ఎవరికో ఏదో రాసి పంపించాను. అడిగితేనే రాశాను. వారం అయింది. అటువైపు నుంచి అలికిడి లేదు. నా అంతట నేను అడగాలంటే ఏదో సంకోచం. ఇంకా టైం పడుతుందంటే? కొంచెం తగ్గించమంటే? తిరగరాయమంటే? ఏదో టెన్షన్‌లో రాసినట్టున్నారు, బాగా రాలేదు, వదిలేద్దామంటే? ఏ సమాధానానికి మాత్రం సమాధానపడగలను?!
“నా అంతటి వాడు రాసిపంపితే, వెయ్యాలా వద్దా, ఈ సారి వేయాలా వాయిదా వేయాలా అని ఆలోచించేంత ధైర్యం అవతలివాడికి ఎట్లా వచ్చిందసలు’’ అని మనసులో ఒక ఏకపాత్రాభినయం రూపొందుతుంటే, తటాలున అంతరాత్మ నా ముందు వాలి ఇట్లా వాక్రుచ్చి కోప్పడింది! ‘ఓరీ, నువ్వేమంత అంతవి కావు. రైటర్ వి అసలే కావు. ఆఫ్టరాల్ నీకే ఇంత ఇదిగా ఉంటే, ఇంతకాలం నువ్వు ఎన్ని వందల వేల నిజమైన కవులను, రచయితలను కాల్చుకుతిన్నావు’?
అయ్యల సౌభాగ్యాలను అధికారాంతాన చూడాలని కొందరైనా కాచుక్కూచుని ఉంటారు. కలగబోయే గర్వభంగాలను కళ్లారా చూడాలని అంతరాత్మకూడా ఆరాటపడుతోంది. అదృష్టం బాగుండి, నాకీ లోకంలో ఇంకా కొన్ని పట్టుశాలువాలు మిగిలే ఉన్నాయి. కొన్ని రౌండు టేబుళ్లూ కొన్ని విశిష్టాత్మీయముఖ్య ఆతిథ్యాలూ పలకరిస్తూనే ఉన్నాయి. పరాయి ఎడిటర్ల ముందు, కేవల రచయితగా మిగలడం మాత్రమే కొంచెం ‘సేడ్’ గా అనిపిస్తుంది.
ప్రచురించక, ప్రచురించి, ఆలస్యం చేసి, కబురుపెట్టక, కారణం చెప్పక రకరకాలుగా రైటర్స్‌ని నేను రొష్టున పెట్టాను. అక్షరాల యోగ్యతాయోగ్యతలు ఒక్కటే కాక, అనేకానేక రాజకీయ, సామాజిక, వైయక్తిక మనోభావాలను లెక్కించి, పౌనఃపున్యాలను, పరిహార పునరావాసాలను నిర్ణయించి, ‘వివిధ’ విధాలుగా సాహిత్య విభాగాల సంపాదకత్వం వహించాను. అన్నివేళలా న్యాయంగానే ఉన్నానని చెప్పలేను. వృత్తిధర్మం మాత్రం పాటించానని చెప్పగలను. అయితే, ఈ సుదీర్ఘకాలంలో, ఇతరుల రచనలను తూకం వేసే పనిలోనో, అధికారంలోనో తలమునకలైపోయి, స్వయంగా ఒక రచయితగా నిరీక్షణ, నిరాశ ఎట్లా ఉంటాయో కూడా మరచిపోయాను.
మొదటి హామీ పత్రం ఎప్పుడు రాశానో, అట్లా రాయాలని ఎప్పుడో నేర్చుకున్నానో గుర్తులేదు. గుండ్రంగా రాయడం ఎప్పుడూ లేదు కానీ, కుదరుగా లైన్ కు లైన్ కు ఎడం ఇచ్చి తెల్లకాగితం మీద రాసి, రాసిన విషయమూ అక్షరాలూ నావేనని అండర్ టేకింగ్ ఇవ్వడం చిన్నప్పుడే నేర్చుకున్నాను. పరీక్షలు రాసేప్పుడు ఎక్కువ అడిషనల్ షీట్స్ తీసుకుని, కుప్పలు తెప్పలుగా పేరాగ్రాఫులు రాయడం మార్కులు తెస్తుందని నమ్మినట్టే, శుభ్రంగా కనిపించే రచన ఎడిటర్లను ఆకట్టుకుంటుందని ఒక ఆశ ఉండేది. చిన్నతనం కదా, ప్రయత్నం మీద ఉన్నంత పట్టింపు, ఫలితం మీద ఉండేది కాదు. స్టాంపులు పెట్టిన కవర్లలో ఠంచనుగా నా కాయితాలు తరచు వెనక్కి తిరిగి వచ్చేవి. అడపాదడపా అచ్చుకూడా అయ్యేవి. ‘స్రవంతి” పత్రికలో అచ్చయిన అనువాద కథ నా మొదటి ప్రచురణ. మొదటి పత్రికాపారితోషికం మాత్రం పదిరూపాయలు, ఒక కవిత కు ఆంధ్రపత్రిక నుంచి అందుకున్నాను.
ప్రచురణకు స్వీకరించామని చెబుతూ లేఖలు రావడం తక్కువే. ఒకసారి ఒక పత్రిక నుంచి అటువంటి లేఖ వచ్చింది. వారిది షరతులతో కూడిన ఆమోదం. పదిహేను రూపాయలు చెల్లిస్తే, కవిత ప్రచురిస్తామని, అంతే కాక, అచ్చయిన పత్రిక పదిహేను కాపీలు కూడా పంపుతామని రాశారు. చాలా షాకింగ్ గా అనిపించింది. అపచారమూ అనిపించింది. చిన్న పత్రిక. నడిపే ఆయన బాగా పెద్దమనిషి. ఆయన రచనల్లో ఒకటిరెండు నాకు ఇష్టమైనవి కూడా. నా కవిత బాగాలేదన్నా, వెయ్యను పొమ్మన్నా బాధపడేవాడిని కాదు, ఇట్లా డబ్బిచ్చి అచ్చేయించుకోవాలా అని బడాయిగా బాధపడ్డాను. తప్పు, మీరిట్లా అడగకూడదు అని వాళ్లకు ఉత్తరం రాసినట్టు గుర్తు. ఇప్పుడు ఆలోచిస్తే, ఆ సంపాదకుడు చేసినదాంట్లో ఏమంత తప్పుందనిపిస్తోంది. ఆయన మాత్రం పత్రిక ఎట్లా నడుపుతాడు? నాకు తెలిసి ఆయన ఏమీ డబ్బుచేసుకోలేదు. సహకారపద్ధతిలో రచయితలూ సంపాదకుడూ కలిసి పత్రికను నడపాలనుకుంటే తప్పేమిటి? తరువాత్తరువాత కాలంలో కవులూ రచయితలూ ఏదో రూపంలో చదివించుకుని మరీ ప్రచురింపించుకోవడం సహజం అయిపోలేదా?
నా ఆరంభ రచనాజీవితంలో నన్ను అచ్చు వెయ్యని పత్రికల మీద, అప్పట్లో నాకు కోపం ఉండేదా? నేను బాగా రాయకపోవడం వల్ల కాక, ఎడిటర్లకు ఏవో పక్షపాతాలు ఉండడం వల్ల వేయడం లేదని విక్టిమ్ హుడ్ తో బాధపడ్డానా? లేక నేను రాసింది అర్థం చేసుకుని, జడ్జి చేసే సామర్థ్యం వాళ్లకు లేదని అనుకునేవాణ్ణా? లేదా నన్ను నేను చాలా ప్రొగ్రెస్సివ్ అనుకుని, ఛాందస ప్రతీఘాత శక్తులు నన్ను నిరోధిస్తున్నాయని ఊహించుకున్నానా? నా రచనలు వేసినవాళ్లు స్నేహంతో పరిగణించి ఫేవర్ చేశారని గుర్తించానా? ఆ మనుషులు అక్కడ ఆ నిర్ణయాత్మక స్థానాలలో లేకపోతే నా రాత ఎట్లా ఉండేదో గ్రహించానా? ఈ తెలివిడులన్నీ అప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. గుర్తులేదు.
విద్యార్థిదశలో చాపల్యపు రచనలు చేస్తున్నకాలంలోనే నాకు సంపాదక బాధ్యతలతో కూడా పరిచయం ఏర్పడింది. కాలేజీ మేగజైన్లు, చిన్న పత్రికలతో పెద్దబాధ్యతలతో మొదలై, మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ప్రారంభ ఉద్యోగిగా పాత్రికేయ జీవితం మొదలుపెట్టాను. అతి తక్కువ కాలం మాత్రమే, పత్రికలకు రచనలు పంపి, ఆమోదం కోసం ఎదురుచూసే రచయితగా ఉన్నాను. ఆ తరువాత, క్రమంగా అంగీకార తిరస్కారాలు నిర్ణయించే బాధ్యతలలోకి వెళ్లాను. రచనల ప్రచురణ యోగ్యత నిర్ణయించే అధికారంలో ఉండే ద్వారపాలక వైభవం చిన్నవయసులోనే తెలిసివచ్చింది. కానీ, నేను నమ్మే విలువల పలుపుతాళ్ల నిడివి తక్కువ కావడంతో, కట్టుతప్పకపోవడం అలవాటుగా మారింది. మిత్రులైన ఎందరో రచయితలు, నాలాంటివారే కాబట్టి, మైత్రికి నీతికి ఎప్పుడూ లోటు రానివ్వలేదు. మొహమాటాలూ మర్యాదలూ పైచేయి అయినప్పుడు నొప్పించకుండానే ఖచ్చితంగా ఉండగలిగాను. నా అభిమానరచయితల లేదా పరిచయస్తుల, నేస్తుల రచనలు నా దగ్గరకి ఏ ఆటంకమూ లేకుండా రాగలగడమూ, నా చూపు వాటి మీద వేగంగా ప్రసరించడమూ జరగలేదని చెప్పలేను. ప్రాసెసింగ్ త్వరగా జరిగేది తప్ప, క్వాలిటీలో రాజీ ఉండేది కాదు. సర్దుబాట్లు అంటూ ఉంటే గనుక అది బయటి ఒత్తిళ్ల వల్ల మాత్రమే.
సాహిత్యరంగంలో పెద్దపేరు సంపాదించుకుని, పీఠాధిపతులుగా మారిపోయిన కవులతో కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఒకానొక సాహిత్యపేజీ బాధ్యత తీసుకుంటున్న సందర్భంలో, ఒక కవిగారి పోయెమ్ ప్రతివారం సాహిత్యపేజీలో వచ్చేది. అందరూ పంచుకోవలసిన స్థలంలో ఒకరినే నింపేస్తే ఎట్లా అన్నది నా ప్రశ్న. సంపాదకులకు బాగా మొహమాటం. బకాసురుడితో చేసుకున్నట్టు ఆ కవిగారితో ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. నెలకు ఒకటి మాత్రమే వేస్తాము అని. మొదట రెండు అని బేరమాడి, చివరకు ఆయన పెద్దమనసుతో ఒకటికి అంగీకరించారు. తరువాత కాలంలో కూడా కొందరు పెద్దకవులతో కొంత సమస్య ఉండేది. ప్రచురణ జరిగిన తరువాత ఆరునెలల దాకా మరో కవిత వేయబోమని విధాన నిర్ణయంగా చెప్పేవాళ్లము. దాన్ని చాలా మంది కవులు ఆరునెలలకోసారి కవిత వేయడం అని పాజిటివ్‌గా అన్వయించుకుని, ఠంచనుగా ఆరునెలలు దాటగానే పంపేవారు, నిలదీసేవారు. అట్లా తేదీల ప్రకారం పంపడానికి సొంత వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే, ఏడాదికి ఒక్కపోయెం కూడా పంపని చాలా పెద్దకవులు కూడా ఉన్నారు. అటువంటివారి కవిత్వం వచ్చిందంటే చాలు, కళ్లకద్దుకుని వెంటనే ప్రచురించేవాళ్లం.
ఇట్లా ఒప్పందాలు చేసుకోవలసివచ్చే స్థాయి ఉన్నప్పుడు ఆ కవుల కవిత్వాన్ని తిరస్కరించే అవకాశమే లేదు. అటువంటివారు కాకుండా, సమాజంలో గౌరవనీయులైన, గొప్ప చరిత్ర కలిగిన సీనియర్ కవులు, రచయితలు ఉంటారు. వాళ్లకు వాళ్ల ప్రతిష్ఠే తప్ప వేరే ఏ గ్లామర్ ఉండదు. లౌక్యం కూడా చేతకాదు. మరి, వారి రచనలు బాగా లేకపోతే ఏమి చేయాలి? తిరస్కరించడం న్యాయం అవుతుందా? పైగా, పత్రికారంగంలోనూ, ప్రజారంగంలోనూ కొంతకాలం గడిచాక, పరిచయాలు పెరుగుతాయి. ఎవరి మొహం మీద చెప్పగలం, పోయెం బాగా లేదని? వచనంలో పస లేదని?
అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రసిద్ధ రచయితలవి, కవులవి ఎవరివీ తిరస్కరించవద్దు. కొత్తగా రాస్తున్నవాళ్లు, మధ్యంతర స్థాయివాళ్ల విషయంలో మాత్రమే ఎంపికలు చేద్దాము, అని. ప్రసిద్ధ రచయిత నాసిరకంగా రాస్తే, ఆ అపకీర్తి ఆ రచయితకే వెడుతుంది. సంపాదకుడికి అంటదు. కానీ, అప్రసిద్ధుడి రచన నాణ్యంగా లేకపోతే, ఆ రచయితను ఎవరూ అనరు, సంపాదకుడిని అంటారు. ఈ సూత్రాన్ని అమలుచేశాక, మా పని కొంత సులువయింది.
బాగా లేదని తిరస్కరించడంలో కూడా రెండు అంతస్థులుంటాయి. అభిప్రాయాలతో అభ్యంతరం ఉంది, అందుకని వేయలేము అని చెబితే, రచయిత సాధారణంగా బాధపడరు, పైగా గర్వపడతారు. పాత్రికేయ ఉద్యోగిని అర్థం చేసుకున్న ఔదార్యం చూపగలుగుతారు. రచనాస్థాయి సమస్యలున్నాయి అని చెబితే మాత్రం నొచ్చుకుంటారు. నిజానికి రచనాస్థాయి నిర్ణయం కూడా పూర్తి సబ్జెక్టివ్. అందులో సార్వజనీన ప్రమాణాలు ఏవీ ఉండవు. కానీ, సమకాలంలో ఏది ఆమోదనీయమైనది, ఏది ఆహ్వానించదగినది అని సూచించే లెక్కలు ఏవో నిర్ణేతలకు అర్థం అవుతూ ఉంటాయి. మొత్తానికి నొచ్చుకోకుండా ‘నో’ చెప్పడం కొంతకాలానికి నేర్చుకున్నాను. ‘మీ స్థాయికి తగ్గట్టుగా లేదండీ’, ‘ మీరేదో ఆదమరచి రాసినట్టున్నారండీ, మీ ఇమేజికి ఇది హాని చేస్తుందండి’ వంటి కారణాలు చెబితే, రచయితలు సందేశాన్నిగ్రహించేవారు.
కొందరు రచయితలు చూసిచూసి విసిగిపోయి వేరే పత్రికలో అచ్చువేసుకునేవారు. మాట్లాడినప్పుడు నిష్ఠూరంగా మాట్లాడేవారు. వారికి ఒక ప్రజాస్వామికమైన వివరణ ఇవ్వడానికి ప్రయత్నించేవాడిని. “ఏ రచననూ మేము విలువలేనిది, పనికిరానిది అన్న తీరులో నిరాకరించము. మా ఎంపికల పద్ధతిలో, మాకున్న స్థలంలో ఇది మేము వేయలేము, అంతే. ఇదే రచన మరొకరి చట్రంలో స్థానం సంపాదించుకోవచ్చు. ఇతర ఎడిటర్లు తిప్పికొట్టిన వాటిని మేం తీసుకోవచ్చు. పత్రికల వాళ్లు చెప్పేది పూర్తి తీర్పు కాదు.’’ ఇదేదో వారి మనశ్శాంతికి చెప్పేది కాదు, ఆ విలువను నేను నమ్మాను. అయితే, నా సంజాయిషీలూ వివరణలూ ఒప్పుకోళ్లూ రచయిత మిత్రులకు ఒప్పుదల అయ్యాయని మాత్రం నమ్మను.
ప్రచురణకు తీసుకోవడమూ తీసుకోకపోవడమూ ఒక అంశం అయితే, దానిని త్వరగా క్యూలో పెట్టించడం కోసం రచయితలు, ముఖ్యంగా కవులు తమ ప్రయత్నం తాము చేస్తారు. పాపం ఒకటి రాశారంటే చాలు, అది అచ్చయ్యేదాకా మోసుకుని తిరుగుతారు. అచ్చయ్యాక, దానికి ప్రశంసలకోసం ఆత్రపడతారు. మార్కెటింగ్ చేయకుండా అవన్నీ సహజంగా సమకూరే అవకాశం ఉందని వాళ్లు నమ్మనే నమ్మరు.
రచన తమ ఊహలో మెదిలినప్పటి నుంచి, రాసినప్పుడు, పోస్టు/మెయిల్ చేసినప్పుడు ఎడిటర్లకు కాల్ చేసి, సమాచారం ఇస్తారు. కొంత సమయంఇచ్చి ఆ పైన గుర్తు చేయడం మొదలుపెడతారు. పరోక్షంగా కూడా రిమైండ్ చేస్తూ ఉంటారు. కొందరు రచయితలైతే, పి.ఎ. దగ్గర నుంచి ఎడిటర్ టేబుల్ మీదకు తమ రచన ప్రయాణాన్ని కూడా మానిటర్ చేస్తారు. అనేక కాల్స్ తీసుకోవలసివచ్చి, ఇబ్బందిగా ఉంటుంది కానీ, వాళ్లు గుర్తుచేయడం కూడా ఎంతో కొంత అవసరమే అనిపించేది. ప్రతి కవితకూ ఒక సందర్భం, ఒక వాతావరణం ఉంటుంది. అవి ఉనికిలో ఉన్నప్పుడే ప్రచురణ జరగడం కవికే కాదు, పత్రికకూ అవసరం.
సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు బలపడిన తరువాత, ప్రాతినిధ్య అవకాశాల గురించి హక్కుగా ప్రశ్నించే చైతన్యం వచ్చిన తరువాత, పత్రికల మీద ఒత్తిడి పెరిగింది. ఆ హక్కును గుర్తించి అంగీకరించేవారు పాపాల భైరవులయ్యేవారు. వాళ్లు మరింత బాధ్యతను, మరింత ఒత్తిడిని తీసుకోవలసివచ్చింది . ప్రాంతాల వారీగా, కులాల వారీగా, ఉపకులాల వారీగా, రాజకీయ విశ్వాసాల వారీగా, సాహిత్యపేజీలలో రచనలను లెక్కపెట్టడం, అన్యాయం జరుగుతోందని నిలదీయడం చేసేవారు. తెలంగాణ ఉద్యమకాలంలోను, ఆ తరువాతా కూడా, తెలంగాణ రచనలు మాత్రమే వేస్తున్నారని ఆంధ్రప్రాంతంలోను, ఆంధ్రావారివే వస్తున్నాయని తెలంగాణలోను ఫిర్యాదులు చేసేవారు. ఈ నిలదీత పత్రిక, రచయిత సంబంధాలలో ప్రజాస్వామ్యాన్నిపెంచింది, సందేహం లేదు. ఎడిటర్లు తప్పనిసరిగా సామాజిక సమతూకాన్ని పాటించవలసిన అవసరాన్ని కూడా ఈ వాతావరణం కల్పించింది. ఆ ఒత్తిడి అన్నివేళలా న్యాయభావనతోటే వచ్చిందని చెప్పలేం. చాలా సార్లు తమ సొంత రచనలు రావడం లేదనే కోపమే ప్రాతినిధ్య ఆవేశంగా ప్రత్యక్షమయ్యేది.
పిట్టపోరుపిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా, రచయితలకు, అందులోనూ కవులకు, పత్రికలకు మధ్య ఉన్న సమస్యను సోషల్ మీడియా వచ్చి తీర్చింది. పత్రికల మీద భారాన్ని తగ్గించింది. పది పన్నెండు సంవత్సరాలుగా, యువకవులెవరూ పత్రికల ద్వారా మాత్రమే తమను తాము వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అడిగితే తప్ప పత్రికలకు పంపని కుర్రకవులు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్ పూర్వ యుగం నుంచి రచనలు చేస్తున్నవారు, సీరియస్ విమర్శావ్యాసాలు రాస్తున్నవాళ్లు మాత్రం ఇంకా సంప్రదాయ మీడియానే ఇష్టపడుతున్నారు. వీళ్లు కూడా సాహిత్యపేజీలో అచ్చయిన ముక్కను తిరిగి సోషల్‌మీడియాలో తిప్పుకుంటున్నారు. తిరస్కరణ ఎదురయ్యే అవకాశమే నేటి రచయితకు లేదు. తనను తాను ప్రచురించుకోగలరు. తమకు తామే సంపాదకులు. వాళ్లు రాసిన దాంట్లో పలుకు ఉంటే, పాఠకులకు తాకే స్పర్శ ఉంటే అది వెలిగిపోతుంది. వైరల్ అవుతుంది.
ఎంత కాదన్నా, రచయితలకు సొంత అంతస్థు గురించిన కొంత అహంకారముంటుంది. తనను ఒకమోస్తరు కక్ష్యలో పెట్టుకున్న రైటర్ ఎవరైనా, తన స్థాయిని గుర్తించాలనే కోరుకుంటారు. తిరస్కారమన్నది తీసుకోలేని అవమానం. యువరచనల కాలంలో తప్ప, విషయానికి తప్ప వ్యక్తీకరణ కు నిరాకరణ దొరికిన అనుభవమేదీ నాకు లేదు. ఇప్పుడు, ఏ హోదా లేకుండా సాధారణ రచయితగా రచనను పంపినప్పుడు, అది ఇతర వేదికల మీద నిరీక్షణలో ఉన్నప్పుడు, ఎంతో కొంత కలవరం కలుగుతూనే ఉంటుంది. మనల్నెవరో తూకం వేస్తున్నట్టు మనసు విలవిలలాడుతుంది. నేను అందుకున్న అనేక రిమైండర్ కాల్స్ వెనుక, ఆయా రచయితల తపన, ఎదురుచూపు స్ఫురించి, మనసు బరువెక్కుతుంది.
*
ఎడిటర్ ఎదుర్కొనే సమస్యలు నీతిగా రాశారు. మందు పోయిస్తే వేసుకున్న ఎడిటర్లను ఎరుగుదును. కులం ఆధారంగా రచనలు వేసుకున్న వారిని ఎరుగుదును. మీలా క్వాలిటీ కోసం తపన పడ్డ వాళ్ళను అతి తక్కువగా చూశాను. మీరున్న ఆ పత్రిక తిరగేసిన రోజులున్నాయంటే అవి మీ పేజీల కోసమే.
రచన పంపాక రిమైండ్ చేస్తారని ఎడిటర్ టేబుల్ దాకా మానిటర్ చేస్తారని ఇప్పుడే తెలిసింది
రచయితగా రచనను పంపినప్పుడు, అది ఇతర వేదికల మీద నిరీక్షణలో ఉన్నప్పుడు, ఎంతో కొంత కలవరం కలుగుతూనే ఉంటుంది. మనల్నెవరో తూకం వేస్తున్నట్టు మనసు విలవిలలాడుతుంది … బాగుంది.
కవిత యోగ్యతను వస్తు, శిల్పాలను బట్టి కాక “వాస్తుశిల్ప” స్థాయిని బట్టి నిర్ణయించే అగత్యం పట్టిన సందర్భాలూ కొందరు సంపాదకులకి ఉండి ఉంటాయి.
మంచి వివరణ శ్రీనివాస్ గారు
అంతా బావుంది సార్. అభినందనలు. అక్షర మక్షరంలో నిజాయితీ కనిపించింది. మనసులో ఉన్నదానిని స్వేచ్ఛగా చెప్పగలిగారు. ఇదుగో, ఈ రచనా స్వేచ్ఛ గతంలోనే కాదు, ఇప్పటికీ ఎంతమందికి ఉంది?! కాలానికి తగ్గట్టు రచయితలు, ఎడిటర్లు, పత్రికలు, యాజమాన్యాలు చివరకు పాఠకులు కూడా మారుతున్నారు. అయితే, ఎడిటర్లు యాజమాన్యాల లైన్ కు అతీతంగా వెళ్ళలేరు. గీత దాటితే ఉద్యోగాలే వదులుకోవాల్సిన పరిస్థితి. వాటికీ స్వంత ఉద్దేశ్యాలు, సిద్ధాంతాలు, భావాలు ఉండవచ్చు. కానీ, ముద్రణకు ఎంపిక చేసుకొనే ముందు రచన ఎవరి కోసం? అన్న ప్రశ్న ఎందరు వేసుకుంటున్నారో అనుమానమే. ఈ అతి స్వేచ్ఛా సమాజంలో ఎవరికి కావలసినట్టు వాళ్లుంటున్నప్పుడు, ప్రచరణ అయ్యే అక్షరాలు చదివి తీరవలసిన పాఠకుల గురించి ఆలోచించే వాళ్ళు కరువయ్యారు. రచన లేదా ఎంపిక పూర్తిగా పాఠకుల కోసం ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజాస్వామిక బాధ్యత అనిపించుకుంటుంది. పాఠకుల్లోనూ అత్యధికుల ఆధారంగా వుండాలి. ఈ సూత్రాన్ని నేను ఈనాడులో స్ట్రింగర్ గా ఉన్నప్పుడు అప్పటి సీనియర్ పాత్రికేయుల నోటివెంట విన్నాను. వార్త అయినా, రచన అయినా వాణిజ్య సరుకుగానో, ఏ కొందరినో తృప్తి పెట్టేదిగానో వుండరాదు అని తెలుసుకున్నాను. ఈ చిన్న నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఇచ్చిన సీనియర్ రచయిత, సంపాదకులు కే శ్రీనివాస్ గారికి, సారంగ నిర్వాహకులకు ధన్యవాదాలు.
– దోర్బల బాలశేఖరశర్మ
నా మొదటి కవిత డెబ్భై యో దశంకంలో నీలిమ అనే పత్రిక లో ప్రచురింపబడింది.
ఆ పత్రిక చివరి పేజీ లో కవులకు కాంప్లిమెంటరీ కాపీ, పారితోషికం పంపుతున్నట్లు రాసారు.
నెలలు గడుస్తున్నా నాకు అందలేదు.
ఈ వైఖరి పత్రికాభివృధ్ధికి శ్రేయోదాయకం కాదు! అని రాసిన వెంటనే ఇరవై రూపాయలు, పత్రిక చేరాయి.
సంపాదకుల ఇబ్బందులు బహుముఖములు.
ఇప్పుడు హాయిగా నచ్చింది రాసుకుని సోషల్ మీడియా లో పోస్ట్ చేసుకోవడంతో బాధ్యత తీరిపోతుంది.
వెంటనే స్పందనా తెలిసిపోతుంది.
మీ వ్యాసం బాగుంది.అభినందనలు.
‘వివిధ’ సాహిత్య పేజీ కి ఒక ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని విశేషమైన గుర్తింపును తేవడంలో ఎడిటర్ గా మీరు పడ్డ తపన మీరు అందించిన సేవ సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రచయిత మానసిక స్థితి నుండి ఎడిటర్ ఆంతర్యంలోని ఆటు పొట్ల దాకా.. నిర్మొహమాటంగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి మరీ వివరించిన తీరు ఇటు రచయితలకూ అటు ఈ బాధ్యతలు స్వీకరించబోయే వారికీ ఆలోచించదగిన చక్కని పాఠంగా నిలిచిపోతుందని చెప్పగలను. కేవలం తమ రచన రావాలని మాత్రమే ఆరాటపడే కవులూ రచయితలూ అటువైపు సాధకబాధకాలను గురించి కూడా ఆలోచించవలసిన అవసరాన్ని సూటిగా మీదైన ప్రత్యేక శైలిలో చెప్పారు. నాకు తెలిసి ఎడిటర్ స్వరం నుంచి ఇంత విస్పష్టంగా నిజాయితీగా వెలువడిన వాయిస్ మీది మాత్రమే. ఇవాళ సాహిత్య జీవులు అందరికీ మెయిన్ టార్గెట్ గా ఆంధ్రజ్యోతి శిఖరాయమానమై నిలిచిందీ అన్నది నిర్వివాదాంశం. కవుల రచయితల ఉద్వేగాలనూ ఉత్సాహాన్నీ ఒత్తిళ్ళనూ విశ్లేషించి చెప్పిన తీరు ముఖ్యంగా ఎప్పటికప్పుడు తమను తాము ఆత్మ విమర్శ చేసుకోవడానికి మార్గంగా ఉంది. మీరు ఎడిటర్ గా ఉన్న అమూల్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అందించిన సాహిత్య వ్యాసాలూ రాజకీయ సామాజిక విశ్లేషణా వ్యాసాలూ నాబోటి వారినుంచీ పరిణత సృజన కారుల దాకా అందరి అభిమానాన్నీ, విశేష జనాదరణనూ పొందడమే కాక రచయితల, పాఠకుల వివేచనా జ్ఞానానికి పదును పెట్టాయి. క్వాలిటీ కోసం తపన పడుతూ ఆ పత్రికకు చక్కని సాహిత్య గౌరవాన్ని నిలబెట్టిన తీరు ఎన్నదగినది మరపురానిది. వివరణాత్మకమైన మీ విశ్లేషణకు నిజాయితీతో కూడిన స్పష్ఠీకరణలకు ప్రత్యేక అభినందనలు..
ఏది ఏమైనా మీరు పని చేసిన యాజమాన్యాల తాలూకు నిజాలు మీ మీద పడలేదనేది మీ జీవితం చాటిన సత్యం సార్.
ఇక మోచే వాడికి తెలుసు కావడి బరువెంతో
అలాగే వేచి చూసే వాడికి తెలుసు ప్రచురణ పేరెంతో…
రచయితలతో మీరు ఇబ్బందులు ఇంత మొహమాట పడి చెప్పడం బాగుంది. మీ వచనం హాయిగా చదవేలా ఉంటుంది.
నేను రచయితగా ఎదగడంలో మీ ప్రోత్సాహం మరువలేనిది సార్. అలాగే కొన్నిసార్లు నా వ్యాసాలను రెజెక్ట్ చేసినప్పుడు మాత్రం మనసు విలవిలలాడేది.
గురువుగారు ఎన్నో కవితలను పత్రికలకు పంపి నిరీక్షించిన యువకవులు చాలామంది నేడు సోషల్ మీడియా పుణ్యమా అని కాస్తంత ఉపశమనం పొందుతున్నారు.
కానీ ఎప్పటికైనా ఏదో ఒక పత్రికలో అచ్చు కోసం ఎదురుచూసేవారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు.
శ్రీనివాస్ గారు,
మీ స్వగతం, అందులో వ్యక్తపరచిన నిజాయితీ, సద్విమర్ష కు జేజేలు.
పత్రిక లో పని చేసే సంపాదకుడి కి ఎవరికయినా మీరు వర్ణించిన స్థితి ఎదురుకోవలసి వస్తుంది. ఎప్పుడు పరీక్ష లాగే ఉంటుంది.
వసంత లక్ష్మి గారు ఎప్పుడు చెప్పుతుండేది. అసలు, ఎంత space ఉంటుంది, ఎన్ని శీర్షికలు ఉంటాయి, ఎంత సమాచారం ఉంటుంది అన్న విషయాలు చెప్పినా అర్ధం చేసుకోరు అనేది. ఎన్నో అభిప్రాయాలు, ఆలోచనలకు తావుఇ వ్వాలి అనేది.
మీ వ్యాసం నాకు నచ్చింది.
*జీవన్ కుమార్
హక్కుల కార్యకర్త
శ్రీనివాస్ గారు,
మీ స్వగతం, అందులో వ్యక్తపరచిన నిజాయితీ, సద్విమర్ష కు జేజేలు.
పత్రిక లో పని చేసే సంపాదకుడి కి ఎవరికయినా మీరు వర్ణించిన స్థితి ఎదురుకోవలసి వస్తుంది. ఎప్పుడు పరీక్ష లాగే ఉంటుంది.
వసంత లక్ష్మి గారు ఎప్పుడు చెప్పుతుండేది. అసలు, ఎంత space ఉంటుంది, ఎన్ని శీర్షికలు ఉంటాయి, ఎంత సమాచారం ఉంటుంది అన్న విషయాలు చెప్పినా అర్ధం చేసుకోరు అనేది. ఎన్నో అభిప్రాయాలు, ఆలోచనలకు తావుఇ వ్వాలి అనేది.
*జీవన్ కుమార్
హక్కుల కార్యకర్త
ఆత్మవిమర్శ, అంతర్మథనం అవసరం. ఇది మీకే కాదు, మీ పాఠకులకు కూడా ఉపయోగరంగా వుంటుంది. ‘ సంధ్యా సమస్యలు’ మాత్రమే కాదు, సంపాదక సమస్యలు కూడా వుంటాయి. వాటిని సృజనాత్మకంగా ఆవిష్కరించవచ్చు. ఈ రచన అంత పనీ చేసింది. ధన్యవాదాలు…
చాలా హానెస్ట్ గా రాశారు. మధ్యలో బలేవుంది అనిపించింది. చివరకు వచ్సేసరికి మనసు బరువెక్కింది. ఇప్పుడు యాభైలలో ఉన్న కవులు, రచయితలు చాలా మందికి ఈ ప్రయాణం ఏదో విధంగా అనుభవమే. ఇది చదివి భుజాలు తడుముకునే వారు చాలా మందే ఉంటారు. మీరన్నట్లు సోషల్ మీడియా వచ్చిన తరువాత పంపించేవారిలో, ప్రచురించే వారిలో చాలా మార్పులు వచ్చేశాయి. మార్కెటింగ్ చేయకుండా మెచ్చుకోళ్ళు సహజంగా సమకూరే అవకాశం ఉందని నమ్మనే నమ్మరు అనడం బాగుంది. కానీ, నిజంగా నమ్మొచ్చా! ఏది ఏమైనా… ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘వివిధ’ది చెరిగిపోని అధ్యాయం. అందులో అచ్చయిన నా ఒక్కో కవిత నన్నెంత రెజువనేట్ చేసిందో చెప్పలేను. థాంక్ యూ ఫర్ సో మెనీ థింగ్స్ శ్రీనివాస్ గారూ.
వాస్తవాలు కొన్ని, తెలియని విషయాలు కొన్ని హాయిగా చదువుకున్నాం
శ్రీనివాస్ గారు! నమస్తే!
ఒక రచయిత ప్రారంభ దశను, పత్రికా సంపాదకుడిగా ఉన్న అనుభవసారాన్ని ఎంతో రమ్యంగా వాస్తవంగా అందించారు .
కృతజ్ఞతలు!
మీ బృహత్ కథనం ఆద్యంతం చదివాను. దశాబ్దాల క్రమంలో పత్రికా సంపాదకులకు, రచయితలకు మధ్య సంబంధాలు, రచనల ఎంపికలు, ప్రస్తుత పరిస్థితులు పూస గుచ్చినట్లుగా వివరించారు. ప్రతిరోజూ అసంఖ్యాకంగా పత్రికాఫీసులకు వచ్చి పడే రచనల్లోంచి స్థలకాలాలకు అనుగుణంగా ఏవి ప్రచురణకు తీసుకోవాలి. రచనల ఎంపిక జరిగిన తర్వాత కూడా కొన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుంది. కొన్ని రచనలను ఎందుకు తీసుకుంటాం. ఎందుకు తీసుకోలేం, రాజకీయ ప్రేరేపితమైన రచనల విషయంలో యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించే రచనలకు ఆమడ దూరంలో ఎందుకు ఉండాల్సి వస్తుంది.. వంటి సవాలక్ష రోజువారీ జర్నలిస్టు జీవితంలోని చిక్కుముఢులు రచనలు పంపే చాలామందికి, పాఠకులకు కూడా తెలియని విలువైన అంశాలు తెలిపారు. చందమామ చివరి సహసంపాదకుడిగా 2010 ప్రాంతంలో పనిచేయడం మొదలుకుని నేటి దిశ సంపాదకీయ, సాహిత్య పేజీలో పని వరకు ఎన్ని అమూల్య అనుభవాలు నా జ్ఞాపకాల్లో కూడా నిలిచి ఉన్నాయి. ప్రతి జర్నలిస్టూ, ప్రతి రచయితా, ప్రతి పాఠకుడూ కరదీపికలాగా భద్రపర్చుకోవలసిన గొప్ప జ్ఞాపకాలు మీవి. మీ విలువైన జ్ఞాపకాలను ఇంత విస్తృతంగా పంచుకున్న మీకు అభినందనలూ… ధన్యవాదాలూ..
డా. కె. శ్రీనివాస్ గారి ఈ వ్యాసం రచనల ఎంపికలో పాత్రికేయులకు పాఠం; రచయితలు, కవులు తమ రచన పత్రికలో ముద్రణకై గుర్తెర్గాల్సిన, గుర్తుంచుకోవాల్సిన, అలవార్చుకోవాల్సిన సంయమనం, సహృదయతలు వివరించిన తీరు ఒక మ్యానిఫెస్టోలా వుంది.