కచ్చ

“ మంగక్కేదిరా ? “ ఇందాకట్నుంచీ వెతుకుతున్నా.. పాపం తీర్థంలోకి వస్తానంది పట్టులంగా తొడుక్కొని! ఎక్కడా ఐపులేదు. నీకేవన్నా కనపడిందేట్రా?.. బతిమాలుతున్నట్టే అడిగింది రాజుగాణ్ణి.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొత్తకథా కోయిల మిథున. సాక్షిలో ప్రచురించబడిన కాటుక డిబ్బీ కథ మంచి గుర్తింపునిచ్చింది. దంపతుల మధ్య అనుబంధాన్ని, సున్నిత భావాల్ని అద్భుతంగా చిత్రించిన కథ అది. ఉత్తరాంధ్ర జీవితాల్ని, పల్లె మనుషుల బతుకు చిత్రాన్ని తన కథలతో చిత్రించాలనే ఆరాటం, తపన ఉన్న రచయిత్రి. గ్రామీణ జీవితాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఇతివృత్తాలుగా రాసే మిథున కథల్లో….. సూటిగా, ఆకట్టుకునేలా ఉండే వాక్యాలు కథల్ని ఏకబిగిన చదివించేలా చేస్తాయి. మిథున రాసిన “కచ్చ”…..ఈ పక్షం సారంగ రేపటి కథ.   

 

కచ్చ : ( గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక మహిళలు తమ చీరె/కింది వస్త్రాన్ని మడిచి, కాళ్ల మధ్య నుండి వెనక్కి లాగి బిగుతుగా పైకి దోపుతారు. దీన్ని ఉత్తరాంధ్ర వైపు ‘కచ్చ’ అనీ ‘ చిలకట్టు’ అనీ అంటారు. ఈ వస్త్ర ధారణని కథా వస్తువుగా తీస్కుని, కొత్త బట్టలు కట్టుకోవాలనే చిన్నమురిపెం కూడా తీర్చుకోలేని ఓ శ్రమజీవి కథ..)

 

“ఓ…. యమ్మణ్ణీ…. బారెడు పొద్దెక్కింది లెగే.. ఓ…. యమ్మణ్ణీ….”

అరుపులినపడగానే ఉలిక్కిపడి లేచింది మంగ. రోజూ అలవాటైన తన మామ్మ అరుపులే అవి! ఈ సూరీడికంత తొందరేంటో.. పని సేస్కోనీకుండా బేగి ఎల్లిపోవూఁ, నిద్దరోనీకుండా బేగి వొచ్చీడవూఁ..తిట్టుకుంటూ లేచింది.

మంగా.. అరవబోతున్న మామ్మకు ఎదురెళ్ళి.. “ఓవ్…. లేచానే, అరకు” అంటూ మంచం పక్కకు ఎత్తిపెట్టింది.

అరిగిపోయిన బ్రష్షుని నోట్లో తిప్పుతూ మామ్మ దగ్గరకొచ్చీ.. “మామ్మా.. పట్టులంగాయే…. “

మురిపెంగా అంటూ వొంటిమీదున్న చిరుగుల పరికిణీ అటూఇటూ చూపింది..మంగ .

“అలగేనే, ముందెల్లి గేదెలకి గడ్డిపరకలొట్టుకురా పో” అంటూ మామ్మ కసురుకుంది.

మంగ హడావుడిగా ముఖం కడిగేస్కుని, గోడకున్న మేకుకి తగిలించిన పాత చొక్కా తీసి తొడుక్కుంది. పరికిణీని రెండు కాళ్లమధ్యనుంచి వెనక్కి లాగుతూ కచ్చ దోపింది చిరుగులు దాచేస్తూ..

రాత్రి తొరిపిన చద్దన్నం కేరేజీలో సర్దుకుని, పెడకనున్న కొడవలి తీస్కుని వరాలమ్మగారి చెరుకుతోటకెళ్ళింది.

తోటలో పచ్చని పొడుగాటి ఆకుల్ని గుప్పిట పట్టి, వెనక్కి లాగిపెట్టి,చేయితిరిగిన శిక్షకుల్లా చకచకా చెరుకులు వొలుస్తున్నారు అక్కడ అప్పటికే చేరుకున్న కూలీలంతా.తనుతెచ్చుకున్న కొడవలితో పని మొదలెట్టింది మంగ.కాసేపటికి చెరుకుతోట కొట్టడం పూర్తయ్యాక గేదెల కోసం ఓ మోపెడు ఆకులు కోసి నెత్తిన పెట్టుకుని పొలానికెళ్లింది.

గేదెలకు మేతేసి , చన్నీళ్ళతో మొహం కడుక్కుని .. కచ్చ విప్పి చద్దన్నం ముందు పెట్టుకుని కూచుంది.

రెండు ముద్దలు తినగానే.. ఎవరో పిలిచినట్టు వినిపించి చూసింది.కల్లం దగ్గర పొద్దున్నే ఎవరిపని వారు చేసుకుంటూ మధ్యమధ్యలో నేనున్నాను అని తెలియాలన్నట్టు ఓ మాటో పాటో ఎత్తుకుంటారక్కడ.

“మంగక్కా.. బేగిరా…”

రాజుగాడరుస్తున్నట్టనిపించింది.

గబగబా మరో రెండు ముద్దలు కానిచ్చీ, చెయ్యి కడిగేసింది.

“యేట్రా రాజూ? యే అలగరుస్తున్నావ్?”

“పంతులుగోరింట్లో వొడ్లు దంచుతానన్నావట్ట కదా.. రమ్మంటన్నారెల్లు”

“ఔన్రోయ్! మర్సిపోయాను!” మొన్న సాయంత్రం అమ్మగోరు మరీమరీ సెప్పింది. పనుల్లో పడిపోయి గురుతురానేదు.ఇప్పుడెల్తే యెన్ని పజ్జాలు పాడుతాదో యేటో! ఒకటో తరగతిలో పద్యం అప్పజెప్పనందుకు చెవి మెలిపెట్టిన మేష్టారు గుర్తొచ్చారు మంగకి!

“బేగెల్లు, నేటైతే మల్లతను శపించీగల్డు! “ కిక్కిక్కిక్కని నవ్వుతూ మరికొంచెం భయపెట్టాడు రాజుగాడు.

“ఓరాగరా.. ఇదిగో ఎల్తన్నా” నంటూ మళ్లీ కచ్చా బిగించింది.

“ఏవే మంగా..మొన్ననగా కబురంపాను. మీ మామ్మ చెప్పలేదంటే? తెల్లారింటికల్లా పెదపాప ఇంటికి బియ్యం బస్తాలు పంపాలి. ఇంతాలస్యమైందే ? “అని శారదమ్మ గదమాయిస్తుంటే.. రాత్రి టీవీలో చూసిన గయ్యాళి సూరమ్మ గుర్తొచ్చి కిసుక్కున నవ్వబోయింది. అంతలోనే పంతులుగారు చూసారంటే భుజమ్మీద ఏ సొంటిపిక్కో ఖాయమని గుర్తొచ్చి గమ్మునాగిపోయింది.

“ అది కాదమ్మా .. మామామ్మ సెప్పింది. నేనే మర్సిపోన్ను! “ తలగోక్కుంటూ.. అంది. మధ్యాహ్నానికి చావిట్లో వొడ్లన్నీ దంచి బస్తాకెత్తింది.

ఎండ చుర్రుమంటోంది. మంగ కడుపులో పేగులు మెలిపెడుతున్నాయ్.తలపైకెత్తి సూరీడ్ని చూడబోయింది. కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్లు.. చప్పున తలదించీ, మధ్యాహ్నమైందని గుర్తించింది.

“ అమ్మగోరండీ.. ఇయ్యాల్తో మూడు బస్తాలు.ఆ.. క.. లేస్తందండీ.. “ అరచేత్తో పొట్ట మీద అక్షరాలు రాస్తున్నట్లు చూపిస్తూ.. పెదాలు రెంటినీ బిగించి ముక్కుకు తాకిస్తూ అడిగింది. కాస్త చనువున్న వారితో మాటాడేటప్పుడలా గారాలు పోవడం ఆ పెదాలకలవాటు!

“భోజనాలవేళ దాటిందే! ఇదిగో.. ముందీ ప్రసాదం తినూ.. డబ్బులు రేపిస్తాలే..” నీకు కూలే దండగా, మళ్లీ ఫలహారాలు కూడానా అన్నట్టుందామె గొంతులో విరుపు.

“అదేం కుదర్దు. మామామ్మ తిడతాది. ఇప్పుడే ఇచ్చియ్యండి”. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని ఒక్కసారే అడిగేసింది. పనైపోయింది కాబట్టి ఇప్పుడు పంతులుగారొచ్చినా శొంటిపిక్కకి దొరక్కుండా పారిపోవచ్చనేమో!

“గడుసుపిండానివే! ఇంద.. తీస్కో” అని అరవై రూపాయలు చేతిలో పెట్టింది శారదమ్మగారు.

అరవైయ్యీ..ముప్పయ్యీ..ఎనబయ్యీ..నూటా…లెక్కేసింది తను దాచుకున్న డబ్బుల్ని . బళ్ళో మేష్టారుకి భయపడి సగం, మామ్మకు సాయంచేసేవారెవరూ లేరని సాకుతో సగం.. చదువుకు చిన్నప్పుడే సెలవిచ్చేసింది. డబ్బులు లెక్కలేయడమంటే పెద్ద చిక్కే తనకి.

‘ కొత్త పట్టులంగా కొనుక్కోడానికి ఈ డబ్బులు సరిపోవు, ఇంకో వందన్నా కావాలి! ‘ అనుకుంటూ పొలంవైపు నడిచింది.

ఎల్లుండి ‘ నూకాలమ్మ తీర్థం ‘. ఊళ్లో అమ్మాయిలంతా కొత్త వోణీలూ..పరికిణీలు.. పట్టులంగాలూ.. వేస్కుని.. జడలుదాటేవరకూ పూలు దోపీ , చేతుల్నిండా గాజులూ, కోను గోరింటలూ వేసుకొని సందడి చేస్తూ తీర్థానికి వెళ్తారు.ఆటలూ, పాటలూ , చుట్టాల పలకరింపులూ.. పరాచికాలూ.. మంచి సందడి.

ముందేడు తీర్థానికి మాణిక్యమ్మగారి ఊరెళ్ళాల్సొచ్చింది.. వాళ్ళమ్మాయికి కాన్పైతేనూ.. తోడుకోసం..కిందటేడు పార్వతమ్మగారి అత్తగారు పోయారని తెలిసీ .. రోజంతా వాళ్లింట్లో వచ్చీపోయినోళ్లకి మంచీ చెడ్డా చూస్కుంటూ గడిపేసింది.ఇయ్యేడెలాగైనా కొత్త పట్టులంగా కట్టుకుని తన స్నేహితురాళ్ళతో చెట్టాపట్టాలేస్కుని.. తీర్థానికి పోవాలి..

‘ ఎక్కడికీ పోకుండా..ఎవ్వరేపని చెప్పినావినకుండా.. ‘ గట్టిగా అనుకుంది.

“ గౌరీ.. నువు సంతకెల్లీటప్పుడు కేకెయ్.. నేనూ వస్తా. కొత్త పట్టులంగా కొనాల. తీర్థానికేస్కుంటా” అంది స్నేహితురాలు గౌరి తో.

“యేటీ ..! నువ్వే.. ?! కొత్త లంగాయే.. ?! తీర్థమే?!

కచ్చ తోటి తీర్థానికొస్తే బాగోదే మంగా !” గౌరి పరాచికానికి చిన్నబోయింది మంగ. వాళ్ళంతా పదోతరగతి వరకూ బుద్ధిగా బడికెళ్ళి చదువుకున్నారు.మంగ బడికిరాకపోయినా వాళ్ళతో సాయంకాలం సరుగుడు తోపుదగ్గర ఆడిన కబడీ ఆట స్నేహితుల్ని చేసింది వాళ్ళని.

గౌరి మాటలకి కాసేపు నొచ్చుకున్నా తనమాటల్లో నిజముందిగా అనిపించింది మంగకి.తనవాలకం.. తన యీడు పిల్లలంతా బడులకెళ్తూ.. ఆడుతూ.. పాడుతూ.. చలాకీగా తిరుగుతుంటే.. తాను మాత్రం….చిరుగుల లంగా కచ్చాతో.. పైనో చొక్కా తొడుక్కొనీ..

‘అమ్మానాన్నల్లేని వూరోరి బిడ్డని కదా! నాకెందుకంట సోకులూ’! ధారగా కారుతోన్న ఉక్రోషాన్ని భుజాన చొక్కాకి ఇంకిస్తూ పనిలో పడింది మళ్ళా.కల్లం దగ్గర శుభ్రం చేసి నులకమంచమ్మీద సాగిలపడబోయింది.

“మంగక్కా..” నిండుకుండలో గుళకరాయేసినట్లు నిశ్శబ్దం మధ్యలో ఆ అరుపుతో చిన్నపాటి అలజడి.రాజుగాడే మళ్లీ! ఈసారేకబురు తెచ్చాడో తింగరచ్చిగాడు.. తిట్టుకుంటూ పాక ముంజూరులోంచి తల బయటకి పెట్టింది.

“యేట్రా ?”

“యెల్లుండు తీర్థం కదే.. రేపు సంతలో మా నాన్న కొత్త పుల్ పాంటూ, బుస్కోటూ కొంటానన్నాడు! “ ఉడికిస్తున్నట్టన్నాడు.

“ఆ.. యెల్లు మరి”

“నువ్వో ?”

“నేనూ కొనుకుంట”.

యీడి పొగరు యిగిరిపోనూ.. కొత్త బట్టలు పేరు చెప్పి నన్నుడికించడమే పనీడికి.రాని కోపాన్ని ఊరికే తెచ్చుకుంటూ మెటికలిరిచింది.

చీకటి పడుతూనే ఇంటికెళ్లి మామ్మ వండిన గుడ్డుపులుసన్నం తింటూ..

“మామ్మా.. కొత్త పట్టులంగాయే.. “ “ తీర్థమే ..” గారాలు పోయింది పెదాలు ముడిచి ముక్కుకంటిస్తూ..

“ ఆ.. రేపు సంతలో కొనుకుందులేయమ్మా.. “

“ నా దగ్గిర రెండొందల డెబ్భైయ్యుందే.. సరిపోవు”. ధాన్యం దంచినందుకు శారదమ్మ ఇచ్చినవీ, పైడినాయుడు చేలో కంకులు కోసి సంపాయించినవీ, బడాయిబాబు పొలంలో సరుగు నారు ఉడిచినందుకు చేతిలో పెట్టినవీ.. ఒక్కో పనికీ తనకొచ్చిన కూలిడబ్బులు లెక్కచెబుతూవుంది..

మామ్మ చిక్కంలో దాచుకున్న చిల్లర తీసిచ్చింది.హమ్మయ్యా..ఎక్కడ దాసీసావే చిక్కాన్నీ.. అనుకుంటూ గబగబా చిల్లర లెక్కెట్టింది. మొత్తం మూడొందలేబయ్యి.ఇంకో యాబయ్యుంటే బాగుణ్ణు, మంచి వోణీ కూడా వచ్చేది.. అనుకుంటూ రెండు నిమిషాలు ఆలోచించింది కళ్ళను చూరుకంటిస్తూ..

జారిన పట్టిని సరిచేసి బొంతను పరిచింది బామ్మ. దాన్ని చూడగానే ఎక్కడలేని నిద్ర ముంచుకొచ్చింది మంగకి.లైటు తీసేసి మామ్మ నడుంచుట్టూ చెయ్యేసి, గట్టిగా కరుచుకొని వెచ్చగా పడుకుంది.

ముక్కునదరగొడుతున్న పొగాకు వాసన.. తనకలవాటైపోయినా..మానమని చెప్పినా బామ్మ మానదని తెలిసినా..ఎప్పట్లా మరోసారి విన్నవించింది..

“అబ్బా.. చుట్టకంపే! మానియ్యొచ్చుకద మామ్మా..” అని!

“నీ పెల్లయ్యాక మానెత్తానే.. మీ నాన్న కూడా యిలాగే నన్నూ….” మామ్మ మళ్లీ పాతకథ ప్రారంభించింది. మామ్మ మాటలు వింటూనే నిద్దట్లోకి జారుకుంది మంగ.

“ఓయమ్మణ్ణీ….” గడియారం లేని అలారంలాంటి మామ్మ పిలుపు!

యథాతథంగా పన్లోకి బయల్దేరి, కచ్చ దోపుతూ “మామ్మా.. ఇయ్యాల సంత. సేలో పనంతా ఐనాక అట్నుంచటే సంతకు పోయొత్తా”నంది. పిల్ల మాటలో ఇవ్వాళ భలే చురుకు కనపడింది మామ్మకి.

“ జాగర్తమ్మణ్ణీ….పొద్దుపోకముందొచ్చీ.. “ నవ్వుతూ పంపింది మామ్మ.

నూకాలమ్మ తీర్థం. ఊరంతా డప్పు చప్పుళ్ళతో.. పులివేశాలు..గుగ్గిలం ధూపాలూ..వేపమండలూ.. ఘటాలెత్తుకున్న పల్లె పడుచుల్తో కోలాహలంగా ఉంది.

“మామ్మా…. మంగేదీ?” గౌరి.. స్నేహితురాళ్ళ గుంపుతో ఇంటిముందుకొచ్చి కేకేసింది, మామ్మకినపడేలా..

“అదెప్పుడో తయారయ్యొచ్చీసిందే.. నీకగపడ్లేదేటీ? “

“ లేదే! “

“ సంబరాలైపోతున్నాయ్.మంగ రాలేదు, మనం పోదామే” ఆదుర్దాగా అంటోంది లక్ష్మి.

“మీరెల్లండే, ఈసారైనా తీర్థానికొస్తానన్నాది మంగ పాపం!నేనెల్లి తీస్కొస్తా” నంటూ గౌరి కల్లాల్లోకీ, ఊర్లోకీ అటూఇటూ మూడుసార్లు తిరిగింది.

“రాజూ….” గౌరి పిలుపుకి కీచుమంటూ బ్రేకేసాడు సైకిల్ వేగాన్ని తగ్గించి,రాజుగాడు.

“ మంగక్కేదిరా ? “ ఇందాకట్నుంచీ వెతుకుతున్నా.. పాపం తీర్థంలోకి వస్తానంది పట్టులంగా తొడుక్కొని! ఎక్కడా ఐపులేదు. నీకేవన్నా కనపడిందేట్రా?.. బతిమాలుతున్నట్టే అడిగింది రాజుగాణ్ణి. మంగ ఏటైంలో ఎక్కడ ఉంటుందో వాడికే తెలుస్తుంది. పొద్దస్తమానం జోడుదూడల్లా తిరుగుతుంటారుగదరా.. ఎక్కడుందదీ? తొరగా చెప్పరా బాబూ.. మరోసారి బతిమాలింది.

చూపుడువేలు గడ్డమ్మీద ఆనించి ఓనిముషం ఆలోచించాడు. బుర్రలో అగ్గిపుల్ల వెలిగిన చప్పుడు.. ఆ…. ఇందాక పెసిరెంటుగారింటి వేపు ఎల్లటం సూసాను. ఇప్పుడు ఎక్కడుందో నాకు తెల్దు. సైకిల్ బ్రేకొదిలి పెడల్ మీద కాలుపెట్టి గాల్లో నిలబడుతూ బలంగా ఓ తొక్కు….

గౌరి ఆత్రంగా ప్రెసిడెంటుగారింటికెళ్లింది. లోపల చాలా మందే ఉన్నారు చుట్టాలేమో!కబుర్లు చెప్పుకుంటూ.. పెద్దగా నవ్వుకుంటూ కొందరు, ముస్తాబులౌతూ కొందరు, పిండివంటలు నవుఁల్తూ కొందరు, పండగంతా ఈలింట్లోనే ఉన్నట్టుంది.. ఈపిల్లెక్కడుందో!తిట్టుకుంటూ వెతుకుతూ వెళుతోంది గౌరి. అక్కడెవరికీ మంగ తెలీకపోవచ్చని, వాళ్ళని ఎవర్నీ అడక్కుండా వెతుకుతోంది. ఎక్కడా పత్తాలేదు పిల్ల. బహుశా ఇక్కడ కూడా లేదేమో .. ఇంకెవరింటికైనా వెళ్లిందేమో!ఒకవేళ పండగలోకి పోయిందా?! కాసేపు గౌరి బుర్ర వేడెక్కిపోయింది. కొంచెం కోపం కూడా.. నాచేతికి దొరకవే మంగా.. అనుకుంటూ ప్రెసిడెంటుగారింటి పెరట్లోకొచ్చింది.

కనపడింది!!

అది మంగేనా? చీకట్లో డిమ్ములైటు వేలాడదీసుంది. దాని వెలుగులో ఇద్దరు.. ఆడవాళ్ళే. మండుతున్న గాడిపొయ్యి దగ్గర….కట్టెలెగదోస్తూ ఒకావిడ.రెండోది ఇనుప చట్రాలతో.. వేగిన అరిసెల్నుండి నూనద్దుతూ….మధ్యమధ్యలో జారిపోతున్న పట్టులంగా కచ్చని సర్దుకుంటూ మంగ!!

*

 

ఇలాంటివే రాయాలని నియమం లేదు: మిథున

– మిథున గారు..నమస్తే అండి. మీ మొదటి కథ ఎప్పుడు రాశారు. ?

చిన్నప్పుడు మా ఇంటిదగ్గర ఒక కిరాణాదుకాణంలో పావలా తీసుకుని ఒక రోజుకి  ఒక కథలపుస్తకం అద్దెకు ఇచ్చేవారు. తరచూ ఏదో ఒకటి తెచ్చుకుని చదువుతూ,

నా పాకెట్ మనీ చాలావరకు అలా అద్దెపుస్తకాలకే ఖర్చు పెట్టేదాన్ని. బాలమిత్ర, చందమామ,బాల జ్యోతి, బుజ్జాయి వంటివన్నీ వదిలిపెట్టకుండా చదివేదాన్ని. తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు మొదటిసారిగా కథ రాసా. మా టీచరు దానిని బాలమిత్రకు పంపారు. కథ పేరు”భలే రాక్షసుడు”. చిన్నప్పటి ఫాంటసీ లోకం గురించిన కథ అది. నాకు ఏవేం కావాలో వాటిని నాకు తెచ్చిపెట్టడంలో ఒక రాక్షసుడు నాకు ఎలా సాయం చేసాడో.. వుంటుందందులో!! తర్వాత ‘నలుగురు అమ్మాయిలు’, ‘మానాన్న రుస్తుం’, అనేవి రాసా.  కొన్ని కథలు రాసినా ముద్రణకి పంపలేదు. చదువైనాక ఉద్యోగార్ధం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. ఆ సమయంలో కథలు రాయలేదుగానీ బాగా చదివేదాన్ని. నాకున్న ఒత్తిడిని తగ్గించడంలో కథా పఠనం ఎంతగానో ఉపయోగపడింది.

-కాటుక డిబ్బీ కథలో…దంపతుల అనుబంధాన్ని బాగా చిత్రించారు.  అచ్చం బాపుగారి సినిమాలా ఉంటుంది. ?

సాక్షి లో అచ్చు వేయబడిన కథ ‘కాటుక డిబ్బీ’ నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అది చదివినపుడు బాపుగారి సినిమా గుర్తొచ్చింది అంటుంటే సంతోషంగా ఉంది.

వారిని అనుకరించలేదు గానీ.. బంధాలనేవి(అవి ఏవైనా)అమూల్యమైనవిగా భావిస్తాను. పాత్రల మధ్య అనుబంధాలను సున్నితంగా ఆవిష్కరించడానికి తపిస్తుంటాను.

 -ఏ తరహా కథలు ఇష్టపడతారు. ఎలాంటి కథలు రాయాలనుకుంటారు… ?

ఇలాంటి కథలే రాయాలని నియమం పెట్టుకోలేదు. ప్రేమ, స్త్రీవాదం, సామాజిక చైతన్యం, తాత్వికత, గ్రామీణ జీవనం..ఇలా ఏవైనా..పాత్రలకు ప్రాణం పోయగలిగినవీ, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు రాయాలనుకుంటున్నా..కొన్ని రాస్తున్నా. కథలు రాయడంలో మెళకువల్ని ఇంకా అవగాహన చేస్కోవలసి ఉంది.

-మీకు నచ్చిన కథలు, కథకులు… ?

మాల్గుడి కథలు,రావిశాస్త్రి గారి రచనలు, చలం నవలలు, దర్గామిట్ట కథలు ఇష్టం. ఇష్టమైన రచయితలంటూ ప్రత్యేకంగా ఒకరిగురించి చెప్పలేను. కథాశైలి కంటే, పాత్రలను మలచిన తీరు,ఆ కథను నడిపించిన విధానాన్ని, గమనిస్తా. మనసులో మాటలను బయటకు వ్యక్తపరచడంలో భావుకత నచ్చుతుంది. ప్రాంతీయ మాండలికాల్లో ఉన్న కథలు ఆసక్తిగా చదువుతా. సినిమా సాహిత్యం కూడా ఇష్టం. సన్నివేశాలను ఊహించుకుని సంభాషణలు రాసుకుంటాను.

ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చినవి….. ?

ఈమధ్య నేను చదివిన కథల్లో ‘ఒంటరి’ బాగా నచ్చింది. మనిషికీ – ప్రకృతికీ మధ్య సంబంధాన్ని, తాత్వికతను అద్భుతంగా చిత్రీకరించారు సన్నపరెడ్డి గారు.  అలాగే ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు.. ఎవరికీ చెప్పుకోలేని సమస్యతో సతమయ్యేటప్పుడు వారి మానసిక పరిస్థితిని, వేదననీ వర్ణిస్తూ కరుణకుమార్ గారు రాసిన  ‘పుష్పలత నవ్వింది’ అనే కథ నన్ను చాలా రోజులు వెంటాడింది.  ఇంతవరకూ ఎక్కడా స్పృశించబడని కథాంశాన్ని అందులో చూశా నేను.

-కథ రాసేముందు ఏదైనా హోం వర్క్ చేస్తుంటారా.. ?

కథలు రాయడానికి హోం వర్క్ బాగానే చేస్తుంటా. కొన్నిసార్లు కథా వస్తువు కంటే, పాత్రలు, వాటిమధ్య సంభాషణలే కథను అల్లుకుంటూ పోతుంటాయి.

ఏది రాస్తున్నా, నా లోలోపల వున్న తాత్విక చింతన ప్రభావం దానిమీద ప్రసరిస్తుందేమో అనిపిస్తుంటుంది. పాత్రల్లో తాదాత్మీకరణ కోసం సన్నివేశాల్ని విజువలైజ్ చేస్కుంటూ ఉంటా కూడా. బహుశా ఈ ఆలోచనా విధానమేనేమో నన్ను సినిమా ప్రపంచానికి  ఆహ్వానించింది. డైరక్టర్ వీర శంకర్ గారు నిర్మిస్తున్న ‘అలా నేను-ఇలా నువ్వు’ అనే  సినిమా కోసం రెండు పాటలు, కొన్ని మాటలు రాస్తున్నా.

-మీ నేపథ్యం.. ?

నేను విశాఖపట్నం వాసిని.ఆంధ్ర యూనివర్సిటీ లో M.A.Philosophy, M.Ed చేసా. పల్లెల మీద వున్న మక్కువతో మారుమూల గ్రామాల్లో పనిచేస్తుంటా.

కథలు చదవడం, రాయడం, గేయకవితలు రాయడం ఇష్టం. ఇప్పుడిప్పుడే సినిమా పాటలు రాస్తున్నా.

 

మిథున

12 comments

Leave a Reply to మిథున ప్రభ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిథున;
    ఒక కొత్త పదం, కఛ్హ తెలిసింది.
    చలనచిత్ర రంగంలోకి వెళ్లినా ఈ రచనా వ్యాసంగం మరిచిపోకుండా ఉంటే బాగుంటుంది.

    చందుః
    చిన్నమురిపెం కూడా తీర్చుకోలేని ఓ శ్రమజీవి కథ అని అన్నారు, కధని పరిచయం చేస్తూ.
    కధలో ఆఖరి వాక్యం; పట్టులంగా కచ్చని సర్దుకుంటూ మంగ!!
    లేక నేను పొరబడ్డానా!

    • థాంక్యూ సర్.. ఏ రంగంలోకి వెళ్ళినా రచిండమనేది నాకిష్టమైన వ్యాపకం కాబట్టి దాన్ని మర్చిపోయే ప్రసక్తి వుండదనే అనుకుంటున్నా. తప్పకుండా ఈ వ్యాసాంగాల రచనని కొనసాగిస్తా.. మీ అందరి మార్గదర్శకంలో..

  • మిథున గారు,
    ‘కచ్చ’ మీదైన శైలిలో చాలా చక్కగా రచించారు, బాగుందండి.

  • ‘కచ్చ’ …కొత్త పదాన్ని పరిచయం చేసారు. గొప్ప తత్వాన్ని చెప్పారు.ఎంతగా ఆరాట పడిందో పట్టులంగా కోసం. ఎంతో కష్టపడి సాధించుకున్నా…ఆ తర్వాతా తన కష్టపడే తత్వాన్ని వదల్లేదు. సాధించుకున్న తృప్తితో ‘కచ్చ’ కట్టి పనిచేయడం చివర్లో గొప్పగా అనిపించింది. మంగను కళ్ళ ముందు నిలిపింది.

  • అమ్మా , మిథున ప్రభ! ఈ కథ చాలా బాగుంది. నీ కథ చదువుతూ ఉంటే ఆ పాత్రలు కళ్ళముందు సజీవంగా వున్నట్టు ఉంటుంది. ఉదా: ‘పెడల్ మీద కాలేసి గాలిలోకిఎగురుతూ బలంగా తొక్కాడు’ ….ఈ చిత్రణ లో ఆ దృశ్యం నా కంటి ముందే ఉంది.
    రచయిత గా బాగా ఎదగాలని ఆశిస్తూ ఆశీర్వాదాలు!
    ——-మహేశ్ పాశల

  • మిథున….మెడo గారు మీరు పర్మిషన్ ఇస్తే…మా ప్రాంతం లొ ఆడపడులకు ఉన్న పెద్ద పoడుగ బతుకమ్మ , ఈ పoడుగ బేస్ చేసుకొని… మా ఊరి లొ నేను చుసిన పిచ్చిరాజి అనే అమ్మయి జీవితం చూపించాలి అని ఉoది…కథ కొన్ని మార్పులు చేస్తాను, రచయిత గా… మీ పేరే ఉoటుంది
    8333912312

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు