మనిషి హృదయంలో అనంతంగా ప్రతిధ్వనించే ఒక మౌనరాగం ఎదురుచూపు. అదొక కాలాతీత కావ్యగానం. ప్రతి శ్వాసలోనూ దాగున్న ఓ ఆత్మీయ స్పర్శ. కేవలం సమయాన్ని లెక్కబెట్టడం కాదు కాలగమనాన్ని ప్రేమతో, ఆశతో అలంకరించడం.
ప్రతి ఎదురుచూపు వెనుక ఒక కథ దాగి వుంటుంది. ఒక అంతులేని ఆశ వుంటుంది. ఒక అద్భుతమైన కల వుంటుంది. ఒక్కోసారి నిగూఢమైన భయం, అన్నీ కలగలిసిన ఒక జీవన సత్యం ఉంటుంది.
వర్షం కోసం తపించే భూమి వలె, నావకై ఎదురుచూసే సంద్రం వలె, మనసు నిరంతరం ఏదో ఒక శుభఘడియకై తపిస్తుంది. రైతు ఆరుగాలాలు శ్రమించి, విత్తనం నాటి, అది మొలకెత్తి, పచ్చగా పెరిగి, కంకులు వేసి, కోతకు వచ్చేదాకా ప్రతీ క్షణాన్ని ఆశగా చూస్తాడు. అదొక నిశ్శబ్ద ప్రార్థన, అదొక ఆకుపచ్చని కల. అలాగే, ఒక మధురమైన వార్త కోసం ఎదురుచూసే చెవులు, ఒక తీయని స్వప్నం కోసం ఎదురుచూసే కళ్ళు, ప్రతి శ్వాసలోనూ ఆశల తోరణాలు కడతాయి. అదొక హృదయపు పల్లకి, భవిష్యత్తు వైపు సాగే మౌనయాత్ర. చీకటిని చీల్చుకుని వచ్చే నవజ్యోతి.
కొన్ని ఎదురుచూపులు అమృత ధారల వంటివి. నవజాత శిశువు తొలి స్పర్శ కోసం తపించే తల్లి హృదయంలా తనలో ప్రేమ అనే మహాసాగరాన్ని నింపుకుంటుంది. ఆ నిరీక్షణలో కలిగే ప్రతీ ఊహ ఒక మధురమైన అనుభూతి. భవిష్యత్తుకోసం వేసిన బంగారు బాటలా ప్రతి నిమిషం ఒక నూతన అధ్యాయానికి నాంది.
నిరీక్షణలో ఒక లోతైన ఆత్మపరిశీలన వుంటుంది. ప్రణాళికలను మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుంది. కొన్ని సవాళ్లకు సిద్ధమవుతాం. ఎదురుచూపులు ముగిసినప్పుడు కలిగే పరిపూర్ణత, ఆనందం, విజయం – అదొక దివ్యానుభూతిగా మారుతుంది.
*
బావుంది