సైదా, ఇలా కాదు మన మిలన్!

మరీ ఎక్కువగా  దేన్నయినా ప్రేమించినప్పుడు దాన్ని అందుకోడానికి కొంత ఆలశ్యమే అవుతుంది. మా అందరి కంటే ఆలశ్యంగా కవిత్వం రాయడం మొదలెట్టాడు సైదా. నిస్సందేహంగా చెప్పగలను, కవిత్వం గురించి నాకంటే అతనికి ఎక్కువ ఊహలే వుండేవి. అతని మాటల గాఢత్వాన్ని కొన్నేళ్ళ తరబడి వింటూ వస్తున్నాను కాబట్టి. అతని తొలి యవ్వనంలో కవిత్వమే అతని ప్రేయసి కాబట్టి నా కంటే ఎక్కువే అతను ప్రాణం పెట్టాడు తన వాక్యాల్లో!

1

ఇంకో సందర్భం యేదైనా వుంటుందేమో సైదాచారి గురించి మాట్లాడడానికి అనుకున్నాను. నెలకిందట అతను పుట్టాడు. పుట్టిన రోజు వెళ్ళిపోయింది కేవలం నాలుగు పదాలతో! పెళ్ళిరోజుకి రెండు పదాలు. ఏదైనా నెగ్గుకొస్తే వొకే వొక్క పదం. కాని, మరణాన్ని నెగ్గుకురాలేని నిస్సహాయతకి అనంతమైన శాంతిని కోరుకునే మూడు పదాలు. మూడున్నర దశాబ్దాల స్నేహానికి తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయిన వాడికి ఏం చెప్పాలి?! కొన్ని మాటల్నీ, లేతయవ్వనాల కొన్ని కలల్నీ, జీవితాన్ని బేఖాతర్ చేసి గొప్ప గర్వంతో వెలిగిపోయిన నిన్నటి కాలాల్ని యెన్ని పదాల్లో పెట్టి చెప్పాలి?! తెలియదు. తెలియడం లేదు. తోచడం లేదు. దూరంగా వున్న వాడికి అసలింకేమీ తోచదు. అనంతు అంటున్నాడు: “నిజంగా నిన్న సాయంత్రం నించీ మృత్యు భయం పట్టుకుంది రా!” అని!

కాని, ఆ మృత్యువు గురించి తప్ప ఇంకా దేన్ని గురించో మాట్లాడాలని అనిపిస్తోంది సైదాచారిని తలచుకుంటే!

ఇంకా నా డిగ్రీ చదువు పూర్తి కాలేదు. పుస్తకాలూ కవిత్వమే బతుకుగా గడుస్తున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ చదవాలన్న తపనతో కాళ్ళకి బలపం కట్టుకొని హైదరాబాద్ పరిగెత్తే వాణ్ని. అప్పటికింకా యాకూబ్ హైదరాబాద్ చేరుకోలేదు కాబట్టి హైదరాబాద్ లో నాకొక ఠికానా లేదు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లోనో, ఆ కేంపస్ లోనే వున్న అమెరికన్ లైబ్రరీ సెంటర్లోనో వుండే వాణ్ణి. అప్పుడు నాలుగు దిక్కుల నించి నలుగురు – గుడిపాటి, రాం దాస్, బాణాల శ్రీనివాస్, సైదాచారి- వచ్చే వాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ చెట్ల కింద వెల్లకిలా పడుకొని ఆకాశంలోకీ, అంత కంటే ఎక్కువ దూరం దూసుకుపోయే తొలి యవ్వనాల కలల్లోకీ చూస్తూ వుండే వాళ్ళం. ఇవాళ ఆ యవ్వన అహంకారమే గుర్తొస్తుంది.  ఈ మధ్య హైదరాబాద్ లో “ఇంటి వైపు” సభకి బహుదూరం నించి వచ్చాడు సైదా. అదే మా ఇద్దరి చివరి రోజు అని ఇప్పుడు ఊహించుకుంటే దిగాలుగా వుంది.

అప్పుడు సైదాచారి కళ్ళు ఎలా వుండేవో గుర్తుందా మీలో ఎవరికైనా?! అతని బక్కపల్చటి, బంగారు మేని ఛాయ సూర్యుడి కిరణాలకి మెరుస్తూ వుండగా, అంతకంటే పదిరెట్లు ఎక్కువ మెరుపు ఆ కళ్ళల్లో!

2

అనుమానమే లేదు, మాకెవ్వరికీ అప్పుడు “రేపు” అనేదొకటి వుందన్న వూహ లేనే లేదు. ఇవాళ దొరికిన క్షణాల్ని కవిత్వంలాంటి వూహలతో ఎల్లా నింపాలన్నదే వెతుకులాట. ఆ వెతుకులాటలో పుస్తకాలూ, పెయింటింగులూ, సంగీతం, ఉస్మానియా చుట్టూ సంచారాలూ, సెకండ్ షో సినిమాలూ, ఇంకా తెల్లారక ముందే చాయ్ కోసం, ఉస్మానియా బిస్కట్ల కోసం పరిగెత్తడాలూ..అంతకంటే ఎక్కువగా రాత్రి కన్న కలలు కంటి అద్దాలలో ఇంకా మిగిలివున్నాయేమో అని వెతుక్కోడాలూ!

జీవితం అట్లాగే మొదలవుతుంది. సైదాచారికి బాగా తెలుసు. నాకు తెలిసీ అతను ప్రకృతికి ఇంకా దగ్గిర! ప్రకృతికి, పంట పొలాలకూ దగ్గరైన వాడికి జీవితం ఇంకా బాగా తెలుస్తుంది. వాడి కళ్ళల్లో తడి ఆరదు. నాకు తెలిసీ అతను స్త్రీకి ఇంకా దగ్గిర! స్త్రీకి దగ్గిరైన వాడికి జీవన మోహం ఇంకా బాగా తెలుస్తుంది. వాడి కళ్ళల్లో వెన్నెల మాయ కాదు. అట్లా వున్నప్పుడే కవిత్వమూ సంగీతమూ రెండూ పోటీ పడి వాణ్ని ప్రేమిస్తాయి. ఇవాళ మృత్యువు గురించి మాట్లాడే కంటే నేను సైదాకి ప్రాణమైన కవిత్వం వింటాను, అతని వయొలిన్ వింటాను.

మరీ ఎక్కువగా  దేన్నయినా ప్రేమించినప్పుడు దాన్ని అందుకోడానికి కొంత ఆలశ్యమే అవుతుంది. మా అందరి కంటే ఆలశ్యంగా కవిత్వం రాయడం మొదలెట్టాడు సైదా. నిస్సందేహంగా చెప్పగలను, కవిత్వం గురించి నాకంటే అతనికి ఎక్కువ ఊహలే వుండేవి. అతని మాటల గాఢత్వాన్ని కొన్నేళ్ళ తరబడి వింటూ వస్తున్నాను కాబట్టి. అతని తొలి యవ్వనంలో కవిత్వమే అతని ప్రేయసి కాబట్టి నా కంటే ఎక్కువే అతను ప్రాణం పెట్టాడు తన వాక్యాల్లో! ప్రాణం పెట్టలేక నేను కొన్ని వాక్యాలు అట్లా వదిలేసినప్పుడు తనే విలవిల్లాడాడు నేను రాయలేని వాక్యాల్లో! సందేహమేమీ లేదు, నేను సైదాచారిలా రాయడానికి మళ్ళీ అతనిలానే పుట్టాలి. ఆ సున్నితత్వంతో, ఆ తాత్వికతతో, ఆ సంచార తపనతో పుట్టాలి. కనీసం అతనిలోని నిదానంతో పుట్టాలి. వయొలిన్ యెంత నిదానంగా పాడుతుందో అంత నిదానం.

సైదాచారి మొదటి కవిత్వ సంపుటి “ఆమె నా బొమ్మ” పద్దెనిమిదేళ్ళ కిందట వచ్చింది. అప్పటికే అది చాలా ఆలశ్యం. అంత నిదానం అన్న మాట సైదా! ఆ కవిత్వ సందర్భం నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అప్పటికే చాలా కాలం ఎదురు చూపుల్లోనే గడిచిపోయింది కాబట్టి.

అంత సుదీర్ఘ కాలంలోనూ సైదాచారి రాసిన కవిత్వం కొంతే. ఇవాళ ఆ రెండు పుస్తకాలూ దగ్గిర పెట్టుకుని చదువుతూ, నేను అనేక కాలాల మధ్య సంచారం చేస్తున్నా. 2010 లో నేనూ వంశీ కృష్ణా కలిసి “అనేక” సంకలనం ఎడిట్ చేస్తున్నప్పుడు సైదాచారి తో ఎక్కువ సేపు మాట్లాడే అవకాశాలు దొరికాయి. అప్పటికి ఏడాది కిందట అతని రెండో కవిత్వ సంపుటి “నీలం మాయ” వెలువడింది, అంటే దాదాపు తొమ్మిదేళ్ళ తరవాత రెండో పుస్తకం. 2010 లో రెండు పుస్తకాలూ దగ్గిర పెట్టుకొని, వొకే వొక్క కవిత అనుకుంటే సైదాచారిని ఏ కవితలో పూర్తిగా చూడగలనా అన్న ఆలోచనలో పడ్డాం. నాకు ఎందుకో “ఆమె నా బొమ్మ” కవిత్వం మీద కొంత సెంటిమెంట్ వుండేది అప్పట్లో.

ఎటూ తేల్చుకోలేక సైదాచారికి ఫోన్ చేస్తే, “నా కంటే నీకే బాగా తెలుసు, అఫ్సర్! నేను కవిత్వం అనేదొకటి రాయక ముందు నించీ నువ్వు చూశావ్ నన్ను. నీకే వదిలేస్తున్నా!” అన్నాడు. అది యెంత భారమైన బాధ్యత నా మీద పెట్టాడో ఇప్పుడు తలచుకుంటే భయమేస్తుంది.  వొకటికి మూడు సార్లు సైదాకవిత్వం చదువుతూ ఆలోచిస్తూ మధనపడుతూ వుండిపోయాను. నాకు నచ్చిన కవిత్వాన్ని నాకు తెలీకుండానే పైకి చదవడం మొదలెట్టడం నా అలవాటు. అట్లా కనీసం అతని పది కవితలు పైకే నాకు నేను వినిపించుకున్నాను. చివరికి వొక కవిత దగ్గిర సైదాచారి దొరికాడని అనిపించింది. అది “ఒక సంచార తల్లి కోరిక.” ఆ కవిత నించే సైదాచారి గురించి మాట్లాడాలి. ఆ కవితతోనే సైదాచారితో సంభాషణ వొక చివరకొస్తుంది. నిజానికి మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పుడు అతని కవిత్వం తప్ప అతన్ని గురించి మాట్లాడాల్సింది ఇంకేమన్నా ఉందా?

జీవితాన్ని చూస్తున్నాను, తల్లీ

అనుభవం కోసం బతుకుతున్నాను.

తల్లివైనా నువ్వు స్త్రీవి

నీ స్థావర,

నా జంగమాత్మక ప్రపంచాలు వేరు.

 

(ఫోటో:  భార్య, కవయిత్రి శివజ్యోతి, కూతురు డాక్టర్ ఆలాపనతో..సైదాచారి)

సైదాచారి బ్లాగు  ఇక్కడ:

సైదాచారి “నీలం మాయ” గురించి నా మాటలు ఇక్కడ:

ఆమె నా బొమ్మ సమీక్ష ఫిబ్రవరి 18, 2001, “వార్త” ఆదివారం అనుబంధంలో ప్రచురితం   (పెన్నా శివరామకృష్ణ సౌజన్యంతో)

 

అఫ్సర్

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనుబంధం, ఆత్మీయత తెలుస్తోంది.

  • జీవితాన్ని చూస్తున్నాను తల్లి!!స్థావర ,జనగామ ప్రపంచాలు ఏకం కావని ఎవరన్నారు?ఈ సంభోధన వచ్చింది ఆ జంగమ ప్రపంచం లో నుండి కదా.అణువు లో ఉండే చైతన్యమే విశ్వము అంతటా ఉన్నది.పైన కనపడే దానిలో లోనా ఇంకోటి ఉన్నది.నీ సంస్కారమే ఆయావాటిని బయటకు తెస్తూ ఉంటాయి.
    అసలు రెండు ప్రపంచాలు పేర్లు చెప్పడం లొనే కవి లోతులు అర్ధం అవుతున్నాయి.రెస్ట్ ఇన్ పీస్ సైదా గారు

  • ” తల్లీ నీ స్థావర, నా జంగమాత్మక ప్రపంచాలు వేరు ”

    ” ఏదైనా తాగొచ్చు ప్రేమనో, సుస్వరాలనో, దివ్యాక్షరాలనో… ”

    ” కలలన్నీ నా అవివాహిత ప్రియురాలి ప్రసవచారికలతో భయానకం ”

    ” మృత్యువుని తోసుకొని గెంతినవాడు బాల్యంలో కూలబడతాడు
    మరణిస్తావా నాకోసంశైశవంలో కలవడానికి ”

    ” సైదాచారి కవిత్వం తెలుగులో ఒక అద్భుతమైన సరికొత్త రూప సారాల శాశ్వత శిలాక్షరం’’
    అని అన్నారు సైదా మిత్రుడు, ప్రఖ్యాత కవి దెంచనాల శ్రీనివాస్‌.

  • వీడ్కోలుకి
    నువ్వు స్నేహ న్యాయం చేసావురా.
    *
    నాది ఈ వీడ్కోలు వేళలకి
    మాటరానితనమే.
    *
    వల్లకాదు
    ఈ అకాల
    వల్లకాడు
    చిత్రకొండ గంగాధర్
    యగ్గీ
    సైదా.
    మరియూ…
    *

  • ‘ద్వీప కూటమి’ చింతపల్లి అనంత్,

    నీ వేదనా విస్పోటనం లోని చివరి పదం ” మరియూ… ” తొలగించడానికి నాకు అనుమతి ఇవ్వవా.
    ( మరుభూమిలోంచి మల్లెల్ని పూయించవా )

  • అయ్యో… ఇలా జరిగి ఉండకూడదు. ఇది చదివాక మళ్లీ మళ్లీ అదే అనిపిస్తోంది..

  • .. ఓ ఆత్మీయ కవి మిత్రునికి నివాళి వ్రాయడమ్ లాంటి వేదనా భరిత సందర్భమ్, ఏ కవికీ రాకూడదు…
    మీ సాన్నిహిత్యమ్ కవి అంతరంగాన్ని ఆవిష్కరించింది… సెల్యూట్…????

  • మెమోరీస్ ఫరెవర్..సో సాడ్ తో హియర్ అబౌట్ హిం. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ హెవెన్..

  • మే 4 కి సరిగ్గా 15 రోజుల ముందు .. ఏప్రిల్ 20 సాయంత్రం 4 – 5 గంటల మధ్య సైదాచారి నాకు కాల్ చేసాడు. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లాను. “ఏమైనా విశేషమా ? ” అని అడిగితె “లేదబ్బా .. చాలా రోజులైంది నీతో మాట్లాడి. పాటల గురించి మాట్లాడాలి ” అన్నాడు. “ఎండలో వచ్చాను .. రాత్రికి నేనే కాల్ చేస్తా ” అన్నాను . అంతే – ఆరోజు రాత్రి వొంట్లో నలతగా ఉండి కాల్ చేయలేకపోయా …
    సారీ సైదా చారీ !
    (సైదాచారికి ” పూజాఫలం ” సినిమాలో పి. సుశీలగారి “ఇది చల్లని వేళైనా” పాట చాలా ఇష్టం)

  • (అనుమానమే లేదు, మాకెవ్వరికీ అప్పుడు “రేపు” అనేదొకటి వుందన్న వూహ లేనే లేదు. ఇవాళ దొరికిన క్షణాల్ని కవిత్వంలాంటి వూహలతో ఎల్లా నింపాలన్నదే వెతుకులాట. .అంతకంటే ఎక్కువగా రాత్రి కన్న కలలు కంటి అద్దాలలో ఇంకా మిగిలివున్నాయేమో అని వెతుక్కోడాలూ!)
    ఇంక ఎక్కడా వెతుక్కోడాలు ఉండవు..స్ఫూర్తి దాయకమైన అన్ని జ్ఞాపకాల్లోనూ స్థిరంగా కన పడుతూనే వుంటారు! May his soul rest in peace!

  • సైదాచారి, గారిని,గురుతు చేసినందుకు .ధన్యవాదాలు. వారి కవిత్వం, చదువుతా ఉండగా,తెల్సింది, వారు పోయారు, అని.. చాలా బాధ కల్గింది…. వారికి, మనః స్ఫూర్తి గా, నివాళి అర్పించడం.. తప్ప, ఏమి చేయలేము.!💐Afsarji.

  • ఇవాళ ఉదయం నుంచీ సైదాను తల్చుకుని తల్చుకునీ ఉన్న డిజిటల్ సోర్సుల్లో వెతికాం కొందరు పిలకాయలం….. కవిత్వాన్ని నేర్పడంలో మాకు కొంత అన్యాయం చేసాడని ఓ కొసన సైదా పై కోపముంది నాకు.

  • ఎంతో దుఃఖాన్ని మోసుకొచ్చిన వ్యాసం సార్ .సైదాచారి సార్ తో మీ అనుబంధం,కవిత్వం గురించి మీరు చెప్పిన విషయాలు ఇప్పటి తరానికి ఎంతో అవసరం.ధన్యవాదాలు సార్ .

  • ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు తరలిపోయిన ఆత్మీయతకు నిస్సహాయ స్థితిలో సమర్పించిన కవితా నివాళి కి ఓ పాఠకురాలిగా కైమోడ్పులు.
    యూనిర్శిటీ చెట్ల కింద స్నేహితునితో కలిసి కన్నా కలలు కవితా సంపుటిలై మీ కళ్ళెదురుగా ఉన్నవి కదా ఎన్నటికీ వీడని జ్ఞాపకాలుగా .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు