1
బాల్య స్నేహితులతో చాలా ఏళ్ల తరువాత గడిపిన ఆనందకరమైన దినాల గురించి రాద్దామనుకుని మొదలు పెట్టి 2 వారాలు అయింది. ఇంకా పూర్తి కాలేదు. త్వరగా రాయగలిగే వాళ్ళను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
15 ఏళ్ల క్రితం మా అమ్మ గారు ఎలక్షన్ ఆఫీసర్ గా దుర్గమమైన కొల్లాపుట్ కాలినడకన చేసుకొని విజయవంతంగా ఎలక్షన్ నిర్వహించడానికి చూపిన తెగువని ఒక సాహసంగా అభివర్ణిస్తూ ఉన్నత అధికారులు చెప్పుకోవడం గురించి నాకు తెలుసు. ఆ ప్రాంతానికి నేనూ ఏదో ఒక రోజున వెళతానని ఆ రోజుల్లో అనుకోలేదు.
High School Reunion ని ఆంధ్ర-ఒడిసా సరిహద్దులోని వివాదాస్పదమైన మారుమూల పర్వత ప్రాంతం కొల్లాపుట్ లో plan చేసుకున్నప్పుడు వేరు వేరు ప్రాంతాల నుండి ఎవరి కార్లలో వాళ్ళం కొల్లాపుట్ చేరుకోవాలని మొదట అనుకున్నాము. కాని అంతిమంగా అందరం ఒక బస్ బుక్ చేసుకొని కలిసి వెళితే మేలని భావించాము. అందరూ నర్సీపట్నం వచ్చేసారు. నర్శీపట్నం నుండి పాడేరు మీదుగా కొల్లాపుట్ వెళుతున్నప్పుడు తెలిసింది కలిసి ప్రయాణం చేయడంలోని ఆనందం. Connectedness లోని ఆనందం.
People think that they are individuals, in fact they are whole. అందుకే మనుషులు కలిసి ఉన్నప్పుడు అంత ఆనందం.
2
అరకు లోయ ఇంకా సుమారు 30 కి.మీ. ఉందనగా బస్ ఎడమ వైపు ఒడిసా దిశకు మళ్ళింది. గతుకుల రోడ్డు పై ప్రయాణం కష్టంగా సాగింది. గత ఏడాది ఇంకా కష్టంగా ఉండేదట ప్రయాణం. కొన్ని కిలో మీటర్లు మేం నడిచి వెళ్ళాల్సి ఉంటుందని మిత్రుడొకడు చెప్పగానే మాకు నిరాశ కలిగింది. కాని ఈమధ్యనే రోడ్డు బాగు చేసారట. ఆ ప్రమాదం తప్పింది.
3
ఆదివాసీలు నిర్వహిస్తున్న కొల్లాపుట్ రిసార్ట్ మొత్తం మేము ముందుగానే బుక్ చేసుకున్నాం. అందువల్ల వేరే టూరిస్టులు ఎవరూ లేరు మేం తప్ప. సొంత ఇంటిలోనే ఉన్నట్టు అనిపించింది. రిసార్ట్ ఆధునికంగా, అందంగా అన్ని సౌకర్యాలతో ఉంది. గార్డెన్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. నిర్వాహకులు ఆదరంగా స్వాగతం పలికారు. అక్కడ వారు భోజనం తయారు చేస్తారు, కాని సాదాసీదాగా ఉంటుంది. అందువల్ల మేము అరకులోయలోని ఒక ప్రముఖ హోటల్ నుండి భోజనాలు వచ్చేలా ముందుగా ఏర్పాట్లు చేసుకున్నాము. వారు మేం కొల్లాపుట్ వెళ్లేసరికి భోజనాలు తీసుకువచ్చారు.
సన్నని వర్షం. చలి గాలి ప్రారంభమయింది. వేడివేడి రుచికరమైన భోజనం. ఎదురుగా ఉన్న కొండ పై నుండి జాలువారే జలపాతాన్ని వర్షంలో చూస్తూ భోజనం చేయడం బాగుంది. అరకులో అంత మంచి ఆహారం దొరుకుతుందని ఊహించలేదు.
4
రాత్రి 9 గంటలకి వర్షం తగ్గింది. చలి బాగా పెరిగింది. నిర్వాహకులు campfire వేసారు. చుట్టూ స్వచ్ఛమైన చీకటి. దగ్గరలోని ఆదివాసీ గ్రామంలో ఎవరికీ కరెంట్ సౌకర్యం లేదు. ఆ గ్రామం అక్కడ లేనట్టే అనిపించింది. ఆ గ్రామం నుండి లీలగా డప్పుల శబ్దం వినిపించింది. ఆ చీకటిలో, ఎత్తైన మంట ముందు చలి కాచుకుంటూ ఆ డప్పుల శబ్దం వినడం ఒక వింత అనుభవాన్నిచ్చింది. ఇప్పుడు ఆ డప్పుల శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోంది. క్రమంగా దగ్గర అవుతోంది. చీకటిలోంచి వరుసగా 20 మంది ఆదివాసీలు; స్త్రీలు, పురుషులూ ఏదో లోకంలోంచి wormhole గుండా ప్రయాణించి ఈ లోకంలోకి ప్రవేశించినట్టుగా మా దగ్గరకు వచ్చారు. Campfire సెగలో వారు డప్పులు వేడి చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ ఆదివాసీల ముఖాలు మనం చూసే ఆదివాసీల కంటే ప్రాచీనంగా ఉన్నాయి. వారు నికార్సయిన ఆదివాసీలు.
ధింసా నాట్యం మొదలు పెడతామని వారు చెప్పారు. మేము ధింసా నాట్యం కావాలని కోరలేదని తెలుసుకొని వారు భావరహితంగా వెనుదిరిగి చీకటిలో అంతర్ధానం అయ్యారు. కొద్ది నిముషాలలోనే వారు ఆ నాట్యాన్ని వారి గ్రామంలో ప్రారంభించారు, వారి ఆనందం కోసం. చీకటిలోంచి వచ్చే వారి డప్పు దరువులు, ఈలలు, అరుపులు ఒక అధివాస్తవిక అనుభవాన్ని కలిగించాయి.
5
రాత్రి 10 గంటలకి నిర్వాహకులు సెలవు తీసుకుని వారి గ్రామానికి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి 2 గంటల తరువాత, సుమారు 4000 అడుగులఎత్తున, ఆ ఎత్తైన పర్వతాల నడుమ, సెలయేరు పక్కన, ప్రగాఢమైన నిశ్శబ్దం ఆవరించిన ప్రాచీనమైన లోయలో నేనున్నాననే స్పృహ నాకెంతో గొప్ప అనుభూతిని కలిగించింది. అలాంటి సునిశితమైన నిశ్శబ్దాన్ని అనుభవించి ఎన్నో ఏళ్ళు అయింది. నా బాల్యమంతా అటువంటి లోయల్లోనే గడిపాను. నా గుండె చప్పుడు, నా శ్వాస నాకు స్పష్టంగా వినిపించడం వింతగా తోచింది. ఆ నిశ్శబ్దాన్ని, శాంతిని అనుభూతి చెందుతూ తెల్లవారు జాము వరకూ నిద్రపోకుండా ఉండి పోయాను. గ్రామంలోంచి ఒక కోడి కూసిన శబ్దం మొట్టమొదటిసారి ఆ నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేసింది.
6
కింద విరగ కాసిన పైనాపిల్ తోట, పైన ఎత్తైన పైన్ చెట్లు.
సన్నని వర్షపు చినుకులు.
చెమ్మ నిండిన చలి గాలి.
Chinese Step Farming తరహాలో చెక్కబడిన కొండ పై నుండి ఒక జలపాతం కింద నున్న చిన్న Dam లోకి ప్రవహిస్తోంది. ఆ Dam ని దాటగానే, మేము trek చెయ్యాలనుకున్న పర్వత పాదంలోనే, ఎర్రని పైనాపిన్ పండ్లు గల తోట మాకు స్వాగతం పలికింది. I felt that the place was so sacred. ఇటువంటి చోట అడుగుపెట్టడానికి మన మనుషులకి ఏం అర్హత ఉంది అనిపించింది. ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించగానే మనసంతా నిశ్చలం అయిపోయింది. ఒక వివసత్వం ఆత్మలోకి ప్రవహించింది. స్వచ్ఛమైన ఉద్వేగం దేహాన్ని ఆక్రమించింది. నేను నేను కాకుండా పోయాను. దానికి లొంగిపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఆ ప్రబలమైన సౌందర్య శక్తికి వశం కాకుండా ఉండడం అసాధ్యం. శిరస్సులో thrills pass అయ్యాయి. మస్తిష్కం ఒక చల్లని, లోతైన, అగాధమైన నిశ్శబ్దంలోకి నెట్టివేయ బడింది.
మేమంతా పర్వత శిఖరం ఎక్కాం. అయితే అక్కడ మాకు కనిపించింది మరో మహా పర్వతం. మేము ఎక్కిన పర్వతం దాని పాదాల వద్ద ఆడుకుంటున్న చిన్న శిశువు మాదిరిగా తోచింది. చుట్టూ అవధి అనేదే లేకుండా పరివ్యాప్తం చెంది ఉన్న ఆ అపరిమితత్వాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించాము. అప్పటికే అలసిపోయి, ఆకలితో నా స్నేహితులంతా పర్వతం దిగి రిసార్ట్ కి వెళ్ళిపోయారు. నేను ఆ పర్వత శిఖరం మీద మైకంలో, ప్రకృతి సౌందర్య గాహంలో ఒక్కడినే ఉండి పోయాను. కొన్ని గంటలు గడిచాక వారు “మన బస్ బయలుదేరే వేళయింది” అని నాకు పర్వత పాదం నుండి అరచి చెప్పారు. వారి మాటలు గాలి శబ్దంతో కలిసి బలహీనంగా, లీలగా వినిపించాయి. వారి సైగలను బట్టి వారు చెప్పాలనుకున్నది నాకు అర్ధం అయింది.
7
Trekking ముగించుకొని అరకులోయ వెళ్లి గిరిజన మ్యూజియం చూసి, అక్కడి నుండి లంబసింగి బయలుదేరాము. ఆంధ్రా కాశ్మీర్ అని పిలవబడే లంబసింగి దక్షిణ భారత దేశంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రాంతం. అక్కడ -5C , -6C వంటి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయి. లంబసింగిలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో విడిదికి ముందుగా ఏర్పాట్లు చేసుకున్నాము. వంటవారు మేం రాత్రి 8 గంటలకి అక్కడికి చేరుకునే సరికే వేడి వేడి విందు భోజనం సిద్ధం చేసి ఉంచారు. మా విందు పూర్తయ్యే సరికి రాత్రి 12 అయింది.
రాత్రంతా స్నేహితుల కబుర్లు, చర్చలు అంతులేకుండా సాగాయి. అందరి హృదయాలలో ఆనందం వెల్లివిరిసింది.
8
ఉదయం ఘాట్ రోడ్డు ముగిసాక మైదాన ప్రాంతానికి రాగానే వాతావరణ పీడనం పెరగడం వల్ల చెవులు పట్టేసాయి. ధ్వనులు లీలగా వినిపించసాగాయి. 30 నిముషాల తరువాత సర్దుకున్నాయి.
9
నర్శీపట్నంలో స్నేహితులం వీడ్కోలు తీసుకుంటూ, త్వరలోనే మళ్ళీ కలుసుకుందామని నిర్ణయం తీసుకున్నాము.
*
అందమైన వచనం. చిన వీరభద్రుడు గారు వారి స్నేహితులతో చేసిన అరకు యాత్ర గురించి ఇండియా టుడే లో దశాబ్దాల క్రితం రాసిన వ్యాసం జ్ఞాపకం వచ్చింది.
శ్రీ రాం, ప్రకృతి రుద్ర రమణీయం! అది చూసి ఆస్వాదించె మనసూ, కళ్ళు ఉండాలి. అందులో మమేకమైపోవాలి. తప్పక చూడాలి శ్రీ రాం.