ఒంటరి ప్రయాణమే దిద్దు ‘బాట’

నా చిన్నప్పుడు మా అమ్మ పెద్దమ్మ  పిన్ని అక్కలు అందరూ వారపత్రికలు మాస పత్రికలు తెప్పించుకుని వంతుల వారిగా చదివేవారు.  నవలలు చదివేవారు.  నేను ఆరు ఏడు తరగతులు చదువుతున్నప్పుడు   మా అమ్మకు  లైబ్రరీ నుండి ఆమెకు కావాల్సినవి రాసి ఇచ్చిన లిస్ట్ లో వున్నవి   వారానికి మూడు పుస్తకాలు చొప్పున   తెచ్చి ఇచ్చేదాన్ని. యద్దనపూడి పూడి సులోచనా రాణి  వాసిరెడ్డి సీతాదేవి పోల్కంపల్లి శాంతాదేవి కోడూరి కౌసల్యాదేవి నవలలు ఎక్కువ వుండేవి.

నాకు పదకొండేళ్ళ నుంచి పరిచయం అయినవి నేను చదివినవి రాధాకృష్ణ సీరియల్  యండమూరి వీరేంద్రనాథ్ గారి  రచనలు. అమ్మ పుస్తకాలు  చదువుతున్నప్పుడు నేను కూడా అవి చదువుతూ వుండేదాన్ని.  చందమామ బాలమిత్ర చదివిన అనుభవం నుండి  నా ఊహాశక్తి  విస్తరించి క్లాస్ లో బ్యాక్ బెంచిలో కూర్చొని   లాంగ్ నోట్ బుక్ లో చిన్నచిన్న కథలు రాసేదాన్ని. . నా బాల్య స్నేహితురాలు ప్రశాంతి. నేను రాసినవి తనే మొదట చదివేది. బాగున్నాయి అని కూడా చెప్పేది. ఆ అనుభవం తోనే  కాలేజ్ డేస్ లో కాలేజ్ మ్యాగజైన్ లో కథలు వ్యాసాలు  రాశాను. అవి ప్రచురితం అయినప్పుడు నాకు గర్వంగా వుండేది. చదువులో అత్యధిక మార్కులు తెచ్చుకుని గర్వంగా ఫీల్ అయ్యే వారిని నేను అధిగమించి కథలు వ్యాసాలు నేను బాగా రాస్తున్నాను అన్న ఫీలింగ్ తో కల్గిన గర్వం అది.

అలాంటి గర్వం నాకిప్పుడు వుండదు అంటే మీరు ఆశ్చర్యపోవద్దు. నా బాల్య స్నేహితురాలిని 35 ఏళ్ళ దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు “ఏం చేస్తున్నావ్” అని అడిగింది.   ‘నేను రచయితగా స్థిరపడ్డాను   కథలు రాస్తున్నానుగా’  అని నవ్వుతూ  చెబుతుంటే ‘నువ్వు  ఇప్పుడు  కథలు రాయడం ఏమిటీ?  హైస్కూల్ చదువులో వున్నప్పుడే రాసేదానివిగా నీ ప్రథమ పాఠకురాలిని నేనే అని చెప్పింది. నా లోని రచయితను ఇంతకాలం గుర్తుంచుకున్న  నా స్నేహితురాలికి కృతజ్ఞతలు చెప్పడం మినహా నేనేం చేయగలను?.  అప్పటి నాలోని రచయితను ఎలా కాపాడుకుంటూ వచ్చానో ఎవరికీ తెలియదు. ఆఖరికి మా ఇంట్లోని వారిక్కూడా! ఇంటర్మీడియట్ తర్వాత వివాహమైంది. గృహిణిగా నా జీవితం ప్రారంభమైంది. అక్కడ ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్ని కథగా రాయాలనుకున్నాను. నిజానికి రాశాను కూడా! కాకపోతే అవి వెలుగు చూడలేదు. కొన్ని కథలు మెదడులో రికార్డ్ అయి వున్నాయి ఇప్పటికీ. కొన్ని కథలు చదవడానికి మీ ముందున్నాయి.

నా కాలేజ్ రోజులు  వదిలేసిన పదేళ్ళ తర్వాత 1996 లో “జాతర” అనే కథ రాసాను. వెంటనే పత్రిక కు పంపాను.  నిడివి పెద్దదిగా వుందని ప్రచురణ కు అనర్హం అన్న వాక్యం తో తిరిగి వచ్చింది. ఆ తర్వాత కూడా రెండు మూడు కథలు అలాగే తిరిగి వచ్చాయి. ఇక రాయడం మానేసాను. చిన్న చిన్న కవితలు రాసాను. వాటిని అచ్చు లో చూసుకోవాలనే తపన కూడా బాగా వుండేది.. నేను అడపాదడపా చదివే పత్రికల్లో వచ్చే కథల కన్నా కవిత్వం కన్నా ఇవి చాలా బాగుంటాయి కదా అనే ఉక్రోషం కూడా వచ్చేది. నా ఇరవైల్లో కొంత అమాయకంగా  పట్టుదలగా వుండేదాన్ని. నేను రాయడం నా భర్తకు అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎందుకంటే నాది ప్రశ్నించే స్వభావం. రేడియో వినడం పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరిగి ఆ ప్రశ్నించే శక్తి మరింత పెరుగుతుందని అతని అసహనం.

రహస్యంగా రాసినవి కొన్ని, రాయడం పూర్తై పత్రికలకు పంపితే తిరిగివచ్చిన కథలు కొన్ని. పూర్తి చేయని కథలు ఇలా  చాలా కథలు వుండేవి నా దగ్గర. రాతప్రతులు అన్నీ ఓ ట్రంకు పెట్టెలో  పుస్తకాల అడుగున దాచుకునేదాన్ని. ఓ రోజు న  అవి నా భర్త కంటబడి నిర్దయగా   కాల్చివేయబడ్డాయి. నేను నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాను.ఆ అసంపూర్తి కథలు కేవలం అక్షరాలు కాదు. ఆ కథలు నా మానస పుత్రికలు.  ఒకే ఒక కథ “జాతర”  అనే కథ మాత్రమే నా వద్ద మిగిలింది.

ఇప్పటికీ  ఒక్క అక్షరం కూడా మార్చని ఆ కథంటే నాకు చాలా ఇష్టం భయం కూడా! ఒక   స్త్రీ భర్తకు అనుగుణంగా నడుస్తూ అతని అదుపుఆజ్ఞల్లో జీవిస్తూ అతని వ్యసనాలను,  లోపాలను భరిస్తూ జీవితాన్ని గడుపుతూ వుండటం అనే నరకం కన్నా మరో నరకమూ జీవిత ఖైదు మరొకటి లేదనిపించేది ఆ రోజుల్లో. నా ఆలోచనలన్నీ  కాగితం పై పెట్టకుండా పెదవి కదపకుండా వుండటం చాలా  కష్టం గా వుండేది. అయినా గృహిణి గా మరికొంత కాలం  జీవితం కొనసాగింది.  ఆ వివాహ జీవితం నుండి  నేను విడివడటానికి ముందుగా ఇంట్లోనూ తర్వాత బయటా కూడా పోరాటం చేయాల్సివచ్చింది. నాకు అందుకు ఊతమిచ్చింది సాహిత్యమే!అంటే మీరు తప్పక నమ్మాలి.  ఓల్గా రాసిన ‘మానవి’ నవల లోని వసంత పాత్ర లాంటి నేను కూడా మానవి గా మారాను. ఒంటరి తల్లిగా నిలబడ్డాను.

2000 లో  స్వేఛ్ఛగా రాయడం మొదలెట్టాను. రేడియో కి రచనలు పంపడం ప్రారంభించాను. జాతర కథను మళ్ళీ  అప్పుడు బయటకు తీసాను.  నిడివి ఎక్కువ వుండటం వల్ల ఆ కథ కొంత భాగం తొలగించి కథానిక గా ఆల్ ఇండియా రేడియో  విజయవాడ  వనితావాణి కార్యక్రమంలో ప్రసారమైంది. అప్పుడు చాలా సంతోషం. తర్వాత “బంగారు” అనే కథానిక “మర్యాద వారోత్సవాలు “అనే కథానికలు ఏఐ ఆర్  లో ప్రసారం అయ్యాయి. చదవడానికి ఆంక్షలు వుండి ఓ పదిహేనేళ్ళు పుస్తకాలు చదవడానికి కూడా దూరమై వున్న నేను  అదే 2000, 2001 సంవత్సరాల  కాలంలో రేడియోలో  ప్రసారం అయ్యే   శతవసంత సాహితీ మంజీరాలు అనే కార్యక్రమం వినడం అనేది ఆయాచితంగా లభించిన వరం అనుకునేదాన్ని.   ఆ కార్యక్రమం ద్వారా పేరెన్నికన్న పుస్తకాలు పరిచయం అయ్యాయి. పుస్తకాలు చదవడం ప్రధాన వ్యాపకం అయింది.  విరివిగా రాయడం మొదలెట్టాను. నాకు కథ కన్నా కవిత్వం అంటే ఇష్టం ఏర్పడింది. కవిత్వం రాయడం మొదలెట్టాను. కవిత్వం బాగా రాయగలను అనే నమ్మకం కూడా వచ్చింది. రేడియోలో పత్రికల్లో నా  కవితలు పది వరకూ ప్రసారం ప్రచురితం అయ్యాయి.

ఒంటరి తల్లిగా బ్రతుకు పోరాటం  విపరీతమైన ఒత్తిడి  ఆరోగ్య సమస్యలు వర్క్ షాపు నిర్వహణ వీటన్నింటి మధ్య కూడా దూర విద్య ద్వారా డిగ్రీ చదువుకుంటూ వుండటం  వలన రాయడానికి  సమయం వుండేది కాదు. అసలు ఏ మాత్రం రాయలేకపోయేదాన్ని.. అలా  నాలుగైదేళ్ళు  అసలు కథలు ఏమీ రాయలేదు. 2010లో కంప్యూటర్ ముందు కూర్చున్నాను. బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. రాస్తూ వున్న క్రమంలో మళ్ళీ కథలు రాయడం మొదలుపెట్టాను. కంట్రి ఉమెన్ కూతురు, కాళ్ళ చెప్పు కరుస్తాది, కూతురైతేనేం, ఆనవాలు కథలు రాసాను.

తర్వాత సారంగ వెబ్ పత్రిక వచ్చింది. కొత్త రచయితలను ప్రోత్సహించింది.  సంస్కారం స్వాతి వాళ్ల అమ్మ రచయిత్రి గారి భార్య కథలు రాసాను. కథను క్లుప్తంగా చెప్పవచ్చు ఇంత దీర్ఘంగా రాయనవసరం లేదు  అన్న పాఠకుల అభిప్రాయాన్ని చాలెంజ్ గా తీసుకుని “మర్మమేమి” కథ రాసాను. అంతకు ముందే కల్పన రెంటాల గారూ పత్రికల ఈ మెయిల్ అడ్రెస్ లు ఇచ్చి ప్రింట్ పత్రికలకు కూడా  రచనలు పంపమని ప్రోత్సహించారు.

అలా వివిధ పత్రికల్లో రెండు మూడేళ్ల కాలంలోనే 25 పాతిక కథల వరకూ ప్రచురింపబడ్డాయి. అలా రచయితగా నాకొక స్థిరమైన స్థానం కుదురుకుంది.  అప్పటి నుండి రాస్తూనే వున్నాను. ఇప్పటికి 130 కథలు రాశాను. నేను రాసిన ప్రతి కథ నా అనుభవంలో నుండో ఇతరుల అనుభవం నుండో రాసినవే! 75% వాస్తవికత 25% ఫిక్షన్ కలగలిపినవి నా కథలు.  నా కథలు అన్నీ చదవని పాఠకులు స్త్రీల కథలు మాత్రమే రాసాను అనుకుంటారు. నేను విభిన్నమైన కథలు రాశాను.  హిజ్రా లపై “మార్పొద్దు మాకు”  టాన్స్ జెండర్ లపై “తృతీయ ప్రకృతి”  లెస్బియన్  సహజీవనం పై “పరస్వరం”  గిగోల స్ “ప్రత్యాహారం” అనే కథలు పదేళ్ళ కిందటే కథలు రాసాను.. ఎందుకంటే ఆ జీవన విధానాలు మన కళ్ళముందు  జరుగుతున్నాయి కాబట్టి. పర్యవరణ పరిరక్షణ గురించిన  అంశాలపై “బయలు నవ్వింది” “నిర్మాల్యం” “బంగారు భూమి” కతలు, విదేశీ విద్యలు  ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం వెంపర్లాడే మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల వెతలు గురించి “ఏనుగు అంబారీ” “రాజు -వెట్టి” కతలు రాసాను. ఆత్మాభిమానం వ్యక్తిత్వంతో నిలబడ్డ స్త్రీల కథలు రాసాను.

సామాజికంగా  నేను వ్యక్తులతో ఎంత కలివిడిగా వుంటానో అంత మౌనంగా కూడా వుంటాను. స్వభావసిద్ధంగా మొండిదాన్ని. ఏ పనైనా నాకు నచ్చితేనే చేస్తాను.అది రాయడం కూడా!  నాకు రాయాలనిపించినప్పుడే రాస్తాను. ఒక కథా సంకలనంలో మీ కథ కూడా  వుంటే బాగుంటుంది కథ రాసి ఇవ్వండి అంటే ఇవ్వలేను. నేను రాసిన కథలన్నీ నేను ఇష్టంగా రాసినవే. ఇంకా బాగా రాయవచ్చేమో అనుకుంటాను కానీ ఇలా ఎందుకు రాసాను అని  నేనెప్పుడూ అనుకోలేదు.

ఒక రచయిత గా నా కాలాన్ని సమకాలీన జీవితాలను నేను నోట్ చేసాననే అనుకుంటున్నాను. ఆగి ఆగి ఆచితూచి రాసిన కథలు ఎలాగూ నాణ్యంగా వుంటాయి. కానీ ఒకే వొక సిట్టింగ్ లో రాసిన కథలు కూడా బాగా వచ్చాయన్నది నా రచనానుభవం. ఇల్లాలి అసహనం, నూతిలో గొంతుకలు, రస స్పర్శ అనే కథలు  రాత్రికి రాత్రి కూర్చుని రాసిన కథలు. అలా రాయగల్గినందుకు నాపై నాకే ఆశ్చర్యం. రోజుకొక పది కథలైనా చదువుతాను. నేను విసృతంగా చదవడం మూలంగానే కొన్ని కథలు బాగా రాయగల్గాను అనుకుంటాను. సహ రచయితలు వదిలేసిన కోణాలు, వారు కథ ముగించిన తర్వాత ఉద్భవించిన ప్రశ్నలకు కొనసాగింపుగా రాసిన కథలు లోలోపల పొరలను కూడా బహిర్గతం చేయాలనే ఆలోచనలతో రాసిన కథలు. ఇలా నా కథా ప్రస్థానం కొనసాగుతుంది.

నా అనుభవంలో  నేను రాసిన వాటికన్నా  రాయని కథలెన్నో వున్నాయి. బద్దకం ఏర్పడింది అనే కన్నా..ఒక విధమైన నిరాశ నెలకొని వుంది. పత్రికలు కథ ను బట్టి స్వీకరించే కాలం కానే కాదు ఇది. రచన కన్నా రచయిత వ్యక్తిగత స్నేహాలకు చోటిచ్చే కాలం. చాలా వరకు సాహిత్య రాజకీయాలకు నెలవైన పత్రికలు వున్నాయి కాబట్టి ఎంత మంచి రచనైనా కారణం లేకుండా తిరిగి వస్తాయి. ఆ నిరాశను తట్టుకోవాలి రచయితలు. నేను అలాగే తట్టుకున్నాను. అలా తిరిగి వచ్చిన  12  అముద్రిత కథలతో  మరో రెండు కథలు  కలిపి “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటి గా ప్రచురించుకున్నాను. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథలు అవి.

నా మైనస్ ఏమిటంటే  రచయితగా ప్రతి కథను ప్రింట్ పత్రికలకు అనుగుణంగా 1500 పదాల్లో క్లుప్తీకరించలేను. అదసలు నాకు నచ్చదు కూడా! లతాంతాలు, నీట చిత్రం, పైడి బొమ్మ లాంటి నిడివి ఎక్కువ కల్గిన కథలు రాసాను. ఆ కథలను పత్రికలు ప్రచురించవు అని నాకు తెలుసు. ఇతివృత్తాన్ని బట్టి కథలకు రూపం ఏర్పడుతుంది తప్ప రచయిత చేసే నాటకీయత   బలవంతపు అసందర్భ  ముగింపులు వల్ల కథలకు వాటికి రావాల్సిన రూపు రాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.అలా రాయడం  నాకు నచ్చదు కూడా.  నా కథలు ఎడిట్ చేసి ప్రచురిస్తాం అంటే కూడా నేను వొప్పుకోను.

కథలకు ఒకోసారి వర్ణన కూడా అత్యవసరం అని నా భావన. నా ప్రతి కథ నిబద్దత తో రాసాను. ఎవరి సలహాల మేరకు మార్పులు చేర్పులు కూడా ఇష్టపడను. వివాదాస్పద రచనలు చేయడం ద్వారా ప్రాచుర్యంలోకి రావడం  కోసం కూడా రాయలేదు. ఇవన్నీ నేను చేసి వుంటే నా కథలు తిరస్కరణకు గురి అయ్యేవి కాదు. మరికొన్ని కథలు ప్రింట్ పత్రికల్లో వచ్చి వుండేవి. రాశి కన్నా వాసి ముఖ్యం అని భావిస్తాను. పలుచన కానీయకే చెలీ, ఆదర్శ నాయకుడు, చూపుల దొంగాట,నీరెండ చాయల్లో లాంటి సూక్ఙమైన కథలు రాసాను. అవి మనస్తత్వ కథలు. కొన్ని చైతన్య స్రవంతిలో రాసిన కథలూ వున్నాయి. నా దృష్టిలో రచయిత రచనలు వేరు వేరు కాదు. ఒకటే! చాలా వరకు నా కథల్లో నేనూ వుంటాను. ఏ కథ? ఏ పాత్ర   అన్నది మాత్రం రహస్యం.

ఇంకో విషయం ఏమిటంటే…

నేనెప్పుడూ ఇలాంటి కథలు  రాశాను ఇన్ని రాశాను  అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇంతవరకూ ఏ పత్రిక లోనూ నా పరిచయం కూడా  రాలేదు. నాలుగైదు పుస్తకాలు ప్రచురించిన తర్వాత కూడా!

రచయితల సమూహం లో నుండి అందరినీ తోసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళి మొదటి వరుసల్లో నేను కూర్చోలేను.అది నాకిష్టం వుండదు. నలుగురి దృష్టిలో పడటానికి ప్రయత్నించను కూడా. నాకున్న అవకాశాలను బట్టి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం మినహా. నా కథల పుస్తకాలకు ముందు మాట రాయించుకోవడం సమీక్షలకు పుస్తకాలు పంపడం కూడా చేయను నేను. ఎందుకో నాకది అంతగా ఇష్టం వుండదు.

ఇవాళ సాహిత్య వాతావరణం ఎలా వుంది అంటే..

మీరు వెంటనే పుస్తకం వేయండి మీకు ఈ సంవత్సరం అవార్డు ఇస్తాం అని ముందుకు ముందే నిర్ణయం చేయబడుతున్న తెలుగు సాహితీలోకంలో అవార్డుల కోసం రివార్డుల కోసం సంకలనాల కోసం ఏదో ఒక విధమైన గుర్తింపు కోసం రచనలు చేయడం నా అభిమతం కాదు. రాయకుండా వుండలేనితనం నన్నావహించినప్పుడు మాత్రమే  రాసాను. రాయాల్సినవి చాలా వున్నాయి. రాసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాస్తాను. ఇప్పుడు మాత్రం స్టోరీ టెల్లర్ గా అవతారమెత్తాను.

ఇతరులను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను. నా కథలే కాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కథలు మంచి మంచి తెలుగు కథలు వినిపిస్తున్నాను.  నేను రాసే కథలు నేను రాస్తున్నాను.   ఏదో అనుకోకుండా గాలివాటుగా నేను రచయితను కాలేదు. భారతీయ సమాజంలో తరతరాలుగా పీడనకు గురవుతున్న స్త్రీ ల  గురించి  వారి జీవితాల్లోని అనేక పార్శ్వాలు గురించి రాయాలనే తపన వలన రచయితను అయ్యాను.  ఆ రాయడం అనేది చాలా బాగుండాలి  అనే శ్రద్ధ వలన  రాయగల్గాను. కీ బోర్డ్ పై రాసే సౌలభ్యం వుండటం మూలంగా రాయగల్గాను తప్ప ఇందులో  వ్యక్తి గా నా గొప్ప ఏమీ లేదు. గొప్పగా వుండాలని గుర్తింపబడాలని కూడా నేను కోరుకోవడం లేదు.

వర్ధమాన రచయితగా వున్నప్పుడు  నేను రాసిన కథల్లోని విపరీతమైన అచ్చుతప్పులను భరించి  సరైన వాక్య నిర్మాణం చేసి నా కథలను ప్రచురించి నన్ను ప్రోత్సహించిన  సారంగ వెబ్ పత్రిక  నిర్వాహకులు అఫ్సర్ గారికి కల్పన రెంటాల గారికి రాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  నా కథలను చదివి ఆదరించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.

*

సారంగ చానెల్ లో కూడా చూడండి:

ఒంటరి పోరాటమే అన్నీ నేర్పింది

 

వనజ తాతినేని

1 comment

Leave a Reply to Lakshmi Raghava Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ జీవనసరళి ఎందరికో స్పూర్తి 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు