది. వేదమంత్రాలు,శతకోటి దీవెనల నడుమ జాను వరుణ్ లు పెళ్లి ప్రమాణాలను అంతఃకరణశుద్దిగా ఆచరించారు. జీలకర్ర, బెల్లంతో ఒకటైయ్యారు. బంధుమిత్రుల సాక్షిగా భాజాభజంత్రీల నడుమ వరుణ్ జాను మెడలో మూడు ముళ్ళు వేసాడు. ఏడడుగులు కలిసి నడిచారు. ఆ క్షణాన అందరి ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. నవదంపతుల కోరిక మేరకు వచ్చినవారు తమ విరాళాలను వధూవరులకిచ్చి వారి ఉన్నతమైన ఆలోచనని అభినందించారు.

పెళ్ళికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి అక్కడ్నుంచి భోజనాలకు డైనింగ్ హాల్ వైపు వెళ్తున్నారు. భోజనాలను ఎప్పటిలా బఫెట్ లా కాకుండా పాత పద్ధతిలో బంతులవారీగా అరెంజ్ చేశారు. ప్లేట్స్ ,గ్లాస్సెస్ మొదలుకుని ఇతరత్రా వాటిల్లో ప్లాస్టిక్ వాడకం ఎక్కడా లేకుండా కేటరింగ్ ప్లానింగ్ అంతా రామ్ దగ్గరుండి చూసుకున్నాడు. భోజనాలు పసందుగా ఉన్నాయి. ఐటమ్స్ మరీ తక్కువ కాకుండా, అలాగని ఎక్కువ లేకుండా విస్తరికి సరిపడేట్లు వున్నాయి. చాలా రోజుల తరువాత ఒక కమ్మటి విందు తిన్నాననిపించింది. అదీ బంతి భోజనాలలో.

భోజనాలు ముగిశాక వచ్చినవారికి తాంబూల కానుకలను పేపర్ బ్యాగ్సలో అందచేశారు. కాసేపటికి పెళ్ళికి వచ్చిన వారంతా ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. మా గ్యాంగ్ మరియు ఇరుతరపున ముఖ్యమైన వారు మాత్రం మిగిలి వున్నాం. లాన్ లో అందరం రిలాక్స్డ్ గా కూర్చుని వున్నాము.

“వరుణ్ ! క్యాటరర్ గోవిందు లైన్లో ఉన్నాడు. నీతో మాట్లాడాలట” అంటూ తన మొబైల్ ను వరుణ్ చేతికందించాడు రామ్.”వరుణ్ బాబు! మీరు చెప్పినట్లుగానే మిగిలిన భోజనాలను కరుణ వృద్ధాశ్రమానికి పంపాము. దానితో పాటు ఎక్స్ట్రా 100 ప్లేట్స్ భోజనాన్ని కూడా పంపించాము. మా కేటరింగ్ తరపున మీ పెళ్లి కానుక. మా ఆశీషులు సదా మీకు ఉంటాయి.”

వరుణ్ గొంతులో ఏదో అడ్డుకున్నట్లు అనిపించింది కాబోలు, నోట మాట పెగల్లేదు. ఒక మంచి పని ఎటువంటి ప్రమేయం లేకుండా నలుగురికీ చేరువవుతుంది అంటారు, ఇదేనేమో.

కాసేపటికి వరుణ్. జానుల కుటుంబాలు యాదగిరి నరసింహ స్వామి దర్శనార్థం బయలుదేరారు.

రిసార్ట్ సిబ్బంది పెళ్ళికి తెచ్చిన షామియానాలు, పరుపులు లారీలోకి ఎక్కిస్తున్నారు. మరికొంతమంది వాడుముఖం పట్టిన పూల తోరణాలను దారం నుండి విడదీస్తున్నారు. వాటిని మేము మొక్కలు పెంచుకునే మా కాలనీ వాళ్లకు ఇవ్వబోతున్నాం. చెత్తకుప్పలో వృధాగా పారేయకుండా వాటిని ఎరువులాగా వాడుకోవచ్చునని ఈ మధ్యే నేను తెలుసుకున్న కొత్త విషయం.

ఇక సెలవన్నట్టుగా ఆకాశంలో సూర్యుడు నారింజ రంగులో అస్తమించడానికి సిద్ధంగా వున్నాడు. కాసేపటికి మేమంతా కూడా బయలుదేరాం. మాన్సి నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది. పెద్దగా ఆకలి అనిపించలేదు. ఫ్లాట్ డోర్ తెరచి బెడఁరూంలోకి వెళ్లి బెడ్ పైన పడుకున్నా. కంటి మీద నిద్ర ఎప్పుడు వాలిందో గుర్తులేదు. లేచేసరికి మరుసటి రోజు ప్రొదున్న 1౦:౩౦ అయ్యింది. లేచి ఫ్రెషప్ అయ్యి కాఫీ కలుపుకుని సోఫాలో న్యూస్ పేపర్ తిరగేస్తూ కూర్చున్నా.

అప్పుడు కనిపించింది టేబుల్ పైనున్న పేపర్ బ్యాగ్. పెళ్ళిలో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఓపెన్ చేశా. లోపల స్వీట్స్ బాక్స్ ,సీడ్ పేపర్ ,కాఫీ స్కర్బ్ వున్నాయి. ఆఫీస్ కాంటీన్ వాడి దగ్గర్నుండి ఫిల్టరుకు వాడగా మిగిలిన కాఫీపొడిని ఎండబెట్టి ఫేస్ స్కర్బ్ తయారు చేసాం నేనూ, ప్రీతీ. పేపర్ బ్యాగ్స్ చేసినప్పటి హడావుడి తలుచుకుని నవ్వొచ్చింది. ఒక్కసారిగా గత నెలన్నర జ్ఞ్యపకాలన్నీ కళ్ళముందు మెదిలాయి.

ఎస్! ఇట్ వస్ ఎ జీరో వేస్ట్ వెడ్డింగ్! సాలోచనగా అనుకున్నా. బ్యాగ్ లోని సీడ్ పేపర్నుతీసుకుని బాల్కనీ వైపు నడిచా, నా బుల్లి తోటలో నాటడానికి.

*

సుచిత్రా రెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు