రాసే ప్రతి కథలో వైవిధ్యం చూపి, తనదైన ప్రపంచాన్ని పాఠకుల ముందుంచే కథకుడు చరణ్ పరిమి. ఇటీవల తన తొలి కథాసంపుటి ‘కేరాఫ్ బావర్చీ’ విడుదలైంది. ఈ సందర్భంగా ఆ పుస్తకం గురించి తనతో మాటామంతీ..
- హాయ్ చరణ్! ముందుగా ‘కేరాఫ్ బావర్చీ’ కథా సంపుటి వెలువరించినందుకు మేలుతలపులు! తొలి కథాసంపుటి వెలువడిన ఈ సందర్భాన్ని ఎలా ఆనందిస్తున్నావ్?
థ్యాంక్యూ! ఏ రచయితకైనా తొలి పుస్తకం రావడం చాలా ఆనందం కలిగించే విషయం. నాకూ అలాగే ఉంది. ముందుగా, ఈ పుస్తకం తీసుకొచ్చిన ‘ఆన్వీక్షికి’ ప్రచురణ సంస్థకు, మహి బెజవాడ, వెంకట్ శిద్దారెడ్డిలకు కృతజ్ఞతలు. 2021లోనే కథా సంపుటి తేవాలన్న ఆలోచన వచ్చింది. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడి, 2022లో బయటికొచ్చింది. పుస్తకం తేవడం కలెక్టివ్ వర్క్. ఇందులో చాలామంది సహకారం ఉంది. కథలు, లేఅవుట్, ముఖచిత్రం సరిగ్గా కుదిరాక ఇదొక మంచి పుస్తకం అవుతుందన్న నమ్మకం బలపడింది.
- ఇప్పటికి 25 కథల దాకా రాశావు కదా? అందులో సగం కథలే పుస్తకంగా వేయడానికి కారణం?
ఈ విషయంలో రచయిత అరిపిరాల సత్యప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుమాట రాయమని ఆయనకు నా కథల్ని పంపాను. అవన్నీ రకరకాల అంశాలపై రాసిన కథలు. అలా వేర్వేరు కథలను పుస్తకంగా వేయడం కంటే, ఒక థీమ్ ఓరియెంటెడ్‌గా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన అనుభవాలు వివరించారు. నేను మొదట్లో రాసిన కొన్ని కథలు క్రాఫ్ట్‌పరంగా కొంత అపరిపక్వంగా ఉంటాయి. ఆ తర్వాత రాసిన మరికొన్ని కథలు అస్తిత్వవాద ధోరణిలో ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి ఈ పుస్తకం కోసం 12 కథలు ఎంపిక చేసుకున్నాను. ఆధునిక కాలంలో కళాకారుడి దృష్టి కోణం, అతని మానసిక స్థితి, అతని అంతఃప్రపంచం చుట్టూ తిరిగే కథల్ని పుస్తకంగా తెచ్చాను. మిగిలిన కథల్ని మరో పుస్తకంగా తేవాలన్న ఆలోచన ఉంది.
- “కళాకారుడి మస్తిష్కంలో, అతని మనసులో ఏముంటుందో, ఏం జరుగుతుంటుందో చూడాలంటే ఈ కథలు చదవండి” అని అరిపిరాల సత్యప్రసాద్ ముందుమాటలో రాశారు. నువ్వొక చిత్రకారుడివి, ఔత్సాహిక సినీ దర్శకుడివి. నీలోని కళాత్మక దృష్టి, కళాతృష్ణే ఈ కథల్లో అంశాలుగా మారాయని అనుకోవచ్చా?
ఈ కథల్లోని ఏ పాత్రా పూర్తిస్థాయిలో నేను కాను. అలాగే ఏ పాత్రా నేను లేకుండా లేదు. ‘కేరాఫ్ బావర్చీ’ కథలో ఔత్సాహిక దర్శకుడు నేనే కావచ్చు. అయితే అందులోని సందర్భం నాకు జరగలేదు. ఆ కథంతా నేను ఊహించుకున్నది. ‘క్యాండిడ్ పిక్చర్’ కథలో శేఖర్ పాత్ర నాకు బావ వరసయ్యే వ్యక్తిని చూసి అల్లుకున్నది. శ్రీశైలంలో ఆయన టూరిస్ట్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ‘బహుముఖాలు’ ఓ మిత్రుడి ప్రేమకథ. అతని జీవితంలోని ట్విస్ట్ నాకో కొత్త ప్రశ్న వేసి కథగా మారింది. ‘అన్ ఆర్టిస్ట్ బయోగ్రఫీ’ కథలో ప్రధానపాత్ర పడ్డ వేదనంతా నేను పడిందే! చిత్రకారుడిగా డిజైనింగ్ రంగంలో ప్రవేశించాక ఎంత పనిచేసినా సంతృప్తి దొరకలేదు.
ఇలా నా కథల్లోని కథానాయక పాత్రల్లో నేనుంటాను. వాటి తపన, అసంతృప్తి, ఆశయాలు నావే! వాటి చుట్టూ అల్లిన సంఘటనలు మాత్రం నాకు జరిగినవి కావు. సమాజంలో నేను చూసిన చీకటి కోణాలు ఆ కథలు రాసేలా చేశాయి. అమ్మాయిల మీద లైంగిక వేధింపులు, కళారంగంలో డార్క్ షేడ్స్, మార్కెట్ వ్యవస్థ లోపలి రూపం.. ఇలాంటివన్నీ నా కథల్లో అంశాలయ్యాయి.
- నీ కథలు ఎక్కువగా పురుషుల దృష్టి కోణం నుంచే నడుస్తాయి. ఎందుకలా? ఏదైనా ప్రత్యేకమైన కారణముందా?
ఈ 12 కథల్లో ‘వెదుకులాట’, ‘మాయపులి’ తప్ప మిగిలినవన్నీ నువ్వు చెప్పినట్టు ఉన్నాయి. నాలోని భావోద్వేగాలే కథల్లో పెట్టాను కాబట్టి అనుకోకుండా కథల్లో ఆ దృష్టికోణం వచ్చి ఉంటుంది. అంతకుమించి ప్రత్యేకమైన కారణమంటూ ఏం లేదు. ‘వింగ్స్ & షాడోస్’ కథలో జ్యో పాత్ర నృత్య కళాకారిణి. డ్యాన్స్‌ని వదిలిపెట్టడం వల్ల తను పడే బాధను రాశాను. నా వరకూ నాకు కథ రాసేటప్పుడు ఆ భావోద్వేగాలు ఒడిసి పట్టడం తప్ప, వేరే తేడాలేవీ చూడను.
- ఈ పుస్తకంలో కథలకు బొమ్మలు నువ్వే వేశావ్? పాఠకుడు కథను చదివి అర్థం చేసుకునేందుకు అవి ఏ మేరకు ఉపయోగపడతాయి?
ఈ పుస్తక ముఖచిత్రంతోపాటు అన్ని కథలకూ Abstract Illustrations వేశాను. కథలను అర్థం చేసుకునేందుకు ఏ మేరకు ఉపయోగపడతాయి అని మాట్లాడే ముందు, అసలు కథలకు బొమ్మలెందుకు వేస్తారు అనే విషయం మాట్లాడుకోవాలి. చాలా వరకు పత్రికల్లో వచ్చే కథలకు వేసే బొమ్మలు గమనిస్తే కథలో పాత్రలు, వాతావరణం, సన్నివేశాలను చిత్రిస్తారు. వాటిద్వారా పాఠకులు కథలోని పాత్రల్ని ఊహించుకోవచ్చు. నా కథల్లో పాత్రల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆ సంఘర్షణను బొమ్మ రూపంలో ఎలా చెప్పగలం? దాన్నొక సన్నివేశంలా చూపించలేం! అందుకే Abstract Illustrations ద్వారా పాత్రల తాలూకు డైలమాను చూపించే ప్రయత్నం చేశాను. ‘వింగ్స్ అండ్ షాడోస్’ కథ కోసం రెక్కలున్న బొమ్మను చిత్రించాను. కథ చదివి, అందులో భావం అర్థమైతే బొమ్మలోని లోతు తెలుస్తుంది. ఈ పుస్తకంలో అన్ని చిత్రాలూ అలాంటివే!
- ఈ కథల్లో కొన్నింటిని స్క్రీన్‌ప్లే పద్ధతిలో రాసినట్టు అనిపించింది. నీలోని కథకుడు దర్శకుడిగా మారి రాసిన కథలా అవి?
కథలు రాసేటప్పుడు నా విజన్ దృశ్యరూపంలో ఉంటుంది. అది నా శైలి. నా ఉద్దేశంలో ప్రతి కథకుడూ దర్శకుడే. కథని నిర్వహించడం అతని పని. దర్శకుడు తెర మీద తన పనితనం చూపితే రచయిత కాగితం మీద చూపిస్తాడు. సినిమాలో హీరో కోపంగా చూశాడు అంటే కెమెరా జూమ్ చేసి అతని ముఖంలో భావాలు చూపిస్తారు. కథలో అయితే ‘అతను కన్నెర్ర చేశాడు’ అనే మాటల ద్వారా ఆ భావం తీసుకురావాలి. రెండూ కథను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన సాధనాలే.
- ‘కేరాఫ్ బావర్చీ’ పుస్తకంలో ఎక్కువ శాతం కథలన్నీ నగరం నేపథ్యంలోనే నడుస్తాయి. ఆధునిక జీవనశైలి అంతా నగరాల్లోనే ఉందన్న ఆలోచనా? పల్లె జీవితాన్ని చూపలేని అశక్తతా?
దీనికో ఉదాహరణ చెప్తాను. మనం కొన్ని పనులు కొన్ని ప్రదేశాలలోనే చేయగలం. ట్రెక్కింగ్ కొండల వద్దే చేయాలి. ఈత కొట్టాలంటే నీళ్లున్న చోటే సాధ్యం. అటుఇటు అయితే ఇబ్బంది తప్పదు. చిత్రకారుడిగా, కథకుడిగా నాకున్న అనుభవంతో నేను రాసే కథలు నగరంలోనే సాధ్యమవుతాయి. పల్లెలో కుదరకపోవచ్చు. అక్కడి నేపథ్యంలో రాసేవి మరోలా ఉంటాయి. సినిమా షూటింగులు, కార్పొరేట్ సంస్థల నేపథ్యంలో కథలు రాయడానికి నగరం అవసరం. దీంతోపాటు కథకు స్థలజ్ఞత ముఖ్యం. కథకు తగ్గ వాతావరణాన్ని రాయాలంటే ఎక్కడ రాస్తున్నామన్నది చూసుకోవాలి.
- ఈ పుస్తకంలోని ‘మాయపులి’ కథ నాకు చాలా ఇష్టం. ఆడవాళ్ల మీద జరిగే అత్యాచారాల గురించి Magic Realism పద్ధతిలో రాశావ్! దానికి నేపథ్యం ఏంటి?
తెలంగాణ రాష్ట్రంలో 2019లో ‘దిశ’ సంఘటన జరిగింది. వెంటనే పోలీసులు, మీడియా, ప్రజలు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. అదే రోజు గుంటూరు జిల్లాలో ఒక దళిత అమ్మాయిపై అదే ఘోరం జరిగింది. కానీ ‘దిశ’ ఘటనలో వచ్చిన స్పందన అక్కడ రాలేదు. వారం రోజుల తర్వాత చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళమ్మ పోలీసు స్టేషన్ ముందు కూర్చుని నిరాహార దీక్ష చేసింది. ఇంత పెద్ద రాష్ట్రం, ఇంతమంది పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు, మీడియా.. ఎవరూ ఎందుకు ఆమెకు అండగా నిలబడలేదు అనే ప్రశ్న మొదలైంది. ఆ ఆలోచన కథగా మారింది. వ్యవస్థ చాలా పెద్దది. దాన్ని ప్రశ్నించాలంటే ఒక ప్రతీక కావాలనిపించింది. పులిని ప్రతీకగా చేసి కథంతా Magic Realism పద్ధతిలో రాశాను.
- ఈ పుస్తకం ప్రత్యేకతను వివరించమంటే ఏం చెప్తావ్?
ప్రతి ఒక్కరి రచనల్లో తమదైన భావజాలం ఉంటుంది. అది వారిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ కథలకు ఆ విలక్షణత ఉంది. పేరు, ముఖచిత్రం దగ్గరినుంచే ఈ పుస్తకం ప్రత్యేకత సంతరించుకుంది. కళారంగాల్లోని వ్యక్తుల స్థితిగతులు, మనస్తత్వాలు ఈ కథల్లో కనిపిస్తాయి. సినీరంగం నేపథ్యంలోనూ ఇందులో కథలున్నాయి.
ఈ కథలు పైకి వ్యక్తిగతంగా కనపడ్డా లోతుల్లో అన్నీ సామాజికమే. ‘మనోగీతం – కొన్ని అధ్యాయాలు’ కథలో దేవుడి మీదే ప్రశ్న సంధించాను. ఆ సందర్భం నిజంగానే ఒక అమ్మాయితో జరిగిన సంభాషణ. ఆమె హర్ట్ అయ్యి ఆ తర్వాత నా కంట పడలేదు. ఇది కథ కాబట్టి దానికి తగ్గ డ్రామా, ముగింపు వేరేగా ఇచ్చాను. కొన్నిసార్లు నాలోని కథకుడు, జర్నలిస్టు కలిసి పనిచేస్తారేమో అనిపిస్తుంది. కాబట్టే సమాజంలోని చెడును చూసి ప్రశ్నించాలని, అందరికీ తెలపాలనే ఆరాటంతో రాశాను. ఈ కథలు ప్రపంచాన్ని మరో కోణం నుంచి పరిచయం చేస్తాయి.
*
కొత్తగా కథలు రాయలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే అంశాల్ని చర్చించారు. చరణ్ అన్న సమాధానాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
Thank you bro.
ఈ మధ్య కాలంలో చదివిన candid interview. కథకుడికి తన రచన పట్ల తనకున్న clarity ఆశ్చర్య పరిచేదే
Thank you sir 😇
కేర్ ఆఫ్ బావర్చి కథలు చదివా. రచన శైలి బాగుంది. Clarity ఉన్న రచయిత మీరు. మీ కథలే కాదు.. లోతైన భావంతో గీసిన బొమ్మలు.. వీటన్నిటికీ మీరిచ్చిన explanation కూడా బాగుంది. Waiting for second book. All the best and Congratulations 👍💐
Thank you andi
Nice stories and Nice interview. Congratulations
Thank you madam