ఉన్నట్టుండి
అయిష్టమైనవన్నీ బారులు తీరి నిలబడతాయి
మనుషులంతా ఇసుకరేణువులవుతారు
ప్రపంచమంతా ఒక తెంపు లేని ఎడారి అవుతుంది
వెదుకుతావు వెదుకుతావు వెదుకుతావు
నువ్వెక్కి తిరిగే ఒంటె ఇక నడవలేనని కూచుంటుంది
దాని పొట్ట కోసి, లోపల మిగిలిన నీళ్లు నువ్వే తాగేసి
పరిగెడతావు పరిగెడతావు పరిగెడతావు
నీ పొట్టలోని నీటిని సైతం గడ్డ కట్టించే శైతల్యం లోనికి
ఇక పాదాలే కాదు పదాలూ మొరాయిస్తాయి
ఎండలో మంచులో బలవంతపు ధ్యానంలో
ఇక మిగిలిన నీ లోనికి నువ్వు మునిగిపోతావు
లోపల కొన్ని నవ్వు మొహాల చెట్ట్లుంటాయి
చెట్ల ఆకుల గుబుర్లలో కొన్ని పిచికలుంటాయి
నువూ పిచికలూ చెట్లూ చిన్న చీమిడి ముక్కు పిల్లలు
అప్పట్లు కొట్టి అలాయి బలాయి చెప్పుకుంటారు
ఎడారి లోలోపల చాల నదులుగా ఊరుతుంది
ఎప్పటిదో సముద్రం ఎడారి జ్ఞాపకాల్లోంచి
ఏ తపస్సుకు లొంగని దేవుడిలా నిద్ర లేస్తుంది
ఒక ఒయాసిస్సు
ఉన్న చోట ఉండలేక నిత్యం విస్తరించే ఒయాసిస్సు
నా ఒయ్యారి ఒయాసిస్సు
భలే భలే బారులు తీరే అయిష్టాలు కూడా ఉపయోగకరమే
ఇసుక రేణువులుగా మారినా మనుషులు ఉపయోగకరమే
వాళ్ళే కదా
ప్రస్తుతం మీద మనుషుల తీవ్ర అయిష్టాలే కదా
అన్ని చట్టబద్ధ సరిహద్దులను దాటి పొంగిపొర్లి
యుగానికొక చెలియలికట్టను కొత్తగా నిర్ణయించే సముద్రాలు
ఏం లేదు
ఎడారి ఇసుకదైనా మంచుదైనా ఉప్పునీటిదైనా
పదాలు పాదాలుగా నడిచే మనిషికి చావు లేదు.
*
చిత్రం: సృజన్ రాజ్
పాదాలే కాదు పదాలూ మొరాయిస్తాయి…