1.
కిటికీ అవతల్నుంచి చెట్టు
పచ్చని నవ్వుల్ని కాగితంలో చుట్టి
నా కేసి విసిరేది
నేను తలతిప్పి చూస్తే
సంబరపడి వొళ్ళు విరుచుకునేది
రోజుకో పక్షిని
రోజుకో పాటని
రోజుకో రంగు పొద్దుని పరిచయం చేసేది
అప్పట్లో – చెట్టు నా ఏకైక స్వప్నం
2.
కొన్నాళ్ళకు
మా మధ్యనున్న కిటికీ కరిగిపోయింది
గదిలో పక్క పక్కనే కూర్చొని
మాటల్ని నేసేవాళ్ళం
నేసిన మాటలన్నీ
చేతుల్లోకి గీతలుగా చేరేవి
అప్పట్లో చెట్టూ నేనూ.. ఇద్దరమే!
మా చూపులకొండకు ఆవలెక్కడో
లోకం తలదాచుకునేది
3.
కొన్నాళ్ళకు నా పైన
వసంతం వచ్చి వాలింది
మరి చెట్టు?
ఆకులన్నీ రాలి నగ్నంగా
నిశ్శబ్దవానలో తడుస్తూ
పక్షుల్లేక.. ఒంటరిగా
మిణుకు మిణుకుమనే ఒక్క ఆశను చేతుల్లో పట్టుకుని!
కిటికీ తెరిచి –
“ఇక చాలు వెళ్ళు” అన్నాను
ఒకే ఒక్కసారి
నా లోతుల్లోకి చూసి
కిటికీ లోంచి అవతలికి వెళ్ళిపోయింది
4.
రుతువులు రుతువులుగా
కాలం రాలిపోతూనే వుంది
ఒక్కొక్కటిగా
నేన్నా దుస్తుల్ని వదిలేసుకుంటూ వచ్చాను
5.
ఇప్పుడొక పసివాడు నాలోకి ప్రవేశించి
చివరి యవ్వనాన్ని వెలిగించాడు
మనసు సలుపుతోంది
నాకిప్పుడు చెట్టు కావాలి
చెట్టు ప్రేమగా అందించే నీడ కావాలి
ఇలా వాలి అలా వెళ్ళిపోయినా సరే
ఆ రెప్పపాటు పరిమళం చాలు..
నా చిన్న గది కి
6.
ఈ కిటికీరెక్క తెరిచి
చెట్టును నా గదిలోకి పిలుచుకొచ్చే
చేతులేవీ?
ఇప్పుడిప్పుడే తెలుస్తోంది
మనిషిగా పుట్టి చాలానే పోగొట్టుకున్నాను
రెక్కల్ని.. పాటల్ని..
ఉన్న ఒక్కగానొక్క హృదయాన్ని కూడా..
*
చాలా బావుంది అండి… అభినందనలు మీకు 💐💐💐
ధన్యవాదాలు సర్