ఒక పసుపు పచ్చ సాయంకాలం 

“ఇదుగో కాఫీ!”

“ఇప్పుడొద్దు ”

“ఏం ?”

“తాగాలని లేదు”

“రోజూ ఈ టైం కి కాఫీ కాఫీ అని అంగలారుస్తావు కదా! అందుకని చేసుకొచ్చాను. ఇప్పుడు దీన్నేం చేయను ?”

“గోడవతల పారపొయ్యి ”

పెదవుల దాకా వచ్చిన మాట అప్రయత్నంగా లోపలకు వెళ్ళిపోయింది.  పెరిగిన గ్యాస్ ధరల నుండి మొదలయ్యే   పూర్ణ మాటల ప్రవాహం ఎంత దూరం ప్రయాణించి ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలుసు ?

“సరే! ఇవ్వు !”

కాఫీ చప్పగా పెదవులను తాకింది. కాఫీ తాగాలని మూడ్ లేనప్పుడు కాఫీ తాగడమే మానెయ్యలేని వాడిని జీవితం అనామకంగా, నిస్సారంగా మారినప్పుడు, ఆ జీవితాన్ని ఎడమ కాలితో తన్నేసి ఎలా వెళ్ళగలను?

పూర్ణ నన్ను కట్టుకుంది. ఈ వాక్యం బాగోదేమో కానీ ఇదే నిజం. చూడటానికి బావుంటాడు, బ్యాంకులో వుద్యోగం. నెలకు ముప్ఫైవేలకు పైగా వస్తుంది. బహుశా ఇవి అప్పుడు నా అర్హతలు అనుకుంటాను.” పూర్ణ నచ్చిందా ?” అని ఎవరూ అన్నడగలేదు. పూర్ణకు నేను నచ్చానా లేదా అని ఎవరైనా అడిగారో  లేదో తెలియదు. ఇద్దరం ఒక ఇంటిలోకి వచ్చాక కూడా నేనా ప్రశ్న ఆమెను కానీ,  ఆమె ఆ ప్రశ్న నన్ను కానీ అడగలేదు.  అలా అడగకపోవడం వెనుక ఏ అభిప్రాయాలూ బలంగా పనిచేసాయో కూడా తెలియదు

నాది టార్గెట్లు , ఎచీవ్మెంట్ల వుద్యోగం. కానీ నాకు శీతాకోక చిలుకలు, మంచు నీటి తుఫానులు , మందార మకరంద మాధుర్య గీతాలు అంటే పడి  చచ్చిపోయేంత  ప్రేమ.  పూర్ణ కాలేజీలో చెప్పాల్సింది కృష్ణ శాస్త్రి కవిత్వమూ,శ్రీశ్రీ విప్లవమూ  అయినా ఆమె దృష్టి ఎప్పుడూ టార్గెట్ల మీద ఉంటుంది. తనకు  తానే  టార్గెట్స్ నిర్ణయించుకుని పని చేస్తూ ఉంటుంది. ఆ టార్గెట్ ఆమె వృత్తికి సంబంధించినవి అయితే బావుండేదేమో కానీ అవి వృత్తేతర లక్ష్యాలు. మొత్తానికి మేమిద్దరమూ అనుభవిస్తున్న జీవితం వేరు. అనుభవించాలి అనుకున్న జీవితం వేరు. రెండింటి మధ్యా ఉన్న  ఆగాధాన్ని పూరించడం ఎలాగో తెలియదు. వారథి  వేయాలి అనుకుంటే వేయగలిగేవాళ్ళమేమో కానీ జీవితాన్ని నిరాసక్తంగా గడపడం లో మాధుర్యం ఏదో  మాకు దొరికినట్టు వుంది . ఇద్దరూ అంతర్ముఖులు అయితే ఆ ఇంట్లోనుండి మాట బయటకు రాదేమో  కానీ  ఏదో  ఒక క్షణం లో ” జీవితానికి అర్ధం ఏమిటి ?” అన్న ప్రశ్న ఎదురవుతుంది. జవాబు చెప్పడానికి వైకుంఠం మాస్టారు నా జీవితం లో లేరు.  వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమి మిగిలింది ?  ముప్పై ఏళ్ళు,  సుధీర్ఘమైన ముప్పయి ఏళ్ళు బ్యాంకు లో బండ  చాకిరి చేసి సగం జీతం ఆదాయపన్ను శాఖ కి సమర్పించుకుని పన్ను కట్టటమే గొప్ప దేశభక్తి అనుకుని లేని భుజ కీర్తులను తగిలించుకుని చివరకు చరమాంకానికి వచ్చాక తెలిసిందేమిటి?

కొన్ని మెరుపులు  మరి కొన్ని మరకలు. జీవితాన్ని యధాతధంగా తీసుకోవాలి అనుకునే ఫిలాసఫీ లో పడి పోయి, జీవితాన్ని గెలిచి తీరాలి అనే సంకల్పాన్ని నేను మరిచిపోయానేమో తెలియదు, కానీ జీవితాన్ని గెలిచి తీరాలి కంకణం కట్టుకున్నట్టు పోరాటం చేసిన పూర్ణ మాత్రం ఏం  సాధించింది?

తీరికగా లెక్కలు వేసుకుంటే మిగిలింది హళ్ళికి హళ్లి సున్నా కి సున్నా! ఇప్పుడు  పురుగు తలలో తెగ తిరుగుతోంది. నేతి  నేతి  అన్నట్టు ఇది కాదు, ఇదికాదు అని లోపలనుండి ఎవరో అరుస్తున్న ధ్వని.  ఎంత ప్రయత్నించినా కళ్ళ  మీద నిదుర శీతాకోక చిలుక వాలదు. గతించిన జీవితం లోని ఆశాభంగాలు అన్నీ కట్ట కట్టుకుని ఆలోచనల రూపం లో వచ్చి, శరీరాన్ని క్యాన్సర్  తిన్నట్టు మనసును తినేస్తాయి.

పూర్ణ ఒక చేత్తో పుస్తకం, మరొక చేత్తో కుర్చీ పట్టుకుని వచ్చి కొంచెం ఎడంగా కూర్చుంది. ఆమె చేతిలో ఏమిటా పుస్తకం? ఇదివరకు తాను అస్సలు పుస్తకాలు చదివేది కాదు. కాలేజీ లో చదువుకునేటప్పుడు చదివి వదిలేసిన సాహిత్యాన్ని మళ్ళీ అంది పుచ్చుకున్నట్టు వుంది. ఎప్పుడూ ఏదో  చదువుతూనే ఉంటుంది. ఇంతకూ ముందు మిస్ అయిన  సాహిత్యం అంతా ఔపోసన పట్టాలనా. పూర్ణ చేతిలో పుస్తకం ఏదో  తెలుసుకోవాలని ప్రయత్నం చేసాను. కానీ సాధ్యపడలేదు

మెల్లగా వీస్తున్న ఆశ్వయిజ మాసపు లేత చలిగాలి కి కళ్ళు మూటలు పడుతున్నట్టున్నాయి. లీలగా ఎవరిదో ఒక గొంతు

” అంకుల్ ఏంటిది? కుర్చీలో కూర్చునే కలలు  కంటున్నారు ?” పైన గదిలో వుండే శ్రీకర్ పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి మగత లోనుండి బయటపడ్డాను. శ్రీకర్ ఉరిమే ఉత్సాహం లాగా ఉంటాడు. పట్టుమని పాతికేళ్ళు కూడా వుంటాయో ఉండవో  కానీ జీవితం పట్ల ఏ భయమూ, బాధ్యతా లేనట్టు  లేదా జీవితాన్ని అనుక్షణమూ అనుభవిస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ పిల్లాడికి ఎందుకంత ధైర్యం?

శ్రీకర్ ను చూసినప్పుడల్లా నా ఇరవై ఐదేళ్ల వయసు గుర్తుకొస్తుంది. నేను ఇరవై నాలుగేళ్లకే  వుద్యోగం లో చేరాను. నిజానికి నా లక్ష్యం ఈ బ్యాంకు వుద్యోగం కాదు. కానీ బ్యాంక్ వుద్యోగం లోనే కూరుకుని పోయాను. నా లక్ష్యం బ్యాంకు వుద్యోగం కాదు అన్నాను కానీ నిజానికి నా కంటూ ఒకలక్ష్యం ఉందా? ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే లక్ష్యమే లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ లక్ష్యమంటూ ఉంటే ఉద్యోగాన్ని వదిలివేసేవాడినేమో?

” అంకుల్ ! మిమ్మల్నే ! ఏంటి ఆలోచిస్తున్నారు?”

“ఏమీ లేదు శ్రీకర్ ! రా కూర్చో !” పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాను

పూర్ణ పుస్తకం లోనుండి తల  పైకి ఎత్తి  ఒక సారి చూసి మళ్ళీ పుస్తకం లోకి తల  దూర్చేసుకుంది. అచ్చు ఉష్ట్ర పక్షిలా. ఉష్ట్ర పక్షిలా అన్న ఉపమానం తోచగానే నాకు నవ్వొచ్చింది. కానీ ఆ నవ్వు రేఖలు ఏవీ బయటపడ నివ్వలేదు

“అంకుల్ మళ్ళీ అడుగుతున్నా! చెప్పండి. ఏం  ఆలోచిస్తున్నారు?”

” లేదు ! ఏమీ ఆలోచించడం లేదు?”

“మనసులో ఏ ఆలోచనా లేకుండా శూన్యం చేసి ధ్యానం చేస్తున్నారా?”

నా మనసు ఏ ఒక్క లిప్త కాలమైనా శూన్యంగా ఉందా? అలా వుంచగలనా ? తుఫాను వేగం తో ఏదో  ఒక ఆలోచన చుట్టుముడుతూనే ఉంటుంది కదా! ఎన్నెన్ని ఆలోచనలు. కొన్ని ఎరుపు రంగు ఆలోచనలు. కొన్ని నీలం రంగు ఆలోచనలు . కొన్ని బూడిద రంగు ఆలోచనలు. మరికొన్ని పసుపుపచ్చ ఆలోచనలు. ఏ ఆలోచన ప్రత్యేకత దానిదే

“పసుపు పచ్చ ఆలోచనలు” అప్రయత్నంగా బయటికి అనేశాను

పసుపు పచ్చ  ఆలోచనలు అనగానే పూర్ణ పుస్తకం లో నుండి తల  పైకెత్తి చదువుతున్న పుస్తకం ముఖ చిత్రం వైపు తేరిపార  చూసింది. ఆ పుస్తకం పేరు “The Yellow Shades of Human Experience”

” ఆలోచనలకి రంగేమిటి అంకుల్ ? మరీ విచిత్రం కాకపోతేనూ?” శ్రీకర్ నవ్వు మొహం తో అన్నాడు

నేను ఏదో చెప్ప బోయేలోగానే పూర్ణ పుస్తకం మూసి మా దగ్గరకు వచ్చింది.

“లేదు శ్రీకర్! అంకుల్ చెప్తున్నది నిజమే . ఆలోచనలకి రంగులుంటాయి. శీతాకోక చిలుకకి రంగులున్నట్టే మన ఆలోచనలకీ రంగులు ఉంటాయి. మీ అంకుల్ చెప్తున్న పసుపుపచ్చ ఆలోచనలు  In chemotherapy, the yellow color is used for soothing, purifying the body, and stimulating the nerves.  నిస్సారంగా , నిస్త్రాణంగా  పడి వున్న భావోద్వేగాలను స్టిమ్యులేట్ చెయ్యడంలో పసుపు పచ్చ రంగు చాలా ప్రాధాన్యత వహిస్తుంది”

“అంటే ఇప్పుడు అంకుల్  తన నిస్సారమైన రిటైర్మెంట్ జీవితాన్ని ఉత్సాహ భరితం చేయడానికి పసుపు పచ్చ ఆలోచనలు చేస్తున్నారన్నమాట” అన్నాడు శ్రీకర్ నవ్వుతూ

పూర్ణ ఇంకా కొనసాగిస్తూ “లేయాట్రిస్ ఐసీమాన్  తన పుస్తకం కలర్ :మెసేజెస్  అండ్ మీనింగ్స్ లో ఒక మంచిమాట చెప్పాడు. The yellow color is associated with being friendly, open, outgoing, and joyful. Yellow color is found to induce a playful, happy, comedic mood” అన్నది

నేను కలగచేసుకుని ” మీ ఆంటీ చెప్పింది ఏదీ నాకు తెలియదు శ్రీకర్. పసుపచ్చ శుభకరం అంటారు కదా! అందుకేనేమో నా నోటి నుండి పసుపుపచ్చ ఆలోచనలు అన్న మాట వచ్చింది” అన్నాను

“ఇంతకూ మీ పసుపుపచ్చ ఆలోచన ఏమిటి అంకుల్?” అన్నాడు శ్రీకర్

“నా పసుపు పచ్చ ఆలోచన నీ పెళ్లే కదా !” అన్నాను

“వద్దు అంకుల్. పసుపు బట్టలు, పసుపు కుంకుమ, పసుపుతాడు ఇలా పెళ్లంతా పసుపు ఉంటుంది కానీ పెళ్లి తరువాత జీవితంలో పసుపు రంగు ఉండదు  అంకుల్! ఉండేది ఒకే ఒక డార్క్ కలర్. అదీ బ్లాక్ కలర్” అన్నాడు శ్రీకర్

శ్రీకర్ మాటలకి నేను మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయాను. నిజమేనా ? పెళ్లి తరువాత జీవితం అంతా డార్క్ బ్లాక్ కలరేనా? వైయక్తిక  స్వేచ్ఛ కుటుంబం లో కూరుకునిపోయి మనిషిని బలహీనుడుని చేస్తుందా? ఒకవేళ అది అలా చేస్తే  స్త్రీ పురుషులు ఇద్దరూ బలహీనపడి, కుటుంబం అనే వ్యవస్థ కి బానిసలు కావాలి  కదా? అవునూ  పూర్ణ కూడా బాధితురాలేనా? బానిసేనా

“అంకుల్ మీరు మళ్ళీ ఆలోచనలో పడిపోయారు” శ్రీకర్ మాటలు  పూర్తి కాకముందే పూర్ణ అందుకుని

” శ్రీకర్ నీకు చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్టు ఉన్నాయే! ఏదైనా స్పష్టమైన అభిప్రాయం ఉండటం మంచిదే. కానీ ఆ అభిప్రాయాలలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. జీవితం లో అనుభవాలు ఎదురవుతూన్న కొద్దీ అభిప్రాయాల్లో పరిణితి కూడా రావాలి. నిలువ నీరు లాగా ఎప్పుడూ ఒకటే అభిప్రాయం మీద నిలబడి ఉంటే జీవితం నిన్ను దాటుకుని వెళ్ళిపోతుంది. చదివే సాహిత్యమూ, జీవన గమనము లో ఎదురయ్యే అనుభవాలూ, అన్నీ జీవితాన్ని ముందుకు నడపడానికి దారి దీపాలు లేదా వే బోర్డు లు గా భావించాలి  తప్పిస్తే వాటికవే జీవితం  అనుకోకూడదు. ఇప్పుడు చెప్పిన పసుపు పచ్చ ఆలోచన గాయాన్ని మాన్పుతుంది. నిజమే మనిషి జీవితం మీద పసుపు పచ్చకి వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయి. పసుపు అలసటనీ, ఆగ్రహాన్ని , ఆందోళనని కూడా కలిగిస్తుంది”  అన్నది

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎక్కడెక్కడి మేఘాలో  ఒక్కఉదుటున మమల్ని కప్పేసిన ఆకాశం లోకి వచ్చి చేరాయి. కాసేపటి క్రితం వరకూ లేత లేత చలి పువ్వులను పూయించిన గాలి ఒక్క క్షణం లో భీకరంగా మారింది. మొదటి చినుకు టప్  మంటూ నా తల  మీద పడింది. బ్యాంకు వుద్యోగం లో సతత హరితారణ్యం లా ఉన్న తల ఎప్పుడో సహారా ఎడారిలా మారిపోవడం తో టప్  మంటూ పడిన చినుకు శబ్దమూ,  స్పర్శా  రెండూ ఒకేసారి నాకు స్పృహ లోకి వచ్చాయి.

”  అంకుల్ మళ్ళీ కలుద్దాం! ఈ సారి ఆకుపచ్చటి ఊహల గురించి మాట్లాడుకుందాం ఏం ?” అల్లరిగా నవ్వుతూ శ్రీకర్ వెళ్ళిపోయాడు మేడ  మీదకు

“లోపలకు వెళదాం!” అన్నది పూర్ణ. కుర్చీలు తీసుకుని నేనూ, పూర్ణా వరండా లోకి నడిచాము. వాన అంతకంతకూ పెద్దది కాసాగింది. ఒకటే ధారగా వాన కురుస్తోంది. మధ్యలో పెద్ద పెద్ద ఉరుములు, వాటిని వెన్నంటి వచ్చే మెరుపులు. ఒక్క సారిగా మనసంతా దిగులు పొగలు సెగలై  జ్వలించసాగింది. వొళ్ళంతా ఒక మంట. “ఏం  చేస్తే ఈ మంట  తగ్గుతుంది?”  నా శరీరం లో మంట  కూడా పసుపు పచ్చటి రంగులోనే ఉన్నదా ? ఏమో

మెరుపులంటే  నాకు చాలా భయం. కానీ పూర్ణ వాటిని కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది. ఆకాశం మెరుపు కళ్ళతో భూదేవికి  మెల్ల మెల్లగా ఎవరికీ వినపడకుండా చెప్పిన రహస్యాన్ని ఉరుము పెద్ద శబ్దం తో అందరికీ బట్ట బయలు చేస్తుందట. వీరన్  కుట్టి అనే మలయాళ కవి చెప్పిన మాటలని పూర్ణ ఎన్నిసార్లు వర్షా సందర్భాలలో మననం చేసుకుందో చెప్పలేను. ఒక్కసారి పూర్ణ వంక చూసాను. పసుపు పచ్చటి ఆ మొహం నా జీవితం లోకి వచ్చినప్పుడు ఎలా వున్నదో , ఇప్పుడు కూడా అలాగే ఉన్నదా?

మెరుపు వెలుగు లో పూర్ణ మొహం కాంతులీనుతూ వుంది. ఆ కళ్ళ  వెనుక ఏదైనా అసంతృప్తి ఉందా? ముప్పై ఏళ్ళ జీవితం, గమనం, గమ్యం పూర్ణకి  సంతృప్తిని ఇచ్చిందా ? పూర్ణ మొహం లో అప్పుడప్పుడూ అలసట కనిపించింది తప్పిస్తే ఎప్పుడైనా అసంతృప్తి కనిపించిందా ? మనసు పాతికేళ్ల క్రితానికి  వెళ్ళిపోయింది. పూర్ణ మొహం అస్సలు గుర్తుకు రావడం లేదు. మళ్ళీ పూర్ణ వంక చూసాను. బాగా లేతగా ఉండి  ఉంటుందా పూర్ణ. నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. తేరుకుని పూర్ణ వంక చూసాను. తాను ఎంత సేపటినుండి నా వంక చూస్తున్న దో

“పూర్ణా ! ఆర్యూ హ్యాపీ ?”  అసంకల్పితంగా నా నోటి నుండి వెలువడిందా ప్రశ్న

“హ్యాపీ  అంటే ఏమిటి?” నా ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నదా  అన్నట్టు పూర్ణ తిరిగి ప్రశ్నించింది . బహుశా ఈ ప్రశ్నను నేను పాతికేళ్ల క్రితం అడిగి ఉండాల్సింది అనుకుంటాను. కానీ పూర్ణ అప్పుడు కూడా ఇలాగే ప్రశ్నించేదా?

“హ్యాపీ అంటే, నడిచి వచ్చిన దారి సంతృప్తికరంగా ఉందా? బాలన్స్ షీట్ లో సుఖం ఎక్కువ ఉందా? దుఃఖం ఎక్కువ ఉందా?” ఇలా అంటానని  నేను కలలో కూడా ఊహించి ఉండను. కానీ ఈ దైవిక శక్తో, రాక్షస కాంక్షో నాతో  అలా అనిపించి ఉంటుంది. ఆ ప్రశ్న అడిగాక  పూర్ణ కళ్ళలోకి చూడకుండా తల  వంచేసుకున్నాను

పూర్ణ మెల్లగా నా దగ్గరకు వచ్చింది. నా చేతిని ఆమె చేతిలోకి తీసుకుంది. చల్లటి స్పర్శ, పాతికేళ్ళక్రితం లా వెచ్చగా లేదు. ఇసుకలోకి నీళ్లు మెల్లగా ఇంకిపోయినట్టు స్పర్శ నాలోపలకు ఇంకిపోయింది. వాన తగ్గాక  వచ్చే మట్టిపరిమళం పూర్ణను తాకి, ఒక పరమహంసనో , అవధూతనో తాకి పునీతమయినట్టుగా పునీతమయి నా లోపలకు చేరుకుంది. ఆకాశం లో విరిసిన ఇంద్ర ధనువులోని సప్త వర్ణాలు ఒకే ఒక శ్వేత వర్ణం లో లయించినట్టు పూర్ణ శ్వాస  నా దేహం లోని అనువణువులోనూ  నిండిపోయింది

నేను పూర్ణ లో కలిసిపోయాను . “The Yellow Shades of Human Experience”  పుస్తకం పూర్ణ ఒళ్ళోంచి జారి  నన్ను కప్పుకుంది

*

చిత్రం: బీబీజీ తిలక్ 

వంశీ కృష్ణ

6 comments

Leave a Reply to శీలా సుభద్రాదేవి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎందరో జీవిత కథనాలకు అద్దంపట్టే రచన.

  • ఒక పరమహంసనో , అవధూతనో తాకి పునీతమయినట్టుగా పునీతమయి నా లోపలకు చేరుకుంది ఈ కథ.

    నిలువ నీరు లాగా ఎప్పుడూ ఒకటే అభిప్రాయం మీద నిలబడి ఉంటే జీవితం నిన్ను దాటుకుని వెళ్ళిపోతుంది

  • వంశీకృష్ణ గారూ మీ కవిత్వం లాగే మీకథ కూడా భావుకత్వం తోనూ, ప్రేమభావంతోనూ నిండి పాఠకులకు ఒక కొత్త అనుభవంలోకి ప్రయాణింప జేసే కవితాత్మకత ఉంది.మీ కవిత్వమే తప్ప మీ కథలు చదవలేదు..

  • ఇద్దరు అంతర్ముఖులు.. అంతర్మధనాలు…ఆవిష్కరించిన తీరు బాగుంది సర్👌ఉద్యోగ విరమణ కు ముందే సప్తవర్ణాలూ ఆ ఒకే ఒక శ్వేత వర్ణం లో లయించి ఉంటే ఎంత బాగుండేది….

  • చాలా బావుందండీ కథ.

    జీవితం లో అనుభవాలు ఎదురవుతూన్న కొద్దీ అభిప్రాయాల్లో పరిణితి కూడా రావాలి. నిలువ నీరు లాగా ఎప్పుడూ ఒకటే అభిప్రాయం మీద నిలబడి ఉంటే జీవితం నిన్ను దాటుకుని వెళ్ళిపోతుంది.
    ఈ వాక్యాలు చాలా అనుభవంతో కానీ రావు.మృదుత్వం ప్రేమ ఉన్న కథ, అప్పుడే అయిపోయిందా.. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా చేసింది!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు