పులే. కాకపోతే చలి పులి. నేను మా ఆవిడ్ని దుప్పటల్లె కప్పుకోవడం చూసి సిగ్గే పడిందో చేవే జచ్చిందో గాని వెనక్కితగ్గి బుద్దిగా మర్యాదగా చేతులు కట్టుకొని నిలబడిపోయింది.
నాకయితే అమ్మ గుండెల్లో నిద్రపోతున్నట్టే వుంది. నా పసితనం నాకింకా యెంతో కొంత మిగిలివున్నది యిక్కడే. దాన్ని రవ్వంత వొదులుకోవడం యిష్టం లేనట్టు మరింత గట్టిగా ఆబగా మా ఆవిడ్ని కరచుకొని పడుకున్నాను. మా ఆవిడ కూడా అమ్మయింది. నన్ను బిడ్డలా మరింతగా గుండెల్లోకి తీసుకుంది. తలవంచి నా నుదిటిమీద ముద్దు పెట్టింది. ముద్దు చేస్తూ జుట్టులోకి వేళ్ళు జొనిపింది. అంతలోనే నన్ను జోకొట్టింది. పారవశ్యంతో నా ముఖాన్ని ఆమె గుండెలకు పులుముకున్నాను. ఆ బిగి కౌగిలిలో వూపిరాడనట్టు గాలి గడుసుగా జారిపోయింది.
“నిద్రపోలేదా?” నిద్రమత్తు వీడకనే అడిగింది మా ఆవిడ. లేదన్నట్టు తల అడ్డంగా కదిలిస్తూనో మరింత గుండెల్లోకి చొరబడుతూనో నేను.
“ఆరోగ్యం పాడవుతుందిరా కన్నా…” మా ఆవిడ గొంతులో బాధ ధ్వనించింది. “నువ్వస్సలు నిద్రపోవడం లేదురా…” అని నొచ్చుకుంది.
“ఈ నిద్రలేని రాత్రులకోసం యెన్ని నిద్రలేని రాత్రులు గడిపాను?” పిచ్చి మోహంలో మునిగి తేలుతూ గొణుగుతున్నట్టుగా మత్తుగా అన్నాను.
“ఔను మరి పక్కింటోడి పెళ్ళాన్ని, యివాళే వుంటాను. రేపు వుండను. కదా?” మా ఆవిడ నా జుట్టుపట్టుకు కసిగా యెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగింది. ‘ఇవాల్టికి వున్న యవ్వనం రేపటికి వుండదు కదా’ అందామనుకొని మింగేశాను. చేతకానివాడిలా రెప్పలార్పకుండా బేలగా మూగగా చూశాను. నా అమాయకపు చూపులకు “నీ పెళ్లాన్నే కదబే…” అంటూ నా కంఠం మీద అరచేతిని వుంచి పీక నొక్కేస్తున్నట్టు బలంగా నొక్కింది.
నే వూపిరాడనట్టు దగ్గుతుంటే “సారీ” అని, అంతలోనే “యాక్టింగు ఆపు” అని, వొక్క క్షణం ఆగి దయతలచినట్టు “రా…” అని గుండెల్లోకి లాక్కుంది. నాకు మాట్లాడే అవకాశమే మరివ్వలేదు.
అలా వొక్కసారిగా అల్లుకున్న నిశ్శబ్దం. పండగ చలి ఆరపండిదేమో యెంత వెచ్చగా వుందని? చలికాలమే లేకపోతే సంసార జీవితంలో సారంపోయి బతుకు యెండాకాలమయిపోదూ?
నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ కాలింగ్ బెల్ దూరంగా వినిపించింది. మా ఆవిడ వులిక్కిపడి లేచింది. వెళ్ళకుండా నడుం చుట్టూ చేతులు వేశాను. చేతులు విడిపించుకుంది. “చలి చలి గాలులు వీచెనూ… నా చేతులు నీకై చాచెనూ…” నా కూని రాగం విని, ఖూనీ చేస్తానన్నట్టు హెచ్చరికగా పిడికిలి బిగించి చూపించింది. నేనూ గౌరవించి వణుకుతూ భయం నటించాను. ‘రా… వచ్చిపో’ అనలేదు, “రా చచ్చిపో” అనే అంది. అదే అదనుగా పసిపిల్లాడు చెంగుమని తల్లిని చుట్టేసినట్టు వొక్క వుదుటన చుట్టేశాను. అలవాటైన అత్తరు వంటి వొంటి వాసన. దీర్ఘ శ్వాస తీశాను.
ఒక్కక్షణమే అవకాశమిచ్చి మరుక్షణం తోసేస్తూ “చూడండీ…” అని మొదలెట్టింది మా ఆవిడ. కోపం వచ్చినప్పుడు చాలా గౌరవించేస్తుంది మరి. “ఇది మన యిల్లు కాదు, బాగోదు” అని నా చేతుల్ని విసిరికొట్టి క్షణాల్లో నైటీలోకి మారిపోయింది. లుంగీ తీసి నా ముఖాన కొట్టింది. కట్టుకోనేలోపే తలుపుతీసి గది బయటకు వెళ్ళిపోయింది. నే వెంటపడ్డాను.
ఆ వేకువజాము వేళ యిల్లంతా పట్టపగల్లా లైట్లతో వెలిగిపోతోంది. అంతా కూర్చొని వున్నారు. సమయం నాలుగయ్యింది. ఏదో వొకటి మాట్లాడాలి కాబట్టి “యెవరొచ్చారు?” అన్నాను. ‘ఊ?’- అన్నట్టు వురిమి చూసి “మీ బ్రదర్” అంది మా ఆవిడ. ‘రాత్రే చెపితే మళ్ళీ అడుగుతావా?’ అని ఆమె హూంకరింపు. “మెమరీ లాస్…” మా ఆవిడకు మాత్రమే వినపడేలా అన్నాను. “నీకు లాస్ యేoట్రా… అంతా లాభమే- నన్ను కట్టుకొని…” మా ఆవిడ కళ్ళలోని భాషని నాకనుకూలంగా యిట్టే అనువదించుకున్నాను.
“చూడమ్మా మీ ఆయనకి యేo కావాలో… వెళ్ళు” మా మావయ్య మాటతో మా మరదలు వేరే గది లోపలకు వెళ్ళిపోయింది. పిల్లలిద్దర్నీ పడుకోబెడతానని మా అత్తయ్య తీసుకుంది. ‘అర్థం చేసుకో’ అన్నట్టు మా ఆవిడ వంక చూశాను. మా అత్తయ్య మావయ్యా పిల్లల్ని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. నే హుషారుగా మా గదిలోకి నడిచాను.
మా ఆవిడ వస్తుందని చూశాను. రాలేదు. అటూ యిటూ దొర్లాను. నిద్ర కూడా రాలేదు. మా ఆవిడ ఏం చేస్తోందో అర్థం కాలేదు. వెయిట్ చెయ్యడం వల్లకాక మళ్ళీ గది బయటకు వచ్చాను. మా ఆవిడ వొక్కతీ హాల్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది. దగ్గరగా వెళ్ళాను. గొంతు తగ్గించి “యింటికీ గొడ్ల చావడికీ పైకప్పు దేనితో వేయిద్దామా?’- అనా..” అన్నాను. ఆవిడా మా ఆవిడే కదా- తక్కువ తిన్లేదు. “నేను నీకు ఫెవికోల్ నే వాడతాను” అంది. “మనిద్దరికీ మధ్యన అది అవసరం” తిరిగి అన్నాను సిగ్గులేకుండా నవ్వుతూ. తను నవ్వలేదు.
ఒక్క క్షణం అలాగే నిలబడి చాలా సౌమ్యంగా “నువ్వెందుకు డిస్ట్రబెన్సు?” అన్నానో లేదో, కళ్ళు బిగించి “మీరు చెయ్యకండి డిస్ట్రబెన్సు” అంది. మాట కటువుగా వుంది. ఇంకా ముందుకు వెళ్ళడం యుద్ధానికి కాలుదువ్వడమేనని గ్రహించాను. కామ్ గా వెనుదిరిగాను. యుద్ధంలో గెలవాలంటే కొన్నిసార్లు యుద్ధం చెయ్యకూడదు అని అనుభవం గుర్తుచేయగా మా ఆవిడ చూస్తుండగా నోటిమీద వేలేసుకొని గదిలోకి వెళ్ళి పడుకున్నాను.
ఇంతకీ రాదే? అంతకీ రాదే? ఎంత వూరుకుందామన్నా మనసు వొప్పదే? నిట్టూర్పు విడిచినా విడవాల్సింది యేదో విడవదే. కాళ్ళు ఆగవే. మళ్ళీ హాల్లోకి వచ్చాను. దగ్గాను. మా ఆవిడ రెస్పాండ్ కాలేదు. “కన్నా” అన్నానో లేదో, యిలా రయ్ మని వొచ్చి “కన్నా లేదు, సొన్నా లేదు, నోర్మూసుకొని పడుకోండి” విసుగ్గా కసురుతూ అంది. అప్పుడు కూడా “కళ్ళు మూసుకొని” అని వాక్యం సరిచేశాను. “ఏదో వొకటి మూసుకొని…” పడుకోండి అన్నట్టు చూసింది. నేనలాగే చూశాను. ‘ఏమిటి?’ అన్నట్టు చూసింది మా ఆవిడ. నా ముఖంలో బోలెడన్ని డౌట్లు కనిపించివుంటాయి తనకి. గిర్రున గదిలోకి వచ్చింది. తలుపు మూసింది. చెప్పమన్నట్టు ‘వూ?’ అంది.
“నువ్వెందుకక్క…” డ- అనకముందే ‘ఢాం’మంది. “మా చెల్లి వుండమంది” అంది. “ముస్తాబు చేసి పంపాలటనా?” కిసుక్కున నవ్వేను. నా మూతి మీద వొక్క పోటు పొడిచింది మా ఆవిడ. “అమ్మా” అరిచాను. “అక్కా” పిలుపు దూరంగా వినిపిస్తోంది. “ఏదో అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటాం, మీకెందుకు?” అంది మా ఆవిడ. “ఈ టైంలోనా? పాపం మా బ్రదర్ అబూదబీ నుండి వచ్చినా గిట్టుబాటు కాలేదన్నమాట…” నే నొచ్చుకుంటుంటే, గిచ్చుతూ “యెప్పుడూ అదే పనేనా? ఆ…” అని చర్మాన్ని చిదిపేసింది. “ఓ… వో అర్థమయింది త్రీ డేస్ కదా… అంతే కదా యామై కరెక్ట్?” యెక్సుపెక్ట్ చేస్తూ అన్నాను. “ర్రాంగ్” అరిచినంత పని చేసింది మా ఆవిడ.
ఒక్కసారిగా నిశ్శబ్దం. నేను అవాక్కయాను. నేనేం తప్పు మాట్లాడానో నాకర్థం కాలేదు. “మీకు లాగ యెప్పుడూ అదే పనా? వేరే పనులు వుండవా? ఆ?” మా ఆవిడవి అసలే పెద్ద కళ్ళేమో అవి బిగించడంతో మరింత పెద్దవైపోయాయి. అయితే అవిప్పుడంత అందంగా లేవు. “ఏంటలా చూస్తున్నారు?” మా ఆవిడ అడిగింది. “కోపంలో నువ్వంత అందంగా లేవు” అన్నాను. “ఛీ… మీరు బాగుపడరు… మీకెప్పుడూ అదే యావ… చి ఛీ…” అనేసి తలుపు విసురుగా వేసేసి వెళ్ళిపోయింది.
నాకు యేo జరుగుతోందో అర్థం కాలేదు. కుప్పకూలినట్టు కూర్చుండిపోయాను. తప్పు మాట్లాడానా? తరచి తరచి తర్కించుకున్నాను. జవాబు దొరకలేదు. గదిలో వుండబుద్ధి కాలేదు. బయటకు వచ్చాను.
పొద్దున్నే వేడినీళ్ళు తాగే అలవాటు తెలిసిన అత్తయ్య నీళ్ళు అందించింది. అందుకొని తలతిప్పి చూశాను. మా ఆవిడా మరదలూ గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి పక్కగది తలుపు తట్టి “బ్రదరూ… గిట్టుబాటు కానప్పుడు యెందుకు అబుదాబీ నుండి రావడం?” అని నా లోపలి విప్లవకారుడు మద్దతు ప్రకటించడానికి ఆవేశపడుతున్నాడు. అదుపు చేసుకొని రెస్ట్ రూమ్లోకి నడిచాను. స్నానం దాక అన్నీ ముగించుకు వచ్చాను. మా ఆవిడకు నేనో పరాయి మగాడిని అయినట్టు కన్నెత్తి కూడా చూడడం లేదు.
మా మరదలివాళ్ళ పిల్లలతో ఆడుకున్నాను. కాదు, వాళ్ళే నాతో ఆడుకున్నారు. పిల్లలు గోల చేస్తుంటే “డాడీ లేచిపోతారు…” అన్నాను. ‘ఎవరితో?’ లోపల నాకు నేనే కౌంటర్ యిచ్చుకున్నాను. ‘ఇలాంటి పెళ్ళాలు దొరికితే యెవరితోనైనా’ మళ్ళీ అనుకున్నాను. నా నోటి తీటని తగ్గించుకోవాలని అనుకున్నాను. ఆలోచనలో పడ్డాను.
పిల్లలు పెద్దగా అరుస్తుంటే తెగిన ఆలోచనల్ని వొదిలి “మీరిలా గోల చేస్తే యెలా? డాడీకి నిద్రలేదు కదా?” అన్నాను. వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకొని అర్థం కానట్టు నావంక చూశారు. చిన్నాగా పెద్దోడు నవ్వి “మా డాడీ రావడానికి యింకా వన్ వీక్ పడుతుంది” అంటే, చిన్నోడు డల్లుగా “మమ్మీ చెప్పింది” అన్నాడు. నాకేమీ బోధపడ్లేదు. “కాసేపాగితే మీకు మీ డాడీని చూపించి సర్ప్రైజ్ చేస్తా… వోం భీమ్ భాం మంత్రం వేసి…” అన్నాను. పిల్లలిద్దరూ నావంక పిచ్చోడ్ని చూసినట్టు చూసి నవ్వుకున్నారు. నేనూ నవ్వేశాను.
మా అత్తయ్య టిఫినుకు పిలిచింది. వేడి వేడి వుల్లి గారెలు. పొగలు కక్కుతున్న మాంసం కూర. వడ్డించింది. నా సంశయం చూసి “మీ మావయ్యగారు బజారుకి వెళ్ళారు, ఆయన వొచ్చేసరికి లేటవుద్ది నువ్వు తినీయమ్మ” అంది. డైనింగు టేబుల్ ముందు కూర్చున్నాను. “పిల్లలు…” అన్నాను. “ఎండుమిర్చి వేయించి యీ కూర కారంగా చేసాను, పిల్లలు కారంగా తినలేరు, వాళ్ళకి వేరేగా అవుతోంది…” అని కిచెన్లోకి వెళ్ళిపోయింది మా అత్తయ్య. ఎర్రగా మా ఆవిడ్లానే టేస్టీగా వుంది కూర.
“మరేం పని? ఉప్పూ కారం తినడమే పని…” రుసరుసలాడుతూ నా ముందు నీళ్ళ గ్లాసు దబ్బున పెట్టింది మా ఆవిడ. “ఉప్పూకారం తినక తప్పదు… కిందా మీదా పడక తప్పదు… రా రా కప్పుకుందాం నన్ను నువ్వు…” పాడుతూ- మా అత్తయ్య రావడంతో “నువ్వు… నువ్వు తిన్నావా?” అని సర్దేశాను. “ఔను… మీ అందరికంటే ముందు తినేశాను…” అనకుండా వుండలేదు మా ఆవిడ.
“ఈ మధ్య యీ పిల్లకి బాగా కోపం యెక్కువైపోతోంది…” అంది మా అత్తయ్య. అల్లుడు ముందు అనకూడని మాటని ఆవిడకేం అనిపించలేదు. “అవునత్తయ్యా… తనకి లోబీపీ కదా? యిప్పుడు చూడండి… గ్యారంటీగా హైబీపీ వుంటుంది” నవ్వాను నేను. “నిన్ను చేసుకున్నాక నాకేం దక్కింది అది తప్ప… థైరాయిడ్ వచ్చింది… రేపు షుగర్ కూడా వస్తుంది” మా ఆవిడ మండి పడిపోయింది. నేను కంగుతిన్నాను. సైలెంటు అయిపోయాను. మా ఆవిడ వయిలెంటు అయిపోయి “యింటి మగాడు సరిగ్గా లేకపోతే యింటి ఆడదాని ఆరోగ్యం యింకెలా వుంటుంది?” గొణగడం కాదు నేరుగా అనేస్తోంది. చుట్టూ యెవరు వున్నారో లేరో చూడనైనా చూడకుండా.
డైవర్ట్ చేద్దామని “మా బ్రదర్ యేడి? టిఫిన్ కు కంపెనీ యిద్దామని” అన్నాను.
“ఆ బాబు అప్పుడే వచ్చిన పది నిమషాలకే వెళ్ళిపోయాడు…” అంది మా అత్తయ్య. నా కర్థం కాలేదు. “ఎక్కడికి?” అన్నాను. “మీలాగే పెళ్ళాన్ని పక్కనేసుకొని పడుకోవడానికి” అని వెక్కిరింతగా యింగ్లీషులో అంది మా ఆవిడ. ఇంకేం మాట్లాడినా బాంబులు నా మీద పడతాయని నాకర్థమయింది. తలొంచుకొని తిని, తేన్చడానికి కూడా భయపడుతూ హాల్లోకి వెళ్ళి న్యూస్ పేపర్లో తలదాచుకున్నాను.
పేపర్లో వార్తలేవీ తలకెక్కడం లేదు. మనోడు రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయిందా? అందుకేనా- మా ఆవిడా మరదలూ కూర్చొని మాట్లాడుకున్నది? ప్చ్… నేనే అపార్ధం చేసుకున్నాను… అందుకే అంత కోపం వచ్చినట్టుంది… అని సరిపెట్టుకున్నాను. సరే… వచ్చినవాడు యెక్కడికి వెళ్ళినట్టు? పేరెంట్స్ దగ్గరికా? తెల్లారాక పిల్లలు లేచాక కూడా వెళ్ళొచ్చు కదా?- ప్రశ్నా నాదే. సమాధానమూ నాదే. అందుకే ఫీలయి అక్కాచెల్లెళ్లు యిద్దరూ షేర్ చేసుకుంటుంటే నేను పానకంలో పుడకలాగ ఆగలేదు…
“వోం భీమ్ భాం… మంత్రం వేసి మా డాడీని తీసుకురా” అన్నారు పిల్లలిద్దరూ నాదరి చేరి. నా మాటని నేనే మర్చిపోయినట్టు తెల్లమొహం వేశాను. సమయానికి మా మరదలు వచ్చింది. రక్షించింది.
“డాడీ రావడానికి యింకో వన్ వీక్ పైనే పడుతుంది. ఫోన్ చేశారు. మీరిద్దరూ అప్పుడు బబ్బున్నారు. మీకిద్దరికీ రిమోట్ ఏరోప్లయిన్స్ తెస్తారు. అవి డుయ్యమని గాల్లో యెగురుతాయి. మరి మీకే కలర్స్ కావాలో చెప్పండి” అంది మా మరదలు. పిల్లలు యిద్దరూ వొకడు బ్లూ అని మరొకడు యెల్లో అని చెప్పి అంతలోనే డౌట్ వొచ్చి రెడ్ బాగుంటుందా మమ్మీ అని అడుగుతున్నారు. పిల్లల ముఖాల్లో చెప్పనలవి కాని ఆనందం.
మా మరదలు యెంత బాధ పడుతోందో కదా- అని ఆమె ముఖం వంక చూశాను. నేను అనుకున్నదానికి మేచ్ కాలేదు. చాలా హుషారుగా సంబరంగా వుంది. పిల్లలకి తినిపిస్తూ చలాకీగా అటూ యిటూ తిరుగుతూ వుంది. కవరు చేసుకుంటుందేమో? భర్త అంత దూరం నుండి వచ్చి పట్టుమని పదినిముషాలు గడపకపోతే యే భార్య మాత్రం ఫీలు కాదు? మా ఆవిడయితే యేది దొరికితే దానితో పొడిచి అక్కడికక్కడే చంపేస్తుంది.
వద్దన్నా నా కళ్ళు మా మరదలి మీదకే పోతున్నాయి. ఆవిడ కూడా నా చూపుల్ని గమనించినట్టే వుంది. నవ్వుతూ “యేoటి బావా?” అంది. ఏమనాలో తెలీక “సారీ” అన్నాను. “దేనికి?” అంది. తవ్వడం దేనికి అని సింపుల్ గా “పెయిన్ ఫుల్ కదా?” అన్నాను. “అదేం లేదు, అలా అలవాటైపోయింది” అంది. “ఎంత అలవాటైనా రోజూ…” అన్నాను. అంతకు మించి నాకు మాట రాలేదు. “తల్లికి తప్పదు… మనకి యెవరూ తినిపించాకుండానే యింతవాళ్ళమయ్యామా?” తీసిపారేసింది. నేను గక్కురుమన్నాను. “నీకలా అర్థమయ్యిందా తల్లీ” అని మూగగా తలాడించాను. తనకి అర్థం కాకపోవడమే మంచిదనుకున్నాను. లేకపోతే అర్థమయ్యి కూడా అలా టర్న్ చేసిందా? తెలీదు.
నేను మాకిచ్చిన గదిలోకి దూరాను. “ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా? సిగలో వుంచాలా…” కూనిరాగం తీసి పాడుకుంటూ ల్యాప్ టాప్ తీసి నెట్ ఫ్లిక్ష్ లో సినిమా పెడుతున్నాను.
“ఆకాశం దించడం… చందమామని చెవిలో పెట్టడం… పెళ్ళాన్ని దేవతని చెయ్యడం… మాటలతో కోటలు కట్టడం… మహారాణీని చెయ్యడం… హు…” మా ఆవిడ మడతపెడుతున్నది బట్టల్నో నన్నో అర్థం కాలేదు.
మరదలకి చెప్పినట్టే మా ఆవిడకీ “సారీ” చెప్పాను. మా ఆవిడ యెందుకు అనలేదు. “నాకు మిగిలినవి సారీలే తప్ప శారీలేవి?” బుసలు కొడుతూనే వుంది. యుద్ధం చెయ్యకూడదని నన్ను నేను నియంత్రించుకున్నాను.
“మా చెల్లెలి మొగుడు పండగకి పది చీరలు తీశాడూ అంటే ‘వూరుకో నువ్వు శారీలో కంటే లేకుంటే బాగుంటావు’ అంటావు. ప్రతి పెళ్ళిరోజుకీ మా చెల్లివాళ్ళు నక్లస్సో నల్లపూసలో యేదో వొకటి బంగారమయితే కొంటారు అంటే ‘వూరుకో నువ్వే బంగారం యింక నీకు బంగారం యెందుకు?, అవన్నీ అందం లేనివాళ్ళకి’ అంటావు. మీ అన్నయ్యవాళ్ళు పేద్ద బిల్డింగు కట్టించుకున్నారు అంటే ‘నువ్వు యువరాణీవి, నువ్వు తిరిగినంత మేరా నాకు ప్యాలస్సే’ అంటావు….” యింకా మా ఆవిడ నేనన్నవన్నీ వదలకుండా వడ్డించగలదు. ఆపమని చెప్పే సాహసం చెయ్యలేక మంచినీళ్ళు అందించాను.
“ఇంత విషమివ్వకూడదూ?” కళ్ళలో గిర్రున నీళ్ళు తిప్పుకుంది. నే అలవాటు పడ్డా ఆ క్షణంలో హతాశుడ్నయ్యాను. ఒక్క క్షణం ఆగి వాతావరణాన్ని లైట్ చేద్దామని “మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా… నిరుపేదని వలచావెందుకే…” రాగం పూర్తికాకముందే చేతిలోని గ్లాసు యెగిరిపోయింది. నేనూ తక్కువవాడిని కాదు. అరవగలను. కాని ఆమె కళ్ళలో నీళ్ళు నన్ను నిలిపేశాయి.
రెండు క్షణాల వ్యవధి యిచ్చి “మంచి సినిమా చూద్దాం రా…” మూడు బాగవుతుందని ఆశగా అడిగాను. “చూడను… నీతో యింకెప్పుడూ యే సినిమా చూడను. నీకు ట్రాన్సులేట్ చెయ్యను. నీ క్వాలిటీ లైఫ్ నాకొద్దు…” అని ఆగింది.
అంతలోనే అందుకొని “హాయిగా రిటైర్డ్ పీపుల్లా మంచి బుక్స్ చదువుకోవడం… మాంచి సినిమాలు చూసుకోవడం… యీ లైఫ్ యెవరికి వస్తుంది? మనదగ్గర డబ్బులు లేకపోతే కొన్ని కంఫర్ట్స్ తగ్గుతాయి తప్పితే యేమీ లేదు. పోతూ పోతూ యెక్కడివి అక్కడ వొదిలేసి వొత్తి చేతులతో పోతాం… ఊ… ఆ… తెరచిన పుస్తకం ముయ్యకుండానే పోతాం…” నా మాటలు మాడ్యులేషనుతో సహా నాకే అప్పజెప్పి కళ్ళు తుడుచుకుంది.
“సంసారం వొక చదరంగం… అనుబంధం వొక రణరంగం…” పాటని నోరుజారాను!
వెంటనే మా ఆవిడ “వెధవ ఫిలాసఫీలూ పాటలూ ఆపి యిప్పుడైనా చూసి బుద్ధి తెచ్చుకోండి” కాస్త గట్టిగానే అంది. “ఎవర్ని? నిన్నా?” అన్నాను. “నన్ను పెళ్ళయిన దగ్గర్నుంచి చూస్తున్నావుగా, కొద్దిగా పక్కన వున్నవాళ్ళని చూసి పెళ్ళాం బిడ్డల్ని యెలా చూడాలో నేర్చుకోండి” ధాటిగా అంది.
నాలోని సర్పము సర్రున లేచింది. యుద్ధానికి దిగకుండా వుండలేకపోయాను. “నన్ను యెవరితో పడితే వాళ్ళతో కంపేర్ చెయ్యకు” నేనూ గట్టిగానే అన్నాను. “కరక్టే” అంది. ఆ మాటలోని వ్యంగ్యం నాకు గుచ్చుకుంది. దాంతో డైరెక్ట్ అయిపోయాను.
“సంవత్సరం తర్వాత విదేశాల నుంచి వొచ్చి పెళ్ళాం పక్కలో పడుకోకుండా పెళ్ళాం బిడ్డల్ని ముద్దులాడకుండా సింగల్ వేసుకోకుండా…” నా మాట పూర్తికాలేదు.
“ఔను… యెప్పుడూ పెళ్ళాం పక్కలో పడుకోవడం… ముద్దులాడుకోవడం… సింగిలూ కుదిరితే డబలూ వేసుకోవడం యివే నీకు. ఇంతకంటే బాగా ఆలోచిస్తే మనం బాగుపడిపోతాం కదా?” మా ఆవిడకు యెంత మంటగా వుందో అర్థం అవుతోంది.
“అంతకంటే యేమి ఘనకార్యాలు వున్నాయో చెప్పు? ఏ ఘనకార్యాల కోసం వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడో చెప్పు?” నిలదీశాను.
“అతను యేo పనిమీద వెళ్ళాడో నీకు తెలుసా? ఊళ్ళో తోట యేదో అమ్మకానికి వొచ్చిందట. అందుకని కొనడానికి వెళ్ళాడు. ఇంతకు ముందు కూడా అలాగే కొన్నాడు. అమ్మాడు. ఇప్పుడు సొంతానికి అయిదు యెకరాలుంది. అదీ బతికే పద్దతి. ఆ తోటకి కంచె వేయించి జీడి మామిడి మొక్కలు వేసి పనిపూర్తయ్యాక నెలకో పదికో వస్తాడు. లేదంటే అట్నుంచి ఆటే వెళ్ళిపోతాడు. చేసేది పెళ్ళాం బిడ్డల కోసమే కదా?” గొప్పగా చెప్పింది మా ఆవిడ.
నాకు కళ్ళు గిర్రున తిరిగాయి. “మహానుభావుడు” అన్నాను. “నిజంగానే” అంది మా ఆవిడ.
“ఇద్దరం వొక తల్లికడుపున పుట్టాం. నా రాత యిలా తగలబడింది” అని వెళ్ళబోతూ ఆగి “మీరిన్ని చెపుతారు కదా? మీరు చదువులో పోటీ పడలేదా? ఇప్పుడంటే ఫ్రీలాన్స్, వుద్యోగంలో వున్నప్పుడు పోటీ పడలేదా? మీ కెరీర్లో మీ ప్రొఫెషన్లో పోటీ పడలేదా? మీ రైటర్స్ తో మీరు పోటీ పడలేదా? మన చుట్టూ వున్నవాళ్ళతో మనం అన్నిట్లో పోటీ పడుతూనే వున్నాం. సొంత యిల్లూ సొంత కారూ పిల్లల్ని బాగా చదివించుకోవాలని వుండదా? అలా వున్న వాళ్ళతో పోటీ వుండదా?” గుక్కతిప్పుకోకుండా అడిగింది.
“మీ చెల్లి హేపీగా వుందా?” స్ట్రెయిట్ గా విషయం అడిగాను.
“చెపితే నమ్మరు కదా?, మీ కళ్ళతో మీరే చూసుకోండి” అనేసి గది బయటకు వెళ్ళిపోయింది.
నిట్టూరుస్తూ సినిమా పెట్టుకున్నాను. సినిమాలో లీనం కాలేకపోయాను. ల్యాప్ టాప్ షట్ డౌన్ చేశాను. అలాగే కూర్చున్నాను. కూర్చోలేక గది బయటకు వచ్చాను.
మా మరదలు నేను పోల్చుకోలేనంతగా ధగధగలాడిపోతోంది. పండగరోజు కదా కొత్త చీరకట్టుకొని నగలు వున్నవన్నీ అలంకరించుకున్నట్టుంది. మా ఆవిడ చూడు అన్నట్టు కళ్ళెగరేసింది. ‘ఆ అందం చూసేవాడూ లేడు… ఆ ఆనందం పంచుకొనే మనిషీ లేడు…’ అనుకున్నాను. అయితే చూడగా చూడగా నాకు మా మరదలు కూడా తన పిల్లల్లో వొక పిల్లగా కనిపించింది. ఔను, పిల్లలకి రిమోట్ ఏరోప్లయిన్స్… యీవిడకి చీరలూ నగలూ. అంతే తేడా. మరదలి మీద సరే పిల్లల మీద మరీ జాలి కలిగింది.
విరక్తిగా నవ్వుకున్నాను. నన్ను చూసిన మా ఆవిడకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు భగభగలాడిపోతోంది.
“నువ్వేసుకో అక్కా… బోడి మెడతో యేమి బాగుంటావ్” అంది నగలు తీసి యివ్వబోతూ మా మరదలు. “బోడి మెడ అయితేనే బాగుంటుంది మీ బావకి… ముద్దులాడడానికి యేదీ అడ్డం రాదు…” వొకమాట నాకు తగిలేలా విసిరేసింది మా ఆవిడ. “అదికాదే…” మా మరదలు చెప్పబోయింది. “మా ఆయనకీ యిలాగే నచ్చుతుంది… కదండీ” కవ్విస్తూ అడిగింది మా ఆవిడ. “మీరయినా చెప్పండి బావా” అంది మా మరదలు. ఏం చెపుతావో చెప్పు అన్నట్టు చూసింది మా ఆవిడ. “మా ఆవిడది నేచురల్ బ్యూటీ” గర్వంగా అన్నాను. ఇదే మా యిల్లయితే యీపాటికి రెచ్చిపోయి నా మీద పడిపోను, ఆ ప్రమాదం తప్పింది అనుకొనేసరికి మరో ప్రమాదం మా అత్తయ్య రూపంలో వచ్చింది. “నా వస్తువులు వేసుకోయమ్మా” అని తనవి తెచ్చి మా ఆవిడకి యివ్వబోయింది. నేను కవరు చెయ్యడమే కాదు, రియల్ గానే అన్నాను. “తనకి కాటన్ శారీ మెడలో సింగల్ చైనూ తనంతా లైట్…” నే తన అభిరుచినే చెప్తున్నాను. “నన్నిలా వుంచడమే ఆయనకిష్టం అంటే మీరు వినరు కదా?” నన్ను వురిమి చూస్తూ తనకి విరుద్దంగా తనే మాట్లాడుతోంది.
అప్పుడే మా మావయ్య వచ్చారు. “అక్కడికి వినబడతన్నాయి మాటలు, యేమయ్యింది?” అడిగారు. అంతే కథ మళ్ళీ మొదలు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. “దిక్కుమాలినోళ్ళులాగ నీకేమమ్మా? మేమున్నాం” భరోసాగా అన్నారు. నేను లేనని చెప్పకనే చెప్పారు. నేను దోషిలా తలదించుకున్నాను. అక్కడ కూర్చోలేక వుండలేక సతమతమవుతుంటే- మా మావయ్య మొదలు పెట్టారు. “మా సూపరిండెంటు కనిపించాడు. చిన్నల్లుడు గురించి యెవరు చెప్పారో వొకటే మాటలు. గొప్ప అల్లుడ్ని కొట్టీసారండీ మీరు అని. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం అన్నా వొప్పరే. మీవాడు భూములు కొన్నాడట. ఇల్లు యిక్కడ సిటీలో కూడా కట్టిస్తామన్నాడట. మీ చిన్నల్లుడ్ని చూసి బుద్ది తెచ్చుకోవాలి యెవరైనా అన్నాడు…” అని ఆపకుండా చెప్పుకుపోతున్నాడు.
ఆ మాటలు వింటుంటే రాజుగారి చిన్నభార్య మంచిది అన్నట్టే అనిపించింది. నాది రాజుగారి పెద్దభార్య పరిస్థితి.
అంతా యెటువాళ్ళటు చెదురుతుండగా “బావా యెలా వున్నాను?” అడిగింది మా మరదలు. “సూపరు” అన్నాను. తను మరింత హ్యాపీ ఫీలయింది. నేనలాగే చూశాను. మా మరదలు నిజంగానే హ్యాపీగా వుంది. ఇదివరకటిలా కళ్ళు లోపలికి లేవు. కళ్ళకింద చారలూ లేవు. తనివి తీర్చిదిద్దినట్టుగా వుంది. అలా కదిలి వెళ్ళిపోయింది. ఎవరో ఆడవాళ్ళు వస్తే తన చీరలూ నగలూ చూపిస్తోంది. తనకి అందులో ఆనందం వుంది. నేనే అనవసరంగా జాలి పడ్డానని నామీద నేను జాలిపడ్డాను.
మధ్యాన్నం భోజనాల దగ్గర అందరూ యేమీ జరగనట్టు వున్నా నేనలా లేను. పండగ భోజనం రుచనిపించలేదు. తిన్నాననిపించాక ఫ్రెండ్ని కలవాలని బయల్దేరబోతే “పండగతో యెక్కడికి బాబూ… వొద్దు రేపు వెల్దురులే” అని ఆపేసింది మా అత్తయ్య.
టీవీలో వస్తున్న అడ్డమైన ప్రోగ్రామ్స్ చూస్తూ ఆవలింతలు తీస్తుంటే “రాత్రులు నిద్రపోకపోతే యేమవుతుంది?” గోడతో అనేసి వెళ్ళిపోయింది మా ఆవిడ. ఎందుకనో ఆలోచించగా చించగా మా ఆవిడ మీద జాలి కలిగింది. తను తన చుట్టూ వున్న వాతావరణం నుంచి వేరుకాలేక పోతోంది తప్పితే నా మీద ప్రేమ లేక కాదు- అని అనుకున్నాక నాకు కాస్త వూపిరాడింది.
అంతే హుషారుగా పిల్లలతో మీ పెద్దమ్మని పిలవండి అన్నాను. మా ఆవిడ వచ్చి యేమిటన్నట్టు నిలబడింది. “నాకు యింగ్లీషు కావాలి” అన్నాను. ఆమాటకు అర్థం ఆవిడకు తెలుసు. “ఇంగ్లీషు కావాలా?” అర్థం కానట్టు పిల్లలు. “అంటే యింగ్లీషు నేర్పించమని…” కవరు చేసి కామ్ చేయబోతే “నీకింక రోజూ యింగ్లీషే” అని వార్నింగ్ యిచ్చినట్టు తలాడించిదే తప్ప నవ్వలేదు. “మీకు సిగ్గూ రోషం వుంటే నాతో మాట్లాడకండి” అని యింగ్లీషులో అంది. “ఐ లైక్ యువర్ యింగ్లీషు మేడమ్…” నవ్వాను. పిల్లలు కూడా నాతో నవ్వారు. మా ఆవిడ మాత్రం చీదరించుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఆ రాత్రి నిద్రపోయే సమయంలో దర్శనమిచ్చింది. బయటకు వెళ్ళిపోవడానికి తలగడా దుప్పటీ తీసుకుంటుంటే ప్లీజింగుగా చూశాను. నమస్కారం పెట్టాను. శాంతించినట్టే పక్క మీద పడుకుంది మా ఆవిడ. నేనూ పక్కన మెల్లగా చేరాను. తను అటు తిరిగింది. నేను యిటు తిరిగాను. నిద్ర నటించాను. గురక కూడా. ప్చ్… సిగ్నల్ రాలేదు. నిద్రలో నాకే తెలీనట్టు దొర్లి తన వైపు తిరిగాను. చెయ్యి వేశాను. విసిరి కొట్టింది. అని వూహించాను. లేదు. తనేమీ అనలేదు. వెన్ను వాసన చూశాను. వీపు మీద ముద్దు పెట్టాను.
“చెప్పు… నాకు అన్నీ కొంటానని చెప్పు”
“కొంటాను”
“చెప్పు… అన్నీ నాపేర్న రాస్తానని చెప్పు”
“రాస్తాను”
“కథలు కాదు”
“కాదు”
“ఇల్లు రాస్తావా?”
“………………..”
“ఊ- అనవేంటి?”
“ఓనర్ వొప్పుకుంటుందా?”
మా ఆవిడ ఒక్క క్షణం ఆగి దబదబా యెక్కడ పడితే అక్కడ నన్ను బాదికెలిపోయింది. చిక్కేసింది. బక్కిరేసింది. జుట్టు పట్టి పీకేసింది. నెత్తిమీద మొట్టికాయలు కూడా వేసింది.
ఏవీ నొప్పనిపించలేదు. అలాగని లోపలి నొప్పీ తగ్గలేదు. మనసు పుండయినందుకేమో కళ్ళు వూటబావులయాయి.
తను గుండెల్లోకి తీసుకుంది. చెరిపేసిన నా జుట్టుని వేళ్ళ దువ్వెనతో దువ్వింది. కొట్టిన చోటల్లా సుతారంగా నిమిరింది. మొట్టికాయలు వేసిన చోట ముద్దులు పెట్టింది. నా పెదవులు చూపించానేగాని దుఃఖం పట్టలేకపోయాను. వెక్కివెక్కి పసిపిల్లాడిలా యేడ్చాను. “అందరిలో నువ్వు తక్కువైపోతున్నావురా కన్నా…” బాధపడుతూ అమ్మై గుండెల్లో చేర్చుకుంది మా ఆవిడ. ఊరడించింది. జుట్టుపట్టి నా ముఖాన్ని యెత్తి కళ్ళని తుడుస్తూ “యేడ్చే మగాళ్ళని నమ్మకూడదు” అంది.
“మనింట్లో మగాడివి నువ్వు కదా?”
“ఔను కదా?”
తను గలగలమని నవ్వింది. ఆ నవ్వులో నేను కలిసిపోయాను!
***
‘ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదు’ అన్నప్పటికీ కథ పూర్తయ్యేసరికి చటుక్కున కళ్ళు చెమర్చాయి బజరా!
కాకుల మధ్య కోకిలల… విలువులున్న వారి సంసారాలు వీధికెక్కుతాయి..సంపాదన తక్కువ ఉన్న వారి అవస్థలు చాలా బాగా తడిమారు..ఎప్పటిలాగే మీ కథావేగం అలరించింది…
కథ మీద అలా చూపు ఉంచాను, అంతే. కథే చూపుల్ని చివరిదాకా నడిపించుకు పోయింది. అంత బాగుంది కథ జగదీశ్వర రావు గారూ.
అద్భుతం అండీ. 👏👏
ఏది అసలు సంపాదనో అద్బుతంగా పలికించారు బజరా గారూ! నచ్చింది కథ.
దండలోని దారంలా భార్యభర్తల మధ్య గల ఒక ఆర్ధికాంశాన్ని కథనం చేయడంలో కథకునిగా మీ చేయి తిరిగిన తనం బలంగా కనిపించింది సర్..