జీవితం లెక్కలతో ముడిపడుందని
ఎప్పటినుండో తెలుసు
రోజుకొకసారి
ముక్కలు ముక్కలవుతున్న మనిషినడిగితే
ఇంకా బాగా చెపుతాడు
గాజుటద్దం పగలడం అందరం
చూసే ఉంటాము
వగరెక్కిన కాయలను తిన్న వాళ్ళూ ఉన్నారు
కళ్ళముందే మనిషిని మాయ చేస్తున్న
ఈ లెక్కలదెంత చిత్రమో కదా
కుట్రలు అవసరం లేదు
కుతంత్రాలు అవసరం లేదు
మనిషిని ఓ సాధారణ,వ్యదార్థ జీవితంలోకి
నెట్టెస్తే చాలు
యంత్రాలు మనిషిని
అంటిపెట్టుకొని తిరుగుతున్న ఈ కాలాన
ఏ చెట్టు కిందా జ్ఞానోదయం కాదు
మానవత్వమంటే
మా ఇంటావంటా లేదన్నట్టుగా
ముఖాన్ని చూపించేవాళ్ళు చాలామంది
కంటిని పొడుచుకోకుండానే
కళ్ళనే లేపేసే సాధనం
ఏ లెక్కయితే ఏముంది
ఇంటిని కాపుకాయని కుక్క
ఎంతలావాటిదయితే ఏముంది!
2
తిరోగమనం..
మళ్ళీ బాల్యం నన్ను
తన ఒడిలోకి రమ్మంటే
ఇక చచ్చినా తిరిగి ఇక్కడికయితే
రాను,రాదలుచుకోను
నలుగురి చేత చెంపలు గిల్లించుకోవడానికో
నలుగురి చెంపల్లో నవ్వుపూల నురుగునవ్వడానికో
ఇంకా పసికందునవ్వాలనుకుంటానేమో గాని
నేటి రోజులను చూస్తూ చూస్తూ
వృద్ధున్ని మాత్రం కాదలుచుకోలేదు
ఒక్కసారి ఆ రాతరాసినవాడు
గడిచిన కాలపుచిక్కుముడులను
సరిగ్గా విప్పుకొని రమ్మంటే
నేను నిన్నలోకి,మొన్నలోకి
అక్కడినుంచి నేరుగా
బాల్యంలోకే వెళ్ళిపోయేవాన్ని
విడిచొచ్చిన పాదముద్రల వంకరలను సరిగ్గాకూడుకొని రమ్మంటే
నేను వేసుకుంటూ వచ్చిన అడుగుల్ని
వెనక్కి తోసుకుంటూ మరీ వెళ్ళిపోయేవాన్ని
వాడిపోతున్న పూలను చూస్తే
నామీద నాకే జాలేస్తుంది
కాలిపోతున్న మనుషుల మానవతను చూస్తే
నామీద నాకే అసహ్యమేస్తుంది
అందుకే
నే వెనక్కివెళ్ళిపోతున్నా
నా మీదుగా కురిసిన చినుకుల్లోంచి
ఋతువుల్లోంచి,దిక్కుల్లోంచి
నిష్కల్మషమైన
ఏమి తెలియని పాలబుగ్గల్లోకి
నిర్ధాక్షిణ్యంగా
కుళ్ళిపోని ప్రేమల్లోకి
ఆరుబయట మంచమేసుకోని
చుక్కలను లెక్కించిన చందమామల్లోకి
చిన్నప్పుడు ప్రేమగా పాకిన పాటల్లోకి
ముక్కుగిచ్చుడు ఆటల్లోకి
దాగుడుమూతల దండాకోరంటూ
మళ్ళీ పూత పూయడానికి,కాత కాయడానికి
మొక్కనుండి విత్తుగా
కాస్త వెనక్కి జరుగుతున్నా.
These two poems are excellent. Congrats Harish Gaud garu.
Thank u sir
Superb sir
Thank u
Congratulations sir poems bavunnayi 💐
Thank u ramu
Thank u sir
INSPIRING WORDS, THANK YOU SIR