దిగులుగా ముసుగు తన్నిన
సూరీడు సాయంకాలాన్ని
ప్రకటించాడు.
సూరీడ్ని చలిమంటలో వేసి
రాత్రిని వెచ్చబెడుతున్న వృద్ధాప్యం.
వణుకుతున్న చలి
ఈ రాత్రినీ,నన్నూ
ఈ లోకాన్ని చుట్టుకుని
మూడంకె వేయిస్తుంటుంది.
ఎప్పటిలానే
నిద్రని కౌగలించిన కలలు
నిధ్రపట్టనితనాన్ని
మత్తుగా నిధ్రబుచ్చుతుంది.
చలిగాలానికి చిక్కిన
నిద్రనది లో చేపల్లా
ఈదులాడాల్సిందే కదా మనమంతా.
పేవ్ మెంట్ మీది అనాథలకు
వెన్నెలే స్వెట్టర్.
రాత్రి చీకటి నల్లపిల్లి కళ్ళతో
ఎంత తీక్షణంగా చూస్తూ
భయపెడుతుంది!
కీచురాళ్లు కూడా మౌనం
పాటించాయి.
అక్కడో మైలారాళ్ళల్లే
గాలికి మల్లెల సుగంధాన్ని
పరిచయం చేస్తూ
వెచ్చని ఆకలి సైగ చేస్తూ..
శాప శిల గా.
చీకటి నల్లత్రాచు కాటేసే సమయం.
వొక ఆకలి మరో ఆకలి పులికి
బలయ్యే మృతక్షణాలు
ఆ తెళ్లనిప్పుల సెగలో
వొడలిన పువ్వైన రాత్రి శిల
ఆమెను బతికిన శిల అనవచ్చునా?
మరణించిన అల అనావచ్చునా?
కాలం నిర్దయగా
మద మోహ మృగమై
ఈ రాత్రి ఓ ప్రపంచాన్ని
హత్య చేసిందా?
మృతక్షణాలకు
ఊపిరులూదిందా?!
ఈ రాత్రికెన్ని రహస్యాలు తెలుసో!
ఎవరో దీని నోరు కుట్టేశారు.
భయం మూగదేనా?!
అభయమివ్వని
లోకమే ఈ రంగుల చీకటి ద్రోహి.
ఆమె ఎన్ని రాత్రుల్లో
ఎందరికొసమో
కాలిపోయిందో?
ఆమె రాత్రిని వెలిగించిన
మంచు దీపమా?
*
పేవ్ మెంట్ మీద అనాధలకు వెన్నెలే స్వెటర్
వావ్