ఐదుగురు

మూలం: అమృతా ప్రీతం 

 

“అదొచ్చిందా?” వరండాలో కొస్తూ ఒకామె ప్రశ్నించింది.

“లేదు. ఇంక రాలేదు. వస్తూందేమో!” వరండాలో కూర్చొని ఉన్నావిడ జవాబిచ్చింది. ఆమె తీక్షణంగా గేటు వైపే కండ్లానించి చూడసాగింది.

మూడో ఆమె  ఏం మాట్లాడకుండా బయటి వైపుకు తదేకంగా చూడసాగింది. నిన్న రాత్రి తన కలలో ఓ రోడ్డును తవ్వింది. కాని ఈ రోజు అది అలాగే ఉంది. దానికేం కాలేదు. ఆమె ఆశ్చర్య పోయింది.

నాలుగో ఆవిడ రోడ్డు వైపు కాకుండా, పోర్చ్ వైపున్న మెట్ల వైపు చూడసాగింది. అక్కడ ఎవరు కనిపించక పోయినా ఎవరివో బూట్లు కనిపించసాగాయి.

ఐదో ఆవిడ ఎత్తు కొద్దిగా చిన్నగా ఉది. ఆమెకు పోర్చ్ లో నిలబడి ఉన్న అతని బూట్లే కాదు ప్యాంటు అంచులు కూడా కనిపించసాగాయి.

కొన్ని నిమిషాల తర్వాత  ‘ఇన్’ గేటులో  ఓ కారు వచ్చింది.  ఫోర్చ్ లో ఆగకుండా, చిన్నగా ఆగుతున్నట్లు…మళ్లీ వేగం పెంచుతూ ‘ఔట్’ అనే గేటు లో నుంచి బయటికి వెళ్లి పోతోంది.

రెండవ అంతస్థు భవనం లోని వరండా లో నిలబడి అమ్మాయిలు  చూడసాగారు.

ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇలాగే కొనసాగుతూండేది. ఆ ఐదుగురు అమ్మాయిలకు ఇది వ్యసనంగా మారింది. ఆదివారం మినహాయించి.

ఈ కథ పూర్వాంశాల గురించి మొదలెట్టాలంటే, ఇలా మొదలెట్టాల్సుంటుంది…

ఒక కార్యాలయం ఉండేది. ఒక బాస్ ఉండేవాడు. అతనికి ఐదుగురు స్టెనోలుండేవారు.

ఆఫీసు చాలా  విశాలంగా ఉండేది. ఎన్నో సెక్షన్లు ఉండేవి. ప్రతి సెక్షన్ కు ఓ బాస్ ఉండేవాడు. కాని అన్-అఫిషియల్ గా  చెప్పుకోవాలంటే  అన్ని  సెక్షన్ లకు అతడే…బాస్!

అతడు ఏ వైపుకు వెళ్లుతాడో ఆ వైపుకు, ఆ వైపుకే గాలి గుబాళించేది! ఏ స్టాఫ్ రూం లో టెలిఫోన్ బెల్ మొగిందంటే,  ఆ రూం లోని స్టెనోను తన గదిలోకి పని కోసం పిలుస్తున్నట్లే. ఆ అమ్మాయి బెంబేలెత్తి పోతోంది.

ఫైల్ ఏదైనప్పటికి, ఆ ఫైల్ మీద అదృశ్యమైన ‘అర్జెంట్ ‘ అనే పదం రాయబడి ఉంటుంది. ఆజ్ఞ ఇంకా బాస్ పెదాల వెనుకనే ఉంటుంది, అమ్మాయిల చేతుల్లో ఆ పని అయిపోతోంది!

బాస్ అనధికార నామం ‘బాద్ షా సలామత్.’  ఆ ఐదుగురు స్టెనో ల కోడ్ వర్డ్…”కోర్ట్ డాన్సర్స్ ‘.

రాజు గారి దర్బారు లోని నృత్య కారిణిలు. తమ నృత్య కళను  మహరాజుగారి సమక్షంలో కేవలం నృత్య  ప్రదర్శనమే గాకుండా తమ  దుస్తుల, కులుకుల జోరు కూడా ఎలా పరిగణలో కొస్తాయో  అలాగే  ప్రతి స్టెనో తన ఆఫీసు కొచ్చే ముందు బాగ  టిప్ టాప్ గా తయారై వస్తూండేది!  కాటన్ దుస్తుల్లో వారి శరీరాంగ సౌష్టవం చూడ ముచ్చటగా ఉండేది. వారి పొగురు నడకలో, వయ్యారంగా తిప్పే నడుం మెలికలులోనూ ఓ విధమైన సంస్కారం ఉండేది.

బాస్ ఏ అమ్మాయినైతే పిలుస్తాడో, ఆమె బాస్ గదిలోకి వెళ్లే కొన్ని క్షణాలకు ముందు…తన హేండ్ బ్యాగ్ లో ఉన్న చిన్న అద్దం తీసి మరో సారి మొహాన్ని చూసుకోనేది. తన ఫైల్ లోని కాగితాలు సరిగా ఉన్నాయా లేవా అన్నట్లు!

బాస్ సంతకం పెట్టాల్సిన కాగితాల పై సంతకం పెట్టి, ఆ తర్వాతి పని గురించి చెప్పి, ఫైల్ ను అమ్మాయి చేతిలొ పెట్టెవాడు. ఆ అమ్మాయి పని నచ్చితే ఆమె వైపు చూసి, “గుడ్ ” అని అంటే…ఇక ఆ అమ్మాయికి నిజమైన గుడ్ డే!

కొందరు అమ్మాయిల సర్వీస్ ఐదేండ్లు అయితే మరికొందరు అమ్మాయిల సర్వీస్ అరేండ్లు. అమ్మాయిలకు ఆఫిసుతో ఏలాంటి  ఫిర్యాదు లేదు. అలాగే ఆఫీసుకు అమ్మాయిల పట్ల! ఒక వేళ ఉన్నా, అమ్మాయిలకు అది తన సెక్షన్ నుంచి మరో సెక్షన్ కు మార్చ కూడదని!

బాస్ నల్లని తల వెంట్రుకలలో కొన్ని తెల్లని చారలు కనిపించసాగాయి. అమ్మాయిల మాటల్లో ఇవి దయ గీతికలు! ఇది గాక మరి  కొన్ని పేర్లు కూడా బాస్ కు అమ్మాయిలు జోడించారు…రోమన్ ఫిగర్, గ్రీక్ బ్యూటీ, ఎంజిల్ ఫేస్,  ఎటర్నల్ యూత్, లవింగ్ గాడ్…

ప్రతి రోజు ఏడుగంటలు ఆఫిసు లో పని. (లంచ్ మరియు ఎక్స్ ట్రా వర్క్ ఈ టైం లోనే సమ్మిళితమై ఉండేది. ఏ రోజు పని ఆ రోజే ముగించే వాళ్లు) ఈ ఆఫీసు పని అమ్మాయిలకు ఓ గుదిగర్ర లా ఉండేది. ఆఫీసు గడియారం లోని సూదులు ఐదు గంటలకు చేరుకున్నాక గుదిగర్ర తో ముక్తి కలిగేది. ఐదుగంటలు కాగానే బాస్ భార్య ఆఫీసుకు చేరుకునేది. తన వెంట కారులో ఇంటికి తీసుకెళ్ళేది. నల్ల రంగు కారు డేగ రెక్కలా అనిపించేది.

బాస్ భార్య సరిగ్గ ఐదు గంటలకు డేగ లా వ్రాలేది. అందరి అమ్మాయిల కండ్లలో దుమ్ము దులిపి,  రెప్పపాటులో బాస్ ను తమ నుంచి లాగుకొని  ఉడాయించేది! అమ్మాయిల రోజువారి  కష్టార్జితం గంగపాలైయ్యేది.

అమ్మాయిలు ఈ ‘హక్కు’ ను వెన్నముద్ద లా భావించేవారు. కాని ఓ రోజు ఓ అమ్మాయి దాన్ని ‘వెజిటేరియన్ టాక్ ‘ అని అంది. అందరమ్మాయిలు కలసి దాన్ని మాంసపు ముద్దతో జోడించారు. నవ్వుల మధ్య ఏ అమ్మాయి కూడా బాస్ భార్యను డేగగా, బాస్ ను మాంసపు ముద్దగా పరిగణించలేదు. కాని వారి శరీరాలల్లో ఓ విధమైన వ్యాకులత, వేడి లాంటి ఫీలింగ్!

ఫ్రతి రోజు ఐదు గంటలకు గుదిగర్ర తో విముక్తి కలిగేది.  అమ్మాయిలు ఇంటికెళ్లడానికి బస్ స్టాండ్ దగ్గర నిలబడినప్పుడు ఆ రోజు బాగా అలసి పోయినట్లనిపించేది. ఈ గుదిగర్ర కూడా సూర్యుడిలా అనిపించేది. ప్రతి రోజు సాయంత్రం గుదిగర్ర సూర్యుడిలా మెడలోనుంచి దిగి పోయేది. మెళ్లీ  ఉదయం సూర్యుడు ఉదయించేలా గుదిగర్ర మెడలో కెక్కిపోయేది.

జీవితపు ఈ ఉద్యోగ నమూనా ఇష్టమున్న లేకపోయినా అమ్మాయిలకు ఒప్పుదలగానే ఉండేది.

                                              ***

ఉన్నట్టుండి ఓ దుర్ఘటన జరిగింది.

బాస్ భార్య చనిపోయింది.

అమ్మాయిలు ఈ వార్త విన్నారు. ఒకరినొకరు చెప్పుకొన్నారు. ఒకరినొకరు మరణ వార్తను నిర్ధారించుకొన్నారు.

క్రితం వారం రోజుల నుంచి బాస్ భార్య, బాస్ ను తీసుకెళ్లడానికి రాడం లేదు! అనారోగ్యంగా ఉందని తెలిసింది. కాని అమ్మాయిలు ఐదు గంటల తర్వాత  ఆఫీసు బయట రోడ్డు వైపుకు ఆమె కారు కోసం ఎదురు చూస్తూండేవారు.  ఈ రోజు కూడా వస్తూందో లేదోనని!  వాళ్లు అమె మరణ వార్త విన్నప్పటికి నమ్మకంగా లేదు. ఆమె వస్తూందేమోనని ఖాళీగా ఉన్న ఆ రొడ్డు వైపుకే దృష్టిని సారించే వారు!

కొన్ని రోజులు ఇట్టే గడచిపోయాయి. అమ్మాయిల మనసులో ఓ నమ్మకం లాంటిది ప్రాకసాగింది, ఆమె నిజంగానే చచ్చిపోయిందని. బాస్ కారు రోజంతా ఆఫీసు క్రింద ఉన్న కార్ షేడ్ లో ఉంది. సాయంత్రం ఐదు గంటలకు అతడు తన గదిలో నంచి బయటికొచ్చేవాడు. మెట్లు దిగేవాడు. కాని క్రింద పోర్చ్ లో నిలబడేవాడు కాదు. బయట పార్క్ చేయబడి ఉన్న మోటార్ స్టార్ట్ చేసి, దాని మీద వెళ్లిపోయేవాడు.

అమ్మాయిలు ఇప్పటికి కూడా బయట వరండాలో నిలబడి ఉంటుండేవారు. మౌనంగా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొంటుండేవారు. కొన్నేళ్ళ నుంచి నడుస్తూన్న ఈ జీవితపు ప్యాటర్న్ బాహ్యంగా ఒకేలా ఉన్నా, లోనుంచి పూర్తిగా చెల్లాచెదురైంది.

“ప్రతి రోజు డేగ లా ఎగురుతూ వస్తూండేది. మా శాపం తగిలింది.” ఇలా కొన్నాళ్లు అమ్మాయిల మధ్య పరిహాసం కొనసాగింది. కాని తర్వాత ఈ ఎగతాళులుకూడా ఆగిపోయాయి.

అమ్మాయిలకు ఇప్పటివరకు అర్ధంగాని భావాలు, అర్ధంకాసాగాయి! అసలు వారికి ఈర్ష్య ఎవరితో ఉండేది కాదు. కేవలం వాళ్లలోనే ఒకరితో ఒకరికి ఉండేది!

ఏ అమ్మాయి అయితే బాస్ గదిలో కెళ్లేదో,  మిగతా నలుగురు అమ్మాయిలకు సమయం ముళ్ళ మీద గడిచేది.

బాస్ గదిలో నుంచి బయటికొచ్చిన అమ్మాయి మొహాన్ని గుచ్చి గుచ్చి చూసేవారు. ఆమె చేసొచ్చిన దొంగతనాన్ని పసిగట్టుతున్నట్లు!

ఉదయం పది గంటలకు ఐదుగురు అమ్మాయిలు ఆఫీసుకు చేరుకున్నాక, ఒకరినొకరు తీక్షణంగా చూసుకునేవారు. ఈ రోజు నిన్నటికన్నచాల బాగ తయారై వచ్చిందంకునే వారు.

“ఈ చీర నువ్వెప్పుడు కొన్నావ్”

“నీ ఈ పర్స్ నేను ఇంతకు ముందెన్నడు చూడ లేదు?”

“నీ ఈ బ్లౌజ్ కు క్లాత్ బహుశా హాఫ్ మీటరే పట్టి ఉంటుంది! నడుం వైపు ఖాళీ గానే ఉంది. హగ్ కు సరిపోతోంది!”

ఒకరి నొకరు బాగా మెచ్చుకొనే వారు. కొన్నిసార్లు కొత్త  హేర్ కట్ ప్రస్తావన కూడా వస్తూండేది.

కాని వారి మాటల్లో తేనే లాంటి తియ్యదనం ఉన్నా, చేదు రుచి మిళితమై ఉండేది.

“డోంట్ వర్రీ ఐ వోంట్ హగ్ హిమ్!”  బ్లౌజ్ గురించి మెచ్చుకున్న అమ్మాయికి కఠినంగా జవాబు ఇచ్చేది. హగ్ విషయం తనంతటా తానే బాస్ వరకు వెళ్లిపొయేది.

ఉదయం పది గంటలకు ఐదుగురు అమ్మాయిలు ఆఫీసుకు చేరుకున్నాక, ఒకరినొకరు నఖశిఖ పర్యంతం  చూసుకునేవారు. ఈ రోజు నిన్నటికన్న చాల బాగ తయారై వచ్చిందంకునే వారు.

“డోంట్ బి అంగ్రి డియర్ డెవుల్!” రెండవ అమ్మాయి నవ్వులాంటిది వదిలేది!

“హాయ్ నీ ఈ అమాయకత్వం పై ప్రాణాలొదిలేద్దామనుకొంటున్నాను!” మరో అమ్మాయి వ్యంగ్యాన్ని నవ్వులో పులుముకొని చెప్పేది.

వాతావరణం వేడెక్కి పోయింది. గుండెల్లో మండుతూన్న వాసన…బయట మాత్రం ఇంతకన్న మిన్నగా వెలుతురు…అమ్మాయిలు వెలుగెత్తి పోయారు…వేష-భూషణల్లో మరియు వ్యంగ్య మాటలల్లో!  పని మొదట్లోలా ఉన్న……పని పిచ్చి మాత్రం అలాగే ఉంది. మొదట్లో వాళ్లు బాస్ ఇంప్రెషన్ కోసం చేసేవారు. ఇప్పుడు ఒకరి నొకరు కించపరచడానికి చేయసాగారు.

అలా ఆరు నెలలు గడచి పోయాయి.

ఉన్నట్టుండి మిన్ను విరిగి మీద పడినట్లైంది.

బాస్ ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు.

అమ్మాయిల చేతుల్లో ఉన్న ఫైల్స్ అకస్మాత్తుగా వణక సాగాయి. అందులో ఉన్న ఆకు పచ్చ, పసుపు పచ్చ, ఎర్ర రంగు కాగితాలు టేబుల్ పై చెల్లచెదురుగా పడిపోయాయి.

 ఆ రోజు మళ్ళీ సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు (ఖాళ్లీగా ఉన్న రోడ్డు పై నుంచి) ఓ నల్లని కారు వచ్చి పోర్చ్ లో ఆగింది. బంగారు రంగుల వెంట్రుకలున్న యువతి కారులో నుంచి దిగింది. ఆమె బాస్ చేతిలొ చెయ్యి వేసి, కార్ లో కూర్చొని కార్ నడిపింది.

“దిస్ టైం ఈస్ ఎ ఫారన్ కల్చర్!” ఓ అమ్మాయి నెమ్మదిగా చెప్పింది. ఎవరు కూడా దీని పై కామెంట్ చేయలేదు. కామెంట్ చేయడానికి వారిలో దమ్ముగిమ్ము లాంటిదేమి లేదు!?

నెమ్మదిగా నెమ్మదిగా మెట్లు దిగుతూ, కొద్ది దూరంలో ఉన్న బస్ స్టాండ్ వైపుకు వెళ్లసాగారు.

అమ్మాయిలందరికి అర్ధం అయింది…వాళ్లు వృద్దులైపోయారని!

                                      *****

అమ్జద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు