ఉద్యోగ పర్వం – కొన్ని అపజయాలూ, కొంత అసంతృప్తి

రావిశాస్త్రివంటి గొప్ప రచయిత మళ్లీ పుడతాడని అనుకోను. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ రకమైన వ్యంగ్యం, విరుపు కనిపించేవి కాదు.

నా ఆలోచనలకు, చదువుకు తగిన ఉద్యోగం రాదేమోనన్న చింత నన్ను నిలువునా దహించేసేది. నా యువ మేధకు మరే విషయమూ పట్టనంతగా, ఆ దిగులొక కారుమేఘంలా కమ్ముకుంది. కళ్లు మూసినా తెరిచినా ఒకటే ప్రశ్న కళ్ల ముందు కరాళ నృత్యం చేస్తూ ఉండేది. వీలయినంత త్వరగా ఉద్యోగం రాకపోతే ఎలాగన్నదే ఆ ప్రశ్న.

డిప్లమా అయిన తర్వాత వేసవి సెలవుల్లో ఇంటికొచ్చానన్న మాటేగాని, వేరే ఏ పనీ తోచేది కాదు. ఏదీ సరదాగానో, ఆటవిడుపుగానో అనిపించేది కాదు. కొత్తగా పెళ్లయిన మా చెల్లెలి సంసారాన్ని స్థిరం చేసి, అవకాశం దొరకగానే నేను చేసిన మొట్టమొదటి పని వాల్తేరు వెళ్లడమే.

మామూలుగానైతే ఆ సమయంలో యూనివర్సిటీ సందడిగా ఉండదు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోతే, పిట్టలు లేని చెట్టులాగా ఉంటుంది. కాని నేను వెళ్లేసరికి తద్విరుద్ధంగా కనిపించింది. ఎటుచూసినా మనుషులు, బిజీగా, పండగ వాతావరణం నెలకొని ఉంది. ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నేపథ్యంలో శాసనసభ వేసవి సమావేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ వేదికయింది. అందుకే ఆ హడావుడి. కర్నూల్లో మండే ఎండల కన్న విశాఖ ఉక్కపోత మేలనుకున్నారేమో, మరి. హాస్టలు గదుల నిండా కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులు బిలబిలలాడుతూ కనిపించారు.

కాని ఇది నడిచింది చాల స్వల్ప సమయానికే. కాంగ్రెస్ పార్టీ సభ్యులొకరు తన పార్టీని కాదని, ప్రభుత్వం మీద అసమ్మతి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో ఒకే ఒక ఏడాది వయసున్న పసిగుడ్డు ప్రభుత్వం పడిపోయింది. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఏపీలో గవర్నర్ పాలన విధించబడింది. గవర్నర్ గా సి.ఎమ్.త్రివేది ఉండేవారు. ఆయన దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్ట వ్యక్తి. పాలనాదక్షుడని పేరుండేది. ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగంలో కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ విభాగాన్ని నడిపించిన ప్రొఫెసర్ గోపాల్ ఇక్కణ్నుంచి మద్రాసు యూనివర్సిటీకి వెళ్లిపోయారు. భావరాజు సర్వేశ్వర్రావుగారు తన చదువు ముగించుకుని కేంబ్రిడ్జి నుంచి తిరిగివచ్చేశారు. (వారి థీసిస్ ను కేంబ్రిడ్జి అప్రూవ్ చెయ్యవలసి ఉండేది) రీడర్, హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ అయ్యారు. నేను ఆయనను కలుసుకుని నా రాక ఉద్దేశాన్ని, వి.ఎస్.కృష్ణగారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇస్తామన్నారన్న మాటనూ ఆయనకు చెప్పాను.

‘అయితే ఇంకేం, ట్యూటర్ గా చేరు వెంటనే..’ అన్నారాయన.

వాస్తవానికి అక్కడొక ప్రొఫెసర్ పోస్టు ఖాళీ ఉంది. అది భర్తీ అయ్యేలోగా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ట్యూటర్ అవసరం. అది ఒక్క ఏడాదికి. తర్వాత కొనసాగుతుందని హామీ ఏమీ లేదు. జీతమూ చాలా తక్కువ. ఆ రోజున అది నెలకు నూటపాతిక రూపాయలు. వేరే అలవెన్సులేమీ ఉండవు. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అవార్డు మేరకు అది 137 రూపాయలకు పెరిగింది. ఏదైనా, ఆనాడు దీనికి అంగీకరించడం తప్ప నాకు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఈ ఉద్యోగంలో ప్రవేశించాక కావాలనుకుంటే అఫిలియేటెడ్ కాలేజీల్లో లెక్చరర్గా చేరేందుకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో కాస్త స్థిమితంగా వెతుక్కోవచ్చు. కాని ఎందుకో నేను ముందు నుంచీ ఆ ఉద్యోగాల పట్ల విముఖుణ్ని.

అందువల్ల సర్వేశ్వర్రావుగారి మాటకు మారు మాట్లాడకుండా యూనివర్సిటీలో ట్యూటర్ గా చేరిపోయాను. డిపార్ట్ మెంట్ లో కొలీగ్స్ అనదగిన అందరూ నాకు అధ్యాపకులు. ఆ ఏడాది కొత్తగా చేరేవాళ్లు తప్ప, ఉన్న విద్యార్థులంతా నాకు జూనియర్లు. ఈ నేపథ్యంలో నాకు తొలి ఉద్యోగంలో కొత్త అనిపించలేదు. అంతా పరిచయస్తులు, పరిచయమున్న వాతావరణం.

నా విద్యార్థులు క్లాసురూమ్ వరకూ నన్ను వారి అధ్యాపకుడిగా గుర్తించడం ప్రారంభించారు, బయట ఒక సీనియర్ స్నేహితుడిగా చూసేవారు. నేను ఎకనామిక్స్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ చెప్పాలి. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ఎకనామిక్స్ బోధించాలి. ట్యూటర్ గా మరో ప్రధానమైన బాధ్యత ఏమంటే ఫైనలియర్ వాళ్లకు కొన్ని ఎక్స్ ట్రా ట్యుటోరియల్ క్లాసులు చెప్పాలి. అవి వారికీ, నాకూ కూడా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉండేందుకు నేనో ప్రణాళిక వేసుకున్నాను. ఎకనామిక్స్ కు శామ్యూల్సన్స్ అనే పాఠ్యపుస్తకం ఉండేది. దాని వర్క్ బుక్ ను రిగరస్ గా రివ్యూ చెయ్యడం, చేయించడం పనిగా పెట్టుకున్నాను. ఒకో ఆర్థిక అంశం మీద విస్తృతమైన చర్చ జరిగేలా చూడటం, దానికి సంబంధించి ఒక్కో విద్యార్థి ఒక్కో వ్యాసం రాసుకుని రావాలి. నేను చాలా బాగా ప్రిపేరయి వెళ్లేవాణ్ణి. అందువల్ల ప్రతి క్లాసులోనూ చెప్పాల్సిన మెటీరియల్ చాలా ఉండేది. అందువల్ల, నా స్వాభావికమైన తీరు వల్ల నేను చాలా త్వరత్వరగా మాట్లాడేసేవాణ్ని. అది విద్యార్థులకు అర్థం కావడం కష్టంగా ఉండేది. ఈ విషయం నాకు తెలిశాక నేను ఒకసారి చెప్పిన అంశాన్నే మరోసారి కూడా చెప్పేవాణ్ని. అప్పుడు వాళ్లకు బాగా అర్థమయ్యేది. అప్పటికీ కాకపోతే, అటువంటివారు మరోసారి చెప్పమని అడిగేవారు. నేను తప్పకుండా చెప్పేవాణ్ని. ఆ రకంగా మేం పరస్పరం అడ్జెస్ట్ అవడం నేర్చుకున్నాం.

ఉద్యోగంలో కాస్త కుదురుకున్నాక నేను నా భార్య రమను విశాఖపట్నం తీసుకొచ్చాను. డాబాగార్డెన్సులో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాం. మాకు బంధువులు ఎక్కువగా వచ్చేవారు. వాళ్లలో ఎక్కువమంది రమ కజిన్స్, అక్కచెల్లెళ్లు. తొలిసారి పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన పడుచు, అందునా కొత్త కాపురం – వీటితో ఎలా సర్దుకుంటోందో అన్న ఆదుర్దాతో వచ్చేవారు. మా అత్తవారి కుటుంబంలో జిల్లా పరిధి దాటి బయటకు వెళ్లిన తొలి ఆడపిల్ల రమే. వాళ్లెవరూ అంతకుముందు పట్నాన్ని చూసినవారు కాదు. ఈమెను చూడొచ్చన్న మిష ఒకటి, పనిలోపనిగా విశాఖపట్నాన్ని, సముద్రాన్ని చూడొచ్చని కొంత. వాళ్ల రాకపోకల వల్ల రమకు ఇంటి బెంగ లేకుండా ఉండేది, రెండోది మా సంసారానికి సరిపడా అన్ని వస్తువులూ వాళ్లే తీసుకొచ్చేసేవారు. బియ్యం, పప్పులు, నెయ్యి, కూరగాయలు – ఇలాంటివి. నా సంపాదన మాకు బొటాబొటీగా సరిపోయేది. నిజం చెప్పాలంటే అందులో అధికభాగం కేవలం వినోదానికే పోయేది. వచ్చిన ప్రతి తెలుగు సినిమానూ వదలకుండా చూసేవాళ్లం మరి!

ఇలాగ ఒక ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియదు. ఇక నా ఉద్యోగం ముగిసినట్టేనని, నన్ను వెళ్లిపొమ్మని చెబుతారని అనుకున్నాను. కాని దానికి బదులు నేను లెక్చరర్ గా ప్రమోట్ అయ్యాను. అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. పాత సబ్జెక్టులతో పాటు ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ కూడా చెప్పాలన్నారు. అప్పటికి ఆ సబ్జెక్టు పెద్దగా అభివృద్ధి చెందలేదు. దాంతో ఎవరికీ కాన్సెప్టుల మీద పట్టులేదు. పిగో, డాల్టన్ రాసిన పుస్తకాలే ఆధారం. ‘ద మస్గ్రావియన్ ఫ్రేమ్ వర్క్’ ఇంకా రానేలేదు. టాక్సేషన్, ఉత్పత్తి మీద దాని ప్రభావం, వినియోగం, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాల మీదే ప్రాముఖ్యత ఉండేది తప్ప, ఇండివిడ్యువల్ టాక్సెస్ వంటివి అభివృద్ధి కాలేదు. ఉన్నదానిలో సైతం ఇండియన్ సిస్టమ్ గురించి మరీ తక్కువ. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కు కొనసాగింపు అన్నట్టుగా ఉండేది ఆ సబ్జెక్టు. ఇప్పుడు తిరిగి చూస్తే అదంతా పాత చింతకాయ పచ్చడి అనిపిస్తుంది.

ఉదయాన్నే రేడియోలో ఇంగ్లిష్ వార్తలు వినడంతో నా దినచర్య మొదలయ్యేది. (అప్పట్లో పత్రికలు సాయంత్రం వచ్చేవి, యూనివర్సిటీ నుంచి ఇంటికెళ్లాక రాత్రి చదివేవాణ్ని) వార్తలు విన్నాక, ఆరోజు చెప్పబోయే క్లాసుల కోసం ప్రిపేరయ్యేవాణ్ని. మరోవైపు ఆలిండియా సర్వీస్ (సివిల్ సర్వీస్) పరీక్షల కోసం ప్రిపేరయ్యేవాణ్ణి. యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చాక టౌనుకు వెళ్లడం, ఒక బృందాన్ని కలవడం నిత్యం జరిగేది. పాల్ఘాట్ కాఫీ హౌస్ కు వెళ్లి వేడి కాఫీ తాగి, బంగాళా దుంపల చిప్స్ తినేవాళ్లం. ఈ బృందంలో యూనివర్సిటీ లెక్చరర్లు, రచయితలు… ఇలా విభిన్న రంగాలకు చెందినవాళ్లుండేవారు.

అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రిగారి గురించే. రావిశాస్త్రి పేరుతో ఆయన సుప్రసిద్ధులు. ఆయన ప్రతిభావంతుడైన న్యాయవాది అయినా చాలా తక్కువ ప్రాక్టీసుండేది. ఆయన స్నేహితులు కొన్ని కేసులిచ్చేవారు. అవి ఎలాంటివంటే అప్పట్లో ప్రొహిబిషన్ ఉండేది, దాన్ని ఉల్లంఘించినవారి కేసులు. నిరుపేదలు, పొట్టకూటికి అంగలార్చేవారు పొద్దంతా కష్టం చేసి తమ కష్టాన్ని మరిచిపోయేందుకు తాగుతూ ఉండేవారు. ప్రొహిబిషన్ వల్ల అక్రమ సారా వ్యాపారం జరిగేది. తమ నెలవారీ కోటా పూర్తిచేసుకునేందుకు పోలీసులు వీళ్లమీద పడేవారు. అసలే తాగిన మత్తులో జోగేవారు, అందునా అక్రమసారా తాగి, ఆరోగ్యం పాడయ్యి, బలహీనులైనవారు – వాళ్లు దొరకడం ఎంతసేపు? సులభంగా దొరికినవాళ్లను మర్నాడు కోర్టుకు తీసుకొచ్చేవారు పోలీసులు. వాళ్లు వకీలు ఖర్చులు పెట్టుకోలేరుగనక ప్రభుత్వమే వకీలును పెట్టేది. చేసింది నేరమని అంగీకరించడం, కుటుంబానికి తిండి పెట్టేవాణ్ని తానే కనుక కాస్త కనికరించమని వేడుకోవడం తప్ప వాళ్లేం చెయ్యగలరు? రావిశాస్త్రిగారికి వచ్చేవన్నీ ఇవే కేసులు. ఇటువంటి వాటివల్ల ఆయనకు ఎంత ఆదాయం ఉంటుందో ఎవరైనా సులువుగా ఊహించుకోవచ్చు. కాని తెలుగునాట ఆయన వంటి గొప్ప రచయిత మళ్లీ పుడతాడని అనుకోను. ఆయన శైలి విలక్షణమైనది. చిన్న వాక్యాలు, చురకత్తుల్లా పదునైనవి, పాఠకుల మీద గొప్ప ప్రభావం చూపేవి. కాని నిత్యజీవితంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ రకమైన వ్యంగ్యం, విరుపు కనిపించేవి కాదు. సమాజ నికృష్టాల మీద పంచ్ లు పడేవి కాదు. ఇంట్లో భార్యాపిల్లలు పడుకున్నాక, రాత్రిపూట ఒంటరిగా కూర్చుని రాసుకునేవారు. ఆయనకు తోడంటే సిగరెట్టు పొగే. అలసిపోయేదాకా రాసేవారు. అల్పజీవుల జీవితాలను ప్రతి రచనలోనూ ప్రతిఫలించిన ఆయనతో సాయంత్రాలు గడపడం గొప్పగా భావిస్తాను.

పాల్ఘాట్ కేఫ్ లో మాటల తర్వాత ఇంటికొచ్చి వార్తాపత్రికలు చదివి, తర్వాత మళ్లీ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించేవాణ్ని.

******

ఈ సమయంలో నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి తెలిసింది. యూనివర్సిటీలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రముఖంగా ఉండేది. ఇది యంగ్ సోషలిస్ట్ లీగ్ నుంచి ఆవిర్భవించినది. యూనివర్సిటీలో వాళ్లు నాకు సన్నిహితంగా ఉండేవారు, మాక్ పార్లమెంట్, స్టూడెంట్ డిబేట్లకు పరిశీలకుడిగా పిలుస్తూ ఉండేవారు. ఆ బృందంలో పి.యు.సి.చౌదరి (ఉపేంద్ర) వంటివారు మెరిసేవారు. మూడు దశాబ్దాల తర్వాత ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయనతో చేతులు కలిపాడు, కేంద్రమంత్రి అయ్యాడు. నేను యువ లెక్చరర్ని, కొందరు విద్యార్థులు నాకన్నా పెద్దవారు! నేను సాధారణంగా అందరినీ విద్యార్థులనే భావన కన్న స్నేహభావనతోనే చూసేవాణ్ని. అందువల్ల వారికీ నాకూ తక్కువ దూరం ఉండేది. అప్పటి సోషలిస్టు పార్టీ నాయకుల్లో ముఖ్యులు పి.వి.జి.రాజుగారు. ఆయన మా పెద్దన్నయ్య అరిగపూడి రమేశ్ చౌదరికి మంచి మిత్రులు. కాని ఆ నేపథ్యంతో ఆయనతో పరిచయం పెంచుకోవాలని నేను భావించలేదు. ఆయననే కాదు, ఏ రాజకీయ నాయకులతోనూ పరిచయం నాకిష్టపడేది కాదు. కాని నా విద్యార్థి స్నేహితుల ద్వారా నాకు పి.వి.జి.రాజుగారితో పరిచయమయ్యింది. కాలక్రమంలో ఆయన జీవితం, ఆలోచనలు నాకు అవగతమయినప్పుడు అది స్నేహంగా బలపడింది. ఆయన సాంగత్యం నాకెంతో విలువైనది.

పూసపాటి విజయరామ గజపతిరాజు విజయనగర రాజ్యానికి సంప్రదాయబద్ధంగా పట్టాభిషిక్తులయిన చిట్టచివరి మహారాజు. అందువల్లనే ఆయనను ఉత్తరాంధ్రవాసులు ‘రాజా సాహెబ్’ అని పిలుచుకునేవారు. రాజవంశంలో పుట్టిపెరిగినవారైనా ఆయనలో అభ్యుదయ భావాలు ఎక్కువ. బెంగుళూరు, మద్రాసుల్లో ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల, మోహన్ కుమారమంగళం, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి నాయకుల భావజాలానికి ఆకర్షితులు కావడం వల్ల – ఆయనలో ఆధునిక ఆలోచనలు పరవళ్లు తొక్కేవి. ‘పివిజి రాజును డెమోక్రటిక్ సోషలిస్టుల్లో రాకుమారుడిగా, రాకుమారుల్లో డెమోక్రటిక్ సోషలిస్టుగా అభివర్ణించవచ్చు’ అని ఒక పాత్రికేయుడు ఆయన గురించి రాశారు. తాను స్వయంగా సంస్థానాధీశుడైనప్పటికీ, సంస్థానాలను, జమీందారీ, ఇనామ్ దారీలనూ రూపుమాపే చట్టం గురించి కృషి చేసిన అరుదైన వ్యక్తిత్వం రాజుగారిది. రద్దుకు ప్రతిగా తాను ఏ భరణమూ ఆశించలేదు, వాస్తవానికి ఎవరికీ ఇవ్వవలసిన అవసరం లేదని కూడా ప్రచారం చేసేవారు.

ఆయన కుటుంబం సింహాచలం దేవస్థానంతో సహా దాదాపు 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తగా వ్యవహరిస్తుంది (ఇప్పటికీ). పివిజి రాజుగారు, తమ తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్టును స్థాపించి తమ ఆస్తులను ట్రస్టుకు ఇచ్చేశారు. ట్రస్ట్ తరఫున ఉత్తరాంధ్రలో విద్యావ్యాప్తికి కృషి చేసేవారు. ప్రభుత్వం సైనిక్ స్కూళ్లను స్థాపించాలనుకున్నప్పుడు ఆయన తమ బంధువుల నుంచి కోరుకొండ ప్యాలెస్ ను కొని దాంతో పాటు సుమారు వెయ్యి ఎకరాలను1961-62లో కేంద్ర ప్రభుత్వానికి దానం చేశారు. మన దేశంలోని 20 సైనిక్ పాఠశాలల్లో మొదటిది కోరుకొండ సైనిక్ స్కూలే. అలాగే వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీకి బోలెడంత భూమి ధారాదత్తం చేశారు. యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్ గా వ్యవహరించేవారు.

నేను తొలిసారి కలిసేనాటికి ఆయన ముప్పైల్లో ఉన్న యువకుడు. అప్పుడే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంత తెలిసింది. ఆయన చిన్నవయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. రాజ్యం (విజయనగర సంస్థానం) కోర్ట్ ఆఫ్ వార్డ్స్ సంరక్షణలో ఉండేది. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రాజుగారు కుసుమ్ మడ్గావ్ కర్ అనే కొంకణ యువతితో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆమె డైవోర్సీ. అయినా ధైర్యంగా పెళ్లిచేసుకున్నారు. అమెరికా నుంచి తిరిగివచ్చాక తల్లి మహారాణి విద్యావతిదేవికి భార్య కుసుమ్ ను పరిచయం చెయ్యబోతే, క్షత్రియ కన్య కాదని, వివాహం తమకిష్టం లేదని ఆమె తిరస్కరించారు. జీవితాంతమూ మహారాణి కోడల్ని చూడనేలేదట!

రాజవ్యవహారాలు, పట్టింపులు, మర్యాదలకు పి.వి.జి.రాజుగారు విముఖంగా ఉండేవారు. పనివారు, ఇతర సహాయకులు వెంట ఉండటం ఆయనకు నచ్చని పని. దాంతో విజయనగర బాధ్యతల మధ్యన ఏ కాస్త వీలు చిక్కినా, వాల్తేరు వచ్చేసేవారు. ఇక్కడ ఆయనకు ఆటవిడుపుగా ఉండేది, ఉల్లాసంగా ఉండేవారు. వాల్తేరులో యూనివర్సిటీ వెనక భాగంలో వారికి చక్కని బంగళా ఉండేది. మేం కలిసేనాటికి వారికి ఇద్దరు మగపిల్లలు ఆనంద్, అశోక్, ఒక కుమార్తె ఉండేవారు. ఆయన వచ్చినప్పుడల్లా కాఫీ హౌస్ లో సభ తీర్చేవారు. తనకిష్టమైనవారందరికీ కబురంపి రప్పించుకునేవారు. విద్యార్థులతో సైతం చక్కగా మాట్లాడేవారు. ఆయన జేబులో ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. ఎవరైనా విద్యార్థులో, స్నేహితులో బిల్లు కట్టేస్తే నవ్వుతూ కూర్చునేవారు. ఆయనలోని ప్రజాకర్షణ ఎటువంటిదంటే, 1952 మొదలు, వివిధ పార్టీల నుంచి లోక్ సభకు నాలుగుసార్లు, అసెంబ్లీకి ఐదుసార్లు పోటీ చేసినా, ఎన్నికల్లో ఓటమి అనేదే ఎరుగని నేత! అదొక్కటీ చాలు, ఆ ప్రాంత ప్రజలకు వారిపట్ల ఉండే ఆదరాభిమానాలు అర్థమవుతాయి.

ఎన్నికల తర్వాత వాల్తేరుకు వారి రాకపోకలు కాస్త తగ్గాయి. మద్రాసు, కొత్త రాజధాని కర్నూలు, విజయనగరం – ఇవన్నీ తిరగడానికి సమయం సరిపోయేది కాదు. ఆ వేసవిలో పి.వి.జి.రాజుగారి కుటుంబం వాల్తేరులో ఉన్నప్పుడు వారితో గడిపేందుకు మా పెద్దన్నయ్య మద్రాసు నుంచి వచ్చాడు. అప్పుడే నేను కూడా వారింటికి వెళ్లాను. మాతోపాటూ ఉన్న మరో అతిథి ఉయ్యూరు రాకుమారుడు ఎమ్. ఆర్. అప్పారావుగారు. మేకా రంగయ్య అప్పారావుగారు అప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా అనుభవమున్నవారు. తర్వాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా (డిసెంబరు 1974 నుంచి 1980 డిసెంబరు వరకూ) , అనంతరం రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. పుస్తకాలు రాశారు, కళాపోషకులు. వారి తండ్రి మేకా వేంకటాద్రి అప్పారావుగారి సమయం నుంచి మా కుటుంబానికి ఆప్తమిత్రులు.

కొత్త ఇంపోర్టెడ్ డాడ్జ్ కారు పంపారు పి.వి.జి.రాజుగారు మమ్మల్ని వారి బంగళాకు తీసుకెళ్లేందుకు. ఆ రాత్రి భోజనాల తర్వాత విజయనగర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ద్వారం నర్సింగరావుగారి వాయులీన కచేరీ ఏర్పాటయింది. కేవలం మేం ఐదుగురమే శ్రోతలం. మూడు గంటల పాటు జరిగిన ఆ కచేరీలో మమ్మల్ని మేం మరిచిపోయాం. అది చాలా గొప్ప అనుభవం అని మాత్రం చెప్పగలను. తర్వాత మాకిచ్చిన పడకగదిలోకి వెళ్లాం. దాన్ని గది అనడం సబబు కాదేమో. ఒక టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉంది. చాలా మంచి భోజనం, తర్వాత సంగీత కచేరీ, వీటి ప్రభావంతో మేం ఒళ్లు మరిచి నిద్రపోయాం. ఎంత గాఢంగానంటే, బయట జోరున వాన పడిన సంగతే మాకు తెలియలేదు. మేం నిద్ర లేచే సమయానికి మామీద ఛాన్సలర్ దుప్పట్లు కప్పి ఉన్నట్టు గమనించాం. వాటివల్లే మేం బయటి చలి తెలియకుండా మరింత సుఖంగా నిద్రపోయామని అర్థమయ్యింది. తర్వాత తెలిసిందేమంటే, రాజుగారే స్వయంగా వచ్చి మాకు వాటిని కప్పి వెళ్లారని! అది ఆయనలోని రాజమర్యాదకు, వ్యక్తిగతంగా ఆయన చూపించే ఆపేక్షకు నిలువుటద్దం అనిపించింది నాకు.

అయితే ఆ గదిలో ఓ మూల చిన్నగా కారుతుండటాన్ని మేం గమనించాం. మా అన్నగాని, ఎమ్.ఆర్. అప్పారావుగారు గాని దానిగురించి ఏమీ మాట్లాడలేదు. నేను వయసులో చిన్నవాణ్ని, అప్పుడే ఉద్యోగంలో చేరిన ఉత్సాహవంతుణ్ని. ఆ ఉత్సాహంలో ‘అదెందుకు బాగు చేయించలేదు’ అని రాజుగారిని నేరుగా అడిగేశాను.

చిన్న చిరునవ్వుతో ఆయన అన్నారు కదా, ‘ఆ చిన్న కన్నాన్ని పూడ్చటానికి మాకెంతవుతుందో మీకు తెలియదు. ఒక సామాన్య పౌరుడికి అది 50 రూపాయలతో అయిపోయే పని. అదే మాకు 50 వేల రూపాయలవుతుంది’ అని!

ఆ సమాధానం నాకు ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగించింది, మరోవైపు సంస్థానాల ఎస్టేట్ల నిర్వహణ తీరును కళ్లకు కట్టింది. ఆయన మాటతో నేను ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చిపడ్డాను. ఇంపెర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంటుందో నాకు అర్థమైన తొలి సంఘటన అది.

ఆ రోజు ఉదయం అలా ప్రారంభమైంది. తర్వాత బ్రేక్ ఫాస్ట్, లంచ్… ఇలా కాలం గడిచేకొద్దీ ఆ కుటుంబం గురించి నాకు అర్థం కావడం మొదలైంది. పి.వి.జి.రాజుగారి భార్య కుసుమ్ విజయనగర రాజుల చరిత్ర, కుటుంబ విషయాలు అంతా నాకు చెప్పడం ప్రారంభించారు. ఆమె అంచనా ప్రకారం వారిలో చాలామందికి మానసిక రుగ్మతలు, సమస్యలు ఉండేవి. వాటినెవరూ గుర్తించలేదు, చికిత్స తీసుకోలేదు. నాకది చాలా షాకింగ్ గా అనిపించింది. పైగా, ఆమె నాకెందుకు అవన్నీ చెబుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు. అది ఆమెకు ఉపశమనాన్నిస్తోందా, కేవలం మనసు విప్పి మాట్లాడటానికి ఓ మనిషి దొరికాడన్న సంతోషమా, నాకు చెప్పినా పర్లేదు, బయట ఎవరికీ తెలియదన్న నమ్మకమా – నాకేమీ పాలుపోలేదు.

ఎక్కడో పశ్చిమ తీరాన కొంకణ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె అనుకోకుండా ఈ తూర్పు తీరానికి, అందునా రాజకుటుంబంలోకి వచ్చిపడ్డారు. ఆమెకిక్కడి భాష రాదు, స్థానిక సంప్రదాయాలు, అలవాట్లు ఏమీ తెలియవు. ఎవరినీ నమ్మలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు. వెంటవెంటనే పుట్టిన ముగ్గురు పిల్లలు, వ్యవహారాల్లో మునిగితేలే భర్త – వీటన్నిటిమధ్యా ఆమె ఒంటరితనం అనుభవిస్తున్నారని అనిపించింది. దానివల్లే ఆమె ఆ రోజు నాతో అవన్నీ సంభాషించారనిపించింది.

ధనికులంతా సుఖంగా ఉంటారన్న నా భ్రమ ఆనాటితో పటాపంచలయ్యింది. బయట నుంచి చూస్తే అంతా బాగుందనిపిస్తుంది. ఎంతోమందికి ఈర్ష్య కలిగిస్తుంది. కాని ఒక్కసారి వారి ఆంతరంగిక లోకంలోకి అడుగుపెట్టగలిగితే వారికెన్నో సమస్యలు, అవి డబ్బు తీర్చగలిగేవి కూడా కాదు.

ఛార్లెస్ వెబ్లెన్ అనే అమెరికన్ ఆర్థికవేత్త అప్పటికే ఇటువంటి రాజ / ధనిక కుటుంబాల ఖర్చుల తీరును పరిశీలించి పుస్తకం రాశాడు. కాని వారి వ్యక్తిగత, మానవీయ కోణం గురించి ఆయనకేమీ తెలియదనిపిస్తుంది. తర్వాత వచ్చిన బ్రిటిష్, అమెరికన్ రచయితలు – ఉదాహరణకు ఫిజరాల్డ్ వంటివారు మాత్రం ఆ కోణాలనూ పట్టించుకుని పరిశోధనలు చేశారు. ధనికులకు, పేదలకు తేడా కేవలం డబ్బు ఒక్కటేనని, మిగిలిన సమస్యలు అందరికీ ఒకటేనని వాళ్లు సూత్రీకరించారు. కొన్ని సమస్యలకు డబ్బు పరిష్కారాన్ని చూపించలేదు అని వాళ్లు చెప్పింది నిజమేనని కుసుమ్ గారి మాటలవల్ల నాకు అర్థమైంది. సాయంత్రమైంది, మాకు ఆతిథ్యాన్నిచ్చినవారి కుటుంబం నుంచి శెలవు తీసుకునే సమయం ఆసన్నమైంది. వారు వాల్తేరు వచ్చినప్పుడు నన్ను పిలిపించివచ్చునా అని కుసుమ్ అడిగారు. నేను చాలా కదిలిపోయాను, తప్పకుండా అని అంగీకరించాను.

అనంతర కాలంలో ఆ కుటుంబం వాల్తేరు వచ్చినప్పుడలా వారి డ్రైవరును నాకోసం పంపేవారు. క్లాసులు లేని సమయంలో నేను వారి బంగళాకు వెళ్లి ఆమె చెప్పే కబుర్లు వింటూ, వారి పిల్లలతో గడిపి తిరిగి వచ్చేసేవాణ్ని. దాదాపు అన్ని సమావేశాల్లోనూ ఆమె తమ కుటుంబ సమస్యలను ఏకరువు పెడుతూ ఉండేవారు. ఆమె విశ్లేషణ ప్రకారం పి.వి.జి.రాజుగారికి కూడా వారి పూర్వీకుల నుంచి కొన్ని మానసిక సమస్యలు వంశపారంపర్యంగా సంక్రమించాయని చెప్పేవారు. నేను ఆమెకన్న ఎన్నో ఏళ్లు వయసులో చిన్నవాణ్ని. అయినప్పటికీ ఆమె భావన సరికాదేమోనని, ఆమె అలా అనుకోవడం కుటుంబానికి మేలుకాదని నెమ్మదిగా చెప్పేవాణ్ణి.

‘అవునేమో, ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యం’ అంటూ కాసేపు ఆలోచనలో పడేవారామె. కాని వాస్తవానికి ఆ కుటుంబంలో ఉద్రిక్తత పెరుగుతూనే వచ్చింది.

ఆ సమయంలో దాన్నంతటినీ అర్థం చేసుకోగల, విశ్లేషించగల పరిపక్వత, వయసు నాకుండేవి కాదు. నావంటి ఒక అతి సామాన్య మనిషి కోరుకునేవన్నీ ఉన్నందుకు రాజుగారి పట్ల ఈర్ష్య పడాలా లేక ఈ సమస్యలన్నిటినీ చూసి జాలి పడాలా అని నాకు అర్థమయ్యేది కాదు. వివాహేతర సంబంధాలున్నవన్న పేరు పొందిన తల్లి, వాటిపట్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న తండ్రి – ఆయన గతం. చంపాలని నిరంతరం ప్రయత్నించే సోదరుడు, మానసిక ఇబ్బందులతో ఓ కాన్వెంటులో క్రిస్టియన్ సిస్టర్ల రక్షణ (చెర)లో ఉండిపోయిన సోదరి, ఆయనకు సగం పిచ్చి అని గట్టిగా నమ్మే భార్య – ఇది వర్తమానం. వీటన్నిటితోనూ రాజుగారు ఎలా వేగుతున్నారో అనిపించింది. నాకు డబ్బు లేకున్నా మనశ్శాంతి ఉన్నందుకు హమ్మయ్య అనుకున్నాను.

పి.వి.జి.రాజుగారు పార్లమెంటు సభ్యులయ్యాక వారి కుటుంబం ఢిల్లీకి మారింది, ఎక్కువ అక్కడే ఉండేవారు. వాల్తేరుకు రాకపోకలు చాలా తగ్గిపోయాయి. ఆ తర్వాత ఆ దంపతుల మధ్య విభేదాలు తీవ్రతరమై విడిపోయారు. విడాకుల అవగాహన ప్రకారం కుసుమ్ గారికి ఆ రోజుల్లో తొమ్మిది లక్షలు భరణంగా ఇచ్చారు. పిల్లల సంరక్షణ రాజుగారికే లభించింది. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు, ఆ సమయంలో భాక్రానంగల్ డ్యామ్ సందర్శనకు వెళుతున్నప్పుడు (1964 మే) కారు ప్రమాదానికి గురయ్యింది. తీవ్రంగా గాయాల పాలయిన ఆయనను చండీగఢ్ లో ఆస్పత్రిలో ఉండగా చూశాను. మెదడుకు గట్టి దెబ్బ తగిలింది. నేను చూసినప్పటికి ఆయన కేవలం రెండేళ్ల పసిపిల్లల వంటి జ్ఞాపకశక్తితో ఉన్నారు. ఉజ్వలమైన జీవితం అటువంటి మలుపు తిరుగుతుందని నేనే కాదు, ఎవ్వరూ ఊహించరు. ఆ తర్వాత నేను ఆయనను కలవలేదు. ఆయన ఎక్కువ హైదరాబాద్ లో నివాసం ఉండేవారు, నేను ఉద్యోగార్థం దేశం వదిలి వెళ్లిపోయాను.

అధ్యాపక వృత్తి ఒక నిలకడైన దినచర్యను ఇస్తుంది, అందులోనే కొన్ని ఉల్లాసకరమైన క్షణాలను, జ్ఞాపకాలను ఇస్తుంది. కొన్ని రోజులు సాధారణంగా గడిచినా, మరికొన్ని అమూల్యమైన సంతృప్తినిస్తాయి. ఒకటే అంశాన్ని పలుమార్లు చెప్పాల్సి, వినాల్సిరావడం ఎవరికైనా బోరు కొడుతుంది. కాని సబ్జెక్టు పట్ల ఇష్టం, విద్యార్థుల పట్ల అంకితభావం ఉన్నప్పుడు ఆ విసుగును జయించి తరగతి గది వాతావరణాన్ని ఆసక్తికరంగా మార్చుకోవచ్చు. సబ్జెక్టు ఒకటే అయినా దాన్నే కొత్తకొత్తగా చెప్పే మార్గాల కోసం అన్వేషించాలి. వేదిక మీద ప్రదర్శన ఇచ్చే కళాకారుల్లాగా అధ్యాపకులు సైతం తమ కౌశలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి, తనలో తనకు నమ్మకం ఉండాలి. సవాళ్లకు సిద్ధపడి ఉండాలి. అప్పుడే విద్యార్థులు అధ్యాపకులతో మమేకమవుతారు, స్పందిస్తారు.

వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిశ్శబ్దంగా, నెమ్మదిగా సాగిపోయిన నా జీవితంలో ఒకటి రెండు మరపురాని ఘట్టాలున్నాయి. యూనివర్సిటీ సందర్శనకు, అతిథులుగా కొందరు ఎప్పుడైనా – విదేశీ ప్రముఖులు, ప్రొఫెసర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు వచ్చేవారు. అటువంటివి కొన్ని గుర్తుండిపోతాయి.

త్వరలోనే రాష్ట్ర గవర్నర్ సి.ఎమ్.త్రివేది యూనివర్సిటీ సందర్శనకు రాబోతున్నారని మాకు వి.సి.గారి నుంచి కబురొచ్చింది. ముఖ్యంగా ఆర్థికశాస్త్ర విభాగం పట్ల, అక్కడి ఆచార్యులను కలవడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారని కూడా తెలియజేశారు. అనుకున్న రోజున గవర్నర్ వచ్చారు. మా ఫ్యాకల్టీ రూమ్ కు కూడా వచ్చారు. ఆయనకు ఉచితాసనం ఇచ్చేందుకు మా డిపార్ట్ మెంట్ లో ఓ మంచి కుర్చీగాని, అందరం కలిసి సమావేశం కాగలిగే ఏర్పాట్లుగాని లేవు. ఆయన ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ వరండాలో నిలబడ్డారు. మేం ఆయన చుట్టూ నిలబడ్డాం. ఏవో ప్రశ్నలడుగుతుంటే మేం సమాధానాలు చెబుతున్నాం. ఆయన అకస్మాత్తుగా సబ్జెక్టు మార్చేశారు. కొత్తగా అచ్చయి వచ్చిన ‘థియరీ ఆఫ్ ఎకనామిక్ గోల్’ అనే పుస్తకాన్ని చదువుతున్నట్టు చెప్పారు. దాన్ని ఆర్థర్ లూయీస్ రాశారు. మాలో ఎవరైనా ఆ పుస్తకాన్ని చదివామా అని అడిగారు.

తన వద్ద ఓ కాపీ ఉందని, కాని ఇంకా తాను చదవలేదని వైస్ ఛాన్సలర్ చెప్పారు. స్టాఫ్ మొత్తంలో ఆ పుస్తకాన్ని చదివినవాణ్ణి నేనొక్కణ్నే. నేను చదివానని చెప్పాను. ఆయన నావైపు సూటిగా చూస్తూ ఆ పుస్తకంలో అసలు సందేశం ఏమిటని అడిగారు.

‘ఆర్థికాభివృద్ధిలో వివిధ సంస్థల పాత్ర, సామాజిక దృక్పథాల గురించి అది వివరిస్తుంది. హారడ్ – డోమర్ రకం ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్స్ మంచివేగాని, వాటికి సైతం సమాజమే కేంద్రంగా ఉండాలి…’ అంటూ నాకు అర్థమైనంత మట్టుకు చెప్పాను. ఆయన నాతో ఏకీభవిస్తూనే, ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వం పాత్ర గురించి వివరించారు.

ఒక గవర్నర్ ను కలవడం, అర్థశాస్త్రానికి సంబంధించిన నూతన సాహిత్యాన్ని చదువుతూ తనను తాను అప్ డేట్ చేసుకునే వ్యక్తిని ఆయనలో చూడగలగడం నాకొక భిన్నమైన అనుభవాన్నిచ్చింది. దాంతోపాటు ఆర్థికాభివృద్ధిని ఎలా సాధించాలి, ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ, తనవైన స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉన్న ఉన్నతమైన వ్యక్తిని కలిశామన్న సంతృప్తి మాలో నిండిపోయింది.

ఇటువంటిదే మరో సమావేశం – ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టోయెన్ బి పర్యటన. ఇండియా సందర్శనలో భాగంగా బ్రిటిష్ కౌన్సిల్ వారు ఏ.యూ.ను కూడా సందర్శించేలా ఏర్పాటు చేశారు. మా వి.సి.గారికి ఆయన నేపథ్యం ఏమీ తెలియదు. నేను అది రాసి ఆయనకు అందజేశాను. ఆర్నాల్డ్ ను ముఖాముఖి కలిసినప్పుడు ఆయన రచనలేవీ చదవలేదని మాత్రం అంగీకరించాను. అవి ఎన్నో వాల్యూములున్న పుస్తకాలు. చదవడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఒక వాల్యూమ్ లో కొంత భాగం ‘డ్యూక్ ఆఫ్ సోమర్ విల్స్’ సమరీ చదివానని చెప్పాను. అదే చాలా కష్టంగా ఉందని, చారిత్రక వాస్తవాల పట్ల ఎంతో లోతైన అవగాహన ఉంటే తప్ప, అది అర్థం కాదని, అటువంటి నేపథ్యం నాకు లేదని నేరుగా చెప్పేశాను. బహుశా అందువల్లేనేమో, ఆయన ప్రసంగం మమ్మల్నెవ్వరినీ అంతగా ఆకట్టుకోలేదు. ఆయన ఉచ్చారణగాని, మాట్లాడిన అంశాలుగాని మా స్థాయికి మించినవి!

*

ఎ.యు. ఎకనామిక్స్ డిపార్ట్ మెంట్ లో అధ్యాపకులుగా చేరిన ఎవరూ ఆలిండియా సర్వీసెస్ పరీక్ష రాయలేదు, అప్పటివరకూ. వయసు, చదువు, అధ్యయనం వంటి అన్ని అర్హతలున్నా, దాదాపు అందరూ బోధన రంగంలో ఉన్నత చదువులవైపే మొగ్గుచూపేవారు. వి.సి.గారు కూడా ఒకసారి యూనివర్సిటీలో చేరిన యువకులు బోధనకే అంకితమై కొనసాగాలని కోరుకునేవారట. కాని నాది చూస్తే తాత్కాలిక ఉద్యోగం. ఒక ప్రొఫెసర్ నియామకం జరిగితే నా ఉద్యోగం ఊడినట్టే. అప్పటికప్పుడు తట్టాబుట్టా సర్దుకోవలసిందే. అది మంచి పద్ధతి కాదు, ముందుగానే ఇతర అవకాశాల వైపు చూడాలని నాకుండేది. అందువల్లనే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు చదువుతూ ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు సిద్ధమయ్యాను. 1955లో మద్రాసు వెళ్లి పరీక్ష రాశాను.

పరీక్ష చాలా కష్టంగా అనిపించింది. మొదటి పేపర్ జనరల్ ఎస్సే. అనుకున్నదానికన్నా తక్కువగా రాశాను. నిజానికి నా సామర్థ్యం కన్న తక్కువస్థాయిలో రాశాను. తర్వాత హిస్టరీ, ఎకనామిక్స్ బాగా రాశాను. నా అంచనా ప్రకారం నేను బాగా రాయలేదు, ఆలిండియా సర్వీసులు కాదుగదా, కనీసం కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు కూడా ఎంపికయ్యే అవకాశం రావడం కష్టమనిపించింది. కాని ఆ పరీక్ష అనుభవం అమూల్యమైనది. ఇది కాకున్నా, మరో రెండు ఛాన్సులున్నాయి రాయడానికి. కాని తొలిసారి రాసివచ్చిన తర్వాత, ఆ తరహా ప్రయత్నాలు మానుకోమని, నా సమయాన్ని పూర్తిగా అధ్యాపక వృత్తికే అంకితం చెయ్యాలని యూనివర్సిటీ వర్గాలు నాకు చెప్పాయి.

వాస్తవానికి బోధన పట్ల ఆసక్తి నాకు మొదట్నుంచీ లేదు. డిపార్ట్ మెంటులో నేను అందరికన్నా జూనియర్ని. వృత్తిపరంగా వచ్చే రెండు దశాబ్దాల్లో ముందుకెళ్లే అవకాశాలేమీ లేవు. ఒకవేళ వెళ్లాలన్నా విదేశాల్లోనో, ఇక్కడో పి.హెచ్.డి. చెయ్యకతప్పదు. ఆ తర్వాత కూడా చెప్పలేం. అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్పులకు చాలా పోటీ ఉండేది. అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు దానికోసం ప్రయత్నించేవారు. అందువల్ల అదొచ్చి విదేశాలు వెళ్లే అవకాశాలు తక్కువే. ఏదయినా, అధ్యాపక వృత్తి నాకు ఆకర్షణీయం కాదు, యు.జి.సి. అవార్డులు కొనసాగుతాయో లేదో తెలియదు. అందువల్ల భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాణ్ని. అందుబాటులో ఉన్న ఇతర అవకాశాలు తక్కువే అయినప్పటికీ నేను వెతకడం మానలేదు.

ఆశ్చర్యం – కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యానని, నన్ను ఇంటర్వూకు హాజరుకమ్మంటూ యు.పి.ఎస్.సి. నుంచి వర్తమానం వచ్చింది, 1956 మే నెలలో. నాతోపాటు ఇంటర్వ్యూకు వచ్చిన పి.ఎస్.రామ్మోహనరావు అంతకు ముందు విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో నాతో పాటే చదివినవాడు, తర్వాత ఐ.పి.ఎస్.గా ఎంపికయ్యాడు. రిటైరయ్యాక తమిళనాడుకు గవర్నరుగా పనిచేశాడు. మేం మంచి స్నేహితులం. అతని వంటి వ్యక్తిని వదులుకోవడం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సుకు నష్టం, కాని అటువంటి వ్యక్తి లభించడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేలు జరిగింది.

*******

ఆ సమయంలో భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మారుతూ ఉండేవి.

ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్రభుత్వం విఫలమై, పతనమైన తర్వాత గవర్నర్ పాలన కొనసాగుతూ ఉండేది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కన్నా, గవర్నర్ పాలనే ప్రజలకు మెరుగ్గా అనిపించడం విచిత్రమేం కాదు. ఎందుకంటే, అనిశ్చితంగా వ్యవహరిస్తూ, పరస్పరం నిందారోపణలు చేసుకునే ప్రభుత్వం అక్కర్లేదు ప్రజలకు. సమర్థవంతమైన పాలన కావాలి. తొలి ప్రభుత్వం అది తప్ప అన్నీ చేసింది. ప్రజలు తమ అభీష్టాన్ని వ్యక్తపరిచారు, తమకున్న స్వేచ్ఛను సరైన సమయంలో, సరైన ప్రదేశాల్లో వినియోగించుకున్నారు.

దేశ చిత్రపటాన్ని అక్షరాలా మార్చింది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ (ఎస్.ఆర్.సి.) రాష్ట్రాల సరిహద్దులను కొత్తగా నిర్వచించడానికి, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అది బాటలు వేసింది. బొంబాయి స్టేట్ వంటి ఒకటోరెండిటినో తప్పిస్తే, ఎస్.ఆర్.సి., కేంద్ర ప్రభుత్వం కలిసి నిశ్శబ్దంగా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చేశాయి. రక్తపాతం లేని విప్లవం అది. పూర్వ సంస్థానాల ఎల్లలను చెరిపేసి భారతదేశాన్ని సరికొత్త రాష్ట్రాల సమాహారంగా తీర్చిదిద్దడం అనేది పెద్ద పని. అప్పటికి రెండు శతాబ్దాలుగా ఉన్న సరిహద్దులను పోగొట్టుకొని నిజామ్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమైంది. కొన్ని జిల్లాలు కర్ణాటక, బొంబాయిలకు వెళ్లిపోయాయి. రాష్ట్రాల పునర్వవస్థీకరణ కోస్తా జిల్లాల నుంచి ప్రజల వలసలకు కొత్త మార్గాలను తెరిచింది. పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం – రెండూ పుష్కలంగా ఉన్న ఆ తరగతి జనం హైదరాబాద్ నగరానికి రెక్కలు కట్టుకొని వాలారు. అది మొన్నటి వరకూ నిరంతరాయంగా సాగింది – ఎంతగానంటే తెలంగాణ ప్రజల్లో విద్వేష విత్తనాలను నాటి, మరోసారి రాష్ట్రం ముక్కలై తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతగా!

తర్వాత బొంబాయి రాష్ట్రం ముక్కలై గుజరాత్ ఆవిర్భవించింది. పంజాబ్ ముక్కలై హర్యాణా ఏర్పడింది. ఈశాన్య ప్రాంతం మూడు రాష్ట్రాలుగా ఏర్పడింది. ఇంకొంతకాలం తర్వాత బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కూడా ముక్కలై మరిన్ని చిన్న రాష్ట్రాలకు జన్మనిచ్చాయి.

ఈ సమయంలో మరో ముఖ్య పరిణామం – ఆర్థిక అంశాలకు సంబంధించినది. మొదటి పంచవర్ష ప్రణాళిక పూర్తి కావస్తూ, రెండో ప్రణాళిక కోసం కసరత్తు మొదలైంది. మొదటి ప్రణాళిక – యుద్ధానంతరం బ్రిటిష్ వారు ఇండియాను వదిలివెళ్లే రెండేళ్ల ముందు ప్రారంభించిన పునర్నిర్మాణ పనులను కొనసాగించినదే. దానిప్రకారం కొన్ని , ముఖ్యంగా ఆహార ధాన్యాల చట్టాలు సామాన్యులను చాలా ఇబ్బందికి గురిచేశాయి.

రెండో పంచవర్ష ప్రణాళిక ఆర్థికవేత్త ప్రొఫెసర్ పి.సి.మహలనోబిస్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకుంది. పొడుగ్గా, హుందాగా ఉండే ఆయన స్టాటిటిక్స్ ప్రొఫెసర్. ప్రణాళిక రూపకల్పనలకు ముందు ఆయన అటు అమెరికా, ఇటు యూరప్ ల నుంచి ప్రఖ్యాత ఆర్థికవేత్తలను ఆహ్వానించారు. అమెరికా నుంచి గాల్ బ్రెయిత్ (పోస్టాఫీస్ సోషలిజమ్ అన్న మాటకు ప్రాణం పోసిందీయనే) మిల్టన్ ఫ్రీడ్మాన్ (కార్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకోమని మనకు చెప్పాడు తప్ప, సొంతంగా తయారుచేసుకోమని చెప్పలేదు) వంటివారు వచ్చారు. వీళ్లలో కొందరిది సోషలిస్ట్ ప్లానింగ్, మరికొందరిది స్వేచ్ఛావాణిజ్య పద్ధతి. వీళ్లందరి ఆలోచనలూ కలబోసి రూపొందించిన రెండో పంచవర్ష ప్రణాళికను 27మంది సుప్రసిద్ధ భారతీయ ఆర్థికవేత్తలతో కూడిన ప్యానెల్ చర్చించింది. వాళ్లంతా ఆమోదించినా, ప్రొఫెసర్ బి.ఆర్.షెనాయ్ మాత్రం అసమ్మతిని తెలియజేస్తానన్నారు. అన్నట్టుగానే ఆయన తన డిసెంట్ నోట్ (అసమ్మతి పత్రాన్ని) జతపరిచారు. ఏటికి ఎదురీదిన ఆయన ధైర్యానికి నావంటివాళ్లం అబ్బురపడేవాళ్లం.

రెండో పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణ మీద దృష్టి కేంద్రీకరించింది. ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1949కు మార్పులు చేసింది. అందులో సోషలిస్టు పంథాను అనుసరించింది. ఆర్థికవ్యవస్థ అభివృద్ధిని ప్రభుత్వమే నిర్దేశించే పద్ధతి అది. దానికి ఆనాటి రాజకీయ ప్రాధాన్యతలు కారణం. సోవియెట్ వ్యవస్థ నుంచి పొందిన స్ఫూర్తి మరికొంత. మొత్తమ్మీద ఆ కాలంలో మన దేశం తనకు తెలిసినదాన్ని వదులుకోవాల్సి వచ్చింది, తెలియనిదాన్ని నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. దూరపు కొండలు నున్నగా, లోయలు పచ్చగా కనిపిస్తాయన్న సామెత ఏనాటి నుంచో ఉంది. ప్రణాళికా వ్యవస్థ అన్ని ఆర్థిక సమస్యలకూ ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందన్న వైపు మొగ్గింది.

*

నేను రాసిన ఆలిండియా సర్వీసు పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకు చాలా పెద్దదొచ్చింది. రాత పరీక్షప్పుడే ఆశ వదిలేశాను, ఏదీ రాదని. అటువంటివాడికి ఇంటర్వ్యూ, ఏదో ఒక ర్యాంకు రావడమే ఆశ్చర్యం కదా. అసలు సర్వీసులోకి ప్రవేశించే అవకాశం వస్తుందని అనుకోలేదు. కాని సర్వీసుల కేటాయింపు చెయ్యడానికి ఆ ఏడాది ఎందుకో చాలా ఆలస్యమయ్యింది. ఈలోగా నేను అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్ అవకాశాలను వెతకాలనుకున్నాను. దరఖాస్తు చేశాను, మద్రాసులో ఇంటర్వ్యూకు వెళ్లాను. అక్కడ సెలెక్టయ్యానుగాని, ఢిల్లీలో జాతీయస్థాయి సెలెక్షన్లలో కాలేకపోయాను.

1957 మొదట్లో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసులో నన్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు అందుకున్నాను. నా ప్రయత్నాలకు తగిన ఫలితం కాదు అది. దాంతో నన్ను నిరాశ అలముకుంది. మరో కారణమూ ఉంది. మాకు తొలి సంతానంగా లక్ష్మి 1956 నవంబరులో పుట్టింది. కాని నెలలు నిండకుండా పుట్టింది. అందువల్ల ఆమె సంరక్షణ మాకు కష్టమయ్యేది. ఆ ఒత్తిడిలో ఉండటం వల్ల వచ్చిన ఈ అవకాశం అంత ఉత్సాహాన్ని కలిగించలేదు.

అయినప్పటికీ నేను కేంద్ర సర్వీసుల్లో చేరాలనే నిర్ణయించుకున్నాను.

ఆంధ్రా యూనివర్సిటీని వదిలి వెళ్లేందుకు సన్నద్ధమయ్యాను. అదే చివరి పని దినం. హిస్టరీ హానర్స్ క్లాస్ లో ఒక విద్యార్థిని నాతో మాట్లాడాలని కోరింది. నేను అక్కడ బోధించిన రెండేళ్లలో ఆమె నా క్లాసులో ఉన్నదని గమనించాను, ఆమె నేపథ్యమూ స్థూలంగా తెలుసుగాని, మాట్లాడుకోలేదు. ఆమె వెనుకబడిన తరగతులకు చెందినది, యూనివర్సిటీలో చేరకముందే పెళ్లయింది, వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తడంతో దాన్ని వదిలి, చదువు కొనసాగించాలన్న తలంపుతో తల్లిదండ్రులను బతిమాలి యూనివర్సిటీలో చేరింది. వాళ్లు సగం అనంగీకారంగానే పంపారు. తరగతిలో హుందాగా నడుచుకునేది. ఆమె భర్త సయోధ్య కోసం ప్రయత్నిస్తూ ఆమెను చూడటానికి వీలవుతుందని యూనివర్సిటీ లా కాలేజీలో చేరాడు. కాని ఆమె అతనితో మాట్లాడేది కాదు, ఆడపిల్లల హాస్టల్లో ఉంటూ చదువు మీదే ఆశ పెట్టుకుని ఉండేది.

నాతో మాట్లాడదామని వచ్చిన రోజు తాను పరీక్షల్లో బాగా రాయలేదని చెప్పింది, ఏం చెయ్యాలని సలహా కోరింది. ఆ ఏడాది పరీక్ష రాయకుండా ఆగిపోయి, తర్వాత ఏడాది రాయవచ్చేమో అనుకుంది. ఆమె బిలో ఏవరేజ్ విద్యార్థి అని నాకు తెలుసు. పరీక్ష రాయకుండా ఆగడం వల్ల మరో ఏడాది ఆదుర్దా పెరగడం తప్ప మంచి ఫలితమేం రాదని చెప్పాను. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. తాను బాగా చదివానని, ప్రశ్నపత్రాలు కష్టంగా ఇచ్చారని చెబుతూ ఏడ్చింది. నేను నా జేబులోంచి రుమాలు తీసి ఇవ్వబోతే తీసుకోలేదు. తన చీర చెంగుతోనే కళ్లొత్తుకుంటూ ఉండిపోయింది. నేను నాకు చేతయినంత సముదాయించి ఆమె నుంచి సెలవు తీసుకున్నాను. చదువు రాదేమోనన్న బెంగతో కన్నీళ్లు నిండిన ఆమె ముఖం, భవిష్యత్తునెలా ఎదుర్కోవాలో తెలియని బేలతనం – ఆమె నా మనోఫలకం మీద చాలాకాలం తారట్లాడుతూ ఉండేది. ఆ రోజుల్లో విద్యార్థి జీవితానికి ఆమె ఒక ఉదాహరణ. ఒక్క ఏడాది చదువు పూర్తి కావడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంత కష్టపడినా ఫలితాలు మనం ఆశించినట్టు ఉండకపోవచ్చు. కాని ఆ మార్కులే భవిష్యత్తును, అవకాశాలను నిర్దేశిస్తాయి.

*

వాల్తేరులో మా ముచ్చటైన చిన్న కాపురాన్ని ఎత్తేశాం. నాకు చదువునూ, ఉద్యోగాన్నీ ఇచ్చిన యూనివర్సిటీకి వీడ్కోలు చెప్పేసి ఢిల్లీకి ప్రయాణం కట్టాం. ‘ఉద్యోగం ఇక్కడా ఉంది కదా, అంత దూరం ఎందుకు వెళ్లడం?’ అంటూ మా ఇంట్లో చర్చ నడిచిందిగాని నా నిర్ణయం మారదని తెలిసి వాళ్లే సర్దుకున్నారు.

ఢిల్లీ చేరాక నన్ను శిక్షణకు పంపారు. శిక్షణలో ఆఫీసు పద్ధతులు, సాధారణ ఆర్థిక సూత్రాలు, టైపింగ్ వంటివాటిపై లెక్చర్లుండేవి. నాకు అప్పుడూ ఇప్పుడూ కూడా టైపింగులో ఆసక్తి చాలా తక్కువ. కాని దాన్ని నేర్పించే వ్యక్తి కొంకణ్ ప్రాంతానికి చెందిన పెద్దమనిషి. చాలా విభిన్నంగా ఆలోచించేవారు. మా టైపింగ్ క్లాసు జరుగుతున్నంతసేపు దానికి అనుగుణమైన రికార్డెడ్ మ్యూజిక్ ప్లే చేసేవారు. దానివల్ల నాలాంటి విముఖులు సైతం పెద్ద ఇబ్బంది పడకుండా నేర్చుకున్నాం. తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగానికి చేరడానికి వెళుతూ జెనీవాలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ప్రమాదవశాత్తు మరణించారు.

ఢిల్లీలో కేంద్ర సెక్రటేరియెట్ జంట భవనాలకు తొలిసారి వెళ్లినప్పుడు ‘నేను మిగిలిన జీవితమంతా ఇక్కడ పనిచెయ్యాలా?’ అన్న బెంగ కలిగింది. ఎందుకో అక్కడ వాతావరణం చాలా అన్ ఫ్రెండ్లీగా అనిపించింది. ఎంతమంది అక్కడ పనిచేసి అనామకంగా గతించిపోయి ఉంటారు, అనిపించింది. (కాని అదృష్టవశాత్తు అక్కడ నేను కొద్ది నెలలే ఉన్నాను)

నా భార్య, పాప ఢిల్లీ పరిస్థితులకు త్వరగానే అలవాటు పడ్డారు. మా ఆవిడ రమకు హిందీ బొత్తిగా రాదు. అప్పటికి ఒక్క హిందీ సినిమా కూడా చూడలేదు. కాని ఏదో తంటాలు పడి పాలవారు, కూరగాయలవారు, పనిమనిషి, కిరాణా దుకాణదారుతో మాట్లాడే నేర్పు సంపాదించింది. అప్పట్లో ఢిల్లీలో సైతం పాలప్యాకెట్లు ఉండేవి కాదు. ఢిల్లీ మిల్క్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటే కాలేదు. గేదెలు పుష్కలంగా ఉండేవి.

మేం ప్రభుత్వ కాలనీల్లో అద్దెకు దొరికే క్వార్టర్లలో ఉండాలనుకోలేదు. కరోల్ బాగ్ లో ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ప్రాంతం కొంత ఎక్కువ కాస్మోపాలిటన్ గా ఉండేది. దక్షిణాది కుటుంబాలెక్కువ ఉండేవి. అప్పట్లో ఢిల్లీ, న్యూఢిల్లీ అంతా కలిసి వంద తెలుగు కుటుంబాలుండేవేమో. వారిలో కొందరు కరోల్ బాగ్ లో ఉండేవారు. అప్పటికే స్థిరపడిన వారు, లేదా మాలాగా అప్పుడే వచ్చినవారు – వీరందరితో మా రమ పరిచయాలు పెంచుకుంది. కాని ఆమెకు ఒక్కటే ఇబ్బందిగా అనిపించేది. అదేమంటే అప్పట్లో ఢిల్లీలో తెలుగు సినిమాలు వచ్చేవే కాదు. ఓ రెండేళ్ల తర్వాత నుంచి ఒకటీ అరా సినిమాలు ఉదయం పూట ఓ థియేటర్ లో వేసేవారు. అప్పుడు ఇతర తెలుగు కుటుంబాలను కలిసే వీలు కలిగేది.

నాకు దాదాపు మొదటి ఏడాది అంతా శిక్షణలోనే గడిచిపోయింది. శిక్షణలో భాగంగా ఒక మూడు నెలలు ఒక మినిస్ట్రీకి అటాచ్ చేశారు. అది పూర్తయ్యాక మళ్లీ మేం ట్రెయినింగ్ స్కూలుకు వచ్చాం. చివర్లో మళ్లీ పరీక్ష రాయాలి. వాటి ఆధారంగా మినిస్ట్రీలను కేటాయిస్తారు. శిక్షణలో ఉన్నప్పుడు నన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ లో వేశారు. ప్రభుత్వ బడ్జెట్లు, ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ తో నా రొమాన్స్ అక్కడే మొదలయ్యింది.

ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సెక్రటేరియెట్ సౌత్ బ్లాక్ లో ఉండేది. విదేశాంగ వ్యవహారాల శాఖ అధ్యక్షులు సాక్షాత్తూ ప్రధానమంత్రే. దాంతో అది అధికారానికి, నైపుణ్యానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఆలిండియా సర్వీసుల్లోకి వచ్చిన ఉత్తమమైన అభ్యర్థులను ఆ విభాగానికి కేటాయించేవారు. ఫారిన్ సర్వీసులో తీసుకునే అభ్యర్థులను ప్రధానమంత్రే స్వయంగా ఇంటర్వ్యూ చేసేవారు! తర్వాత వారిని ఆక్స్ బ్రిడ్జి యూనివర్సిటీలకు మరింత శిక్షణ కోసం పంపేవారు. ఫారిన్ సర్వీసులో డైరెక్టు రిక్రూట్ మెంట్ తో పాటు ఇంకొన్ని స్థాయుల్లో సర్వీసు కోసం లేటరల్ రిక్రూట్ మెంట్ ఉండేది. దానిలో సాధారణంగా పూర్వపు రాజవంశాల వారసులుండేవారు. ప్రముఖ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, కొందరు పార్టీ వీరవిధేయులు, స్వాతంత్ర్య సమరయోధుల సంతానం – వీరందరికీ అదే కలిసొచ్చే అవకాశంగా ఉండేది. సరోజినీనాయుడు కుమార్తె లీలమణి కూడా ఈ కోవకు చెందినవారే. ఆమె మహమ్మదాలీ జిన్నాను అచ్చుగుద్దినట్టు పోలింది. ఈ విషయం నాకు హెక్టార్ బొలిటో రాసిన జిన్నా జీవితకథ చదివాకే అర్థమయింది. సరోజినీనాయుడు జిన్నా గురించి రాసుకున్న ప్రణయ కవిత్వాన్ని కూడా అందులో ఆయన పొందుపర్చాడు.

సెక్రటేరియెట్ చుట్టుపక్కల ఉన్నతాధికారులు అందంగా, హుందాగా మంచి సూట్లలో, ఉత్సాహంగా కనిపించేవారు. అలీనోద్యమం పెద్ద ఊపున ఉండేది. కొత్తగా వచ్చిన పంచశీల సూత్రాలను విస్తరించడం మీద వారి దృష్టి ఉండేది. ఆ ప్రాంతం, ఆ వాతావరణం నావంటి యువకులకు గొప్ప ఉత్తేజంగా ఉండేది. ప్రధానమంత్రి రోజూ ఆఫీసుకు రావడం పోవడం చూసేవాళ్లం. కాని అప్పట్లో అది పెద్ద విశేష కార్యక్రమంగా ఉండేది కాదు. ఆయన ఒక చిన్న కారులో వచ్చేవారు. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ అసెంబుల్ చేసిన తొలి కారు అది. డ్రైవరుండేవాడు. అంతే. పైలెట్ కార్లు, సైరన్లు, హడావుడి ఏమీ ఉండేది కాదు. ఎవరూ ఆయనకు డోరు తియ్యడం వంటివీ లేవు. తాను దిగి, త్వరగా నడుచుకుంటూ మొదటి అంతస్తులోని కార్యాలయానికి చేరుకునేవారు. రోజులో చాలామటుకు ఆఫీసులోనే ఉండేవారు. అందమైన, స్పష్టమైన చేతిరాతతో ఫైళ్ల మీద తన కామెంట్లు రాసేవారు. వాటిని చదివే అవకాశం నాకు దక్కింది. మిగిలిన ప్రావిన్సుల రాజధానుల్లాగా కాకుండా, అప్పటికి ఢిల్లీలో రాజకీయనేతల అనుచరులు తక్కువ కనిపించేవారు. సెక్రటేరియెట్ కారిడార్లలో అసలే కనిపించేవారు కాదు. అప్పటికింకా విదేశీ మారక ద్రవ్య సంక్షోభమేదీ లేదు. అందువల్ల ప్రభుత్వ ఆఫీసులు నింపాదిగా తమ పని తాము చేసుకుపోతూ ఉండేవి. వాతావరణం శాంతంగా ఉండేది!

నేను ఫైనాన్స్ శాఖలో చేరిన వారంలోపే, అర్జెంటు పనుందని నన్ను కె.పి.సోని పిలిపించారు. ఆయన అప్పటికి అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ సమయానికి బడ్జెట్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రతి మంత్రిత్వశాఖ తన బడ్జెట్ ను సిద్ధం చేసుకుని ఫైనాన్స్ డిపార్టుమెంటు రివ్యూ కోసం పంపేది. సాధారణ చర్చ, మార్పుచేర్పుల తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ బడ్జెట్ ను ఫైనాన్స్ మినిస్ట్రీలోని బడ్జెట్ డివిజన్ కు పంపుతారు. నిధుల కోసం అభ్యర్థనలు (డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్) పత్రాలను పార్లమెంటుకు సమర్పించాలి, అవి అక్కడ ఆమోదం పొందాలి.

ఇంతకూ నన్నెందుకు పిలిచారు?

లండన్లో ఉన్న ఇండియా హైకమిషన్ బడ్జెట్టును కనీసం 12 శాతం తగ్గించాలని ఆనాటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి ఆదేశించారు. ఆ మాటే చెబుతూ ఫైలు నా చేతిలో పెట్టారు సోనీగారు. దాన్ని కూలంకషంగా పరిశీలించి బడ్జెట్ లో కోత పెట్టాలి. నేను చాలా కొత్తవాణ్నని, ఒక డ్రాఫ్ట్ బడ్జెట్టును ఎప్పుడూ చూసిన పాపాన పోలేదని, అందువల్ల దీన్ని పరిశీలించడం, అందులో కోతలు పెట్టడం నావల్ల కాదని ఆయన దగ్గర మొరపెట్టుకున్నాను. ఆయన కొంత సానుభూతితో విన్నారు. అప్పుడు ‘పనిచేసి అపజయం పాలయినా భయపడను’ అని చెప్పాను. దాంతో ఆయన నాకు అభయమిచ్చారు. ‘పని మొదలుపెట్టండి, మీకే సందేహం వచ్చినా నన్ను అడగండి, నేను సాయం చేస్తాను. మీ ప్రతి అడుగులోనూ నేను తోడుంటాను’ అని ధైర్యమిచ్చారు. అప్పుడే ఒక గంట కూర్చోబెట్టి బడ్జెట్ల ప్రాముఖ్యత, వాటినెలా తయారుచేస్తారు వంటి విషయాలను వివరంగా చెప్పారు.

సోనీగారిచ్చిన ధైర్యంతో నేను రంగంలోకి ఉరికాను. డ్రాఫ్ట్ బడ్జెట్ను పరిశీలిస్తే కొన్నిచోట్ల లోపాలు కనిపించాయి. దాన్ని ఒకదారికి తీసుకురావడం, ఖర్చు తగ్గించడం నేననుకున్నంత కష్టం కాదనిపించింది. ఆర్థికమంత్రివర్యుల ఆదేశాలకు అర్థమూ అప్పుడే తెలిసింది.

జరుగుతున్నది ఏమిటంటే – రాజకీయ నాయకులు, సీనియర్ సివిల్ సర్వెంట్ల సంతానం ఉన్నత చదువులకంటూ లండన్ వెళ్లడం పరిపాటి. వారికి హైకమిషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇచ్చి, వారి ఫీజులకు సాయం చేసేలా ఒక మార్గముంది. అటువంటి విద్యార్థులు అక్కడ బోల్డుమంది, కాని వాళ్లెప్పుడూ ఉద్యోగాలకు రారు. జీతాలు మాత్రం తీసుకుంటారు. ఈ పద్ధతికి మంగళం పాడెయ్యాలని ఆర్థికమంత్రి ఆలోచన. నేను చాలా సూక్ష్మంగా పరిశీలించి, ప్రతి అంశానికీ ఎక్కడ ఎంత ఎక్కువ ఖర్చు అవుతోందో చూసి, కొన్ని కోతలు ప్రతిపాదించి 1957 – 58 కోసం ఒక సబబైన ఎస్టిమేట్ తయారుచేసిచ్చాను. చేశానేగాని, నా పనిలో నాకే నమ్మకం కలగలేదు. దాన్ని తిరస్కరిస్తారేమోనని భయపడుతూనే ఫైలు సోనీగారికందించాను. నా నోట్ చదివాక ఆయన అంతా బాగుందని చెప్పి, సంతకం పెట్టేసి నేరుగా విదేశాంత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపేశారు.

అప్పటి హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూగారికి సోదరి. మినిస్ట్రీ నుంచి ఈ సూచనలు ఆమెకు అందగానే ఆమె అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వాటిని పరిశీలించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. తర్వాత తన సోదరుడికి పంపారు. వ్యక్తిగతంగా ఒక లేఖ కూడా రాశారు. హైకమిషన్ పనితీరును అభివృద్ధి చేసేందుకు తాను అహర్నిశలూ శ్రమిస్తూంటే హెడ్ క్వార్టర్స్ లో దానికేమీ ప్రతిఫలం లభించడం లేదని, దానికితోడు ఆర్థికశాఖ చేసిన ఈ సూచనలు పాటిస్తే తన చేతులు కట్టేసినట్టేనని ఆవిడ అభిప్రాయపడ్డారు. దాంతో ఆ ఫైలు మళ్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్ స్థాయికి వచ్చింది. తర్వాత దాన్ని రివైజ్ చేశారు. వారు కోతల్లో కొంచెం తక్కువ చేసి పంపారు. దాన్ని ఆర్థికమంత్రి, ప్రధాని ఆమోదించారు. మొత్తమ్మీద ఈ ప్రహసనం నాకో వినూత్నమైన అనుభవాన్ని, కేంద్ర ప్రభుత్వంలో చట్టాల రూపకల్పన పట్ల అవగాహననూ ఇచ్చింది.

త్వరలోనే నాకు ఒక సెక్షన్ బాధ్యతలను అప్పజెప్పారు. మామూలు సైజు కన్న భిన్నంగా ఎనిమిదిమంది అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్ సర్వీస్ అకౌంటెంట్లు, ఒక అప్పర్ డివిజన్ క్లర్కు కొందరు క్లాస్ డి ఉద్యోగులను ఇచ్చారు. ఆడిట్ డిపార్టుమెంట్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కోర్డినేషన్, ఎస్టిమేట్స్ కమిటీ రిపోర్ట్స్ వంటివి, చట్టసభలవి, ప్రెసిడెంట్ ఆఫీసువి ఎక్స్ పెండిచర్ ప్రపోజల్స్ ను రివ్యూ చెయ్యడం మా పని. నేను బాధ్యతలు స్వీకరించగానే జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకునేందుకు ఉపకరించింది.

ఒక పార్లమెంటు సభ్యుడు రాతపూర్వకంగా పంపిన ప్రశ్న దీనికి తెర లేపింది. ప్రజాధనం మితిమీరి వ్యయమవుతుండటం తనకు బాధాకరంగా ఉందని అంటూ 1947 మొదలు 1957 వరకు ప్రభుత్వంలో అసలు ఎంతమంది జాయింటు సెక్రెటరీలు, అడిషనల్ సెక్రెటరీలున్నారు, ఎక్స్ అఫీషియో పోస్టులెన్ని అని లోక్ సభలో ఆర్థికమంత్రిని అడిగారు. అసలు ఆ ప్రశ్నను ఎక్కడికి పంపాలో పార్లమెంటు మినిస్ట్రీలో ఎవరికీ పాలుపోలేదు తొలుత. అటుతిరిగి ఇటుతిరిగి అది నా సెక్షనుకు వచ్చిపడింది. జాయింట్ సెక్రటరీ నన్ను పిలిచి దానికి సమాధానంగా ఓ లెటర్ డ్రాఫ్ట్ చెయ్యమన్నారు. ‘సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు, దాన్ని వెతకడానికి చాలా సమయం పడుతుంది, ఖర్చు కూడా కావొచ్చు’ అంటూ రాయమన్నారు. నిజానికి అప్పటివరకూ అటువంటి లెక్క ఉందో లేదో ఎవరికీ తెలియదు, ఎవరూ దృష్టిపెట్టలేదు. అటువంటి సమాధానం ఇవ్వడం బాగుండదని, కనీసం ఉన్నంత వరకూ సమాచారం ఇస్తేనే గడచిన ఐదేళ్లలో సాధించిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు అవుతుందని నేను ఆయనకు నివేదించాను.

ఆయన నా మాటలను కొట్టిపారేశారు. ‘నువ్వు చెబుతున్నదాని ఫలితాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. నువ్వు చాలా కొత్తవాడివి, అసలు నీకేం తెలీదు. నేను చెప్పినట్టు డ్రాఫ్ట్ చెయ్యి చాలు…’ అంటూ చెప్పారు.

మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటుండగానే పార్లమెంటు నుంచి సందేశం వచ్చింది – స్పీకర్ దాన్ని స్టార్ గుర్తున్న ప్రశ్నగా ఎంపిక చేశారని. అంటే సభలో దాన్ని మౌఖికంగా చదివి జవాబివ్వాలి, అలాగే అనుబంధ ప్రశ్నలు వచ్చే అవకాశమూ ఉంది అని. స్పీకరుకు కూడా ఆ ప్రశ్న ఆసక్తి కలిగించిందని, ఇతర సభ్యులకూ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారని అందువల్ల ఆయన ఇంకొంత సమయం కూడా దానికి కేటాయించవచ్చని తెలిసింది. ఆ సందేశం మా డిపార్ట్ మెంటులో సీనియర్ అధికారులెవరికీ నచ్చలేదు. కాని వాళ్లు చెయ్యగలిగిందేం లేదు. సమాధానం ఎగ్గొడదామనుకున్నవారి ఆశలు ముందే అడియాసలయ్యాయి.

‘సరే అయితే, ఇప్పుడేం చేద్దాం మరి?’ అన్నారు జాయింటు సెక్రెటరీ తన స్వరం మార్చి.

ఏం చెయ్యాలో, సమాధానం ఎలా ఇవ్వాలో ఆయన చెబుతారని అనుకుని వెళ్లిన నాకు ఇది కొత్తగా అనిపించింది. చూడబోతే, అసలు ఆయనకే ఏమీ తోచలేదు. చివరికి నేనే చెప్పాను. ‘ 1947 సమాచారం కోసం ఫైనాన్స్ లైబ్రరీని జల్లెడపడతాను, 1957 సమాచారం హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఇస్తే సరిపోతుంది’ అని.

మాకున్నది ఒక్క వారం రోజుల సమయం. ఆలోపలే అనుబంధ ప్రశ్నల సమాధానాలు కూడా వెతకాలి. విచిత్రం ఏమంటే 1947నాటి సమాచారం నాకు లైబ్రరీలో క్షణాల్లో దొరికిందిగాని 1957 సమాచారం మినిస్ట్రీ నుంచి రావడానికి బోలెడు సమయం పట్టింది. అందులోనే సెక్రెటేరియట్ పోస్టుల సమాచారం ఉందిగాని, ఎక్స్ అఫీషియో పోస్టుల సమాచారం తెలియదని చేతులెత్తేశారు. దాన్ని సంపాదించడానికి నేను టెలిఫోన్ డైరెక్టరీ మీద ఆధారపడ్డాను. అదే సమాధానంలో పొందుపరిచి అప్రూవల్ కు పంపాను. ఆ సమాచారం నాకు ఎక్కణ్నుంచి వచ్చిందో అయినా అడక్కుండానే ఉన్నతాధికారులు ఆ ఫైలును జాయింట్ సెక్రటరీకి పంపేశారు. ఆయన నన్ను పిలిచి కొన్ని ప్రశ్నలడిగారు. అదేం ఆడిట్ చేసి చెబుతున్న సమగ్ర నివేదిక ఏమీ కాదని, ఉన్న సమయంలో సంపాదించిన సమాచారం మాత్రమేనని స్పష్టం చేశాను. నేను టెలిఫోన్ డైరెక్టరీమీద ఆధారపడటం ఆయనకు నచ్చలేదు. కాని మార్గాంతరం లేదని కూడా తెలుసు. దాంతో ఆ ఫైలు అలానే ముందుకు కదిలి ఆర్థికమంత్రికి చేరింది. అనుకున్నట్టుగానే అనుబంధ ప్రశ్నలెన్నో వచ్చాయి. త్వరలో ఇంకాస్త సమాచారం సేకరించి సభకు నివేదిస్తానని ఆయన అంగీకరించాల్సి వచ్చింది. అవి చాలా సూక్ష్మమైన ప్రశ్నలు. దేనికీ సమాధానాలు సిద్ధంగా లేవు. దాంతో పెద్ద ప్రయత్నం మొదలయ్యింది. బడ్జెట్ డివిజన్ సారథ్యంలో ఒక విపులమైన మొమొరాండమ్ తయారైంది. ‘ద గ్రోత్ ఆఫ్ సివిల్ ఎక్స్ పెండిచర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ అనేది ఆ రిపోర్ట్ పేరు.

ఈ ప్రక్రియలో నాకు రెండు విషయాలు అవగాహనకు వచ్చాయి.

ఏ నియంత్రణా లేకపోవడమే ఖర్చులు పెరిగిపోవడానికి ప్రధాన కారణమనేది మొదటిది. రెండోది బ్యూరోక్రసీలో పాతుకుపోయిన ఒక నెగెటివ్ దృక్పథం. పార్లమెంటరీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఇష్టపడని తత్వం. వీలైనంతగా వాటిని అడ్డుకోవడం, వీలైతే దాటవెయ్యడం, తప్పించుకోవడం – ఇదే పద్ధతిలో నడుద్దామని ప్రయత్నిస్తారు తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలన్న సానుకూల భావన నాకు ఎవ్వరిలోనూ కనిపించలేదు. అమాత్యులు మొదలుకొని కిందిస్థాయి ఉద్యోగుల వరకూ అందరిదీ ఒకటే తీరు. సభ్యులు ఏ ఉద్దేశాలతో ప్రశ్నలు అడుగుతారో పసిగట్టి సమాధానాలిద్దామనుకుంటారు మంత్రులు. రాజకీయ – అడ్మినిస్టేరటివ్ రంగాలకు చెందిన వ్యక్తులు, ఆలోచనల్లో వ్యత్యాసముంటుంది. కాని ఫలితం సుమారుగా ఒకటే ఉంటుంది, అది నేటికీ అలాగే అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉండటమే బాధాకరం.

*
నేను న్యూఢిల్లీలో కేంద్ర సెక్రటేరియెట్ లో చేరేనాటికి సెక్షన్ ఆఫీసర్లలో రెండు గ్రేడ్లుండేవి. మొదటిది – నేరుగా రిక్రూట్ అయినవారికి సీనియారిటీ కలిసి వస్తుందని, రెండేళ్లు గడిచేసరికల్లా హయ్యర్ గ్రేడుకు వెళ్లే ప్రమోషన్ అర్హత వస్తుందని సాధారణంగా అనుకునేవారు. అలా జరిగితే మరో ఐదారేళ్లకు అండర్ సెక్రటరీ స్థాయికి చేరే మరో ప్రమోషన్ వస్తుంది.

మేం చేరాక ప్రభుత్వం సెకెండ్ పే కమిషన్ను నియమించింది. సర్వీస్ స్ట్రక్చర్ ను పరిశీలించడం, జీతాల్ని రివైజ్ చెయ్యడం, ఆనాటి ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణాలను గమనిస్తూ డియర్ నెస్ అలవెన్సులను సవరించడం – ఇదీ దానికి అప్పజెప్పిన బాధ్యతలు.

దేనికైనా సరే ఓ కమిషన్ లేదా కమిటీని వెయ్యడం అనేది బ్రిటిష్ వారి నుంచి భారత ప్రభుత్వం అందిపుచ్చుకున్న ఘనమైన వారసత్వం. దానివల్ల ప్రభుత్వం చేతులకు మసి అంటదు. నిర్ణయాలక రాజకీయ రంగు పులిమే అవకాశం ఉండదు. పైగా ప్రభుత్వానికి ఉండాల్సిన ఒత్తిడి అంతా కమిషన్లమీదే పడుతుంది. అదీగాక కమిషన్లకు, కమిటీలకు సాధారణంగా న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారు. వాళ్లు ఏ పక్షపాతాలూ లేకుండా, రాజకీయాల్లేకుండా న్యాయబద్ధంగా నడుచుకుంటారనే ఆశ ఉంటుంది. పైగా న్యాయపరమైన చిక్కులు లేకుండా వారు చూసుకుంటారనే ధోరణి ఉంటుంది. ఈ కమిషన్లలో ప్రభుత్వం తరఫున ఓ వ్యక్తి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. తుది నివేదికను రాయవలసింది వాళ్లే. వాళ్ల మీదుండే పెద్ద బాధ్యత ఏమంటే ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉండటం. ఈ తరహా కమిషన్లలో ఛైర్మన్, ఇతర సభ్యులు అశాశ్వతమైనవారు. కాని మెంబర్ సెక్రటరీ ప్రభుత్వోద్యోగి, అతని ఉద్యోగజీవితమంతా ప్రభుత్వంతోనే గడపాలి, ప్రమోషన్ల వంటి ఆశలూ ఉంటాయి, బోలెడు భవిష్యత్తుంటుంది. అదంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. పైగా కమిషన్లను కేవలం సలహామండలిగాను, అవిచ్చేవాటిని సూచనలుగానే పరిగణిస్తారు తప్ప, నిర్ణయాధికారం ఉండదు. నిర్ణయాలెప్పుడూ ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. బయటి నుంచి వచ్చేవారు ఎంత నిపుణులైనప్పటికీ వారికి మెంబర్ సెక్రటరీ, సెక్రటేరియట్ ఇచ్చే విషయపరిజ్ఞానం (ఇన్ పుట్) అత్యంత కీలకమైనది. ఇటువంటి కమిషన్ల పనితీరు ప్రభుత్వానికి కొత్తేమీ కాదుగనక అవి తాము అనుకున్న కార్యాన్ని మెంబర్ సెక్రటరీల ద్వారా చేయిస్తాయి.

సెకెండ్ పే కమిషన్ కు కూడా సుప్రీంకోర్టులో రిటైరయిన ఓ జడ్జిగారు అధ్యక్షులు. మెంబర్ సెక్రటరీగా ఓ ఐసీఎస్ అధికారి. హోమ్ శాఖలో పనిచేసిన అనుభవజ్ఞుడు. సెక్రటేరియట్ సర్వీసులకు సంబంధించి రెండు గ్రేడ్ల సెక్షన్ ఆఫీసర్లు చేసే పని ఇంచుమించుగా ఒకటే అన్నది ఆయన అభిప్రాయం. దాన్నిబట్టి అందరినీ కలిపేసి ఒకటే గ్రేడ్ చెయ్యాలనుకుంటున్నారని బయటకు గుప్పుమంది. అదేగనక చేస్తే, డైరెక్ట్ రిక్రూట్లకు ప్రమోషన్ అవకాశాలు తగ్గిపోతాయి. కనీసం ఓ పదేళ్లపాటు సీనియారిటీ అడ్వాంటేజ్ ఉండదు. హయ్యర్ గ్రేడ్ లో ఉన్న ఉద్యోగులు వీళ్లకు సీనియర్లయిపోతారు. అప్పటికి ఉన్న 300 మంది డైరెక్ట్ రిక్రూట్లు తామున్న గ్రేడ్ లోనే ఉండిపోవాలి. వారికే భవిష్యత్తూ ఉండదు. ఈ కొత్తవాస్తవాన్ని అంగీకరించడం మాకు కష్టమయ్యింది. ‘ఏదో కొత్త కెరీర్ను ఆశించి ఇక్కడ చేరితే ఇలాగయ్యిందేమిటా’ అని తలపట్టుకున్నవాళ్లమే మేమందరం. దాంతో మా ప్రతిఘటన తెలియజెయ్యాలి, వీలయితే న్యాయస్థానం తలుపు తట్టాలని కూడా నిర్ణయించుకున్నాం.

వీటన్నిటికన్నా ముందు చెయ్యవలసింది కమిషన్ కు మా తరఫు వాస్తవాలు, వాదనలు తెలియజెయ్యడం. ఒక మెమొరాండమ్ ఇచ్చి, సాక్ష్యం చెప్పాలి. నేనూ, మరో సీనియర్ ఆ పనిచెయ్యాలని మా సహోద్యోగులు నిర్ణయించారు. మేం బోలెడంత సమాచారం సేకరించి సవివరమైన మెమొరాండమ్ ఇచ్చాం. కాని సాక్ష్యం ఇవ్వడానికి వెళ్లేసరికి అక్కడి దృశ్యం మాకు పూర్తిగా అర్థమైంది. మెంబర్ సెక్రటరీ దృష్టి కోణాన్ని కమిషన్ స్వీకరించిందని తేటతెల్లమైంది. రెండు గ్రేడ్లను కొనసాగిస్తారని మా సహోద్యోగుల్లో కొందరికి అప్పటికీ ఏ మూలో కాస్త ఆశ ఉండేది. అది కుదిరేలాగా లేదని నాకు స్పష్టంగా అర్థమయ్యింది.

1959 చివర్లో కమిషన్ నివేదిక వచ్చింది. మా భయాలు నిజాలయ్యాయి. ప్రభుత్వం రెండు గ్రేడ్లనూ ఏకం చేసేసింది. ఆశాకిరణాలు వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. ఒక తప్పు కెరీర్ ఛాయిస్ మమ్మల్ని ఘోరంగా దెబ్బతీసిందని మాకు అర్థమయ్యింది.

నావంటి డైరెక్ట్ రిక్రూట్లకు ఉన్న మార్గాలేమిటి? ఒకటి మంచోచెడో అందులోనే కొనసాగి నిలకడగా జీవితాన్ని కొనసాగించడం. రెండోది – కొత్త అవకాశాలేమున్నాయని అన్వేషించడం. దానివల్ల జీవితం మళ్లీ మొదటికొస్తుంది, ఒక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పనిచేసిన ప్రసిద్ధ ఆర్థికవేత్త ఫ్రాంక్ నైట్ రిస్కుకు, అన్ సర్టెనిటీకి తేడా వివరించాడు. రిస్క్ అంటే ప్రమాదాలను అంచనా వేయవచ్చు. అనిశ్చితి అటువంటిది కాదు. ముందేమవుతుందో తెలియకపోవడం. మేం ఉద్యోగం వదిలెయ్యడం అంటే అంతు తెలియని సముద్రంలోకి దూకినట్టే. రెండేళ్ల క్రితం అకడమిక్ ప్రపంచాన్ని వదిలి పరిచయం లేని ప్రభుత్వ రంగంలోకి దూకాను. ఇప్పుడు ఈ సెక్రటేరియట్ సర్వీసును వదిలి మరెందులోకైనా దూకడానికి సిద్ధపడాలి. అప్పుడు కుటుంబం చిన్నది, ఇప్పుడు మా రెండో అమ్మాయి పద్మ కూడా పుట్టింది (1959). ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తొందరపడకూడదు.

నా సహోద్యోగుల్లో ఎస్.సి.సేథ్ ఒకరు. సర్వీసులోకి వచ్చేసరికే ఆయనకు పొలిటికల్ సైన్సులో పి.హెచ్.డి. ఉంది. ఆయనకూ మాలాగే భవిష్యత్తు అంధకారమని అర్థమయ్యింది. కమిషన్ రిపోర్టు రాకముందే ఆయన మాంచెష్టర్ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్ సంపాదించి స్టడీ లీవ్ మీద వెళ్లిపోయారు. అది చూశాక నా దృష్టి రచన మీద పడింది. రచన ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయన్న నమ్మకం కలిగింది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అప్పుడే కొత్తగా నాలుగు ఫెలోషిప్ లు ప్రకటించింది. అక్కడ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాసన్ గారిని సంప్రదించాను. వారు నాకు ఆంధ్రా యూనివర్సిటీలో పరిచయస్తులు. చాలా దయాళువు, స్పందించే హృదయమున్న ఆయన నాకో ఫెలోషిప్ ఇస్తామన్నారు. అనుకోని ఈ కొత్త మలుపు ఎన్నో కొత్త అవకాశాలను ఇస్తుందని నాకప్పుడు తెలియలేదు.

*

అనువాదం: అరుణా పప్పు

అరిగపూడి ప్రేమ్ చంద్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాచరికములోని లోపలి సంగతులు, వ్యక్తి పురోగమనంలో కృషి అద్భుతముగా వివరించారు

  • అస్సలు అనువాదం లా అనిపించడము లేదు . చాలా బాగుంది . అరుణ గారికి అభినందనలు .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు