ఇప్పుడామె నిర్జన వారధి కాదు జన వారధి

ఒకనాటి తన నిర్జన వారధిని జనంతో నింపుకున్న ఘనత ఆమెది. ఆమెది మాత్రమే. అందులో ఇంకెవరికీ ఇసుమంత వాటా లేదు.

వంద వసంతాలే కాదు వంద శిశిరాలు కూడా చూసిన కొండపల్లి కోటేశ్వరమ్మమ్మ గురించి నేను ఇవ్వాళ చెప్పగల కొత్త విషయాలు ఏముంటాయి? ఈ వ్యాసం చదివే వాళ్ళందరూ బహుశా ఆమె ఆత్మకధ ‘నిర్జన వారధి’ చదివే ఉంటారు. దాదాపు 40 ఏళ్ళ పరిచయం, స్నేహం, సాన్నిహిత్యం ఉన్నా ఆమెను నేను ఎన్నడూ ఆమె జీవితం గురించి అడగలేదు. అప్పటికే అనేక గుండెకోత ఆపరేషన్లు చేయించుకున్నంతటి నొప్పితో ఆమె గిలగిలలాడుతుంటే ఆ నొప్పి గురించి మరికొంచం చెప్పమని ఏమడుగుతాం?

తనంతట తను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెపితే వినడమే గాని ప్రశ్నలు వేసి ఆమె దుఖపు లోతుల గురించి తెలుసుకోవాలని నాకెప్పుడూ అనిపించలేదు. ఆమె చెపితే విని తట్టుకోగల శక్తి నాకు లేదనే భయం కూడా నాలో ఎక్కడో ఉండేదనుకుంటా. చెపుతూ చెపుతూ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే…ఆ రోజు అన్నం తినకపోతే…ఆ రాత్రి ఆ జ్ఞాపకాలతో ఆమె నిద్ర పోలేకపోతే…వాటిని కెలికి నేను సాధించేదేమిటి? రోజూ వచ్చి ఆమె కన్నీళ్ళు తుడవగలనా! ఊరికే వినేసి రేపటినుంచి కుశల ప్రశ్నలకు పరిమితం కాగలనా! ఇవన్నీ ఇంత స్పష్టంగా అనుకున్నానని కాదు కాని అస్పష్టంగా నైనా అటువంటి భయాలు, సంకోచాలు నాలో ఉండేవి.

ఇదంతా 1980-84 మధ్య సంగతి. 30 ఏళ్ళ తర్వాత అమ్మమ్మ పెద్ద మనవరాలు చిన్ని(అనురాధ) ‘నిర్జన వారధి’ రాతప్రతి పట్టుకుని నా దగ్గరకు వచ్చింది. అన్నీ తెలిసిన కష్టాలే అయినా ఒడ్డున నిలబడి సముద్రపు అలల్ని చూడడానికి, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల మధ్య ప్రయాణించడానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం అనిపించింది అప్పటిదాకా నాకు తెలిసిన అమ్మమ్మ జీవితానికి, ఈ పుస్తకంలో అమ్మమ్మ విప్పి చెప్పిన జీవితానికి. చాలా ఏడుపు వచ్చింది. నిస్సందేహంగా గొప్ప పుస్తకంగా పేరు తెచ్చుకుంటుందని ఆ రోజే చిన్నితో చెప్పాను. అయితే నా ఆలోచనలు తెలుగు వరకే ఉన్నాయి. ఇతర భాషలలో కూడా అంత పేరు వచ్చేలా చేసిన ఘనత హెచ్.బి.టి గీతది.

కోటేశ్వరమ్మ శత వసంతాల పండగకు వస్తున్న వాళ్ళందరూ మినహాయింపు లేకుండా ఈ పుస్తకం చదివి వస్తున్న వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. అందరికీ ఆమె వ్యక్తిగతంగా తెలుసని నేను అనుకోను. ‘నిర్జన వారధి’ ప్రచురణకర్త గీతా రామస్వామి ఆమెను ఇంతవరకు చూడలేదు. ఆమె కూతురు లీల కూడా. ఆ పుస్తకాన్ని తమిళంలోకి అనువాదం చేసిన గౌరీ కృపానందన్ కు కూడా ఆమెతో పరిచయం లేదు. అయినా భర్తతో కలిసి ఆమె కూడా విశాఖ వస్తోంది. ఇలాంటి వారెందరో! అన్ని వయస్సుల వాళ్ళూ, కమ్యూనిస్ట్ రాజకీయాలతో సంబంధం లేనివాళ్ళు కూడా 5 వ తేదీ సాయంత్రం విశాఖ సాగర తీరంలో జరుగుతున్న ఈ ఇష్టాగోష్టి సమావేశానికి పని గట్టుకుని వస్తున్నారంటే ఆమె జీవితం వారిని ఎంతగా ఆకర్షించి ఉండాలి! వారికి ఆమె ఎలా కనిపించి ఉంటుంది?

మళ్ళీ మళ్ళీ పడి లేచే కెరటంలా కనిపించిందా…రాళ్ళ గుట్టల మధ్య నిలదొక్కుకున్న మహావృక్షంలా కనిపించిందా…ఎడారి నడుమ ప్రవహించే జీవనదిలా కనిపించిందా…నాకైతే అలానే కనిపించింది. ప్రేమ, పరిణతి, నిబ్బరం, జీవితేచ్చలను పుష్కలంగా నింపుకున్న నిండు జీవితం ఆమెది. అనురాధ, సుధలకే కాదు ఎంతెంత మందికో ఆమె ఇవ్వాళ అమ్మమ్మ. భర్త, కొడుకు, కూతురు, అల్లుడు పోయిన, విడిపోయిన లోటును ఆమెకు ఎవరూ భర్తీ చేయలేకపోయారేమో గాని మనవల విషయంలో మాత్రం ఆమెకు కొరత లేదు. మూడు నాలుగు తరాలకు చెందిన మనవలు ఉన్నారు ఆమెకు. ప్రతి కొత్త తరానికీ ఆమె అంత బాగా ఎలా కనెక్ట్ అవుతారనేది నాకిప్పటికీ ఆశ్చర్యమే! రాజకీయాలను, సమాజాన్ని, సాహిత్యాన్ని నిత్యం చదువుతూ, update అవుతూ ఉన్నందు వల్లనే ఆమె ఇందరితో ఇంత సజీవ సంబంధం పెట్టుకో గలుగుతున్నారేమో!

‘నిర్జన వారధి’ అచ్చయిన కొత్తలో మా అబ్బాయి ప్రభాత ఇంట్లో అందరూ దాని గురించే మాట్లాడుకోవడం విని తనంతట తనే ఆ పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. కొంత చదివాక ‘అమ్మమ్మ వాళ్ళాయన పెద్ద నాయకుడిలా ఉన్నాడే’ అన్నాడు. నాకు ఒక నిమిషం అర్ధం కాలేదు. వాడికి కొండపల్లి సీతారామయ్య తెలియదు. అమ్మమ్మే తెలుసు. రేపు ఎప్పుడో కొండపల్లి సీతారామయ్య మీద పుస్తకం వస్తే దాన్ని చదివిన వాళ్ళు అమ్మమ్మ గురించి కూడా ఇలాగే ‘ఆయన భార్య ఎవరో చాలా గొప్ప మనిషిలా ఉందే’ అనుకుంటారా అని సందేహం కలిగింది. కొండపల్లి సీతారామయ్యతో తన సంబంధాల గురించి అమ్మమ్మ తన పుస్తకంలో ఏ దాపరికమూ లేకుండా రాశారు. ఇష్టమైనప్పుడు ఇష్టంగా, గొప్ప పనులు చేసినప్పుడు గర్వంగా, నాయకత్వపు లక్షణాలు చూపినప్పుడు గౌరవంగా, తనను చురుకైన కార్యకర్తగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతగా…అన్ని రకాలా తన జీవితంలో ఆయన పాత్రను acknowledge చేసారామె. అలాగే విడిపోయే ముందు, తర్వాత కూడా తనకు కలిగిన నొప్పిని దాచుకోలేదామె. ఆ నొప్పి ఎంత ఉన్నా ఆయన పార్టీ మనుషులకు తన ఇంట్లో ఆతిధ్యమివ్వడమే కాక ఇంటిని ష్యూరిటీగా పెట్టి  వారిని విడిపించారామె. కాళోజి తదితరుల కోరికపై మళ్ళీ సీతారామయ్యతో మాట్లాడడానికి ఒప్పుకున్న సందర్భంలో ఆమె చూపిన పరిణతి అసాధారణమైనది. ఆయన చనిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక కామ్రేడ్ గా ఆయనకు నివాళి అర్పించింది. తమ నాయకుడికి తుది వీడ్కోలు పలకడానికి ఆయన సహచరులకు అడ్డం వచ్చిన సిద్ధాంత విభేదాలను చూసి నొచ్చుకుంది. మనస్పర్ధలతో విడిపోయిన ఒక భర్త పట్ల ఒక భార్య ఇంత ఔదార్యం చూపడాన్ని ఎప్పుడు చూసాము మనం!!

అడుగడుగునా అంత హుందాతనం చూపిన ఆమె పట్ల మరి మన వైఖరేమిటి? ఆమె ప్రజా జీవితం సీతారామయ్య భార్యగా మొదలై ఉండవచ్చు కాని ఆ గుర్తింపును దాటి ఆమె చాలా దూరం ప్రయాణించిందని మనలోనే కొంతమంది ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. ఆయనతో జోడించి కాని ఆమె గురించి మాట్లాడలేని వాళ్ళను చూస్తుంటే బాధ, కోపం, ఆశ్చర్యం కలుగుతాయి. ఇవ్వాళ్టికీ ఆమెను కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆమె తనకి ఆ గుర్తింపు ఇష్టం లేదని చెపుతున్నా కూడా. ‘ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు కాదు కదండీ’ అని మనబోటివాళ్ళు గుర్తు చేసినా సరే ‘అదేలెండి. మాకు అలాగే తెలుసు కదా! అలవాటు అయిపోయింది’ అంటుంటారు. అదేమి సమర్ధన? వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్ని ఉద్యోగాలో మారి ఉండొచ్చు. ఎన్ని ఊర్లో మారి ఉండొచ్చు. ఎన్ని పార్టీలో మారి ఉండొచ్చు. ఎందరు స్నేహితులతోనో తెగతెంపులు చేసుకుని ఉండొచ్చు. ఆ మార్పులు జరిగాక వారిని ఎవరైనా తమ ఉద్యోగం గురించో, స్నేహితుల గురించో, రాజకీయాభిప్రాయాల గురించో అడిగితే ఏవి చెప్పుకుంటారు? ఇప్పటి వాటి గురించి చెప్పుకుంటారా, లేక వదిలేసి వచ్చినవాటి గురించి చెప్పుకుంటారా! అక్కడ కాని అలవాటు ఇక్కడ మాత్రమే ఎలా అయింది? ఇటువంటి పరిచయం ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించడం కాదా!

ఆయనతో విడిపోయి 60 ఏళ్ళయ్యాక కూడా ఇంకా ‘కొండపల్లి సీతారామయ్య సహచరికి’ అని రాసి ఆమెకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఏమనుకోవాలి? అది ఆమెను అవమానించడం కాక మరేమిటి? ఈ ధోరణి ఇతరుల కంటే వామపక్షాల వారిలో, మీడియాలో ఎక్కువ ఉండడం మరింత బాధ కలిగించే విషయం. ఆమె నూరు వసంతాల పండగ ఆహ్వానంలో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇవాల్టి హిందూ పత్రిక కూడా ఆమె గురించి అదే రాసింది. కనీసం ex వైఫ్ అని కూడా అనలేకపోయింది. వందేళ్ళ జీవితంలో ఆమె ఆయనతో కలిసి బతికింది 20 ఏళ్ళ లోపే. మిగతా 8౦ ఏళ్ళ జీవితం ఆమె ఒక స్వతంత్ర వ్యక్తిగా బతికిందని వీరంతా ఎందుకు గుర్తించరు? ఒక రాజకీయ జీవిగా, కళాకారిణిగా, సాహిత్య జీవిగా ఆమె జీవించిన జీవితమంతా పక్కకు పోయి ఒకే ఒక గుర్తింపులో ఆమెను ఇరికించాలని చూడడం ఏమి న్యాయం? కొడుకు కోరికపై కొండపల్లి అనే ఇంటి పేరు ఉంచుకోవడమే ఆమె చేసిన నేరమా!

అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటె ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారిని ఇప్పటికీ ముప్పాళ రంగనాయకమ్మ అనేవాళ్ళను చూసాను నేను. ఆ ఇంటి పేరును ఆమె వదిలేసి దాదాపు 40 ఏళ్ళయింది. ఆ తర్వాత ఆమె ఇరవయ్యో ముప్పయ్యో పుస్తకాలు, వందలాది వ్యాసాలు రంగనాయకమ్మ అనే పేరుతోనే రాసారు. అయినా కొందరు ఇవాళ్టికీ ఆమె గురించి మాట్లాడేటప్పుడు విడిపోయిన ఆ భర్త ఇంటి పేరును తగిలించడం మర్చిపోరు. వ్యక్తిగత జీవిత వివరాలు తెలియక అలా అనే వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. చెపితే సరిదిద్దుకునే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడడం లేదు. అన్ని వివరాలూ తెలిసి కూడా, నాబోటి వాళ్ళు పదే పదే చెప్పినా, ఆయా వ్యక్తులు స్వయంగా అయిష్టత వ్యక్తం చేసినా దాన్ని చాలా అల్పమైన విషయంగా భావించేవాళ్ళ గురించి, వారి అభ్యంతరాన్ని ఆకతాయితనంగా తీసిపారేసే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వీరిలో పురుషులూ ఉన్నారు, స్త్రీలూ ఉన్నారు. పితృస్వామ్యంలో ఇది సహజం అనే వాళ్ళు, అనుకునే వాళ్ళంతా మార్పు పట్ల తమ వ్యతిరేకతను, సాటి మనుషుల మనోభావాల పట్ల తమ ఖాతరులేనితనాన్ని (insensitiveness) ఆ ముసుగు కింద కప్పి పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. Once a wife forever a wife అనుకోవడం ఏ రకమైన భావజాలానికి చిహ్నం? అవతలి మగవాడి పట్ల మీకు అపారమైన గౌరవం ఉంటే ఉండవచ్చుగాక. ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ గౌరవం నీడ కింద నిలబెట్టి ఆమెను చిన్నబుచ్చాల్సిన పని లేదు.

* * *

మంచాన పడకుండా ఇంకా తన పనులు తను చేసుకుంటూ వచ్చినవాళ్ళతో చక్కగా కబుర్లు చెపుతూ రోజూ నాలుగు పేపర్లు పుస్తకాలు చదువుతూ వంటలు చేస్తూ పచ్చళ్ళు పెడుతూ మనవరాళ్ళకు ముద్దలు కలిపి పెడుతూ ఎప్పటెప్పటి జ్ఞాపకాలనో కధలు కధలుగా చెపుతూ బతికేస్తున్న కోటేశ్వరమ్మమ్మను ఈ మధ్య ఎప్పుడు చూసినా ఆమె నిలబడింది నిర్జన వారధి మీద కాదు జన వారధి మీద అని అనుకోకుండా ఉండలేము. ఒకనాటి తన నిర్జన వారధిని జనంతో నింపుకున్న ఘనత ఆమెది. ఆమెది మాత్రమే. అందులో ఇంకెవరికీ ఇసుమంత వాటా లేదు.

*

వేమన వసంత లక్ష్మి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు