కల్లోల పరచే ప్రశ్న బుచ్చిబాబు కథ 

అసలు నిరంతర చలన శీలమైన స్త్రీ పురుష సంబంధాలలో స్థిరత్వం , లేదూ మానవ సంబంధాలలో స్థిరత్వం సాధ్యమేనా ? ఇలా ఎన్నో ప్రశ్నలు కలిగిస్తుంది ఈ కథ

గొప్ప సత్యాన్ని సంఘం నమ్మదు . అందుకనే సంఘం అసత్యాల మీద ఆధారపడి వుంది . అందుకనే ఈ సంఘాలలో అజంతా శిల్పాలలాంటి వ్యక్తులు జన్మించరు . సత్యాలలో కెల్లా గొప్ప సత్యం సత్యాలు సంభవించడమే

ఈ నాలుగు వాక్యాలతో బుచ్చిబాబు అజంతా అనే కథను ముగిస్తాడు . నిజానికి కథ  అక్కడ ముగియదు . పాఠకుడి మెదడును తొలుస్తూ , అతడి ఆలోచనాశక్తి కి పదునుపెడుతూ ముందుకు సాగుతుంది . ఒకమంచి కవితను కవి సగం రాస్తే పాఠకుడు మరో సగం రాసుకుంటాడు అని ఒక గొప్ప కవిత్వ ప్రేమికుడు అన్నాడు . నిజానికి బుచ్చిబాబు కధలు కూడా అలాగే ఉంటాయి . సగం కథను బుచ్చిబాబు చెపితే మిగతా సగం కథను పాఠకుడు తన మేధ  తో పూరించుకుంటాడు

బుచ్చిబాబు పేరు చెప్పగానే చాలామందికి నన్ను గురించి కథ వ్రాయవూ గుర్తు వస్తుంది .లేదూ అంతరంగ కథనం  గుర్తుకువస్తుంది . కోమలి , కాత్యాయని గుర్తుకొస్తారు . నాకెందుకో తెలియదు కానీ అజంతా కథ  గుర్తుకువస్తుంది . అజంతా కంటే గొప్ప కథలు  బుచ్చిబాబు రాసి ఉండవచ్చు కానీ , అజంతా మాత్రం ప్రత్యేకం

ఏమిటి అజంతా ప్రత్యేకత ?

అజంతా శిల్పాలలాంటి వ్యక్తుల కోసం సమాజం లో అన్వేషించడమే అజంతా ప్రత్యేకత . ఈ కథలో  కథానాయకుడు మధుసూధనం ఒక మాట అంటాడు

“మానవుడి శరీరం నాకు గొప్ప యదార్ధం . వాడి హృదయాలు , నీతులు ,ఆత్మలు నాకు అక్కర లేదు . శరీరం లో ఒంపులు ,ఎత్తులు , పల్లాలు శిల్పం లో ప్రతిఫలింప చేస్తే చాలు . అతని సౌందర్యం , మంచితనం  శాశ్వతంగా వుంది పోతాయి . శిల్పం లో స్థిరత్వం వుంది ”

ఈ వాక్యాలు అర్ధం కావాలంటే ముందుగా కథ గురించి కొంచెం చెప్పుకుందాము

అజంతా కథ దాసు , సుశీల , జ్ఞానభక్తి అనే మూడు పాత్రలు చుట్టూ తిరుగుతుంది . ఒకప్పుడు సుశీలను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు దాసు . కానీ సుశీల దాసును కాదని మధుసూదనం ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటుంది . సుశీల తో పోలిస్తే మధుసూదనం అందగాడు కాదు . అసలామెకు తగినవాడే కాదు . అతడిని సుశీల ఎలా ప్రేమించింది , ఎలా పెళ్లి చేసుకున్నది అనేది దాసుకు ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ . తాను పెళ్లి చేసుకోక పోయినా సంవత్సరానికో , రెండేళ్లకో ఒక సారి సుశీల ఇంటికి వెళ్లి ఆమె యోగ క్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు దాసు . అలా దాసు ఒక సారి సుశీల ఇంటికి వెళ్లే సరికి ఇల్లంతా గంభీరంగా ఉంటుంది . సుశీల అక్క జ్ఞానభక్తి , ఆమె అన్నయ్య అంతా అక్కడే వుంటారు . ఏమిటి విషయం అని ఆరా తీస్తే మధుసూదనం ఒక వుత్తరం రాసి ఇంట్లోనుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది . ఎక్కడికి వెళ్ళాడో , ఎందుకు వెళ్ళాడో , అసలు తిరిగి వస్తాడో , రాడో  కూడా తెలియదు . అతడు రాసిన వుత్తరం లో తన గురించి ఎదురు చూడవద్దు అని మాత్రమే ఉంటుంది పెళ్ళై పదేళ్లు ఐన తరువాత , పైగా ఒక పిల్ల కూడా పుట్టిన తరువాత ఇదేమి పాడు బుద్ది  అని సుశీల అన్నయ్య . జ్ఞాన భక్తి తలా ఒక మాట అంటారు

మధుసూదనం ఎక్కడికి వెళ్ళాడో వెతికే బాధ్యత దాసు మీద పడుతుంది . దాసు ఊళ్లన్నీ వెతుకుతూ వెతుకుతూ ఔఱంగాబాద్  చేరుకుంటాడు . అక్కడికి అజంతా గుహలు చాలా దగ్గర . ఒక టీ  దుకాణంలో టీ  తాగుతున్నప్పుడు దాసు కి మధుసూదనం కనిపిస్తాడు . పలకరించి , అతడిని వెతుక్కుంటూ తాను  ఔరంగాబాద్ వచ్చానని , సుశీల చాలా బెంగ పడిందనీ , తనతో వస్తే ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు .మధుసూదనం ససేమిరా ఒప్పుకోడు . దాసు మధుసూదనం తో కలసి అతడు ఉంటున్న గదికి వస్తాడు . చాలా చిన్న గది  అది. దాసు కళ్ళు ఎవరికోసమో వెతుకుతూ ఉంటాయి . మధుసూదనం ఎవరో ఒక స్త్రీని తీసుకుని అజంతా వచ్చి ఉంటాడని అతడి భావన . కానీ అలాంటి జాడలు ఏవీ కనపడవు . నాలుగైదు రోజుల సంభాషణ తరువాత మధుసూధనానికి ఇంటికి తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేదని అతడికి అర్ధం అవుతుంది . అతడా అజంతా శిల్పాల దగ్గరే ఉండి  ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కి తన జన్మ సార్ధకం చేసుకోవాలి అనుకుంటాడు . పెళ్లి తనలోని సృజన శక్తులు అన్నీ హరించి వేసిందనీ . పదేళ్లు తానూ అన్నీ వదిలి వేసి భార్యా పిల్లలకోసం బతికాడు కనుక ఇప్పుడు తనకోసం తాను  బతకాలి అనుకుంటున్నాడు అని దాసుకు అర్ధం అవుతుంది

దాసు మధుసూధనాన్ని అలాగే వదిలివేసి తన ఇంటికి వెళ్లిపోయి సుశీల కి ఒక పెద్ద వుత్తరం రాస్తాడు . అతడు అజంతా శిల్పాల మీద ఎంత మోహ పడుతున్నాడో  ఒకటికి రెండు కల్పించి మరీ వుత్తరం రాస్తాడు . అదంతా చదివాక సుశీలకి ఒక విషయం  అర్ధం అవుతుంది . అతడు కళ  కోసం తనని వదిలి వేసి వెళ్ళాడు . మళ్ళీ తన భర్తను తన దగ్గరికి రప్పించుకోవడం ఎలా ? దాసు ఇంకో మాట కూడా రాసాడు . శిల్పాల కోసం మనుషులను వదిలి వెళ్ళాడు . శిల్పం లాంటి మనుషులు లేరూ ? మీ అక్క జ్ఞానభక్తి అజంతా శిల్పం లా ఉండదూ ? అని ఆ మాట గుర్తుకువచ్చి అక్క జ్ఞాన భక్తిని మధుసూధనాన్ని తీసుకురమ్మని అడుగుతుంది సుశీల . అందుకు జ్ఞానభక్తి నిరాకరిస్తుంది . అతడంటే ఆమెకు అంత సదభిప్రాయం లేదు . పైపెచ్చు రవ్వంత భయంకూడా . అక్క ఎంత నిరాకరించినా సుశీల అక్కను  పదే  పదే  ప్రాథేయపడుతుంది . చివరకు జ్ఞానభక్తి ఒప్పుకుంటుంది.    ఎందుకు ?

కళ  కోసం భార్యను వదిలివేసినవాడిని శిల్పం లాంటి తాను  గెల్చుకుని వస్తే

తన కోసం కళను వదిలివేస్తే అది తనకు ఎంతటి విజయం ?

జ్ఞానభక్తి మధుసూదనం కోసం అజంతా వెళుతుంది . ఆమె వెళ్లి ఆరు నెలలు అయినా సుశీలకి ఏ కబురూ అందదు . ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబువుండదు .

చివరకు సుశీల తానె అజంతా వెళ్లాలని బయలుదేరుతున్నప్పుడు మధుసూదనం , జ్ఞానభక్తి  కారు లోనుంచి దిగుతారు . వాళ్లతో పాటు గా ఒక పెద్ద పెట్టె కూడా . సుశీల తన మనసులో ఎన్ని సందేహాలు కలుగుతున్నా , ఎన్ని సముద్రాలు పొంగుతున్నా  మారు మాట్లాడకుండా ఇద్దరినీ లోపలి ఆహ్వానిస్తుంది . మరుసటి రోజు జ్ఞానభక్తి తన ఇంటికి తానూ వెళ్లి పోతుంది . ఆ పెట్టెలో ఏమి  ఉన్నది అనే ఉత్సుకత సుశీలను నిలువనీయదు .దాని గురించి అడిగితే మధుసూదనం ఆ పెట్టె లోనుంచి ఒక బొమ్మ తీసి చూపిస్తాడు .  ఆధునిక బానిస -శిల్పి మధు అని రాసి వుంది . ఒకే బేస్ మీద రెండు బొమ్మలు ఒక పురుషుడు మోకాళ్లని కిందకి ఆనించి రెండు చేతులు నడుం వెనుక భాగాన్ని కట్టుకుని తల  వొంచుకుని ఉంటాడు . అతడి మీద మీద ఒక చెయ్యి నొక్కిపెట్టి ,మరొక చేతితో వంట గరిట పట్టుకుని బలంగా నిలబడివుంటుంది ఒక స్త్రీ . .అదీ ఆ విగ్రహం సుమారు నాలుగడుగుల ఎత్తు . ఆమెకేమీ అర్ధ కాలేదు

ఈ శిల్పాన్ని అఖిల భారతీయ చిత్ర కళా ప్రదర్శనకి ఢిల్లీ . పంపిస్తాను . రేపు సోమవారం కాంప్ కి వెళ్లి రాగానే అంటాడు అతడు .ఆమె ఏమీ మాట్లాడదు . అతడు కాంప్ కి వెళ్ళిపోతాడు .

సుశీల ను ఆ బొమ్మ పదే పదే  కలవరపెడుతుంది . ఆ బొమ్మ ఆమెకు జ్ఞానభక్తిని గుర్తుకు తెస్తుంది . ఆ బొమ్మ జ్ఞానభక్తి విజయానికి చిహ్నం గా  ఆమెకు అనిపిస్తుంది. ఆ సౌందర్యాన్ని వర్ణించడం ఎలా ?   మామూలు చీరాలకీ .చొక్కాలకీ అందం అనే పదం వాడీ ,వాడీ  ఆ  పదం తిరిగి పోయింది . అసలైన సౌందర్యం ఎదురైనప్పుడు మాటలు దొరకవు వర్ణించడానికి . ఆ బొమ్మ జ్ఞానభక్తిని చూసి చెక్కిందే . అంటే అక్కకి బానిసగా మారాడు అని అర్థమా ? ఈ భావం స్ఫురించగానే ఆమె ఆ బొమ్మను ముక్కలు చేయాలి అనుకుంది . సరిగ్గా అప్పుడే జ్ఞానభక్తి ఊడిపడుతుంది . చెల్లెలిని ఆ బొమ్మను పాడుచేయవద్దు అని వారిస్తుంది . బ్రతిమాలుతుంది . అక్క అలా బ్రతిమిలాడటం తో తన ప్రతి రూపాన్ని రక్షించుకోవడానికి అక్క తంటాలు పడుతున్నది అనే భావం కలగగానే ఆమె బొమ్మను ఎత్తిపడేస్తుంది . బొమ్మ ముక్కలుముక్కలు అవుతుంది

జ్ఞానభక్తికి చెల్లెలి అంతరంగం అర్ధం అవుతుంది . అతడు తనను కనీసంతాకను కూడా తాకలేదు అని చెపుతుంది

ఇది కథ  . ఎప్పుడో 1942 లో రాసిన కథ . బుచ్చిబాబు స్త్రీ పురుష సంబంధాలలో ఉన్న  సంక్లిష్టతను ఎంత అన్యాపదేశంగా , సున్నితంగా చెప్పాడు . కలిసి విడిపోయి , విడిపోయి కలిసే ఊహా మేఘాలుగా స్త్రీ పురుష సంబంధాలు మారిన ఈ 21 వ శతాబ్దం లో ఎప్పుడో డెబ్బై ఆరేళ్ళ క్రితం రాసిన ఈ కథ  ఏమైనా చెపుతున్నదా  అన్నది అసలు ప్రశ్న . ఆ బొమ్మ కి  ఆధునిక బానిస అనే పేరు పెట్టడం స్త్రీ పురుషులు ఇరువురూ ఒకరికి మరొకరు బానిసలు అని చెప్పడం అనుకుందామా అంటే పురుషుడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తలా వంచి స్త్రీని బలమైన శక్తిగా నిలబెట్టాడు . స్త్రీ కి పురుషుడు బానిస అనుకుందామా అంటే ఈ ఎనిమిది దశాబ్దాల స్త్రీ చరిత్ర మొత్తం పురుష పీడన పరాయణత్వమే కదా . పైగా ఈ కథకి  అజంతా అనే పేరు పెట్టాడు . అజంతా శిల్పాలు ఎప్పటికీ వన్నె తగ్గనివి

అజంతా శిల్పాలలో ఒక శిల్పం లో  యవ్వనం లో ఉన్న  విహారికోసంవేటాడుతూ దూరంగా నిలబడ్డాడు విటుడు . ఆ ప్రతిమ లోని విహారి తన యవ్వనం పోగొట్టుకోదు . విటుడు ఆమెను పొందలేడు . ప్రేమ విజయం పొందాడు కనుక సౌందర్యానికి చావు లేదు  ఎన్ని శతాబ్దాలైనా ఆ ప్రతిమ అలాగే ఉంటుంది . స్థిరత్వం అంటే అదేనా ?

కథ  చివరలో అజంతా శిల్పాల లాంటి వ్యక్తులు జన్మించరు  అన్నాడు . అసలు నిరంతర చలన శీలమైన స్త్రీ పురుష సంబంధాలలో  స్థిరత్వం , లేదూ మానవ సంబంధాలలో స్థిరత్వం సాధ్యమేనా ? ఇలా ఎన్నో ప్రశ్నలు కలిగిస్తుంది ఈ కథ

బుచ్చి బాబు కథను ముగించాడు కానీ పాఠకుడు మళ్ళీ కొత్తగా తన కథను తానూ రాసుకోవాలి . సత్యాలలో గొప్ప సత్యం సత్యాలు సంభవించడమే అంటే అలాంటి స్థిరత్వాన్ని బుచ్చిబాబు ఊహించాడా ? లేక అరవిందుడి అతీత మానవుడిని తన  దృష్టిలో ఉంచుకుని అజంతా శిల్పాల లాంటి వ్యక్తులు జన్మించరు  అన్నాడా ? స్త్రీలకోసం  యుద్దాలు జరిగి మానవ హననం జరిగిన ఈ నెల మీదే స్త్రీ ని  ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా కళకి .సౌందర్యానికి బానిస అయిన  ఒక పురుషుడిని సృష్టించి స్త్రీల సౌందర్యం చుట్టూ పురుషులు గిరికీలు కొడతారు అనే భావన కని పూర్వ పక్షం చేశాడా ?

అన్నీ ప్రశ్నలే . మన ఆలోచనని పదునుపెట్టే ప్రశ్నలు . మనలని కల్లోల పరచే ప్రశ్నలు . కల్లోల పరచే ప్రశ్న బుచ్చి బాబు అజంతా కథ . మీరూ చదవండి

ఒక కొత్త లోకానికి మీ మనసు తలపులు తెరవండి

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు