ఈ వెన్నెల ఎంతో ఎరుపు!

ఖమ్మం జిల్లా పరిషత్ హాల్ లో కౌముది ఫౌండేషన్ ఆవిర్బావ సభ 27 న …

నైజాము ఏలుబడిలో ప్రతిఘటనా పోరాటాలకూ, బ్రిటిష్ పాలనలో ఆధునికత ఫలాలకూ అందుబాటులో ఉంటుంది ఖమ్మం. ఒక రకంగా కోస్తాంధ్ర ఆధునికత, పెట్టుబడి,సాంస్కృతిక ఆధిపత్యానికి విద్వంశం అయిన ప్రాంతం మాది. ఆంద్ర మహాసభ, గ్రంధాలయ ఉద్యమం,ప్రత్యేక తెలంగాణ ఉద్యమం,అభ్యుదయ విప్లవ సాహిత్య కార్యాచరణకు పునాదులు ఖమ్మం కేంద్రంగా ఉండేది. ఈ రాష్ట్రం లో శ్రీ కృష్ణ దేవరాన్ద్రాయ భాషా నిలయానికి చేయూత నిచ్చిన ఖమ్మం ప్రభంధ, జాతీయ, అభ్యుదయ, విప్లవ,అస్తిత్వ పాయలకు సంగమ స్థలిలో కవిరాజ మూర్తి,దాశరధి,హీరాలాల్ మోరియా లాంటి వాళ్ళతో బాటు నాడు రాష్ట్ర అభ్యుదయ సాహిత్య వేత్తలతో నడిచి కలిసి పనిచేసిన  కౌముది కూడా ఉన్నాడు.    

కౌముది అలియాస్ షంషుద్దీన్ హిందీ పండితుడు.మహమ్మద్ హుస్సేన్, కుల్సుం ఇంట  పందొమ్మిది వందల ముప్పై తొమ్మిది లో ఖమ్మం, కృష్ణా , గోదావరి, సరిహద్దు గ్రామం అయిన మీనవోలులో పుట్టాడు. ఆయన పసివాడుగా ఉండగానే కన్న తల్లి ఆతర్వాత పెంచుకున్న మహబూబ్ అలీ.చనిపోయారు.ఒక రకంగా ఆయన బాల్యం అత్యంత దుర్బరంగా గడిచింది అని తెలిసింది. ఆయన తాత ఏడో నిజాం ఇలాకాలో కస్టమ్స్ పెద్ద అధికారి. ఆ క్రమం లో ఆదాయమూ అంతే ఉండేది. పోలీస్ యాక్షన్ జరిగాక అంతరించి సౌదాలలో కౌముది పూర్వీకులదీ ఒకటి. కన్న తల్లిదండ్రులూ పెంచిన వాళ్ళూ చిన్న వయసులో దూరం అవడం మూలంగా అనాధగా మిగిలిన ఆయనను  సమీప  బంధువుల ఇంట్లో పెరిగాడు. నాడు ఆ ఇల్లు వామపక్ష సాంస్కృతిక రంగాలకు చిరునామా.రాజకీయ సాంస్కృతిక రంగాల లో పనిచేసిన సాలార్ మహమ్మద్ కౌముది దగ్గరి బంధువు. ఒక నాటి వందల ఎకరాల ఆసామి మనవడు భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తున్న వాతావరణం లో పెరిగాడు. ఆయన పెరిగిన ప్రాంతం వామపక్ష సాంస్కృతిక రంగాలకు దగ్గర చేసింది.

కౌముదిగా పేరు గాంచిన మహమ్మద్ షంషుద్దీన్ నాకు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల లో పనిచేసిన గ్రేడ్ వన్ హిందీ పండితునిగా మాత్రమే తెలుసు. నాకు ఆయన ప్రత్యక్ష గురువు.తరగతి గదిలో గంబీరంగా ఉండే ఆయనను చూస్తే నాకే కాదు అందరికీ బయమే. ఆయన అలా ఉండడం వెనక అంతులేని ఆయన అనుభవించిన సంక్షోబాలు ఉన్నాయి అని ఆలశ్యంగా తెలిసింది. ఆయనలో ఉన్న సాహిత్య విరాట్ రూపం అర్ధం కావడానికి నాకు మాత్రం చానా కాలమే పట్టింది. కవిగా,అనువాదకుడిగా,నవలాకారుడిగా,సాహితీ విమర్శకుడిగా ప్రసిద్ది గాంచిన ఆయన  ప్రముఖ విప్లవ కవి ముక్దూం మరణ వార్త విని చలించి రాసిన “అల్విదా”అనే గేయం లో ‘గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. నిప్పులో మంచును మంచులో నిప్పును పుట్టించినవాడు’ ఆడవాళ్ళ చొల్లులో అబద్దాలతో సానివాడల్లో సారాయికంపులో నగ్నంగా చివికి పోయిన కవిత్వానికి అగ్ని భిక్ష పెట్టినవాడు” అని ఉద్వేగంగా ఆయన రాసిన స్మృతి గీతం మర్చిపోదగినది కాదు. అమెరికా అధ్యక్షుడు లింకన్ మరణ వార్త మీద  వాల్ట్ విట్మన్ రాసిన ‘వెన్ లైలాక్స్ లాస్ట్ ఇన్ ది డోర్ యార్డ్ బ్లూం’ కవితా  స్మృతి రూపంలో సారంలో అంతే శక్తివంతమైనది..   

తనకు పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం లోనే బెజవాడ కమ్యూనిస్ట్ పార్టీ సభలో లక్షలాది మంది సమక్షం లో పాట పాడిన కౌముది ఇంటి వైపూ తాను చేసుకున్న సహచరి ఇంటివైపూ కమ్యూనిస్టు రాజకీయాలు ప్రజానాట్య మండలి, కళాకారుల వారసత్వం ఉంది. ముఖ్యంగా తెలంగాణ సాయుధపోరాటం కాలంలో ఎంతోమంది అజ్ఞాత కార్యకర్తలను ఆశ్రయం ఇచ్చిన కుటుంబం అది . ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలు దొరలకు వ్యతిరేకంగా సాయుధ రాజకీయాల కొలిమిలో భగ భగ మండుతున్నాయి. ముఖ్యంగా మీనవోలు పోలీస్ యాక్షన్ కాలంలో  ఒక వైపు రజాకారుల దాడులు మరోవైపు సాయుధపోరాటం లో భాగం అయిన కార్యకర్తల మీద మిలటరీ దాడులు మధ్య నిప్పుల కొలిమిలా ఉండేది. నాడు పందొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పదమూడున రజాకారుల దాడుల్లో అమరులు అయిన తోట వెంకయ్య, తోటలాలయ్య, బండి వీరయ్య, మెట్ల శ్రీరాములు అమరత్వం, గ్రామస్తుల తిరుగుబాటు చేసి రాజాకార్ కమాండర్ ను చంపేసి   వాళ్ళనుండి    గుంజుకున్న ఆయుధాలు సాయుధ యోధులకు ఇచ్చి వీరోచితంగా పోరాడిన జ్ఞాపకాలు ఇంకా అక్కడ సజీవంగానే ఉన్నాయి. ఈ ఘటన జరిగాక మరుసటి రోజు  రెండువందల మంది మిలటరీ పదఘట్టనల మధ్య ఊరును చుట్టుముట్టి కాల్చేసిన గాయాలు రాంపల్లి రామయ్య, ముత్తయ్య,కోటయ్యల అమరత్వం చరిత్ర పేజీల్లో కొండ గుర్తులు. ఈ ఘటన జరిగే నాటికి కౌముది కి ఎనిమిదితొమ్మిదేళ్ళ ప్రాయం. మీనవోలు,అల్లీనగరం, ఎరుపాలెం వామపక్ష సాయుధ పోరాటం స్మారక స్తూపాలు సజీవంగా నే నిలబడి ఉన్నాయి కానీ వాటికి చేయూత నిచ్చిన కౌముది పూర్వీకుల ఆనవాళ్ళు మాత్రం చరిత్ర పేజీల లో లేవు.

అలహాబాద్, ఆగ్రా సాహిత్య మహోపాధ్యాయ చదివిన కౌముది మొదట విశాలాంధ్ర లో ప్రూఫ్ రీడర్ గా మొదలు పెట్టి తర్వాత ఖమ్మం జిల్లాలో పందిళ్ళపల్లి,చింతకాని,తల్లంపాడు లాంటి ప్రాంతాలలో హిందీ పండిట్ గా వేలాది  విద్యార్ధులకు అక్షర జ్ఞానం ఇచ్చారు.  ఆయన పనిచేసిన ప్రతిచోటా విద్యార్ధులలో కవిత్వ అంశను వెలికి తీయడానికి ‘మధురవాణి’ గోడపత్రిక లో అందమైన ఆయన చేతిరాత మాత్రం మరిచిపోలేనిది. బడిలో పసి ప్రాయం లోనే కా  అక్షరాలకు నీళ్ళు పోసిన సాహిత్య కాపరి . నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అయిన అక్షరదీపం సాక్షరతా మిషన్ లో ఖమ్మం జిల్లా లో బడి ముఖం చూడని చీకటి గూడేల లో అక్షర కాగడా ఎత్తిన శ్రమజీవి మా కౌముది టీచర్.

చింతకాని నుండి ఖమ్మం హీరాలాల్ మోరియా ఇంట్లోకి మారాక ఆ ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా సాహితీ  ఉద్దండ పండితులకు  జంగమ స్థావరం. ఆ క్రమంలోనే మిత్రుల తో కలిసి మాధురి ప్రెస్ ఏర్పాటు చేసి ఒక పత్రిక తేవాలనే ఆలోచన లో ఉన్న ఆయన  నిర్వహణ లోపమో ఆర్ధిక లేమినో తెలియదు కానీ అది మధ్యలోనే ఆగి పోయింది. పందొమ్మిది వందల అరవై అరవై నాలుగు మధ్య ‘మా భూమి’అనే పత్రిక, నడిపిన ఆయన   వామపక్ష రాజకీయాలు అందునా అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణాలు అంతకు ముందు ప్రజానాట్యమండలి తో మమేకం అయిన కౌముది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత కొంతకాలం ఖమ్మం జిల్లా అరసం బాధ్యుడిగా పనిచేసి ఆ తర్వాత ఎటువంటి నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. ఆయన మీద పార్టీ చీలిక ప్రభావం పడ్డది అని ఆయన మిత్రులు అనుకుంటే వినడం . 

విశాలాంధ్ర తో బాటు అభ్యుదయ,ప్రగతి,యువజన సాహిత్య పేజీలలో అసంఖ్యాకంగా కవిత్వం సమీక్షల తోబాటు , రాహుల్ సాంకృత్యాయన్, కిషన్ చందర్ రచనలు అనేకం అనువాద రూపంలో వారం వారం సాహిత్య పేజీలలో గుబాలించాయి. ఆయనకు మక్తూం మొహిద్దీన్ అత్యంత సన్నిహిత మిత్రుడు, ఆయన ఉర్దూ కవిత “సన్నాటా”ని నీరవం పేరుతో, ఇంకా హీరాలాల్ మోరియా రచనలను  కూడా అనువాదం చేసిన ఆయన నాటి అగ్ర శ్రేణి కవులకు ఏమాత్రం తీసిపోకుండా సాహిత్య ప్రపంచం తో కలగలసి నడిచిన ఆయన ఈ తరానికి తెలియక పోవచ్చు కానీ ఆయన వైభవోపేత సాహిత్య గతాన్ని, మేధోసంపత్తినీ, తాత్వికలోతునూ దగ్గరగా చూసిన వాళ్ళు కూడా కౌముది ప్రస్తావన విస్మరించడం బాధగా ఉంది.

బ్రతుకంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదనీ,నిజాన్ని నిష్కర్షగా చెప్పడం అనీ,ఆ క్రమం లో నాలుగు రాళ్ళు పడ్డా అవి విజయానికి మెట్లుగా వేసుకొని సాగడం అనీ, మెతుకు మెతుకునూ జ్ఞానపు గింజ గా మార్చుకుంటూ సాగిన సాహిత్య జీవితం మా సార్ ది. చింతకాని ఊరుబడి నుండి మా తల్లంపాడు దాకా ఆయన పనిచేసిన ప్రతిచోటా నిలువెత్తు అక్షరమై నిలబడ్డాడు ఆయన. “సిద్దాంత బలం కన్నా సాహిత్యం లో జీవన బలం ప్రధానంగా ఉండాలి అని బలంగా విస్వశించే కౌముది హింది సాహిత్యం లో నిరాలా, సుమిత్రానందన్ పంత్.అజ్ఞేయ్, ముక్తిబోద్ తెలుగులో శ్రీనాదున్నీ,కృష్ణశాస్త్రిని ఇష్టపడే కౌముది వాస్తవానికి చానా తక్కువగా మాట్లాడతారు.

ఆ కుటుంబం లో కవి అఫ్సర్ మూడో తరం మేధో కొనసాగింపు. అఫ్సర్ తండ్రి కౌముదికీ  ఆయనను పెంచుకున్న  తండ్రి మహబూబ్ అలీ,  తెలుగు, సంస్కృత, ఆంగ్ల, అరబిక్, పార్సీ, హిందీ లో అపారమైన విద్వత్ వారసత్వం ఉంది.   పందొమ్మిది వందల యాభై మొదలు మూడు నాలుగు  దశాబ్దాలుగా నాటి సాహిత్య పేజీలలో అనువాదాలు, విమర్శనా వ్యాసాలూ కవిత్వం రాయడం తోబాటు  ‘అల్విదా’ పేరుతో వచ్చిన కవితా సంకలనం వాస్తవానికి అసమగ్రం. అరవై లనుండి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అనేక కవితలు  ప్రాచీన సంగం సాహిత్యం లో పంచ కావ్యాల లో ఒకటిగా పరిగణించబడ్డ శిలప్పాధికారం కావ్యాన్ని హిందీలో అమృత్ లాల్ నాగర్ ‘సుహాగ్ కే నూపుర్’ అనుసరణగా  మొదట ‘కళంకిని’  పేరుతో ఆ తర్వాత కళ్యాణ మంజీరాలుగా ప్రచురించిన బడిన నవల కౌముది అనువాద ప్రతిభకు నిదర్శనం. అది కాకుండా విజయ అనే ఒక అసంపూర్ణ నవల డెబ్భై ఎనిమిది లో మైత్రేయ న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ వాళ్ళు ప్రచురించారు అది కాకుండా రాహుల్ సాంకృత్యాన్, కిషన్ చందర్  నాటి హిందీ, ఉర్దూ రచనలను కు ఆయన చేసిన అనువాదాలు మౌలిక రచనల ఔన్నత్యాన్ని పెంచినవి అంటే అతిశయోక్తి కాదు.

నిజాం ఇలాకాలో పెద్ద కస్టమ్స్ అధికారిగా పనిచేసిన తన తాత ద్వారా సంక్రమించిన మధిర,ఎరుపాలెం గ్రామాలలో విస్తరించిన  వందలాది ఎకరాల భూములు ఖమ్మం బెజవాడ రైలు కట్టల కింద, దాయాదుల పంపకాల కింద అన్యాక్రాంతం అయ్యాయి. ఆస్తులు పోతే సరే అపురూపమైన ఆయన సాహిత్య సంపదా ఇంకా వెలికి తెయాల్సే ఉంది. ఖమ్మం అంటే అంటే దాశరధి,మోరియా,కవిరాజ మూర్తి మాత్రమే కాదు విద్వత్ దృష్ట్యా రాశిలో వాసిలో వాళ్ళ అందరికన్నా ఎక్కువ సాహిత్య సృష్టి చేసిన కౌముది సాహిత్య చారిత్ర లో విస్మ్రుతునిగా మిగలడమే వర్తమాన విషాదం. కౌముది బహుభాషా వేత్త, ఆంధ్ర,ఆంగ్ల ఉర్ధూ,పారసీ అరబిక్ భాషలను చదివిన ఆయన ఆముక్తమాల్యద మొదలు ఎన్నో ప్రాచీన ప్రబంధగ్రంధాలను పారాయణంలా ఆవాహనం చేసుకున్న ఆయన గురజాడ కావ్య కన్యక మధురవాణిని కవితా సందేశం గా తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో గోడల మీద కవితా జెండా ఎగరేసి సాహిత్య కార్యశాలలు నడిపినప్పటికీ ఆధునిక సాహిత్య గిరీషాలు మాత్రం పట్టించుకోలేదు.

ఆయనను ఎవరన్నా మైనారిటీ కవి అని అంటే “నేను ముస్లింననే స్పృహ నాకు చిన్నప్పటి నుంచీ లేదు,కాబట్టి నన్ను నేను అలా దూరంగా విభజించుకుని మాట్లాడ లేను.నాకు ఊహ,వివేకం తెలిసినప్పటి నుండీ ఈ సమాజం లో దోపిడీకి గురి అవుతున్న వారూ దోపిడీ చేస్తున్న వారూ. ఇవి రెండే కులాలు ఆ క్రమం లో బాధితుడే ఈ సమాజానికి నాయకత్వం వహించాలి ఇదొక్కటే నాకు తెలిసిన నిజం” అని తన లో విశ్వ నరుని విరాట్ రూపాన్ని చూపించిన కౌముది పట్ల తన తోటి వారూ సమకాలీన సాహితీ ఉద్దండులూ ఎందుకో ఆయన సాహిత్య ప్రతిభను మాత్రం గతితార్కిక కుల తూకంలోనే తూచారు. ఆయన వివిధ సాహిత్య పేజీలకి చేసిన అనువాదాలు ఇంకా సమగ్రంగా బయటకు రావాల్సి ఉంది. అది వస్తే తప్ప ఆయన సాహిత్య ప్రభను అంచనా వేయలేము. కౌముది  పోయిన దశాబ్ద కాలం తర్వాత ఆలశ్యంగా అయినా మొదలవుతున్న కౌముది ఫౌండేషన్ ఆయన సమగ్ర సాహిత్యాన్ని ముందు తరాలకు అందించడమే ఆయనకు మనం ఇచ్చేనివాళి

*

   

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

7 comments

Leave a Reply to Giriprasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎన్ని పేజీల్లో నింపగలం మండే అగ్నిగోళం లా వెలిగిన ఎర్రటి వెన్నల విరాట్ రూపాన్ని !!?
    కౌముది ““నేను ముస్లింననే స్పృహ నాకు చిన్నప్పటి నుంచీ లేదు,కాబట్టి నన్ను నేను అలా దూరంగా విభజించుకుని మాట్లాడ లేను” కానీ నాగరిక సమాజం ఆయన ప్రభ ను ఖమ్మం ఖిల్లా కే పరిమితం చేసారు…
    థాంక్స్ సారంగ..

  • కౌముది గారి గురించి రేఖామాత్రంగానే ఐనా చాలా తెలియని విషయాలు రాసారు.ముఖ్యంగా మా ప్రాతం వారని ( మీనవోలు దగ్గర రేమిడిచర్ల మాది) చదివాక నాకు మరింత సంతోషంగా ఉంది.నిజమే, మీరన్నట్టు కౌముది సర్ గురించి,ఆయన సాహిత్య సేవగురించి మరింత సమాచారం తెలుసుకోవాలి వర్తమానతరం.సీతారాం గారూ.మీరు మిరియాల నారాయణ గుప్తా జీవిత చరిత్ర చదివారా…! లేకపోతే ఆ పుస్తకం సంపాదించి చదవండి.తెలంగాణలో ఆంధ్రమహా సభ,గ్రంధాలయాల స్థాపనలో మె!! విషయాల గురించి మరింత సమాచారం దొరకవచ్చును.మంచి వ్యాసం అందించినందు ధన్యవాదాలు.

  • Very sad to know that I did not heard about this great learned man who represented the Marxist tradition. It is too hasty and vague conclusion that he was neglected due to his caste/religious background. There might be many great people in other places as well? We may some contemporary examples? Need to revist the Left movements from the inception not to blame or praise but to build social history.

  • బ్రతుకంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కాదనీ,నిజాన్ని నిష్కర్షగా చెప్పడం అనీ,అక్రమం లో నాలుగు రాళ్ళు పడ్డా అవి విజయానికి మెట్లుగా వేసుకొని సాగడం అనీ,మెతుకు మెతుకునూ జ్ఞానపు గింజ గా మార్చుకుంటూ సాగిన సాహిత్య జీవితం మా సార్ ది. ..అద్భుతమైన సందేశం . కౌముది సాహితీ వెన్నెలగా అందరినీ చేరి మండే గుండెలకు స్వాంతన కలిగించేది కావాలని కోరుకుందాం.

  • Afsar గారు పూనుకుంటే అవుతుంది. మంచి article 🙏🏻

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు