ఆశల నిప్పులపై భారీవర్షం
శూన్యంలోకి జారిపోతున్న భవిష్యత్తు
మొలిచిన రెక్కలు చచ్చుబడిన దాఖలా
తేనెను మింగుతున్న తెట్టైపోయింది భూగ్రహం
ఖాళీ అయిపొతున్న గుమ్మాలు
వలసబాట పట్టిన పక్షులు
స్వస్థలాలు…గూళ్ళూ గుబులు పాటలు
ఏవీ శ్వాసించిన ఆనవాళ్ళు లేవు
మూల్గుతున్న చీకటికి వేలాడుతున్న ఆకాశం
బహుశా పురుగులకూ,కీటకాలకూ,పాములకూ,జంతువులకు
ఏంజరుగుతుందో తెలిదనుకుంటా….
చినుకులు రాలుతున్నాయంతె
చలిలో తడిసిపోతున్నాయో…బురదలో కూరుకుపోతున్నాయో
చీమలకూ చిట్టెలుకలకూ ఎలా తెలుస్తుందో.
ఖర్చుకు నోచుకోని డబ్బు
వెక్కివెక్కి ఏడుస్తున్న బట్టలకుప్పలు
చీపురు ముఖంలో యేడుపు రాగం
ఏం జరుగుతుందసలు..
ఉసిళ్ళో…నల్లచీమలో…
అప్పడాల గుర్రాలో
కుప్పలుగా పుట్టుకురావడం తెలుసు
చినుకుల చిటపటలో తెల్లవారిన మట్టి
పచ్చికను తొడుక్కుని
ఆరుద్ర చుక్కల పూలచొక్కాలా
గిలిగింతలాడడమూ తెలుసు
వర్షం ఎంత బాగుంటుందసలు
కత్తిపడవనూ…జొన్నబెరడునూ
ఒకేలా పరుగెత్తించిన వాన
కోపమో సంతోషమో…కొన్ని రాళ్ళవానలు
రేకులతో అద్దాలతో పోట్లాడి
ఇసుక దుప్పటిలో దూరిన చల్లని వజ్రాలు
అన్నీ… అన్నిటితో మాట్లాడిన గురుతే
ఇవాళ వర్షం కూడా ఒక తడిలేని భాష
ఈ ముందంతా కృష్ణబిలపు వ్యూహాత్మక ఆకర్షణా క్షేత్రం
గాలి తాళ్ళతో నేయబడి వలవిసురుతున్న కాలం
ఏ పాతాళగరిగో పట్టుకుని
ఒకానొక అదృశ్య లోకాన్ని నిర్మించుకోవాలిక
వనదేవతలమై
ప్రాణవాయులకు చుట్టుకుని వేళ్ళాడాలిప్పుడు!!
*
కవిత బావుంది