ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాదులయిన ఉగ్రవాదులు పర్యాటకులపై సాగించిన పైశాచిక హత్యాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లందరిలోనూ ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మతాలకతీతంగా అందరూ నిరసించిన ఈ అమానవీయ చర్యను ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఖండించాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన కవులూ తమతమ భాషల్లో ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ కవితలను రచించారు.
దీనిపై తెలుగులో వివిధ పత్రికలలో వచ్చిన కవితలలో కొన్నింటిని ఈ వ్యాసంలో పరిశీలిద్దాం. మతం మనిషి జీవితంలో ఒక భాగంగా వుండాలే తప్ప మతోన్మాదాన్ని తలకెక్కించుకుంటే మాత్రం అది మనిషి మనుగడకే ప్రమాదకరంగా తయారవుతుంది. దీనిని వివరిస్తూ వైష్ణవి శ్రీ ‘కుంకుమపువ్వు’ అనే కవితలో
‘మతమే మనిషైనప్పుడు
నిలువ నీడ కూడా
నీ పైకి తుపాకీ గురిపెడుతుంది
నిషిధ్ధ స్థలమైపోతుంది’ అంటారు.
అసలు మతం అనేది ఎలావుండాలో చెబుతూ షేక్ నసీమాబేగం
‘ ఐక్యతను సమాధి చేసే
రుధిరక్రీడ కాదు మతం
మానవత్వం నిలువెల్లా
తడిసిన ప్రేమతత్వం పేరు మతం
మనిషిని మనిషితో కలిపే
సంపూర్ణత్వం కావాలి దాని రూపం.’
అంటారు ‘ఏది మతం?’ అనే తన కవితలో.
శాస్త్రసాంకేతిక రంగాలలో మానవాళి ఎంత ప్రగతిని సాధిస్తున్నా కాలానుగుణంగా ఎన్నెన్ని మార్పులు వస్తున్నా ఇప్పటివరకూ ఏ మతమూ ప్రమాదంలో పడలేదు. కానీ ఆ మతాల చుట్టూ తిరుగుతున్న మనిషి మాత్రం ప్రమాదంలో పడుతున్నాడు. దీనినే చిత్తలూరి సత్యనారాయణ ‘వాళ్ళెవరైతేనేం?’ అనే కవితలో
’ఎవడు గోక్కుంటే వాడికే
రసికారే రాచపుండు కదా మతం
ఎవరికి సోకితే వాళ్లు
తొలగించు కావాల్సిన
కుళ్ళిపోయిన పుండే కదా అది’ అంటూ హితబోధ చేయడంతోపాటు మతమన్నది కేవలం ఒక విశ్వాసం. మతాలు వేరయినా మనమంతా మనుషులమే కదా! కానీ దారితప్పిన ఉగ్రవాదులకు ఇదంతా అర్ధం కాదు. అందుకే
‘వాళ్ళెవరైతేనేం
మనుషుల్రా తండ్రీ…మనుషులు
నీకు లాగే కాళ్ళూ చేతులున్నాయి
ముక్కూమొఖముంది
చల్లని నవనీతంలాంటి హృదయముంది
బహుశ నీకది లేకపోవచ్చు’ అంటూ ఉగ్రవాదులలోని క్రౌర్యాన్ని నిందిస్తారు చిత్తలూరి. ఇదే విషయాన్ని
’నువ్వెప్పటికీ పరాజితుడివే…’ అనే కవితలో
‘మొదటి పుట్టుక గుట్టు విప్పిన
సాక్ష్యం సాక్షిగా
నిన్నూ నన్నూ కన్నది ఒకే అమ్మేరా
ప్రతి అమ్మ తీసే పురిటి నొప్పుల బాధ ఒకటేరా
ఉమ్మనీటిలో తొమ్మిది నెలలు ఈదులాడిన
మనందరి పెనుగులాట ఒక్కటేరా’
అంటారు గాజోజు నాగభూషణం.
అలాగే ‘ఆ మౌనం ఏం చెప్పింది?’ అనే కవితలో శాంతయోగి యోగానంద అనే కవి
‘కొంచెం అటు ఇటుగా కట్టుబొట్టు తప్ప
అందరూ ఒకే బతుకు బతుకుతున్నారు’
అంటూ మతం మన కట్టు బొట్టులను మార్చిందేమో గానీ ఏ మతమూ మన బతుకులను మార్చలేకపోయిందనే విషయాన్ని సూటిగా చెప్పారు.
అక్కడ జరిగిన పాశవిక ఘటనను కవులు భారమైన హృదయాలతో ఒక్కొక్కరు ఒక్కో శైలిలో రచించారు.
‘కాశ్మీరం నెత్తుటి రంగు పులుముకుంటుంది
బులియన్ సరస్సు కన్నీటితో గడ్డ కడుతుంది
బైరస్ లోయ మీద ఉన్మాదం నిప్పులు చెరుగుతోంది
పర్వతాలు చావు కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి ‘
అంటూ ఇక్కడి భయోద్విగ్న పరిస్థితులను చిత్రీకరించారు వైష్ణవి శ్రీ. అలాగే శిఖా-ఆకాష్ తాను రచించిన ‘రాజకీయ మత రక్త సింధూరం’ అనే కవితలో
‘భూమంతా విస్తరించిన
మరణ ఋతువు
ఉగ్రవాద విధ్వంసపు హత్యా క్రతువు
అంటారు.
కోటం చంద్రశేఖర్ రచించిన ‘చూసావా…’ అనే కవితలో
‘చూసావా
చిగురుటాకులా వణుకుతున్న
జనజీవన దృశ్యం
అమాయక ప్రాణాలే
కుంచెలై గీసిన రక్త వర్ణచిత్రం
నాగరిక సమాజానికి తగిలిన పెనుగాయం
గణతంత్ర వ్యవస్థ పాడిన
మహా విషాదగేయం’ అంటూ ఇక్కడ జరిగిన పాతకం ఎంత ఘోరమైనదో కదా అంటూ తన దుఃఖాన్ని వ్యక్తం చేస్తారు.
నిండు నూరేళ్లూ కలిసి జీవించాలని కోటి ఆశలతో ఒక్కటై సంతోషంగా గడిపేందుకని కాశ్మీర్ వచ్చిన నవదంపతులలో భర్తను ఆ భార్య ముందే ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాళ్ళపారాణి ఆరకముందే ఒంటరయిపోయిన ఆమె కన్నీరుమున్నీరయిన దృశ్యాన్ని చూచినవారెవరికయినా కళ్ళు చెమర్చకమానవు. ఈ అంశాన్ని దాదాపు అందరు కవులూ తమ కవితలలో ప్రముఖంగా ప్రస్తావించారు. దీనినే వస్తువుగా తీసుకుని గట్టు రాధికా మోహన్ ‘రాలిపడిన కుంకుమ పువ్వు’ అనే కవితను రచించారు.
‘కుంకుమ పువ్వును
కొంగున కట్టుకునిపోదామనుకున్న ఆమెకు
కుంకుమే లేకుండా చేసిన
ఈ మతతత్వం ఒక సరళరేఖ’ అంటారు.
సరళరేఖలా అంతం లేకుండా కొనసాగుతున్నఠ ఈ మతత్వం అంతం కావాలంటూ ఆమె తన కవితలో ఆకాంక్షించారు.
ఇదే అంశంపైన ‘మంచు కొండల్లో యజ్ఞకుండాలు’ అనే కవితను రచించారు సందీప్ వొటారికారి. ‘మానవత్వం మంట కలిసింది’ అనే మరో కవితను వీపూరి శ్రీనివాస్ రచించారు.
‘అడగాలనిపించింది’ అనే కవితలో
‘నీది ఏ మతమని అడిగారు
అప్పుడే తెలిసిపోయింది
వారు ఏ మతస్థులూ కారని
భూమ్మీద బ్రతికే అర్హత లేని మనుషులు’ అంటారు భీమవరపు పురుషోత్తం.
‘బాంబనేది పిచ్చివాడి చేతిలో ఓరాయి
ఎవడు విసిరినా వాడు మనకు పరాయి’ అంటూ మనకు హాని తలపెట్టే వాడెవడయినా మనకు శత్రువేనని స్పష్టం చేస్తారు.
అయితే జరిగిన దుస్సంఘటనను సాకుగా చూపించి మొత్తం కాశ్మీరీలందరినో లేదా పూర్తిగా ఒక మతం వారినో బాధ్యులుగా చూపేందుకు జరుగుతున్న సంకుచిత ప్రయత్నాలపట్ల కూడా కవులు తమ అప్రమత్తతను కనబరచడం విశేషం.
‘మంచుపూలనేమీ అనకండి
తూటాల వర్షంతో రక్తసిక్తమైనాయి
కుంకుమ పువ్వులపై నిందలు మోపకండి’ అని చెబుతూ
‘ఆకాశాన్నంటిన పైన్ వృక్షాలకు
ఉన్మాదం ఊసుతెలియదు
రాజకీయ వ్యూహాల దుర్గంధం వాటిని సోకదు.’
అని చెబుతూ ప్రస్తుత ఉద్రేక సమయంలో ప్రజలను సరియైన దిశగా ఆలోచించమని చెబుతారు వైష్ణవి శ్రీ. కాగా మతోన్మాదుల కారణంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు చరమగీతం పలికేలా మనమిప్పుడు…
‘కరడుగట్టిన తత్వాలకు బొందపెట్టి
మన రెండు భుజాలపై ఈ దేశాన్ని నిలబెట్టుకుందాం
సరికొత్త లౌకిక బలంతో, లౌక్యంతో
చారలుపడ్డ ఈ దేశ ముఖ చిత్రాన్ని కొత్తగా నిర్ణయించుకుందాం.’ అని చెప్పడం ద్వారా ఉగ్రవాదానికి బొందబెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూనే మన లౌకిక తత్వంతో మన దేశాన్ని సరికొత్తగా నిర్మించుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు గట్టు రాధికా మోహన్.
పైన ప్రస్తావించిన కవితలే కాకుండా సింగారపు రాజయ్య రచించిన ‘మతం రంగులో మృత్యువు’, డా. వి డి రాజగోపాల్ రచించిన ‘ఉగ్రవాదమా అంతరించుమా’ అనే కవిత, మధుపాళి రచించిన ‘పాక్ (కా)సుర ఉగ్రోన్మాదం’ అనే కవితలు కూడా ఈ సంఘటన పట్ల కవుల స్పందనకు అద్దం పట్టాయి.
ఊహించని విధంగా అమాయకులయిన పర్యాటకులపై మారణహోమానికి తెగబడ్డ తీవ్రవాదుల దుశ్చర్యలపై వెంటనే స్పందించి తమ కవిత్వం ద్వారా పాఠకులను ఆలోచింపజేసిన మన కవుల చైతన్యం అభినందనీయం.
*
డేగ కన్ను తో అన్ని కవితలను ఒక దగ్గరకు చేర్చడమే కాకుండా మతం కన్నా మానవత్వం గొప్పది అనే ఆలోచనలో పరిశీలన చేయడం చాలా బాగుంది..
మంచి పరిశీలన