విదిలించిన రాజముద్రల నుంచి
రాలిన ఎంగిలి మెతుకులే మహాప్రసాదాలు
ఆకలి కడుపుల
ఎలుకల పరుగులకు
బోను భోజనమే పరిష్కారం
దినసరి దుఃఖం
సెలవు తీసుకోనంది
సగటు శ్వాస పరిస్థితి విషమం
*
దేశం చేసిన అప్పుకు
రోజు కూలీ ఈఎమ్మయి
వడ్డీ కే జమవుతోంది
లాభం నష్టం రాగం ద్వేషంతో
కటీఫన్నాయి
లోటు
బడ్జెట్ దో బతుకుదెరువు దో
ఆస్తి అప్పుల పట్టీ తేల్చదు
*
సరుకుల చిట్టా
కొట్టివేతలతో చిక్కి శల్యమైంది
తాయిలాల తాంబూలాలకు
తన్నులాటలే చావురేవులు
అన్నం ముద్ద
ఆత్మహత్యకు ఆటోగ్రాఫ్ ఇస్తే
జప్తు కాగితం మీది చేవ్రాలయింది
రాజ్యమే గొంతు నులుముతున్నపుడు
ఉరికంబ విశ్రాంతి విరామం సంతోషాన్నివ్వదు
బతుకు రాలిన నేల
నెత్తుటి మొలకయ్యింది
*
ఓదార్పులు పరామర్శలు
చిలుం పట్టాయి
అంకెల మెదళ్లకు
ఉద్వేగాల సశేషం విశేషం కాదు
పేదరికంతో అబద్దమాడితే
కలలు కళ్ళను బహిష్కరించాయి
నది అలను చెట్టు చివురును
గాలి పరిమళాన్ని ఆక్రమించినట్టు
మనిషి
జీవితాన్ని ఆశ పడుతున్నాడు
ఆకలి సుష్టుగా
ఆహార్యం పులుముకుని
త్రేన్పులను నటిస్తోంది.
*
చిత్రం: సృజన్ రాజ్
Very good poem
బతుకు రాలిన నేల నెత్తుటి మొలకయ్యింది
👏👏👏🙏🙏🙏
💕👌
🎊🌱💐
దేశం చేసిన అప్పుకు
రోజు కూలీ ఈ ఎమ్ ఐ
వడ్డీకే జమవుతోంది – అనడం కఠోర వాస్తవం
లోతైన చూపు కూడా
👌🙏