ఎండమావి!

వాడి జ్ఞాపకాలు నన్నొదలవు, వాడో నేనో,  పోతే  తప్ప. ఈ మధ్య నాలో కొత్త భయం మొదలయ్యింది,  వాడు నన్ను జన్మ జన్మలకి ఇలా సతాయిస్తాడేమో అని.

అందుకే నేను ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కూతురుగా, ఒక మంచి కోడలుగా, చాలా మంచి పనులు చేస్తూ, బోలెడు పుణ్యం మూటగట్టేసుకుంటూ, జన్మ రాహిత్యం కోసం పాటుపడుతున్నా.

వాడి బారిన పడిన నా జీవితం వయస్సు ఇప్పటికి ముప్పై ఏళ్ళు. డిగ్రీ రెండో సంవత్సరం లో ఒక స్నేహితురాలి ఇంట్లో దానికి లెక్కలు నేర్పిస్తూ కనపడ్డాడు మొదటి సారి. బుడబొక్కల బాగీ  ప్యాంటు, దాని మీద టైట్ స్లాక్ వేసుకొని అప్పటికి కాలం వెర్రి వంటపట్టిచ్చుకున్నోడి మల్లె.

నా మానాన నేను నా స్నేహితురాల్ని కబుర్ల లో దించడామని ప్రయత్నిస్తుంటే వాడేదో అపర రామానుజం  లాగ దాని బుర్రలోకి లెక్కలు ఎక్కిస్తున్నాడు. వాడిని లేని పోని ప్రశ్నలతో విసిగించి తరిమేసిన తరవాత దాని మాటల్లో తెలిసింది వాడు దాని సీనియర్ సీనియర్  అని, వాళ్ళ నాయనలు పరిచయస్తులని, అందుకే వీడు దానికి లెక్కలు నేర్పిస్తున్నాడని.

ఆ తర్వాత మా స్నేహితురాలింట్లోనే ఒకటో రెండో మార్లు చూశా వాడిని, బాగానే వుండాడు, మాటలు కూడా మీరకుండా బాగానే మాట్లాడతాడు, బాగానే చదవతాడు అని కూడా తెలిసింది. నేనూ వాడు వేరే వేరే కాలేజీ అయినా ఒకటే గ్రూప్  కావటం తో ఒకటీ ఆరా మా చదువులు గురుంచి మాటలు. వాడి మాటల్లో అనిపించింది వాడికి నేనంటే ఎదో ఇష్టం ఏర్పడుతుంది అని.

నా స్నేహితురాలి మాటల్లో పట్టాడే ఏమో కానీ, నేను రెండో సంవత్సరం లో ఓ ల్యాబ్  తప్పానని బోలెడు సానుభూతి, దాంతో పాటు బోలెడు ధైర్యం చెబుతూ ఇన్ ల్యాండ్ కవర్లో ఆఖరికి అతికించే సైడ్ కూడా వేస్ట్ కానీయకుండా ఓ ఉత్తరం రాసాడు.

వాడికి తెలుసు నేను ఇటువంటి చిన్న చిన్న సెట్ బ్యాక్ లకి భయపడే దాన్ని కాదు అని, కానీ సాకు కావాలి వాడికి లెటర్ రాయడానికి. అయినా ఆ లెటర్ లో ఏమి  వుండి సచ్చింది కనక, కనపడ్డప్పుడల్లా వాడు వాగే చదువు గోల తప్ప.

కలిసినప్పుడల్లా సర్వీసెస్ లేక ఎం.బీ.ఏ కి రాయమని శత  పోరేవాడు. ఎక్కడ పట్టేవాడో కానీ కట్టల కట్టలుగా మెటీరియల్ ఇచ్చేవాడు. లెటర్స్ లో తెగ సతాయించే వాడు వాటి గురుంచే. ఇంజనీరింగ్ సర్వీసెస్ కి అయితే నా ఫీజు కూడా వాడే కట్టేసాడు.

వాడికసలు జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ ఎంత సూన్యమంటే, ఒకసారి కలిసినప్పుడు అడిగాడు నువ్వు లెటర్ అంతా అయ్యాక ఎల్.యూ.వి అని సైన్ చేస్తావ్, దానర్థమేంది అని. నా బొందరా నా బొంద అని చెప్పా వొళ్ళు మండి .

ఈ కామన్ సెన్స్ లేని వాళ్లకే  వొస్తాయి, పీ.జీ లలో సీట్లు మరియు డిస్టింక్షన్లు. నాలాటి ధైర్యస్థురాళ్లు, స్ట్రీట్ స్మార్ట్ లు మాత్రము ఫస్ట్ క్లాస్ లతో సరిపెట్టుకోవాలి. అలా ఏడ్చి చచ్చాయి మన చదువులు.

ఏరా పీ జీ సీట్ వచ్చింది, ఇంకా ఏమిటి నీ ప్లాన్ అని అడిగా ఒకరోజు మా వూర్లో కాలి నడకన వాడి పక్కన నడుస్తూ. పెద్ద పోజ్ కొట్టాడు . పీ జీ చదివి వుద్యోగం సంపాదించి, కుటుంబాన్ని ఉద్దరించాలని. ఉద్దరించరా నాయనా నేనేమన్నా కాదన్నానా అని చెప్పా అప్పటికీ, వాడికి  అర్ధమవ్వుద్ది అని.

అప్పుడు కక్కాడు అసలు విషయం, మా ఊరంతా నడిపించి నడిపించి, మా మధ్య తిండి దగ్గర నుండి పద్దతుల వరకూ కంపాటబిలిటీ ఇష్యూస్ అని. అదీ కాక నేనెప్పుడో వాగానట నా స్నేహితురాలి దగ్గర మా సోదరీమణి ఇంటర్ కాస్ట్  చేసుకున్నప్పుడు మా నాన్న పడిన నరకం చూసి నేను మా అయ్య చూసిన ఏ గొట్టం గాడిని అయినా చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని.  అందుకని వీడు మనస్సు మార్చుకున్నాడట.

ఎదవ సోది చెప్పాడు ఆరోజు. వాళ్ళ అయ్య చెప్పుంటాడు వాడికి,  “మనోళ్ళలో కట్నం బాగా వస్తుందిరా నాయనా, నువ్వు ప్రేమా దోమా అంటూ ఎవరి వెంట పడకు” అనో, లేక ఈ మధ్య గాప్ వచ్చింది కదా దేని వెంటో  పడుంటాడు, అందుకే ఆ సోది అంతా అననుకున్నా.

అప్పటికీ చెప్పా, అదేమీ లేదురా నాయనా అనీ, ఊహూ వినడే మూర్ఖపు వెధవ. చాలా ఎదురు చూసానబ్బా వాడికోసం. అలా వాడేమో పీజీ కి ఇటు నేనేమో ఉద్యోగార్థం దూర రాష్ట్రానికి వెళ్ళిపోయాము.

మరల కలవటం ఓ ఏడాది తర్వాతే. మా నాన్నగారు ఆ సంవత్సరమే పోయారు అని కూడా తెలీదు వాడికి.

మూడు సెమిస్టర్ల పీజీలో రెండు సెమిస్టర్లు అయ్యాక, క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం సంపాదించి మా వూరు వచ్చాడు. అప్సరా లో కాఫీ తాగుతూ అసలు విషయం లోకి వచ్చాడు. “ఉద్యోగం వచ్చింది, బతకగలను, బతికించుకోగలను అనే ధైర్యం వచ్చింది, కాబట్టి నువ్వు ఇంకో రెండేళ్లు ఆగితే మనం పెళ్లి చేసుకుందాము “అని.

నవ్వొచ్చింది నాకు వాడి మొహం చూస్తే, ఆ చెప్పే విధానం చూస్తే, టీచర్ ముందు చేతులు కట్టుకొని ఒప్ప చెప్పే బాలుడిలా.

“ఏరా ! దీని నాన్నగారు చనిపోయారు. ఇక దీనికి పెళ్లికాదు అనేమన్న జాలి పడుతున్నావా నువ్వు” అని అడిగా.

“నిన్నసలు నేను ఆడపిల్లలా చూడలేదు. నువ్వెక్కడైనా ధైర్యం గా బ్రహ్మాండం గా బతికెయ్యగలవ్ అనే నమ్మకం నాకున్నప్పుడు నీ  మీద జాలి ఏమిటి. నాకు నిజం గా ఇష్టం కాబట్టే అడుగుతున్న” అన్నాడు వాడు.

నన్ను ఎక్కువా చెయ్యడు, తక్కువా చెయ్యడు. వాడితో నేను సమానం అనుకుంటాడు. అదే నాకు వాడిలో నచ్చేది, నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది

నవ్వి నవ్వి చెప్పా, “నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేట్  రా అబ్బయ్య” అని. తెల్ల మొహం వేసాడోడు.

“ఈ సంవత్సర కాలం లో చాలా జరిగిపోయాయి, కొన్ని నా ప్రమేయం లేకుండా, మరి కొన్ని నా ప్రమేయం తో.

మా  నాన్న గారు పోయారు, ఆయన పోయిన సంవత్సరం లోపే నాకు పెళ్లి అయితే ఆ కన్యాదాన ఫలం మా నాన్న గారికే చెందుతుంది కాబట్టి, అర్జెంటు గా నా పెళ్లి జరిపించేయాలని మా బంధు వర్గం చాలా పట్టుబట్టారు. దీంతో నా ప్రమేయం లేదు.

కుక్కతోక పట్టుకొని నేను గోదారి ఈదలేను. నిన్ను నమ్ముకొని, నేను పెళ్ళివాయిదా వేసుకోలేను. అందుకనే నేను పెళ్ళికి ఒప్పేసుకున్న. నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది నా ప్రమేయంతోనే” చెప్పా కచ్చిగా.

వాడి కళ్ళల్లో నీళ్లు, బాధ. నాకు తెలుసు నన్ను వొదులుకోవటం వాడికి చాలా కష్టం.

తమాయించుకొని అడిగాడు, కుదరదా అని.

“అస్సలకే కుదరదు. మా వాళ్లంతా మెట్టుతో కొడతారు. ఎందుకంటే, వరుడిని నేనే సెలక్ట్ చేసుకున్నా. తాను మా సీనియర్. చాలా కాలం నుండి నేనంటే ఇష్టపడుతున్నాడు. నేను లేకపోతే బతక లేను అంటున్నాడు” ఇష్టం, బతకలేక పోవటం కాస్త వొత్తి పలుకుతూ చెప్పా.

చాలా సేపు సైలెంట్ అయ్యాడు వాడు.

ఇప్పటికన్నా చెప్తాడు అని ఆశించా, “నువ్వు లేకుంటే నాకు కష్టం, నేను బతకలేను” అని.

అసలు వాడి ఇష్టం నా ఇష్టమంత బలమైనదా కాదా అనే సందేహం నాది. కానీ ఆ మాట మాత్రం చెప్పడు. వొళ్ళంతా బలుపు వెధవకి.

ఎంత సేపటికీ బెల్లం కొట్టిన రాయిలా కూర్చోవటమే కాని, ఏమన్నా బయటపడి చస్తే కదా!

విసుగ్గా వుంది నాకు ఆ మౌనం, లేచి, హ్యాండ్ బాగ్ తీసుకొని, “ఇక నేను బయలుదేరుతా” అని వస్తూ అడిగా, “కార్డు పంపుతా వస్తావా పెళ్ళికి” అని.

వాడి మొహం చూస్తేనే అర్థమయ్యింది నాకు, ఇదే వాడి ఆఖరి చూపు అని.

నాకూ అదే కావాలి. మనం స్నేహితులుగా ఉండిపోదాము అనే అర్థం లేని మాటా లేక అర్థం లేని పనులు నాకూ ఇష్టం లేదు వాడితో

ఎప్పటికి ఇల్లు చేరేడో ఏమో. ఆ తర్వాత నాకు కనపడలా.

వాడు నా పెళ్ళికి రాడు  అని తెలుసు, ఇంట్లో వాళ్ళకి నా ఊహలు తెలిస్తే చంపేస్తారని తెలుసు, అయినా పెళ్లి మంటపానికి వాడు వస్తాడు, ఎదో ఒక మాయ చేసి నా మెళ్ళో తాళి కట్టేస్తాడనే  పిచ్చి ఆశ నన్ను వదలలా. వాడు రాలా!

నా పెళ్లి అయిపొయింది. వాడేమో వెళ్లి పీజీ కంప్లీట్ చేసుకొని జాబ్ లో చేరి పోయి ఉంటాడు.

వాడన్నట్టే నేను ఎక్కడ వున్నా బాగుంటాను, నా జీవితం చాలా బాగుంది. బంగారపు పూలతో చేశానేమో పూజ, నా మొగుడు నిజంగా బంగారమే.

ఒకవేళ కనపడితే మా మధ్య సంభాషణ ఎలా ఉంటుందో అని చాలా సార్లు ఊహించా.

“ఎక్కడున్నా బాగుంటావు.ఇంకో వందేళ్లు బతికేయి” అంటాడు వాడు

నేను భయం భయం గా, “నువ్వెలా వున్నావురా?” అని అడగతా.

“నాకేమే  నేను ఫస్ట్ క్లాస్, నేను సూపర్” అంటాడు వాడు.   వళ్లంతా, బలుపు కదా వాడికి.

వాడి గురించి  ఇవే నా ఆలోచనలు యిన్నేళ్ళు, మొన్న వాడి గురించి తెలిసే వరకూ.

వాడి జీవితం లో ఎన్నో మంచి విషయాలు జరిగుంటాయి. అవి ఏవీ ఎవరూ ఎప్పుడూ నాకు పనిగట్టుకొచ్చి చెప్పలా.

“వాడు నెలక్రితం కోవిడ్ తో పోరాడి, రికవర్ అవుతూ, సడన్ గా స్ట్రోక్ తో పోయాడు” అని నన్ను వెతికి వెంటాడి వచ్చి చెప్పారు.

నా మానాన నేను వాడెక్కడున్నా హాయి గా ఉంటాడనే భావనలో ఉండటం వాళ్ళకి నచ్చలేదు కాబోలు.

“అడగలేక అడగలేక అడిగా, నాకు ఫోన్ చేసిన వాళ్ళని, వాడి భార్య, పిల్లలు ఈ షాక్ ఎలా తట్టుకున్నారు” అని.

“నిట్టూర్చి చెప్పారు వాళ్ళు, వాడసలు పెళ్లే చేసుకోలేదని”

నేను వెంపర్లాడిన జన్మరాహిత్యం వాడికి దొరికినట్టుంది.

*

హర్షవర్ధన్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు