కుందుర్తి కవిత: రెండు కవితలు

కుందుర్తి కవిత: రెండు కవితలు

1

అంకురం

 

మారాకువేస్తున్న ఆకుల మీద

ఏడు రంగుల నీటిచుక్కల్ని

ఉదయింపజేసే రోజులు కొన్నుంటాయి

 

అప్పుడే విచ్చుకున్న తెల్లటి పూవు

వెచ్చగా పొదువుకున్న పుప్పొడిని

చిరుగాలై వెదజల్లే రోజులవి

పారుతూ అలసిన నదిని

కొండపైనుంచి కిందకి తోసే

ధైర్యపు రోజులు

అనుకుంటాం గానీ, అన్ని రోజులూ

ఒకేలా గడచిపోవు

 

జ్ఞాపకాల హోరుల్లో

హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా

సమ్మోహన సాంద్రం చేసే రోజులు

దారితప్పిన సంధ్యల్లో

తోడుండే సన్నటి వెలుతురు ముసుర్లు

అలజడి వాన లో తడిసిన మాటలు

తడబడతాయి, స్పృహ తప్పుతాయి

 

శరీరం శూన్యమవుతుంది

కలల మాయావలయంలో

చిక్కుకున్న పడవ

ఎదురుచూపుల ఒడ్డున అల్లల్లాడిపోతుంది

 

కొన్ని రోజులు

తుఫాను రాత్రులవుతాయి

భూకంపాలై బద్దలవుతాయి

ఆకాశం విరిగి తలపై పడిపోతుంది

సమస్త గాయాలకీ లేపనంలా

లోపలెక్కడో చివురంత ప్రేమ!!

 

2

పుస్తకంలోంచి…

 

మైదానంలో స్వేచ్ఛగా

ఎగురుతాను

నీలం నిప్పు పువ్వులా

విచ్చుకుంటాను

 

ఈపూటకి

అధ్యాయం ముగిసిపోవల్సి ఉంది

 

ఎంత తిరిగినా తనివితీరని

ఊహా ప్రపంచంలోంచి

బయటకి వెళ్ళిపోవల్సి వుంది

 

ఉన్నట్టుండి మూసేసినప్పుడు

దిగులు పిట్టల్లా దిక్కులు చూస్తూ

పేజీలు వెళ్లద్దని

రెపరెపలాడుతూ బతిమాలుతాయి

పదాలు మూగబోతాయి

 

సంకెళ్లు వేసెవరో మనసుని బంధిస్తారు

వాక్యాలన్నీ ఒక మాటమీదకొచ్చి

వెనగ్గా హత్తుకుంటాయి

కథల్లోని పాత్రల్లా ధైర్యంగా

కలల తీరంలో ఆడుకోవాలనుకుంటాను

 

నగరంలో వానకి తడిచి ముద్దవుతాను

వేళ్ళలోకి వేళ్ళు పెట్టి

కళ్ళలోకి కళ్ళు కలిపి

కవర్ పేజీ కదలనివ్వదు

చదవడం ఆపేయాలంటే

మనసుపడ్డ వాళ్ళని వదిలి వెళ్తున్న

ముల్లు గుచ్చుకుంటుంది

 

మళ్లీ కలవాలనే ఆశే లేకపోతే

ఇన్ని పుస్తకాల్ని మూయలేను

అనుభవాల హృదయ పుటల్ని

మళ్ళీ మళ్ళీ తెరవనూలేను!!

*

కుందుర్తి కవిత

6 comments

Leave a Reply to కవిత Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావున్నాయి
    వాక్యాలన్నీ ఒక మాట మీదకి వచ్చి

  • సున్నితత్వం, తాత్వికత మేళవించిన ఉత్తమ కవితలు. పంచుకున్నందుకు ధన్యవాదాలు!

  • కవితలు చదివాను. చదవాల్సిన కవితలు. దేనికి అవే ప్రత్యేకంగా ఉన్నాయి. రెండు భిన్నమైన వస్తులైనప్పటికి మొదటి కవితలో ఈ లైన్లు చాలా నచ్చాయి.

    అనుకుంటాం గానీ, అన్ని రోజులూ
    ఒకేలా గడచిపోవు

    కలల మాయావలయంలో
    చిక్కుకున్న పడవ
    ఎదురుచూపుల ఒడ్డున అల్లల్లాడిపోతుంది.
    ….
    సమస్త గాయాలకీ లేపనంలా
    లోపలెక్కడో చివురంత ప్రేమ!!

    బహుశా ఆ ప్రేమ లోపల ఉండబట్టే కవి అయ్యారు. ఆ ప్రేమ గాయాల్ని మాన్పుతుంది కాబట్టి ఇలా రాయగలిగారు. Beautiful 💙🌼

    • రామూ, ప్రేమతో నిండిన నీ స్పందన కి థాంక్యూ. 😍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు