ఎదారక ముందు మన వాడ కథ!

ప్రజల్నిసంస్కరించాలనీ, ఆధునికీకరించాలనే ఆతృతలో వాళ్ళ భాషనీ, హృదయ స్పందననీ వినడం మానేశారు. దానితో ప్రజలూ, గ్రామీణులూ అవిద్యావంతులనీ, నిరక్షరాశ్యులనీ వారికి నేర్పాలనే గోల పెరిగింది.

“అబ్బుడు మావూర్లో అందరమూ అందరి కోసం అన్నట్టు బతికితిమి. అనెంక మాకోసం మేమే అనే దినాలొచ్చె. ఇబ్బుడు నాకోసం నేనే అనే కాలం నడుస్తా ఉండాది”, అని తన జీవిత కాలంలో వచ్చిన మార్పుని మూడు విధాలుగా విభజిస్తారు, ఎండపల్లి భారతి ముందుమాటలో.

మనిషి అంటేనే “గేపకాలు”(ఙ్ఞాపకాలు).  ఙ్ఞాపకాలు అనేవి వట్టి నిర్జీవమైన అంకెలని గుర్తుకుపెట్టుకోవడంతో సమానమైనవి కావు. కథలకు మూలమైనవి  ఙ్ఞాపకాలే. నేను అనే వునికికి కానీ, మేము అనే వునికికి కానీ మూలం ఙ్ఞాపకాలే. నిజానికి ఆధునిక మార్పులు యీ ఙ్ఞాపకాలకు వుండే ప్రాధాన్యాన్ని తగ్గించి వేస్తున్నయి. వొకప్పుడు వూరు బతికినది యీ గేపకాల తలపోత మీదే. చిట్టచివరి కథ, ’ఎదారిబతుకుల”లో శామలత్త కేక పెడ్తుంది. “ఏమండ్రా, నా బట్టగుంపా, ఊర్లో మనుసులే లేరేమిరా అందరూ సచ్చినారా”.

వూరు ఎలా చనిపోయింది? బాధల వల్లనా, నైరాశ్యం వల్లనా, వేదనాభరితమైన ఙ్ఞాపకాల వల్లనా? కాదు, కానే కాదు. నిజానికి ఆనందం , బాధ అనేవి మానవ జీవితాన్ని ఖాలీగా మార్చవు. వినోదాన్ని పంచుతానన్న టీవీ గ్రామాన్ని మృతప్రాయంగా మార్చేస్తుంది. ఎంతో వివక్షని, హింసని, బాధని, వ్యసనాలని, భరిస్తూ వచ్చిన “వూరు”వుమ్మడితనం ఆధునిక వినోద సాధనం కిందపడి నుజ్జునుజ్జౌతుంది.

టీవీ రాక ముందు , వూరు పూర్తిగా ఎదారక ముందు( గుండె తడి ఆరక ముందు) ఆ మాదిగ వాడ యెలా వుండేది అనేదే యీ కథా గుచ్చం. అందుకే ఎండపల్లి భారతి యీ పుస్తకంలో చివరిగా రాసిన కథ ఎదారి బతుకులు. పుస్తకం పేరు కూడా అదే.

అంటే ఎదారి పోయినపుడు గేపకాలు నిలచిపోతాయి. జీవితం ప్రవాహశీలతని కోల్పోతుంది. వూరు మరణిస్తుంది. ఆధునిక మార్పులు జీవలక్షణాన్ని చంపేస్తున్నాయి.

జయ అనే గ్రామస్తురాలు అంటుంది. పెండ్లయిన కొత్తలో అత్త, మొగుడు పట్టించుకోకపోతే గ్రామమే సాకింది. వూళ్ళోని ఏ యింటికైనా వెళ్ళి అన్నం తినే చనువు వుండేది. ఆ పరిస్థితి నశించింది.

” ఒక కాకికి పది మెతుకులు కనబడితే, ఆ మెతుకుల కాడికి పోయి మూతి పెట్టదు. నోరంతా తెరిసి యింకొక పది కాకుల్ని పిలుస్తాది. మన వూరు కూడా అట్లుండే ఆ కాలం పోయింది.” గంగులవ్వ మజ్జిగ కతలోలా పాడిని అమ్ముకోవడం కాక అందరికీ పంచి ఆనందించే కాలం వెళ్ళిపోయింది.

వూరినీ, మనిషినీ, పశుపక్ష్యాదులనీ వొకేవొక సమగ్ర చిత్రంగా చూపుతారు భారతి. కాల మార్పుని కూడా మొత్తంగా చూపుతారు. ( రాళ్ళనే స్త్రీ పురుషులుగా చిత్రిస్తూ వొక ప్రేమకథని షార్ట్ ఫిల్మ్ గా తీసారు భారతి)

“జెర్సీ గొడ్లు నీళ్ళు చల్లితే పాలు సేపుకి వదులుతాయి. అదే దేశావులయితే అట్లా బిడ్డ సచ్చిపోతే, సచ్చిన బిడ్డ తోలుని యెండబెట్టి, దాంట్లో వరి గడ్డి కుక్కి దూడ మాదిరి బొమ్మని చేసిపెడితే, దాన్ని చూస్తా, నాకుతా గానీ అవి పాలు పిండనిచ్చేవి కాదు. ఇబుడేమీ లేదు. నీళ్ళూ చల్లితే సేపుని వదులుతాయి.”

దేశీ లక్షణాలు కోల్పోయి అంతా కృత్రిమ నాగరికత చోటు చేసుకోవడం గురించి సహజంగా చిత్రిస్తాయి యీ కథలు. పశువులూ, మనుషులూ మొత్తం ప్రకృతే తన సహజత్వాన్ని కోల్పోతూ వస్తుంది. ఇదే బాధని విశ్వనాథ సత్యనారాయణ కూడా వ్యక్తం చేయడం జగద్విదితమే.

“ఆవులయితే పేయదూడను కనల్ల. ఆవులు కోడె దూడలను ఈనితే అమ్మేస్తారు. ఆడోళ్ళు ఆడబిడ్డను కంటే ఆరుపోరు పెడతారు”. యీ పరిణామానికి కారణం మడకలతో సేద్యం చేసేపని పోయి ట్రాక్టర్లు వచ్చెయ్యడమే. అంతేకాదు వొకప్పుడు “ఆవుల మిందికి సూడి కట్టేదానికి ఎద్దులు మేపుతా వుండిరి. ఇబ్బుడంటా సూదులతో బిడ్డలు కనేస్తుండాయి”.

పశువులలో,  ప్రకృతిలో వచ్చిన కృత్రిమ మార్పు మనుషులని వదలిపెడ్తుందా? టీవీ రూపంలో వూరినిమింగేసింది. టీవీఆధునిక యంత్ర భూతానికి వొక ప్రతీక మాత్రమే.

వినియోగ సంస్కృతి గ్రామాలమీద చూపుతున్న ప్రభావం తక్కువేమీ కాదు. కొంగొత్త వస్తు ప్రపంచం మోజులో తమ సంతానం దుబారాకి దిగడాన్ని ముసలివాళ్ళు జీర్ణం చేసుకోలేరు. రూపాయలని కూడబెట్టి దాచిపెడ్తారు. కానీ ప్రభుత్వమే నోట్లరద్దుకు దిగడంతో దిక్కు తోచదు.

“గంటేసి ముడేసి, కూడేసి యిచ్చిపొయ్యేది మీకే కదా నాయనా. అబ్బుడున్నెట్లు ఉండారా ఇబ్బుడు. దుడ్డూ దుగ్గానీ చేర్చి అంత నేల కొనుక్కుందాం, అంత కొంప కొనుక్కుందాం అనుకుంటూ ఉండారా”, అని ప్రశ్నిస్తుంది ముసలిది. “చేతిలో రూక పడితేనే టీవీలు, ఫోన్లంటూ … ఇంకా అయ్యేమేమో వాటి పేర్లు గూడా మానోటికి వచ్చే లేదు”

నోరు తిరగని పేర్లతో ముంచెత్తుతున్న వస్తు ప్రపంచం. “పల్లెకన్నీరు పెడుతుందో”, అని గోరటి వెంకన్న నెత్తీ నోరూ మొత్తుకున్నది యిందుకే.

ఆధునిక మార్పులు సాంస్కృతికంగా శూన్యం నింపడాన్ని కూడా ప్రస్తావిస్తారు. సమే దాసరి కథలో, వొకప్పుడూ మొక్కు తీర్చుకోవడానికి మధ్యవర్తిగా ఉండే సమే దాసరి అసలు గ్రామాల్లో కనపడకుండాపోయాడు. “వాకిట్లో గరడగంబం ఎత్తుకొని  సమేదాసరి నిలబడుకోని ఉండాడు. ఆయన్ని చూసి నా ముకం వెలిగిపోయింది తలకు పీత, చెక్కల దోవతి, నొసటన మూడు నామాలు, నడి మద్దెన తిరువణి, గొంతుకు వేలాడుతుండే సెంకు, ఒక సేతిలో జాగిటి, ఇంకొక సేతిలో గరుడగంబంతో సోచ్చాత్తూ వెంకట్రమణ సామే వచ్చినట్లు ఉండాడు”

కానీ యిప్పుడూ కానరావడంలేదు, అని చెప్పడం ద్వారా వొక సాంస్కృతిక శూన్యాన్ని కళ్ళముందు నిలుపుతారు.

నిజానికి ఆధునిక విద్య నాగరికత పెంచిన అఙ్ఞానాన్నీ, మూఢవిశ్వాసాల్నీ తుంచివేసి నిజమైన ఙ్ఞానాన్ని పొందడానికి ఎండపల్లి భారతి రాసిన పల్లెకతలు చదవవలిసిందే.

యీ కతల్లో ఆవుతో తనకి గల అనుబంధం గురించి చక్కగా చిత్రించారు యండపల్లి భారతి. గేదెలూ, దున్నపోతుల ప్రసక్తి ఎక్కడా కనపడదు. “కారణం ఏమిటీ”,  అని భారతి గారిని ప్రశ్నించాను. గేదెలు చాలా సుకుమారమైన జంతువులు అని, చల్లదనం , నీళ్ళూ ఎక్కువగా వున్నచోటే బతికి బట్టకట్టగలవు అనీ సమాధానం చెప్పారు రచయిత్రి. అందుకే కోస్తాలో బర్రెలు ఎక్కువగా కనపడతాయి అనీ, రాయలసీమలో ఎక్కువగా కనపడవు అన్నారు. ఆవుని దేవతగా చూసే హిందుత్వవాదులకు గానీ, ఆవుని బ్రాహ్మడితో పోల్చే కంచె ఐలయ్యలాంటి ప్రొఫెసర్లకిగానీ గ్రామాల గురించి ఏమీ తెలియదు. వాళ్ళది యింగ్లీషు చదువులు తెచ్చిన అఙ్ఞానం.

గేదె పెరుగుతో భోజనం పెట్టమని కోరుతూ కాళిదాసు రాసిన సంస్కృత చాటువు  వొకటి ప్రసిద్ధిలో ఉంది. ఎందుకంటే గేదె అనేది నీళ్ళు పుష్కలంగా వుండే ప్రాంతంలో పెరిగే ఖరీదైన జంతువు. ఆవు పేద, బడుగు జంతువు. కాటన్ దొర ప్రాజెక్టు వల్ల నీళ్ళు లభించడంతో గోదావరి జిల్లాల్లో గేదెల పెంపకం పెరిగింది. ఆ విధంగా వలసవాదులు కూడా గేదెల పెంపకానికి కారణమయ్యారు. యిప్పటికీ మెట్టప్రాంతాల్లో ఆవుల పెంపకం ఎక్కువ. ఆవుకి, మనిషితో అనుబంధం కూడా ఎక్కువ. ఆవు మాత్రమే మెడ నిమరమని మోర ఎత్తుతుంది. అందుకే ప్రాచీనకాలం నుంచీ ఆవుకథలే కానీ గేదె కథలు లేవు.

ఐతే ఆవుల పెంపకమే కాదు. ఆవు మాంసం దళితుల ఆహారం అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి యీ కథలు. వారికి అందుబాటులో వుండే చౌకయైన ఆహారం అదే. “మా యన్నసదువు”, అనే కతలో తినుబండారాలు కొనుక్కోవడానికి డబ్బులు లేని మాదిగ పిల్లవాడు ఆవు మాంసం తునకల్ని బడికి తెచ్చుకొని తింటూ బడిపంతులకి దొరికిపోతాడు. బాగా కొట్టడంతో భయపడి పోయి చదువు మానేస్తాడు.

గొడ్డుమాంసం అనేది దళితుల ఆహార సంస్కృతిలో విడదీయరాని భాగం. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడేవారు వారి ఆహార సంస్కృతిని కూడా గౌరవించాలి.

“ఏమి తునకలమ్మా, తునకలా ఇవి, ఉత్త జుబురు తునకలు గానీ . చేతిలోకే రావు. జారి జారి పోతా ఉండాయి. ఇవి గొడ్డువేనా అని. ఏదో ఎనుపు గొడ్డుది. పుట్టిన దూడని కోసేసినట్లుండారు. వీటిని చూసి గొడ్డుతునకల మీద బెమ లేకుండా పోయింది. మా కాలంలో అయితే కరుపూరం ఉన్నట్లుండేది. కొవ్వు ఒకటి, తునక ఒకటి తింటూ ఉంటే అంత బాగుండేది”.

స్థలకాలాలు సాపేక్షమైనవి. మనం నిలబడిన చోటును బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి వాటి డైమన్షన్స్ వుంటాయి.  మాదిగ వాడలోంచీ స్థలకాలాల్లో వస్తున్న మార్పుని కొలుస్తుంది భారతి.

వృత్తులలో, జీవన విధానంలో, మనస్తత్వంలో వస్తున్న మార్పుల్ని మాదిగ పల్లె కోణంలోంచీ చిత్రిస్తుంది.

“పలకలు కొట్టల్ల, ఊర్లో ఎవరి గొడ్డన్నా చస్తే దాని తోలుని వొలిసి గొడ్డుగల్లొల్లకి యిచ్చెయ్యాల. ఏలంటే అబ్బుడు సేద్దెం చెయ్యాల్లంటే, బావులకి మోటార్లు లేవు. యాతాలతో, కపిళ్ళతో నీళ్ళు ఎత్తెత్తి పొయ్యాల. ఆ యాతం బానలూ, కపిల బానలూ కుట్టాలంటే తోళ్ళు కావాల”. గ్రామానికి సంబంధించిన ఙ్ఞాన భాండాగారంలా వుంటాయి  “ఎదారి బతుకులు’ కతలు. పశువులు మేసే గడ్డి ఎన్ని రకాలో, ఏటువంటి పరిస్థితుల్లో ఎలాంటి గడ్డి మేపాలో రచయిత్రి రాస్తారు. గడ్డి పేర్లని కూడా వుటంకిస్తారు. తీగలగడ్డి, పూలగడ్డి, జీవనగడ్డి, సొంటిగడ్డి, తుంగ…

అలాగే  కోడి గుడ్లని పొదగడం గురించి … యిదంతా యెందుకు తెలుసుకోవాలంటే వరిగింజలు చెట్లకి కాస్తాయి అనుకునే పుస్తకం పురుగులైన మేధావులు రకరకాల సిద్ధాంతాలు చేసేస్తున్నారు. అందువల్ల విద్యావంతులు యీ పుస్తకాన్ని , యిటువంటి పుస్తకాల్ని అధ్యయనం చేయక తప్పదు. అప్పుడే సజీవమైన ఙ్ఞానం లభిస్తుంది. గ్రామీణ విశ్వాసాలని పరిహసించడం కాదు. ఆధునిక నాగరికత పేరుతో విస్తరిస్తున్న మూఢవిశ్వాసాలని నిలదీయడానికి యిటువంటి కథలని పట్టుకొని గ్రామాలకు తరలాలి. గ్రామాల్ని వుద్ధరించడం కోసం కాదు. గ్రామాల నుండి నేర్చుకోవడం కోసం.

గ్రామాలలో కాలం సజీవం. అది గడియారాలతో కొలవబడదు.

” ఈ పొద్దు మంగళవారం కదా, ఇంక రెండు మంగళవారాలు. తొలి, మూడవ మంగళవారం నాటికి గుడ్లన్నీ ఇడిగి కున్నిముండలు బయటి కొస్తాయి. అంతవరకూ కోడిని బద్దరంగా చూసుకోవాల్ల. దినానికి ఒకసారో రెండుసార్లో గంపని దాటి బయటికొస్తాది కోడి…(పూలపెట్ట).

యిదిగో యిలా జీవంతో కొలుస్తుంది గ్రామం. అది సజీవ గడియారం. అది ధ్వంసమైన స్థితే చివరికథ “ఎదారి బతుకులు”.

పల్లె అనగానే పండుగలూ, పబ్బాలూ వాటిని వెన్నంటి వుండే వ్యసనాలు కూడా. “శివరాతిరి పండగ రాబోతూ ఉండాదని మాకెల్లా తెలుస్తాదంటే, మావూరి మగోళ్ళు, ఉడ్డజేరి, చేతినిండా చింత పిచ్చెలు పట్టుకొని, ఉడ్లరా నక్కరా మూడురా నాలుగురా అని పందేలు కాస్తా ఆడతా ఉంటారు”. యిదొక జూదం. కొందరికి లాభం. మరికొందరికి విషాధం, ఆడవాళ్ళలో చెలరేగే ఈర్ష్యాసూయలు.

“ఎందరి పెళ్ళాం బిడ్డలు ఏడిసుటే వాడి  పెళ్ళాం బిడ్డలు నగుకోనుంటారు. దానికే ఈ సారి వాని పెళ్ళాం బిడ్డల్ని ఏడిపించినాడు”.

జీవితమే అన్నింటికన్నా పెద్ద వ్యసనం అంటాడువొక పెద్ద రచయిత. తాగుడు లాంటి వ్యసనాలు కేవలం పురుషులకి సంబంధించినవి మాత్రమే కాదు. భర్త ప్రోద్భలం వల్ల మద్యం రుచి చూసిన ’లచ్చుమత్త’, చివరకి భర్త మానేసినా మద్యం వ్యసనాన్ని విడిచిపెట్టదు. యీ కథ పేరు తాగుబోతు. “ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవల్ల. తాగల్లంటే మా అత్తతో కూచ్చునే తాగల్ల”.

కానీ పురుషుల తాగుడు వ్యసనం స్త్రీల పాలిట శాపంగా మారడం వాస్తవం. మొదటి కథలోనే వొక పల్లె స్త్రీ యిష్టంగా కొనుక్కొని ముచ్చటగా చూసుకొనే ’ఇత్తరి’ బిందెని భర్త తాగుడు కోసం అమ్మేయడం గుండెని కలిచివేస్తుంది. “పండుగ సంబరంలో అందరూ ఒక్కపొద్దులు ఉంటే, చిందిపోయిన ఏడుపులో నేనూ, మాయమ్మా ఒక్కపొద్దు ఉంటిమి ఆ పొద్దు”.

చెక్కుచెదరని ఇల్లు కాదు మాదిగలది, వాళ్ళ జీవిఅంలాగే. గాలీ వానకి కప్పు మొత్తంగా ఎగిరిపోతుంది. భార్యా, భర్త కలిసి మళ్ళీ ఆకులు కప్పెయ్యడంలో యిల్లు ఏర్పడి పోతుంది.

రెడ్డి చేసిన అత్యాచారం, దాన్ని బయటకు చెప్పుకోలేని స్థితి…. కులవివక్షని చాలా సూక్షంగా వ్యక్తం చేస్తారు భారతి. “కుట్టే వానికి మెట్టు కరువు”లో చెప్పులు కుట్టే మాదిగ చెప్పులు వేసుకునే హక్కుకి నిరాకరించబడడం….. నోరెండిపోతున్నా బావిలోని నీళ్ళని చేదుకోలేని పరిస్థితి. …..ఇలా ఎన్నో వివక్షా రూపాలు.

దీనితో పాటూ స్త్రీలపై భర్తల అజమాయిషీ. ముసలివాడై పోయి అంగస్తంభన కాకపోయినా విసిగించే భర్త, అనుమానంతో బాధ పెట్టడం, నిద్రకి దూరం చెయ్యడం, చివరకి చచ్చినా దెయ్యమై హింసించడం( పాపం గెంగవ్వ).

పరిష్కారాలని స్త్రీలు వెతుక్కుంటారు. “ఎవరికో బయపడి నీ బతుకుని బుగ్గి చేసుకుంటావా అత్తా, ఒక పని చెయ్యి. వాడు తాగి యింటి కొచ్చినబ్బుడు తలుపు మూసి పరకతో కొట్టి చెప్పు. దీనిని ఎవరితోనూ చెప్పుకోలేడు కదా. నువ్వు బయపడద్దత్తా. కాటికి పొయ్యేడబ్బుడు కూడా బయపడుతుంటే ఎట్ల”. అనుమానంతో భర్త హింసించదంతో ఆత్మహత్యకు సిద్ధమైన స్త్రీకి యిచ్చిన భరోసా యిది.

పురాణ కథలు

ఆ పల్లె జనం చెప్పుకొనే పురాణకథలు కూడా వారి అంతర్మధనాన్ని వ్యక్తం చేస్తాయి. యీ పుస్తకంలో ప్రస్తావించిన రెండు కథలూ నన్ను ఆకర్షించాయి. ఒకటి శివుడికి సంబంధించిన కథ. రెండు గ్రామ దేవతకి చెందినది.

శివపురాణం

లంజలెవరు, పతివ్రతలెవరు అని శివునికి, పార్వతికీ సందేహమొచ్చిందంట. జనాలు గుంపులుగుంపులుగా తిర్నాలకు పోతా ఉండారంట. శివుడు పండు ముసలోడిగా మారి, దోవ పక్కనుండే బురద గుంటలో పడి, లెయ్యలేక తనకలాడతా వుండాడంట. మొగుడికి మటుకే కొంగేసిన పతివర్తమ్మలు పట్టుచీరలు కట్టుకొని ఆ దోవన వచ్చిరంట. ముసలోడు వాళ్ళని చూసి ’అమ్మా కాపాడండమ్మా’, అని అరిచినాడంట. “మేము తిర్నాలకు పోతుండాము.నీకోసరం దిగితే చీరలకు బురదైపోతాది.” అనేసి తిరిగి చూడకుండా పొయ్యేసిరంటా. కొంచేపటికి అదే దోవలో పదిమందికి కొంగేసి బతికే లంజెమ్మలు వచ్చిరంట. వాళ్ళు గుడక పట్టుచీరలు కట్టుకోనుండిరంట. గుంటలో పడుండే ముసలోడిని చూసి ఆయన నోరు తెరిచి అడగముందర్నే నలుగురు నాలుగు పక్కలా మల్లుకొని, వాళ్ళ చీరల్ని విప్పి, బురదగుంటలోకి విసిరి, ఆయన్ని బయటకి లాగిరంట. ” పతివర్తలెవరో, లంజెలెవరో తెలిసిందా ” అని శివుడు పారవతిని అడిగినాడంట. ఇబ్బుడు మీరు చెప్పండి. ఇంటి ముందరకు వచ్చినోళ్ళకి అంత కడిపెట్టి పంపించిన కడింటిది బజారుదా, బైశాలిదా” ( తప్పేది, ఒప్పేది)

దేవుళ్ళ, దేవతల కథలని మాదిగలు ఎలా చూసారు, ఎలా వెళ్ళారు అనేది ఆసక్తికరమైన విషయం. అగ్రవర్ణాల శివుడీకీ, మాదిగ శివుడికీ చాలా తేడా ఉంది.పుస్తకప్పురుగులు దీన్ని గ్రహించలేరు. తమ మాదిగకులంలో క్రైస్తవం ప్రభావం లేదు అని ఎండపల్లి భారతి అన్నారు.

అలాగే గంగమ్మ తల్లినే పొరక పట్టుకొని భయపెట్టిన స్త్రీ గురించి చదివితీరాలి( గంగమ్మే బెదిరిపోయే)

రంగనాయకమ్మలా సంస్కృత రామాయణ,భారతాలని చదివి విశ్లేషిస్తూ కూర్చునే వాళ్ళకి పురాణకతలు, ప్రజల నాల్కలపై నర్తించేవేకానీ, పుస్తకాలలో భద్రపరిచేవి కావు అని అర్థం కాదు.

జీవితాన్నివైవిధ్యభరితంగా, సజీవంగా చిత్రించే పద్ధతిని వ్యాప్తిలోకి తెచ్చిన రుషి నామిని సుబ్రమణ్యం నాయుడు. ఆ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే చేవ ఉన్న రచయిత భారతి.

సాధారణంగా కథలూ, సాహిత్యమూ ఆధునిక ఉద్యమాలకు ప్రతిధ్వనులుగా మారిపోవడం వల్ల జీవలక్షణం కోల్పోయాయి. జీవితంలోని బహుముఖీన కోణాలూ, బహుళ కథనాలూ, బహుళమైన దృష్టీ కుదించుక పోయాయి. వట్టి నీతి కథలుగా, నినాదాలుగా మారిపోయాయి. దానివల్ల ఉద్యమాలు లాభపడి ఉండవచ్చుగానీ జీవలక్షణాన్నికోల్పోయాయి. ఫలితంగా ఉద్యమాలు కూడా గిడసబారిపోయాయి. సాహిత్యం నుంచీ స్పూర్తిని పొందే లక్షణం పోయింది ఉద్యమాలకీ, ఉద్యమకారులకీ.

ఆల్ టీచర్స్ మస్ట్ బీ డిస్ట్రాయిడ్ ( యూజీ).  ప్రజలకి నేర్పే మహోపాధ్యాయులే గానీ ప్రజలనుంచీ నేర్చుకునేవారు కరువయ్యారు.

ప్రజల్నిసంస్కరించాలనీ, ఆధునికీకరించాలనే ఆతృతలో వాళ్ళ భాషనీ, హృదయ స్పందననీ వినడం మానేశారు. దానితో ప్రజలూ, గ్రామీణులూ అవిద్యావంతులనీ, నిరక్షరాశ్యులనీ వారికి నేర్పాలనే గోల పెరిగింది. దానివల్ల సమాజం నిరక్షరాశ్యంగా మారిపోతూ వచ్చింది. యుగాల అనుభవాల నుంచీ, ప్రజలూ, గ్రామీణులూ ఆర్జించిన ఙ్ఞానం,  ఙ్ఞానం కాకుండా పోయింది. ఆంగ్ల విద్యావంతుల ఆధిపత్యం పెరిగింది. వారు దిగుమతి చేసుకున్న సిద్ధాంతాల్లో తన్నుకలాడ్తూ గ్రామీణ స్వరాన్ని నిర్లక్ష్యం చేసారు. యిప్పుడు మనం భారతి లాంటి రచయితల దగ్గర అక్షరాభ్యాసం మొదలుపెట్టాలి.

(ఎడిటర్: సాయి గారు ఈ కింద కామెంట్ లో ఒక ఆడియో ఫైల్ పెట్టారు. అదే ఆడియో ఇక్కడ వినవచ్చు. థాంక్ యు సాయి గారు, ఇలా మీ ఆడియో ఫైల్ మేము అప్లోడ్ చేసి లింక్ పెట్టినందుకు మీకు ఏమయినా అభ్యంతరం అంటే చెప్పండి.):

( ప్రతుల కోసం- ఎండపల్లి భారతి, ఫోన్ నెం: 9652802460)

రాణి శివశంకర్ శర్మ

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమస్తే సర్..
    అద్భుతమైన విశ్లేషణ….
    కతల్లోని సారాన్ని చక్కగా వివరించారు..
    నమస్సులు..ధన్యవాదాలు…

    • ధన్యవాదాలు పల్లి వట్టు గారూ

  • ‘ఎదారి కతలు’ పై ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ గారు యిచ్చిన ఉపన్యాసం విన్నారా?
    ‘ ఇతర కులాలవారికన్నా దళిత పురుషులు చెడ్డవారు,హింసా ప్రవృత్తి కలవారు. అదే వాస్తవాన్ని యీ కతలు సమర్థిస్తున్నాయి’ అని సింగమనేని నారాయణ చాల వివరంగా చెప్పారు.నేను ఆమాటలకి దిగ్భ్రా౦తి చెందాను. మీరు అటువంటి ప్రస్తావన లేకుండా రాసారు.నేను కతలు చదవలేదు.కనుక సింగమనేని చెప్పింది వాస్తవమా కాదా స్పష్టం చెయ్యండి.

      • సాయి గారు, ఈ రేడియో ప్రసంగం లింక్ సరిగా లేదనుకుంటాను.

      • I uploaded the audio file and now anyone can play the audio. See the bottom of the main post. Thanks, Sai!

    • నరహరి గారూ
      సింగమనేని నారాయణ గారు ప్రగతిశీల రచయిత గా గుర్తింపు పొందారు. ఆయన ప్రగతిశీలత చివరికి యిలా తెల్లారింది.
      ఇతర కులాల పురుషులకన్నా దళితులు విపరీత మనస్తత్వం , హింసాప్రవృత్తి కలవారట. ముస్లింలని హిందూవాదులు టెర్రరిస్టులని ముద్ర వేయడానికి ,సింగమనేనివారి కామెంటుకి తేడా ఏముంది? పైగా యిది రచయిత్రి భారతిగారి అభిప్రాయంగా ఆవిడ నెత్తి మీద రుద్దడం ఎంత అన్యాయం? అగ్రకులాలవా రు చేసే అత్యాచారాలని వివక్షని కథలలో బయటపెట్టిన భారతి పైనా యినిందలూ? యింతకన్నా అగ్రవర్ణ దాష్టీకం మరేముంటుంది?
      కేవలం దళిత పురుషుల ఆధిపత్య ధోరణిని బయటపెట్టడం కోసమే రచయిత్రి భారతి యీ కతలు రాసారు అంటారు సింగమనేని.అలాగే దళిత స్త్రీల దయనీయ స్థితిని గురించి మాత్రమే ప్రస్తావించారు.దళితస్త్రీలలో గల తిరుగుబాటు తత్వాన్ని బలాన్నీ కూడా చిత్రించారు భారతి.
      దళిత సంస్కృతిలోని ఔన్నత్యాన్ని కూడా భారతి చిత్రించారు.సింగమనేని భారతి కథలలోని వైవిధ్యాన్ని చూడలేకపోయారు.ఆయనకి ఆ శక్తి , ఆ ప్రతిభ కొరవడింది .
      సింగమనేని నారాయణ గారు దళిత పురుషులని దుర్మార్గులుగా చూపడానికి యీ కథలని సాకుగా తీసుకున్నారు.వక్రీకరించారు.యీ వక్రీకరణని తాను అనంతపురంలో జరిగిన సభలో ఖండించానని కటిక పూలు కథారచయిత ఇండస్ మార్టిన్ అన్నారు.
      నిజానికి దళిత స్త్రీలే అగ్రకుల స్త్రీల కంటే ఆర్థికంగా .సాంస్కృతికంగా స్వతంత్రంగా జీవించారని ఇండస్ మార్టిన్ అన్నారు.

  • Mee samikshalonu, Narayanagari prasangamlonu utankimpulu bhinnakonalalo sagayi. Mukthayimpu lakshyamga pusthakalu chaduvuthama leka chadivinaka oka kotha velugu choosthama annadanimeeda sandeham kaluguthondi. Idee manchide. Evarikivaru chadivi thelusukuntaru. Mee pariseelana rachayitha pradhana drushti konaanni visishtamga chupe prayathnam chesina mataithe vasthavam.

    • Chalam deplored about the oppression that brahmin women underwent those days and even went so far as inviting Muslim males to come forth and salvage their self respect. Dalit writers openly portray the treatment dalit women are meted out by their males. Then with whom does sri Narayana compare the plight of dalit women with to arrive as worse affected than upper caste women?

  • ” ఆధునిక విద్య నాగరికత పెంచిన అఙ్ఞానాన్నీ, మూఢవిశ్వాసాల్నీ తుంచివేసి
    నిజమైన ఙ్ఞానాన్ని పొందడానికి ఎండపల్లి భారతి రాసిన పల్లెకతలు చదవవలిసిందే.
    యిప్పుడు మనం భారతి లాంటి రచయితల దగ్గర అక్షరాభ్యాసం మొదలుపెట్టాలి ”

    ప్రియమైన రాణి శివశంకర్ శర్మ గారూ! నామిని అన్న తర్వాత మనకు దొరికిన మరో ఆణిముత్యం
    ఈయమ్మ ఎండపల్లి భారతి గారు కదూ.

    • మీ బోటి సహృదయులు నా వ్యాసం చదవడం ఆనందకరం రామయ్య గారూ

  • ” ఎదారక ముందు మన వాడ కథ! ” ప్రతులు నవోదయ బుక్ హౌస్, కాచిగూడా, హైద్రాబాదు వారి నుండి కూడా లభ్యం : https://www.telugubooks.in/pages/contact-us

  • ఎదారిన బతుకులు కథల మీద ఈ సమీక్ష, దళితుల మీద జరుగుతున్న అన్ని రకాల దోపిడీలతోపాటుగా, రచయిత్రి ప్రత్యేకించి చెప్పదలుచుకున్న సామూహికతా విచ్చిన్నాన్ని, వినియోగదారి సంస్కృతిని కూడా ఎత్తిచూపుతోంది. రచయిత్రి తెలియజేస్తున్న సాంస్కృతిక అంశాలకు తన గొంతును కలుపుతోన్నది.

    సింగమనేని సమీక్ష కూడా విన్నాక, ఏ పాఠకుడికైనా సింగమనేని పట్టించుకున్న అంశాలకు, శర్మగారు పట్టించుకున్న అంశాలకు తేడా స్పష్టంగా తెలిసి పోతుంది. దళిత మగవాళ్ళ “ప్రత్యేక”మైన దుర్మార్గాన్ని ప్రస్తావిస్తూ సింగమనేని “దళిత మగవాళ్ళ సంస్కరణ” అంటూన్నప్పుడు ఒక రకమైన “పొగరు” నాకు ధ్వనించింది.

    ఎదారి బతుకులు – కతలపై సింగమనేని సమీక్ష విన్నాక, సమీక్షకుడు కనీసం ఒక ఇరవై ఏళ్ళు వెనుక దృష్టితో రాసినట్టూ, రచయిత్రే సదరు సమీక్షకుడి దృష్టికి ఒక ఇరవై ఐదేళ్ళ ముందున్నట్టుగా నాకు తోస్తున్నది.

    శర్మగారు తన ధోరణికి భిన్నంగా రచయిత్రి నుంచి విస్తృతంగా ఉల్లేఖనలిస్తూ, ఆమె చెప్పదలుచుకున్నదానికి తగిన స్థానం ఇచ్చారు తన సమీక్షలో

  • ఎదారిన బతుకులు కథల మీద ఈ సమీక్ష, దళితుల మీద జరుగుతున్న అన్ని రకాల దోపిడీలతోపాటుగా, రచయిత్రి ప్రత్యేకించి చెప్పదలుచుకున్న సామూహికతా విచ్చిన్నాన్ని, వినియోగదారి సంస్కృతిని కూడా ఎత్తిచూపుతోంది. రచయిత్రి తెలియజేస్తున్న సాంస్కృతిక అంశాలకు తన గొంతును కలుపుతోన్నది.

    సింగమనేని సమీక్ష కూడా విన్నాక, ఏ పాఠకుడికైనా సింగమనేని పట్టించుకున్న అంశాలకు, శర్మగారు పట్టించుకున్న అంశాలకు తేడా స్పష్టంగా తెలిసి పోతుంది. దళిత మగవాళ్ళ “ప్రత్యేక”మైన దుర్మార్గాన్ని ప్రస్తావిస్తూ సింగమనేని “దళిత మగవాళ్ళ సంస్కరణ” అంటూన్నప్పుడు ఒక రకమైన “పొగరు” నాకు ధ్వనించింది.

    ఎదారి బతుకులు – కతలపై సింగమనేని సమీక్ష విన్నాక, సమీక్షకుడు కనీసం ఒక ఇరవై ఏళ్ళు వెనుక దృష్టితో రాసినట్టూ, రచయిత్రే సదరు సమీక్షకుడి దృష్టికన్నా ఒక ఇరవై ఐదేళ్ళ ముందున్నట్టుగా నాకు తోస్తున్నది.

    శర్మగారు తన ధోరణికి భిన్నంగా రచయిత్రి నుంచి విస్తృతంగా ఉల్లేఖనలిస్తూ, ఆమె చెప్పదలుచుకున్నదానికి తగిన స్థానం ఇచ్చారు తన సమీక్షలో

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు