క్రాస్ రోడ్స్…

స్త్రీ-పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థ, మానవ సంబంధాల్లోని లోటుపాట్లు, అగాథాలు, అంతరాలు శతపత్రమంజరి కథల్లో ప్రతిఫలిస్తాయి.

వర్షం కురిసి వెలుస్తుందో, వెలిసే లోపే మరోసారి కురుస్తుందో అర్థమవ్వడం లేదు.

అచ్చం నా రోదనలాగే…అంతా విని నన్ను తన గుండెల్లో పొదువుకున్నాడు.

జాలో, ప్రేమనో…పేరేదైతేనేమీ!?

 రెండు తనువులు కలవడానికి పెద్ద పెద్ద కారణాలక్కరలేదు.

కొంత ఏకాంతం-దానికి తగిన వాతావరణం-ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటే చాలేమో…

 

***

రీంనగర్ జిల్లాకు చెందిన, హైద్రాబాద్ లో స్థిరపడిన శతపత్ర మంజరి తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కవిత్వంతో పాటూ కథలు రాస్తున్నారు. గత ఏడాది వచ్చిన జాడ కథతో కొత్తతరం కథకుల్లో గుర్తింపు పొందారు. స్త్రీ-పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థ, మానవ సంబంధాల్లోని లోటుపాట్లు, అగాథాలు, అంతరాలు శతపత్రమంజరి కథల్లో ప్రతిఫలిస్తాయి. ఆధునిక మహిళల్లోని అంతస్సంఘర్షణను తన కథల్లో చూపిస్తున్న శతపత్రమంజరి కథ  క్రాస్ రోడ్స్ ….సారంగ రేపటి కథ.

*

క్రాస్ రోడ్స్

హోరున కురుస్తున్న వర్షంలో, నిర్మానుష్యమైన ఈ ఘాట్ రోడ్డుమీద చిక్కడి పోయి గంటకు పైగా అవుతుంది…..

బయలుదేరుతున్నప్పుడే తుంపర తుంపరగా ఉన్న ముసురు చినికి చినికి గాలివానగా మారింది. సాలూరు దాటి ఘాట్ రోడెక్కిన పదినిమిషాలకే కారు టైరు పంక్చరయ్యింది.

సాయంత్రం ఐదింటికే దట్టమైన మబ్బుల కారణంగా చీకటి ముసురుకుంటుంది.

స్పేరు టైర్ ఫిట్ చేసుకుని బయలుదే‌రడానికి అరగంట సమయం పట్టింది.

మరోఅరగంట ప్రయాణం చేసామో లేదో రెండో టైరు పంక్చరయ్యింది.

కొత్తకారు అనే నమ్మకంతో సాయంత్రం వేళ ఘాటీ రోడు ప్రయాణానికి పూనుకున్నాం.

ఊహించని విధంగా రెండో టైరు కూడా పంక్చరవ్వడంతో ఏం చేయాలో తోచక తనలో విసుక్కుంటున్నాడు… గిరిధర్.

“అంత అర్జెంట్ పనేమిటీ!? ప్రోగ్రాం రేపు మధ్యాహ్నం అంటున్నావు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే బయలుదేరవచ్చు కదా….”

గిరి మాట వినకుండా హడావిడి చేసి మరీ గిరిని ‘కొరాపుట్’కి బయలుదేర దీసిన నా తొందరపాటు గుర్తొచ్చి, తన మాట విని ఈ రాత్రికి శ్రీకాకుళంలో ఉండిపోయినా అయిపోయేది అనిపించసాగింది.

అన్ని వైపులా అద్దాలు పైకెత్తినా ఒంట్లో ఒణుకు పుట్టేస్తుంది.

చుట్టుపక్కలోయలంతా పచ్చగా ఉన్నాయి. కాస్త దూరంలో ఒక జలపాతం పాల నురగలు కక్కుతూ జలజల దూకుతుంది.

మరో సమయంలో అయితే ఎంత ఎంజాయ్ చేసేదాన్నో ఇలాంటి అందమైన ప్రదేశంలో…కానీ ఇప్పుడు మాత్రం బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను.

“కొరాపుట్ చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది”అని అడిగాను.

“గంటన్నర”అన్నాడు గిరి.

గిరి నా డిగ్రీలో క్లాస్మేట్ అండ్ కొంత కాలం నా కొలీగ్ కూడా…కాలేజ్లో గెటిన్ గెదర్ వలన మళ్ళీ ఎనిమిదేళ్ళ తరువాత ఇలా శ్రీకాకుళంలో కలిసాం.

తను కొరాపుట్లో పనుంది అనడంతో ఇద్దరం కలిసి ప్రయాణం మొదలెట్టాం.

ఫ్రెండ్సందరూ టచ్లోనే ఉంటున్నారు. ఒక్క నేను తప్పా.  మా కెమిస్ట్రీ లెక్చరర్ ప్రస్తుతం నా కొలీగ్ కావడం మూలాన నేనూ అంటెండ్ కాగలిగాను.

ఏదో హారన్ మోత వినపడితే వెనక్కి తిరిగి చూసాను. ట్రక్కు వేగంగా దూసుకొస్తుంది.

ఆ ట్రక్కును ఆపండి నేను అందులో వెళ్ళిపోతానన్నాను.

“ఈ సమయంలో ఒంటరిగా ట్రక్కులోనా…వద్దు”సేఫ్ కాదన్నాడు గిరి.

“మరెలా…ఇలా నడిరోడ్డు మీద ఎంతసేపని ఉండగలం…”అన్నాను..అసహనంగా…

“మెకానిక్ షెడ్డు కూడా దగ్గరలో లేదు. సాయంత్రం ఆరు,ఏడయితే ఈ ఘాట్ రూట్లో ట్రక్కులు తప్ప వెహికిల్స్ కూడా పెద్దగా తిరగవు. పోని నేను ఏదైనా ట్రక్కులో వెళ్ళి మెకానిక్ తీసుకొస్తాను” అంత వరకు నువ్వుండగలవా…!?

“అమ్మో…ఈ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒంటరిగానా…నా వల్ల” కాదన్నాను.

సిగరెట్ తీసి వెలిగించుకుని…పర్లేదు కదా..అన్నాడు సిగరెట్ ఎత్తిచూపుతూ…

“పర్లేదన్నట్లుగా తలాడించాను. ఆయనకి తెలియని విషయం నేను చైన్ స్మోకర్నని!

కాసేపటి మౌనాన్ని ఛేదిస్తూ..అదిగో అక్కడ కనిపించే కొండ మలుపు తిరిగితే పొట్టంగి ఊరొస్తుంది. అక్కడ నాకు తెలిసిన ఒక సంగీతం టీచరుంటారు. నడుస్తూ వెళ్తే పదినిమిషాలలో అక్కడుంటాం…వెళ్దామా” అన్నాడు.

స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగే సిట్యూయేషనా..నాది!?

మీ ఇష్టం అన్నాను.

పదిహేను నిమిషాలు వానలో తడుస్తూ నడిచాక, ఒక పెద్ద బంగళా ముందు నిలబడ్డాము. గేటు కొట్టగా, కొట్టగా…రెయిన్ కోట్ ధరించి ఉన్న ఒక యాభై సంవత్సరాల వ్యక్తి పెద్దపద్ద అంగలేస్తూ వచ్చి ఒరియాలో ఏదో మాట్లాడాడు.

గిరి కూడా ఒరియాలోనే ఏదో సమాధానమిచ్చాక మోస్తరు పరుగు లాంటి నడకతో లోపలికెళ్ళి, రెండు మూడు నిమిషాలలో తాళం చెవితో తిరిగొచ్చి గేటు తెరిచాడు

“ఘాటీ రూట్లో కదా…దొంగల భయం ఎక్కువ..అందుకే ఇలా చీకటి పడకముందే తాళాలు వేసేసుకుంటారు. మేడమ్ ఊర్లో లేరంటా, ఇందాకటతను కాల్ చేస్తే మనల్ని ఉదయం వరకు వచ్చేస్తాను మనల్ని ఉండమన్నారట” అంటూ ఏవేవో చెప్తున్నాడు  లోపలికి నడుస్తూ…గిరిధర్!

అత్యాధునిక బిల్డింగేం కాకపోయినా అన్నీ సౌకర్యాలతో చాలా బాగుంది. వర్షం ఆగాగి కురుస్తూనే ఉంది. వేణ్ణీళ్ళతో స్నానం చేసాక, సంగీతం టీచర్ గారిదే ఒక నైటీ వేసుకుని మాలీ ఇచ్చిన టీ తాగుతూ వరండాలో మార్బల్ పై కాళ్ళు మలిచి ఒదిగి దగ్గరకు ముడుచుకుని కూర్చున్నాను.

గిరి కూడా టీ కప్పుతో వచ్చి కూర్చున్నాడు.

ఎదురుగా కొండల మధ్య నుండి హోరుమని చప్పుడు చేస్తూ వీస్తున్న గాలి,కొండలను ఒరుసుకుంటూ నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న యేరు నన్నే చూస్తూ తాను-తనని గమనించనట్లు నటించే నేను!!

ఎన్నో చెప్పాలనుంది కానీ, ఎంతసేపటికీ తానేమీ అడగడే…

“తాను…ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నిర్దాక్షిణ్యంగా నవ్వేసి, మా ఇద్దరికీ కామన్ కొలిగ్ అయిన రఘుతో నా పెళ్ళని చెప్పినప్పుడు ఎంత నిరాశను చూసానో తన కళ్ళలో…

ఆ తరువాత లిబియా యూనివర్సిటీ వాళ్ళు పంపిన కండొలెన్స్ పేరిట మమ్మల్ని వదిలేసి గెస్ట్ ఫ్యాకల్టిగా”వెళ్ళిపోయాడు.

తాను వెళ్ళిపోయాక నెల రోజులకే మా పెళ్ళి అయిపోయింది.

హలో మేడమ్…హలో మేడమ్…హలో…మూడోసారికి సృహలోకొచ్చి, తనని చూసి తడబడిపోయాను.
“ఇప్పుడేంటీ…మిమ్మల్ని మీరు అనాలా మేడమ్!?”అన్నాడు చిలిపిగా నవ్వుతూ…
“పోరారేయ్…”ఆగాకుండా నవ్వుతూనే ఉన్నాను.
మెల్లిగా నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు”ఇప్పుడు చెప్పు! నీ గురించి ఏదేదో విన్నాను. విన్నవన్నీ నిజాలని నమ్మి నిన్ను అవమానించలేను. నువ్వు చెప్తే వినాలనుంది” అన్నాడు మృదువుగా చేతిని తడుముతూ…

“కోమలం..మృదుమధురం పావనం”

ఈ మాత్రం ఆత్మీయత దొరకక రెండేళ్లుగా ఎంత అల్లల్లాడిపోయాను…ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేసింది.

హఠాత్తుగా తన భుజంపై వాలి పోయి ఏడ్చేసాను. నా అంతట నేనుగా తెప్పరిల్లే వరకు తానేమీ మాట్లాడలేదు.

చాలా సేపటి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ..”నువ్వేం విన్నావో నాకు తెలియదు కానీ, నేను నా భర్తను హత్య చేయడానికి ప్రయత్నించి, విఫలమయ్యి పోలీస్టేషన్లు, కోర్టుల చుట్టు తిరిగి ఈ మధ్యే ఆ కేసు నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నాను గిరి…” అన్నాను.

విషయం ముందే తెలిసినందుకు కావచ్చు నేను ఊహించినంతగా ఆశ్చర్యపోలేదు తాను “ఇంకా చెప్పు”అన్నట్లుగా చూస్తున్నాడు నాకేసి…

వివాహానంతర జీవితం పంజరంలో చిలకలాగయిపోయింది గిరి. ఆ రోజుల్లోనే మా అమ్మానాన్నలది రెవల్యూషనరీ మ్యారేజ్. నేను పుట్టింది కేరళ. పెరిగింది కరీంనగర్. ఉద్యోగం చేస్తున్నది హైదరాబాద్. అసలు సిసలైన కాస్మోపాలిటన్ నేను. మనుషుల్ని కలుపుకుపోవడం, మనుషుల్లో కలిసిపోవడం నాకిష్టం.

మా పెళ్ళయిన రెండు నెలలకు మా పిన్ని కొడుకు అరవింద్ పెయింగ్ గెస్ట్ గా ఉండి చదువుకోవడానికి మా ఇంటికొచ్చాడు. వాడు వస్తున్నట్లు, ఒక ఆరు నెలల పాటు మా ఇంట్లోనే ఉండబోతున్నట్టు ముందే ఈయనకు చెప్పుంచాను… అయినా వాడొచ్చిన మూడోరోజు మీ కజిన్ కి మొహమాటం ఎక్కువనుకుంటా మరో రెండు రోజుల వరకు వెళ్ళడానికి వీళ్ళేదని నా మాటగా ఖచ్చితంగా చెప్పు నీలూ…అని వాడికి వినపడేలా గట్టిగా అరిచి చెప్పాడు. అందుకు వాడు “ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వుంటాను బావా”అనేసి సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యాడు. అది మొదలు ఏదో కొంపలు మునిగే అవసరం ఉంటే తప్ప నా తరుపు బంధువులెవరు మా ఇంటికి వచ్చేవారు కాదు.

నా నడక, నడత, నవ్వు… నా జీతం, జీవనం, జీవితం… నా తెలివి,హ్యూమర్,చలాకీతనం…అన్ని తన అదుపాజ్ఞాలలోకి వెళ్ళిపోయాయి. ‘నీలిమా లోగిల్ల’ అనే నా పేరు ‘మిసెస్ నీలిమా రఘురామ మూర్తి’గా గెజిటెడ్ అటెండెన్స్ లో మారే వరకు ఆయనకు కంటి మీద కునుకు లేదు. ఫ్యామిలి ఫ్లానింగ్ చేస్తున్నట్లు నాలుగక్షరాలతో ఆయన సైన్ చూసినప్పుడల్లా నా ప్రాణం చివుక్కుమనేది. సంతకాలలోనే కాదు సంసారంలో కూడా ఆయనది సిగ్నేచర్-నాది డిక్లరేషన్!!

ఎంత సర్దుకుపోదామన్న గొడవలు ఒక్కొక్కటి పెరుగుతూనే పోయాయి. రివల్యూషనరీ ప్రేమ పెళ్ళి చేసుకున్న నా పేరెంట్స్-పెళ్ళయ్యాక మాత్రం మామూలు పేరెంట్స్ అయిపోయారు. పైగా రివల్యూషనరి జీవితం పట్ల అసహనంగా ఉన్నారు. ఈ ఆత్మవంచన కాపురం చేయడం నా వల్ల కాదని బయటికొచ్చిన ప్రతిసారి పరువుని, ప్రతిష్టని…చివరకు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి కలిపే వారు.

ఆ రోజు ఫ్రెండింట్లో పార్టీకి వెళ్ళడం వలన రాత్రి ఆలస్యంగా ఇంటికెళ్ళాను. మామూలుగా తన నుండి ఎలాంటి అవమానం ఎదురవుతుందనుకున్నానో అంతకు పదిరెట్లు ఎక్కువయ్యింది. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా వీధిలోనే కాలనీ వాళ్ళంతా చూస్తుంటే నోటికొచ్చినట్లు తిట్టేసాడు. రాత్రంతా చలిలోనే గేటు ముందు పడుండలేక నా ఫ్రెండ్ రమ్య ఇంటికి వెళ్ళాను.

తెల్లవారేసరికల్లా ఇద్దరు పోలీసులతో వచ్చి రమ్య భర్త వినయ్ గారిని కిడ్నాపింగ్ కేసులో అరెస్టు చేయించాడు. రమ్యను బ్రోకరని,తాడ్పుడుగత్తె అని ఏదేదో తిట్టేసాడు. ఆ పోలీసులు నాకు చక్కగా సంసారం చేసుకోమని హితభోద చేసి మరి వెళ్ళారు. నాకు తల తీసేసినట్లయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకుని ఇంటికెళ్ళాను. వాడు చస్తే తప్పా నా జీవితానికి వెలుగు లేదని-రాదని…అదే రోజు రాత్రి తప్పతాగి వచ్చి బూతుపురాణం చదివి,చదివి…పడుకున్న వాడి మొహం మీద దిండేసి నొక్కిపట్టాను. ఊపిరాడక తన్నులాడుతుంటే ఛాతి మీద కూర్చోని మరి బలంగా నొక్కేసాను. ఐదు నిమిషాలలో తన చేతనం తగ్గి,తన్నులాడడం తగ్గింది. మరో నాలుగైదు నిమిషాలలో ప్రాణం పోయేదే…కానీ నా వల్ల కాలేదు గిరి…ఒక మనిషిని చంపి,మామూలుగా బతకడం నాతో అయ్యే పని కాదు. దిండు పక్కన పారేసి,ఓ మూల జరిగి కూర్చోని ఏడవడం మొదలుపెట్టాను.

పదిహేను నిమిషాలకు స్థిమితపడిన తరువాత తన ఇష్టం వచ్చినట్లు కొట్టేసాడు. సృహ తప్పిన నన్ను వదిలేసి పోలిస్ రిపోర్ట్ చేసాడు. మా బంధువులను పిలిపించి పంచాయతీ పెట్టాడు. పోలీస్ స్టేషన్లో, బంధువులలో, స్నేహితులలో..అన్నిచోట్ల అవమానాలే…నా ఉద్యోగం తీయించాలని ప్రయత్నించాడు. కానీ నా తరుపు లాయర్ తెలివిగా వాదించి గట్టెక్కించాడు.

వర్షం కురిసి వెలుస్తుందో, వెలిసే లోపే మరోసారి కురుస్తుందో అర్థమవ్వడం లేదు. అచ్చం నా రోదనలాగే…అంతా విని నన్ను తన గుండెల్లో పొదువుకున్నాడు.

జాలో, ప్రేమనో…పేరేదైతేనేమీ!? రెండు తనువులు కలవడానికి పెద్ద పెద్ద కారణాలక్కరలేదు. కొంత ఏకాంతం-దానికి తగిన వాతావరణం-ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటే చాలేమో…

ఉదయం తొమ్మిందిటికి కొరాపుట్ ప్రయాణమయ్యాం. దారి పొడవున ఇద్దరి మధ్య నిశ్శబ్ధం అవహించింది. కొరాపుట్లో నన్ను డ్రాప్ చేసి వెళ్ళే ముందు ‘నీలూ’ నిన్ను మరోసారి కలవాలంటే ఎలా!? నీ అడ్రెస్, మొబైల్ నెంబర్ ఇవ్వవూ అన్నాడు…ఆర్తిగా చేతిని తడుముతూ….

‘వద్దు గిరి!మన జీవితాలు వేరు-గమ్యాలు వేరు!! ఒకరికి ఒకరం స్థాయి నుండి మన పిల్లలకు మనం అనే స్థాయికి ఎదిగాం…మన జీవితాలు ప్రశాంతంగా ఉండాలంటే మన కలయికను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుని ముందుకు సాగడమే అని చేతిని మృదువుగా వదిలించుకుని ముందుకు సాగాను.

*

 

రోజూ చూసే జీవితమే కథ

మొదటి కథ ఎప్పుడు రాశారు…దాని నేపథ్యం చెప్పండి.

మొదటి కథ 2015లో రాసాను. సరదాగా ఫేస్బుక్కులో పోస్ట్ చేసుకుందామని రాసుకున్న ఒక కథను స్వాతి వీక్లీలో హాస్యకథల పోటీకి “రాంబాబు-ఆ పేరులోనే ఓ వైబ్రేషనుంది”అనే టైటిల్ తో పంపిస్తే కన్సోలేషన్ బహుమతి కథగా ప్రచురితమైంది. అదో గొప్ప ప్రేరణ నాకు. నేను రాసినవి కూడా ప్రచురింపబడతాయనే ఆత్మస్థైర్యాన్ని పెంచింది.

మీ కథల్లో ఎక్కువగా పెళ్లి గురించి, ఆ బంధంలోని ఆటు పోట్లు గురించి చర్చిస్తుంటారు.  ఎందుకని?

ఏ కళైనా మన జీవితానుభవాలకు అతీతం కాదు. రచన కూడా అంతేనేమో… మన రోజు వారి జీవితంలోంచి, మన అనుభవాల నుంచి స్పూర్తి పొందే కదా రాస్తాము. అలా నేను కూడా నాకో, నా పరిచయస్తులకో ఎదురైన సంఘటనల ఆధారంగా కథలు రాస్తున్నాను.

 మీ కథల్లో …జాడ కథ భిన్నంగా ఉంటుంది. దాని కి ప్రేరణ ఇచ్చిన సంఘటన ఏదైనా ఉందా..?

2009లో డిగ్రీ ఫైనల్ మొదలు..బి.ఎడ్.,ఎం.ఏ తెలుగు&సంస్కృతం…నా చదువంతా తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో సాగింది. అప్పుడు పోగేసుకున్న జ్ఞాపకాలే ‘జాడ’కథకు మూలం. ఆ కాలానివి ఇంకా బోలెడు జ్ఞాపకాలున్నాయి. కాలం అనుకూలిస్తే అన్నింటినీ కథలుగా రాయాలనుంది.

 తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పుడు కొత్త తరం కథకులు చాలా తక్కువగా వస్తున్నారు. మహిళా కథకులు ఇంకా తక్కువ. ఎందుకని అనుకుంటున్నారు.?

ఇప్పుడే కాదు గతంలో కూడా బండారు అచ్చమాంబ, ఇల్లిందుల సరస్వతీ దేవి, పి.యశోదారెడ్డి, ముదిగంటి సుజాతా రెడ్డి…ఇలా వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మేరలోనే తెలంగాణ ప్రాంతం నుండి మహిళా కథకులు ఉన్నారు. తెలంగాణలోని అన్ని రంగాలలో మాదిరే రచనా రంగంలో కూడా ఈ వెనకబాటు. మా ప్రొఫెసర్ కాశీం సర్ ఒక మాట చెప్పేవారు.  కడుపు కాలినోడికి పొట్ట తిప్పలు-కడుపు నిండినోడికి కాలక్షేపం తిప్పలని…

మీకు నచ్చిన కథలు, కథకులు…

చలం మాదిగమ్మాయి మీద ఒక రివ్యూ రాయాలనుంది. అలాగే త్రిపురనేని గోపిచంద్ సంపెంగ పువ్వు, గీతాపారాయణం, హిందూపాతివ్రత్యం, పతివ్రత అంతరంగికం, సలీం గారి తెగిన గుండె, కొలకలూరి కులవృత్తి, పాటిబండ్ల రజిని గారి పున్నామ నరకం..ఇంకా చాలా మంది. పుష్కిన్, ఛెకోవ్, గోర్కీ, మామ్, ఓ హెన్రీ, బేట్స్…ఎవరెవరో పరిచయం చేస్తే చదివింది (డిక్షనరీ పక్కన పెట్టుకునిలెండి) కొన్ని కథలే అయినా అలా గుర్తుండిపోయారు.

 మీ నేపథ్యం…?

మాది కరీంనగర్ జిల్లా, అమ్మ వసంత, నాన్న జగన్ మోహన్,  ఇద్దరు చెల్లెల్లు రేఖ, సిరిషా…అస్సలు సాహిత్యంతో సంబంధం లేని కుటుంబ నేపథ్యం…నాకో పాప, బాబు. నేను డిగ్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను.

నాకు చదవడం.. రాయడం..రాసింది నలుగురితో పంచుకోవడం…అంటే చాలా ఇష్టం.  అందుకే మా ఊళ్లో ఒక పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాను. మా ఊరి చుట్టుపక్కల 20-30 ఊర్లకు అందుబాటులో ఉండేలాగ సెంట్రల్లో ప్లాన్ చేసాను. వారానికో ఊరు చొప్పున ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పంచాయతీ ఆఫీసులు తిరిగి గ్రంథాలయం పై అవగాహన కల్పిస్తాను. ఆసక్తి ఉన్న విద్యార్థులను, ఔత్సాహికులను సేకరించి, విద్యంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదని, బతకడమంటే రోబోలుగా మారడం కాదని..అదో విస్తృతమైన, సులభతరమైన ప్రాసెసని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను.

*

 

 

శతపత్ర మంజరి

8 comments

Leave a Reply to Prasanthi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు కథ రాసిన విధానం చాలా బావుంది. చివరిదాకా చదివించింది.

    కకపోతే, అదే వాస్తవ ప్రపంచంలో జరిగేదేమో – అంతగా పరిచయం కాని ప్రపంచం గురించి కమెంట్ చేసే సాహసం నాదేమో – కానీ ఎందుకో ఇలాంటి కథలు ఇలా కాకుండా ఇంకొంచెం higher plane లో ముగిస్తే బావుంటుందీ అని అంతే! అది కూడా నేను అనుకోవడమే కానీ మీరు నాతో ఏకీభవించాలని కానే కాదు.

  • జీవితాన్ని చూస్తున్నట్లు అనిపించింది….చాలా బావుంది…చదివించే శైలి…you are a excellent writer….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు