ఎన్ని ఆటంకాలున్నా ఈ ప్రయాణం ఆగదు

ఈ కాలంలోనే అప్పటికి కథలు విరివిగా రాస్తున్న ఒక రచయిత, ‘మీరు కథలు వెయ్యకపోతే కథలు రాయడం మానేస్తా,’ అనే బెదిరింపులాంటి వైరాగ్యపు ఫోన్‌ కాల్‌ నన్ను చాలాకాలం వెంటాడింది.

ప్రతి సంవత్సరం తెలుగులో వస్తున్న అసంఖ్యాక కథల్లోంచి ఆణిముత్యాలను ఏరి కథా వార్షిక సంచికలను 1990 నుండి కథాసాహితి సంపాదకులు పాపినేని శివశంకర్ వాసిరెడ్డి నవీన్ లు తీసుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కథ 2024 ఆ వరుసలో వస్తున్న 35వ సంకలనం. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం నిరాటంకంగా వస్తున్న సిరీస్ లలో బహుశా ఇది రెండవది అనుకుంటా.

ఈ సంకలనంలోని కథలను గమనిస్తే ఒక సమాజపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, వర్తమానత కనబడుతుంది. సాహిత్యం చరిత్రను పునర్లిఖిస్తుందనేది అందరికీ తెలిసిందే. ఈ కథాసాహితి లోని కథలు తెలుగువారి చరిత్రను పునర్లిఖిస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చిన కథల్ని చదవడం వాటిలోంచి కొద్ది కథల్ని ఎంచుకోవడం సామాన్యమైన విషయమేమి కాదు. ఆ కథల ఎంపికకు వారు ఏర్పరచుకున్న ప్రమాణాలు, ఎంపికలోని సాధకబాధకాలు వారితోనే మాట్లాడుదాం.

నవీన్ గారూ ముందుగా మీరు చెప్పండి. కథావార్షిక సంచికల ప్రారంభదినాలను గుర్తుచేయండి.

*1985లో హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ సంకలనం ‘కథ 60-85’ కోసం కథలు వెతికే క్రమంలో పడిన కష్టం నుంచి వచ్చిన ఆలోచన ఈ కథావార్షిక సంకలనాలు. అప్పటికి నేను జనసాహితి సంస్థలో చురుగ్గా       ఉన్నాను. కార్యదర్శిని కూడా. అందుకే ఈ ఆలోచనని జనసాహితి కార్యవర్గం ముందు ఉంచితే, రెండు మూడు సమావేశాలయ్యాక కుదిరే వ్యవహారం కాదని తేలిపోయింది. కానీ ఆ ఆలోచన బుర్రలో స్థిరంగా నిలబడిపోయింది. 1990 నాటికి ఇతర కారణాలవల్ల జనసాహితి నుంచి బయటికి వచ్చాక ఈ ఆలోచన మళ్లీ పురుడు పోసుకుంది. శివారెడ్డి, హరి, చలసాని ప్రసాదరావు, చేకూరి రామారావు వంటి పెద్దల ప్రోద్బలంతో రంగంలోకి దిగాను. మరో సంపాదకుడిగా ఉండవలసిందిగా పాపినేని శివశంకర్‌ని సంప్రదించాను. ఆయన్నే ఎందుకడిగానంటే దానికో కారణం ఉంది.

1980లో జనసాహితి సాహిత్య పాఠశాలలో కథమీద తన ఉపన్యాసం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్నుంచీ తనతో సాన్నిహిత్యం పెరిగింది. 1983లో వచ్చిన తన ‘హింసరచన’ కథతో శివశంకర్‌ కథారచయితగా కూడా మంచి గుర్తింపులోకి వచ్చాడు. అలా ఇద్దరి ప్రయాణం మొదలైంది. 1991 మార్చి నెలలో ఇద్దరం సరే అనుకుని కథల ఎన్నిక మొదలుపెట్టి 15 కథలతో ‘కథ 90’ సంకలనాన్ని తయారుచేసి, 1991 డిసెంబర్‌ 28నాడు హడావుడిగా, శివారెడ్డిగారితో రోజూ కలిసి కూర్చునే ద్వారకా హోటల్లోనే ఆవిష్కరణ అనుకున్నాం. అందరికీ కబుర్లు వెళ్లాయి. యాభైమందిమి చేరాం. ఆ రెస్టారెంట్‌ టేబుళ్లన్నీ మాతోనే నిండిపోయాయి. అప్పటికప్పుడు అనుకుని పెద్దలు చేకూరి రామారావుగారితో ‘కథ 90’ని ఆవిష్కరింప చేశాం. దానికి శివశంకర్‌ రాలేదు. కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, హరి, చలసాని ప్రసాదరావు, కోడూరి కాశీ (ప్రముఖ దర్శకుడు రాజమౌళి పెద్దనాన్న)తో సహా అనేకమంది సాహితీ ప్రముఖుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరిగింది. 160 పేజీలు, వెల 17 రూపాయలు. ఇంత తక్కువ రేటా అని ఆశ్చర్యపోయి, ఒకరిద్దరు ఇది వచ్చే సంవత్సరం నాటికి వచ్చేనా అని నాతోనే అన్నారు. దానితో పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలే ఇలా ముప్పైÛ అయిదేళ్లపాటుగా నడిపిస్తోంది.

1990లోనే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘ఈ వారం కథ’ శీర్షిక మొదలైంది. ప్రతి కథ ఒక అద్భుతంలా ఉండేది. ఇవికాక ఇతర పత్రికల్లో వచ్చిన కథలన్నీ కలిపి, సంకలనంలోకి రావలసిన మంచి కథలు దాదాపు అరవై వరకు ఉన్నాయి. ఎన్నిక మహా కష్టమైంది. ఏదీ వదలబుద్ధి కాదు. మళ్లీ ఆరోజులు రావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాయన్న నమ్మకమూ ఉంది. ‘కథ 91’కి వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టి, ఆగస్ట్‌ నాటికి సంకలనం తయారైంది. ఆగస్ట్‌ 38న అనంతపురంలో మధురాంతకం రాజారాం ఆవిష్కరించారు. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కోచోట ఆవిష్కరించే సంప్రదాయం అలా మొదలైంది. మూడు నాలుగేళ్లు గడిచేసరికి క్రమం తప్పకుండా సంకలనాలు తేగలమని సాహితీప్రియులందరికీ నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఎక్కువ సంతోషంగాను, కొంత గర్వంగా కూడా ఉంది.

ముప్పైఅయిదేళ్ల ప్రస్థానంలో జ్ఞాపకం చేసుకోవలసిన ప్రధానమైన అంశాలను వివరించండి.

* అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కథాయాత్రలు. ‘కథ 94’ ఆవిష్కరణ కోసం 1995లో గోదావరిఖనికి వెళ్లాం. దాదాపు ముప్పైమందికి పైగా కథకులు, కథాప్రియులు రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యారు. ఆవిష్కరణ అయిపోయిన మర్నాడు అందరం బొగ్గుగనుల్లోకి వెళ్లాం. జీవిత కాలంలో మర్చిపోలేని అనుభవం అది. ఇప్పటికీ అనేకమంది రచయితలు ఆ యాత్రను గుర్తుచేస్తూ ఉంటారు. అప్పట్నుంచి వీలైనప్పుడల్లా రెండురోజుల కార్యక్రమం ప్లాన్‌ చేసి, రచయితలందరం యాత్రకి వెళ్లేవాళ్లం. కొత్తగూడెం నుండి పాపికొండలు, విశాఖ నుండి అరకు, తిరుపతి నుండి తిరుమల- ఇలా చాలాచోట్లే తిరిగాం. బెంగుళూరు, ఢిల్లీలో కూడా ఆవిష్కరణలు జరిగాయి. ఇవన్నీ తీపి జ్ఞాపకాలే. అలాగే ‘కథ 2014’ తెనాలిలో 300 మందికి పైగా ఉత్సాహవంతులైన విద్యార్థుల మధ్య 20 సెప్టెంబర్‌ 2015న ఆవిష్కరణ జరిగింది. ఆ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా చర్చలో సైతం పాల్గొనడం ఎప్పటికీ ఉత్తేజాన్నిచ్చే జ్ఞాపకమే. ఇలా ఎన్నో జ్ఞాపకాలు, ఎంతోమంది మిత్రులను సంపాదించి పెట్టింది ఈ ముప్పైఅయిదేళ్ల కథాయాత్ర.
కథాసంకలనాలు మొదలుపెట్టి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పటివరకూ వచ్చిన 272 కథల నుంచి ఎన్నిక చేసిన ముప్పై కథలతో ‘రెండు దశాబ్దాలు’ పేరిట ఒక సంకలనాన్ని ప్రచురించాము. దీనికి జంపాల చౌదరి, ఎ.కె. ప్రభాకర్‌, గుడిపాటి సంపాదకులు. ఈ సంకలనం రెండు వేల కాపీలు వేసిన మూడు నెలల్లో అయిపోవడం ఎప్పటికీ గుర్తుండే మరో జ్ఞాపకం.

ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పటివరకు వెలువడిన 337 కథలతో 2600 పేజీల పాతికేళ్ల కథ సంకలనం రెండు భాగాలుగా మనసు ఫౌండేషన్‌వారు ప్రచురించడం, ఆ సభ హైదరాబాదులో కొంతమంది పాఠకులు, ప్రచురణకర్తలు చర్చలో పాల్గొనడం మరో మంచి జ్ఞాపకం.

కథావార్షికల ప్రచురణలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ఆందోళనల గురించి చెప్పండి.

*  ఇవికూడా తక్కువేమీ లేవు. 1991 నుండి ఆరేడు సంవత్సరాలు ప్రచురణలో ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురిచేశాయి. ఏమైనాసరే, ముందుకెళ్లాల్సిందే అనే మొండితనమే వాటిని అధిగమించేటట్లు చేసింది. ఈ కాలంలోనే 1999లో తానాలో సాహిత్య అభిమాని జంపాల చౌదరిగారి ఒక్క ఫోన్‌ కాల్‌ ఆ ఇబ్బందులను చాలావరకు తొలగించింది. ఆ సహకారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ కాలంలోనే అప్పటికి కథలు విరివిగా రాస్తున్న ఒక రచయిత, ‘మీరు కథలు వెయ్యకపోతే కథలు రాయడం మానేస్తా,’ అనే బెదిరింపులాంటి వైరాగ్యపు ఫోన్‌ కాల్‌ నన్ను చాలాకాలం వెంటాడింది. ఆ తర్వాత చాలాకాలంపాటు ఆ రచయిత కథలను ఒకటికి రెండుసార్లు ప్రత్యేకంగా చదివేవాడిని.

1990వ దశకం భారతదేశాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మలుపుతిప్పిన దశకం. నూతన ఆర్థిక విధానాలు, అప్పటికే మొదలై తీవ్రంగా చర్చించబడుతున్న మండల్‌ కమిషన్‌ ప్రతిపాదనలు, అన్నిటికన్నా ముఖ్యంగా అప్పుడే ఊపిరి పోసుకుంటున్న అస్తిత్వవాద ఉద్యమాలు బలపడి స్త్రీవాద ఉద్యమం, మరోవైపు ఉధృతంగా సాగుతున్న దండకారణ్య విముక్తపోరాట విప్లవోద్యమం-ఎన్‌కౌంటర్లు… ఇలా సమాజం తీవ్ర మార్పులకు లోనవుతున్న దశలో మా యీ ప్రయాణం మొదలై ముందుకు సాగింది. ఈ ప్రభావాలన్నీ నామీద, ప్రచురించే కథలమీద, కథా సంకలనాలమీద తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి.

2000 సంవత్సరంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలై 2010 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఈ కాలంలోనే తెలంగాణ ప్రాంత రచయితల కథలకు ఈ సంకలనాల్లో అన్యాయం జరుగుతోందనే వాదన ముందుకొచ్చింది. నామీద విమర్శల జడవాన మొదలైంది. అదెంతవరకూ వెళ్లిందంటే, నవంబర్‌ 2010లో హైదరాబాదులో జరిగిన ‘కథ 2009’, తానావారు ప్రచురించిన ‘రెండు దశాబ్దాలు’ ప్రత్యేక సంకలనం ఆవిష్కరణలను ఆపాలనే ప్రయత్నం వరకు వెళ్లింది. ఈ స్థాయి అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు, అవమానాలు గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. కథకు ముందు దాదాపు పదిరోజులు నిద్రలేని రాత్రులతో గడిపాను. సభ జరగనివ్వమని ప్రకటనలు వెలువడ్డాయి. సభలో కరపత్రాలు పంచారు. సభికులే లేరని ప్రచారం చేశారు. ఈ గందరగోళం అంతా తెలిసిన పోలీసువారు సభ జరిగే తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తిష్ట వేశారు. వారిని మేమే పిలిపించామని ప్రచారం కూడా జరిగింది. ఎవరెన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా దాదాపు రెండువందల మందితో సభ అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిది¸గా వచ్చిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌ నిక్కచ్చిగా మాట్లాడారు.

తెలంగాణ ప్రాంత కథల విషయంలో ఇప్పటికీ ఆ వత్తిడి సెగ తగుల్తూనే ఉంది. అయితే ఇవేవీ శివశంకర్‌కి పెద్దగా తెలియవు. నేనుండేది హైదరాబాదు కాబట్టి ముందుగా ఈ ప్రకంపనలన్నీ నన్నే తాకేవి, ఇప్పటికీ తాకుతూనే ఉన్నాయి. అందుకే నావరకు నేను తెలంగాణ కథలను ప్రత్యేక దృష్టితో  ఒకటికి రెండుసార్లు చదువుతా, మంచి కథలు తప్పిపోకూడదని.

ఇప్పుడు మా ముందున్న ప్రధానమైన సవాలు కథల కొరత. పత్రికలు కనుమరుగైపోవటం వల్ల, ఉన్నవాటిలో అరకొర కథలు రావటం, అవీ బక్కచిక్కిపోయి రావటం, మొత్తంగా కథల సంఖ్య తగ్గటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. మంచి కథలు రాయగలిగిన ఒక తరం రచయితలు రాయటం తగ్గించటం, కొత్త తరం రచయితలు ఇప్పుడిప్పుడే రావటంవల్ల, వచ్చినవారికి కథానిర్మాణంలో నైపుణ్య లోపం వల్ల మంచి కథల కొరతను ఎదుర్కొంటున్నాం. 1990 దశకంలో ఎన్నిక కష్టసాధ్యమయ్యేది. ఇప్పుడు మంచి కథల అన్వేషణ కష్టంగా ఉంది. ఈ స్థితి మరికొంతకాలం ఉండచ్చు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. నాలుగైదు కథాసంకలనాలు వచ్చాక, విమర్శలు మొదలయ్యాక ‘కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి’ అనే కారా మాష్టారు మాటలు అప్పటికీ ఇప్పటికీ ఎంతో ధైర్యాన్ని, ఊరటని ఇచ్చేవి.

అలాగే నిరంతరం ఈ ప్రయాణం సాగాలన్న ఆలోచన నుంచి పుట్టిందే మరొకరి సహాయం తీసుకోవాలనే ఆలోచన. దీంట్లో భాగంగా గత సంవత్సరం నుండి కథావిశ్లేషకుడు ఎ.వి. రమణమూర్తిని మూడవ వ్యక్తిగా సంపాదకవర్గంలోకి తీసుకున్నాం. రమణమూర్తి గత కొన్ని సంవత్సరాలుగా కథలను సేకరించే పనిలో నిమగ్నమై కథానిలయానికి కూడా చేదోడువాదోడుగా ఉన్నారు. వీలైతే త్వరలో దీన్ని విస్తరించి కలకాలం సాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆలోచన.

ఏది ఏమైనా వీటన్నిటి మధ్యన నిలబడి ఒక్కొక్కసారి ఏటికి ఎదురీదుతూ వత్తిడులు, అవమానాలను అధిగమించి ముందుకు సాగుతున్నందుకు ఆనందాన్ని అనుభవిస్తూ, ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ సాగే ఈ ప్రయాణం మాత్రం ఆగదు అని ఘంటాపధంగా చెప్పగలం.

*

శివశంకర్ గారూ ఇప్పుడు మీరు చెప్పండి . కథల ఎంపికలో మీరు నిర్దేశించుకున్న ప్రమాణాలు ఏమిటి? వాటికి విరుద్ధంగా ఎప్పుడైనా కథలను ఎంపిక చేయాల్సి వచ్చిందా?

*కథ 2000 లో CREDO అనే ముందుమాటలో కథాసాహితి ప్రమాణాల గురించి వివరించాను. జీవన పోరాటాన్ని, అనుభవాన్ని సుసంపన్నం చేసేవీ, శిల్ప సమగ్రత గలవీ గొప్ప కథలని కథాసాహితి భావిస్తుంది. విషయ ప్రమేయం తప్ప వ్యక్తి ప్రమేయం లేదు. ప్రసిద్ధ అప్రసిద్ధ రచయితలనే తేడా లేదు. వివిధ జీవిత సిద్ధాంతాలను వాదాలను ధోరణులను పట్టించుకుంటాం. ఆయా రచయితల కులమతాలు, వర్గాలు, ప్రాంతాలు ముఖ్యం కాదు. ఈ సంకలనాల్లో కనపడే వివిధ వర్గాలకు చెందిన 450 కి పైగా ఉన్న రచయితల లిస్టే ఆ సంగతి చెబుతుంది. ప్రాతినిధ్యం మరీ తగ్గుతుందనుకున్న చోట కాస్త వెసులబాటుతో ఆలోచిస్తాం. సుదీర్ఘమైన చర్చల తర్వాతే ఒక కథ ఎన్నిక ఉంటుంది.

కథల ఎంపికలో ఇద్దరు సంపాదకుల మధ్య వచ్చిన విభేదాలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకునేవారు?

* వచ్చిన విభేదాలు కాదు రాని విభేదాలు ఏంటని అడగండి. అందరూ అనుకునేట్టు ఇది అన్యోన్య దాంపత్యం కాదు. కలహాల కాపురం. మా ఇద్దరికీ స్వరూప స్వభావాల్లో పోలికే కుదరదు. స్వభావరీత్యా నాది పల్లెటూరితనం, తనది నాగరికం. ఒక రచయిత్రి సరదాగా అన్నది ఆయన నవీనులు, మీరు సనాతనులు అని (నూరు శాతం కాదు లెండి).

నవీన్ కథల్ని సూక్ష్మంగా పరిశీలించగలడు. కాస్త వామపక్ష భావజాలం. టెక్నిక్, శైలి లాంటి అంశాల్లో కొత్తదనం వెంటనే ఆకర్షిస్తుంది తనని. రచనల్లోని మెళుకువను పట్టుకోగలడు. కథారచయితగా ఇంకొన్ని లోపలి మెళుకువలు, అంతర్గతమైన ఆల్కేమి నేను గ్రహించగలను. కథ అంతస్సారం గురించి ఆలోచిస్తాను. తాత్వికత గురించి ఆలోచిస్తాను.

వస్తు వైవిధ్యంతో పాటు రూప వైవిద్యం ఇద్దరికీ ఇష్టమే. కథలన్నీ సేకరించి విడివిడిగా చదువుకున్నాక ఇద్దరికీ నచ్చినవి కొద్దిగా ఉంటాయి. ఒకళ్ళకే నచ్చిన వాటి గురించి తీవ్రమైన చర్చలు, పోట్లాటలు, బాహబాహీ ఉంటాయి. కొన్ని సర్దుకుంటాము. అప్పటికీ తేలకపోతే మరొక పరిశీలకుడికి ఇచ్చి ఆయన అభిప్రాయం పాటిస్తాం. ఒకళ్ళు గెలవడం అనేది కాదు, అంతిమంగా మంచి కథను ఎన్నుకోవటమే మా లక్ష్యం. విభేదాలు తప్ప వైషమ్యాలు లేకపోవడం వల్ల, స్థూలంగా మంచి కథల్ని ప్రేమించడం వల్ల ఈ ద్వంద్వం ఇలా సాగిపోతూ ఉంది.

అయితే ఎన్నుకున్న కథలు ఏ పదిహేనో ఉంటే మరికొన్ని మంచివి మా దృష్టికి రానివి ఉండవచ్చు. ఒక్కోసారి ఫలానా కదా మిస్ అయ్యాము అనిపిస్తుంది. పాఠకులు, రచయితలు ముందుగానే వారి చూపులో మంచి కథలు మా దృష్టికి తేవచ్చు. ఎవరి దృష్టి కోణం, స్వీయ ప్రాధాన్యం వారికి ఉంటుంది కాబట్టి రచయితల వైపు నుంచి ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దాన్ని అర్థం చేసుకోగలం.

కథల ఎంపికలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన కొన్ని సందర్భాలను చెప్పండి.

* ఎప్పటికప్పుడు కొత్త రచయితల్ని గుర్తించటానికి ప్రయత్నిస్తాం. ప్రతి సంకలనంలోనూ నలుగురైదుగురు కొత్త వాళ్లే ఉంటారు.  ‘కథాసాహితి’కి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఇందులో తమకథ వచ్చినందుకు చాలా సంతోషపడతారు. వాళ్ళ సంతోషం మాకు సగం బలం.

కథే మాకు ముఖ్యం. రచయిత పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కావు. కనుక ఏమంత గుర్తింపు లేని రచయితల కథల్ని పట్టుకుంటాం. అట్లా ఎక్కడో మారుమూల ప్రచురితమైన అప్రసిద్ధ రచయితల కథల్ని వెలుగులోకి తెస్తుంటే వాళ్లతో పాటు మాకు తృప్తి కలుగుతుంది. ఏ కథలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సంకలనాలు వరుసగా చూస్తే అర్థమవుతుంది.

నిజానికి ఈ కథాసాహితీ సంపాదకత్వం నా మటుకు నాకు తలనొప్పి పని. ఇది నూర్పిడి కార్యక్రమం. సృజనాత్మకత లేనిది. ఎంత నిజాయితీగా చేస్తున్నా అడపాదడపా విమర్శలు వస్తూనే ఉంటాయి.పాఠకులు అద్భుతంగా ఆదరిస్తున్నందుకు సంతోషం కలుగుతుంది.

అయితే ఎల్లకాలం ఈ బరువు మోయగలమా? సమర్థులైన యువకులు దొరికితే ఈ బాధ్యత వాళ్ళకి అప్పగించి గౌరవ స్థానంలో కూర్చుందామని మా ఆలోచన.

*

బండ్ల మాధవరావు

2 comments

Leave a Reply to Nagabhushanam Sunkara Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు