ఈ కథ అనువాదం నాకు చాలా పెద్దపాఠమే!

కాళీపట్నం రామారావుగారి ఆర్తి కథ గురించి, కథలో ఈనాటి వ్యవస్థగురించి రచయిత అవగాహన, భావజాలం – వీటిమీద చాలా చర్చలు జరిగేయి,  జరుగుతున్నాయి. కానీ శిల్పం, శైలిగురించిన ప్రస్తావన నేను చూడలేదు. బహుశా సిద్ధాంతవ్యాసాల్లోనో ఉపన్యాసాల్లోనో ఎవరైనా ప్రస్తావించేరేమో నాకు తెలీదు.

ఈ అనువాదం మొదలు పెట్టేక నాకు కొన్ని విషయాలు తోచేయి. ముఖ్యంగా నేను అనువాదాలు చేసి చాలాకాలం అయినందున కూడా మళ్లీ హరిః ఓం అని మొదటికొచ్చినట్టు అనిపించింది.

హెచ్చరిక. నేను కాళీపట్నం రామారావుగారి కథలో లోపాలుగా వీటినిగురించి చర్చించడం లేదు. ప్రస్తుతానికి అనువాదాంకోసం ఈకథ సూక్ష్మంగా పరిశీలించడం జరిగింది కనక ఈకథని ఉదాహరణగా తీసుకున్నాను కానీ అనేక తెలుగుకథలలో ఈ అంశాలు కనిపిస్తాయి.

ఆర్తికథ చదువుతుంటేనూ, అనువాదం చేస్తుంటేనూ ఇందులో కథనం మౌఖికసాహిత్యంలో కథనంలా తోచింది నాకు. మౌఖికసాహిత్యంలో కథనం మనలో మనం మాటాడుకుంటున్నట్టు సాగుతుంది. అచ్చంగా అలాగే కాదు కానీ కొంతవరకూ stream of consciousness శైలి అని కూడా అనొచ్చు. అంటే నాఅభిప్రాయం, కథ నడక (flow) విషయంలో రాతకీ మాటకీ తేడా. రాస్తున్నప్పుడు కట్టుదిట్టంగా పదం తరవాత పదం, వాక్యంతరవాత వాక్యం గోడ కట్టడానికి ఇటుకలు పేర్చినట్టు సాగాలి. ఆ నడకలో తర్కం కనిపిస్తుంది. ముఖాముఖీ మాటాడుతున్నప్పుడు అలా కాదు. నెమ్మదిగా ఆలోచిస్తూ మనసులోకి వచ్చినమాటలు ఒకదానితరవాత ఒకటి చెప్తాం. ఆవరసలో విషయానికి సంబంధించని మాటలు రావచ్చు. ముందు ఆడిన నాలుగు మాటలూ ఆ తరవాత ఆడిన నాలుగుమాటలు తూచి వేసినట్టు పడవు. అదే రాసినప్పుడు అయితే అనవసర పదాలో విషయాలో అయినట్టు కనిపిస్తాయి.

ఈకథ అనువదిస్తున్నపుడు నాకు కలిగిన సందేహాలు చెప్తాను. కొన్నిచోట్ల, ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవలసిన అవస్థ అనుకోవచ్చు.

అసలు అనువాదం అంటేనే మరొకరికథ చెప్పడం. నాకథ అయితే నేనేం అనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. మరొకరికథ చెప్తున్నప్పుడు నాకు ఎలా అర్థం అయిందో అలా మాత్రమే చెప్పడం జరుగుతుంది. అనేక సందేహాలకి ఆస్కారం ఉంది. అనువాదకులు నిర్ణయించుకోవలసిన సందర్భాలు ఉంటాయి. రచయితని అడగొచ్చు కానీ మనరచయితలు మీకు అవుసరమైనట్టు మార్చుకోండి అని ఒక blanket అనుమతి ఇచ్చేసందర్భాలే ఎక్కువ. నాకు అలా చాలాసార్లు జరిగింది.

మొదటిది భాష. అందులో మాండలీకం మరొకస్థాయి. మామూలుగా ఏ మాండలీకం గానీ, ఆ మాండలీకంలోని సొగసులు అనువాదంలో రావనే నేను అనుకుంటున్నాను. అమెరికాలో పల్లెల్లో రైతులు వాడే మాండలీకం ఉంది కానీ అది నాకు పరిచయం లేదు. అలా పరిచయం ఉండి ఆ ప్రత్యేక వ్యావహారికంలో అనువాదాలు ఎవరైనా చేసేరేమో కూడా నాకు తెలీదు. నాకు మాత్రం తెలీదు కనక నాకు తెలిసిన శిష్టజనవ్యావహారికాన్నే నేను ఆశ్రియించేను.

అనువాదం మూలం చదవలేనివారికోసం మాత్రమే. అందునా నాలాటి కొందరు మనసంస్కృతిని విదేశీయులకి పరిచయం చేయడంకోసం చేస్తారు. (ఈ తెలీనివారిలో ఇంగ్లీషు చదువులు చదివిన తెలుగువారు ఉండడం విశేషం.). అంటే కథలో వస్తువుకీ, భావాలకే పెద్దపీట. శైలి నామమాత్రమే. భాషాశాస్త్రవేత్తలు కవిత్వస్థాయిలో శైలి పట్టుకోగలరేమో నాకు తెలీదు.

ఆర్తి కళింగాంధ్రలో ఒక వర్గం -రైతులు, మాలవారు, నాయుళ్లు – మాటాడుకునేభాషలో రాయడం జరిగింది. ఈభాష ఇప్పుడు ఎంతమంది ఇంకా వాడుతున్నారో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ప్రతిపదం కుస్తీపట్లే అయింది. దీంతో నేను తెలుగూ, ఇంగ్లీషూ కూడా ఎంత మర్చిపోయేనో అర్థం అయింది. ఇది వైయక్తం అనుకోండి. అది వేరే కథ. కళింగాంధ్ర నిఘంటువులు మూడు చూసేను కానీ దాదాపు అన్ని సందర్భాలలోనూ నేను వెతికినపదం కనిపించలేదు! అంచేత ఏ ఒక్క పదానికైనా అనువాదం సరి కాదనుకుంటే తెలియజేయగలరు. దిద్దుకుంటాను. కానీ కథానువాదం పదానువాదం కాదు అని గమనించాలి. కొన్నిపదాలు తప్పనిసరిగా వదిలేయవలసివచ్చింది నాకు.

మొదట్లో చెప్పినట్టు ఆర్తికథలో శైలిగురించి చర్చలు జరిగేయో లేదో నాకు తెలీదు. కానీ కొన్ని సందర్భాలు అనువాదపరంగా నన్ను ఆలోచించుకునేలా చేసేయి.

ఆర్తి కథలో కోటయ్య “సన్నిని రెక్కపట్టుకు చూరుకిందనించి లాక్కొచ్చి ఒక్కతోపు తోసేడు.” అని ఒకచోట ఉంది. ఆ తరవాత, “సన్నిని ముట్టుకోవలసిన పనిలేకుండా తుండుగుడ్డ ఆమె నడుంకి చుట్టి గొరగొర ఈడ్చుకుపోతున్నాడు.” అని ఉంది. Edgar Ellen Poe, వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారివంటి సాహితీవేత్తల సూత్రాలు పాటించేవారు ఇది శిల్పంలో ఒక లోపమనే అంటారు. కానీ తెలుగుపాఠకులకి ఇదేమంత పట్టించుకోవలసినవిషయంగా తోచదు.

ఇక్కడ నాసందేహం విదేశీపాఠకులు ఎలా స్పందిస్తారనే. రెక్క పుచ్చుకు లాగినప్పుడు ముట్టుకోడం జరిగింది కదా అని అడుగుతారు. కోటయ్య పట్టలేని ఆవేశంలో మొదట రెక్క పుచ్చుకు లాగేడు కానీ తరవాత నిగ్రహించుకున్నాడు అని సమర్థించుకోవచ్చు. సమర్థించుకుంటాం మనం. సాధారణంగా ఇది విదేశీపాఠకులకి గందరగోళంగానే ఉంటుంది. నేను అనువాదాలు మొదలుపెట్టిన రోజులలో నా అమెరికన్ స్నేహితులని సంప్రదించేను కనక గట్టిగా చెప్పగలుగుతున్నాను.

సందేహాలూ సందిగ్ధాలూ. కొన్నిచోట్ల రచయిత చెప్పింది నాకు సరిగా అర్థం అయిందా అన్న సందేహం. కొన్నిచోట్ల రచయిత చెప్పింది అర్థం అయింది కానీ ఉద్దిష్ట పాఠకులకోణంలోనుంచి చూస్తే ఇది కథకి ఏమాత్రం అవుసరం, నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్న సందిగ్ధం.

”గొప్పవాళ్లలో గొప్పవాళ్లూ, చాలాగొప్పవాళ్లూ, అతిగొప్పవాళ్లూ ఉన్నట్టే పేదవాళ్లలో కడుపేదలు, నిరుపేదలు ఉంటారు” అని వాక్యం. ఇది చదవగానే నాకు తోచిన మొదటి ఆలోచన పేదవాళ్లలో రెండే వర్గాలని. కానీ ఆ తరవాత కథకుడు ఎర్రెమ్మ ఆస్తి లెక్కగట్టి “ఆమె నిరుపేద, … కడుపేదల కోవలోకి చేర్చరాదు” అంటారు. “ఆమెతో తైపారువేస్తే, బంగారి వొత్తి పేదరాలు మాత్రమే అవుతుంది”.  ఇక్కడికొచ్చేక కానీ నాకు అర్థం కాలేదు పేదరాలు వర్గం, నిరుపేద, కడుపేద కాక మరొక వర్గం అని. తదనుగుణంగా అనువాదంలో చిన్నమార్పు చేయవలసివచ్చింది. ఇది సందిగ్ధం అన్నమాట, నేను నిర్ణయించుకోవలసిన సందర్భం.

బారికి రామయ్య పైడయ్యని పట్నంలో కలుసుకున్నప్పుడు పైడయ్య తనకి ఇల్లు లేదనీ, పెద్ద బజారులోనే ఓ మూల పడుకుంటానని చెప్తాడు. ఆ తరవాత మురికివాడకి తీసుకువెళ్తాడు. మరి పైడయ్యకి గది ఉన్నట్టా లేనట్టా? ఈ సందేహం అలాగే వదిలేసి, ఉన్నదున్నట్టు అనువాదం చేసేను పాఠకులే నిర్ణయించుకుంటారని.

అలాగే, రామయ్య వచ్చి వెళ్లిపోయేక, పైడయ్య తనగది గురించి ఆలోచనలో పడతాడు. “పది రాళ్ళు జేబులో ఉన్నప్పుడల్లా ఫరవాలేదనిపించినా డబ్బులు తక్కువైనప్పుడల్లా ఆమాటలు గుర్తుకొచ్చేవి” అంటాడు కథకుడు. ఇక్కడ రామయ్యమాటలు గుర్తు తెచ్చుకోవాలి. అలాటిగదిలో ఉండడంకన్నా “తిండి నేక ఏ గడ్డో కరిసి సావడం మేలు” అంటాడు రామయ్య. అతను తిండిమాట అన్నా, పైడయ్య దాన్ని తను ఉంటున్న గదికే అన్వయించుకున్నట్టు కనిపిస్తోంది. నాసందేహం – ఆ గది అంత అధ్వాన్నంగా ఉంటే, డబ్బులు ఉన్నప్పుడు అది ఫరవాలేదని ఎలా అనిపిస్తుంది అని. వాక్యం అర్థమవుతూనే ఉన్న అన్వయించుకునేతీరులో సందిగ్ధత ఉంది. ఈవాక్యం నేను మార్చలేదు. ఉన్నదున్నట్టు అనువదించేను, అన్వయం పాఠకులకి వదిలేసి.

కథలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. మనం మామూలుగా కథలో క్రియాపదం ఏకాలంలో ఉన్నా అంతగా పట్టించుకోం. కథలన్నీ చాలామటుకు భూతకాలంలో చెప్పడంతోనే మొదలవుతుంది కానీ వర్తమాన, భవిష్యత్ ప్రత్యయాలు కూడా వాడేస్తాం. అలాగే కథలో అంతకుముందు జరిగిన మరో సంఘటన చెప్తున్నప్పుడు కూడా అదే ప్రత్యయం వాడుతాం. ఏ ఒక్కకాలం తీసుకున్నా, ఆకాలంలో కాలక్రమ నిర్ణయం చేయగల తేడా తెలుగుకథలో లేదు.

ఇంగ్లీషులో అలా కాదు. కథ భూతకాలంలో చెప్తే, అంతకుముందు జరిగిన సంఘటన తప్పనిసరిగా past perfectలో ఉండాలి. ఒక వాక్యం అయితే ఫరవాలేదు కానీ పది వాక్యాలలో ఒక సంఘటన వివరించవలసివస్తే, అన్ని వాక్యాలు past perfect లో రాస్తే చదవడానికి ఇంపుగా ఉండదు. మరోలా స్పష్టం చేయాలి. అందుకు చిన్నమార్పులు చేయవలసిరావచ్చు.

ఆర్తి కథలో పైడయ్య సాయంకాలంపూట ఏటిఒడ్డున సన్నికోసం ఎదురు చూస్తూ ఆలోచనల్లో పడతాడు. ఆ సమయంలో తాను వెనక ఎప్పుడో మాదిగప్పయ్యకూతురుమీద జరిపిన అత్యాచారం, ఆ మధ్యాహ్నం కోటప్పతో మాటాడినమాటలు ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనల్లోనే కోటయ్య చెప్పిన ఇంకా వెనకటి ఉదంతం- రామయ్యకోడలికీ తనకీ మధ్య జరిగిన ఉదంతం తలుచుకుంటాడు. ఇవన్నీ కథలో కథ, ఆ కథలో అంతకుముందు జరిగిన కథ, ఇంకా వెనకటికథగా మూడు స్థాయిలలో ఉంది. ఇంగ్లీషులో past, past perfect రెండే ఉన్నాయి. నిజానికి తెలుగులో వెనక, ఆవెనక, అంతకంటె వెనక అంటూ కాలనిర్ణయం క్రియాపద ప్రత్యయాలలో లేదు. అయినా మనకి ఏది ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది. నాకు కొంత సమయం పట్టిందనుకోండి ఇది తెలుసుకోడానికి. అది వేరేసంగతి. నేను అంటున్నది ఇది మౌఖికసాహిత్య లక్షణం అని. మనసంస్కృతి తెలీనివారికోసం అనువాదం చేస్తున్నప్పుడు ఇది మాటలలో స్పష్టం చేయాలి. దీనికి కొన్ని కిటుకులు ఏదో సైటులో చూసేను కానీ ఇక్కడ నేను పాఠాలు పెట్టబోవడంలేదు. మీదృష్టికి తీసుకువచ్చేవరకే నాపని.

క్లుప్తతవిషయంలో చెహోవ్ సూత్రం – గదిలో తుపాకీ ఉందని రాస్తే కథ ముగిసేలోపున అది పేలాలి అన్న సిద్ధాంతం ఆశ్రయించే విమర్శకులు ఎంచడానికి వీలయిన వాక్యాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి పెద్దమ్మ ఊరు వర్ణిస్తూ ఊరుమధ్య “చిక్కని కొబ్బరిచెట్లనీడ మధ్యని ఎత్తుగా దేవాలయం” ఉందంటాడు కథకుడు. ఆతరవాత ఆ దేవాలయం ప్రసక్తి లేదు. అది ఉందని తెలిసినా తెలియకపోయినా పాఠకుడికి ఒకటే. కథ నడకకి ఆవాక్యం దోహదం చేయదు. అనువాదంలో తొలగించేసేను నేను. అంటే చెహోవ్ సూత్రం పాటిస్తున్నానని కాదు. కథ అయోమయానికి తావీయకుండా ఉండాలి, కథ పటిష్టంగా చిక్కగా ఉండాలనుకునే పాఠకుల సౌకర్యార్థం అనే ఉద్దేశ్యంతో.

ఏమైనా ఈ కథ అనువాదం నాకు చాలా పెద్దపాఠమేనని చెప్పుకోవాలి. రచయిత కాళీపట్నం రామారావుగారికి కృతజ్ఞతలు.

నా అనువాదానికి లింకు https://thulika.net/?p=1691

*

 

 

నిడదవోలు మాలతి

7 comments

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు