అజ్ఞాత కెరటాల అవగాహనాతీత అర్ణవాలలోకి, ‘మెరపులీనే’ అవ్యక్త అసీమలలోకి, అస్తిత్వ విపర్యాలలోకి నా ప్రయాణం!
– పాబ్లో సబోరియో (Pablo Saborio ).
పాబ్లో సబోరియో బహుముఖ కళాకారుడు. ఆధునికానంతర కవి. అమూర్త చిత్రకారుడు. అపూర్వ ఫోటోగ్రాఫర్. కోస్టరీకా లో పుట్టిపెరిగి, అమెరికా, స్వీడన్, జర్మనీలో నివసించి, ప్రస్తుతం డెన్మార్క్ లో ఉంటున్నాడు. నిరంతర యాత్రికుడు. హత్తుకునే రంగుల మాంత్రికుడు. భాషకు అవతలి భాషాతీత తీరాలలో అక్షరాలను ఎక్కుపెట్టే విలుకాడు. వర్ణమాలికతో హరివిల్లులను అల్లిన ‘చిత్ర’కారుడు. సాంప్రదాయ స్కూల్ విద్యా విధానాలు పట్టని, ఉజ్వలమైన ఉద్యోగాలంటే గిట్టని అతివాది, అధివాస్తవిక వాది సబోరియో. కోపెన్ హేగన్ లోని ప్రపంచ కళాఖండాల మార్కెట్ Maskiner Arts సభ్యుడు. సబోరియో అంటే ‘Beyond Language’, both in English and Spanish. అతనికి కవిత్వం అంటే ఒక Trans-Sence language, ఒక language of transcendence, ఒక Soul language, క్షణికం నుండి అక్షణికాన్ని రాబట్టే ఒకానొక Alchemy. ‘నేను ఆకాశ సంబంధిని’ అంటూ నిశ్శబ్దపు వంపుల మీద అదృశ్య దృశ్య రూపకమై నింపాదిగా Cosmosలోకి రంగప్రవేశం చేసే అత్యంత అధునాథన ఫిలాసఫర్-పొయట్ ఆర్టిస్ట్.
పాబ్లో సబోరియో పేంటింగులు పారుతున్న దృశ్యకవనాలు. సూక్ష్మ, స్థూలరూపాలుగా మిళితమైన ప్రకృతి రూపాకృతులు కాన్వాసు మీద రంగుల జలపాతాలై దూకుతుంటవి. రంగులు, రంగుల నీడలు ఒరుసుకుంటూ పారుతుంటవి. కాన్వాసు మీద, గాజు పలకల మీద abstract paintings లై, ఛాయాచిత్రపటాలలో film poetry లై అతను ప్రవహిస్తుంటాడు. అతని నవసృజన కవిత్వం, అతని అమూర్త చిత్రలేఖనంలో అతడు కరిగిపోతుంటాడు. అతని మనోమయ ప్రపంచం అంతా కళావేదిక మీద దృశ్యాదృశ్య కవన ధ్వనిపై నర్తిస్తుంటుందని విశ్లేషకుల సాభిప్రాయం. కోపెన్ హేగ్ లో ఇప్పటికే మూడు సోలో ఆర్ట్ ప్రదర్శనలు చేశాడు. తరచుగా స్కాండినేవియాలో విశ్వ విఖ్యాత చిత్రకళాఖండాలను సేకరిస్తుంటాడు.
పాబ్లో సబోరియోది చిత్రమైన వ్యక్తిత్వం. అంచులు దాటుతున్న కవితాభివ్యక్తి. అచంచల కళాభిలాష. అతిశయ భ్రమణ కాంక్ష. రెండున్నర ఏళ్లలో 25 ప్రపంచ దేశాలు పర్యటించాడు. సైన్స్, సాహిత్య, చరిత్ర, తాత్విక చిత్రకళారంగాలలో పదేళ్ళుగా పరిశోధన చేస్తున్నాడు. ఈమధ్య మెడిటేషన్ మీద పడ్డాడు.
పాబ్లో సబోరియో మాటల్లో కొన్ని పదాలు భాషకు బయట ఉంటవి. కొన్ని నవ కవన స్రవంతులు భాషారేఖకు బయట, పదాల పరిధికి చేరువలో ఆత్మిక చైతన్యమై, భౌతిక ఆనందమై కలిసి ప్రవహిస్తుంటవి. కొత్త వాక్యాలు పురివిప్పుతుంటవి.
పాబ్లో సబోరియో నాలుగు పద్యాలకు నా అనువాదాలు:
“Beyond Language” అనే కవితా సంచిక నుండి సేకరించి అనువదించిన పద్యాలివి. “రాస్తా”లో వచ్చినవి. నా అనువాద కవనసంపుటి “ పురివిప్పిన పొరుగు స్వరాలు” లో విచ్చుకున్నవి:
- అనంత అవ్యక్తం:
ఆకాశాన కనిపించీ కనిపించని ముత్యంలా ఓ నగ్న మేఘం;
దాని మీంచి జారుతుంటుంది అనంత అవ్యక్తం.
నేను చలి సమీరాలను చీల్చి తెచ్చి
నా భుజాలకు కనిపించని మెత్తలను కట్టుకుంటాను.
కారు పరుగెత్తిస్తున్న హెడ్ లైట్ కాంతులను
పీల్చుతుంటుంది దిగ్వలయం.
నా అర్థాలన్నిటికి ఆధారం వాతావరణం;
మంచు బరువుల ఆలోచనలు కింది స్థాయికి చేరుకుంటవి,
అద్దంలాంటి నిశ్శబ్ద తెలివిడులు పిట్ట మాటలను
రాయి చూపులను కలుపుతుంటవి.
ఎంత నిశితంగా ఉండాలి
బాణంలా దూసుకుపోయే ఈ అడవి బాతుల బారు!
ఆఖరు సూర్యుని కత్తి గాటుకు పేరిన నా కన్నీటి తడిపొర
కనుమరుగు చేస్తున్నది నా అశ్రువులో దాగిన ప్రపంచాన్ని.
నా అసంపూర్ణ కథ తిరిగి బుద్ధునిలో కరుగుతుంది.
నక్షత్రం లాంటి ఈ రాత్రి దీర్ఘ కాంతి ధారై పారిపోతుంది.
- బంగారు :
దేహరహిత సందేశం గదిలోకి చేరుకుంది;
వట్టి వర్తమాన సంకేతం.
శుభ్రమైన గుహ గుండ్రంగా;
ప్రతిధ్వనిలా వణుకుతున్నది పారదర్శకంగా.
గాలి గోడలకు వేలాడుతున్నది మట్టి బెడ్డలా;
ఆ బరువైన పక్వ ఫలం ఎప్పుడైనా రాలొచ్చు,
వెలుతురు అంచుల చుట్టు గోతులు తవ్వుతున్నది;
నట్టనడుమ ఓ నీడల ద్వీపాన్ని నాటాలని.
మాట కన్నా చిక్కనైన వార్త
దుర్మార్గపు అనుభవాలను పారిస్తున్నది;
తుప్పుపట్టిన మసక వెలుగుల చీకటి కిటికీలోంచి పోతూ పోతూ.
ఆ పసిడి సంకేతం దీపస్తంభాల మిసిమికి తాకి నేల రాలుతున్నది;
ముడుచుకున్న కొన్ని ఆకులు పడిఉన్నవి ఇంకా రోడ్డు పక్కన;
నిండు రాత్రి నిశ్శబ్దంగా ప్రేవేశించే దాకా.
చేయిని అందిస్తున్నది తొందరిస్తున్న చెవి; సందేశ సారాంశం కోసం.
శ్రోత శబ్దాన్ని మాత్రమే చూస్తున్నాడు;
కారుతున్న ప్రపంచ పదార్ధం సంగీతంలోకి స్రవిస్తున్నది.
వింటున్న వాడి దేహం మొదట జ్వాలై నర్తించి,
పిదప గాలిలా కదలి,
తుదకు మర్మర ధ్వనిగా మిగిలి పోయింది.
చివరకు కలుస్తవి సంకేత సందేశాలు,
దేహ౦ శబ్దం, సంగీతం రక్త నాళాలు.
ఇప్పుడు
గదిలో నిండిన నీరు సందేశాన్ని ముంచేస్తుంది.
దేహం – కేవలం ఓ పాట;
పాట ప్రపంచంగా మిగిలి పోతుంది .
- కవిత రాయడం ఎలా ? :
గారడి ఏంటంటే కళ్ళు మూసుకోవడం.
కనురెప్పల కింది చీకటి దుప్పట్లోకి దూరి వెదకడం.
ఉండు నిశ్చల వేటకానిలా. తొణకొద్దు;
శూన్యంలో వెండి వెలుగులు మార్మోగినా.
నీవు వేచి చూచేది ఓ గర్జన కోసం.
అది ఒక సంకేతాల సుడిగాలితో మొదలౌతుంది;
ప్రతీకల చుట్టు ప్రతీకలు పరిభ్రమిస్తున్న
రూపమార్పిడుల వింత ప్రయోగాలతో.
నీవు ఒక మెరుపు రేఖను ఆశిస్తుంటావు,
అవగాహనా కంచెను దాటి
ఆలోచనా తోటలను ఆసాంతం మింగేసే
ఓ విపత్కర ఒంటరి పదం కోసం చూస్తుంటావు.
ఆకస్మిక ప్రమాదాలలోకి సాహసిస్తుంటావు,
బూది కుప్పలపై తుఫానులా చెలరేగుతుంటావు.
త్వరలోనే, చీకటి కాలిన మంటలు మొదలౌతాయి;
అప్పుడు
నీవు ఓ అణువు లోకి దూకిన సూర్యునివై దర్శిస్తుంటావు
నగ్న నయనానికి కనిపించే ఒక జన్మ ప్రసవించడం .
- గతంలోకి :
నేను మేఘాన్ని నరకాలని కాంతిని ఖడ్గంలా సాచాను;
చిక్కింది చిక్కని అనంతత్వపు ద్రవబిందువు.
వెలుతురును ముక్కలు ముక్కలు చేసి కాలాన్ని తిరిగి అమర్చేందుకు
సూర్యుణ్ణి మించిన సాధనం ఇంకేం ఉంటుంది.
తల దిండులను పేల్చి ఈకల లాంటి జవాబులను
ఆ కలలో వేలాడదీసాక నిశ్శబ్దం ఎంత సమ్మోహనం;
అది కంపిస్తుంటుంది;
నీ కళ్లూ ఆ ఈకలూ కలిసిన సింఫొనీ లా.
మళ్ళీ కొన్ని క్షణాలకు
చెట్టుకన్నా ముందు నల్ల రక్తనాళాల ఆకాశం
నిశ్శబ్దపు రేతిరి దేహం లోకి వేశిస్తుంది.
అది మనసు సూచన; దాని కథ తుంచబడుతుంది
కాలం పన్నిన భ్రాంతి పరిమళంలోంచి.
నా నిన్నటిలో తిష్టవేసిన ప్రపంచం నా కథలను నేస్తుంటుంది
పోగు పోగుగా పై పై భాషలోకి;
సముద్రం, శిఖరం, కాంతీ, కంటకాల వస్తుసంగతుల ప్రోగును
తునకలు తునకలుగా ఉపరితల భాషలోకి.
ఒక్క సారి మూలం లోకి వెనుతిరిగిన నిశ్శబ్దపు అగాధ గాధ
కన్నుల, కాలివేళ్ళ, సంద్ర తీరాల శిలలను కప్పేస్తుంది.
కవిత్వమే చిత్రకళై, చిత్రకళే ‘చిత్ర’కవిత్వమై, తానే ఆ రెండూ మిళితమైన Streams of Consciousness ఐ ప్రవహించిన ఆధునికానంతర Poet-Artist పాబ్లో సబోరియో.
*
Add comment