కథలో ప్రధాన పాత్రకు కలిగే అదాటు కనువిప్పుతో లేక అనుకోని జ్ఞానోదయంతో ముగించే నిర్మాణపద్దతికి సంబంధించి సొదుం జయరాం, చాసోల కథల్ని పరిశీలించాం. కథలోని పాత్రల స్వభావం గురించీ, ప్రవర్తన గురించీ లేక సన్నివేశాలగురించీ కలిగే మెరుపు ఎరుకను నిర్మించే ఈ పద్ధతి మూలాలు James Joyce కథల్లో ఉన్నాయ్. Katherine Mansfield మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. James Joyce తన కథల్లో తాను పాటించిన ఈ టెక్నిక్ ని epiphany అని పిలిచాడు. దాన్ని గురించి తనే ఇలా చెప్పాడు. A moment of insight, discovery, or revelation by which a character’s life is greatly altered. This generally occurs near the end of the story. కథ చివర ఇతరులెవరో మాట్లాడుకునే మాటల్ని విన్నప్పుడు ప్రధాన పాత్రకు కలిగే తటాలు కనువిప్పు, తక్షణ జ్ఞానోదయం మొత్తం కథను తిరిగి నిర్మించటంలోనే ఈ కళా రహస్యం ఉంది. అందుకే దీన్ని A sudden spiritual manifestation in overheard fragments of conversation అని కూడా చెబుతాడు Joyce.
Joyce రాసిన కథల్లోAraby , The Dead అనే కథలు గొప్ప కథలు. Araby లో ఒక టీనేజ్ బాలుడికి కథ చివరిలో కలిగిన ఎరుక ఇతివృత్తం.
తన స్నేహితుడి అక్కను చూసి ఆకర్షితుడైన ఈ అబ్బాయ్ రోజూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె తనతో మాట్లాడిన ప్రతిసారీ మైమరుపుకు గురవుతాడు. ఒక రోజు ఆమె పలకరించి Araby అనే మార్కెట్ బజారు చాలా బాగుంటుందని చెబుతుంది. అతన్ని అక్కడకు వెళ్లి చూడమంటుంది. తను రాలేనని చెబుతుంది. ఇంట్లో అనుమతి పొంది ఆ అమ్మాయికి ఏదన్నా గిఫ్ట్ కొందామనే ఆలోచనతో ఈ అబ్బాయ్ araby వెళతాడు. అక్కడ ఒక షాప్ లోకి వెళతాడు. సేల్స్ గాళ్ తనను పట్టించుకోకుండా వేరే ఇద్దరు కుర్రవాళ్ళతో ఏవో కవ్వించే మాటలు మాట్లాడుతుంది .
ఆ సంభాషణ విన్న ఈ బాలుడు ఒక రకమైన ఉద్వేగానికి లోనౌతాడు. కోపం , అవమానం తో మండిపోయి ఎదో జ్ఞానోదయమైనట్లుగా వచ్చిన పని కూడా మరిచి ఇంటిదారి పడతాడు. ఆ కొత్త ఎరుకలో తాను అప్పటివరకూ ఇష్టపడుతున్న అమ్మాయి పట్ల ఆకర్షణ కూడా మాయమౌతుంది. ఈ epiphany విధానాన్నే ‘చెదపురుగు ‘కథలో మరింత సృజనాత్మకంగా వాడాడు సొదుం జయరాం. కథ ముగింపులో శేషమాంబ చెప్పిన మాటలు విని కథకుడు ఎంత దిగ్భ్రమ చెందుతాడో మనకు తెలిసిందే. అలాంటి దిగ్భ్రమ
పాఠకులకి కలిగించటంలోకూడా జయరాం సఫలీకృతుడయ్యాడు.
Katherine Mansfield రాసిన Miss Brill కథలో ఒక వృద్ధురాలికి కలిగిన అనుభవం ఇలాంటి దిగ్భ్రమకు చెందిందే. ఆదివారం పార్కులో జరిగే వేడుకలో పాల్గొనడానికి చక్కగా ముస్తాబై తనకున్న ఫర్కోట్ తొడుక్కుని వెళుతుంది. అక్కడి యువతీ యువకుల్నీ, సంగీతాన్నీ , దృశ్యాల్నీ ఆనందిస్తుంది. ఆ సమయంలో తనపక్కనున్న ఇద్దరు ప్రేమికులు తమ గోప్యతకు ఆమె అడ్డు వచ్చినట్లుగా మాట్లాడుకోవడం వింటుంది. ఆమెని, ఆమె తొడుక్కొచ్చిన కోటునీ ఏహ్యంగా చూస్తారు. ముసలిదానికంత అవసరమా అన్నట్లు మాట్లాడుకుంటారు.
Why does she come here at all– who wants her? Why doesn’t she keep her silly old mug at home ?
It’s her fur coat which is so funny, It’s exactly like a fried whiting
Ah, be off with you
ఇలా సాగిన ప్రేమికుల సంభాషణ వృద్ధురాలి మనఃస్తితిని పూర్తిగా మార్చుతుంది.
తనలాంటి వాళ్ళను యువత ఇలా చూస్తుందనే కొత్త స్పృహ ఆమెను అశాంతిపాలు చేస్తుంది. కలచి వేస్తుంది. ఇంటికెళ్లి మ్రాన్పడుతుంది. సరిగ్గా ఇదే స్థితిని’ వాయులీనం’
కథలో రాజ్యం ఎదుర్కొంటుంది. తనన్నా తన అభిరుచులన్నా తన భర్తకున్న చిన్న చూపు తన ఫిడేలును ఆయన అమ్మివేసినప్పుడు ఆమెకు అర్ధమౌతుంది. ఈ కథలో ముగింపు సంభాషణ ఉండదు. రాజ్యం తనలో తాను మాట్లాడుకోవడం ద్వారా తన మెరుపు ఎరుకను బయటపెడుతుంది. చాసో గొప్ప గుప్తతతో కధను నడిపి ముగింపులో పాఠకుల మతి పోగొడతాడు.
ఇలా James Joyce పరిచయం చేసిన ఎపిఫనీ ని మన కథకులు మరింత ప్రతిభావంతంగా వాడిన ఉదాహరణలు చాలా వున్నాయ్.
*
|
కృతజ్ఞతలు, తెలియని విషయం , గురించి, వివరణ.బాగాచెప్పారు. Sir!
మీ, విశ్లేషణ బాగుంది, sir, వాయులీనం, నాకు బాగా నచ్చిన కధ. మిగతావి, ఇప్పుడే chadivanu. కృతజ్ఞతలు. మీకు !