చిక్కని పులి

పులి.. పులి.. ఆమ్మో పులి.. పులి..అని అరుస్తూ వొళ్ళంతా చెమటలు పట్టగా తానూ నుంచున్న చోటే కూలబడి పోయింది ముషిని శ్రీనివాసరావు గారి భార్య  సావిత్రి.

ఇంట్లో గళ్ళలుంగీ కట్ బనీనుతో వున్న  ముషిని బయటకు వొచ్చి ముందు వాళ్లావిడని ,తరువాత పులిని చూసి మనిషి అలాగ కర్ర లాగుండిపోయాడు.

పులి ..ఆ వీధిలైటు కింద దర్జాగా మహారాజా లాగ కూర్చుంది.

పైన వీధిలైటు చుట్టూ రకరకాల పురుగులు.

వీళ్ళ పక్క పోర్షన్ లో సాంబమూర్తి గారుంటారు.  అప్పుడే స్నానం చేసి వొచ్చిన ఆయన తాను ఎప్పుడూ తాగే కింగ్ సైజ్ సిగరెట్టు కాల్చుకుందుకు బయటకు వొచ్చాడు.

అగ్గిపుల్ల గీసి ఎదురుగా వున్న దృశ్యం చూసి ఆయన కూడా అలా ఉండి పోయి ఆ పుల్ల ఆర్పడం మర్చిపోయాడు.

ఈలోగా పోర్టు లో పనిచేస్తూ.. రియల్ ఎస్టేటు కూడా చేస్తున్న రాయుడు సత్యనారాయణ గారు ఆదరాబాదరాగా పురుషోత్తపురం నుంచి చేతక్ స్కూటర్ మీద వేగంగా వొస్తూ పులి ముండను చూసి బండి హేండిల్ వొదిలేసారు.

దాంతో దేక్కుంటా పోయిన ఆ చేతక్ బండి పెద్ద సౌండు చేస్తూ రోడ్డు దిగువకు పడిపోయింది.

సత్యనారాయణ గారు రోడ్డు మీద పడిపోయారు. ఈ శబ్దానికి కూర్చున్న పులి కాస్తా లేచి ఒక్కసారిగా ‘ గుర్ర్ ..గుర్ .. ‘ మని చాలా గట్టిగా అరిచింది.

కాలనీలో అప్పుడప్పుడే ఇంటింటికి కేబుల్  కనెక్షన్లు బిగిస్తున్న బక్క రాజు భుజాల మీద నల్లని వైరు వేసుకొని జేబులో కటింగ్ బ్లేరుతో యెన్ ఏ డి కాలనీ నుంచి నడుచుకుంటూ వొస్తున్నవాడు కాస్తా నుంచున్న పులిని చూసి అలాగుండిపోయేడు.

పేరు రాజు గాని పిట్టంత మనిషి.   కాస్తుంటే పులికి పలారం అయిపోయేవాడు.

అది రాజునే చూస్తుంది. రాజు ప్యాంటు తడిచిపోయిందో లేదో ఆ చీకట్లో చెప్పడం కష్టం.

ఇంతలో ..చటుక్కున ఇంటి లోపలికి వెళ్లి అంతే వేగంగా తన లైసెన్సుడు తుపాకీతో  బయటకు వొచ్చిన సాంబమూర్తి గారు గాలిలోకి ఒక  రౌండు పేల్చారు.

ఆ శబ్దానికి కూర్చున్నది కాస్తా అది ఉలిక్కిపడి లేచింది.

ఒక్కసారి పేల్చిన వైపు చూసిన పులి  వేగంగా దక్షిణం వైపు వున్న చీకటి తుప్పల వైపు గెంతి అంతే వేగంగా మాయమైపోయింది.

ఆ తుప్పల వెనకాల,గెడ్డలు, గెడ్డల వెనకాల మామిడి తోటలు, వాటి వెనకాల జీడి తోటలు, వాటి వెనక ఎత్తైన ఆకాశాన్ని తాకేంత పెద్ద కొండ.

అదంతా చీకటి,కళ్లకింద  కాటుక అంత చీకటి, కళ్ళు చించుకున్నా కనపడని చీకటి.

పులి ఆ చీకట్లో నక్కి వుందో..లేదా కొండల్లోకి నడుచుకుంటూ పోయిందో తెలీని పరిస్థితి.

ఇంతా చేసి రాత్రి ఎనిమిది కూడా కాలేదు, ఇంకా కొన్ని ఇళ్లల్లో వంటలు అవుతున్నాయి, కొందరు స్నానాలు చేస్తున్నారు, ప్రయివేటు స్కూలు పిల్లలు హోమ్ వర్కులు చేస్తున్నారు,ఇంతలో ఇంత పనైపోయింది.

ముందుగా సాంబమూర్తి  ధైర్యం చేసి గన్నుతో సహా ఇంటి గేటు తోసుకొని  బయటకు వొచ్చారు.

ముషిని శ్రీనివాసరావు లుంగీ గట్టిగా కట్టుకొని నిలబడ్డారు. వాళ్ళావిడ కొద్దిగా మంచినీళ్లు తాగి కుదుట పడింది.

రాయుడు సత్యనారాయనని ఇంకెవరో లేపారు. స్కూటర్ స్టాండ్ వేసి నిలబెట్టారు.  కేబుల్ రాజుని ఎవరూ పట్టించుకోలేదు, కాసేపటికి వాడే తేరుకొని మెల్లగా సాంబమూర్తి దగ్గరకు వొచ్చి ఆ గన్నువంకే చూడటం మొదలుపెట్టాడు.

కొండలనానుకొని వున్న ఆ కాలనీలో అక్కడక్కడా ఇల్లు ఉంటాయి.

మట్టిరోడ్లు..రోడ్డుకు అటూ ఇటూ తుప్పలు.అక్కడక్కడా మిణుకుమనే వీధిలైట్లు.

ఆ కాలనీలో వుండేవాళ్ళందరూ  రకరకాల ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులు.

దాదాపు అందరివీ సొంతిల్లులే. సాంబమూర్తి మాత్రం  అద్దె ఇంట్లో వుంటున్నారు.

కొంత సేపటికి జనం బాగా పోగయ్యారు, అందరికీ ఒకే ప్రశ్న.

పులిని సరైన సమయానికి తరిమేశారు గాని ఈయన దగ్గరకు ఆ గన్నుఎలా వొచ్చింది.?

అది లైసెన్సుడు గన్నా ? లేకపోతే మామ్మూలుగానే గన్ను మైంటైన్ చేస్తున్నాడా ?

*   *   *

‘నీకు తెలీదా ఆయన  ఇంతకు ముందు నక్సలైట్లలో వుండే వాడు, అందుకే ఆయన దగ్గర గన్నుంది’ అన్నాడు కోదండం కేబుల్ రాజుతో.

‘ ఇది ఆ గన్నేనంటావా ..అంటే అప్పుడు అడవుల్లో వాడింది ?’ అడిగాడు రాజు.

‘ ఒరే నీ యవ్వ .. అది తీసుకురానిస్తార్రా, ఆయన గన్నుతోనే లొంగిపోయాడు, ఇది వేరే గన్ను అయ్యుంటుంది.’

‘ అరే.. కాలనీలోకి పులొచ్చింది కదా, మనం కూడా ఒక గన్ను కొనుక్కుందాం రా ‘

ఆ వెళ్లరా వెళ్ళు.. పూర్ణామార్కెట్టు కాడ అమ్ముతున్నారట వెళ్లి  కొనుక్కురా .. ఫో..  బే ‘ చిరాకుపడ్డాడు కోదండ.

‘ ఒరే ముందు మీ ఇంట్లో  పంగళి కర్ర ఉందా ఇంట్లో ? విజిల్ ఉందా ? అవెక్కడ పెట్టావో చూడు ముందు , పులొచ్చే సమయానికి అవి వెతుక్కుంటూ కూర్చుంటావు’కోదండ తిట్టాడు.

అప్పటికి కాలనీలో దొంగలు పడుతున్నారని కాలనీ కమిటీ వాళ్ళు ఇంటింటికి కర్రలు, విజిల్సు పంచారు.

అందరూ కాసేపు అక్కడే కాలక్షేపం చేసి, పులి ఇక వెనక్కు రాదని నిర్ణయించుకొని, ఎవరిళ్ళకు వాళ్ళు పోయారు.

కొన్నాళ్ళు పులి భయం కాలనీ జనాల్ని ఒక విధంగా వెంటాడింది.

సాయంత్రం ఆరయితే చాలు ఇళ్లనుంచి ఎవరూ బయటకు వొచ్చే వారు కాదు.

ఇంటి గుమ్మాల ముందు లైటు వేయని వాళ్ళు కూడా వేసుకొని, దొడ్డేపు కూడా లైట్లు వేసి  తెల్లార్లూ వుంచేస్తున్నారు.

బాత్రూములు  ఇంటి బయట ఉండటంతో అర్ధరాత్రి బయటకు వెళ్లాలంటే భయపడి చేస్తున్నారు.  పెద్దాళ్ళయితే ఆపుకుంటారు, పిల్లల్ని ఆపుకోమని చెప్పలేరు కదా, దాంతో వాళ్ళను కిటికీ దగ్గర నిలబెట్టి ‘ వూ.. పొయ్యి ‘ అని గదమాయిస్తూ విసుక్కుంటున్నారు.

అలా కొన్నాళ్ళు గడిచాక మెల్లగా జనానికి పులి భయం తగ్గింది.

ఈ లోగా పగలంతా ఇంటింటికి కేబుల్ కనెక్షన్లు పెంచుకుంటూ పోయాడు రాజు.

సాయంత్రమైతే చాలు సినిమాలు వేయడం మొదలుపెట్టేవాడు, జనం ఇక ఆ సినిమాలు చూసుకుంటూ  బయటకు వొచ్చేవారు కాదు.

అలా మెల్లగా పులెళ్ళిపోయి ఆ కాలనీలోకి కేబుల్ పులి దిగింది.

*   *  *

‘మేడం మొత్తం ఇటు ఎనిమిది అటు ఎనిమిది పదహారు సైట్లు మేడం, ఆ కొంచెం బిట్టు వుడా లే అవుట్ కాదు కానీ రైతుల దగ్గర కొన్నట్టు పక్కా దస్తావేజులు వున్నాయి , రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది, అందరం రిటైర్ అయిపోయాం మేడం’

‘ఇప్పుడీ దొంగ నా కొడుకు వొచ్చి నకిలీ డాక్యుమెంట్లు పుట్టిచ్చి, మాకు స్థలం అమ్మిన రైతుని  కులం పేరుతో తనవైపు తిప్పుకొని మమ్మల్ని పుర్రాకులు పట్టిస్తున్నాడు మేడం ‘ అని సమస్య వివరించాడు పెద్దాయన కృష్ణ ప్రసాదు.

‘మొత్తమందరం జీవితాంతం ఆ వూరు, ఈ వూరు తిరిగి ఉద్యోగాలు చేసాం, చివర్లో ఈ కొండల పక్కన ప్రశాంతంగా ఆ సింహాద్రినాధుడు తెల్లారిలేస్తే కనపడేలా ఉందని ఇక్కడ స్థలం కొన్నాం, అయితే మేం చేసిన తప్పేంటంటే  వుడా దగ్గర తీసుకోకుండా రైతు దగ్గర కొనేసి పంచాయతీ అప్రూవ్డ్ లే అవుటు వేసుకున్నాము ‘అని అక్కడ టేబుల్ మీద వున్న గ్లాసెడు నీళ్లు తాగాడు. అతనితో పాటు వొచ్చిన మరో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు దిగాలుగా కూర్చుని వున్నారు.

అంతావిన్న కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు అనంతలక్ష్మి ‘ ఇది చాలా అన్యాయం , నేను పార్టీ దృష్టికి తీసుకెళతాను, మీడియాకి కూడా సమాచారం ఇద్దాము, అయినా రాత్రికి  రాత్రి మీ స్థలంలో అరటి తోట వేయడం చుట్టూ దడి కట్టేయడం చాలా అన్యాయం ‘ అందావిడ.

‘ అవును మేడం, మొన్న సాయంత్రం వరకు మైదానంలా వున్న మా లే అవుటు ఒక్కరోజులోనే గెలలు కాసే అరటి చెట్లు వేసి ఇప్పుడిక్కడ అరటితోట వుంది, ఇది రైతుది అంటున్నాడు , ఆ గువ్వ అయోధ్యరామయ్య  చాలా మోసకారి మేడం, మా కష్టార్జితం దోచుకుంటున్నాడు.. అదీ పబ్లిగ్గా ‘ అని ఒక నిముషం అలా వుండిపోయాడు.  మళ్ళీ అతనే ‘ రేపే పోలీస్ కమిషనర్ కి ఒక పిటిషన్ రాసి ఇస్తాను ‘ అన్నాడా కృష్ణ ప్రసాదు.

‘ఏది చేసినా చట్ట ప్రకారం వెళ్ళండి, అతన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు, ఎక్కడినుంచో వొచ్చి ఇక్కడున్న వాళ్ళని మన మంతా ఒకే   కులం అని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాడు, పేదోడి కులం వేరే డబ్బున్నోడి కులం వేరే అని ఇక్కడ జనాలు అనుకోరు, ఆ రైతు మీకు అడ్డం తిరుగుతాడు, ఎందుకంటే గువ్వ అయోధ్యరామయ్యది, రైతుది ఒకటే కులం కాబట్టి ‘ ఆవిడ ఖచ్చితంగా జరగబోయేది చెప్పింది.

‘ అలాగే వుంది మేడం ‘ పరిస్థితి.

నగరానికి దూరంగా వున్న కాలనీ ఇది, పక్కనే పంచాయితీలు, మరోపక్క దేవస్థానం భూములు.

భూముల గురుంచి తెలీని జనం వుడా భూములు కాకుండా పంచాయతీ భూములు, దేవస్థానం భూములు కొనుక్కొని చిక్కుల్లో పడిపోతున్నారు.

మరోపక్క  శ్రీకాకుళం, విజీనగరం నుంచి వొచ్చిన శ్రామిక జనాలు ఇక్కడ ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టడానికి మందలు మందలుగా దిగిపోతున్నారు, వాళ్ళకోసం ప్రభుత్వ బంజరు భూముల్లో పార్టీ జెండాలు పాతి ఒక్కొక్కళ్ళకు వందగజాల చొప్పున వొచ్చేట్టు పోరాడింది ఆవిడ, అలా ఆ సమస్యలపై వొచ్చే జనం పోయే జనంతో ఇంటిముందు సందడిగా ఉంటోంది.

జనం వేసిన పాకలను రెవిన్యూ వాళ్ళు కూల్చేస్తే జనాలు కట్టిన కరెంటు బిల్లులు చూపించి పట్టాలిమ్మని పోరాడి వాళ్లకు ఇల్లొచ్చేలాగా చేస్తోంది.

ఈలోగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్ భూ సమస్య.

చిత్రం: ఆనంద్

వొచ్చిపడింది గువ్వ అయోధ్యరామయ్య మేకలమంద మీద పడిన పులిలా వీళ్ళమీద పడి మెడ జీవాలు కోరికేస్తున్నాడు.

ఒకప్పుడు ఈ ప్రాంతంలో  గజం వొంద కొచ్చే భూమి ఇప్పుడు వేళల్లో పలికితే ఎక్కడెక్కడినుంచో గెద్దల్లా దిగబడిపోతున్నారు రియల్ ఎస్టేట్ అంటూ.

ఓ వారం తరువాత పొద్దున్నే పేపర్లో ‘ గువ్వ అయోధ్య రామయ్య అరటి తోటలోకి అక్రమంగా ప్రవేశించిన దుండగులు ‘ అనే వార్త వొచ్చింది.

వొళ్ళు మండిన ఆ రిటైర్డ్ ఎంప్లాయి కృష్ణప్రసాదు కొంత మంది మనుషుల్ని తీసుకెళ్లి ఆ తోటలో అరటిచెట్లు కొన్ని నరికించేసి గట్టిగా అరుస్తూ ఆ తరువాత ఏడుస్తూ ఉండిపోయాడని తెలిసింది.

‘ ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళమంటే వినలేదీ  ముసలోడు’ అని పేపర్ అవతలకు గిరాటేసిందా కమ్యూనిస్టు నాయకురాలు అనంతలక్ష్మి.

మరో నెలలో ఆ లే అవుటు ముందు నుంచి వెళుతున్న ఆమెకు ‘ పులి రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్  గువ్వ అయోధ్య రామయ్య ‘ అనే బోర్డు ఆ అరటి తోట ముందు కనిపించింది.

‘ తూ .. పనికి మాలిన పరాన్నజీవి.. బూర్జువా నాకొడకా ‘ అని ఒక కమ్యూనిస్టు తిట్టు తిట్టి కాండ్రించి రోడ్డు మీద ఉమ్మేసింది ఆవిడ.

చిత్రంగా ఆ తాత్కాలిక అరటి తోట వున్న ప్రాంతం అప్పటికి పదిహేనేళ్ల క్రితం వీధి కింద కొండలమీదనుంచి పులి వొచ్చి కూర్చున్న చోటు.

*  *  *

పై అంతస్తులో కూర్చున్నారు సాంబమూర్తి.

ఎదురుగా తూరుపు కొండలు, ఆకాశమంత కొండలు, ఏనుగుల్లాంటి కొండలు, ఒకటే చక్కటి గాలి.

ఆ కాలనీలోకి  పులొచ్చాక అందరూ తాను పేల్చిన  గన్ను గురుంచి మాట్లాడటం మొదలెట్టారు, దాంతో కొన్ని నెలలకు ఆ కాలనీ వొదిలిపెట్టి ఎగువున వున్న ఈ వూరికి వొచ్చేసారు, మొదట అద్దెకు ఆ తరువాత విశాలంగా ఈ  ఇల్లు కట్టుకున్నారు.

కిందన కారు పార్కింగ్ కి గార్డెనింగ్ కి స్థలం ఉంచారు, అందమైన మొక్కలు కుదురుగా పెరుగుతున్నాయి.

ఎదురుగా బ్లాక్ లేబుల్ బాటిల్ లోంచి ఒంపుకున్న తొంబై ఎమ్మెల్ వుంది. రెండు ఐస్ క్యూబులు అందులో కరుగుతున్నాయి ఆయన జ్ఞాపకాల లాగే.

పందొమ్మిదివందల అరవైతొమ్మిది ఇక్కడ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదవడానికి కృష్ణాజిల్లా నుంచి వొచ్చాడు. రైతు కుటుంబం, నెలవారీ ఖర్చులకు ఢోకాలేదు. హాయిగా ఉండొచ్చు.

తనని ఎవరు ఐడెంటిఫై చేశారో గాని మెల్లగా విద్యార్థి సంఘం లోకి తీసుకెళ్లారు. అక్కడనుంచి పార్టీ కాంటాక్ట్ లోకి వెళ్ళాడు.  సాయంత్రం యూనివర్సిటీ హాస్టల్స్    మీద సమావేశాలు, వుద్రేకమైన పాటలు. తానూ ఆ యవ్వనావేశంలో దళం లో చేరాడు,

ఆ శ్రీకాకుళ  పోరాటం గోచీకట్టుకొన్న గిరిజనులను పోరాటయోధులుగా చేసింది. వేలాది ఎకరాలు భూములు సాధించింది.

కానీ రాను రాను పోలీసు నిర్బంధం ఇంకా పెరిగిపోయింది, కాల్పుల్లో జనం పిట్టల్లా రాలి పోయారు.

దాంతో పార్టీ ఆదేశాలతో సాంబమూర్తి తెలంగాణ లో పనిచేయడం ప్రారంభించాడు.

అక్కడ దళంలో ఉండగా ఒకసారి మలేరియా వొచ్చింది , మరోసారి రక్త విరోచనాలు పట్టుకున్నయ్యి దాంతో బెంబేలెత్తి పోయాడు, బతుకుతానా లేదా అనుకున్నాడు.

ఉత్సాహం తగ్గిపోయింది, బతుకుమీద ఆశ పెరిగింది, లొంగి పోయాడు.

‘ఏమండీ పిల్లలు ఫోన్ చేశారు సియాటెల్ నుంచి..’ అన్న భార్య మాటతో ఈలోకంలోకి వొచ్చారు.

రుషికొండ విల్లాస్ లో ఎవరో ఫ్లాట్ సేల్ పెట్టారు, మీకు వివరాలు వాట్సాప్ చేస్తాను, కొంచెం ఎంక్వయిరీ చేయండి ‘ కూతురు చెప్పినదానికి ‘ వూ ‘ కొట్టారు.

ఎదురుగుండా షెల్ఫ్ లో ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచన ​’కుటుంబం, ప్రైవేట్ ఆస్తి మరియు రాష్ట్రం యొక్క ఉద్భవం’ వుంది.

సాంబమూర్తి కళ్ళజోడు చేతితో తీసి పట్టుకోగానే  పుస్తకం క్రమంగా పూర్తిగా అతని దృష్టి నుంచి మసకబారింది.

కాసేపు అవీ ఇవీ మాట్లాడి ఆ ఫోను భార్యకు ఇచ్చేసి వొచ్చి మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు.

జాయిగా ఒక సిగరెట్టు వెలిగించాడు.

కమ్మని పొగ వాసన.

దళం నుంచి బయటకు వొచ్చి లొంగిపోయాక ఈ ప్రాంతానికి వొచ్చి గెడ్డ వార చిన్నగా ప్లాస్టిక్ పరిశ్రమ పెట్టుకున్నాడు.

పరిశ్రమలో వున్న వర్కర్స్.. యూనియన్ అన్నమాటే రాకుండా చూసుకున్నాడు.

ఏ పార్టీ వాళ్ళు వొచ్చినా చక్కగా చందా ఇచ్చాడు, వాళ్ళ పేపర్లు వేయించుకున్నాడు.

గ్లాసులో ఐసు పూర్తిగా కరిగిపోయింది, ఆ కొంచెం గరళం పూర్తగా సప్పరించేస్తే మనసు కుదుటపడుతుంది.

తన ప్రవహించే స్వభావ రీత్యా కాపిటలిస్టు అయినా నేనది కాదు అని ప్రపంచానికి నిరూపించాడు, అభ్యుదయవాదిగా తన ముఖాన్ని ప్రదర్శించాడు.

కాపిటలిస్టు కాకపొతే తన దగ్గర ఇంత పెద్ద ఇల్లు, కారు, ఫ్యాక్టరీ స్థలం ఎలా వస్తాయి, పిల్లల్ని అమెరికా ఎలా పంపుతాడు. ఆ విషయం తనకి తెలీదా ఏంటి ?

కానీ తనని కలవడానికి వొచ్చిన వాళ్ళతో మాత్రం సాంబమూర్తి మాత్రం ‘ పార్టీలన్నీ కలిసిపోవాలండీ ఇండియా లో ఎప్పటికైనా సోషలిజం రావాలి.. అని  టీ ఇచ్చి గంటసేపు మాట్లాడతాడు.

మెత్తని పులి తాను, ఆ విషయం తనకు మాత్రమే తెలుసుకాబట్టి భరించలేక ఇంకో పెగ్గు గ్లాసులోకి ఒంపుకున్నాడు.

తానే కాదు, బయట విప్లవం మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళని పూర్తి భద్రజీవులుగా తయారుచేసేవాళ్ళు, జనానికి నాస్తికత్వం చెబుతూ ఇంట్లో పూజలూ వ్రతాలూ చేసేవాళ్ళు, మిగతా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోమని చెబుతూ తమ పిల్లల్ని పొద్దున్నించి రాత్రి వరకూ కొర్పొరేట్ కాలేజీల్లో రుద్దేవాళ్ళు , ప్రభుత్వ ఉద్యోగాలు రావని ప్రచారం చేసి తాము మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ పెన్షన్ తీసుకొని సుఖంగా విప్లవం చేసే నాయకులు, ఇల్లంతా చాలా ఖరీదుగా కట్టుకొని జిడ్డు మొహం, బట్టలతో తమ దగ్గర ఏమీలేనట్టు నటిస్తూ జనానికి సింప్లిసిటీ గురుంచి చెబుతూ తమ ఇళ్లలో ప్రతి క్రతువూ అత్యంత ఖరీదుగా జరుపుకునే నాయకులూ కార్యకర్తలూ .. ప్రతి వూరిలోనూ తమ జిల్లా వాడిని మాత్రమే  ముఖ్యమైన బాధ్యతల్లో ఉంచి, వాళ్ళను మాత్రమే గెలిపించే రాష్ట్ర నాయకులూ  అందరూ మెత్తని.. చిక్కని పులులు అని అనుకోగానే అతని మనసు పూర్తిగా శాంతం పొందింది.

అయితే మరోసారి నింపుకున్న గ్లాసు లో ద్రావకం గబా..గబా తాగేసి ఇంటి ఎదురుగ్గా వున్న ఖాళీ స్థలంలో రాయి మీదకు దాన్ని విసిరికొట్టి అది ఘల్లుమని బద్దలవ్వగా అక్కడున్న తుప్పల వొంక చూపిస్తూ …పులి.. పులి.. పులి.. అని నవ్వుతూ గట్టిగా అరిచాడు.

*

హరివెంకట రమణ

రచయిత కుదురుగా ఓకే చోట పనిచేస్తే ఎలా ? అందుకే పత్రికా రంగం లో మొదలయ్యి యానిమేషన్ లో పనిచేసి తరువాత యెన్. జీ. ఓ రంగంలో పిల్లల హక్కులు, విద్య,సంరక్షణ అంశాలపై పనిచేస్తున్నాను. చదువేమో తెలుగు, సోషల్ వర్క్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్సు.
'బర్మాకేంపు కథలు '( ఈ మధ్యే పుస్తకం గా వొచ్చింది ) ఇంకా స్కూలు అనుభవాలు ' మా బడి కథలు ' గా వొచ్చేయి మరో పదిహేను కథలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. పాతికేళ్లుగా వ్యంగ్య రాజకీయ చిత్రకారుడిగా ఫ్రీలాన్సరుగా ఉంటూ మూడు కార్టూను పుస్తకాలు ప్రసవించాను. ( హరి కార్టూన్లు, జగమేమాయ, ఇదీలోకం)

భారత ప్రభుత్వ యువజన అవార్డు 2012 లో అందుకుని, 2022 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై మానవ అక్రమరవాణా అంశంపై అధ్యయన యాత్రకు నెలరోజుల పాటు పర్యటించిన నేను పత్రికల్లో విద్య, బాలల అంశాలపై వ్యాసాలు కూడా రాస్తుంటాను.

4 comments

Leave a Reply to P V RAMA SARMA Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధ మొత్తం ఆసక్తిగా వుంది. చాలా బాగుంది.

  • చిక్కని పులి కధ చాలా బాగుంది. చదివినంత సేపు ఆసక్తిగా సాగింది. రచయిత అభినందనీయులు.

  • చిక్కనిపులి కధ చాలా బాగుంది. రచయిత అభినందనీయుడు.

  • అరణ్యంలో పులులు, జనారణ్యంలో పులులు ఎలా ఉంటాయో చక్కగా చెప్పారు..అభినందనలు హరి వెంకట్ గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు