ఉదయం కాగానే తాజాగా పుడుతూ వుంటా!

ప్రేరణ, ఓ భావన, ఓ కవిత, ఓ లయ–  ఇవన్నీ కలిస్తే నిండుగా సీతారామశాస్త్రి.

ఆయన మొదటిపాట “విధాత తలపున” నుండి నేటి మన విశ్లేషణ పాట “ఏదారెదురైనా” వరకు తనదో ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.ఆయన శైలీకరణం,
పదజాలప్రయోగం వేరు.’సిరివెన్నెల’ సినిమాతో సినీరంగప్రవేశం చేసి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా,ఒంటి పేరుగా స్థిరపరుచుకున్న ప్రతిభాశాలి.అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి.ఆ పేరుతో పిలిస్తే ఆయనకు కూడా చిత్రంగానే అనిపించొచ్చు.ఇప్పుడు అందరి మనస్సులో సిరివెన్నెలగానే నాటుకుపోయాడు. తరగని వన్నెతో పాటలకు అక్షరాలను అద్దుతూనే ఉన్నాడు.

తల్లిదండ్రులు డా.సి.వి.యోగి,సుబ్బలక్ష్మి.ఈయన స్వస్థలం విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి. సాహిత్యంలో నోబెల్ అందుకోవాల్సిన సత్తా ఉన్న రచయిత అని త్రివిక్రమ్ అన్న మాటల్లో కొంత అతిశయం కనిపించినా వాస్తవం లేకపోలేదు. అలాగే తెలుగు పాట స్థాయిని, తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచడంలో కీలకభూమిక పోషించాడని త్రివిక్రమ్ అనటంలో ఎలాంటి సందేహంలేదు.”ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి” అనే పాట సిరివెన్నెల రాసిన పాటల్లో గొప్ప ప్రేరణాగీతం గా చెప్పుకొవచ్చు.ఏదో సాధించాలనే సంకల్పమున్నవాడు రోజుకొక్కసారయినా వినాల్సిన పాట ఇది.పరిశోధన చేయాల్సినంత సాహిత్యం సిరివెన్నెల పాటల్లో ఎంతో ఉందన్న విషయం లోకవిధితమే.ఒక్క పాట గూర్చి మాట్లాడడంతోనే సిరివెన్నెలను పూర్తిగా దొరకబట్టలేము.నేనేదో సాహసం చేస్తున్నట్టే లెక్క.

మనిషి జీవితంలో తీయని అనుభూతులు తప్పక ఉంటాయి.శైశవం నుండి వృద్ధాప్యం వరకు ఏదో దశలో నుంచి కొన్ని స్మృతులు వెంటాడుతూనే ఉంటాయి.
ఇందులో మరువనివి ఉంటాయి.మరిచిపోయేవి ఉంటాయి.మనసుకు మందు రాసేవి ఉంటాయి.

మనసును చిత్రవధ చేసేవి ఉంటాయి.కొంత మంది అనుభూతుల నుండి జ్ఞాపకాల నుండి సాధారణంగా బయట పడతారు.కొంత మంది కొంత కష్టంతో బయట పడతారు.ఈ పాటలో రచయిత కొన్ని జన్మలకు సరిపడే జ్ఞాపకాలను పోగేసుకుని ఎప్పటికీ అందులో నుండి బయటకురాని కథానాయకుడి గూర్చి రాశాడు.
ఇటువంటి ఒంటరి ప్రేమకు ముగింపు ఉండదు.ఆ ప్రేమను రోజు కొత్తగా ఆహ్వానించే వ్యక్తి ప్రపంచాన్ని ఊహించటం కష్టం.ఆ సరిహద్దులను స్పృశించటం ఇంకా ఇంకా కష్టం.మనలోంచి మనల్ని తీసేసుకోని తనను నింపుకున్నప్పుడు ఆ జ్ఞాపకాల తాలూకా బరువును అంచనా వేయగలుగుతామోమో.

ఈ రోజుల్లో ప్రేమ పాదరసం లాంటిది.వెతికి పట్టుకునేంతలోపు జారుతుంది.పట్టుకున్నాననే భ్రమ వీడిపోకముందే ఎక్కడికో చెంగున దూకుతుంది.
మానసిక పరిపక్వత లేకపోవటం,కుటుంబపరిస్థితులు, కోరికల వల్లే కావచ్చు.ఇంకేదైనా కారణం కావచ్చు.ఈ పాటలో ఓ వైరాగ్యంలోకి,ఓ వేదాంతంలోకి నెట్టివేయబడ్డ ప్రేమికుని మాటలు రచయిత కలం నుంచి వాక్యాల గుత్తులుగా హత్తుకునేట్టుగా బయటకొచ్చాయి.చూస్తున్నవాడికి అదో వేదాంతం.అనుభవిస్తున్నవాడికి అదో స్మృతి.

మధురానుభూతి.ఒక మనిషి రెండు కోణాల్లో ఒకే సారి జీవించలేడు కాబట్టి అంచనాలు ఒకొక్కరివి ఒక్కొక్కటిగా ఉంటూ వ్యతిరేకించేవిగా ఉండొచ్చు.
రచయిత పూర్తిగా ఆత్మాశ్రయ ధోరణిలో కథానాయకుడి భావాలను శక్తివంతంగా ప్రకటించాడు.

మనిషికి దినచర్య ఉంటుంది.వయసుని బట్టి బాధ్యతలుంటాయి.ఇతనిది దినచర్యలేని ప్రవాహం.ఇతనిది ప్రేమైక దినచర్య.ఆరాధనా భావం.ప్రేమ ప్రేమగా ఉన్నప్పటి పరిస్థితి వేరు.ఆరాధన స్థితికి చేరాక పరిస్థితి వేరు.ఈ భావాలను వ్యక్తపరిచే వాక్యాల ధ్వని పాటలో స్పష్టంగా వినబడుతుంది.
రచయిత opening లోనే ధృడమైన పదబంధాలతో విరుచుకు పడుతాడు.విని తేరుకునే లోపే ఇంకోక భావం మెదులుతూనే ఉంటుంది.ఎడతెరిపిలేకుండా పదాలను గుప్పిస్తూ వెళుతుంటాడు. దారిలోకి  మనం వెళ్ళేప్పుడు ఏముందో గమనిస్తూ ముందుకెళ్తాం.సరిగ్గా చేరుకునే ప్రయత్నం చేస్తాం.ఇక్కడ దారితో సంబంధం లేని ప్రయాణం కథానాయకుడిది.

దారితప్పాడా అని అనుకుంటాం.అసలు దారిని పట్టించుకునే అవసరం లేదన్నట్టుగా,వెతకాల్సిందేదో దొరకకపోయిన ఇక వెతకడం మాటే పట్టించుకోని విధంగా ఓ ఖచ్చితత్వం ఉన్న మనిషిని రచయిత పరిచయం చేస్తాడు.మనిషికి ఉత్సాహం ఉన్నంత సేపో,బాధ ఉన్నంత సేపో,ఇంకేదో అనుభూతిని పొందినంత సేపో ఏదో ఓ కదలిక చేస్తాడు.కదలికలు ఆగిపోయిన వ్యక్తి శిల కాక ఇంకేమవుతాడు.ఏ వ్యక్తి శిలలా మారాలని కోరుకోడు.ఈ సందర్భంలో ఓ చమత్కారం గుర్తొస్తుంది.ఎదురుగా వచ్చే వ్యక్తి కూడా చక్కగనే రావాలిగా అంటారు.అవును ఇద్దరు accidental గా కలుసుకున్న పర్లేదు.జీవితాన్నే తెలిసి తెలిసి accident కానివ్వకూడదు.ఇక్కడ రచయిత శిల,కల అనే రెండు పదాల ప్రయోగాన్ని తీసుకొని హీరో గొంతుక ద్వారా ఆర్తిని వినిపించాడు.శిల, కరిగిపోయే కలలు దాటి తను రెంటికి తేడాలేనంత చివరి స్థాయిలోకి చేరిపోతాడు.ఇక ప్రశ్నించే అవకాశం లేదు.ఏదో ఓ సమాధానం చెప్పి ఆ అంతర్లీనమైన ఉదయపు వేళలోని తాజాదనం నుండి బయటపడాలన్న ఆలోచన లేదనట్టుగా వాక్యాల పోత పోశాడు.ఇంగితం తెలిసిన ఎవడు ప్రశ్నలా బ్రతకాలని కోరుకోడు.జవాబివ్వని స్థితిలో మనిషి హాయిగా ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితులకు ప్రశ్నే సబబనిపిస్తుంది.

రచయిత ఈ పాటలో ఇంకో గొప్ప కోణాన్ని ఆవిష్కరించాడు.ప్రేమలో విఫలమైన వానిపై ఖచ్చితంగా సానుభూతి చూపిస్తుంది లోకం.కానీ ఇక్కడ
విరోధాబాసాన్ని ఉపయోగిస్తూ  ప్రార్థనార్థకంగా ఓ వాక్యాన్ని నిర్మించాడు.ఇంకొన్ని జన్మలకు సరిపడే జ్ఞాపకాలున్నాయని, నన్ను ఒంటరివని ఎలా అడుగుతారని,నాపై దయ ఉంచి అలా అడగకండి అని చెప్పే వాక్యాలు రచయిత సృజనను పట్టిస్తాయి.నా ఊపిరి ముందుకు సాగటానికి కారణం నా హృదయంలో ఆమె తాలుకా కబుర్ల ఘుమఘుమలు ఇంకా గుసగుసపెట్టడమేనంటాడు.

పరిశీలనగా చూస్తే ఇప్పుడు ప్రశ్న మనవైపుకు తిరిగినట్టే అనిపిస్తుంది.అతన్నిప్పుడు ఒంటరి అనగలుగుతామా?ఆ అవకాశాన్ని రచయిత పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని బదులులేని ప్రశ్నను సమాధానంగా ఇచ్చాడు.

రచయిత ప్రేమ స్మృతులను చూపిస్తూ, కథానాయకుడిని జీవితాన్ని ఏమాత్రం తక్కువ చూపించకుండా అతని వైపుగా నిలబడి రాయాల్సిన పాట ఇది.రెండు పదాలు ఈ పాటనంతా ఎలివేట్ చేస్తాయి.

1.రచయిత “తుదిలేని కథ” గా అతని జీవితాన్ని చెప్పటం
2.”బదులు పొందని లేఖ” తనకు తానుగా
లోలోపల కేకలు వేసి వేసి..మౌనస్థితిని చేరుకోవటం

మనిషి ఏకాంతంను కోరుకుంటాడు.రోజువారీ కార్యకలాపాల నుండి కాస్తా దూరంగా జరుగుదామని కోరుకోవచ్చు.ఇక్కడ హీరో ఏకాంతం వేరు.వ్యక్తికి,వ్యక్తికి మధ్య ఈ అర్థం రకరకాల రూపాలను దాల్చుతుంది. లోలోపల గూడుకట్టుకున్న తన ప్రేమ తాలుకా జ్ఞాపకాల లోకమిది.బహిర్లోకం అందరికి ఒక్కటే.లోపలి లోకాన్ని గణన చేయలేము.అంతు చిక్కనంత నిడివి ఉంటుంది.ఒకవేళ చేయాల్సొస్తే అదిక మానసిక నిపుణిని వంతే అవుతుంది.ఇక్కడ ఏకాంతాన్ని రచయిత ఎంతలా చూపారంటే మనిషి తన నీడను మాత్రమే నమ్మేంతగా కనిపించే ఏకాంతం.

జాబిల్లిని,అమ్మను ఈ పాట ద్వారా గుర్తుతెచ్చారు రచయిత.చిన్నతనం నుండే అందని వాటిని చూపించబట్టే మనిషి ఇలా తయారవుతున్నాడని అనుకోవచ్చా ? లేదే.దూరాన్ని గుర్తెరిగి ఎవరు చెరుపగలుగుతారో వాళ్ళకు జాబిల్లినందుకోవటం కష్టమేమి కాదు.జాబిల్లి అనేది ప్రేయసికి ప్రత్యామ్నయంగా రచయిత తీసుకున్నారు.రచయిత ఇంకో గొప్పమాట చెప్పారు. దూరంగా ఉన్నప్పటికీ జాబిల్లి జోలపాట పాడుతుందని అందకపోయినా అలా చూస్తూ జీవితాంతం బ్రతుకొచ్చని చెబుతూ పాటలో పూర్తి పర్ఫెక్షన్ చూపించారు.ప్రేమికుడు తనపైన ప్రేమను చంపుకుంటాడేమోగాని తన ప్రేమ ప్రవాహాంలో ప్రాణమున్నంతసేపు ఏదో సన్నివేశంలో వెనక్కెళ్ళి మరీ మునకలేసి వస్తాడు.ఇన్నాళ్ళు ప్రేమే గొప్పదనుకున్నాను.ప్రేమను ప్రేమలా ఆరాధించేవాడు గొప్పవాడని ఈ పాట చూశాక అర్థమయ్యింది.

ఇప్పటికైనా ప్రేమను నటిస్తున్న కళ్ళు ఈ పాటతో ఏ మాత్రం చెమర్చుతాయో చూడాలి.

పాట:

ఏదారెదురైనా ఎటువెళుతుందో..  అడిగానా..

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ..  పోతున్నా..

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా…  ఏదైనా..

ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ..  ఉన్నా

కదలని ఓ శిలనే అయినా

తృటిలో కరిగే కలనే అయినా..

ఏం తేడా ఉందట

నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

              ఇల్లాగే  కడదాకా
             ఓ  ప్రశ్నయి ఉంటానంటున్న
             ఏదో ఒక బదులై
           నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్న

          నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు..
         అనొద్దు దయుంచి ఎవరు
         ఇంకొన్ని జన్మాలకి సరిపడు
         అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

         నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
         తన వెన్నంటి నడిపిన
         చేయూత ఎవరిది
         నా ఎదలయను కుశలము అడిగిన
          గుస గుస కబురులా
         ఘుమ ఘుమ లెవరివి

       ఉదయం కాగానే తాజాగా పుడుతూ వుంటా
        కాలం ఇపుడే నను కనగా..
       అనగనగ అంటూ నే ఉంటా
       ఎపుడు పూర్తవనే అవకా..
       తుది లేని కథ నేనుగా..

        గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక
       కాలు నిలవదు ఏ చోటా..  నిలకడగా
     ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
     ఎందుకు వేస్తుందో కేక…  మౌనంగా

     నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు
     అనొద్దు దయుంచి ఎవరు
    ఇంకొన్ని జన్మాలకి సరిపడు
    అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

    నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
    తన వెన్నంటి నడిపిన
   చేయూత ఎవరిది
    నా ఎదలయను కుశలము అడిగిన
   గుస గుస కబురులా
   ఘుమ ఘుమ లెవరివి

  లోలో  ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
  నాకే సొంతం అంటున్నా.. విన్నారా
  నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
  రాకూడదు…  ఇంకెవరైనా

   అమ్మ ఒడిలో మొన్న
  అందని ఆశలతో నిన్న
 ఎంతో ఊరిస్తూ ఉంది
 జాబిల్లి అంత దూరాన ఉన్న
 వెన్నెలగా చెంతనే ఉన్నా
 అంటూ ఊయాలాలూపింది జోలాలి

  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే
  తానే నానే నానినే

సినిమా  – జాను 

లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి 

గాయకులు : ప్రదీప్ కుమార్ 

సంగీతం : గోవింద్ వసంత 

తండ హరీష్ గౌడ్

12 comments

Leave a Reply to Ramana Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకెంతో ఇష్టమైన తాజా సిరివెన్నెల పాట
    ” ప్రేమ ప్రేమగా ఉన్నప్పటి పరిస్థితి వేరు.
    ఆరాధన స్థితికి చేరాక పరిస్థితి వేరు.
    ప్రేమను ప్రేమలా ఆరాధించేవాడు గొప్పవాడని ”
    చాలా బాగా విశ్లేషించారన్నా పాటను
    🌹👌ఆద్యంతం ఆమోఘః👌🌹

  • అద్భుతం గురు గారు …కాలం కూడా అసూయపడేలా ఉన్నది

  • మనిషిలోని నటన అనే విషపుకోరలను పీకి నిజమైన ప్రేమమనిషిగ తీర్చిదిద్దె పాట అన్న.ఈ వ్యాసాల ప్రయోజనం భవిష్యత్తులో మీకు తెలుస్తుంది.అంత అద్భుతంగ వున్నాయి.మరింత కష్టపడి దేనికది విభిన్నంగా కష్టపడి రాయండి…ప్రేమతో మీ తమ్ముడూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు