‘ఏం పుస్తకం చదివినవురా’

అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావటం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను.

 “వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ చేస్తున్నప్పుడు హరగోపాల్ మా కాలేజిలోనే లెక్చరర్ గా వుండేవారు. హీరోలా వుండేవాడని అందరం అనుకునేది. ఆయన పాఠాలు బాగా చెప్పేవాడని అనేవాళ్ళు. నాది ఆయన సబ్జెక్టు కాకపోయినా గానీ అప్పుడప్పుడూ వెళ్లి కూర్చుని వినేవాడిని. తర్వాత ఎమ్‌.ఏ ఇంగ్లీషు వరంగల్‌లోనే చేశాను.  చాలామంది హైదరాబాద్‌ వెళ్లేవారు యూనివర్సిటీ కోసం. అప్పటికి వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ రాలేదు. పిజి కాలేజీనే వుండేది. అక్కడే చదివాను. ‘74లో పూర్తయింది.

మా బాపు ఐఏయస్‌ మీద పట్టుబట్టడంతో ఒకసారి రాసాను గానీ, అంత శ్రద్ధ పెట్టలేదు. ఆ వైపుగా పోవాలనిపించలేదు. ఎమ్‌.ఏ అయిన వెంటనే 1974లోనే వరంగల్ సికెఎమ్‌ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. ఎయిడెడ్‌ కాలేజి. ఎక్కువ రెడ్లే వుండేవారు. ఆధిపత్యకులాలను దాటి బిసిలకు ఉద్యోగం రావటం కష్టమైన రోజులవి. ఇక్కడ రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. ఊర్లలో వుండే రెడ్లు సాధారణంగానే వుండేవారు కానీ, వరంగల్‌ ప్రాంతంలో చాలా ఆధిపత్యంతో వుండేవారు. కాలేజీ ఎన్నికలు వస్తే జీపుల్లో వచ్చి ప్రచారం చేసేవాళ్ళు. అలానే తర్వాతి కాలంలో కాలేజీలో ఎబివిపి ఆధిపత్య రాజకీయాలకి వ్యతిరేకంగా చాలా నిలబడ్డాం.

ఉద్యోగం వచ్చిన తర్వాత స్వీట్స్‌ తీసుకుని కాళోజీ దగ్గరకు వెళ్లాను. ఆయన ఒక్కటే అడిగారు, ‘ట్యూషన్స్‌ చెప్తావా?’ అని. లేదని చెప్పాను. అప్పుడు ఇంగ్లీషు టీచర్లకి చాలా డిమాండ్‌ వుంది. గైడ్లు రాయటం, ట్యూషన్లు చెప్పటం అలాంటివి. ‘నీ ప్రతిభకు, నీ విజ్ఞానానికి ప్రభుత్వం జీతం ఇస్తోంది. అంతకుమించి నీ మేథోసంపత్తిని ఇంక దేనికీ అమ్ముకోకు’ అని కాళోజి చెప్పారు. ఆ విషయం నాకు బలంగా మనసులో నాటుకుపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ నేను ఆయన మాటకు కట్టుబడి వున్నాను. కాళోజి ద్వారానే నాకు లోహియా రచనలతోనూ, జయప్రకాష్‌ నారాయణ రచనలతోనూ పరిచయం అయింది. చాలా విస్తృతంగా వారి రచనలు చదివాను. విలువలకు సంబంధించి కాళోజి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను.

ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేవాడు. కలిసినప్పుడల్లా ‘ఏం పుస్తకం చదివినవురా’ అని అడిగేది. చదవలేదంటే తిట్టేది. ఆయన భయంతో ఇంకా ఎక్కువ కొత్త పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. ‘75లో ఎమర్జెన్సీ వచ్చింది. అనేకమంది అరెస్టయ్యారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కాళోజి తెలంగాణ అంతా తిరిగారు. నేను కూడా ఆయనతో కలిసి చాలాచోట్లకు వెళ్లాను. అదే సమయంలో రాజకీయ ఖైదీలు భూమయ్య, కిష్టాగౌడ్‌లని సికింద్రాబాద్‌లో ఉరితీశారు. ఎంతో భయానకమైన పరిస్థితి దేశమంతటా!

వరవరరావు కూడా అదే కాలేజిలో చేస్తూ వుండేవారు. అంతకుముందు ఆయన్ని దూరంనుంచి చూడటమే కానీ నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. మా వెనుక గల్లీలోనే వుండేవారు. అయితే, నేను అక్కడ జేరే సమయానికే ఆయన మీసా కింద అనుకుంటా, అరెస్ట్ అయ్యి జైలులో ఉండటంతో నేను ఆయనకి నేరుగా పరిచయం కాలేదు. ఆయన మూడో కూతురు బన్నీ పుట్టిన పదిరోజులకే ఆయన్ని అరెస్ట్ చేసారని అప్పుడు తెలిసింది. అందుకే పరిచయం లేకపోయినా గానీ వాళ్ళింటికి వెళ్లి హేమక్కను పలకరించి వచ్చాను. అది నా బాధ్యతగా అనిపించింది. ఆ తర్వాత కాలంలో దాదాపు నేను వాళ్ళింట్లో సభ్యుడుగా అయిపోయాను. అప్పటికి హక్కుల దృక్పధం లేదు కానీ, ప్రజాఉద్యమాలతో పనిచేయటం అవసరం అని భావించాను. ఎమర్జెన్సీ నిర్బంధం తర్వాత అది మరింత బలపడింది.

ఎమర్జెన్సీకి ముందే పౌరహక్కుల సంఘం ప్రారంభమయింది కానీ, అంత చురుగ్గా పనిచేయటం లేదు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అన్ని విప్లవ పార్టీల ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్‌ని నిర్వహించారు. అది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఒక్క నాగిరెడ్డి గ్రూప్ యుసిసిఅర్ఐఎమ్మెల్ తప్ప ఇతర విప్లవ సంస్థల ఆధ్వర్యంలో పౌరహక్కుల సంఘం తిరిగి ప్రారంభమయింది. కన్వీనర్లుగా కాశీపతి, రంగనాథం, విఠల్ రావు వుండేవారు. వరంగల్ నుంచి డా.రామనాథం, అట్లూరి రంగారావు, వరవరరావు, నరసింహయ్యలతో పాటు నన్ను కూడా ఏపిసిఎల్‌సి రాష్ట్ర కమిటీ మెంబరుగా అప్పుడు ఆహ్వానించారు. దానితర్వాత రాజ్యహింసకు సంబంధించి అనేక సంఘటనలకు ఎపిసిఎల్‌సి సభ్యుడుగా నిజనిర్థారణకు వెళ్లేవాడిని.

1981లో బాలగోపాల్‌ హక్కుల ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మా పని విధానంలో చాలా చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నిజనిర్థారణ చేసే విషయంలో. విప్లవ సంస్థల ఆధ్వర్యంలో వున్నసంస్థ కాబట్టి ఆయా సంస్థలు వున్నచోట వాటి ప్రభావం వుండేది. అయితే, ఈ రాజకీయ ఒత్తిడికి కానీ, ప్రభావానికి కానీ లోనుకాకుండా అక్కడ జరిగిన వాస్తవాన్ని వాస్తవంగా రికార్డు చేయటం మేము బాలగోపాల్‌ నుంచే నేర్చుకున్నాం. తను ‘79లో ఆర్‌ఇసిలో మాథమెటిక్స్ లో రిసెర్చ్‌ చేసేవాడు. మాకు వరంగల్‌లో ఒక ఫిల్మ్ సొసైటీ వుండేది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ తర్వాత ఇదే తెలంగాణలో మొదటి ఫిల్మ్ సొసైటీ. దీన్ని కొంతమంది మిత్రులం కలిసి స్థాపించాం. నేను దానికి మొదటినుంచీ కార్యదర్శిగా ఉండేవాడిని. నిర్బంధం పెరిగిన తర్వాత వేరేవాళ్ళకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రతివారం ప్రపంచ ప్రసిద్ధ సినిమాలు వేసేవాళ్లం. చిత్రరీతి అనే పత్రికలో వాటి గురించి నేను రివ్యూలు కూడా రాసేవాడిని. మామూలుగా అయితే సభ్యులకు మాత్రమే అనుమతి వుంటుంది. వేరేవాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే ఐదు రూపాయలు కట్టి రావొచ్చు.

ఆర్‌ఇసిలో ప్రొఫెసర్‌ పండిట్ అనే ఆయన మా ఫిల్మ్ క్లబ్ మెంబరు. ఆయన బాలగోపాల్ కి పి.హెచ్.డి గైడ్. ఒకసారి సత్యజిత్ రే సినిమాలు వేసినప్పుడు ‘మా స్టూడెంట్‌ కి చాలా ఇంట్రస్ట్‌ వుంది, తీసుకురావొచ్చా’ అని ఆయన అడిగాడు. అలా నాకు బాలగోపాల్‌తో మొదటి పరిచయం. ఆ తర్వాత కాలంలో తనకి కాకతీయ యూనివర్సిటీలోనే ఉద్యోగం వచ్చింది. అప్పుడు తను హక్కుల ఉద్యమంలోకి వచ్చాడు. బాలగోపాల్‌ వచ్చిన తర్వాత వరంగల్‌ యూనిట్‌ చాలా క్రియాశీలకంగా పనిచేసింది. డా.రామనాథం, నర్రా ప్రభాకర్ రెడ్డి, బుర్రా రాములు ఇలా అందరం నిరంతరం హక్కుల ఉద్యమ పనిలో వుండేవాళ్లం.

నేను హక్కుల ఉద్యమం పని ఎంచుకొన్నతర్వాత, నా కుటుంబం మీద పోలీసుల ఒత్తిడి బాగా పెరిగింది. మా బాపుని పిలిచి బెదిరించేది. ఇంట్లో అందరూ భయపడేవారు. 1979 సంవత్సరంలో ప్రతిమతో నా పెళ్లయింది. వాళ్ళది కరీంనగర్.   తను అంపశయ్య నవీన్ స్టూడెంట్. ఆయన ద్వారానే మా పెళ్లి  అయ్యింది. నవీన్ ద్వారా తనకి సాహిత్యంతో పరిచయం, బాగా చదువుతుంది కూడా. పెళ్ళయిన మూడో రోజే ఒక నిజనిర్థారణకు వెళ్లాను. పండితాపురం పోలీసుకాల్పుల సంఘటన అది.

ఇంట్లో అందరూ నన్ను సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పమని ప్రతిమ మీద ఒత్తిడి తెచ్చేవారు. తను అటు నాకు చెప్పలేక, పెద్దలకు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడేది. నేను హక్కుల ఉద్యమంలో పని ఆపనని చాలా గట్టిగా చెప్పాల్సివచ్చింది. నిజానికి, మొండిగా వాదించడం అనేది నా స్వభావం కాదు. ‘పెద్ద పెద్ద వాళ్లకు ఏమీ కాదు కానీ, మనలాంటి చిన్నవాళ్లకు ఏమయినా అయితే ఆదుకునేవాళ్ళు వుండరు’ అని మా బాపు బాధపడ్డాడు. నేను వినకపోవడంతో తర్వాత ఇంకేమీ అనలేదు. తర్వాతి కాలంలో మొత్తం కుటుంబమంతా నా పనిని అర్థం చేసుకుని చాలా సహకరించారు.

వరంగల్‌ లో ఎంత నిర్బంధం పెరిగిందంటే దానిని వర్ణించలేం. ప్రతిమ డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్తే,  ‘అతను నక్షలైట్ల కోసం తిరుగుతాడు, అతని భార్యకు ట్రీట్మెంట్ ఇస్తే పోలిసుల నుంచి మీకేమన్నా సమస్యలు రావొచ్చని’ డాక్టర్లతో వాళ్లకు తెలిసినవాళ్ళు అనేవారట! అవి విన్నప్పుడు చాలా ఒత్తిడి అనిపించేది. నిజంగా ఏంచేయాలో తోచేది కాదు. పోలీసు నిర్బంధం ప్రభావం అట్లా వుండేది. అనుక్షణం ఒత్తిడే. బయటికెళ్లిన వాళ్లం ఇంటికి తిరిగి వచ్చేవరకూ ఇంట్లో వాళ్లకి చాలా భయం వుండేది. వెనక్కి వస్తామో రామో అని ఎంతో ఆందోళన పడేవాళ్లు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ముందు పోలీసులు ఇంటిమీదికి వచ్చేసేవారు. మా కుటుంబమంతా ఆ పరిస్థితిని భరించారు.

ఆ సమయంలో తెలంగాణలో వారానికి రెండు మూడు మిస్సింగ్‌ కేసులు, ఎన్‌కౌంటర్లు నమోదు అయ్యేవి. నా విద్యార్థులు ఐదారుగుర్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అలాంటి సమయంలోనే ‘85లో డాక్టర్‌ రామనాథంని పోలీసులు హత్య చేసారు. చాలామంది కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతమంది అరెస్టయ్యారు. వరంగల్‌ వదిలి బాలగోపాల్, వరవరరావు హైదరాబాద్‌ వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కడ్నే వరంగల్ లో వున్నాను. మా కుటుంబం మొత్తం అక్కడే వుండటం కూడా ఒక కారణం.

రామనాథం హత్య తర్వాత

ఈ హత్య తర్వాత నిర్భంధం చాలా పెరిగింది. హేమక్క ఒక్కతే పిల్లలతో ఇక్కడ వుంది. నేను తనని పలకరించి రావటానికి వాళ్ళింటికి వెళుతుంటే మధ్యలో సత్యనారాయణ అనే ఇంటలిజెన్స్ ఇన్స్పెక్టర్ ‘నువ్వు వరవరరావు ఇంటికి పోవద్దు, ఇది టౌన్ డిఎస్పి ఆర్డర్’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ఆ సమయంలో వాళ్ళింటికి వెళ్ళటానికి అందరూ భయపడేవారు.

ఒకసారి హేమక్కను బస్ స్టాండ్ కి స్కూటర్ మీద తీసుకెళుతుంటే  పోలిస్ స్టేషన్ ఎదురుగా నిల్చున్న సి ఐ షమీం చూసి, నేను మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు నా స్కూటర్ కి అడ్డంగా జీప్ పెట్టి ఆపి ఎస్పి అరవిందరావు దగ్గరకు తీసుకెళ్ళాడు. సార్ కి ముగ్గురు ఆడపిల్లలు, వాళ్లకు చాలా అవసరాలు వుంటాయి, నేనే జీతం డబ్బులు తీసుకెళ్లి ఇవ్వాలి, మీరు వెల్లోద్దని చెప్పినా గానీ నేను తప్పకుండా వెళ్తూనే వుంటాను అని వాదించాను. ‘జీవన్ వినడు, వదిలేయండి అని ఎస్పి అన్నాడు. కన్నభిరాన్‌ ఎప్పుడూ చెప్పేవారు, “జీవన్‌ ఒక్కడివే వున్నావు, జాగ్రత్త” అని. నా ధైర్యం ఏమిటంటే, మాకేదైనా అయితే చూసుకోవటానికి ఆయనున్నాడు కదా అనే.

1986లో ములుగు దగ్గర పస్రా అనే వూరిలో ఒక లాకప్‌ డెత్‌ జరిగితే, దాని గురించి రాసినందుకు పోలీసులు నన్ను అరెస్టుచేసి తీసుకెళ్లి బాగా కొట్టారు. ఒక రకంగా నేను శారీరిక హింసకు గురయ్యింది అప్పుడే. మా ఇంట్లో వాళ్లను కూడా తీవ్రస్థాయిలో బెదిరించారు. నన్ను పాయింట్‌ బ్లాంక్ లో బెదిరించి ఎపిసిఎల్‌సికి రాజీనామా చేసినట్లుగా రాయించి దాన్ని పేపర్లో ప్రకటనగా ఇచ్చారు. నేను ఎలాంటి స్థితిలో ఆ ఉత్తరం రాశానో ఆ తర్వాత కన్నభిరాన్‌ గారికి, బాలగోపాల్‌కి వివరిస్తూ చాలా పెద్ద ఉత్తరం రాశాను.

అట్లాంటి వాతావరణంలో ఇంక నేను కూడా వరంగల్‌లో వుండే పరిస్థితి లేకపోయింది. ప్రతిమ అక్కడే ప్రభుత్వ టీచర్‌గా చేస్తోంది. నాతో జీవితం పంచుకున్నందుకు తను కూడా ఈ సమస్యలన్నిటినీ భరించింది. నాకు రావలసిన తొమ్మిది నెలల జీతాన్ని కూడా వదులుకుని 1987లో హైదరాబాద్‌కి వచ్చి  సిఐఇఎఫ్ఎల్ లో ఒక డిప్లొమా కోర్స్ లో జేరాను. అప్పుడు జయశంకర్ సార్ అక్కడ రిజిస్ట్రార్ గా చేసేవారు. నిజానికి నాకు డెప్యుటేషన్ మీద వచ్చే అవకాశం వుంది కానీ అత్యవసరంగా జేరాల్సి రావటంతో జీతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అది పూర్తయిన తర్వాత మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయాను. పౌరహక్కుల సంఘం పని మళ్ళీ మొదలుపెట్టాం. మాజీ మంత్రి హయగ్రీవాచారి హత్యకు ప్రతీకారంగా పోలీసులు 1991లో వరంగల్ యూనిట్ కన్వీనర్లలో ఒకడైన అడ్వకేట్ నర్రా ప్రభాకర్ రెడ్డిని హత్యచేసారు. నిర్బంధం మరింతగా తీవ్రమవుతూ వస్తోంది.

జిల్లా కలెక్టర్ బి.పి.ఆచార్య సలహాతో వరంగల్ వదిలి హైదరాబాద్ ఏవి కాలేజీకి డెప్యుటేషన్ మీద వచ్చాను. ఆర్డర్స్ తీసుకుని వెళుతుంటే కలెక్టర్ ‘ఎట్లా హైదరాబాద్ వెళుతున్నావు కదా ఒకసారి ఇక్కడ ఎస్పికి కనిపించి వెళ్ళమని సూచించాడు. నేను ప్రతిమను తీసుకునివెళ్లి ఎస్పీ నాయక్ ను కలిసాను. అతను మాతో చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. చాలా అసహ్యమైన భాషలో తిట్టాడు. పిస్టల్ నాపైకి గురిపెట్టి ‘ఈ క్షణంలో నిన్ను ముండను చేస్తాను’ అంటూ ప్రతిమని బెదిరించాడు. కలెక్టర్ తో ఫోనులో మాట్లాడిన తర్వాత,  ‘సరే హైదరాబాద్ కు వెళ్ళు, అక్కడ నిన్ను రోడ్డుమీద కాల్చి చంపుతా’ అని బెదిరించాడు. ఇంత ఘోరమైన నిర్బంధ పరిస్థితి వల్లే వరంగల్ విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మరోదారి లేకపోయింది.  ఎంతో కష్టం మీద ప్రతిమకు కూడా హైదరాబాద్‌ బదిలీ అయింది. అప్పుడు ఎపిసిఎల్‌సి హైదరాబాద్‌ యూనిట్‌కి కోదండ్‌ కన్వీనర్‌గా వుండేది. కంచ ఐలయ్య, మధుసూదన్‌రాజ్‌…వీళ్లంతా వుండేవారు. పౌరహక్కుల సంఘం కార్యక్రమాలు అక్కడినుంచి కొనసాగించాం.

’92లో ఏవి కాలేజీలో ణా ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సమయానికి జర్నలిస్ట్ రసూల్ ని పోలీసులు హత్య చేసారు. అది ఇంకో అన్యాయమైన కథ. వాళ్ళది భువనగిరి దగ్గర ఒక వూరు. వాళ్ల పూర్వీకులకు చాలా భూములుండేవి కానీ ఆ తర్వాత అక్కడ ఒక రెడ్డి కుటుంబం దాన్ని తమ పేరు మీదికి బదలాయిన్చుకున్నారట! ఈ విషయం రసూల్ కి వాళ్ల తాతే స్వయంగా చెప్పాడు. దానిమీద అతను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఒక కథనం రాసాడు. దానితో అతని ఉద్యగం అక్కడ పోయింది. ఆ తర్వాత  ఉదయం దినపత్రికలో చేరాడు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి జరుగుతున్న కబ్జాల మీద, దానిలో పోలీసుల పాత్ర మీద అతను వరుస కథనాలు రాసాడు. దానికి ప్రతిస్పందన ఎన్ కౌంటర్ పేరుతో జరిగిన హత్య. చాలా అన్యాయంగా చంపేశారు. జర్నలిస్టుల ఆందోళనవల్ల  ప్రభుత్వం గులాం రసూల్ ఎన్ కౌంటర్ కేసుని, అప్పటికే మిస్సింగ్ కేసుల గురించి పనిచేస్తున్న టిఎల్ఎన్ రెడ్డి కమిషన్కు ప్రభుత్వం అప్పజెప్పింది. అయితే ఆ కమిషన్‌ చాలా అన్యాయమైన రిపోర్టును ఇచ్చింది.

దాని మీద అసలు వాస్తవాలతో కూడిన సుదీర్ఘమయిన ఒక బుక్‌లెట్‌ ‘న్యాయమూ లేదు. విచారణా లేదు- రెండోసారి రసూల్‌ హత్య’ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌తో కలిపి తీసుకొచ్చాం. ఇక్కడేం జరిగిందంటే, నేను ఈ కేసుకి సంబంధించిన నిజనిర్ధారణ విషయాలలో పనిచేయటం అనేది ఏవి కాలేజీ యాజమాన్యానికి నచ్చలేదు. ఆ కేసులో వారికి సంబంధించినవారు వుండటం ఒక కారణం. దానితో నన్ను పర్మినెంట్‌ చేయకుండా అక్కడనుంచి వెళ్లిపొమ్మని చెప్పారు.

ఆ తర్వాత పాతబస్తీ యాకుత్ పురలో వున్న ధర్మవంత్‌ కాలేజీలో జేరాను. నేను పౌరహక్కుల కోసం పనిచేస్తున్నానని తెలిసినా గానీ అక్కడి మేనేజ్మెంట్ చాలా సహకరించారు. అక్కడే రిటైర్ అయ్యాను. ఇలాంటి సమస్యలన్నీ అలవాటయిపోయాయి. అయితే, ఎక్కడా కూడా నా సర్వీస్‌ బ్రేక్‌ కాకపోవటంతో ఉద్యోగం నిలబడింది.

పౌరహక్కుల సంఘం నుంచి నిష్క్రమణ, మానవహక్కుల వేదిక ఆవిర్భావం:

‘98 వరకూ…అంటే ఉరిశిక్షలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వరకూ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యనంతర పరిణామాల వరకూ ఎపిసిఎల్‌సిలోనే వున్నాను. అయితే కొన్ని అంశాల్లో పౌరహక్కుల ఉద్యమం తీరుతెన్నుల మీద విమర్శనాత్మకమైన వైఖరి తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సంఘటనలు నన్ను, బాలగోపాల్ ని, మరికొంతమందిని చాలా ఇబ్బందిపెడుతూ వస్తున్నాయి. డిస్ట్రబ్‌ చేశాయి. ముఖ్యంగా కాకతీయ ఎక్స్ ప్రెస్ కాల్చివేసిన సంఘటన. దానిలో 24మంది చనిపోయారు.

ఒక సంవత్సరం తర్వాత అది చేసిన వ్యక్తి పోలీసులకి లొంగిపోయి తామే చేశామనే ‘అసలు విషయాన్ని’ బయటపెట్టడంతో, జరిగిన పొరపాటుకి క్షమించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అప్పుడు పీపుల్స్ వార్‌ పార్టీ ఆ సంఘటన కు బాధ్యత తమదే అని ప్రకటన ఇచ్చింది. అప్పటివరకూ కనీసం మాట్లాడలేదు. ఈ సంఘటనతో పాటు సమూలమైన సామాజిక మార్పుకోసం పనిచేస్తున్నామన్న విప్లవ రాజకీయ పార్టీలు కొన్నిసందర్భాలలో ప్రజలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు కూడా మమ్మల్ని చాలా ఆలోచనలో పడేసింది. ప్రజాకోర్టుల్లో, న్యాయం పేరుతో సామాన్య ప్రజలపై ప్రయోగించిన ఒత్తిడి, హింస ఎంతో ఆందోళన కలిగించాయి.

ఆ సమయంలోనే,  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో ముఖ్యమైనది, ఈస్ట్ యూరోప్ లోని సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమవటం, ఆ సందర్భంగా ఎదురైన ప్రశ్నలు. అలానే చైనాలో తియన్మాన్‌ స్క్వేర్‌లో జరిగిన విద్యార్థుల ప్రదర్శన…దానిమీద అక్కడి ప్రభుత్వం అనుసరించిన దమనకాండ. మన దగ్గరకు వస్తే, కారంచేడు నుండి చుండూరు వరకూ…ఆ తర్వాత కూడా దళితుల మీద జరుగుతూ వస్తున్న కుల దురహంకార మారణకాండలు.

మరో రెండు ముఖ్యమైన విషయాలు…ప్రపంచీకరణ విధానాలతో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, గృహహింసకు గురయి చనిపోతున్న స్త్రీలు. ఒక సంవత్సరంలో వచ్చిన గణాంకాలను పరిశీలిస్తే 270 మంది స్త్రీలు వరకట్న మరణాలకు గురయితే, ఆ సంవత్సరంలో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య 178. రాజ్యం చేస్తున్న హక్కుల ఉల్లంఘనను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామో, అంతే తీవ్రంగా సామాజికంగా జరుగుతున్న హక్కుల ఉల్లంఘనను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం వుందనేది మేము బలంగా భావించాం.

అధికారం వివిధ రూపాల్లో ఎక్కడెక్కడ కేంద్రీకృతమౌతుందో ఆయా అంశాన్నింటినీ వ్యతిరేకించాలని మా వాదన. అలాగే విప్లవ రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలకు రాజకీయకోణం వుంటుంది. వారు తీసుకునే చర్యలపై ప్రతిస్పందన హక్కుల కార్యకర్తలు ఎదుర్కోవాల్సి వస్తోందని మాకెదురవుతున్న అనుభవం. సంస్థలో వీటన్నిటి మీదా ఎప్పటికప్పుడు చర్చ పెడుతూ వస్తున్నాం. పూర్తిస్థాయి చర్చ మాత్రం గుంటూరు సభల్లో జరిగింది.

మీరు నమ్మరు గానీ, ఆ సభలో మేము పెట్టిన అంశాలపై నలభై ఎనిమిది గంటలపాటు చర్చ జరిగింది. దీన్ని ‘గ్రేట్‌ డిబేట్‌’ అని హరగోపాల్‌ ఎప్పుడూ అంటుండేవారు. అయితే మా విమర్శను మెజారిటీ సభ్యులు అంగీకరించకపోవటంతో ఒక ముఫ్పైరెండు మందిమి బయటకు వచ్చి మానవహక్కుల వేదికగా (హ్యూమన్‌ రైట్స్‌ ఫోరమ్‌) మా కార్యాచరణను 1998లో ఒక స్వతంత్ర ఆస్తిత్వం, అవగాహన, ఆచరణతో ప్రారంభించాం.

సమాజంలో అసమానత, అణచివేతలు వివిధ రూపాల్లో స్థిరపడి వుంటాయి. ఇవి హక్కులను అంగీకరించవు. ఈ అణచివేత ఏ రంగాల్లో వున్నా వ్యతిరేకించి పనిచేయాలనేది మా అవగాహన. హక్కుల ప్రాతిపదిక దిశగా పనిచేయాలని అనుకున్నాం. అలాగే, సామాజిక మార్పుకోసం ఉద్యమించే సంస్థలు, రాజకీయపార్టీలు తమ కార్యాచరణలో అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే బహిరంగంగానే వారితో ఈ విషయాలను చర్చించాలని కూడా అనుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచీ ఈ అవగాహనతో పనిచేస్తూనే వస్తున్నాం. బాలగోపాల్‌ తాత్విక ఆలోచనా ధోరణి, నాయకత్వం మాకు చాలా పెద్ద బలం. అయితే 2009లో ఆయన ఆకస్మిక మరణం నాకు వ్యక్తిగతంగానూ, సంస్థాపరంగానూ కోలుకోలేని దెబ్బ. దానిని అధిగమించి ఆయన చనిపోయిన ఈ పదేళ్లలో సంస్థను బలోపేతం చేసుకున్నాం. రెండు రాష్ట్రాలలోనూ మా శక్తిమేరకు హక్కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

పౌర స్పందన వేదిక ఏర్పాటు:

నా ఉద్యమ గమనంలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రాధాన్యత గల అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది.  అది పౌరస్పందన వేదిక ఆవిర్భావం. తెలంగాణ జిల్లాలలో పోలీసుల నిర్బంధం, నక్షలైట్ల కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలు ఇద్దరి మధ్యలో నలిగిపోవడమే కాకుండా సామాజికాభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇబ్బంది ఏర్పడింది. నక్షలైట్ల సమస్యను బూచిగా చూపిస్తూ ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్లి పథకాలను అమలుపరచడం మానుకున్నారు. నక్షలైట్ల అణచివేత పేరుతో పోలీసులు పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులనే కాకుండా ఏమీ సంబంధం లేని అమాయకుల్ని కూడా వేధించడం జరిగింది.

ప్రజాస్వామికవాదులుగా ఈ పరిస్థితిలో జోక్యంచేసుకుని ప్రభుత్వానికి, నక్షలైట్లకు పరిస్థితి తీవ్రత వివరిస్తూ, బాధిత ప్రజల తరఫున మాట్లాడటానికి ఒక ‘’మూడవ గొంతుక” అవసరం అని భావించిన రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ ఎస్.ఆర్.శంకరన్, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావులు “పౌరస్పందన వేదిక” ఆవిర్భావానికి చొరవ తీసుకున్నారు. ఇది 1997లో ప్రారంభమయింది. హక్కులరంగం నుంచి బాలగోపాల్, కోదండ్ వేదికలో వుండాలని వాళ్ళను అడిగారు. బాలగోపాల్ నా పేరు సూచించారు. నాకు గ్రామాలలో అన్ని వర్గాలతో సంబంధాలున్నాయని, పరిస్థితులను చాలా కాలంగా చూస్తున్నానని, కాబట్టి నేను వుండటం సబబు అన్నాడట. వేదికలో ఎస్.ఆర్.శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి, ప్రొఫెసర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్, ప్రొఫెసర్ హరగోపాల్, కన్నభిరాన్, మాజీ ఎంఎల్ఏ పి. జనార్ధనరెడ్డి(జనతా పార్టీ, కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్), జర్నలిస్టులు అనంతకృష్ణ, అఖిలేశ్వరి, నేను, కోదండ్ వుండేవాళ్ళం.

తెలంగాణ జిల్లాలలో ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి ఈ వేదిక తరఫున చాలా ప్రయత్నాలే చేసాం. అన్ని జిల్లాలలో సమావేశాలు, అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజాసంఘాలతో, వార్తపత్రికల సంపాదకులతో సమావేశాలు నిర్వహించాం. నేను దాదాపు ఎస్.ఆర్.శంకరన్ గారి వెంటే ఉంటూ కార్యక్రమాల ఏర్పాటులో, వ్యక్తులను, సంస్థలను గుర్తించే విషయంలో సహాయం చేసేవాడిని. ‘పౌరస్పందన వేదిక’ సాహిత్యం పంచడం కూడా ప్రధాన కార్యక్రమంగా చేసేవాడిని.

ఈ ప్రయత్నంతో చివరకు ప్రభుత్వానికి, నక్షలైట్లకు మధ్య సుహృద్భావం కలిపించి చర్చలు జరిపే దిశగా కొనసాగింది. చర్చలు విఫలం అయినప్పటికీ, “శాంతి” ప్రయత్నం అవసరం అనే భావనను సమాజంలోని అన్ని వర్గాలలో కల్పించామనే సంతృప్తి అందరితో పాటు నాకూ మిగిలింది.

నా స్వభావరీత్యా సంస్థాపరంగానే కాకుండా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా కొన్ని సమస్యలకు స్పందించేవాడిని. ఎవరిదైనా సమస్య వచ్చినపుడు, ముఖ్యంగా పేదప్రజలది అయినప్పుడు దాన్ని నిజాయితీగా పరిష్కరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం కనపడుతుందనే విశ్వాసం నాకు చినవెంకటి సంఘటన తర్వాత అనేక విషయాలలో కలిగింది. వరంగల్ లో విద్యుత్ ఆఫీసు ముందు పిచ్చమ్మ అనే ఒకావిడ చనిపోయిన తన భర్త పెన్షన్ను మంజూరు చేయటం  లేదని ఒక అట్టముక్క మీద రాసుకుని ఒక్కతే రోజుల తరబడి కూర్చుంది. కాలేజికి వెళ్తూ చూసాను కానీ ముందు అంత శ్రద్ధ పెట్టలేదు. ఎవరో మంత్రి వస్తున్నారంటే పోలీసులు బలవంతంగా ఆమెని అక్కడినుంచి లేపడంతో ఆమెని వెళ్లి విషయం ఆరాతీస్తే అసలు సంగతి తెలిసింది.

ఆమె భర్త అక్కడ చాలా చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఆఫీసులో అతని సర్వీస్ రూల్స్ ని సరిగ్గా రిజిస్టర్ చేయకపోవటం వల్ల అతనికి పెన్షన్ రాలేదు. కారుణ్య నియామకం కింద ఆమె కొడుకుకి కూడా ఉద్యోగం రావాలి. కానీ ఈ విషయాలేమీ కార్మిక సంఘాలు కూడా పట్టించుకోలేదు. ఆమెతో అప్లికేషన్ రాయించి ఆఫీసులో ఇప్పించాను. నెలల తరబడి పని జరగలేదు. ఆమె పూర్తిగా నిరాధారమైపోయింది.

అప్పుడు హైదరాబాద్ లో వున్న బాలగోపాల్ ని తీసుకుని విద్యుత్ సౌధకి వెళ్లి అక్కడ ఎపిఎస్ఇబి సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ ఎపివిఎన్ శర్మ గారిని రెండు మూడుసార్లు కలిసాం. ఇంత చిన్న విషయమై వరంగల్ నుంచి వస్తున్నారా అని ముందు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి నేను హైదరాబాద్ లో వున్నప్పుడు మా అమ్మ ఇంటి నుంచి ఫోన్ చేసి ‘నీ వల్ల ఉద్యోగం వచ్చిందని ఎవరో వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్ళారని’ చెప్పింది. అతను పిచ్చమ్మ కొడుకు. మా ఈ ప్రయత్నం వల్ల అతనితో పాటు ఇంకా ఇరవైమూడు మందికి కూడా ఆ డిపార్టుమెంటులో కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు వచ్చాయని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది.

ఇంకో సంఘటన, నిజామాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో సున్నం నర్సిమ్ములు అనే పేరుతో ముగ్గురు వుండేవారు. అందులో ఒకతను ఒక విప్లవ సంస్థలో మిలిటెంట్. పోలీసులు అతననుకుని ఇంకో అతన్ని చంపేశారు. అక్కడ అప్పుడు జాయింట్ కలెక్టర్ గా నా స్నేహితుడు వున్నారు. విచారణలో నా సహాయం అడిగాడు. చాలా కష్టపడి పోలీసుల చర్యను బయటపెట్టగలిగాం. బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం కలెక్టర్ సూచించారు కానీ తప్పు చేసిన పోలీసులకు శిక్ష వేయలేకపోయారు.

సాహిత్యం, సినిమాలతో అనుబంధం:

చదవటం విషయంలో నాకు ఇప్పటికీ కాళోజీ భయం,  దానితో పాటు వచ్చిన అమితమైన ఇష్టమూ వుంటుంది. ఆయనకు చెప్పటం కోసం చదివిన పుస్తకాలు చాలా వున్నాయి. ఖలీల్ జిబ్రాన్ జీవనగీతిక, ఇది కాళోజి అనువాదం చేసారు. ఈ అనువాదం మీద రాచమల్లు రామచంద్రారెడ్డి చాలా కటువైన విమర్శ చేసారు. చాలా చర్చలు కూడా జరిగాయి అప్పుడు.  మహాశ్వేతాదేవి రచనలు, రష్యన్‌ సాహిత్యం, దోస్తోవిస్కీ, గోర్కీ (అమ్మ), ఉన్నవ లక్ష్మీనారాయణ వంటివారి రచనలు చదివాను. ఇంగ్లీషు సాహిత్యంలో సోమర్‌సెట్‌ మామ్‌ రచనలు బాగా ప్రభావితం చేశాయి. అలాగే థామస్‌ హార్డీ నవలలు, విక్టర్‌ హ్యూగో, ఛార్లెస్ డికెన్స్ రచనలు చదివాను. పొయిట్రీలో వర్డ్స్ వర్త్‌, కీట్స్‌, షెల్లీలను అధ్యయనంలో భాగంగా చదివాను. చాలా ఇష్టంగా కూడా వుండేవి.

నేను కాలేజీలో ఉద్యోగంలో చేరాక పిల్లలకు కూడా వీటి గురించి బాగా చెప్పేది. షేక్‌ష్పియర్‌, టాగోర్‌, ఆర్‌.కె నారాయణ రచనలు అన్నీ చదివాను. ముల్క్ రాజ్‌ ఆనంద్‌ అన్‌టచబుల్స్‌, రష్యన్‌ నవల యమా ది పిట్‌ (యమకూపం) చదివాను. అన్నాకెరీనినా నవల చాలాసార్లు చదివాను. బాగా నచ్చిన నవల ఇది.

హక్కుల ఉద్యమంలో కొచ్చాక నాకు బాగా దగ్గరగా అనిపించినవి మహాశ్వేతాదేవి రచనలు. ఆవిడ రచనలలో వున్నటువంటి పరిస్థితులే తెలంగాణలో వుండటం కూడా కారణం కావొచ్చు. ‘ఒకతల్లి’ ఇంగ్లీషులో చదివి చాలా ఏడ్చాను. సరిగ్గా అలాంటి సంఘటనే మా కళ్ళముందు జరిగింది. హన్మకొండలో వుండే సోంనర్సమ్మ కథ కూడా ఇలాంటిదే. ఆమె చిన్న కొడుకు ప్రకాష్ ను హన్మకొండ పోలీసులు వరంగల్ కోర్టులో మా కళ్ళముందే ఎత్తుకెళ్ళి మాయంచేసారు. ఆమె బిడ్డను, ఇంకొక కొడుకును, మనుమడిని కూడా పోలీసులు చంపేశారు.

అలానే తెలుగులో రావిశాస్త్రి రచనలు కూడా బాగా నచ్చాయి. పౌరహక్కుల ఉద్యమంలో భాగంగా పోలీసులు, కేసులు, కోర్టులను నిరంతరం చూడటం, వాటి స్వభావాలు అర్థమవుతున్నకొద్దీ ఆయన ఎంతబాగా వాటిని పట్టుకోగలిగారు అని అనిపించింది. చలం, కొకులను చదివాను కానీ, రచనాపరంగా చలం నచ్చినట్లుగా కొకు రచనలు నన్ను ఎక్కువగా ఆకట్టుకోలేదు. ఆయన రాసిన జీవితానికి, నేను వచ్చిన తెలంగాణ సాంస్కృతిక నేపధ్యానికి చాలా తేడా వుండటం కారణమేమో! తర్వాత కాలంలో నేను వాటిని పెద్దగా పరిశీలించలేదు. అల్లం రాజయ్య, కేశవరెడ్డిల సాహిత్యం మొత్తం చదివాను. పెల్లుబుకిన నక్సలైట్ ఉద్యమం గురించి ‘కాల్లకింది మన్ను కళ్ళల్లో పండింది’ అని అల్లం రాజయ్య ఒకచోట అంటాడు. తెలంగాణ గ్రామీణభాషలో వూరి ప్రజల జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చూపిస్తాడు రాజయ్య. కేశవరెడ్డి ‘చివరి గుడిసె’, ‘మూగవాని పిల్లనగ్రోవి’ చదివినప్పుడు కడుపులో దేవేసినట్లు అవుతుంది. అట్టడుగునవున్న పేదవాళ్ళ జీవితాలను బాగా చిత్రీకరించాడాయన. అలాగే అంపశయ్య నవీన్ నవలలు కూడా – అంపశయ్య, చీకటి రోజులు, సౌజన్య, కాలరేఖలు నాకు బాగా నచ్చినవి.

చాలావరకు ప్రయాణాల్లోనే పుస్తకాలు చదవటం అలవాటు. హక్కుల ఉద్యమం బాధ్యతలు పెరుగుతున్నకొద్దీ సాహిత్యం చదవటానికి సమయం సరిపోవటం లేదు. రిపోర్టులు చదవటానికే ఒక్కోసారి సమయం వుండదు. తెలుగులో వచ్చిన కవిత్వం పెద్దగా చదవలేదు. ఈ మధ్యకాలంలో తెలుగులో నేను చదివిన పుస్తకాలలో బాగా ఆకట్టుకున్నది కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’. క్రిస్టియానిటీకి సంబంధించిన కోణం మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు అనిపించింది.

అలాగే, వై.బి.సత్యనారాయణ రాసిన ‘మా నాయన బాలయ్య’ చాలా నచ్చింది. ఆయన ధర్మవంత్‌ కాలేజీలో మాకు ప్రిన్సిపాల్‌గా వుండేది. ఇలా అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావటం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను. సాహిత్యపరంగా చూస్తే నేను కేవలం చదువరిని. ఆ తర్వాత వాటి గురించి నా విద్యార్థులకు చెప్పటం, అంతవరకే. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు కొంతమంది కలిసినప్పుడు చెబుతారు ‘మీవల్లే పుస్తకాలు చదవటం అలవాటయ్యాయని’. హక్కుల కోణంలో అయితే వ్యాసాలు వెంటనే రాసేస్తాను. అవి చాలా వున్నాయి.

వరంగల్‌ ఫిలింక్లబ్‌ ద్వారా చాలా విస్తృతంగా వివిధ భాషల్లోని సినిమాలు చూసేవాళ్లం అని చెప్పాను కదా! ఇప్పటికీ నాకు ఈ విషయంలో ఆసక్తి ఎక్కువ. అకిరో కురసోవా సినిమాలు దాదాపు అన్నీ చూసాను. ఫెడేరిక్ ఫెలిని, విక్టోరియా డిసికా, సత్యజిత్ రే, మృణాల్ సేన్, గౌతంఘోష్ సినిమాలు చాలా చూసాను. ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడు వివిధ భాషలలోని సినిమాలు చూస్తూ వుంటాను.

మలి తెలంగాణ ఉద్యమం, ప్రస్తుత పరిస్థితులు:

నా చిన్నప్పటినుంచి వున్న అనుభవాలు, తెలంగాణలో గత అరవై ఏళ్లుగా జరిగిన పరిణామాలు, మధ్యమధ్యలో జరిగిన అనేక సంఘటనలు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవల్సిందే అనే అభిప్రాయాన్ని ఎక్కువచేసాయి. మా తమ్ముడు శ్రీకాంత్ కు 1973లో ఆంధ్ర యూనివర్సిటీ లో బి.ఫార్మసీలో సీటు వచ్చింది. అప్పుడు తెలంగాణలో ఈ కోర్స్ లేదు. వరంగల్ ఆర్ఇసిలో తెలిసిన ఒక ప్రొఫెసర్ నుండి లెటర్ తీసుకుని విశాఖపట్నం వెళ్లి మా తమ్ముడిని చేర్పించి రెండు రోజులుండి వచ్చాను.

నెలరోజుల తర్వాత మా తమ్ముడు తిరిగి వచ్చేసాడు. అక్కడ తెలంగాణ విద్యార్థులు ఎవరూ లేరనీ, తనపట్ల చాలా వివక్ష చూపుతూ, అవమానపరుస్తున్నారని చెప్పాడు. సర్దిచెప్పి మళ్లీ పంపిస్తే, అన్నింటికీ ఓర్చుకుని చదువు పూర్తి చేసుకున్నాడు. ఇటువంటి ఎన్నో అనుభవాలు పేరుకపోవడం వల్ల మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా హక్కుల కార్యకర్తలుగా, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి చాలా అంశాలను హక్కుల కోణం నుంచి చూసి మావంతుగా మేం కూడా ఉద్యమానికి దోహదపడ్డాం.

తెలంగాణ ఏర్పడితే హక్కుల రక్షణ, పోలీసు వేధింపుల విషయంలో కొంచం మెరుగ్గా ఉంటుందని ఆశించాం. ఎన్ కౌంటర్లు, లాకప్ మరణాలు, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసల విషయాలపై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని మా సంస్థ తరఫున ముఖ్యమంత్రిని అడిగాం. నిర్ణయం అట్లా వుంచి, మెల్లమెల్లగా తీవ్రమైన నిర్బంధ పరిస్థితులు కల్పించారు. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు వంటి రాజ్యాంగపరమైన హక్కులు కూడా అణిచివేయబడ్డాయి.

గత రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ కోసం కృషిచేస్తూ, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి పోలీసులు అరెస్ట్ చేసారు. ఇది, ఆయన రాజకీయ పార్టీ పెట్టకముందే జరిగింది. ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం మళ్లీ మొదలయింది. ముఖ్యమంత్రి ఎక్కడకు వెళ్తే ఆ ప్రాంతంలో సామాజిక కార్యకర్తలను, హక్కుల కోసం పనిచేసేవారినీ అక్రమ అరెస్టులు చేసారు. ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. హోంమంత్రి, ఇతర మంత్రులెవ్వరూ కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోని పరిస్థితి కల్పించారు.

ఒకప్పుడు ప్రజాస్వామిక సంస్థలకు బాధ్యులుగా వుండి ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా ఈ పరిస్థితిపై మాట్లాడటం లేదు. ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అన్నిరకాల ఉల్లంఘనల విషయంలో వీలైన చోట్ల సమావేశాలు నిర్వహించడం, కరపత్రాలు వేయడం చేస్తున్నాం. ముఖ్యమంత్రికి, అధికార్లకు బహిరంగ లేఖలు రాయవలసి వచ్చింది. ముఖ్యమంత్రికి రాసిన లేఖ విషయంలో ‘మీరెందుకు ఇట్లా రాసారు’ అని అధికారులు మమ్మల్ని ప్రశ్నించారు కూడా!

తెలంగాణ పరిస్థితి ఇలా వుంటే, జాతీయస్థాయిలో చూస్తే గత రెండు దశాబ్దాలుగా హిందూ ఫాసిస్టుశక్తులు బలపడుతూ వస్తున్నాయి. ఒక ప్రయోగంగా బాబ్రి మసీదు కూల్చివేత, గుజరాత్ లో ముస్లింల ఊచకోత జరగటం మామూలు విషయమేమీ కాదు. ప్రజల ఆలోచనల్లో హిందుత్వ భావనను చొప్పించడంలో ఈ శక్తులు విజయం సాధించాయి.

ముస్లింలలో ఒక వర్గమైన “ఖురేషి అసోషియేషన్” అనే సంస్థకు గత నాలుగేళ్ళనుంచి గౌరవ సలహాదారుగా వున్నాను. ఈ కమ్యూనిటీ వాళ్ళు గ్రామాల నుండి పశువులను(ఆవులు కాదు)కొని, హైదరాబాదుకు తెచ్చి మాంసశాలలకు అమ్ముతుంటారు. అలానే మాంసం దుకాణాలను నడుపుతుంటారు. వీళ్ళను “గోసంరక్షణ కమిటీ” పేరుతో హిందుత్వ కార్యకర్తలు నానా ఇబ్బందులు పెడుతుంటారు. వాళ్ళపై దాడులుచేస్తూ వాళ్ళు ప్రభుత్వ నియమాల ప్రకారం తెచ్చుకునే పశువుల్ని కూడా అక్రమంగా గోశాలలకు తరలిస్తుంటారు.

ఆ పశువుల్ని విడిచిపెట్టే విషయమై నేను అధికారులను కలుస్తుంటాను. ఈ విషయంలో డిజిపి దగ్గరనుండి కింది అధికారుల వరకూ చాలా అసహనంగా వ్యవహరిస్తారు. తామే భారతదేశ పశుసంపదను కాపాడుతున్నట్టు, దేశాన్ని ముస్లిముల నుంచి రక్షిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. ముస్లిం, దళిత వ్యతిరేక భావాలు మధ్యతరగతి శ్రేణుల్లో కూడా వ్యాప్తి చెందటం అనేది చాలా విచారకరం. ప్రజాస్వామిక భావాలు కలవాళ్ళంతా, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈ భావాలకు వ్యతిరేకంగా కృషిచేయాలి. ఆ అవసరం ఎంతైనా వుంది.

నేను నడిచిన ఈ గమనంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, అవి లేవనెత్తిన అనేక సామాజిక అంశాలు, వామపక్ష విద్యార్థి, మహిళా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఆదివాసీల పోరాటాలను ఎంతో దగ్గరగా, చాలా సందర్భాల్లో భాగమై వీక్షించడం నాకు లభించిన గొప్ప అవకాశం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, అన్ని ఉద్యమాలకు జవాబుగా రాజ్యం అణిచివేసే పద్ధతుల్ని, అది ప్రయోగించిన క్రూరమైన హింసను కూడా చూసాను.

రాష్ట్రంలో కాళోజీ, కన్నభిరాన్, బాలగోపాల్, వరవరరావు, ఎస్.ఆర్.శంకరన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, కేశవరావుజాదవ్, బొజ్జా తారకం, జయశంకర్, కె.ఆర్.వేణుగోపాల్, కాకి మాధవరావు, వసంత కన్నభిరాన్, రమ మెల్కోటే, ఎం.టి.ఖాన్, జాహెద్ అలీఖాన్ లాంటి సామాజిక ఆలోచనాపరులతో కలిసి పనిచేయడం నా వ్యక్తిత్వం మలుచుకోవడానికి దోహదపడింది.

జాతీయస్థాయిలో మేథాపాట్కర్, అరుణారాయ్, సందీప్ పాండే, హర్షమందిర్ లాంటి ఉద్యమకారులవల్ల, వాళ్ళు పాల్గొంటున్న సామాజిక ఉద్యమాల్లో పాల్గొనటం, వాటితో కలిసి పనిచేయటం కూడా నాకు లభించిన ఒక మంచి అవకాశం. మా గ్రామంలోని నా బాల్య స్నేహితులు అయిలయ్య, అశోక్ కుమార్, రజిత, బాలరాజు, మోహన్, శ్రీనివాస్ ల సాంగత్యం నా జీవిత ప్రథమభాగంలో గాఢముద్ర వేసింది.”

*******

జీవన్ పాతబస్తీ యాకుత్ పురలోని ధర్మవంత్ కాలేజీలో పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ముస్లిం ప్రజలతో వారి సమస్యల మీద చాలా పనిచేసారు. హైదరాబాద్ లాంటి నగరాలలో బస్తీలలో వుండే పేదప్రజల జీవితాలు నిత్యం ఒక అభద్రతలోనే వుంటాయి. కనీస ప్రాథమిక అవసరాలు కూడా వుండవు. అభివృద్ధి పేరుమీద ఏ క్షణాన అధికారులు వచ్చి ఇళ్లు, గుడిసెలు కూలగొడతారో తెలియదు. అలా ఇళ్లు కూల్చినపుడు పరిస్థితి ఎంతో హృదయవిదారకంగా వుంటుంది. సుఖంగా జీవించే మధ్య తరగతి వాళ్లకు ఆ సమస్య ఎంత దారుణంగా వుంటుందో అర్ధంకాదు. ఆదుకునే వ్యవస్థలు వుండవు.

జీవన్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ సమస్యను ఎంతో బాధ్యతగా పట్టించుకున్నారు. నివాస హక్కుల వేదిక ‘ఛత్రి’ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. ఈ పనిలో బ్రదర్ వర్గీస్, అశ్వాక్, బిలాల్ ఇంకా నాతోపాటు ఎంతోమంది భాగస్వాములుగా ఉన్నారు. బస్తీల్లో ఏదైనా సమస్య రాగానే, ఏ సమయంలో అయినా పరిగెత్తడం, వాళ్లకు సహాయం చేయడం అది తన కర్తవ్యంగా భావించుకోవడం నేను జీవన్ లోనే చూసాను. బస్తీలలో కొంతమంది మంది తమ పిల్లలకు జీవన్ అని పేరు కూడా పెట్టుకోవడం చూస్తేనే ఆయనంటే వారికి ఎంత అభిమానమో అర్థమవుతుంది. జీవన్, వర్గీస్ ఇద్దరూ ప్రతి రంజాన్ పండుగకు బస్తీలకు వెళ్లి అక్కడి కుటుంబాలను కలిసినప్పుడు బస్తీవాసుల ఆప్యాయతను, సంతోషాన్ని చూసి తీరాలి!

“గత ఇరవై సంవత్సరాల నుంచి నేను జీవన్ తో చాలా సన్నిహితంగా నివాస హక్కులు, బస్తీవాసుల సమస్యలపై కలిసి పనిచేస్తున్నాను. సమాజపు అంచుల్లోకి నెట్టివేయబడిన ప్రజల హక్కుల కోసం అత్యంత నిజాయితీగా స్పందించే వ్యక్తి. ఏ సమయంలో పిలిచినా వెనుకడుగు వేయరు. ప్రమాదం పొంచి వుందని తెలిసినా సరే వెనుకడుగు వేయని హక్కులనేత. అన్నిటినీ మించి అత్యంత మానవీయమైన వ్యక్తి”  అని హైదరాబాద్ మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్ చెప్పారు. నిజమే! జీవన్ లో అరుదైన మానవీయకోణం వుంది. అది రాజకీయాలకు అతీతం. ఎలాంటి సమస్యలతో వచ్చినా గానీ నా కెందుకులే అని వదిలేయరు. ఇది ఆయనతో కలిసి పనిచేస్తున్న నాలాంటి వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయమే.

బాలగోపాల్ చనిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ లో పెండింగ్ లో ఉండిపోయిన కోర్ట్ కేసులన్నింటినీ సమర్ధవంతంగా వాదించి, దాదాపుగా పూర్తిచేసిన హైకోర్ట్ న్యాయవాది వసుధ నాగరాజ్ అభిప్రాయంలో జీవన్ ఒక ‘జనవారధి’. అండగా నిలిచే ‘ప్రజాగొంతు’.

జీవన్ పనివిధానంలో తనకెదురైన ఒక అనుభవాన్ని గురించి చెబుతూ “చాలాకాలం క్రితం వృద్ధురాలైన ఒక ముస్లిం మహిళ ఇంట్లో అద్దెకు వున్న పోలీసు కానిస్టేబుల్ ఒకతను ఇల్లు ఖాళీచేయకుండా, అద్దె ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నాడు. అతను కోర్టుకి కూడా వెళ్లి ఖాళీ చేయకుండా ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు.

ఆమె ఈ కేసు విషయంలో సహాయం చేయమని నా దగ్గరకు వచ్చింది. అతన్ని కోర్ట్ ద్వారా ఖాళీ చేయించటానికి కనీసం రెండేళ్ళు పడుతుంది. అప్పటివరకు అతని చేతిలో ఆమె అలా ప్రతిరోజూ హింసపడుతూ ఉండాల్సిందే. పైగా ఒంటరి మహిళ. అప్పుడు నేను ఈ విషయంలో, అతను పనిచేసే డిపార్టుమెంటులో పై అధికారుల ద్వారా ఏమన్నా చెప్పించగలుగుతామా అని జీవన్ గారి సహాయం అడిగాను. “పోలీసుల చేతుల్లో హింసకు గురైన ఒక యువకుడికి సంబంధించి ఆ మర్నాడు హోం మినిస్టర్ని కలుస్తున్నానని, నన్ను కూడా తనతో రమ్మని” చెప్పి తీసుకెళ్ళారు.

ఆ యువకుడితో పాటు ఆమెది కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని రాసుకుని అక్కడకు తీసుకువచ్చారు. హోం మినిస్టర్ జీవన్ తో చాలా మర్యాదగా మాట్లాడారు. ఈ రెండు కేసులను విన్న ఆయన వాటిని పరిశీలించమని తన అసిస్టెంట్ కు చెప్పారు. మేము ఆయన్ని కలిసింది కేవలం ఐదు నిముషాలే. ఆ మర్నాడు నా క్లయింట్ ఫోన్ చేసి ఆ పోలీసు కానిస్టేబుల్ ఇల్లు ఖాళీచేసాడు అని చాలా ఆనందంతో చెప్పింది.

నేను నిజంగా నమ్మలేకపోయాను. అదీ జీవన్ గారు ఇచ్చే విజ్ఞప్తి పత్రానికున్న బలం. పోలీసులతో కానీ, అధికార యంత్రాంగంతో కానీ ముడిపడిన కేసులు ఏమైనా వుంటే నేను ముందు ఫోన్ చేసి సహాయం అడిగేది జీవన్ గారినే. సహాయం అంటే ఆ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లటం. ఆ సమస్య పరిష్కారం కోసం వారితో చర్చించడం. జీవన్ లాంటి వ్యక్తులు ఒక వ్యవస్థగా పనిచేయకపోతే చాలా విషయాలు కనీసం వెలుగులోకి కూడా రావు. ఈ అంశాన్ని మనం గుర్తించి తీరాలి” అంటారామె.

జీవన్ ఉద్యోగం నుంచి రిటైరైన సందర్భంలో ధర్మవంత్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ వరవరరావుగారు “జీవన్ ని కేవలం ఏదో ఒక చట్రంలో పెట్టి మాత్రమే చూడలేం. చాలా విస్తృత ప్రాపంచిక అంశాలు తను చేసే పనుల్లో ఇమిడి వుంటాయి. సమాజం పట్ల, పౌరుల హక్కుల పట్ల చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి” అని చెప్పారు. జీవన్ దగ్గరకు వచ్చే వ్యక్తుల సంఖ్యను లెక్కపెట్టలేం. అలా అని ఎక్కడా రాజకీయ నాయకుల్లాగా అట్టహాసమేమీ వుండదు. ఎంత పనైనా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరికీ అండగా వుంటారు.

చివరగా,  గత నలభై సంవత్సరాలుగా ఆయన జీవిత భాగస్వామి ప్రతిమ కూడా ఈ ప్రయాణంలో అనేక ఆటుపోట్లను మౌనంగానే ఎదుర్కొన్నారు. అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ “తను చేసే పని గురించి నాకు ముందు పూర్తిగా అవగాహన లేదు. తర్వాత అర్థమైంది. అతి మంచితనం, అతి సహనంగల వ్యక్తిగా నేను జీవితంలో గమనించాను. ఆయన పనికి నేను అడ్డుచెప్పకుండా, సపోర్ట్ చేస్తున్నానని మా అత్తగారు మొదట్లో అనేవారు. వరంగల్ లో వున్నప్పుడు ప్రతిరోజూ మాకు టెన్షన్ గానే వుండేది. చాలా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. దాన్ని వర్ణించలేను నేను. ఇతరులు ఇబ్బందుల్లో వున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం ఆయన స్వభావం కాదు. అటువంటి వ్యక్తులకు సహాయం చేసే ప్రయత్నంలో తానూ ఇబ్బందులకు గురైన సందర్భాలు కూడా నాకు గుర్తు. ఆయన విలువలతో నిండిన ఒక మంచి మనిషి” అన్నారు.

జీవన్ గారూ, మీరు క్రమం తప్పకుండా హక్కుల కలమై పత్రికల్లో దశాబ్దాలుగా వ్యాసాలూ రాస్తూనే వున్నారు కానీ, ఇంతవరకూ అవి పుస్తకరూపం దాల్చలేదు. అది వాస్తవరూపం దాల్చాలని, మీ తర్వాతి తరానికి అవి అందించాలని కోరుతున్నాం. అలాగే ఈమధ్యనే హరగోపాల్ గారు ‘‘జీవన్, హక్కుల ఉద్యమంలో నీది సుదీర్ఘమైన అనుభవం. వాటిని  రాస్తే, అది అత్యంత విలువైన చరిత్ర అవుతుంది, నువ్వు ఆ పనిని ఆలస్యం చెయ్యకుండా చేయాలి’’ అని అడిగిన దానికి నేనే ప్రత్యక్షసాక్షిని. ఆ పనిని మీరు వెంటనే మొదలుపెట్టాలని, అది తొందరలోనే పుస్తకరూపంలో బయటకు రావాలని ఆశిస్తూ, హక్కుల బాటసారికి ‘యాక్టివిస్ట్ డైరీ’ సెల్యూట్.

*

 

 

 

 

 

 

సజయ. కె

44 comments

Leave a Reply to సజయ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా విలువైన వ్యాసం ఇది..ఒక చరిత్రను మనముందు సజీవంగా చూపించారు..త్యాంక్యూ సారంగ

  • జీవన్ గారి బాల్యస్నేహితుల్లో హరికిషన్ అనే ఆయన పేరు టైప్ లో పొరపాటున delete అయింది. కలిపి చదువుకోగలరు.

  • Activistdairy బాగుంది. మొదటి సారి చదవడం. సజయ. K..mam, అభివందనాలు.మీకు !

  • ఈ మధ్య కాలం లో ఒక పూర్తి స్థాయి కార్యకర్త మనోగతం, సమకాలీన రాజకీయాల సమాహారం ఇంత ప్రతిభావంతంగా రాయగా చదివింది లేదు. సజయ గారి మూలంగా జరిగింది. మానవ హక్కుల వేదిక రాజకీయాలతో తీవ్రంగా విభేదించే నేను. జీవన్ తన కార్యాచరణ లో ఎదుర్కొన్న నిర్భంధం అత్యవసర పరిస్థితి ని తలపించే లా ఉంది.నాడు ప్రజా సంఘాల లో పని చేసిన వారు వరంగల్ వదిలి హైదరాబాదు రావడం మీద చర్చ చేయడం నాకు ఇష్టం లేదు. నిర్బంధం విధించదలుచు కుంటే శత్రువుకు హైదరాబాదు దూరం కాదు. వరంగల్ వదలడం ఒక అనివార్యత గా భావించిన వాళ్ళ సిద్దాంతాలు వాళ్లకు ఉండొచ్చు గాక, ఆ మాట కొస్తే వరంగల్ హైదరాబాదు కు ఎంత దూరమో, హైదరాబాదు కూడా వరంగల్ కు అంతే దూరం.ఇన్ని నిర్భందాలు తట్టుకొని నిలబడ్డ బుర్రా రాములు నాకు నిలువెత్తు ఆదర్శంగా కనబడుతున్నాడు. ఇవే జ్ఞాపకాలు రాములన్న రాస్తే ఎంత బాగుండేది అనిపించింది. చరిత్ర నిర్మాణం లో రాళ్లు ఎత్తిన కూలీలు రాములు అన్న, ఎం టి ఖాన్ లాంటి వాళ్ళు అనామకంగా మిగిలి పోవడమే విషాదం. ఆ పని నాలాంటి వాళ్ళు చేయాలి అనుకున్నా వాళ్ళ వాళ్ళిప్పుడు లేరు. అనామకంగా వాళ్ళ చరిత్ర కాలం లో కలిసి పోయింది. విజేతల చరిత్రలు నిర్మించే మనం పరాజితుల చరిత్ర అందునా సీరియస్ నిర్మాణాల లో ఉన్న వాళ్ళ ప్రభావ వంతమైన బ్రతుకు రాయాల్సి ఉండే. వాళ్ళు కూడా విస్మ్రుతులు అవుతున్నారు అదే బాధ

    • థాంక్యూ సీతారాములు గారు. మీరు చెప్పినట్లు చరిత్రలో కి ఎక్కని అజ్ఞాత వ్యక్తులు ఎంతో మంది. మనకు తెలిసిన వారి గురించి వారు చనిపోయి వుంటే , వారి సమకాలీనుల ద్వారా, స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా reconstruct చేయటమొక్కటే మార్గం. కె. లలిత తన తల్లిదండ్రుల గురించి ఆనాటి రాజకీయ పరిస్థితులు గురించి “అంతం వరకు అనంతం” అనే పుస్తకం లో అలాగే reconstruct చేశారు. బుర్రా రాములన్న, ఎం. టి. ఖాన్ సాబ్ ల గురించి మీలాంటి వారు పూనుకుంటే చాలా శక్తి వంతమైన చరిత్ర వెలుగులోకి వస్తుంది. ఎం.టి.ఖాన్ సాబ్ సమకాలికులు కూడా చాలా పెద్ద వయసులో వున్నారు. ఎంత తొందరగా వారితో మాట్లాడగలిగితే అంత మంచిది. లేకపోతే సమాచారం కాలగర్భంలో కలిసిపోతుంది.

      • థాంక్స్ మామ్ మీరు గారు అని దూరం పెట్టడం నచ్చలేదు ఇక ముందు కూడా చేయరని. ఇక పోతే activist డైరీ అందునా హక్కుల కార్యకర్తల తో మీ ఉద్యమ అనుభవాలు చెప్పే తీరు నిజంగా కొత్తగా ప్రభావంతంగా ఉంది.విలువైన జ్ఞాపకాలు ఇవి. ఇంకొంత మంది తెలియని వ్యక్తుల గురించి రాస్తారని ఆశ. అందుకే ఖాన్ సాబ్ రాములన్న ప్రస్తావన చేశా.

  • మానవ హక్కుల నేత, బాలగోపాల్‌ గారికి ఉద్యమ సహచరుడు, మానవ జీవితం, మానవ సంబంధాల పట్ల అత్యంత గౌరవం కలిగిన అరుదైన వ్యక్తి, స్నేహశీలి జీవన్ తో కె. సజయ గారి సంభాషణ మొదటి భాగం ’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్ “ యాక్టవిస్టు డైరీ “ శీర్షికన “ (https://magazine.saarangabooks.com/jan15-69%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5/ ) .

    జీవన్ అనుభవాల సమాహారం రెండవ భాగం ‘ఏం పుస్తకం చదివినవురా’ సజయ గారి “ యాక్టవిస్టు డైరీ “ శీర్షికన.

    పై వివరణలు గుర్తుకు తెచ్చిన శ్రీ రమేష్ గారికి ( సెల్‌: 984 879 9092 ) . . . . సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ గారికి కృతజ్నతలు .

    • థాంక్యూ రామయ్య గారు. మీరు మాట్లాడారని రమేష్ చెప్పారు.

  • థాంక్స్ పద్మ గారు. మొదటి భాగం జనవరి 15, 2019 సంచిక లో వచ్చింది చూడండి.

  • ” చరిత్ర నిర్మాణంలో రాళ్లు ఎత్తిన కూలీలు రాములు అన్న, ఎం టి ఖాన్ లాంటి వాళ్ళు అనామకంగా మిగిలి పోవడమే విషాదం. ఆ పని నాలాంటి వాళ్ళు చేయాలి అనుకున్నా . . . ”

    డా. గుఱ్ఱం సీతారాములు గారూ! రాములు అన్న, ఎం టి ఖాన్ ల గురించి మీరు వ్యక్తపరిచిన వేదన ఎందరిలోనో ( నా లాంటి అనామకుడు, అనర్హుడిలో కూడా ) ప్రతిబింబిస్తున్నది. సజయ గారిలా మీరూ ప్రతిభావంతంగా రాయగలరు. వాళ్ల గురించి రాయడానికి దయచేసి ప్రయత్నించండి.

  • చదువుతున్నఅంతసేపు…జీవన్ గారి ఉపన్యాసమొ సంభాషనో వింటున్నట్లే ఉంది! సరళంగా . చదవాలనిపించేలా రాసావు వ్యాసాన్ని సజయ!
    Activist డైరీ చాలా అవసరం. Activist లు వాళ్ళగురించి వాళ్ళు రాసుకోడమో చెప్పుకోడమో చెయ్యరు. వాళ్ళకి రాదు కూడా. మీలాంటి వాళ్ళు ఈ విధంగా డాక్యుమెంట్ చేయడం చాలా అవసరం సమాజం కోసం! అందుకు,
    సారంగ వేదిక కావడం సంతోషం.

    • థాంక్యూ సుమిత్ర. సాధ్యమైనంత వరకూ రాస్తాను.

  • చాలా విలువైన వ్యాసం. కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది మీరు రాసింది చదువుతూంటే. నిజంగానే పుస్తకం రాస్తే బాగుణ్ణు. Salute to both of you.

    • థాంక్యూ నిత్యా. జీవన్ గారికి మీ అభిప్రాయం తెలియజేస్తాను.

  • Wonderfully written article Sajaya garu. You have an excellent style in depicting the story. I recall many of the incidents and the trauma that people like Jeevan garu had to undergo. Your narrative has great literary touch to it and I expect all these diaries to be published as a book. They are nostalgia, history and literature and must be recorded.

    • Thank you Swamy. Many experiences from different walks of life are there to be documented. Hope I can do atleast few.

  • An extraordinary account an extraordinary person.

    People who are unfamiliar with the course of the Telugu society that was heavily influenced and in turn influenced the society and the generations to come should follow this “Activist Dairy” coloumn regularly. The first in the series to be recorded is the relentless, tireless Human Rights work of Jeevan Sir.

    I have a small snippet to share here. When we met the Resident Editor of The Hindu for Andhra Pradesh on some work he told us that for a long time (some 25 years or so) he was under the impression that Jeevan sir does only ‘this’ (which he meant Human Rights activism as part of both then APCLC and HRF) work and nothing else.Only much later he came to know that he was also an English lecturer!

    The biggest regret for people of our generation is that we cannot even imagine the turbulent times of the ear gone-by. The spring thunder that had shaken the Telugu society, the overwhelming participation of people from more or less all walks of the society, the repression, hardships, the endless difficulties they have to endure, the new understandings that have developed in the course of their never ending work, the bitter struggles and ‘Great Debates’ that have taken place .After all these, today they are continuing their work as silently and ardently as they had for almost 4 decades without any itch for recognition (which is the norm in today’s social media facilitated flamboyant, attention-seeking, absolutely nothing worth in substance, mutual back scratching cacophony) and the additional work of pampering and guiding the new generation of activists.

    Thanks Sajaya gaaru.

  • సజయ గారూ! కొన్ని ఆవేదనలను, అవి కలిగించే కొన్ని ఆవేశాలు నన్ను హద్దు మీరేలా చేస్తాయి. అందుకే జీవన్ అన్నతో మాట్లాడాను. తనను మీరు అద్భుతంగా ఆవిష్కరించిన విషయం చెప్పి వాటిని చదవమని చెప్పాను. కా. కౌముదిగారబ్బాయి అఫ్సర్ నడుపుతున్న అంతర్జాల పత్రిక సారంగ లో చూడమని, చదవమని చెప్పాను.

    డా. గుఱ్ఱం సీతారాములు గారూ! బుర్రా రాములన్న, ఎం. టి. ఖాన్ సాబ్ ల గురించిన సమాచారం కాలగర్భంలో కలిసిపోకుండా వివరాలు సేకరించటానికి జీవన్ అన్న మీకు తన వంతు సాయం అందిస్తానన్నారు. వారి సమకాలీకులను, సాటి పెద్దల వద్ద నుండి వివరాలు, విలువైన సమాచారం సేకరించి సజయ గారికి అందిస్తే “ యాక్టవిస్టు డైరీ “ శీర్షికన తీసుకొస్తారేమో ఆలోచించగలరు.

    • రామయ్య గారు, తప్పకుండా రికార్డ్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. వారిద్దరితో నాకు కూడా మంచి అనుబంధం వుంది.

  • జీవన్ గారు ఎంతో సాదా సీదాగా కనిపిస్తారు! దూరం నుంచి చూడడమే గానీ మాకు తెలియని ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నదున్నట్లు అతి సహజంగా చూపించావు సజయా! మనుషుల మెరుగైన బతుకుల కోసం తపన పడేవాళ్ళు ఏమాత్రం కీర్తికాంక్ష లేకుండా ఎంత నిశ్శబ్దంగా పని చేస్తారో అర్ధమైంది.ఆశ్చర్యంగా ఆయనకిష్టమైన సినిమాలన్నీ నేనూ చూశాను. ఇప్పుడు యువతరం సినిమాల మీద శ్రద్ధ చూపుతున్నారు.ఊరూరా ఫిల్మ్ క్లబ్ లు వెలిసి మంచి ప్రపంచ సినిమాల ద్వారా యువతని ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుందేమో!

  • Thanks Jeevan for sharing the articles.
    Your memories have thrown insight into your association with friends, colleagues, activists and the way you looked at the society, surroundings and perceived the same, the backdrop in which we were grown, the conditions that were emerging then and despite the untiring efforts and struggle the way the things have taken shape which are all laced beautifully.

    And Kudos to Sajaya and the Web journal!

    ( I think using the word Publisher may not be appropriate in the case of Web journals.)

    • The above comment is by K.Ashok Kumar, Jeevan’s childhood classmate.
      Native of Waddepally.
      He retired as Inspector General of Post offices,
      Govt.Of India.

  • In the face of such shape and weight of present misfortune, the voice of the individual artist may seem perhaps of no more consequence than the whirring of a cricket in the grass, but the arts do live continuously, and they live literally by faith; their names and their shapes and their uses and their basic meanings survive unchanged in all that matters through times of interruption, diminishment, neglect; they outlive governments and creeds and the societies, even the very civilizations that produced them. They cannot be destroyed altogether because they represent the substance of faith and the only reality. They are what we find again when the ruins are cleared away. And even the smallest and most incomplete offering at this time can be a proud act in defense of that faith.” – Katherine Ann Porter
    *————*—-*—-*
    The above comment is by M.Vishweshwar,a social thinker,a software management person.
    A staunch supporter of Telangana,hails from Karim Nagar.

  • చాలా బాగుంది… గుండె కు హత్తుకుంది.థ్యాంక్స్ .
    Nellutla Ramgopal,
    Andhra Bank Officer(Retd)
    Chinna Pendiyal,
    Warangal

  • వరవర రావు సార్ మీ గురించి చెప్పిన అభిప్రాయాలే నేను కూడా ఒక సారి మా ఫ్రెండ్స్ తో చెప్పాను.
    మీరు నాకు ఇన్స్పిరేషన్ సార్ .

    నటరాజ్ ,
    మానవ హక్కుల కార్యకర్త చిక్కడపల్లి

  • యాక్టివిస్ట్ డైరీ రెండు భాగాలు చదివిన. జీవన్ గురించి ఎన్నో ఇదివరకు తెలువని సంగతులు తెల్సినయ్. సమాజ సేవలొ కేవలం మానవతా వాదానికే కట్టుబడి ఉండి. ప్రాణాలను లెక్క చేయకనిరంతరంగా పని చేయడం చాలా గొప్ప విషయం.జీవన్ మాకు తెల్సు అనే అనుకుంటున్నంకాని నాకు తెలువని జీవన్ చాలాచాలా గొప్పవాడు వ్యక్తిగా సమాజంలొ అట్ల బతకడం కష్టమైన పనిఏ పార్టీతో టి సంబంధం లేకుండా అణచబడ్డ వ్యక్తుల కో సం పని చేయడం మామూలు విషయం కాదు.జీవన్ గారి బయొగ్ర ఫీ పూర్తిగారావాలె. వినమ్రంగా చెట్లు క్షుధార్తులకు ఫలాలిచ్చినట్లు మేఘాలు వర్షించనట్లు ఎవరి మెప్పుకొసమొ కాకుండా తను నమ్మిన మానవతా సిద్దాంతంకొసం పనిచేసుకు పొతున్నడు. కొన్ని సఘటనలు తను కార్యకర్త గానే చెప్పుకున్నాడుఅంతటా .కొన్నచొట్ల. 1946 లొ ఫొర్ట్ వరంగల్ లొ గూండాలు పెండాల్ కాలబెట్టినాక ఎంక్వైరీకి వచ్చిన సూబేదార్అడ్జదిడ్జంగా మాట్లాడుతుంటే క్యా బక్ రహా హై అని గల్లాపట్టిన కాళొజీ యాదికి వచ్చిండు పో రాటపటిమను జీవితలక్ష్యంగా పని చేస్తున్నజీవన్ శ్రీమతి ప్రతిమనూ అభినందించక తప్పదు ఏద ఏమైనా జీవన్ బయొగ్ర ఫీ పూర్తిగా బయటకొస్తే వరంఙల్ లొ జరిగిన ప్రజా పో రాటాల చరిత్రంతా తెలుస్తుంది—రామశాస్త్రి
    మిత్ర మండలి, కాళోజి ఫౌండేషన్ ,వరంగల్

  • జీవన్ సార్ సారంగా వచ్చిన మీట్ జీవిత విషయాల గురించి చదివి ఏడ్చాను.నేను మీtho కలిసి ఫిలిం సొసైటీ లో పని చేసినప్పుడు నాకు ఆ సంస్థ గురించి చాలా విషయాలు నేర్పించారు. వరంగల్ లో మీరు పడ్డ ఇబ్బందులు కొన్ని నేను చూసాను.
    కానీ ఇంత లోతుల్లోకి వెళ్లి వ్ తెలుసుకోలేదు.
    మీరు నాకు పరిచయస్తుడుగా ఉన్నందుకు గర్విస్తున్నాను .
    సజయగారు మిమ్మల్ని బాగా చిత్రీకరించింది
    శ్యామ్ సుందర్,
    ఆర్ అండ్ బి రిటైర్డ్ ఉద్యోగి, వరంగల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి ,
    హనంకొండ

  • సౌమ్యుడైన సాదా సీదాగా ఉండే జీవన్ సార్ మాకెరుక . మానవ హక్కుల కోసం ఎదో చేస్తున్నాడూ అనుకొనేవాళ్ళమే గాని ఇంత తీవ్రంగా గన్ చేతబట్టకుండానే పోరాటాలు మనవ హక్కులకోసం ఉద్యమాలు chesinda అని సంభ్రమాశ్చర్యం గలుగుతుంది ఒక దిక్కు పోరాటం మరో దిక్కు వృత్తి అయిన విద్యార్థుల పై తన అభిప్రాయాలూ రుద్దకుండా మరియు ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నం చెయ్య కుండానే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించినారు . కధనం చదువుతుంటే స్పైడర్ మాన్ లేక ఒక రాబిన్ హుడ్ సినిమా చూస్తునట్లు ఉన్నది . ప్రజల్లో కలసి ఎంతో సౌమ్యుడిగా ఉండే వ్యక్తి సామాన్యుడి హక్కుల కోసం అష్ట కష్టాలు పడి ప్రాణాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టి వ్యక్తి ఈయనేనా మా సారె నా అని ఆశ్చర్యం గల్గుతున్నది & నేను వారితో కలసి పనిచేయలేకపోతినేమి సిగ్గేస్తుంది. థాంక్స్ సర్.

  • 🙏 చాల బాగుంది సార్!! It is very humbling and moving. Knowing you for the last 20 years( 98?) has been an educative human experience for me.
    Only guilty thing is- beyond words-many people like me , although reap benefits from, dont help in your noble efforts. Regards,
    Chukka Srinivas,
    California,US

  • I just read your memoir in Saranga written by Sajaya. Very interesting and well written. Happy to be working with you.

  • జీవన్ గారు, రెండూ చదివా. చదివిన దగ్గరనుండి ఏం రాద్దామన్నా వెలితి గానే అనిపిస్తోంది. ఈ వ్యాసాలు చదివాక మీ నిబద్దత పట్ల గౌరవం రెట్టింపయింది. కొద్ది రోజులైనా మీతో పనిచేసే అవకాశం వచ్హినండుకు చాలా సంతోషం గా గర్వంగా ఉంది. మీ రచనల ప్రచురణ కోసం ఎదురు చూస్తూ….
    Raghu, Premjee Foundation,Banglore

  • జీవన్ నాకు సోదరుడు. మేమిద్దరం స్కూల్లో క్లాస్ మేట్స్ మి. మంచి స్నేహితులం. జీవన్ అంతరంగాన్ని చదివి దాదాపు కొన్ని నిముషాలు నిశ్శబ్దంగా రోదించాను. ఇంతకాలంగా సన్నిహితంగా వున్నా, ఆయన జీవితం గురించి, ఆయన నమ్మిన విశ్వాసాల ప్రకారం నడుచుకోడానికి పడ్డ బాధలు నాకు ఎప్పుడూ ఇంత వివరంగా చెప్పలేదు. నేను ఉద్యోగరీత్యా జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు, ఆ ప్రాంతాలకు వచ్చినపుడు కలిసేవాడు . ఫోన్ లో మాట్లాడే వాడు. కానీ, ఇంత వివరంగా చెప్పలేదు. అవి చదివి జీవన్ కు ఫోన్ చేసి ఏడ్చాను.
    జీవం కథనం ఇంత బాగా రచించిన జర్నలిస్ట్ సజయ గారికి అభినందనలు.
    కె. కృష్ణ మూర్తి, విద్యుత్ శాఖ నుంచి విశ్రాంత ఇంజనీర్, నారాయణపురం, జనగాం.

  • జీవన్ గారు నాకు CKM కళాశాలలో సహచరుడు. నేను గ్రూప్2 పరీక్ష పాసై రెవెన్యూ సర్వీస్ లో చేరిన తర్వాత ప్రజల సమస్య లపై నన్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చేవాడు. చాలా నిబద్ధతతో వ్యవహరించే మనిషిగా నాకు తెలుసు. కానీ, సారంగ లో కథనం చదివిన తర్వాత చాలా విషయాలు తెలిశాయి. వరవరరావు లాగానే ఆయన జీవితంలో తాను నమ్మిన విశ్వాసాల కనుగుణంగా నడుచుకోడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. మా కుటుంబం లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా జీవన్ పరిష్కారం కోసం ప్రయత్నం చేశాడు. జీవన్ గురించి ఇన్ని విషయాలు వివరంగా చెప్పిన సజయ గారికి కృతజ్ఞతలు.
    డాక్టర్ పి.లక్ష్మీనారాయణ (IAS-retd), వరంగల్.

  • ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా ఈ పరిస్థితిపై మాట్లాడటం లేదు. ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోలేదు. 

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు