జుత్పాల ఆకు

ఎందుకో మా అమ్మ మొండిది. ఎంత మొండిదో చెప్తానికి ఒక కథ చెప్పాలి.

నాకప్పుడు పది పన్నెండేంట్లుంటయేమో! ఒక్కపూట బళ్లు నడుస్తున్నయి. ఆ రోజెందులో ఇంట్ల ఎవ్వరులేరు. అమ్మ రేషన్ షాపుకో ఇంక దేనికో పోయింది. నేను చేతకాకుంటే అప్పటిదాంక పండుకొని పొద్దుగూకే టైమ్‌కి లేచిన.

కళ్లు తిరుగుతున్నట్టుండె. ఇంటి బయటికొచ్చి ఆ కొసనించి ఈ కొసదాంక ఎటుచూసినా అమ్మ కనిపియ్యలే. గనుమమీద కూసొని ఇగ వస్తదేమో, ఇగ వస్తదేమో అని చూస్తున్న. చిన్నగ చీకటి పడుతుందనంగ వచ్చింది.

“నీయమ్మ నాకు చాతనైతలేదు, నువ్వేడికి పోయినవే” అని అరిచిన.

“ఏమాయెరా! ఇట్లరా” అని దగ్గరికి పిలిచింది మా అమ్మ. నా ఒళ్లంత చెమటలు పడితే కొంగుతోటి తుడిచి, ఒక పొట్లంల ఇంత చక్కర తీసుకొని ఏదో మంత్రం చదివింది.

అట్ల ఎప్పుడు మంత్రం చదివినా మా అమ్మకు కండ్లల్ల నీళ్లొస్తయి, ఆగకుండ ఆవలింతలొస్తయి. సోంపో, చక్కరో.. మంత్రిచ్చింది ఏదో ఒకటి తినమంటది, అది తినంగనే ఏదో మ్యాజిక్ చేసినట్టు పావుగంటల ఏమున్నా నిమ్మలమయ్యేటిది. ఎట్లయితదో ఏమో తెల్వదుగానీ, అమ్మ దగ్గరికి ఎవలెవలో వచ్చి ఆ మంత్రం చదివిచ్చుకొని పొయ్యేటోళ్లు.

కానీ అమ్మ కండ్లల్ల నీళ్లొస్తుంటయిగా, “ఎవ్వలడిగినా ఎందుకు చేస్తవే?” అనడిగిన ఒకసారి ఇట్లనే.

“ఏమో వచ్చి అడుగుతున్నరు కదరా!” అనేటిది మా అమ్మ.

ఎప్పుడన్న ఏదన్న ఆపదొస్తే ఈళ్లంత వస్తరని అనుకునేటిది కూడా కాదు మా అమ్మ. అట్ల ఎప్పుడన్న ఆలోచిచ్చి ఉంటదనిగూడ నేననుకోను.

ఎందుకో మా అమ్మ మొండిది. ఎంత మొండిదో చెప్తానికి ఒక కథ చెప్పాలి.

మా నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడి ఇండ్లల్ల క్యాన్ల లెక్కకు పోసే పని చేస్తున్నడు కదా!

ఒక ఎండాకాలం నీళ్లు బాయిలోపటికి ఉన్నయని అండ్ల దిగితే కాలు జారి అందుల పడ్డడు. కాలు ఇరిగింది. పసరు కట్టు కడ్తరని ఒక ఊరికి పోయిన్రని ఒక కథల చెప్పిన. ఆ కథనే మా అమ్మ నించి చెప్త ఇప్పుడు.

అట్ల కొండ చెల్మ బాయిల పడి కాళ్లు ఇరగ్గొట్టుకొని ఇంట్ల పడ్డడు మా నాన్న.

“మరెట్ల చెయ్యాలె?” అని మా అమ్మ చానామందిని అడిగిందంట. ముప్పై నల్భై కిలోమీటర్లకి అవుతల ఒక ముసలాయ, ఇట్లనే బొక్కలు ఇరిగితే పసరు కట్టు కడ్తడని ఎవలో చెప్తే మా నాన్నని బస్సుల ఎక్కిచ్చి ఆ ఊరికి తీసుకపోయిందంట మా అమ్మ.

ఇక్కడ పెద్దక్క, అన్ననేమో తెలిసినోళ్ల ఇంట్ల ఉన్నరు. నేను, చిన్నక్క అప్పటికింక పుట్టలే.

చూస్తే ఆ ముసలాయన కాడ ఎక్కడిలేని జనమంట. ఆడ్నే కూసొని నాన్న కాలు చూపిస్తే, “కట్టు కడదాంగానీ, చానా కావాలె జుత్పాలాకు. ఇక్కడ దగ్గరిపట్ల ఎక్కడలేదు” అన్నడంట ముసలాయన.

ఓరి దేవుడా! జుత్పాలాకు ఎక్కడ దొరకాలె?

ఆడున్నోళ్లందర్నడిగితే.. “ఈడ దగ్గర్ల ఏడ లేదే! మళ్లా నల్లగొండకే పోవాలె. గంధమోరి గూడంల దొరుకుతుండొచ్చు” అన్నరంట.

మా నాన్నని ఆడ్నే ఒదిలేసి నల్లగొండకొచ్చింది మా అమ్మ. నల్లగొండనుంచి గంధమోరి గూడానికి ఎట్ల పోవాలె? బస్సులుగిట్ల లేవు. ఎర్రటి ఎండ. చీకటి పడ్డదంటే మళ్ల కష్టం. ఆ ఎండలనే ఏడెనిమిది కిలోమీటర్లు నడ్షి, జుత్పాలాకు ఏరుకొని, గోనెసంచిల ఏస్కున్నదంట. కరాబు కాకుంట సంచికి నీళ్లు చల్లి అది భుజానికేసుకొని ఇంటికొచ్చింది.

నల్లగొండకి వస్తాలెకే చీకటయ్యింది. ఇగయ్యాల నల్లగొండలనే ఉండి, తెల్లారే మళ్ల బస్సెక్కి కట్టు కట్టేకాడికి పోయింది.

జుత్పాలాకు తీస్కొని పసరు కట్టు కట్టిండు ఆ ముసలాయన. వారానికోపాలి కట్టు మార్చాలన్నరంట. నల్లగొండకు తిరిగొచ్చుడు అయ్యేటిది కాదు. అదే ఊళ్ల ఉందామంటే అన్ని ఎవరిండ్లు ఆళ్లయేనాయె.

అప్పుడే ఆ బళ్ల టీచర్‌గ చేస్తాయన సెలవులని నల్లగొండకే పోతున్నడంట. ఆయనని ఎట్లనో గుర్తువట్టి, “గీ రెండు వారాలు కట్టు అయిపోయేదాంక ఉంటం” అనడిగితే రెండర్రలల్ల ఒక అర్ర ఇచ్చిండంట ఆ టీచర్.

ఆ ఊర్లనే, ఆ ఇంట్లనే రెండు నెలలు ఉన్నరు మా అమ్మ, మా నాన్న. ఫస్టుసారి కట్టు కట్టినప్పుడు, “గియే ఉన్నయే!” అని ముసలాయన చేతుల ఎంత పెడ్తే అంతే తీసుకున్నడంట.

“నా బిడ్డంత ఉన్నవు. ఎంతుంటే అంతనే ఇయ్యరాదే” అనేటోడంట. జుత్పాలాకు కోసంగూడ మళ్ల మళ్ల నల్లగొండకే పోకుండ, కట్టుగట్టించుకుంటానికి వచ్చినోళ్ల దగ్గర్నే ఇంత ఇంత తీసి కట్టేదంట ముసలాయన.

కట్టు మంచిగ అయిపోయినంక రెండు నెలలకు నల్లగొండల వచ్చి పడ్డరు.

మా నాన్న ఒక్కకాడ ఉండే మనిషా? కట్టు మానకముందల్నే “పని చేస్కోకుంటె ఎట్ల?” అని తిరిగిండంట.

అది కాలొక్కటే కాదుగదా, తుంటి బొక్కగూడ కొంచెం ఇరిగి ఉండె. మా నాన్న శెకలకి మొత్తం కాలే వంకరయ్యింది.

అట్ల అట్లనే కొన్నేండ్లు గడిచినయి.

సినిమా టాకీసుల పనిచేస్తున్న టైమ్‌ల.. “కుంటికాలికి బస్‌పాస్ ఇస్తరు.. తీస్కో మారయ్యా..” అని ఎవలో చెప్తే బస్‌పాస్‌కని పోయిండు మా నాన్న.

“బానే ఉన్నవుగా! నీకేమైనదని?” అని అరిచి డాక్టర్ సర్టిఫికెటు తెచ్చుకోమన్నరంట.

“అట్లనే..” అని ఈయన ఎక్స్‌రే తీపిస్తే, మొత్తం కాలే తీశేశే కథ అయితున్నదని చెప్పిండు డాక్టర్.

కాలు తీస్తే ఏమన్న ఉన్నదా? ఎవలో తెలిసినాయిన “నేను చూస్కుంటలేవే మొత్తం” అని హైదరాబాద్ తీస్కపోయి ఉస్మానియాల ఆపరేషన్ చెయ్యించిండు. అప్పటికి పెద్దక్కగూడ చిన్నపిల్లనేగానీ తోడు ఆమెనే తీస్కపోయిండంట నాన్న.

అమ్మకేమో రెండేండ్ల బిడ్డ (చిన్నక్క) తోడైతే.. కడుపుల నేనున్న. నెలలు నిండుతున్నయి అప్పుడే.

మా పెద్నాయన ఏడనో జువాల కాసే పనిల ఉన్నడంట. ఎవలో మా పెద్నాయనని, “బుద్ధున్నదావారీ? పెండ్లామా పిల్లలా నీకు, చిన్నపిల్లని పంపిస్తవ అంత దూరం? పోయి మీ తమ్మునికాడ ఉండుపో. పిల్లనిటు పంపియి” అన్నడంట.

ఇగ మా పెద్నాయన హైదరాబాద్‌ల పడితే, మా అక్క నల్లగొండల పడ్డది.

ఆళ్లు అక్కడ హైదరాబాద్‌ల ఉన్నరు, ఇక్కడ నల్లగొండల ముగ్గురు పిల్లలతోటి, నెలలు నిండిన మా అమ్మ. మేమప్పుడు రోశమ్మవ్వ ఇంట్ల కిరాయికి ఉంటుండె.

అదేం కాలమో ఎన్నడులేని వానలున్నయంట. కుంట తెగి, రోడ్డు మీదికి మనిషొస్తే కొట్కపొయ్యెటట్టు వరదలు.

ఊర్నించి మా నాన్న వాటా కింద బియ్యం వచ్చేటియి. అయి ఆసారి ఎందుకో రాలేదంట. ఇంట్ల బియ్యం లేవు. చక్కర, చాపత్తలుగూడ లేవు. పిల్లలేమో ఆకలంటున్నరు. మా అమ్మకైనా ఆకలి ఉంటదిగదా. పూట ఇడిస్తే ఇంకో పూట వాన పడ్తనే ఉన్నది.

జెరంత వాన తగ్గేదాంక చూసిందంట మా అమ్మ. సందులెమ్మటి పడుకుంట పొయ్యి తెలిసినోళ్ల షాపుల, “ఇంట్ల ఏం లేవమ్మ” అని బియ్యం, చక్కర, గిన్ని కూరగాయలు పట్టుకొని ఇంట్ల పడ్డదంట.

ఉన్న గింత ఇంట్ల ఎటు చూసినా టప్ టప్మని వాన చినుకులు పడ్తనే ఉన్నయంట. అప్పట్ల ఒక నవ్వార మంచముండేటిది మా ఇంట్ల. వాన కురవని కాడ ఆ మంచమేసి, ముగ్గురు పిల్లల్ని అందుల పండుకోబెట్టి దానిపక్కన కూసొని, “ఎప్పటికి ఆగే వానరా దేవుడా!” అనుకునేదంట మా అమ్మ.

ఎన్ని వారాలు మా నాన్న హైదరాబాద్‌ల ఉన్నడో, అన్ని వారాలూ రోజుగాకొకరోజు పడే వాన, ఉంటదో పోతదో తెల్వని కరెంటు, పిల్లలు, కడుపుల నన్ను పెట్టుకొని నల్లగొండల ఉన్నది మా అమ్మ.

మా నాన్న ఆపరేషన్ అయ్యింది. తిరిగొచ్చిండు. నేను పుట్టిన. శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గరికి వస్తమని మొక్కిన్రంట.

ఇయన్నీటికి నిలబడ్డదని మా అమ్మ మొండిదని చెప్పుడుగాదుగానీ,

నేను పుట్టిన పన్నెండో రోజో ఏమో, ఆళ్లింట్ల పెండ్లి ఉన్నదని ఇల్లు ఖాళీ చెయ్యమన్నదంట రోశమ్మవ్వ.

“ఇరవయ్యొక్కటిగూడ కాలే. రోజుల పిలగాడు. ఎట్ల పోతం?” అని అడిగిందంట. లేదు పోవాల్సిందేనన్నరంట.

“ఎహెయ్, ఎన్ని చూడలే ఇట్లాంటియి. ఇదొకటా?” అనుకున్నదంట మా అమ్మ. ఎప్పుడు ఏ పెద్ద ఆపదొచ్చినా ఇంతగూడ భయపడకుండ ఈ మాట అంటది. ఇందుకు మొండిది మా అమ్మ!

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలంగాణ యస లో రసీనా విదానం చాలా బాగా నాచినై. కథ లో నాకు ఎడురైనా చాలా సన్నీవేశశలు నా జివితం లో ఎదురైనవి . ధిస్తి తకినాపుడు చక్కెర మంత్రీచుడు, చెయి విరిగి నాపుడు పసారు కట్టు. నకు ఎధురైనా అనుభావలు. మారిని కథలను ఆషిస్తు. ఒక పటాకుడిని …!

  • మల్లి. నా మిత్రుడు, వర్ధమాన రచయిత.

    ఇతని కథలు చదువుతుంటే, అవి ఏవో కాలక్షేపం కథలనో, కల్పితాలనో అనిపించదు. అవన్నీ మన జీవితంలోని ఏదో ఒక అనుభవం. ఒక గడచిన సంఘటన, పదే పదే మనం వెనుదిరిగి చూసుకునే, మన పిలుపు కోసం చూడకుండా వచ్చి మనలో నిండిపోయే ఆ ఒక్క క్షణం! బహుశా, ఒక మంచి రచనకు ఉండవలసిన లక్షణం, ఒక రచయిత కోరుకోగల స్థానం అదేనేమో కదా.

    చదువుతున్నామన్న స్పృహ మనలో మిగిలి ఉన్నంత సేపూ; కథావస్తువు, శైలి, పాత్రా పరిచయం – బాగుంటే అది ఒక మంచి కథగా మనసులో నిలిచిపోతుంది. బాగలేదనుకుంటే, మన మస్తిష్కంలోనుండీ మాసిపోతుంది. ఎలాగున్నా కేవలం కథగానే మిగిలిపోతుంది.

    ఏదైతే అంతకు పైకెదిగి, పాఠకుడికి అనుభవంగా మారుతుందో, పాత్రలు మాయమై చదువరి స్వయంగా ఆ కథాసమయంలో తనను తానే పొందుతాడో, ఏ అనుభూతి సజీవమై తనలో నిండుతుందో, అది మాత్రం ఒక మిత్రుడై, హితుడై వెంట నడుస్తుంది. వెంటుండి నడిపిస్తుంది.

    మా మల్లి ఆ కోవకు చెందిన రచయితేనని, తను పరిచయం చేస్తున్న ప్రతి కథతోనూ మరింతగా, మరెంతగానో ఎదుగుతున్నాడని నా నమ్మకం. అతని ఎదుగుదలకు కొలబద్ద కూడా తానే అవాలని, ఆస్థాయికి అతి త్వరలో చేరాలని నా కోరిక.

  • దీనినే పంచదార శైలి అంటారు. ఒక పక్క కళ్లకు కట్టినట్టు జరిగినది చూపిస్తూనే, పాఠకుడి యెద లోతులను తడుముతాడు రచయిత. ఎప్పటిలాగానే అద్భుతమైన రచన మల్లన్నా!!!

  • కష్టాన్ని ని ఎదురుకునే మొండితనం…అమ్మ 👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు