గెలవటానికీ యుద్ధమే.. ఓడిపోటానికీ యుద్ధమే

1999 మండు వేసవిలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం లో దళిత సాహిత్యం మీద రెండు రోజులు సెమినార్ నిర్వహించాం.అప్పటికే తన ‘ఖాకీ బతుకులు’ నవల ద్వారా సాహిత్యాభిమానులందరికీ పరిచయమైపోయిన జి.మోహన్ రావు(స్పార్టకస్)ను  ఒక సెషన్ లో  వక్తగా పిలిచాం.సభికులతో కిక్కిరిసిపోయిన  హాల్లో సున్నితంగా స్లోగా మొదలై బడబాలనంలా కురిసిన అతని ఉపన్యాసం అందరినీ గట్టిగా తాకింది.ఎత్తుగా,చామన ఛాయలో బక్కపలచగా ఉన్న ఆ రచయిత ఉపన్యాసం ఇన్స్టంట్ హిట్ అయ్యింది.వేదిక మీదనుంచి కిందికి దిగినాక చుట్టుముట్టిన జనంతో మాత్రం ఆగి ఆగి మాటలకోసం వెతుక్కుంటూ మాట్లాడాడు.లంచ్ కి  వుండమన్నా ఉండకుండా వెళ్ళిపోయాడు.  ఆయన నిన్న మరణించాడు. మరణించడం అందరూ చేయాల్సిందే గానీ బతికినంత కాలం ఆ బతుకు స్వభావం ఏంటి సారమేంటి అనేదే ముఖ్యం.

బతుకంతా యుద్ధంజేస్తూ బతికాడు మోహన్ రావు.సమస్యల ముళ్ళమీద నడుస్తూ ఎన్నోసార్లు ఓడిపోయాడు.కొద్దిగా గెలిచాడు.మళ్లీ ఓడిపోయాడు. గెలవటానికైనా ఓడిపోవటానికైనా యుద్ధం తప్పదని తన జీవితం ద్వారా నిరూపించాడు. మా తెనాలి గడ్డ నుంచి గొప్పగా వెలిగి ఆరిపోయిన అపురూప దళిత సాహిత్య యోధుడు ‘ఖాకీ బతుకులు’ నవలా రచయిత  జి.మోహన్ రావు (స్పార్టకస్).

కారం చేడు పోరు తరవాత వచ్చిన తొలి దళిత నవల (1996) ఖాకీ బతుకులు. ఈ నవలలో   పోలీసు వ్యవస్థను దళిత దృక్పథం నుంచి చిత్రించాడు రచయిత. పోలీసు కానిస్టేబుల్స్‌ చుట్టూ అల్లుకు పోయిన కుల , మత పీడననూ, ఇతర సమస్యల నూ , అగ్రకుల అధికార్ల  పెత్తనాన్నీ ఈ నవలలో వాస్తవికంగా చిత్రించి విశ్లేషించాడు రచయిత. చాలా పెద్ద నవల.అప్పట్లో చాలా సంచలనం కలిగించిన నవల.ప్రజా శత్రువులుగా మామూలు పోలీసులను భావిస్తున్న కాలంలో వారి బ్రతుకులు ప్రజల బ్రతుకలకు భిన్నంగా ఏమీ లేవని చూపిన నవల. ఇది పతంజలి ‘ఖాకీవనం’ నవలలా మొత్తం చీకటికోణాన్ని కాకుండా  కిందిస్థాయి పోలీసు జీవితాలు , అందులోనూ దళిత కులాల నుంచి వచ్చిన వారి జీవితాలు , ఎంత వివక్షనూ ,క్రూరత్వాన్నీ ఎదుర్కోవాలిసుంటుందో ‘ఖాకీ బతుకులు’ వాస్తవికంగా చిత్రించింది.నిజానికిది యాంటీ స్టేట్ ఇతివృత్తం.ఆ వస్తువును నిర్వహించడం ప్రమాదకరం అని తెలిసికూడా అది చేయకుండా వుండలేకపోయాడు.

‘ఖాకీ బతుకులు ‘ నవల  తనకి ఎంత పేరు తెచ్చిందో అన్ని బాధల్నీ తెచ్చింది.అధికారులవల్ల అనూహ్య ఇబ్బందులు ఎదుర్కున్నాడు.ఫలితంగా తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.13 సంవత్సరాలు కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ కడు పెదరికానికీ, అవమానాలకీ గురౌతూనే న్యాయ పోరాటం చేసి పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందాదు.ఈలోపు ఎంతో struggle, lot of suffering.ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు రావటాలూ పోవటాలూ .జాబ్ వచ్చినా తనకు తిరిగి రావల్సిన డబ్బు రాలేదు.తిరిగి ఉద్యోగం వచ్చినాక ఓకే ఒక సంవత్సరం ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు.  నవల  రెండవ భాగం రాయాలన్న కోరిక తీరలేదు. భగ్న హృదయం తోనే అశువులు బాశాడు.స్పార్టకస్ పేరుతో రాసిన ఆయనకు స్పార్టకస్ స్ఫూర్తి లేదని కొంతమంది విమర్శించారు.స్టేట్ మీద తాను చేసిన కష్టతరమైన  ఒంటరి పోరాటం మాటేమిటి మరి? పగలు చెమటనీ, రాత్రి కన్నీళ్ళనూ తాగుతూ చేసిన న్యాయ పోరాటం సంగతేంటి?

వీరుడిగా బతికి వీరుడిగా మరణించిన మిత్రుడు మోహన్ రావుకు కన్నీటి నివాళి.లొంగిపోయి, నంగిగా  వంగిపోయి బతుకుతున్న ఎంతోమంది నేటి రచయితలకు స్పార్టకస్ సింహస్వప్నం.ధైర్యవంతులైన యువ రచయితలకు అతనొక స్పూర్తి.

*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

4 comments

Leave a Reply to Thirirupalu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆపాటి ధైర్యం చేయలేనివాళ్ళే ఆయనను విమర్శించారు.

  • ఒక విశిష్ట వ్యక్తి శక్తి గురించి తెలియచెప్పారు.ఇంకా తెలుసుకోవాలని, ఇంకొంచెం సేపు అదే భావఝరిలో ఉండాలనిపించేలా వ్రాసారు.మోహన్ రావు గారు సైనికుడు.ఆయనకు విప్లవాభినందనలు.మీకు కృతజ్ఞతలు.

  • హృదయాన్ని హత్తుకునే నివాలి! అవును ఆరోజుల్లో సాహిత్య లోకంలో గొప్ప సంచలన మే!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు