కలవని రచయితలనెందరినో..కలిసే అవకాశం

దివరకు ఇలాంటి సమావేశాలు జరగలేదు కాబట్టి ఇంతమంది రచయితలను ఒకేచోట కలవటం ఇదివరకు సాధ్యం కాలేదు. ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసిన మిత్రులకు మప్పిదాలు. ముఖ్యంగా కాలిపోర్నియా, టెక్సాస్ లనుంచి ఇదివరకు కలవని రచయితలనెందరినో మొదటిసారి కలిసే అవకాశం కలిగింది.

సభల నిర్వహణ నాకు బాగా నచ్చింది. ఒక్కో ప్రసంగానికి ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడం, దాన్ని పదినిమిషాలదాకా పొడిగించినా, తర్వాత చర్చకు చాలా సమయం ఉండింది. అలా కాకుండా ప్రసంగాలు పదిహేను నిమిషాలు పెట్టినట్లయితే, అది ఇరవై ఇరవైయ్యైదు నిమిషాలదాకా పోయి, తర్వాత చర్చకు సమయం లేదు, సారీ, తర్వాత మాట్లాడేది ఫలానా వారు … ఇది మనకు తెలిసిందేకదా. అలా జరగలేదు. ఇది చాలా మంచి ప్రయోగం.

కానీ ఇందులోకూడా కొంత మార్పు రావాలి. మొదటి ప్రసంగం తర్వాత చర్చ చాలాసేపు జరిగింది. చివరి వక్త ప్రసంగం ముగించేసరికి చర్చకు తగినంత సమయం మిగల్లేదు. సమయపాలన నిర్వహించినవారు, నాతో సహా, తగు జాగ్రత్తలు తీసుకోలేదు. దీనిగురించి ఈసారి ఇంకొంచెం శ్రద్ధవహించాలి.

నాకు బాగా నచ్చిన ప్రసంగాలు: చంద్రహాస్ గారి ఉద్యమాల్లో రచయితల బాధ్యత , అనంత్ గారి సాహిత్య సభలు నిర్వహించడం ఎలాగా.

-ఆరి సీతారామయ్య

కిక్ స్టార్ట్

మొదటి  అమెరికా రచయితల సదస్సు నుండి  తిరిగొచ్చి  ఐదు రోజులయ్యింది, ఇంకా  మత్తు  వదల్లేదు. అభిరుచి కలిపే స్నేహాలు  చాలా పాతగా అనిపిస్తాయి, రెండు రోజులు సాగిన గాఢమైన  ముచ్చట్ల ప్రభావం వీడడానికి కాస్త సమయం పడుతుంది, పట్టకపోయినా ప్రమాదం లేదు.

నాకు సంప్రదాయ సభలు కొత్త కాదు – మా హ్యూస్టన్ బృందంతో  కలిసి వెన్నెల కార్యక్రమాలు  నిర్వహిస్తూ  ఉంటాను,  అలానే కొన్నింటిలో పాల్గొన్న  అనుభవం  కూడా  ఉంది, అయితే రచయిత కోణం నుండి చూస్తే ఆ పద్ధతి అసంపూర్ణంగా అనిపించేది. సంప్రదాయ సభల విలువ తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. అక్కడ టార్గెట్  ఆడియన్స్  వేరు, ఆశించే ప్రయోజనం వేరు. అలా అని సరిపెట్టుకుంటే  అసంతృప్తి మాయమవదు కదా!  రాస్తున్నప్పుడు ఏకాంతం తప్ప చుట్టూ ఏమీ ఉండదని రచయిత  ఏకాకి కాదు, తోటి రచయితల, సీనియర్ల   ఆలోచనా సరళి  తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. కొందరిని  ఏదైనా సందర్భంలో కలుసుకున్నా ఆ  సంభాషణ ‘‘కూలర్ టాక్’ లా పైపైన సాగుతుంది తప్ప విస్తృతమైన సంభాషణకి దారితీయదు. సంపాదకులు కొత్త ప్రతిభను ఎలా గుర్తిస్తారు? , రచనలను ఎలా ఎంపిక చేస్తారు?  – ఈ ప్రక్రియ వైయుక్తికమా? లేక నిరంకుశ సంపాదకుల ఇష్టారాజ్యమా?,  డయాస్పోరా సాహిత్యం  ప్రస్తుతం  ఏ స్థాయిలో  ఉంది? కవిత్వంలో అస్తిత్వ వాదాల ప్రయోజనం ఏమిటి? సైన్స్ ఫిక్షన్ కథలు రాయడం కష్టమా?  ఇలా ఎన్నో  ‘ఇన్సైడర్’ సందేహాలు. ఇవి కొత్త  సందేహాలు కాదు, ఎందరో ఎన్నోసార్లు ముచ్చటించనవే, అయినా సంబంధించిన వారితో ప్రత్యక్షంగా, సూటిగా  మాట్లాడడానికి మించిన  దారేముంది? ఇలా ఎన్నో ఖాళీలని పూరించడానికి  ప్రత్యేక వేదిక అవసరం ఉందని గుర్తించి, దాన్ని సాధించిన కోర్ టీమ్ – బ్రహ్మానందం గొర్తి, చంద్ర కన్నెగంటి, అఫ్సర్, కల్పన గార్లని అభినందించాలి. ఈ కబుర్ల ఉద్యమాన్ని కిక్ స్టార్ట్ చెయ్యడానికి  వారి బ్రాండ్ వేల్యూ గొప్పగా పని చేసిందనే చెప్పాలి.

కథ, కవిత్వం, విమర్శ, అనువాదాలు, పుస్తక ప్రచురణ వంటి వివిధ అంశాలపై వక్తలు శ్రోతలు అనే పిట్ట గోడలు  లేకుండా చర్చలు లోతుగా, ఆసక్తికరంగా సాగాయి. ఒకే దేశంలో ఉన్నా ఫేస్బుక్ కి, పరిమితమైన మిత్రులని  మొదటిసారి కలుసుకోవడం, ఏళ్ళుగా   అమెరికాలో  తెలుగు  సాహిత్యానికి చిరునామాగా నిలిచిన పెద్దలని,  ఎన్నిసార్లు కలిసినా కొత్తగా  అనిపించే  మిత్రులని  తిరిగి  కలుసుకోవడం చాలా  సంతోషాన్నిచ్చాయి. కొన్ని సందేహాలు తీరాయి, కొన్ని వచ్చే సభకి దాచుకున్నాను.

-మధు పెమ్మరాజు

ఎడిటర్

3 comments

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ అభిప్రాయాలు చదివాక ఒక మంచి సమావేశానికి వెళ్ళలేకపోయానే అనే బెంగ మరీ ఎక్కువ అయింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు