ఇప్పటికీ ఎప్పటికీ ఆమె ‘పాపాయే’!

బహుశా తను జీవించలేని జీవితాన్నిముందే ఊహించిందేమో, తన వృత్తిలో భాగంగా తన వయసుకు మించిన తల్లి పాత్రల్లో అలవోకగా జీవించింది శ్రీలక్ష్మి కనకాల.

ళ్ళనిండా తన భవిష్యత్తు, తన పిల్లల భవిష్యత్తుని కలలుగన్న ఆమె తన చివరి ఊపిరిని ఎంతో భారంగా తీస్తోంది. చూపు ఎవరిమీదా నిలపలేకున్నప్పటికీ ఎవరు మాట్లాడుతున్నా తనకి అర్థం అవుతోంది. వినిపిస్తూనే వుంది. పిలిచే పలుకుకి స్పందనగా కుడికంటి నుంచీ ఒక్కో కన్నీటి చుక్క జారుతోంది. ఇంకొన్ని గంటల్లో అమ్మ శాశ్వతంగా తమకు దూరమవుతోందన్న దిగులుని బయటకు తెలియనీయకుండా ఆ చిన్నారులిద్దరూ ఆమెకు ఇష్టమయిన పాటల్ని పాడాలని ప్రయత్నిస్తూ, అభినయిస్తూ తనని ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తూ వున్నారు. ‘ఎప్పుడూ సంతోషంగా వుండండి’ అని మాట తీసుకుందట వాళ్ల దగ్గరి నుంచీ. మరి అమ్మ మాటంటే మాటే, పాటించాలి అనుకున్నారిద్దరూ!

వాళ్లకి తనొక బెస్ట్ ఫ్రెండ్. ఎన్ని విన్యాసాలు చేసినా వోర్పుగా విసుక్కోకుండా వుండే టీచర్. ఆకలయితే ఇష్టమయినవి చేసిపెట్టే అమ్మ. అరమరికలు లేకుండా ఎంత సిల్లీ విషయాలనయినా గడగడా చెప్పుకోగలిగే ఒకే ఒక వ్యక్తి. తను వాళ్ళతో ఆడేది, పాడేది, పోట్లాడేది, అలిగేది. వాళ్ళు అడిగే అసాధ్యమయిన కోరికల సాధ్యాసాధ్యాలను వివరిస్తూ సున్నితంగానే తిరస్కరించే రూలర్. ఒక్కోసారి డిక్టేటర్. బంధువులు, స్నేహితులు, తమ చుట్టూవుండే వారితో మెలగాల్సిన స్నేహసంబంధాలను, వాటి విలువను అర్థమయ్యేటట్లు చెప్పే గైడ్. చివరిరోజుల్లో వాళ్ళే ఆమెకి అమ్మయ్యారు. అమ్మకి ఆరోగ్యం బాలేదని, ఇక ఎక్కువకాలం ఉండదని అర్థమయినప్పటినుంచీ దాదాపు ఆమెని కనిపెట్టుకునే వున్నారు.

అమ్మ పరిస్థితి గురించి వివరించిన నాన్నకు గుక్కతిప్పుకోనివ్వకుండా అనేక ప్రశ్నలను సంధించారు. కోపగించారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని ఆజ్ఞాపించారు. ఇవేవీ పనిచేయవని తెలిసిన తర్వాత నాన్నని అంటిపెట్టుకుని నిశబ్దంగానే రోదించారు. తమ బాధను దిగమింగుకుని అమ్మముందు మామూలుగానే ఉండటానికి ప్రయత్నించారు. ఆమెకు బాధ తెలియకుండా వుండేందుకు తమకు చేతనయినంత ‘నర్సు’ పని చేశారు. ప్రతి క్షణం ఆమెని చుట్టుకుని తిరిగారు. ఆడారు, పాడారు, గంతులేశారు. ఆమె ముందు కన్నీళ్లని మాత్రం బయటకు రానీయలేదు. ఇంతా చేసి వారి వయసు పదిహేనుకి లోపే. వాళ్లే ప్రేరణ (పరి), రాగలీన(రాగా). వాళ్లకి తోడు మేనమామ పిల్లలు రోషన్, మనస్విని. ఆ నిష్కల్మషమైన పసిహృదయాల సమక్షంలో ఆమె మేము చూస్తుండగానే మా అందరి నుంచి సెలవంటూ చివరి ఊపిరి తీసుకుంది. అలా మా అందరి నుంచీ భౌతికంగానే దూరమైంది శ్రీలక్ష్మి.

అవును, ఆమె పూర్తి పేరు శ్రీలక్ష్మి కనకాల. పరిచయం అక్కరలేని తెలుగు టీవీ సీరియల్ నటి. తన నటనా వైదుష్యానికి గానూ రాష్ట్ర ప్రభుత్వ ‘నంది’ అవార్డుతో పాటు ఇంకా అనేక అవార్డులు అందుకున్నవ్యక్తి. అయినా గానీ, తన తల్లిదండ్రులకూ, అన్నకూ, చిన్నప్పటి స్నేహితులకీ, బంధువులకూ అందరికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె ‘పాపాయే’. ఆ పేరుతోనే పిలుస్తారు. ‘నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మావాళ్లు ఇంకా ‘పాపాయ్’ అనే పిలుస్తారండీ, ఎంత చెప్పినా వినరు ఎవరూ! ఇప్పుడు పిల్లలు కూడా నన్ను ఉడికించాలంటే మాత్రం అలానే అంటారు’ అని చెప్పింది ఒకసారి. ‘ఇదేదో బాగుంది, మేము కూడా అలానే పిలుస్తాం అయితే’ అంటే, ‘బాబోయ్, మీరు మాత్రం అస్సలు అలా పిలవొద్దు ప్లీజ్, ప్లీజ్… మీదగ్గర నేను నేనులా శ్రీలక్ష్మి లానే వుంటాను, వేరే ఏ బాదరబందీలూ లేకుండా, అలానే ఉందాం’ అంటూ గట్టిగా నవ్వేసింది. శ్రీలక్ష్మికి వున్న గొప్ప లక్షణమేమంటే, హాయిగా గట్టిగా నవ్వుతుంది.

2001 లో అనుకుంటా, ఒకరోజు పెద్ది రామారావు తనని తీసుకొచ్చి నాకూ, రమేష్ కి పరిచయం చేశాడు. అప్పటికి ఇంకా రామారావు తన ప్రేమ గురించి తన తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు. బహుశా, ముందు మాకే చెప్పాడనుకుంటా! నాకు, రమేష్ కీ సీరియల్స్ పెద్దగా చూసే అలవాటు లేకపోవటంతో మాకు తను ఆ వైపుగా అస్సలు తెలియదు. తన మొదటి సీరియల్ దూరదర్శన్ లో వచ్చిన ‘రాజశేఖర చరిత్ర’. ఇప్పటికీ ఆనాటి పన్నెండేళ్ళ ఆ ముగ్ధ మనోహర రూపాన్ని, ఆమె అభినయాన్ని అనేకమంది గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాతి కాలంలో ‘స్వయంవరం’, ఈటీవీ లో వచ్చిన ‘కస్తూరి’ నటిగా ఆమె ప్రతిభను బలంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాయి. అయితే, మేము వీటిగురించి అస్సలు ఏమీ తెలియని అజ్ఞానులం. వాటిగురించి ఏ ప్రస్తావనా లేకుండానే మా మొదటి సంభాషణ సరదాగా నడిచిపోయింది. తర్వాతెప్పుడో, రమేష్ ఒకసారి న్యూస్ రీడర్ గా వస్తే బావుంటుంది అని అడిగాడు. ‘టీవీ ప్రపంచానికి దూరంగా వుండేవాళ్లుగా పరిచయమయిన మొదటిరోజు మిమ్మల్ని చూశాను, ఆ తర్వాత మీరే ఆ టీవీ వార్తా ప్రపంచంలోకి వెళ్ళిపోయారు’ అని రమేష్ కి ఆ విషయాన్ని గుర్తుచేసింది. 2002 మార్చ్ 31న వాళ్ల పెళ్లికి రమేష్, నామాడి శ్రీధర్ కలిసి రామారావు కవిత్వాన్ని పుస్తకంగా వేసి, నాపేరు కూడా కలిపి కానుకగా ఇచ్చారు. ‘పెళ్లి కానుకగా ఎవరైనా మంచి గిఫ్ట్ ఇస్తారు, వీళ్లు పుస్తకం ప్రచురించి ఇచ్చారేమిటి, వీళ్ళేం ఫ్రెండ్స్ రా బాబూ’ అనుకుందట! నిజానికి, ‘అమ్మ నాన్న ఇద్దరూ నటులుగా, దర్శకులుగా, నటనా శిక్షకులుగా వుండటం, వాటినే చూస్తూ పెరిగినప్పటికీ, నటనను తన వృత్తిగా చేసుకోవాలనుకోలేదని, లిటరేచర్ తన ఇంట్రెస్ట్’ అని చెప్పింది.

అయితే, ఆ వైపుగా వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని’ చెప్పింది. ఆ వైపుగా తనని గైడ్ చేసేవాళ్లు దొరకలేదని, తాను కూడా ఆ విషయంలో మరీ అంత సీరియస్ గా లేనేమోనని కూడా అనుకుంది. ‘రమేష్ గారూ, మీరు ముందే పరిచయం అయివుంటే లిటరేచర్ లో స్టడీస్ కంటిన్యూ చేసేదాన్ని’ అని జోక్స్ వేస్తూ సరదాగా వుండేది. పెళ్లికి ముందు, అమ్మానాన్నలు చెప్పారని, అవకాశం వచ్చింది అని సరదాగా చేసిన ఆ రెండు మూడు సీరియల్స్ తప్పించి, నటనను సీరియస్ గా తీసుకుంది మాత్రం పిల్లలు పుట్టిన తర్వాతే! బహుశా ఈ నిర్ణయం, పెళ్లి తర్వాత కుటుంబ జీవితంలో స్త్రీలందరికీ అనివార్యంగా ఎదురయ్యే అనేక సంఘర్షణల అనంతరం వచ్చినదే అనుకుంటా! తనకంటూ ఏర్పడిన కుటుంబం, కొత్త బంధుత్వాలు, వాటికి అనుగుణంగా తనను తాను మలచుకునే క్రమం, ఆ క్రమంలో ఎదురయ్యే ఘర్షణలు, వాటిని మరీ పెద్దవి కాకుండా సర్దుకుపోవాలని చేసే ప్రయత్నం, పిల్లలు, వారి పెంపకం సమస్యలు, ఆర్థిక స్వతంత్రం ప్రశ్న, వీటన్నిటి మధ్యలో ఎక్కడో శ్రీలక్ష్మిగా తన అస్తిత్వం కనుమరుగై పోతుందేమో అనే భయం బలంగా పనిచేసిందని చెప్పింది. కొన్నాళ్ళు పిల్లలు చదివే స్కూల్ లోనే టీచర్ గా పనిచేసింది. పిల్లలతోనే వుంటున్నానన్న సంతోషం ఉన్నప్పటికీ, ఇది తన ఉనికి కాదు అని లోలోపల బలంగా అనిపించేదట! తను మంచి పెయింటర్. గాజు పలకల మీద చాలా బాగా బొమ్మలు వేసేది. తమ ఇంట్లో తాను స్వంతంగా ఇంటీరియర్ డిజైన్ చేసిన విధానంలో కూడా ఆ వైవిధ్యం స్పష్టంగా కనిపించేది. అయితే, ఇవేవి తనకు సంతృప్తిని ఇవ్వలేదు.

పైగా, ఇప్పుడు కొత్తగా అనుభవంలేని రంగంలోకి ఏ రకమైన శిక్షణా లేకుండా అడుగుపెడితే ఎలా వుంటుందో తెలియని ఒక అనిశ్చితి. అలా, కొంతకాలం లోలోపల మధనపడిన తర్వాత, పిల్లల్ని చూసుకోవటానికి ఒక సహాయం దొరకటంతో తనకు చిన్నప్పటి నుంచీ అనుభవమున్న నటనారంగంలోకే ప్రవేశించింది. అందులో తనను తాను నిరూపించుకోవటానికి ఒక కసితో ప్రయత్నం చేసిందనే చెప్పాలి. నటనారంగంలో పేరున్న కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తిగా కాక, తనకు తానుగా స్వతంత్రంగా ఒక నటిగా నిలబడటానికి అంతర్లీనంగా ఒక యుద్ధమే చేసింది. తల్లీ, తండ్రీ, అన్న, వదిన, భర్త అందరూ ప్రతిభావంతులైన రంగస్థల, సినిమా, టీవీ కళాకారులుగా అప్పటికే పేరుపొందారు. వారి నీడగా కాకుండా తనను తానుగా నిరూపించుకోవటం అనేది నిజానికి కత్తిమీద సాములాంటిదే! నటనా మెళకువలను తన పసిప్రాయం నుంచే చూస్తూ పెరిగిన ఆమెకు ప్రత్యేకంగా మళ్లీ శిక్షణ అవసరం లేదు. తల్లిదండ్రుల అనుభవాన్ని అలవోకగా అందుకుంది.

అప్పుడప్పుడూ తనే గురువుగా మారి తన తల్లిదండ్రులు నడిపే యాక్టింగ్ స్కూల్ లో క్లాసులు తీసుకున్న అనుభవం కూడా వుంది. వృత్తిని ఎంచుకోవటంలో ఎదురయిన గందరగోళాల్ని, అవరోధాలను అధిగమించి కొంత ఆలస్యంగా తన ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ తన అద్భుతమైన అభినయంతో జెమిని టీవిలో వచ్చిన ‘అగ్నిపూలు’ సీరియల్ ని రగిలించిన కళాకారిణిగా ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోతుంది. స్త్రీల మీద రుద్దే సామాజిక కట్టుబాట్లను ఎదిరించే క్రమంలో ఏర్పడే సంఘర్షణలను ఎదుర్కొంటూ తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని నిలుపుకునే మధ్యతరగతి స్త్రీ పాత్ర ఆమెది. దానికి, తన కళ్ళతోనే పలికించిన అభినయం చాలామంది స్త్రీలను ఆమెకు అభిమానుల్ని చేసింది. అగ్నిపూలు తర్వాత రుతుగీతం కూడా తనకి మంచి పేరు తెచ్చింది. ఈ రెండు సీరియల్స్ తీసిన మంజులా నాయుడు అంటే శ్రీలక్ష్మి కి ప్రత్యేకమైన అభిమానం. స్త్రీల సాధికారత, జెండర్ అంశాలలోని సంక్లిష్టతలను వివిధ కోణాలలో సామాన్య మధ్యతరగతి స్త్రీలకు కూడా అర్థమయ్యేరీతిలో చిత్రీకరిస్తారని చెప్పేది. దర్శకురాలిగా ఆవిడకు ఒక అవార్డు వచ్చిన సందర్భంగా ఒక టీవీ ఛానల్ లో ఆవిడను తనే ఇంటర్వ్యూ చేసింది.

నటనకు సంబంధించి తన చెల్లిని గుర్తు చేసుకుంటూ, రుద్ధమైన కంఠంతో రాజీవ్ మాట్లాడుతూ, “ఇంత చిన్నవయసులో మా పాపాయ్ మాకు దూరమయిపోయిందంటే ఇంకా నమ్మాలనిపించడం లేదు. అప్పుడే ఒకరోజు గడిచిపోయింది. నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నాకంటే సంవత్సరంన్నర చిన్నది. అందరిలానే చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళం. కానీ, అమ్మా నాన్నా ఏమన్నా అంటే మాత్రం ఇద్దరం ఒకటైపోయి వాళ్ల మీద గొడవ పెట్టేసేవాళ్ళం. చిన్నప్పుడు మద్రాస్ లో కొంతకాలం వున్నాం. తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. అమ్మానాన్నలను చూసి నేను సినిమా ఇండస్ట్రీలోనే నా భవిష్యత్తుని నిర్ణయించుకున్నాను. కానీ, పాపాయ్ అలా ఏమీ అనుకోలేదు. చిన్నప్పుడు ఏమీ అనలేదు కానీ కొంచం పెద్దగయిన తర్వాత ‘పాపాయ్’ అని పిలిస్తే అలా పిలవొద్దని బాగా గొడవ చేసేది. కానీ, మాకు తను ఎప్పటికీ పాపాయే! చిన్నప్పటినుంచీ ఈ హాండీక్రాఫ్ట్స్ చేయటంలో చాలా ఉత్సాహంగా క్రియేటివ్ గా వుండేది.

నాన్న ప్రొడ్యూస్ చేసిన రాజశేఖర చరిత్రలో మొదటిసారి చేసింది. నేను కూడా వున్నాను దానిలో. బేసిక్ గా తను చాలా స్ట్రాంగ్, ఇండిపెండంట్ నేచర్ వున్న వ్యక్తి. రామారావు నాకు సెంట్రల్ యూనివర్సిటీలో క్లాస్మేట్. బెస్ట్ ఫ్రెండ్. తను మా యాక్టింగ్ స్కూల్ కి వస్తూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరికీ పరిచయం అయింది. వాళ్ల పెళ్లి ప్రపోజల్ కి మేము కూడా సంతోష పడ్డాం. ఎందుకంటే రామారావు గురించీ నాకు బాగా తెలుసు. పెళ్లి తర్వాత సీరియస్ గా యాక్టింగ్ ని తీసుకుంది. తన ఈ నిర్ణయం మాకు ఆశ్చర్యమే! పాపాయ్ ‘అగ్నిపూలు’ చేస్తున్నప్పుడు నాన్నకి ఫ్రెండ్స్ ఫోన్ చేసి మీ అమ్మాయి చాలా బాగా చేస్తోంది అని చెబితే ఆయన చిన్నపిల్లాడిలా ‘చూడరా రాజా…అందరూ ఏమంటున్నారో’ అంటూ ఎంత సంతోష పడిపోయేవారో! తనని తాను నిరూపించుకోవటానికి బాగా తపన పడిందని మాత్రం మాకు అర్థం అయింది. నంది అవార్డు ప్రకటించినప్పుడు నాన్న చాలా ఉద్వేగపడ్డారు. ‘మొత్తానికి సాధించిందిరా’… అని చెప్పారు. అమ్మ పోయిన సంవత్సరం లోపలే పాపాయికి కాన్సర్ అని తెలియడంతో అంతంత మాత్రంగా వున్న నాన్న ఆరోగ్యం మరింత పాడయింది. ఈ దిగులుని బాగా లోపల పెట్టేసుకున్నారు. శారీరకంగా బాగా ఇబ్బందిపడ్డారు. రెండున్నరేళ్ళలో అమ్మ, నాన్న, పాపాయ్ ముగ్గురూ చనిపోవటం… అంతా అయోమయంగా అనిపిస్తోంది” అంటుంటే అతని కన్నీళ్ళతో నా కంటి నీరు కూడా జత పడింది.

రాజీవ్ తో పెళ్ళికి ముందే సుమ, శ్రీలక్ష్మి కలిసి స్వయంవరం సీరియల్ చేశారు. అది గుర్తుచేసుకుంటూ సుమ, ‘‘మేమిద్దరం దాదాపు ఒకటే వయసు. నాకూ రాజీవ్ కి మధ్య వారధిగా శ్రీలక్ష్మి వుండేది. మా పెళ్ళయిన తర్వాత, రాజీవ్ వున్నా లేకపోయినా మేమిద్దరం కలిసి బయట తిరిగేసి వచ్చేసేవాళ్ళం. అప్పటికి తనకి ఇంకా పెళ్లి అవలేదు. అప్పుడు నిజానికి మా దగ్గర డబ్బు ఎక్కువలేదు కానీ, మా బెస్ట్ టైమ్స్ అంటే మాత్రం ఆ రోజులే. మాకు రోషన్ పుట్టాడు. ఇంట్లో మొదటి బిడ్డ అవటంతో శ్రీలక్ష్మి వాడిని రకరకాలుగా తయారుచేసి ముద్దుచేసేది. తన పెళ్లి అయి, పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్ ని తన కెరియర్ గా సీరియస్ గా తీసుకుంది. తనకి మొదటి పాప ‘పరి’ పుట్టిన రెండు నెలలకు నాకు మనస్విని పుట్టింది. ఇద్దరం ఒకే సమయంలో మళ్లీ కొంతకాలం ఆ పసిపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో హ్యాపీ గా వున్నాం… పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. ఇలా అవటం అనేది మాకింకా డైజెస్ట్ కావటం లేదు. బయటపడాలని ధైర్యంగా ఫైట్ చేసింది కానీ, తట్టుకోలేకపోయింది. చివరి వారంరోజులు నెప్పితో బాధపడుతుంటే, చూస్తూ వుండిపోవటం తప్పించి ఏమీ చేయలేని నిస్సహాయత మాది’’ అని చెప్తుంటే నెప్పితో విలవిలలాడిన శ్రీలక్ష్మిని తలచుకుని మనసు గిలగిలలాడిపోయింది. హాస్పిటల్లో తన పడిన బాధను ప్రత్యక్షంగా చూసి ఉండటంతో అదంతా మళ్లీ కళ్ళముందుకు వచ్చేసింది.

‘పరి’ కడుపులో వున్నప్పుడు ప్రేగ్నన్సి లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ ఏదన్నా పుస్తకం ఇమ్మంటే, తనకి మేము ప్రచురించిన ‘సవాలక్ష సందేహాలు- స్త్రీలు, ఆరోగ్యం- సంస్కృతి’ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ రెండూ ఇచ్చాను. తనకు లోలోపల వచ్చిన భయాలు, అనుమానాలను పోగొట్టుకోవటానికి ఆ పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పింది. మారుతున్న ఆధునిక జీవనశైలిలో, నగర జీవన విధానంలో చిన్ని కుటుంబాలే ఎక్కువ వుంటాయి. ఉమ్మడి కుటుంబాల్లో వుండటం అందరికీ లభ్యమయ్యే అంశం కాదు. వాటిలో వుండే సమస్యలు వాటిలోనూ వుంటాయి. వేటినీ గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమాచారం అందుబాటులో వుండటం ఒక భరోసాను కలిపిస్తుంది. నేనిచ్చిన పుస్తకాలు ఆ భరోసా కలిగించాయని చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. తన స్నేహితులందరికీ ఆమె ఒక కౌన్సిలర్. వాళ్ల కుటుంబాల్లో వచ్చే అనేకానేక సమస్యలను ఓర్పుతో వినే మనిషి. అయితే, అవి మరీ సంక్లిష్టంగా ఉన్నాయంటే మాత్రం నాకు వెంటనే ఫోన్ వచ్చేది. ‘ఏం చేస్తే బాగుంటుంది, మీరు చెప్పండి పరిష్కారం’ అంటూ. అయితే ఇలాంటి విషయాల్లో తను ఏనాడూ ఎవరి పేర్లూ ఒక్కసారి కూడా నా దగ్గర ప్రస్తావించలేదు. ఫ్రెండ్, కజిన్ ఇలానే ప్రస్తావించేది. గృహ సంబంధమైన సమస్యలను వినే యాక్టివిస్టులకు, కౌన్సిలర్లకు ఉండాల్సిన మొట్టమొదటి అంశం ‘ఎదుటివారి ప్రైవసీ’ని గౌరవిస్తూ, వారి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ ప్రస్తావించకూడదు. శ్రీలక్ష్మిలో వున్న మరో మంచి కోణం ఇది.

మామూలుగా ఎంతో ధైర్యంగా వుంటుంది. అంత ధైర్యంగా వుండే మనిషి కూడా రెండో పాప ‘రాగా’కు ఆరునెలల వయసులో న్యుమోనియా వచ్చి రోజుల తరబడి ఐసియులో ఉంచాల్సివచ్చినప్పుడు చాలా బేలగా అయిపోయింది. ‘ఏంకాదు కదండీ, భయమేస్తోంది’ అని మమ్మల్ని చూడగానే కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది. పాప ఆరోగ్యం మళ్లీ మామూలు అయ్యేంతవరకూ ఆ టెన్షన్ తోనే గడిపింది. అందుకే ఇప్పటికీ ‘రాగా’ ఆరోగ్యం పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యతతో వుంటుంది. ‘రాగా’ తన రెండున్నర ఏళ్ళ వయసులో అక్క ‘పరి’ మీద అలిగి మా వెంటపడి స్కూటర్ మీద మా ఇంటికి వచ్చేసింది. అప్పట్లో వాళ్లు కళ్యాణ్ నగర్ లో వుండేవారు. మేముండేది గాంధీనగర్ లో. దాదాపు పది కిలోమీటర్ల దూరం. వాళ్ళింటి దగ్గర ‘రాగా’ టాటా చెప్పేస్తుంటే, శ్రీలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు అలా ధారగా కారిపోతూనే వున్నాయి. అప్పటివరకూ అమ్మను వదిలి ఐదు నిముషాలైనా వుండని పిల్ల పంతంగా మాతో వచ్చేసింది. పైగా, వాళ్ల అమ్మానాన్నలు రాకూడదని కచ్చితంగా చెప్పేసింది. అక్కడ బయలుదేరినప్పుడు ఎత్తుకుంది గట్టిగా పాటలు పాడటం, దారి పొడుగూతా అలా పాడుతూనే వుంది. ఆరోజు రోడ్డు మీద నాకూ, రమేష్ కూ ఎంతో ప్రాముఖ్యత కల్పించింది చిన్నారి ‘రాగా’. నిజంగా రాగాలమ్మే. ఇక్కడ అసలు విషయం చెప్పాలి, మా స్కూటర్ వెనుకే పరి, శ్రీలక్ష్మి, రామారావు కారులో మాకు ఎస్కార్ట్ గా వచ్చారు. ‘రాగా’ అమ్మ కావాలీ అనేంతవరకూ మా ఇంటి ముందు రోడ్డు మీద అలా పడిగాపులు పడుతూ మూడు నాలుగు గంటలపాటు అలా వుండిపోయారు. పరి, రాగా ఇద్దరి స్వభావాల్లోని ప్రత్యేకతలకు అనుగుణంగా వారి పెంపకంలో భార్యాభార్తలిరువురూ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, ఇందులో ప్రధాన పాత్ర శ్రీలక్ష్మిదే!

నటుడు శ్రీనివాసరెడ్డి కుటుంబం, వీళ్లూ ఒకే అపార్ట్ మెంట్లో వుండేవారు. “చిన్నప్పటి నుంచీ దాదాపు ‘పరి’ మా ఇంట్లోనే పెరిగింది. శ్రీలక్ష్మి చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం వున్న మనిషి. ఐరన్ లేడీ. ధైర్యంగా వుండేవారు. ఏదన్నా అనుకున్నారంటే సాధించే మనిషి. మంచి పాలనా దక్షత వున్న వ్యక్తి. ఆమె తన ఇంటిని ఇంటీరియర్ డిజైన్ చేసిన పద్ధతి చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఎవరో ప్రొఫెషనల్స్ చేశారనుకుంటారు. కానీ ఆమె స్వయంగా దగ్గరుండి ప్రతిదీ ప్లాన్ చేశారు. ఈ అపార్ట్ మెంట్ కి ఆమె ట్రెజరర్. తమ ఇంటినే కాదు అపార్ట్ మెంట్ ను కూడా పిల్లలకు అనుకూలంగా, మొక్కలు ఉండేలా చాలా బాగా డిజైన్ చేశారు. బిల్డర్ ఇష్టపడకపోయినా పట్టుబట్టి తను అనుకున్న పద్ధతిలో పనిచేయించారు. పిల్లల పట్ల, వారి అవసరాల పట్లా చాలా కన్సర్న్ గా వుండేవారు. వాళ్ల పిల్లలు, మాపాప కొన్నాళ్లు ఒక స్కూల్ లోనే చదువుకున్నారు కూడా! ఇండస్ట్రీ లో కూడా తన మీద చిన్న కంప్లయింట్ లేదు. టైం కి రావడం, పని పూర్తిచేసుకుని వెళ్లిపోవటమే తప్పించి ఇతరత్రా అనవసరమైన వాటిలో తలదూర్చేవారు కాదు. పని, పిల్లలు, కుటుంబం, స్నేహితులు ఇదే తన జీవితం. ఇన్ని సంవత్సరాలు ఎంతో స్నేహంగా కలిసివున్నాం. ఇంత హటాత్తుగా తను మా నుంచీ మాయమవటం అనేది మా కుటుంబానికి తట్టుకోలేని బాధగా అనిపిస్తోంది” అని తమ స్నేహాన్ని పంచుకున్నారు ఆయన.

నాలుగున్నర పదుల జీవితమే ఆమెకు వందేళ్ల జీవితమయింది. బహుశా తను జీవించలేని జీవితాన్నిముందే ఊహించిందేమో, తన వృత్తిలో భాగంగా తన వయసుకు మించిన తల్లి పాత్రల్లో అలవోకగా జీవించింది. సీరియల్స్ కి కొంతకాలం విరామం ఇద్దామనుకుంటున్నాను అని సంవత్సరంన్నర క్రితం ఒకసారి చెప్పింది. ఎందుకు అంటే, కొత్తగా ఇల్లు మారటం, షూటింగ్ లతో శారీరకంగా బాగా అలసట అనిపిస్తోంది. కారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంక సీరియల్స్ మానేసి నెమ్మదిగా అటువైపు వెళతాను, సమయం మన చేతిలో వుంటుంది అని చెప్పింది. అప్పుడే, ఇంటీరియర్ డిజైన్ లో తన అభిరుచిని గమనించిన తర్వాత, నువ్వు దీని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందేమో చూడు’ అని నేను సలహా ఇచ్చాను. ఆలోచిస్తానని చెప్పింది. చెప్పిన కొద్ది రోజులకే, ఒక సంవత్సరం క్రితం సరిగ్గా ఏప్రిల్ నెలలోనే ‘అస్సలు బాలేదు కాన్సర్ నాలుగవ స్టేజి అంటున్నారు, రండి’ అని రామారావు నుంచి ఫోన్. ఊహించని ఉత్పాతం. రొమ్ములో మొదలైన కాన్సర్ వెన్నుపూసను కూడా తాకుతోంది. కాలుతీసి కాలువేయనీయని నెప్పి. అల్లాడిపోతోంది. తనని అలా చూసి రమేష్ అస్సలు తట్టుకోలేక పోయాడు. అప్పుడు చాలా ధైర్యంగా వుంది. పిల్లల కోసం పళ్ళబిగువన నెప్పిని, చికిత్సని అనేక నెలలపాటు భరించింది. కష్టమైనప్పటికీ  ఆహార నియమాల్ని పాటించింది. నిజానికి తను పూర్తి శాఖాహారి. చాలామంది అపోహ ఏమిటంటే, మాంసాహారం తీసుకునేవాళ్లకే కాన్సర్ ఎక్కువగా వస్తుందని! కానీ, దానిలో ఏ హేతుబద్ధత లేదు. కాన్సర్ ఎవరికైనా వస్తుందనటానికి అనేక ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.

కొన్ని నెలల తర్వాత తనని మళ్లీ చూడటానికి నేనూ, వినోదిని కలిసి వెళ్ళినపుడు చాలావరకు తగ్గినట్లే అనిపిస్తోందని, తనకు శారీరకంగా, మానసికంగా బావుందని చెప్పింది. ‘ఇంత భరించగలుగుతుందని ఊహించలేదమ్మా, చాలా కష్టం తీసుకుంది’ అన్నాడు రామారావు. ఒక సంవత్సరం తిరిగే సరికి ఒకరోజు ఆనందంగా ఫోన్ చేసింది. ‘సజయగారూ, అన్ని రిపోర్టులు కాన్సర్ పూర్తిగా నయమయినట్లు వచ్చాయి. హ్యాపీగా వున్నాం రండి’ అని. ఫిబ్రవరి 24న నేనూ, రమేష్, నామాడి శ్రీధర్ వెళ్ళాం కలవటానికి. ఆరోజు ఎన్ని విషయాలు చెప్పిందో. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆనందంగా చెబుతూనే వుంది. వాళ్ల నాన్న దేవదాస్ కనకాలగారు రాసిన ‘అభినయ వేదం’ అనే పుస్తకం గురించి, దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్న ‘పరి’ ప్రయత్నం గురించీ చెబుతూ, ‘అమ్మానాన్న లేని లోటు బాగా తెలిసింది, ఈ సమయంలో’ అని కళ్లనీళ్లు పెట్టుకుంది.

‘నాన్నదేవదాస్, అమ్మ లక్ష్మీదేవిగారి జ్ఞాపకాలతో ఒక మంచి పుస్తకం తెచ్చే బాధ్యత తీసుకో, వాళ్లు లేరనే దిగులు తగ్గుతుంది’ అంటే రాజాతో మాట్లాడతాను వీలు చూసుకుని, మరి మీరు గైడ్ చేస్తారా అని రమేష్ ని అడిగింది. ఇరవై రోజులు గడిచేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. వెనక్కి తగ్గినట్లే భ్రమ కల్పించిన కాన్సర్ కణాలు, ఊహించని వేగంతో సునామీ లాగా శరీరంలోని అన్ని ప్రధాన భాగాలకు పాకిపోయాయి. కామెర్లు వచ్చాయి. ఏ చికిత్సకు లొంగని పరిస్థితి. డాక్టర్లు పరిస్థితి వివరించి చెప్పేశారు. అన్నీ విన్న తర్వాత ‘ కనీసం మార్చి 31 వరకూ అన్నా బతికి వుంటానా’ అని అడిగిందట రామారావుని. పెళ్ళయి పద్దెనిమిదేళ్ళు ఆరోజుకి. ఎంత చిన్ని కోరిక అది! ‘పిల్లలకి విషయం స్పష్టంగా చెప్పాల్సిందే, లేకపోతే తర్వాత మానసికంగా ఇబ్బంది పడతారు’ అని చెప్పిందట! గత కొన్నేళ్లుగా తనని, తన పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడిన దుర్గమ్మకు పరిస్థితిని తానే వివరించింది. “నేను చనిపోతానని డాక్టర్లు చెప్పేశారు, ఇంకో పదేళ్లపాటు నా పిల్లల్ని చూసుకోగలవా అని అడుగుతుంటే చాలా కష్టమేసేసిందండి, ఏడుపొచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను’ అని దుర్గమ్మ బాధపడుతూ చెప్పింది. నిజమే, ‘పరి’ అన్నట్లు వాళ్ల అమ్మ మంచి ప్లానర్. తను లేకపోయినా పిల్లలకు రోజువారీ జీవితంలో ఒక సహాయం వుండాలని తాపత్రయ పడింది. తల్లులు మాత్రమే ఆలోచించే కోణమేమో ఇది! ఇప్పుడు వారికి తల్లయినా తండ్రయినా రామారావే! మిగిలిన అందరం దూరం నుంచీ భరోసాగా మేమున్నామని చెప్పేవాళ్ళం మాత్రమే అవుతాం.

ఇప్పుడంతా కరోనా వైరస్ సమయం నడుస్తోంది. సర్వం బంద్. తన పరిస్థితి బాలేదని తెలుసు కానీ, ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆహారం ఇచ్చే పనిలో ప్రతిరోజూ బయటే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో తన దగ్గరకు వెళ్లి ఇబ్బందిపెట్టడం మంచిది కాదు అనుకుని నేనూ, రమేష్ ఆగిపోయాం. కానీ ప్రతిరోజూ లోలోపల భయం పెరుగుతూనే వుంది. చివరికి, ఏప్రిల్ 6న ఆ భయమే నిజమయ్యింది. శ్రీలక్ష్మితో మాకున్న స్నేహాన్ని, తన స్వతంత్ర, అరుదైన వ్యక్తిత్వాన్ని నలుగురితో పంచుకోవటం ఒక విషయం అయితే, ఈ చివరి వాక్యాలు మనందరి కోసం.

*కరోనా కంటే ప్రమాదకరమైన కాన్సర్ మన రోజువారీ జీవితాల్లోకి ఎందుకు వస్తోంది? ఏ కారణాలు దానికి దోహదం చేస్తున్నాయి? మనచుట్టూ వున్న పర్యావరణం ఎక్కడెక్కడ ఏ విధంగా ధ్వంసం అవుతోంది? దానికి మనమెంత కారణమవుతున్నాము? నిజంగా మనం తినే ఆహారం ఆరోగ్యకరమేనా? మన వ్యవసాయంలోకి విషపూరిత రసాయన ఎరువులు, పురుగు మందులు ఎందుకు వచ్చాయి? వీటికి ప్రోత్సాహం ఇస్తున్నదెవరు? వీటి మార్కెట్ ను శాసిస్తు న్నదెవరు? ముందుగా ఎవరు దీనికి బలవుతున్నారు? వ్యవసాయం భారంగా మారి రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆహారచక్రంలో చివరన వినియోగదారులుగా వున్న మనం రోజురోజుకీ కాన్సర్ బాధితులుగా ఎందుకు మారుతున్నాం? ‘కాన్సర్ హబ్’లుగా హైదరాబాద్ లాంటి నగరాలు పేరుపడటం గర్వకారణమా? కాన్సర్ వచ్చిన తర్వాత ఆధునిక చికిత్సా విధానం కంటే, కాన్సర్ రాకుండా వుండే పరిస్థితుల మీద దృష్టి పెట్టడం అసాధ్యమా? పరిస్థితి మారాలంటే మన జీవన విధానంలో మారవలసిన అంశాలేమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకోగలిగిన నాడు, వాటికి హేతుబద్ధమైన సమాధానాలు వెతికిననాడు, శ్రీలక్ష్మి లాంటి అనేకమంది కాన్సర్ బాధితులకి నిజమైన నివాళి అవుతుంది. అప్పటివరకూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక మూల, ఏదో ఒక కుటుంబంలో ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే వుంటాయి. అందులో మనమూ ఉండొచ్చు. ఛాయిస్ మనదే.

*

సజయ. కె

38 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చదవటానికి చాలా ఇబ్బంది పడ్డాను చివర్లో, అక్షరాలకు కన్నీళ్లు అడ్డు తగులుతూ నే ఉన్నాయి ..సజయా .

  • శ్రీ లక్ష్మి గారి గురించి ఎంత బాగా రాశారక్క. నేను కూడా ఆమెను కలిసి మానవి పేజ్ కి ఇంటర్వ్యూ చేశాను.

  • Thanks for sharing the article. My condolences to you for losing a good friend. శ్రీలక్ష్మి గారి గురించి నాకు ఇప్పటివరకు తెలియదు, చాలా తక్కువ టివి చూసే బ్యాచ్ లోనే ఇంకా ఉన్నాను. చదివిన తర్వాత తను కేన్సర్ తో చిన్న వయసులోనే పోయినందుకు చాలా బాధగా అనిపించింది. అయితే ఒక మంచి మనిషి గురించి, ఆర్టిస్ట్ గురించి మీరు కళ్ళకి కట్టినట్టుగా రాశారు, శ్రీలక్ష్మి గారి గురించి తెలుసుకొని బాగా అనిపించింది.

  • Chala painful ga undi chaduvutunte, Tanu parichayam lekunnaa kalla munde jariginattugaa rasavu Sajaya .. nijamaina nivaali 😢

  • Sorry about the loss Sajaya ! Thanks for sharing her story ! I don’t know her but I feel like I got to know her. 🙏🏼
    Also raising important and basic questions about Cancer..

  • ఇప్పుడే చదివాను అక్క….. మనసు చాలా భారం అయ్యింది… ఏడుపు ఆగడం లేదు… తన జీవితం మొత్తం కనిపించింది…. పిల్లలు బాగుండాలి…

  • Abbha!! Eantha Baga vivarincharu Akka chaduvutunte kanneru vostune vundi. Anni kallamunde kanipistunnatke vivarincharu. Hats off!!!!
    Raaga me intiki vachinnapudu nenu me intlone vunnanu Akka. Sri Laxmi gari ni kinda vunde ma flat ki tesukochi Ramesh menakodalu ani parichayam chesaru. RIP Sri Laxmi garu. 🙏

  • అక్కా బాగుంది . శ్రీ లక్ష్మీఆమె జీవితం స్టోరీ కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది.

  • బాగా రాశారు. నేను tv సీరియల్స్ చూడను. అందుకు తన గురించి తెలియదు.
    Face book లో తను చనిపోయినప్పుడి కొంత తెలుసుకున్న.
    ఈ మీ వ్యాసం ద్వారా మరింత తెలుసుకున్న
    👌👌

  • చాలా బాగా రాశావు సజయా, కదిలించింది

  • చాలా బాగా వివరించారు. ఎవరికైనా గానీ అంత చిన్న వయసులో మరణం బాధాకరం. కానీ, అందరం టైం కి కట్టుబడి వుండాల్సిందే.

  • So sad mam…
    Ma family lo kuda cancer ku bali ina vallu unnaru..
    Painful…chustundagaane maayam ipothaaru…

  • Sajaya,
    ఆ అమ్మాయి బాధని ఎంత బాగా చెప్పావు. పొన్నరి పెళ్లి లో చూసాను మాట్లాడాను పరి letter కూడా చదివాను

  • Very sad.. Aunty tho ramarao uncle tho una memories gurtuku vachai sajaya atta after reading the post..

  • మనసంతా వికలమైపోయింది. ఇన్నాళ్లు ఇన్ని విషయాలు ఎందుకు తెలియకుండా ఉన్నాయో అనుకున్నప్పుడు బాధేస్తుంది.

  • ఎంత బాగా రాసారో, ఆవిడ ఉన్నప్పుడు వ్రాయాల్సింది. కాస్త ఆనందపెట్టేవారేమో.

  • That’s so touching sajayatta. Big loss for Ramarao uncle and kids. Hope they all will be strong enough to live with their loss. 😢

  • Peddi ramarao anna naaku atmeeyulu. Thana vaipu nunchi okatrendu maatalu vinaalani unde… But me vyaasam kastha sprushinchindhi…

    Suma, Rajiv garla anubandham media lo ekkuva report indhi. Rama rao anna mana circle kada…

    but touching tribute.

    It seems, Sri lakshmi garu lived life of an ordinary woman with all her might in good and bad situations. May her soul rest in peace.

    Rana Rao anna, take care.

  • Hrudayanni kadilinchi vesindhi, okka saari venakki munduku alochisthe, prastutamunna nagarika paristhithi, labinche aharam, eppudu evarini etu nettivesthaayo theliyani paristhithi.

  • పెద్దిరామారావు, కనకాల కుటుంబాలు, మీలాంటి మిత్రులే కాదు నా లాంటి వారి కళ్లూ తడి అయ్యాయి సజయా..
    ఆత్మీయులంతా ముందు నిలబడి శ్రీలక్ష్మిగారిని తలచుకుంటూ కంటతడి పెడుతున్న భావన కలిగింది. బాగారాశావు సజయా

  • Very heart touching escription of Srilakshmi’s life. Her views on cancer and many other aspects of our environment do need lot of attention. Sajaya made a beautiful narration.

  • కదిలించిన వివరణ సజయ గారూ..శ్రీలక్ష్మి ని నేను సీరియల్ నటిగా చూసాను నటన పట్ల అంకితభావం కనిపించేది..ఈ మధ్య కనిపించడం లేదు అనుకున్నాను కానీ ఇంత బాధననుభవించారని తెలియదు ..ఆ కుటుంబం ఎంతగా అల్లాడుతుందో ..దగ్గరుండి చూసిన మీ అనుభవాలు కదిలించేసాయ్ ..

  • Manchi sannihituralini kolipoinaduku mee bhada varna naatitam. Sorry akka . Nenu kuda oka manchi snehituralini kolpoyanu same condition tho eddaru chinna biddalu 5 years and 1and half years.

  • సజయా, శ్రీ లక్ష్మీ నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు. కానీ మీ ఆర్టికల్ నాకు తెలియని ఆ పాపాయి కోసం కంటతడి పెట్టించింది.
    ఎంత విస్తృతం సజయా మీ ఇద్దరి జీవితం. ఆ జీవితం లోకి రాని వాళ్ళు ఏ పార్స్వం లో నైనా వున్నారా అనిపిస్తోంది. Lots of love to you both.

  • చాల ఉద్వేగంగా ఉంది చదువుతుంటే కళ్ళలో నిరంతరం నీటి పొర అడ్డమొచ్చి చిట్లి జారిపోతోంది – రామారావు మీరూ తెలుసు కానీ తను రామారావు సహచరి అని తెలియదు – మనసంతా భారంగా ఉంది సజయా – చిన్న వయసులో మృత్యువు అదీ ఇన్నిన్ని బంధాలు ఇంత విలువైన జీవితాన్ని విఛ్చిన్నం చెయ్యడం భరించరాని బాధ

  • Thank you for this post Sajaya. So well written with perfect wording. Iam such a fan of Srilakshmi’s character Parvati in Agnipoolu. Not able to digest that she left us so early. Wishing her family great strength and peace.

  • సజయ గారూ…శ్రీలక్ష్మి గారి గురించి ఆఖరి పేరాలు చదువుతుంటే నాకు యేడుపు వచ్చింది. సరిగ్గా అలానే… ఆఖరి స్టేజిలో నా సహచరికి కేన్సర్ బయట పడింది. ఆరు నెలల కంటే యెక్కువ బతకదన్నారు. అయినా ట్రీట్ మెంట్ చేయమన్నాం. ఆరు కీమోల తర్వాత దాదాపుగా శరీరం లో యెక్కడా కేన్సర్ లేదు..పోయింది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. మేమూ పొంగిపోయాం. కానీ మళ్ళీ ఆరునెలల తర్వాత మరో చోట బయట పడింది. మళ్ళీ కీమో…మళ్ళీ తగ్గేది. ఆరునెలలు హాయిగా వుండేది. మళ్ళీ ఆరునెలల తర్వాత మెదడుకి…సోకింది. రేడియేషన్…దాంతో తగ్గింది. ఇలా దాదాపు మూడేళ్ళు ఆమెతో ఆడుకుంది కేన్సర్. మా సహచరి చాలా ధైర్యవంతురాలు. అసలు చికిత్స సమయమ్ లో గానీ తగ్గాక గానీ కేన్సర్ గురించి చింతన పడేదికాదు. ఇంట్లో అందరికీ ఆమెను చూస్తే ఆశ్చర్యమేసేది. ఓ వేపు నాకు తెలిసేది…ఈమె యే క్షణమయినా మనల్ని వొదిలేసి వెలిపోతుందని. మా ముప్పయ్యేళ్ళ బంధం కళ్ళముందు కదిలేది. కళ్లల్లో నీల్లొస్తే…ఆమెకు దూరంగా వెళిపోయేవాడ్ని. ఆమె మాత్రం యేనాడూ యేడ్వలేదు. ఆఖరిలో..మెదడులో ఓ వేపు నీళ్ళు చేరి కాలూ,చేయీ పడిపోయినపుడు…కూడా చింతించలేదు. ఫిజియో ధెరఫీ చేయిస్తే కొంత కదలిక వచ్చింది గానీ ఓ రెండు నెలలకు మెదడులో నీరు వలన చేతనత్వం పోయి హాస్పత్రిలో బెడ్ మీద వుండింది ఓ పదిహేను రోజులు. అప్పుడుమాత్రం ఆమె కనుగుడ్లలోమ్చి చుక్కచుక్కా నీటి బొట్టు జారేది…ఇప్పటికీ ఆ ద్రుశ్యం నా కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి.
    మీ రాత నాకు కన్నీళ్ళు తెప్పించాయి.
    కేన్సర్ గురించి డాక్టర్ లలిత్.. మా సహచరికి వైద్యం చేసిన వారన్నదేమంటే…మన దేశం లో అవగాహనా లోపముందని. ఆ రోగమ్ యెలా వస్తుంది, యెందుకు వస్తుంది అన్న ప్రశ్నలకు జవాబులు వెదకడంతో పాటూ…వచ్చాకనో, ముందుగానో తెలుసుకోవాల్సిన వైద్య అవగాహన మనకు తక్కువని. అది నిజమనిపిస్తోమ్ది. చాలామంది బలి అవుతున్నారు. కిందటి యేడాది…ప్రాధమిక అవగాహన కోసం నేను ఓ డాక్టర్ గారు రాసిన విషయాలతో చిన్న బ్రోచర్ వేసాను…సహచరి వర్ధంతి రోజున…చాలా విషయాలు కేన్సర్ గురించి తెలుసుకోవాల్సినవి వున్నాయి.
    నా అనుభవం లో నేను గ్రహించింది యేమంటే…మొదటి రెండు స్టేజిలలో తెల్సుకుంటే చికిత్స వుంది, వ్యాధిని జయించవచ్చు. ఆ స్టేజిలు దాటితే యే ప్రయోజనమూ లేదు, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చి మనిషిని తీసుకుపోతుంది. అంచేత ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
    నాకు శ్రీలక్ష్మి గారు తెలీదు, సీరియల్సేవీ చూడలేదు,గానీ మీ వ్యాసం ఆమె వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది. ఆమెకు నివాళులు.

  • Sajaya గారు శ్రీలక్ష్మి గారి గురించి రాసినది హృదయానికి హద్దుకునెలా వున్నది…చివరి ముగింపు ఆలోచనాత్మక మైనదీ

  • అక్కా.. నీవు రాసిన అక్షరం అక్షరం పాపాయిని (శ్రీలక్ష్మి) కళ్ళ కట్టినట్లుంది. చివరి పేరా అక్షర సత్యం.. గుండె మెలిపెట్టే బాధ.. రామారావు గారికి.. పిల్లలకు మనమంతా అండగా ఉండాలి.. అంతే అక్క.. లవ్ యు

  • చదువుతుంటే ఈ మధ్యే వర్జీనియా లో క్యాన్సర్ తో పోయిన మా అమ్మాయి స్నేహితురాలు కళ్ళముందు మెదిలింది…ఆ అమ్మాయి మరీ మూడున్నర పదులే…ఇద్దరు పసిపిల్లల తల్లి…ఈ క్యాన్సర్ మహమ్మారి కరోనా కన్నా అతి భయంకరమైనది.. మీ ప్రెజెంటేషన్ బావుంది…..నేను టీవీ సీరియల్స్ చూడను…బట్ పిక్ చూసి ఆమె గురించి చదివాక ఆమెను ఊహించాను.. a big loss to the family

  • అంత చక్కటి నటి, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా నిష్క్రమించింది. రామారావు గారి కుటుంబానికి, కనకాల కుటుంబానికి ప్రగాఢ సంతాపం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు