కవిత్వం కింద దాచిన తుఫాను!

ఈ నెలలో వెలువడిన పుస్తకాలని పరిచయం చేయండి. మీ సమీక్షలూ సంవేదనలూ editor@saarangabooks.com కి పంపించండి

థేరీ గాథలు పుస్తకం కాదది, నిన్నటి నిరసనల హోరు. స్త్రీ హృదయ వేదనల తుఫాను.

క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం సాహిత్యం మన చేతుల్లో వాలింది. రాజమాత ల దగ్గరి నుండి వేశ్యల మనసులోని ప్రకంపనల హోరును సన్యాసినులుగా మారాక పాళీ భాషలో అక్షరీకరించగా బొల్లోజు బాబా తేట తెలుగు లోకి అనువదించారు.

2565 సంవత్సరాల కింది భిక్షుణుల భావాల పరంపర తో ప్రతీ పేజీ నిండి పోయింది. బుద్ధుడి సందేశాలు థేరీలు అక్షర రూపం ఇస్తూ వ్రాసిన కవితలు బౌద్ధ సిద్దాంతాల ప్రాతిపదిక న సాగాయి. “థేరికా! చిన్నప్పుడు నీకు పెట్టిన పేరు సార్థక మైంది! నువ్వు స్వయంగా కుట్టుకున్న   బొంత కప్పుకుని పడుకో! నీ వాంఛలన్నీ కుండలో దాచిన మూలికల్లా వడలి ఎండి పోతాయి ఇక!…” ఈ కవితలో దుఃఖానికి మూలం కోరికలే అన్న మూల సూత్రం ప్రతిబింబిస్తుంది. మత్త అనే కవితలో” ఏ బంధనాలు లేని మనసుతో నీ భిక్షను ఆరగించు “అని బంధనాల నుండి విముక్తి సూక్తి ని పలికించారు.

మరొక తిస్సా కవితలో “తిస్సా! దమ్మ మార్గాన్ని వీడకు, ఈ క్షణాన్ని చేజార్చుకోకు! చేజార్చుకంటే దురవస్థ ల పాలవుతావంటూ ” ధమ్మ మార్గ విశిష్టత ను కాలం విలువను క్రోడీకరించి చెప్పారు.

ధీరా! నిబ్బాణని  నీ గమ్యం చేసుకో! అంటూ రాగం ద్వేషం మోహాలను అధిగమించే స్థితిని చేరుకోండని  వక్కాణించారు.

“మిత్తా సాధన చేయి శాంతి ని పొందు! మరియు భద్రా ! యోగ క్షేమాన్ని సాధన చేయి నిన్ను వెనక్కి లాగే శక్తుల నుండీ అదే రక్షిస్తుందని” భిక్షుణుల సాధనలోని మర్మాన్ని లోకం ముందుంచారు. శిక్షణ సాధన లు ఒకదానికొకటి పెన వేసుకుని పోయింది . ముత్త అనే కవితలో” నేను స్వేచ్ఛ ని పొందాను మూడు కుటిల విషయాల నుండి భర్త ,రోలు ,రోకలి, నేను విముక్తి పొందాను మూడు కుటిల విషయాల నుండి జననం, మరణం, పునర్జన్మ ” ఈ కవిత లో బాధించ బడేవి బాధ పెట్టేవి రెండింటినీ త్యజించమనే సంకేతాన్ని బహిరంగం గా ప్రకటించారు.

ఎవరి హృదయం భోగ లాలసకు కేంద్రం కాదో ఆమె ప్రవాహంలోకి ప్రవేశించినట్లే అని ధమ్మదిన్నె కవితలో సెలవిచ్చిన సన్యాసిని ఆత్మ కథలోని నిజాన్ని ప్రపంచం ముందు వుంచారు. ప్రవాహం యొక్క అర్థాన్ని కూడా అదే పేజీలో పొందు పరచారు రచయిత. అష్టాంగ మార్గం లోనుండి నిబ్బాణ దిశ గా వెళ్ళే దశను ప్రవాహంలో కి ప్రవేశించినట్లని అర్థం. ఇలాంటి కొత్త పదాలకు ప్రతి పేజీలో రచయిత అర్థం వివరించారు .

ఉత్తర అనే కవితలో “దేహం మనసు మాటలను స్వాధీనంలోకి తీసుకున్నా! వాంఛలన్నీ వేళ్ళతో పెళ్ళగించాను!” లో వాంఛల మూలాన్ని చేధించే ప్రయత్నం ఆ కవితలో కనిపించింది. భిక్ష కోసం సంచరిస్తూ ఎండకు తాళలేక తూలి పోతుంటే” నేనే గుప్పెడు మెతుకులు, ప్రపంచం మొత్తం ఒక భిక్షా పాత్ర” అనే మహత్తర సందేశం ఓ సన్యాసిని కలం నుండి నాటి కాలాన్ని పట్టించి ఇచ్చింది. సంఘ అనే కవితలో ఇంటిని కొడుకును పశుసంపద ను ఇష్ట పడే వాటినన్నింటిని వదిలేసా! ఎంతో శాంతి గా వుంది నాకు అని కోరికలను జయించిన భిక్షుణుల మనస్తత్వం తెలుస్తుంది.

జెంతి అనే కవితలో దారి తప్పకుండా ఈ దారిలో నడవటానికి కావాల్సిన స్నేహితులను ఉటంకిస్తూ ఎరుక పరిశీలన పరాక్రమం ఆనందం ప్రశాంతి ఏకాగ్రత సమతుల్యత లను పేర్కొన్నారు. అవే సప్త బోధ్యంగములు అని రచయిత వివరణ ఇవ్వడం సందర్భోచితంగా వుంది.

సుమంగళుని తల్లి కవితలో” వేడి ఇనుప కడ్డీ ని నీటిలో ముంచినప్పుడు వచ్చే శబ్దాల వలె సడి చేస్తూ నా రాగ ద్వేషాలు చల్లారి పోయాయి ” ఇందులో వస్తు వైవిధ్యం కనిపించింది.

వ్యభిచారి నుండి సన్యాసిని గా మారిన ఆమె అర్థ కాశి కవితలో “ఒకప్పుడు నా వెల నిర్ణయించి నప్పుడు అది కాశీ పట్టణం మొత్తం సంపాదన తో సమానం గా వుండేది, చాలా మంది విటులు గడిచాకా నా ధర సగానికి తగ్గించబడిందంటూ ఈ దేహం నాకు ఇచ్చినవి చాలు అనుకున్నాను అలసి పోయాను రోసి పోయాను అని ఆవేదన వ్యక్తం చేస్తూ త్రివిద్యలతో జన్మ రాహిత్యాన్ని పొందానని బౌద్ధం వల్ల ప్రక్షాళన జరిగిందనే సత్యాన్ని తెలియ చేసారు.

” ఉత్తమ జన్మ కొరకు ఎన్నో ఉపవాసాలు ఉన్నాను అష్టమి ఏకాదశి చతుర్ధశి పౌర్ణమి ఎన్నో ఉపవాసాలు ఉండేదాన్ని… ఈ రోజు శిరో ముండనం గావించుకొని ఒక పూటే తింటున్నాను, ఉత్తమ జన్మ పట్ల నా మనసులో ఏ బెంగా లేదిక” ఈ కవితను మూఢ నమ్మకాల పై ఎక్కుపెట్టిన అస్త్రం గా పరిగణించాలి . ఉబ్బిరి అనే కవిత లో చనిపోయిన కూతురు కోసం రోదిస్తున్న తల్లిని ఓదార్చే క్రమంలో జీవా జీవా అంటూ రోదిస్తూ జీవా అనే పేరు గల ఎనభై నాలుగు వేలమంది కుమార్తెలు ఈ శ్మశానంలో చితిపై కాలిపోయారు వారిలో ఏ కుమార్తె కొరకు నీవు దుఖిస్తున్నావు అనే సంఘర్షణ ఈ రోజు బాణం లేదు హృదయ గాయం నయమైంది ముగింపు తో పరిణతి పొందింది. శైల కవితలో ఇంద్రియ సుఖాలు కత్తులు శూలాల వంటివి అవి నిత్యం ఈ దేహం మనసులను ఖండిస్తుంటాయని వయసు వాంఛల పై కొరడా ఝుళిపించారు. స్వేచ్ఛ నొందిన హృదయానికి అందే అనంతమైన దూరాలతో పోల్చినప్పుడు కొన్ని అంగుళాల మాంసపు తునక ఏపాటిది? అనే ప్రశ్న అవయవాల నిగ్గును తేల్చేసింది.

శిశూ పచాల కవితలో బౌద్ధ మతం చెప్పిన స్వర్గం తావ తింస కి అధిపతి ఇంద్రుడని ముప్పై ముగ్గురు దేవతలున్నార నే కొత్త చర్చ ను లేవదీస్తుంది. ఆ తావ తింసలో ఇతరుల సంపదను సుఖిస్తూ స్వేచ్ఛా జీవనం సాగించవచ్చు కానీ వారు జీవన్ముక్తులు కారు, జరామరణ వలయంలో పరిభ్రమిస్తున్నారు అంటూ ఆ స్వర్గాన్ని నిర్వచించే ప్రయత్నం గావించ బడింది . ఆమ్ర పాలి కవిత లో “చూసావుగా నా దేహం ఎలాగ శిథిలమైందో నేడు ఇది బాధలు వసించే చోటు, పెచ్చులు రాలిపోతున్న ఒక జీర్ణ గృహం” యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని పోల్చుతూ దేహం శాశ్వతం కాదని చెప్పారు.

శుభ అనే సంభాషణ లో యువతీ యువకుని మధ్య పదాల దొర్లింపు హృద్యంగా సాగుతూ అష్టాంగ మార్గ ఔన్నత్యాన్ని పై చేయి గా మలిచారు. గమ్యం కోసం వెతికే క్రమంలో “వినబడుతోందా! ఆకుల మధ్య అలల సంగీతం ముందుకు సాగు” అని తీరాన్ని తాకే సత్తువ నిచ్చే చేతన ను ఇవ్వగలిగింది.

ఇంకా ఈ పుస్తకంలో చాలా కవితలు ఉన్నాయి. బాధలున్నాయి. తల్లీ కూతుళ్ళు సవతులై ఆ పిమ్మట బాధలతో తల్లడిల్లి చివరకు శాంతి కోసం పయనించి సన్యాసినులుగా  మారిన తీరు వారి బాధలను వ్యక్తీకరించిన పద కోశం నేటికీ తాజాగా వుంది. రచయిత ముగింపు మాటల్లో లోపలి కవిత లను వాటి ఘట్టాలను విశదీకరించిన తీరు శ్లాఘనీయం. పాళీ భాష నుండి తెలుగులో కి అనువదించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కొన్నింటి కోసం బౌద్ధ భిక్షువు సహకారం కూడా తీసుకున్నారు. తెలుగు సాహిత్యం లో ఇదో మైలు రాయి రచయితకి.

ప్రతులకు:

Chaaya resources center,
103, Haritha Apartments
A-3, D.No.8-3-222/C/13 & 14
Madhuranagar, Hyderabad – 500 038
Ph. 040 2374 2711

*

గిరి ప్రసాద్ చెలమల్లు

3 comments

Leave a Reply to డి. ఎజ్రాశాస్త్రి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్సలెంట్ మిత్రమా ,సారంగ వెబ్ పత్రకకు నీకు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు