“హమ్ తుమ్ ఎక్ కమ్రే మే బంద్ హో…” 70ల్లో ఈ పాటని హమ్ చేయని పెదవులు బహుశా చాలా తక్కువేమో! ఆ చిత్రంలో అది, హీరో హీరోయిన్ల మధ్య ఆకర్షణ కొంత దూరం సాగిన తర్వాత వచ్చే సందర్భోచితమైన పాట. అదే సినిమాలో ఇంకో ఆణిముత్యంలాంటి గీతం – “మై షాయర్ తో నహీ…” ఆ పాటతో, నూనూగు మీసాల యవ్వనపు అమాయకత్వాన్ని, చందమామలాంటి ముఖంలో వెన్నెల లాంటి ప్రేమనీ, కరకురాయిలాంటి పట్టుదలనీ ఒలికించిన రిషీ కపూర్, ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయాడు. ఆ తర్వాత ఎన్నో రకరకాల పాత్రలని పోషించిన రిషీ కపూర్ నటించిన చివరి చిత్రం – “శర్మాజీ నమ్కీన్”.
బహుశా చలనచిత్ర చరిత్రలోనే అరుదైన విషయం – ఒకే పాత్రని తెర మీద ఇద్దరు నటులు పోషించి మెప్పించడం! ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగిన తర్వాత రిషీ కపూర్ ఆరోగ్యం క్షీణించి, మరణించాడు. ఆ సినిమా ఆగిపోయిందనే అనుకుంటున్న తరుణంలో, రిషీ కపూర్ కి ఏమాత్రం తీసిపోని మరో నటదిగ్గజం – పరేష్ రావల్ ఆ పాత్రని పోషించడానికి ఆహ్వానాన్ని అందుకున్నాడు. అలా, చిత్రంలో ముఖ్యపాత్రని ఈ ఇద్దరూ నటించారు. విశేషం అది కాదు. ఇద్దరిలోనూ తెరమీద ‘GB శర్మ’ తప్ప, రిషీ కపూర్ కానీ, పరేష్ రావల్ గానీ కనిపించకపోవడం!
కథ – దాదాపు ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక దశలో ఎదురయ్యేదే. అతి సింపుల్ గా, రెండు మూడు వాక్యాల్లో చెప్తే ముగిసిపోయే ఈ కథని, నాలుగయిదు పొరల్లో కట్టబెట్టి పూతరేకులా అందించిన దర్శకుడు హితేష్ భాటియాకీ, ఎక్కడా ఫ్లో చెడకుండా కథని నడిపించి చూపిన ఎడిటర్ బోధాదిత్య బెనర్జీకీ, నటుల హావభావాలని సరైన యాంగిల్స్ లోంచి పట్టుకున్న సినిమటోగ్రాఫర్లు – పీయూష్ పుటీ, హరేంద్ర సింగ్ లకీ అభినందనలు చెప్పకతప్పదు. శర్మాజీకి పెద్దకొడుకుగా సుహాలీ నయ్యర్ చక్కటి ఇంటొనేషన్లతో అగ్రనటులకి దీటుగా రాణించాడు. ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కి సంగీతాన్ని అందించిన స్నేహ ఖన్విల్కర్ ఈ సినిమాలోనూ తన ప్రతిభ చూపెట్టింది. అవసరమైన చోట్ల మాత్రమే, అవసరమైనంత శబ్దాన్ని మాత్రమే అల్లింది ఆమె. హాట్సాఫ్!
ఇంతకీ కథేమిటి?
గజానికొక ఫైటు, గంటకి రెండు పాటలు, అర్థంపర్ధంలేని ఆహార్యాలతో, లాజిక్కుకి చిక్కని ట్విస్ట్ లవంటివేవీ లేవీ కథలో. అరవైకి రెండేళ్ళ ముందే రిటైర్ గావించబడ్డ, తండ్రి. కొడుకులిద్దరికీ తన తన చేత్తో వండి ఆప్యాయంగా వడ్డించడం అతని హాబీ. చేతుల నిండుగా పొంగి పొర్లుతున్న సమయాన్ని ఏం చేసుకోవాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో, ఒక అవకాశం వస్తుంది – తన హాబీనే సంపాదనకి పనికొచ్చే వ్యాపకంగా మార్చుకోవడానికి. చేస్తున్న పనిని బయటికి చెప్పుకుంటే కొడుకుల ముందు చిన్నతనంగా ఉంటుందనుకుంటాడా పెద్దమనిషి. కానీ ఏ పనీ చిన్నదీ పెద్దదీ కాదని ఆయనకీ తెలుసు. అందుకని చేస్తుంటాడు – తగిన జాగ్రత్తలతో. దానివల్ల, అయన చేతి వంటని రుచి చూసిన – సంఘంలో హెచ్చు స్థాయికి చెందిన కొందరితో చక్కటి పరిచయం ఏర్పడుతుంది ఆయనకి.
సమాంతరంగా సాగుతుంటుంది పెద్ద కొడుకు కథ. ఒక సమస్యలో ఇరుక్కున్న ఆ కొడుకు, దాదాపు చేతులు కాల్చుకుని కటకటాల్లో ఇరుక్కుంటాడు. చిన్న చిన్న మలుపులు తిరిగి, కథ ఏమవుతుందో మీరు చూసి తెలుసుకోవడమే సమంజసం.
చిన్న చిన్న లూజ్ ఎండ్స్ కొన్ని ఇందులో కూడా ఉన్నప్పటికీ, వాటిని తేలికగా ఇగ్నోర్ చేసేయవచ్చు.
ఈ సినిమాలో చెప్పకుండా చెప్పిన మంచిమాటలు నాలుగు:
– రిటైర్మెంట్ అనేది జీవితానికి ఫుల్ స్టాప్ కాదు.
– చేసే పనిలో చిన్నా పెద్దా అనేదేదీ లేదు.
– మాట తేడాలొచ్చినా, కుటుంబం అనేదొకటి ఉండడమే ఒక ప్రివిలేజ్.
– సాయం చేసే గుణానికి సాంఘిక స్థాయితో పనిలేదు.
ఇవేవీ కొత్త విషయాలు కావు. వాటిని ఈ కథలో చూపించిన తీరు కొత్తది.
కనీసం ఒకసారైనా చూడదగిన ‘నీట్ అండ్ క్లీన్’ సినిమా ఇది.
చిత్రం – “శర్మాజీ నమ్కీన్”
నిర్మాతలు – ఫర్హాన్ అఖ్తర్, అభిషేక్ చౌబే
నటులు – రిషీ కపూర్, పరేష్ రావల్, జూహీ చావ్లా, శీబా చడ్డా, గుఫీ పైంటాల్, పర్మీత్ సేథీ, సతీష్ కౌశిక్ తదితరులు…
అందుబాటు – అమెజాన్ ప్రైమ్
*
Add comment