కవిత్వం, కథ రెండూ అద్భుతంగా రాయగల సాహిత్యకారులు చాలా అరుదుగా ఉంటారు. పాలమూరు బిడ్డ గుడిపల్లి నిరంజన్ అటువంటి అరుదైన సాహిత్యకారుడు. లందపొద్దు కవితా సంకలనంతో కవిగా…నీరేటిగాని కల, ఊరు మెచ్చిన మనిషి…లాంటి కథలతో ప్రముఖ కథా సంకలనాల్లో చోటు సంపాదించారు గుడిపల్లి. నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి వీరి స్వస్థలం. సొంత ఊరును కలం పేరుగా పెట్టుకొని ”గుడిపల్లి నిరంజన్”గా కథలు, కవిత్వం, అటు సాహిత్య విమర్శ చేస్తున్నారు. ఇప్పటివరకు “పొద్దైంది” కందనూలు కవిత్వం సంపాదకత్వం, “లంద పొద్దు” తెలంగాణ బహుజన కవిత్వం, “బడి కైతలు” (38 మంది విద్యార్థుల కవిత్వం) “ఎరుక” బహుజన మహోద్యమ దీర్ఘ కావ్యం, “నాగర్ కర్నూలు జిల్లా సాహిత్యచరిత్ర, “నిట్టాడి” భారతరత్న అబ్దుల్ కలాం శాస్త్రీయ జీవితంపై దీర్ఘ కవితలు ప్రచురించారు. తెలంగాణ దళిత కథలు సంకలనానికి, తొలి తెలుగు దళిత కథా వార్షిక తొండం బొక్కెన సంకలనానికి సహ సంపాదకులుగా ఉన్నారు. తాను రాసిన ఊరు మెచ్చిన మనిషి కథ వెనుక అనుభవాన్ని సారంగ పాఠకులతో పంచుకున్నారు.
***
నేను నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామంలో దళిత కులంలో జన్మించాను. ఊరన్న ,పల్లె జనమన్న మహా ఇష్టం .ఊరు పై ఉన్న అభిమానంతో నా కలం పేరుగా “గుడిపల్లి” ని పెట్టుకున్న .నా ఇంటి పేరు కొడిదల నిరంజన్ .కానీ సాహిత్యకారులకు “గుడిపల్లి నిరంజన్” గానే ఎక్కువ మందికి తెలుసు.
చిన్నప్పటినుంచి మా ఊరిలో వృత్తి కులాల మధ్య ఉన్న ప్రేమ సంబంధాలను, స్నేహసంబంధాలను చూసి పెరిగాను. అప్పుడప్పుడు ఈ కులాల మధ్య ఘర్షణ సంబంధాలను కూడా చూశాను. ముఖ్యంగా బీసీలు దళితుల మధ్య భౌతిక దాడులకు సంబంధించిన ఘటనలను కూడా చిన్నప్పుడే చూశాను.
మాదిగ వాడలో మనుషులు మోసాలను ,గాయాలను మోసుకు తిరుగుతుంటారు. ఎన్నో నెత్తుటి జ్ఞాపకాలను మిగిల్చి కొని బతుకీడుస్తుంటారు. వారి మెదళ్ల చుట్టూ ఆంక్షల కంచెలు వారు పుట్టకముందే బిగించి ఉంటాయి. బతుకు నిండా కన్నీటి నదులు పారుతుంటాయి. నిరాశా నిస్పృహలు శకలాలు శకలాలుగా నిత్యం రాలి పడుతుంటాయి. బతుకంతా దుమ్ము కొట్టుకపోతుంది. ఏ అవకాశం వారికి దక్కదు. ఎవరు వాళ్ళు బాధ చూడరు.తీర్చరు. ఆర్థిక ఆంక్షలు, సాంస్కృతిక ఆంక్షలు, సామాజిక ఆంక్షలు, రాజకీయ ఆంక్షలు ఇవన్నీ కూడా సహజంగానే నిర్మాణమై ఉంటాయి.ప్రతిబంధకంగా అడ్డు తగులతాయి. ఇవన్నీ ఎదిరిస్తే తప్ప బతుకు గొప్పగా పండదు.
అట్లా ఆర్థిక స్థోమత లేకపోవడం చేత చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోతుంటారు.ఇది గమనించిన నేను దీనిని కథగా మలచాలి అనుకున్నాను.
నేను కొన్నాళ్లు మా గురువు కొంకల వెంకట నారాయణ సార్ ప్రభావంవల్ల కుల -వర్గ దృక్పథంతో పనిచేసే కామ్రేడ్ మారోజు వీరన్న సిద్ధాంతాన్ని దగ్గరగా పరిశీలించాను. కొన్ని మీటింగుల్లో పాలుగొన్నాను. కొన్ని రోజులు పని చేశాను కూడా .ఆ ప్రభావంతో కుల -వర్గ దృక్పథంతో ఒక కథ రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఆ నేపథ్యంలో రాసిన కథ ఊరు మెచ్చిన మనిషి-కథ.
సాధారణంగా దళిత కథలన్నీ కూడా ఎక్కువగా అగ్రకుల తత్వాన్ని క్రూరంగా చూపిస్తాయి .నేను చదివిన కథలన్నీ కూడా ఉన్నత కులాల వ్యక్తులను శత్రువులుగా చూపించిన కథలే. ఉన్నత కులాలకు నిన్న కులాలకు మధ్య శత్రుత్వం తప్ప ప్రేమ, సమభావం ,సౌభ్రాతృత్వం లేనట్లుగానే దాదాపుగా కథలన్నీ రికార్డయ్యాయి. ఈ రెండు కులాల మధ్య ఉన్న సంబంధాలు శత్రు సంబంధాలు గానే చెప్పేస్తున్నారు. రా చేస్తున్నారు. అయితే ప్రతి దానికి ఉన్నత కులాలను తిడుతూ వారి జులుంను పెత్తనాన్ని దూషిస్తూన్నాం.వారి అవమానాలను అన్యాయాలను, దోపిడీని భరించి సహించిన పాత్రలే కథల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ కథల్లో సమస్య చిత్రాణలతో పాటు తిరుగుబాటు ప్రతీకారంకూడా వ్యక్తమయ్యాయి. ఒక శాతమో అరశాతమో,లేదా తక్కువ శాతమో ఉన్నత కులాలలో కూడా మానవత్వం చూపించే వ్యక్తులు తప్పకుండా ఉన్నారు. నేను ఈ” ఊరు మెచ్చిన మనిషి “కథలో అట్లా అన్ని కులాల వ్యక్తులతో స్నేహంగా ఉండి చెప్పులు చేసుకొని ఈదయ్య జీవితాన్ని ఈ కథలో చెప్పాలనుకున్నా. అయితే ఈ కథ రాసేటప్పుడు దళిత జీవితం ఉండాలి. దళిత వృత్తులు కనపడాలి. అన్ని కులాల తోటి స్నేహంగా ఉండే ఒక సన్నని పొరలాంటి సంబంధమేదైతే ఉందొ దాన్ని పట్టుకోని చెప్పాలనుకొని రాసిన కథ ఇది.
ఈ కథలో ఉన్న వస్తువు యదార్థం. నా కళ్ళ ముందు జరిగిన కథ.ఏమాత్రం కల్పితం లేని కథ. కిడ్నీలు ఫెయిల్ అయ్యి,డబ్బులు లేకపోవడం వల్ల,డయాలసిస్ చేసుకోక పోవడం వల్ల మా భార్య మేనమామ ఈదయ్య కక్కయ్య చనిపోతాడు.నేను డబ్బులు అప్పు ఇస్తానని చెప్పాను.కానీ పిల్లలు చిన్నవాళ్ళు అప్పు పెట్టొద్దు.నేను బతికి గడెం దున్నేది ఉందా నాయనా అని చావు ఎద మీద కూసున్నా కూడా నవ్వుతూ చెప్పిండు. అట్లా అని చెప్పి మాహాబూబ్ నగర్ హాస్పిటల్ నుండిట్రీట్మెంట్ తీసుకోకుండానే , డయాలసిస్ చేసుకోకుండానే ఇంటి మొకం అంబులెన్స్ ను మలిపిచ్చిండు.నేను ఈ హాస్పిటల్ లో చావను గాక చావనన్నాడు.నేను పుట్టిన ఊళ్ళో,కట్టుకున్న గుడిసె ముందర చస్తా అన్నాడు.అంబులెన్స్ ఇంటికోతుంటే ఆ కక్కయ్య పక్కనే నేను కూర్చున్నా. నా మనసు మసి పూసినట్లు అవుతుంది. కడుపులో కసిబిసి అవుతోంది. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల,తిరుగు ప్రయాణంలో నా ప్రక్కనే మనిషి ఆయాస పడుతుంటే నేను చూసి తట్టుకోలేక పోయిన ఊపిరాడని స్థితిని కథగా రాసిన. ఆ కక్కయ్య గుండె ధైర్యం నన్ను కట్టిపడేసింది. బుద్ధుడి ప్రకారం విపస్యన చేసిన వ్యక్తి మాత్రమే పుట్టుకను,చావును సమానంగా స్వీకరిస్తాడు. ఆ రకంగా ఆ ఈదయ్య కక్కయ్య లో నాకు గొప్ప తాత్వికుడు కనపడిండు.ఈ వస్తువు తో కథ రాయాలని అనుకున్న. ఒక్క రోజులోనే కథ రాసిన.
ఈ కథలో ఈదయ్య చెప్పులు కుట్టుకుంటూ వృత్తి జీవితాన్ని గడుపుతుంటాడు. కుటుంబాన్ని పోషిస్తుంటాడు. సహజంగానే ఈదయ్య కక్కయ్య మృదుస్వభావి. కలుపుగోలు వ్యక్తి. తన కులం వారితో కంటే ఎక్కువగా పై కులాలతోటే సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. అన్ని కులాల వాళ్లను వరుసలు పెట్టి పిలుస్తుంటాడు. ఇతర కులాలు వాళ్ళు కూడా అలానే ఆయన్ని పిలుస్తుంటారు.
ఆ బంధుత్వాల నేపథ్యంలో ఈదయ్య కక్కయ్యను ఆయాసపడుతుండగానే, తను కోరుకున్న ఇంటి ముందు పడుకోబెట్టాము.
మలమూత్ర విసర్జన రెండు రోజులనుండి లేకపోవడం వల్ల బ్లడ్ పాయిజన్ అయ్యి, రెండో రోజు మా కళ్ళ ముందరే పానం బోక ఆయాస పడుతుండు.
అట్లా పడుకోబెట్టిన మనిషిని అన్ని కులాల వాళ్ళు బీసీలు, ఓ సి లు కూడా వచ్చి ఆత్మీయంగా పలకరిచ్చారు. ఊరి సర్పంచి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి చేయి పట్టుకొని పలకరించాడు. ఆ సమయంలో తనకు శక్తి లేకున్నా కూడా లేవడానికి ప్రయత్నించాడు .సర్పంచ్ గారు వారించి పడుకో పడుకోఅని అన్నారు. అట్లా అన్ని కులాలతో మాట్లాడిందు. తన పిల్లలను ప్రేమగా చూసుకోమని వచ్చిన వాళ్ళ తోటి చెప్పిండు. నేను బతికినన్ని రోజులు ఊర్లో అందరికీ చెప్పులు చేశాను. కోరుకున్న రకంగా చెప్పులు చేశాను. చిన్నా పెద్దా అందరికీ మంచిగా ఉన్నా .నాకు తెలిసి నేను ఎవరికీ ఎదురు మాట్లాడింది లేదు.అన్యాయం చేసింది లేదు. అయినప్పటికీ నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే మనసులో పెట్టుకోకుండా మన్నించండి అంటూ చివరి కోరిక గా కోరుకున్నారు .ఆ సందర్భంలో అక్కడున్న అందరికి కళ్ళ నీళ్లొచ్చాయి. అందరం చూస్తుండగానే మా కళ్ళ ముందట నవ్వుతూ జీవి ఇడిసిండు.
అందరూ ఆయన జ్ఞాపకాలను గుర్తించుకొని బొంద పెట్టి ఇంటికి వచ్చారు. కడుపుతోటి ఉన్న ఈదయ్య కక్కయ్య పెద్దకోడలు సాయంత్రం పండంటి బాబుకు జన్మనిచ్చింది . చుట్టాలు బక్కాలు అక్కడికొచ్చిన మంది, ఒక ఈదయ్య మట్టిలోకిపోయిండు. ఇంకో ఈదయ్య పుట్టిండు అని తాత రూపంగా చెప్పుకొన్నారు. ఇది యధార్థం .దీన్ని కథగా మలిచాను.2016లో ఈ కథ ఆదివారం ‘బతుకమ్మ ‘లో ప్రచురణ పొందింది. ఆ తర్వాత పెద్దలు సంగిశెట్టి శ్రీనివాస్ , వెల్దండి శ్రీధర్ గార్లు తీసుక వస్తున్న తెలంగాణ కథా వార్షిక 2016 “కూరాడు” పుస్తకంలో ఉత్తమ కథగా ఎంపిక చేశారు. వారికి ధన్యవాదాలు.
*
very nice writing, thank u