“ఏందిన్నా, ఏందిన్నా ఇది. మళ్ళా ఇంత అధ్వాన్నమా?” బాధలో కూడా కోపం కనపడ్తాంది మాటల్లో.
“ఏమిన్నా, ఏమైంది, ఏమన్నా గొడవా?”
“గొడవేముందిలే సామీ. సావింటికాడ గొడవెందుకుంటాది. ఆయమ్మ బర్తే…”
“ఏం ఆయప్ప తాగొచ్చినాడా?”
“తాగని రోజుంద్యా?”
“సరెలే, ఆయప్ప సంగతి ఇడ్సిపెట్టండి”
“జరగాల్సిన పని చూడండి.”
“ఆయప్పనెవురూ పట్టిచ్చుకోవాకండిప్పా.”
“వాళ్ళ పిల్లోళ్ళు వచ్చినారా?”
“పిల్లోళ్ళని తీస్కోని కొడుకులు, కోడండ్లు వచ్చినారు. కూతురు, అల్లుడు ఇంగా రాల్యా. టౌనులో ఆటో ఎక్కినారంట. వచ్చేస్తారు”
ఇట్లా ఎవరో ఒకరు ఏందో ఒకటి అడుగుతానే ఉన్నారు. ఆడున్న మనుషుల్లో ఎవరో ఒకరు వాళ్ళకి జవాబు చెప్తానే ఉన్నారు.
ముసిలాయమ్మ చనిపోయింది. ఎట్ల చనిపోయింది?
*****
పొద్దున్నే పనికిపోయేటోళ్ళు వస్తే నేనీపొద్దు రాను మీరు పోయిరాపోండి అన్‌చెప్పింది. పండగ, పార్ణా అనుకోకుందా పనికిపోతాది, ఈ రోజేమైంది ఈ ముసిలాయమ్మకి అనుకున్యారు పనికి పొయ్యేటోళ్ళంతా. ఆరోగ్యం సరీత లేదేమోలే అనుకోని పనికి కదిల్నారు. ముసిలాయమ్మ కొట్టం పక్కన ఉన్నే కొట్టంలో వాళ్ళ కోడలు అడిగింది, ఏం పెద్దమ్మా పనికి పోనంటాన్నావు అని. ఏమీ లేదు పాపా, గోగాకు పప్పు తినక ఎన్నిరోజులైందని! ఈరోజు దొరికింది. పట్నం గోగాకు కాదు మన గోగాకే. దీంతో పప్పు రామితే ఎంత రుసిగా ఉంటుందని, అనింది కళ్ళు పెద్దవి చేస్కుంట.
ఔరా, బలే మనిషివి పెద్దమ్మా. గోగాకు పప్పు తినల్లని పనిలోకి పోవడం లేదా అనంటే నగింది ముసిలాయమ్మ. నగి చెప్తాంది, యాడా? మీ పెదనాయిన ఉండాడు గదా, వాడే నా మొగుడునాకొడుకు. కుండలో ఎంత పెట్టి పోతే అంతా తినేస్తాడు. రేత్రికి కూడా రోంత కూడా ఉండనీయడు. పనికి పోయినే సాట తిందామంటే తొందర తొందర తినండిమ్మా, పనికికి వొంగల్ల కదా అంటారు. కడుపుకి తినేకే కదా పాపా, ఈ కష్టమంతా. నిమ్మలంగా తినల్యాకపోతే ఎందుకింగ ఇదంతా? అదీ గాక గోగాకంటే నాకు పాణం. ఇన్నిరోజులకి దొరికింది. ఈరోజు పప్పు రాముకోని తింటా నిమ్మలంగా, అని ఆపింది.
ఔ, పెదనాయిన యాటికి పోయినాడు పెద్దమ్మా అనడుగుతానే, ఏంది పాపా ఏమీ తెలీనట్టు అడుగుతాండావు. యాడుంటాడు ఆయప్ప? సారాయంగడి కాడే కదూ, కడుపులో కాల్తే కదా ఇండ్లు గుర్తుకొచ్చేది, అనేసి కొట్టం బయటుండే గుంజకి పట్టుకోని నిలబడింది.
ఇప్పుడిట్లంటావ్ గానీ పెద్దమ్మా, ఏమైనా బలే సూస్కుంటావు పెదనాయన్ని, అంటానే చూసుకోకపోతే ఏం చేయల్ల పాపా. ఈయప్ప ఇట్ల తాగుతాడని తెలిసీ పెళ్ళి చేసిరి మా ముసలోళ్ళు. పెళ్ళి చేస్తానే వాళ్ళు దాటుకునిరి. అన్నలనే వాళ్ళు పలకరీయకపాయిరి. అక్కలనే వాళ్ళే ల్యాకపాయిరి. ఇంగ పుట్టినిల్లు ల్యాకుండా అయిపాయ. ఈయప్ప తాగేది చూస్తే భయమైతాండ్య. అయినా నాకుండేది ఆయప్పొకడే కదా అని పనికి పోయొచ్చి సాకుతాంటి. యానాడూ పనికి పొయ్యొచ్చి ఇన్ని దుడ్లు తెచ్చినే కత లేదు. ఎవురు మందు పోపిస్తా అంటే వాళ్ళ పని చేస్తాండ్య. పని చేసినా చేయకపోయినా తాగేది మాత్రం తక్కవ ల్యా. అయిదేండ్లకి ముగ్గురు పిల్లోళ్ళు పుట్టిరి. పుట్టిండే పిల్లోళ్ళు పుట్టినట్లే పెరిగి పెద్దోళ్ళయిరి. వీళ్ళ నాయిన రావిడి తట్టుకోల్యాక పెళ్ళిల్లు అయితానే వేరే ఊర్లకి పోయి చేరుకునిరి. మళ్ళా మొదటికే వచ్చె కదా కత. ఇంగ ఆయప్పా నేనే ఉంటాం ఇద్దుర్లో ఎవురో ఒకరం దాటుకునే వరుకూ. ఆ తర్వాత కత దేవుడెరుగు అనేసి లోపలికి పోయింది ముసిలాయమ్మ.
గోగాకు కట్ట ముందరేస్కోని కుచ్చోయింది. ఒక్కొక్క ఆకు తీసి గిన్నెలో ఏసింది. గోగాకు, మెరక్కాయిలు, బ్యాల్లు కడిగి పక్కనపెట్టి, దాంట్లోకి ఉప్పు, పసుపు ఏసి ఉడకేసింది. ఉడికినాక పప్పుగిత్తి తీస్కోని బాగా రామి, ఇంత నూనెలో జిలకరావాలు, పచ్చి కరేపాకు, ఎర్రగడ్డ ఏసి తిరవాత కేసింది. అన్నం గూడా చేసేసింది. వడియాలు గుర్తుకొచ్చి పొయ్యి మింద గోళం పెట్టి నూనె పోసి వడియాలు ఏంచింది. అట్లే రోన్ని మజ్జిగ మెరక్కాయిలు గూడా ఏంచుకుంది. అంతా అయితానే ఉడుకుడుకు బువ్వ తట్టలో పెట్టుకోని కావాల్సినంత పప్పు ఏస్కోని కలుపుకోని, వడియాలు, మజ్జిగ మెరక్కాయిలు మార్చి మార్చి నంజుకుంటా తినింది. ఎంతసేపుటికి కడుపు నిండిందో ఆయమ్మకే తెలియల్ల. కడుపు నిండిందో, మనసు గూడా నిండిందో కానీ మొత్తానికి చేయి కడుక్కుంది. కొట్టంలో నుండి బయటికొచ్చి ఆ చేతులు కడుక్కొయినే నీళ్ళతోనే తట్ట కడిగి ఆ నీళ్ళు రోడ్దు మిందికి పారేసింది. ఆ నీళ్ళల్లో అన్నం మెతుకులు, మెరక్కాయ తోళ్ళు ఉంటే కోళ్ళొచ్చి తినబట్నాయి. చొంబులోని నీళ్ళు ఇంకొన్ని పోసి తట్ట కడిగింది. లోపలికి పోయి కుండలో నీళ్ళు తీస్కోని సాలు అనిపిచ్చేదాకా తాగింది.
కొట్టానికి వాకిలేస్కోని లోపల మంచమేస్కోని పనుకోయింది. నిద్రపోయింది. ఇంగ అట్ల ఉంది. అట్లే నిద్దర్లోనే ఎళ్ళిపోయింది.
*****
తాగొచ్చిన ముసిలోడు ఈరంగం చేస్తాన్నాడు. ఆయప్పకి జనాల్ని ఎక్కువ మందిని చూస్తే యాడలేని కోపమొస్తాది. వాళ్ళంతా ఆయప్ప కొట్టంకాడే ఉండేసరికి కోపం ఇంగా జ్యాచ్చీ అయింది. తాగేసి ఉన్నాడు కాబట్టి అదింగా ఎక్కువైంది. అయినా యారోజు తాగిలేడని!
ఇప్పుడేమి దీనికి నీళ్ళుపోసి, పౌడరు కొట్టి సింగారించల్లనా? సచ్చిపోయిండే దానికి ఎందుకివన్నీ, పోయి పారెక్కి రాపోండి, అనుకుంట ఎగుర్తాన్నాడు. ఇద్దరు మనుషులు పట్టుకోని ఒక సాట కుచ్చోబెట్టినారు. అయినా అరిసేది మానుకోల్యా. యాదో ఒకటి చెప్తానే ఉన్నాడు.
కొంచేపటికి ఇంటికాడ చేయాల్సిండేవన్నీ ముగించుకోని సమాధుల కాటికి తీస్కపోయినారు ముసిలాయమ్మని. పోదాము రా అంటే పోల్యా ముసిలాయప్ప. మీరు పోయిరాండిరా నీయక్క, నాకేం పట్టింది? అనుకుంట కుచ్చొయినాడు.
మొగోళ్ళందురూ పోతే ఆడోళ్ళు ఒకటే ఇంటికాడ ఉండిపోయినారు. సన్నగ లేసినాడు ముసిలోడు. అప్పుడు అర్సుకుంట ఎగిర్నే ఎగరడం , లుంగీ యాడో అంతదూరంలో పడింది. డాయరు మీదనే ఉండాడు. కాళ్ళు చేతులు కట్టెలాలె ఉన్నాయి. నెత్తిమింద ఎంటికలు తెల్లగ పెయింటు కొట్టినెట్లుండాయి. కాళ్ళు ఒకసాట నిలబడల్యాకపోతాండాయి. నాలుగడుగులు దబాదబా ఏసి లుంగీ ఉన్నేసాటికి కింద పడకుండానే వచ్చినాడు. ఆ లుంగీ తీస్కోని భుజమ్మిందేసుకున్యాడు. సర్రని బయట బల్బుండే కాడికొచ్చినాడు. వచ్చిండే స్పీడు చూస్తే కింద పడ్తాడేమో అనుకోవాల్సిండేదే. కొట్టానికి బయటున్న గుంజకు పట్టుకోని ఆగినాడు. చేయి పైకెత్తి వెలుగుతాన్నే లైటు అట్లనే పట్టి పీకినాడు. చేయి కాలిందో లేదో మళ్ళ!
లైటు ల్యాకపోయేతలికి ఆడంతా సీకటైపోయింది. ఆ లైటు తీస్కోని పోతాపోతా, దాన్ని పారెక్కేకి పోయినారు గదా? ఇంగ ఈడేం పని మీకు , మీ కొంపలకి ఊరేగండి అనేసి లోపలికి పోయి వాకిలేసుకున్నాడు. ఆయప్ప లోపలికి పోతానే లోపల్నుండి అన్నం తినేకి తట్ట, గ్లాసు కదిలిచ్చినే శబ్దమొచ్చింది. కొంచేపటికి బ్రేవ్… అని తేన్చి లోపలుండే లైటు గూడా ఆఫ్ చేసేసి పనుకున్యాడు.
“ఏమిక్కా, ఇంతద్వాన్నమా?”
“ఏం చేయల్ల. రోజూ ఇదే కతేనేమో..?”
“ఇట్లాంటోనితో ఇన్నేళ్ళు ఎట్ల కాపురం చేసిందో ఏమో ముసిలాయమ్మ.”
“ఎన్నేండ్లుంటాయి ఈయప్పకి?”
“డెబ్బైకి తక్కువుండవు.”
“ముసిలాయమ్మకి?”
“ఒక అరవై ఉండవూ?”
“మళ్ళ అన్నేండ్లు కాపురం చేసినే పెళ్ళాం సచ్చిపోతే ఇట్లుంటారా?”
“తాగినాడు కదూ..!”
“తాగనిదెప్పుడని?”
“అయినా ఆయమ్మకి దండం పెట్టొచ్చు. బూదేవంత సగనం అంటారు చూడు. అట్ల.”
“ముసిలోనికి రోంతన్న బాదుంటాదంటావా?”
“ఏముంటాదో ఏమో, పిల్లప్పుట్యాల్ నుండి వాళ్ళమ్మ సాకింది. పెళ్ళయితానే పెళ్ళాం సాకింది. డెబ్బై ఏండ్లొచ్చినా ఒకరి మింద ఆదారపడి బ్రతికేది పోల్యా. వాళ్ళమ్మకేం ఈయప్పకి పెండ్లి చేసి రెండేండ్లకే దాటుకుంది. పాపం ఈ ముసలాయమ్మ ఇన్నేండ్లు…”
“ఇప్పుడు ఈయమ్మా దాటుకుందిలే…”
“రేప్పొద్దున నిద్దరలేస్తే, తాగినేదంతా దిగిపోయినాక, కడుపులో కాలితే అప్పుడు ముసిలాయమ్మ గుర్తుకొస్తాది.”
“డెబ్బై ఏండ్లకి జీవితం మొదలైతాది ముసిలోనికి.”
“అసలైన జీవితం…”
*
చిత్రం: చరణ్ పరిమి
గౌస్ అన్న చాలా బాగుందన్నా కథ. రాయలసీమ పదాలు యెంత చక్కగా రాసారన్నా, ముసలమ్మంత దేవత పోయినాక ముసలాడి దుస్తితేంటో
మన భాష…మన యాసతో అద్భుతమైన కథ గౌస్!!ధన్యవాదాలు..
👏
చాలా బాగా రాసారు .. మీరు చాలా గొప్ప కథకులు అవుతారు .. ఒక కుర్రాడు ఇంత బాగా రాయగలడని ఊహించలేదు .. మాండలికం మీద పట్టు , సంఘటన యొక్క detailing .. excellent . 😍