ఒంటరి రాత్రుల వెనుక కథలు ఇవన్నీ!

చదివాక ఆలోచనల అలలు ఎగసేలా– ఓ మెలకువ తీరం వైపు మరలించే కవి వంశీకృష్ణ

వొకేసారి రెండు అవార్డులు వరసగా గెల్చుకుంది వంశీ కృష్ణ కవిత్వ సంపుటి : రెప్ప వాలని రాత్రి. అదే మంచి సందర్భమైతే ఇవాళ ఇంకో మంచి సందర్భం వంశీ పుట్టిన రోజు. ఈ రెండు సందర్భాలను కలుపుకొని ఇది ఫణి మాధవి ద్వారా సారంగ అందిస్తున్న కానుక. 

*

ఫణి మాధవి: నమస్తే! మీ “రెప్ప వాలని రాత్రి” కవిత్వ సంపుటి, తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారం పొందినందుకు సారంగ తరఫున అభినందనలు.

ప్రశ్న :  ఒక క్షణం మోహ పరవశ  గా మరు క్షణం మోహాతీత తాత్విక గా దర్శనమిస్తుంది మీ రెప్పవాలని రాత్రి. ఈ వైరుధ్యం ఎలా సాధ్యమయింది?

జవాబు :  ఇందులో వైరుధ్యం ఉన్నదా? నేనైతే లేదనే అనుకుంటున్నాను. ఎవరినైనా  పరవశానికి గురిచేసేది కేవలం మోహాతీత తాత్వికతే అని నేను అనుకుంటాను. ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసినప్పుడో, ఒక గొప్ప కవిత చదివినప్పుడో, మనోధర్మాన్ని వెలిగించే ఒకానొక సంగీత ఝరి లో తల  మునకలయినప్పుడో, ఆ క్షణం మనలని మనం మరచి, మన భౌతిక, ఆంతరంగిక ప్రపంచాలను విడిచి  కేవలం నిమిత్త మాత్రులుగా నిలచిపోవడమే పరవశం అనుకుంటే దానిని మించిన తాత్వికత కూడా మరొకటి లేదు. దాన్ని మించిన నిర్వాణం కూడా మరొకటి లేదు. అందుకే నేను వైరుధ్యం లేదు అంటున్నాను. ప్రతి మనిషిలోనూ అతడికే లేదా ఆమెకే పరిమితమయ్యే ఒక తాత్వికత ఒకటి ఉంటుంది. అది దానికదే యూనిక్. ప్రతి మనిషీ ఆ తాత్వికత లో తనకు   తెలియకుండానే పరవశం చెందుతాడు. ఆ రెండింటికీ తేడా లేదు. రెండూ ఒకటే. పరవశం అంటేనే పరుల వశం కావడం. ఇక్కడ ఆ పరులు మనలో దాగి ఉండి  మనకే తెలియని ఒకానొక  జీవన తాత్వికత.

ప్రశ్న : రెప్పవాలని రాత్రుల నేపథ్యం  అంటే నిదుర పట్టని ఒంటరి రాత్రుల  వెనుక కథ మాతో పంచుకుంటారా ?

జవాబు :  నేపథ్యం.. కరోనా !  ఒంటరి రాత్రుల వెనుక కథలు అన్నీ కరోనా వ్యథార్థ జీవన దృశ్యాలే. లాక్ డవున్  రోజులన్నీ నిజంగా నిద్ర పట్టని రాత్రులు. మన లోపలి మనుషులను స్కానింగ్ చేసి మనకే చూపిన రోజులు మూసిన కనురెప్పల మీద మోయలేని రాజ్య భారం. కలలు వాలని కళ్ళ నిండా కరగని తరగని మంచు శిలలు, కూడూ గూడూ ఇవ్వక పోతే పోనీ కంటి నిండా నిద్రయినా ఇవ్వరాదా ! నా ప్రియమైన రాజ్యమా !  రెప్ప వాలితే చాలు దుఃఖం తో ఆనవాళ్లు కోల్పోయిన మొహమొకటి గుర్తుకు వస్తుంది అని అనడం వెనుక మనం లెక్కలు వేసుకున్న  చేసుకున్న మృత్యు  శీతల కౌగిళ్లే వున్నాయి. లతా ఒక్కసారంటే ఒక్కసారి ఒకటి, నాలుగు, ఐదు కాక ఆ మూడో నోట్ లో స్వరం పలికించవూ అని అనడం వెనుక స్టేట్ ఇంకొంత మానవీయంగా ఉంటే బావుండును అన్న ఆకాంక్ష వుంది. లాక్ డవున్  మొదలయి వారమేగా అయింది అని వలసకూలీల చర్చ వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్  అన్న మాట ఉన్నది. నేనంటే ఒక గాలి బుడగ. నీటి తరగ అనడం వెనుక కరోనా అనుభవం లోకి తీసుకుని వచ్చిన అశాశ్వత శాశ్వత సత్యం కదా వున్నది.

ప్రశ్న :  కవిత్వం లో పదాడంబరం వంటి భాష గురించిన విమర్శల నేపథ్యంలో భాష గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలని వున్నది.

జవాబు: “అన్నమయ్య భాషా శరీరం పెద్దది” అని పుట్టపర్తి  నారాయణాచార్యులు గారు ఒక చోట అన్నారు. అంత పెద్ద భాషా శరీరాలు ఏవీ నాతో సహా ఇప్పటి కవులకు ఎవరికీ లేవు. భాషా శరీరం అంటే  కొత్త తరానికి అర్ధం అయ్యే భాషలో చెప్పాలి అంటే వొకాబ్యులరీ అనే కదా అర్ధం. నాకంటే ముందు కవుల కవిత్వం చదువుతున్నప్పుడు, ఇతర భాషల సాహిత్యం చదువుతున్నప్పుడు మన భాషలోని సౌందర్యం, మన భాషలోని వైవిధ్యం అర్ధం అవుతూ వచ్చింది. అందుకని కవిత్వం రాసేటప్పుడు, తిరిగి చదువుకునేటప్పుడు భాష గురించి కొంత మెలకువ తోనే నేను వుంటాను. పదాడంబరం వేరు. భాషా వైవిధ్యం వేరు. రెండూ వేరు వేరు అంశాలు. పదాడంబరం కవిత్వానికి మేలు చేయదు. నా కవిత్వ భాషలో సంస్కృత పద గుంఫనం ఎక్కువ అని చాలా మంది అంటారు. కానీ అవసరానికి మించి సంస్కృత పదాలు నేను వాడను. నా ఇతర కవిత్వ పుస్తకాలు చదివితే నా మాట నిజమని మీరూ ఒప్పుకుంటారు. రెప్పవాలని రాత్రి లోని వస్తువుకు ఈ భాష అవసరం కనుక ఈ భాష ఎక్కువగా ఉపయోగించాను. నా కొన్ని నేనులు, ఒక దేశం రెండు పదప్రయోగాలు లేదా డబ్బుపిట్ట చూడండి వాటిలో మీకు ఈ భాష కనిపించదు. కవిత తన భాషను తానే  వెతుక్కుంటుంది.

ప్రశ్న :  క్రియాంత వాక్యాలు  ముఖ్యంగా సమాపక క్రియలతో అంతమయ్యే వాక్యాలు నిండిన కవిత్వం వచనము అవుతుంది  కానీ కవిత్వం కాదనే విమర్శకుల వ్యాసాలూ చదివాను. (కవిత్వ స్పర్శ ఉన్నప్పటికీ). ఈ విషయంగా వర్ధమాన కవులలో ఓ గందరగోళం. చదువరి మనసును తాకే కవిత్వమయిన మీ రెప్పవాలని రాత్రిలోనూ సమాపక క్రియలు బాగానే కనిపిస్తాయి. పై గందరగోళం పై మీరేమంటారు ?

జవాబు :  కవిత్వ స్పర్శ ఉన్నప్పటికీ కవిత్వం కాదు అంటే  నేనేమీ చెప్పలేను. అసలు కవిత్వానికే  అందరూ ఆమోదించే నిర్వచనం లేదు. ఎంతమంది కవులు వున్నారో అన్ని కవిత్వ నిర్వచనాలు వున్నాయి. అంతేకాదు. ఎవరి అనుభూతి వారిదే. నాదైన అనుభూతి నాది కాదే  అని విశ్వనాథ అన్నాడు కదా. పాఠకుడు ఒక కవిత చదివినప్పుడు ఆ కవిత పాఠకుడిలో ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది అన్నదే ప్రాధాన్యమున్న  అంశం. మీ రసాస్వాదనకు  ఆటంకం కలగనంతవరకు  వాక్యం క్రియంతమా ? కాదా అన్న విషయం  పట్టించుకోవలసిన అవసరం లేదనే అనుకుంటాను. ఆంగ్లం లో కర్త క్రియ కర్మ  అనే ఆర్డర్ ఉంటే తెలుగు లో కర్త కర్మ క్రియ ఉంటుంది. అంటే తెలుగులో వాక్య నిర్మాణం Basic Structure  క్రియాంతమే. కవిత్వం రాసేటప్పుడు సమాపక క్రియలు ఉంటే అవి రసాస్వాదనకు  అడ్డం పడతాయనో , శుద్ధ వచనము లాగా తేలిపోతుందనో వాటిని పరిహరించాలి లేదా అతి తక్కువ స్థాయిలో ఉపయోగించాలి అనటం ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. శుద్ధ వచనము  రాస్తే కవిని  పాఠకుడు ఎలాగూ క్షమించడు. అది కవిత్వం కాదని పుస్తకాన్ని పాఠకుడు విసిరి కొడతాడు. క్రియాంతం కానీ వాక్యాలతో  కవిత్వం రాసినా అందులో కవిత్వం లేక పోతే పాఠకుడు ఆ కవిని కూడా విసిరి కొడతాడు. కాకపోతే క్రియాంత  వాక్యాలు మరీ ఎక్కువ అయి, పదే  పదే  రిపీట్ అవుతుంటే పాఠకుడికి విసుగు కలుగుతుంది. మీ అభిప్రాయాలకు దగ్గరగా వుండే తెలుగు వెంకటేష్ కవిత్వం చదవండి. ఆ కవిత్వం కూడా ఏకబిగిన చదవలేము. ఆగి, ఆగి మామిడి పండ్లను మాగబెట్టినట్టు మాగబెట్టుకొని చదవాలి. కొంచెం ఎక్కువ చెప్పానేమో కదా?!

ప్రశ్న : సామాజిక సంచలనాలకు చలించి పోయి ప్రకటిత మవడం మీ కవిత్వ ప్రయాణం అంతా కనిపిస్తుంది. ధిక్కార స్వరం కూడా వినిపిస్తుంది. ఈ సంపుటి లో తాత్విక పదును అదనంగా కలిసింది. ఈ తాత్విక ధోరణికి కారణం తెలుసుకోవచ్చా ?

జవాబు :  ధిక్కారం లేని వాడు కవి ఎలా అవుతాడు? కాడు కదా! వంశీకృష్ణ కవిత్వం లో సున్నితత్వమే కాదు ధిక్కారం కూడా వుంది అని గుర్తించినందుకు మీకు కృతజ్ఞతలు. ధిక్కారం ఎలా అయినా ఉండవచ్చు. గాంధీ ధిక్కారం లో మౌనం వుంది. సత్యాగ్రహం వుంది. నేతాజీ ధిక్కారం లో ఆగ్రహం వుంది. అల్లూరి ధిక్కారం లో నెత్తుటి సెలయేళ్ళు వున్నాయి. అలాగే కవిగా నా ధిక్కారం లో తాత్విక పదును ( ఇది మీ మాటే ) ఉన్నదేమో. ధిక్కారం ఎలాగయినా ఉండవచ్చు కదా!

చదివాక ఆలోచనల అలలు ఎగసేలా ఓ మెలకువ తీరం వైపు మరలేలాంటి కవిత్వం అందించారు. మరోమారు అభినందనలతో ధన్యవాదాలు మీకు.

*

ఫణిమాధవి కన్నోజు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్సలెంట్ ,రచయితకు అభినందనలు

  • వంశీకృష్ణ గారి సమాధానాలు అద్భుతం
    పాఠాలుగా నేర్పే విషయాలుంటాయి
    ఫణిమాధవి అక్కా
    విలువైన ప్రశ్నలడిగారు

    ఇద్దరికీ అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు