చివరి మెట్రో

బాగా వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడో.. కిటికీలోంచి బయటకు చూస్తూ హైవే మీద వెళ్లిపోతూ ఉండే బండ్లను గమనిస్తూ వాటిని లెక్కబెడుతూ ఉండేవాడ్ని. కాలేజీలో ఉన్నప్పుడు ఇది.

’ఈ వర్షం తగ్గాక ఇంటికెలా పోతాం’ అన్న ఆలోచన ఉండేది కాదు.

ఆ కొస నుంచి ఈ కొసవరకు సెకండ్లలో వెళ్లిపోయేది ఒక్కో బండి. అంత పెద్ద రోడ్డు ఒక్కోసారి సెకండ్ల తరబడి ఖాళీగా ఉండేది. అలాంటి ఖాళీ సెకండ్లు లెక్కబెడుతున్నప్పుడు సడెన్‌గా వెళ్లిపోయే, వర్షం మధ్యలోంచి వచ్చినట్టుండే ఒక కారును ఇవ్వాళ ఈ పొద్దున తల్చుకొని, ఆ వర్షానివో, ఆ కారువో నువ్వై ఉంటావనుకుంటా.

ఆదివారం రోజు పొద్దున పూట కూరగాయల మార్కెట్ పోగయ్యే చోటు నుంచి ఆటోలో వెళ్తూ, తలంతా బయటకు పెట్టి చూస్తుంటా. ఏ కూరగాయల బండి మీద నీ చెయ్యి ఉంటుందా అని వెతుక్కుంటాను.

నేనెప్పుడైనా నీకొక వాక్యం రాయడం సరిగ్గా గమనించావా?

’నీ గురించి ఆలోచిస్తాను’. ’వెతుక్కుంటాను’. ’రమ్మని పిలుస్తాను’… జరిగిపోయినవి కూడా ఇలా రాస్తాను చూశావా! ఇంకా ఏ పనీ మొదలుపెట్టనట్టు, నిన్ను ప్రేమించడం నాకు అక్కణ్నుంచి చెప్పడం ఇష్టం. వెళ్లి అక్కణ్నుంచి ఇవన్నీ చేస్తానని చెప్పడం ఇష్టం.

హాస్టల్‌లో తినడానికేం లేదంటే, మధ్యాహ్నం ఆర్డర్ పెడుతున్నా. ఇలాంటి యాప్స్ ఉన్నాయని నాకు పరిచయం చేసిందే నువ్వని గుర్తొస్తుంది. రోజుకొక ఐటమ్ ఆర్డర్ చేసేదానివని, ఒకరోజు చాయ్ బాక్స్ కూడా చేశానని చెప్తావు. నాకు ఇదంతా గుర్తొచ్చిన్నప్పుడు ఎక్కడున్నా నిన్ను చూడాలని ఉంటుంది. వెతుక్కుంటూ రావాలని ఉంటుంది.

నువ్వు ఇక్కడెక్కడో ఉండవని తెలిసినప్పుడు ఎక్కడో ఆగిపోయి, దేనిగురించో ఆలోచిస్తుంటాను. దగ్గర్లోని కేఫ్‌కి వెళ్లి ఒక చాయ్ తాగుతుంటాను. పైనించి మెట్రో రయ్యని వెళ్లిపోతుంటుంది. సరిగ్గా ఆ ఖైరతాబాద్ సర్వీ నుంచి, వర్షం పడుతున్న సాయంత్రమో, మబ్బులు కమ్ముకున్న ఉదయమో ఆ మెట్రోను నీకు చూపించాలని ఉంటుంది.

ఆ తర్వాత ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి, హాస్టల్ మెస్ నుంచి, జేఎన్టీయూ మెట్రో స్టాప్ పక్కనే ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ నుంచి, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ నుంచి, అమీర్‌పేట్‌లో ఇంకా జనాలెవ్వరూ లేవని టైమ్‌లో మనం చూసే మెట్రోనే, జనాలున్న టైమ్‌కి ఎలా ఉంటుందో నేను చూడటం గురించి… ఇవన్నీ నీకు చూపించాలని ఉంటుంది.

ఖైరతాబాద్ దగ్గర మెట్రో కోసం ఎదురుచూస్తుంటే ఎదురెదురుగా వచ్చి ఆగిన మెట్రో రైళ్లను చూసినప్పుడు నీకు ఏమాత్రం సంబంధం లేకున్నా నీకది చూపించాలని ఉంటుంది. నువ్వు లేకుండా ఉండుంటే నేనివన్నీ ఎలా చూసేవాడినా అని ఆలోచిస్తా.

ఇవి చెప్పుకోవడానికి నువ్వు ఉంటావన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ, నువ్వు లేవంటే మాత్రం ఏడుపొస్తోంది ఎందుకో!

ఇవన్నీ కనిపించని ప్రదేశాలకు పారిపోవాలని ఉంటుంది. నేను పారిపోబోతే నీ దగ్గరికి వస్తానని నాకు తెలుసు.

నిన్ను కలిసివెళ్లిన ఒకరోజు పదిన్నరకు మెస్‌లో కూర్చొని, తింటూ, చివరి మెట్రో వెళ్లిపోతుంటే, ’ఆ వెళ్లిపోతున్న చివరి మెట్రో నువ్వనుకుంటా’ అని నీతో అన్నాను గుర్తుందా? ఇవ్వాళ ఏ చివర్నించి చూసినా, ఆ వెళ్లిపోతున్న మెట్రోవి నువ్వనిపిస్తుంది.

రేప్పొద్దున్న ఈ కొత్త లైన్ కూడా లాంచ్ అయ్యాక, మనం నడిచెళ్లే దార్లో ఆగి చాయ్ తాగుతాం కదా, అక్కణ్నుంచి; నువ్వు నన్ను దింపి వెళ్లిపోతే నేను చాయ్ తాగే చోటుంది కదా, అక్కణ్నుంచి; నాకెదురుగా కూర్చొని నువ్వు కబుర్లు చెప్పే ఈ దార్లోని లెక్కలేనన్ని టీ షాపులున్నాయి కదా, అక్కణ్నుంచి.. ఇన్నిన్ని చోట్ల మెట్రో వెళ్లిపోతుంటే, ఆ ప్రతి మెట్రోవి నువ్వని అనుకుంటా.

ఎప్పుడైనా సాహసం చేసి, ఎగిరి నీ ముందుకొచ్చి ఆగుతాను.

నేనని గుర్తుపట్టి ఆగుతావా, బేబీ?

*

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు