సరివిచెట్టు ఊగుతూ ఊగుతూ
పిల్లనగోవి రాగాన్ని ఆలపిస్తున్నది
నిటారుగా నిల్చున్న నామీంచి
చీకటి వెలుతురుల రాగం తడుతూ
నరాలను మర్దన చేస్తోంది
వానకాలంలో దప్పిక తీర్చుతూ
నాలోని అణువణువుకూ కొత్త పూలు పూయిస్తోంది
చలి శరీరం నిండా పాకి
రక్తాన్ని పరుగులు పెట్టిస్తోంది
సూర్యుడి ఉత్తేజం
ఉగ్గుపట్టిన ఊహలకు కొత్త దారిని పరుస్తోంది
మట్టిలో పుట్టి
మట్టిలోకి వెళ్ళే ఈ దేహం
బతుకుతో సంఘర్షిస్తూ ఏళ్లకేళ్లు పుటం పెట్టుకుంటోంది
వచ్చిపోయే ఎన్నికలు అధికారాలు
క్రోటాన్ మొక్కలా పెరుగుతున్నా
అంది వచ్చే ఆలోచనలు కత్తిరిస్తూ ‘ట్రిమ్’ చేస్తోంది
మట్టి పిసుక్కుంటున్న వాడు మట్టిలోనే తనువు చాలిస్తాడు
మగ్గం నేసేవాడు గుంతలోనే జీవం విడుస్తాడు
భూమి పొరల కింద ఖనిజాలను చేజిక్కించుకున్నవాడు
రాత్రికి రాత్రే దేశానికి రాజవుతాడు
జలపాతాలను కంటిచూపులో బంధించేవాడు
ఆకలిపాతాలను అంచనా వేయలేడు
కవిత్వాన్ని తలపై మోస్తున్నవాడిని
గొప్ప జ్వాలగా వెలుగాలని తపన పడుతున్నాను
ఊపిరి గాలితో
ప్రపంచాన్ని చుట్టేయాలని ఆరాటపడుతున్నాను
నాలో నేనే
ఓ రైతును చూస్తున్నాను
ఓ నేతకారుడిని కలగంటున్నాను
సమస్త వృత్తుల స్వేదబిందువులతో
జీవనం సాగిస్తున్నవాడ్ని
కవిత్వాన్ని భుజానేసుకుని కదులుతూ
కలత చెందుతున్న మనస్సులను ఊరడిస్తున్నాను.
*
బతుకు తో సంఘర్షిస్తూ ఏళ్ళ కేళ్ళకు పుటం పెట్టుకుంటుంది