అది వైశాఖమాసం. ఎండలు బాగా మండి పోతున్నాయి. ఉదయం పది పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకూ ఎండ బాగా తీక్షణంగా వుంటోంది. వీధుల్లో ఎవరూ తిరగడం లేదు. ఆడవాళ్లందరూ తమతమ ఇళ్లల్లోనే ఉంటున్నారు. మగ వాళ్లు మాత్రం, ఊర్లో ఉన్న మందిరాల్లోనూ, సాలల్లోనూ, కళ్లాలలోనూ ఉంటుంటారు గాలి కోసం. ఆ ఎండ ఉన్నంతసేపు అదే పరిస్థితి.
మా వీధిలో మగవాళ్లు కొందరు రామమందిరం పైకి చేరుకుంటారు. కొందరు అమ్మతల్లి గుడి చావిడి పైన చేరి అష్టా చెమ్మా ఆడుకుంటుంటారు. కొందరు అక్కడే ఓపక్కన పడు కుంటారు. మరికొందరు ఇంటిముందరి సాలల్లో కూర్చోని కబుర్లు చెప్పుకుంటుంటారు. వయసులో వున్న కుర్రాళ్లు మాత్రం సాలల్లో బొంగరాల ఆటలు ఆడుతుంటారు. బొత్స రాములు పశువుల సాలలో ఎక్కువగా బొంగరాలు ఆట ఆడు తుంటారు.
బొత్సరాములు పశువుల వ్యాపారి. ఎప్పుడూ పశువులు కొనడం. అమ్మడం చేస్తుంటాడు. కనుక వాళ్ల ఇంటి ముందర చెదురుగా పెద్ద పశువుల సాల ఉంటుంది.
వేసవి గనుక సాలలో పెద్దగా పశువులు ఉండవు. తొలకరి మొదలైతే అమ్మేవాళ్ళు అమ్ము తుంటారు. కొనేవాళ్ళు కొంటుంటారు. వేసవిలో పెద్దగా అమ్మకాలు కొనడాలు జరగవు.
అందుచేత ఆ సాల వేసవి వున్నన్నాళ్లూ, రోజూ బొంగరాల ఆటకి బాగా పనికొచ్చేది.
ఆ రోజు ఎప్పటిలాగే బొంగరాలు ఆడుతున్నారు కుర్రాళ్లు. చుట్టూ గుంపుగా చాలామంది చేరారు. పోటీలు పెట్టుకున్నారేమో! అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. గోల గోలగా వుంది. ఆ గోల మా ఇంటికి పెద్దగా వినపడి, నేనూ చూడ్డానికి వెళ్లాను. మా ఇంటికి దగ్గరే ఆ సాల.
ఆ రోజు గుల్ల సత్యంకి మరడాన వెంకటికి మధ్య పోటీ అంట.
కింద నేలమీద రెండు బొంగరాలు గిర్రున గిర్రున తిరుగుతున్నాయి. మధ్య మధ్యలో ఒకదాన్ని ఒకటి గుద్దుకొంటున్నాయి. అలాంటప్పుడే చుట్టూ ఉన్నవారు, మరింత హడా వుడిగా కేకలు వేస్తున్నారు. ఎవరి బొంగరం ముందు పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టుగా భావిస్తారు. చుట్టూ వున్నవారు ఇరువైపులా పందేలు కాసారు. కాబట్టి వాళ్లు హడావుడిగా వున్నారు.
“పడిపోయమ్మా..! తల్లీ పడిపోయే..పడిపో..” అని కొందరు ఎదుటిపక్షం బొంగరం పడిపో వాలని కోరుకొంటుంటే
“అదిగో… మీదే పడిపోతోంది, దాని పని అయిపోయింది.” అంటున్నారు ఎదుటి పక్షం వారు.
“మీ దానికి బుర్రతిరిగేస్తోంది. అమ్మతల్లి పట్టేసింది గావాల, వూగేస్తోంది” కొందరు వెటకారిస్తుంటే
“మీ బొంగరంలో పస అయిపోయింది, పడుకుండి పోతోంది. దానికి రాత్రి నిద్దర లేనట్టుం ది.” మరికొందరు వేళాకోళం చేస్తున్నారు. అలా మాటవిరుపులు, అరుపులు, కేకలుతో గొప్ప సందడిగా వుంది.
సరిగ్గా అదే సమయములో వీధిలోనుంచి పేద్ద.. గావుకేక లాంటి, ఆర్తనాదం ఒకటి వినప డింది. నేను తుళ్లిపడి వెనక్కి తిరిగి చూశాను. చుట్టూ వున్నవారు అందరూ కూడా నాలాగే ఒక్కసారి వెనక్కి తిరిగి ఏమిటా! అన్నట్టు వీధివైపు చూశారు.
“సంపేస్తన్నాడు నాయనో ….” అని కేకలేస్తు ఏడుస్తూ వీధిలోన పరుగెడుతూ వస్తోంది. మా చాకలి నచ్చెమ్మ.( బహుశా తనపేరు లక్ష్మమ్మ అయివుండొచ్చు. కానీ ఊరిలో అందరూ నచ్చెమ్మ లేదా లచ్చెమ్మ అనే పిలుస్తారు ) అల్లంత దూరములో తన వెనకనే పరుగు నడకన అప్పిశెట్టి దుడ్డుకర్ర లాటి కర్ర పట్టుకొని వస్తున్నాడు. మనిషి తూలు తున్నాడు, ఆవేశంతో వూగిపోతున్నాడు. అప్పి శెట్టి నచ్చెమ్మ మొగుడు.
“ఎక్కడికెల్తావే లం… నిన్నీవేల సంపీకుండా ఇంటికెల్లను” అనుకోని కేకలేస్తున్నాడు. అప్పిశెట్టి లావుగా వుంటాడు. నచ్చమ్మంత వేగం పరుగెట్టలేడు. అందులోనా సారా తాగినట్టు ఉన్నాడు.
వెను తిరిగి చూసిన అందరూ ఒక్క నిముషం అటు చూసి మనకెందుకులే, అని భావించి, అంతకన్నా మనకు ఆట ముఖ్యం అన్నట్టు, తలలు తిప్పేసి మళ్ళీ ఆటలో లీనమైపోయారు. నేను మాత్రం అటువైపే చూస్తున్నాను. అప్పిశెట్టి ముఖం చూసిన నాకు కొంచెం భయం వేసింది. అలాగే నచ్చెమ్మను చూసి మనసులో జాలి బాధ కలిగాయి .
నచ్చెమ్మ చాలా మంచిదాయి. మాయింటి మాసినబట్టలు పట్టుకెల్లడానికి తనే వస్తుంది. అప్పిశెట్టి ఏప్పుడో గాని రాడు. ఒకవేళ వచ్చినా ఆరోజు సాయంత్రం ఉతికినబట్టలు సరిగ్గా ఇవ్వడు. మా బట్టల్లో వేరే వాళ్లవి కొన్ని కలిపేసి తెస్తాడు. లేదా మాబట్టలు కొన్ని ఎవరి బట్టల్లోనో కలిపేసి యిచ్చేస్తాడు.
అందుకనే మా అమ్మ
“అప్పిశెట్టీ…నువ్వొస్తే బట్టలెయ్యము, ఎల్లి మీ ఆవిడని రమ్మను.” అని కరాఖండీగా చెప్పేసేది, అప్పిశెట్టితో.
నేను హైస్కూలుకి వెళ్ళిన ఏడాది అది. వెళ్లి నప్పటినుంచి నా బట్టలు ఇస్త్రీ చేయించ మని మా ఇంట్లో అల్లరిపెట్టేను. అందరూ ఇస్త్రీ బట్టలు వేసుకొని స్కూలుకి వస్తున్నారని ఏడిస్తే మా అమ్మ చివరికి నచ్చెమ్మకి చెప్పింది.
“సిన్నప్పా. ఇస్త్రీకి పందుం(పది కుంచాలు ) జీతం మరి ఏరేగా యివ్వాల” అంది నచ్చెమ్మ.
“ఆడి ఒక్కడి బట్టలకే అంతజీతమేటే! ఆడికున్నివే నాలుగు జతలు. ఆ ఒక్కడి బట్టలకే కదా ఇస్త్రీ! యేదుము( ఐదు కుంచాలు) గింజలు యిస్తానులె” అని ఒప్పంచ బోయింది, మా అమ్మ.
“నాక్కిట్టదు సిన్నప్పా! బొగ్గులు దొరకవు, బొబ్బిలి నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలి” అంది నచ్చెమ్మ.
ఆఖరుకి ఎనమందుముకి (ఎనిమిది కుంచాలు ) ఒప్పానమయింది. ఆ ఎనమందుమూ ధాన్యమే ఇవ్వాలంది నచ్చెమ్మ.
“అలగెలగే..ఉతికినదానికి నీ జీతము ఎలగిస్తామో ఇవీ అలాగే, నల్తుము (నాలుగు కుంచాలు) ధాన్యము,ఇద్దుము( రెండు కుంచాలు) సోలు,ఇద్దుము ఊదలు ఇస్తానని అని చెప్పింది మా అమ్మ. అయిష్టంగానే ఒప్పుకుంది నచ్చెమ్మ.
బట్టలు ఉతికినందుకు ఒక కుటుంబానికి పుట్టెడు గింజలు జీతము. ఆ పుట్టెడులో సగం అనగా పందుము ధాన్యము, ఏదుము సోలు, ఏదుము ఊదలు ఇచ్చేవారు. ఒక భర్త భార్య పెళ్లికాని పిల్లలు ఒక కుటుంబంగా లెక్కవేస్తారు. మగపిల్లలకు పెళ్లయితే వారిని మరో కుటుంబముగా గణిస్తారు.
అప్పిశెట్టి ఎప్పుడూ సరిగ్గా బట్టలు సమయానికి ఇస్త్రీ చేసేవాడు కాదు. ఇస్త్రీ బట్టలు ఎప్పుడూ ఆలస్యముగా ఇచ్చేవాడు. నాకు బట్టలు ఎక్కువలేవు. నేను గోల చేస్తే మా అమ్మ నచ్చమ్మ మీద కేకలేసేది.
“ఉతికేసే ఉన్నాయి సిన్నప్పా! ఇస్త్రీ చెయ్యాలి అందుకే ఆలిసిమయింది” అని చెప్పేది
“కిష్ణబాబూ! నువ్వు పొస్తకాలొట్టుకొని ఆ మాసిపోయిన బట్టల తోనే తిన్నగా మా యింటి కాసొచ్చీ, అక్కడ నేను ఎవలితోనో ఒకలితోని ఇస్త్రీ చేయించి ఉంచుతాను” అనేది.
అలాగే చేయించేది. వాళ్ల ఇరుగు పొరుగు అందరూ చాకల్లే,ఎవరో ఒకరు ఇస్త్రీ పెట్టె రాజేసి ఇస్త్రీ చేస్తుండేవారు. నేను నచ్చమ్మ వాళ్ల గడపలోనే బట్టలు మార్చుకొని స్కూలికి వెళ్ళేవాన్ని. అటు నుంచి కూడా హైస్కూలుకి దారుంది గనక.
నచ్చెమ్మ ఎప్పుడూ సరదాగా వుండేది. ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడేది. మా అమ్మ కోప్పడినా..కసిరినా నవ్వేది. మా అమ్మకోపం ఉత్తుత్తిదే అని తనకు తెలుసు కాబట్టి. అలాంటి నచ్చెమ్మ ఏడుస్తూ భయంతో పరుగెడుతుంటే నాకు చాలా బాధగా అని పించింది.
నచ్చెమ్మ తిన్నగవెళ్లి మా గోలిగోడ వైపు తిరిగింది. నేను ఆశ్చర్యపోయాను. మా ఇంటికి వెళుతోందా! అని. నేను ఆటదగ్గర వుండలేకపోయాను. పరుగెత్తి ఇంటికి వెళ్లాను.
ఆపక్కన ఈదుబిల్లి వాళ్ల సాలలో కూర్చున్న ఈదుబిల్లి అప్పలస్వామి,ఈదుబిల్లి రాములు, కొల్లి శివున్నాయుడు (శిముడు తాత) మొదలైన పెద్దవాళ్ళు అప్పిశెట్టిని చూసి
“అవున్రా! ఒరే..ఓరి సాకలి ముండాకొడక, ఏటిరా ఈదిలోన అల్లరి.” అని కేకలేశారు.
నలుగురు నాయుళ్లను చూసాడేమో, అప్పిశెట్టి కాస్తతగ్గి “నేదు బాబూ!” అని కాస్తా ముందు కెల్లి, వాళ్లకు దూరంగా గుల్ల రాములు ఇంటిముందరి గాది పక్కన నీడలో నిలబడి పోయా డు. అప్పిశెట్టి మా యింటికిరాడు. ఇలాంటప్పుడు అసలే రాడు. మా అమ్మ తిడతాదని భయం.
అప్పిశెట్టి బాగా తాగేసి వున్నాడు. ఎండలో వచ్చాడేమో ఒళ్లంతా చెమట పట్టేసి కట్టుకున్న తెల్లపంచె, తెల్లబాడీ బాగా తడిసిపోయి ఎర్రగా కనిపిస్తున్నాయి. మనిషి వూగుతూనే వున్నాడు.
నచ్చెమ్మ పరుగు పరుగున వెళ్లి మా పైగడప మునంచురాయి మీద చతికిల పడింది.
“సిన్నప్పా!” అని భోరున కేకవేస్తూ “రచ్చించవా!..రచ్చించు..రచ్చించు ..సంపేస్తన్నాడు… తల్లో..సంపేస్తున్నాడు” అంటూ ఏడుస్తోంది.
అప్పుడే మా ఇంట్లోవాళ్ళు అందరూ అంబల్లు తిని ఎటోలటు వెళిపోయారు. లోపల వంట గది సర్దుతోంది మా అమ్మ. ఒక్క సారిగా రోదన వినపడి గాబరా పడింది. నచ్చెమ్మను చూసింది.
“ఏటయ్యిందే..!” అంటూ దగ్గరకొచ్చింది.
నచ్చెమ్మ అప్పటికి కూర్చున్న చోటులోనే అలాగచ్చుమీద పక్కకుతిరిగి చేరబడి పోయింది.
నచ్చెమ్మ వీపంతా చీరుకుపోయి, వీపుమీద చిన్న చిన్నగ రక్తాలు చిమ్ముతు దెబ్బలు కనపడ్డాయి. మా అమ్మ ఆశ్చర్యపోతూ
“ అయ్యో! రామా!” అని విచారించింది.
“ఎవులే..అంతదినిగా కొట్టేశారు” అని అడుగుతూ బాధపడింది.
“నామొగుడే సిన్నప్పా! సెక్కపేడుతోని కొట్టేశాడు” అని ఏడుస్తూ లేచి కూర్చుంది.
“అయ్యో! ఆడికేం పోయేకాలమే, అంతగట్టిగా కొట్టేడు. మరేం దొరకలేదా,సెక్కపేడుతో కొట్టేడు, బీపంతా సీరీసింది. కనపడనీ గండడిని” అని కోపంతో ఊగిపోయింది మా అమ్మ.
అంతా చూస్తున్న నేను
“అమ్మా! అప్పిశెట్టి ఇల్లిక్కడే గుల్లోలి గాదిపక్కనే నిలబడ్డాడు” అని చెప్పాను.
మా అమ్మ విసురుగా మాఇంట్లో నుంచి వెళ్లి మండువా తలుపుతీసి చూసింది.మా ఇంటికి వెనకవైపునే వీధి. వీధికి అవతల ఎదురుగా అప్పిశెట్టి కనపడ్డాడు.
“అవున్రా గండా! నీకేం సంకటమురా! గొడ్డును బాదినట్టు బాదేస్తావా! అది నీకు పుట్టిందా! నీ అమ్మా బాబుకి పుట్టిందా! వూరోడి అమ్మ కూతుర్ని..నిన్నునమ్ముకోని వస్తే..దాన్ని సంపేస్తవా!” గట్టిగా తిట్టింది.
అప్పిశెట్టి మౌనంగా తలొంచీసి నిలబడ్డాడు.
నాకు ఆశ్చరమనిపించింది. ఒక మగాడు, అందులో తాగివున్నాడు, మా అమ్మ అంత ధైర్యంగా మాటలంటో దేమిటా!? అని. అయినా మా అమ్మ మాటలకి ఎదురు చెప్పలేదు సరికదా మౌనం దాల్చేడు.
ఒక్క క్షణం ఆగి,
“ఆ నంజని తోలీ వొదినా!..మాం అంబల్లు తినలేదు. ఎంత వరకు దాగుంతాది, తోలీ” అన్నాడు. తల పైకెత్తకుండానే వూగుతూ..
“తినకపొతే ఎల్లి తిను, నీ వొంతు దానొంతు అంతా నీ ఎదా నెట్టుకో, అదిక్కడే ఏ అంబలో గెంజో తాగుతాదిలే ” అని విసురుగా తలుపేసేసింది. మా అమ్మ కోపముతో
లోపలికెల్లిన మా అమ్మ నచ్చెమ్మనడిగింది.
“అవునే..అంబళ్లు తినలేదట! మామందరమూ తినేసినాము.. కాసింత గంజిబువ్వుంది తిను..లెగు” అంది.
“నాకేటి వొద్దు సిన్నప్పా! అని ఏడుస్తూ తన పయ్యాడ కొంగుతో ముక్కు తుడుచుకుంది నచ్చెమ్మ.
“ఆ..ఆకలితోటి వుంతావ! లెగు…లెగు” అని ఒక తపాలాలో గంజన్నము తెచ్చి పెట్టింది. ఇద ఈ పిండొడెమే.. మరేటి నేదు నంపు” అని రెండు పిండొడియాలు చేతిలో పెట్టింది.
నచ్చెమ్మ కూచొని అక్కడే గంజి తాగేసింది. తపేలా కడిగేసి ఆ పక్కన బొమ్మల్లించి మళ్ళీ అక్కడే నేల మీదే చేరగిలపడింది.
“ఏమిదనికే గొడవ!?” అడిగింది అమ్మ.
“పందికూన గురించి అప్పా! నిన్న పొద్దున్న బేరంవస్తే పందికూన అమ్మేశాను. దానికే ఈ గొడవ.” బాధతో మూలుగుతూనే చెప్పింది.
“అదేటే కూన ఎవులు కొన్నారే!? ఏటి చేసుకుంతారు!?” అడిగింది. సహజంగా పందులు పెద్ద వాటినే కొంటుంటారు.అమ్మేవాళ్ళు వాటినే అమ్ముతారు.
“కూన అంతే కూన కాదప్పా! నిమానుగుంతాది, కూర ఒరిగే.”
కూర ఒరిగిని అమ్మితే ఏమి!? దానికి గొడవెందుకు అన్నట్టు అయోమయంగా చూసింది. మా అమ్మకి విషయం అర్ధంకాలేదు. అది గ్రహించి నచ్చెమ్మ తిరిగి ఇలా చెప్పింది.
“అప్పా! అసలు జరిగిందేంటంతే.. మొన్న పొద్దోయి, సిరి సీకటి పడ్డాక, నా మొగుడు ఆ పందికూన ఒకళ్ళకి బేరం పెట్టాడు. అతగాడు అమ్మేస్తే పావలా డబ్బులు ఇంటికిరావు. అందుకని తెల్లారి వేరే బేరగాళ్ళు వస్తే దాన్ని నేనే ముందు అమ్మేసాను. వాళ్ళు దాన్ని పట్టుకుపోయారు. ఈ సంగతి అతగాడికి తెలీదు. అప్పుడికే అతగాడు బయానా డబ్బులు పుచ్చుకున్నాడట. ఆ సంగతి నాకు తెలీదు. ఆలు ఆరోజు పందికూన్ని చూసి రేపు వస్తాము అనుకొని ఎలిపోనారు. అది నేను చూశాను. అందుకని తొందరపడి నేను అమ్మేశాను. సుట్టుపక్క వూళ్లల్ల అసిరమ్మ పండుగులు కదా!
నిన్న పొద్దున్నుంచి తాక్కొని గడపలో పడి ఉన్నాడు. ఈవేళ ఇందాక పన్నెండు గంటలప్పుడు, ఇతగాని దగ్గర కొన్న ఆసామి ముదరాడబ్బులు తెచ్చి ఇతగాడి చేతిలో పెట్టబోతుంటే అప్పుడు నేను చెప్పేను.
“పెద్దయ్యా! పందికూన నిన్నే అమ్మీడమయి పోయింది, మరి లేదు.” అని .
ఆ మాటిని లెగిసినాడప్పా నా మొగుడు. నామీద అగ్గిఫైర్ అయిపోయాడంతే నమ్ము. దమట పెచ్చరిల్లినట్టు పెచ్చరిల్లి పోనాడు. ఒక ఉదుటన లెగిసి
“లంజా!.. నీకెవుడే ఇచ్చాడు పెద్దరికం!?” అని నన్ను చెక్కపేడు తీసి దబాదబా బాదేశాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోయొచ్చాను” అని జరిగిన సంగతి చెప్పింది.
అంతా విని అలాగా! అన్నట్టు నిలువుగా బుర్ర ఊపింది అమ్మ. నచ్చెమ్మ ఏమనుకుందో తిరిగి అంది.
“నేనెందల పడిపోవాలి సెప్పూ! ఇంటిల ఒక గింజ…ఒక గిన్ని ఏటీ ఉంచడు. ఇద్దరు పిల్లలని నేను ఎలా పెంచాలి సెప్పూ!..అని దుఃఖపడుతూ కళ్ళంట జలజలా నీళ్లు రాల్చింది.
“ప్చ్!” ఒక నిట్టూర్పు విడిచింది మా అమ్మ.
ఒక అరగంట చూసి, అప్పిశెట్టి మా యింటివైపు వస్తున్నాడు. అది చూసి మా అమ్మ తనని తుళ్ల గసిరేసింది.
“ఏవూర్రా నీది! నువ్విటొచ్చావంటే బాగోదు సెప్తున్నాను.” అని ముంజూరు దగ్గరే నిలబడింది.
“నాను రాను, దాన్ని తోలీ వొదినా!..” అన్నాడు. అక్కడే నిలబడిపోయి.
నచ్చెమ్మ నుద్దేశించి “ఏమే రావెందే!..ఎంతవరకు దాగుంతావే!?” అన్నాడు.
“నేను మరి రాను..ఎలాగా సస్తావో సావు. మా నాయనోరే నన్ను పెంచుతారు” అంది. నచ్చెమ్మ
అప్పిశెట్టి పెద్ద కేకలేస్తున్నాడు. తిడుతున్నాడు.
“ఒరే అప్పిశెట్టి..అదే దానికి నచ్చినప్పుడొత్తాది, నువ్వెల్లు. మాయింటిదగ్గర మాత్రం అల్లరొద్దు.” అని తనని పంపించేసింది అమ్మ.
నచ్చెమ్మను తిట్టుకుంటూ వెళిపోయాడు అప్పిశెట్టి.
సాయంత్రం ఎండ తగ్గేక మళ్లీ వచ్చేడు అప్పిశెట్టి. అప్పుడికి కొంచెం మామూలు మనిషి అయ్యాడు. అలాంటప్పుడు అసలు మాట్లాడ్డు. ఎంతో అమాయకుడు సుమా! అనిపిస్తాడు. గోడంచున నిలబడ్డాడు.
నచ్చెమ్మ మా అమ్మకాసి చూసింది. ఏటి చేసేది అన్నట్టుగా.
“ఏటిచేస్తావు!? ఎన్ని అన్నుకున్నా ఆడుకున్నా, కొట్టుకున్నా తిట్టుకున్నా ఆడు నీ మొగుడు.నువ్వాడి పెళ్లానివి..తప్పుతాదేటి, ఎల్లక ఎటుపోతావు!? నీ పిల్లలేటవ్వాలి? ఇది బతుకు. బాదలు పడాల” అంది.
“మొగ గండలకు ఏబాధ వుండదు. ఆడదానికి తప్పదీ ఇంస, పిల్లల్లొదిలి ఎక్కడికీ పారిపోలేము” అని కూడా అంది.
నచ్చమ్మకు ఇద్దరు పిల్లలు,కొడుకు సన్నాసి(సన్యాసి)కూతురు మంగ.
నచ్చెమ్మ వెళ్లడానికి సిద్దపడింది.
అమ్మ అప్పిశెట్టిని కేకేసి, “మళ్ళీ దన్నేమైనా అంతావా!” అని నిలదీసింది.
“దాన్ని కొట్టడం గానీ.. తిట్టడం గానీ చేసావనుకో, నేనే తిన్నగా కురుమినాయుడి దగ్గిరికి దాన్ని తీసికెల్తాను.” అని బెదిరించింది.
కూర్మినాయుడు గారు మాజీ ఎమ్మెల్యే, మా గ్రామపెద్ద. అంతేకాదు మా నాయునోరి కుటుంబములోని వ్యక్తి. మా అమ్మకు మామయ్య అవుతాడు. ఆ విషయం అప్పిశెట్టికి తెలుసు. కూర్మినాయుడంతే అతనికే కాదు వూరందరికి భయము, భక్తి కూడా వున్నాయి. ఊర్లో తనమాటకు ఎవరూ ఎదురు చెప్పరు.
“నేదొదినా! అచ్చే.. మరేటంతాన..ఇందాకేదో తాగేసి.. అలగైపోయింది. తప్పే. మరేటన్ను” అని ఒప్పాన పడ్డాడు.
అప్పిశెట్టి ముందు నడుస్తుంటే నచ్చెమ్మ కొంత దూరంలో వెనక నడిచింది.
***
అలనాటి పల్లేల రోజువారి ముచ్చట, చాలాబాగుంది ఆరోజుల్లో స్త్రీలు నిత్యం చస్తు బతుకుతుండేవారు నేటిపరిస్తితి మారింది. కధ వాస్తవికతకు దగ్గరగాఉంది.
మోహనరావు గారు,మీ స్పందనకు ధన్యవాదాలు సార్.
చిలా సంతోషంసార్ మీరు ఇటువంటి కధలు ఇంకా వ్రాసి ప్రచురించండి పాతకాలం ముచ్చటలు గుర్తు చేసుకోంటాను
రామకృష్ణ గారు కథ ఒక్కసారిగా నన్ను 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది. కథనం బాగుంది. అయితే ఉత్తరాంధ్ర భాషపై మరీ ముఖ్యంగా శ్రీకాకుళం భాష గురించి పెద్ద అవగాహన లేని వ్యక్తి రీ రివ్యూ చేసినట్టనిపించింది. అక్కడక్కడ అక్షర దోషాలు ఉన్నాయి. (తపేలా-తపాలా అని మొదట్లో రాశారు. రెండో సారి కరెక్ట్ గానే ఉంది). ఇది అభిప్రాయం మాత్రమే సుమా.. అన్యదా భావించొద్దు.
SamSri గారూ ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు. మీ మొదటి వ్యాఖ్య అర్ధం కాలేదు.
రెండవది ‘తపేలా’ పదము రెండుదగ్గర్ల వేరు వేరుగా వచ్చిన మాట నిజమే,తపేలా అనే వుండాలి.అచ్చుతప్పులు గురించి ఇకపై మరింత జాగ్రత్త తీసుకుంటాను.