“ఇంటి వైపు” మళ్ళిన కవి కోసం…

“ఇంటివైపు” చూడగానే ఇలాంటి కవిదే ఓ పలవరింత గుర్తొచ్చింది.
“‘చిన్నప్పుడు
పసుపురేకుల తెల్లగన్నేరు పూలను
ఏరుకుని తెగ పరవశించినప్పటి
జ్ఞాపకాన్ని గూర్చి పాడనా
లేక, అగోచర భవిష్య యుగాల్ని
గూర్చి పాడనా!”
ఇదే నాకు గుర్తొచ్చిన కవిత.
అగోచర భవిష్య యుగాలు తెలియనప్పటి కవిత.
 కానీ  ఆ కవికైనా ఈ కవికైనా అగోచర భవిష్యత్తులు తేటతెల్లమయ్యాయి.తెలిసిన తరువాత ఇప్పుడు ఈ కవి స్పష్టంగా” ఇంటివైపే” చూస్తున్నాడు,
చిన్నప్పటి ఇల్లు వదిలి, ఊరు వదిలి, నగరాలు వదిలి, దేశాలు పట్టిపోయాక తిరిగి వెనక్కి రావడమంటే తనలోని తను రావడమే కదా! అందుకే ఇప్పుడు ఇలా అంటున్నాడు.
“కొలమానాలన్నీ గాల్లోకి
చిలిపిగా విసిరేసి
నీలోపల శిథిలమైపోనీ నిబ్బరం గా” – ఇక్కడ ‘నీ’ అంటే ‘నా’ అనే.
ఏ ఎక్కువ తక్కువలూ గమనించని లోపలికి పయనం గనకే నిబ్బరంగా శిథిలమవ్వాలంటాడు. స్థిమితంగా శిథిలమవడమనుకుంటా బహుశా.
లోపలికి తిరిగాక ఇన్ని అనుభూతులుగా మారిన అనుభవాల సారం ఏ గుర్తులు మిగిల్చిందో చూసుకోవడమే ఒక ప్రశ్నగా ఇలా…
”నా మీంచి వెళ్ళిపోయి
వెనక్కి వాలి కొంటెగా
అడుగుతోందొక వెన్నెలరెక్క
నేను నిన్నేదో తడిపేస్తున్నానని నువ్వనుకుంటున్నావే గానీ
నీ లోపల నేనెంత కురిసానో లేదో
ఎప్పుడయినా చూసుకున్నావా అసలు?”
చూసుకోలేదని తెలుసుకుని, లోలోలపలికి చూసుకునే దర్శనమే ఈ ఇంటివైపు
”వెతుక్కుంటూ ఉండడం అలవాటయ్యి, దొరికినవాటి మీద ప్రేమ చచ్చిపోయింది. తీరం మీద పెద్దగా ఆసక్తి లేకపోవడం కారణం. అందుకే వెతుక్కుంటూ ఉన్నంతసేపూ వేసటే రాదు”
కవికి బయట వెతకడం అవసరం లేదని తెలిసింది. అప్పుడే ఇంటివైపు దారి కూడా తెలిసింది. మార్గాయాసం లేదు కానీ గాయాల లేపనం ఒకింత ఉపశమనమిస్తున్నా పాదాలకు బాధ అంటుకునే ఉంది.
దాన్ని మూడు ముక్కల్లో చెప్తాడు ఇలా
“ఈ వాక్యాలకి
ఇంత బాధ ఎక్కణ్ణించి అనే కదా
మాటిమాటికీ నీ ప్రశ్న
ఒకే ఒక్కసారిగా నిజమైన ఏకాంతంలోకి
నెమ్మదిగా నడచిరా
నువు నడచినంత మేరా!”
కవి ఇక్కడ ఏకాంతమనకుండా నిజమైన ఏకాంతంలో అంటాడు. తన ఇల్లు  శరీరాన్ని దాటి మనసు వేపుగా ఇంకా ఎక్కడో లోలోపలి వెలుగు గుహల్లో ఉన్నట్టు ఆ వేపుకే చేసిన ప్రయాణపు యాతన అక్షరాల్లోకి, మాటల్లోకీ రాబట్టాలని చూస్తాడు ఇలా –
” గది లోపల నా లోపల
ఎక్కడెక్కడి నుంచో శరీరపు లోచర్మపు లోలోపలనుంచీ
పాడుతూనే ఉన్నాడు నస్రత్ ఫతే ఆలీఖాన్
– పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా”
“లోయలూ శిఖరాలూ నీ లోపలే
ఆకాశాలూ అరణ్యాలూ నీలోనే
– ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం.”
ఇవి జావేద్ కోసమే అయినా అఫ్సర్ తన కోసం కూడా రాసుకున్న వాక్యాలే.
ఇంటిదాకా వెళ్ళేక అద్దంలో చూసుకున్నంత వివరంగా చూసుకున్నాక నీ రూపు నీకే మోహనమవ్వాలంటాడు. ఎలాగంటే
”ఎవరూ అందుకోలేని ఏదో నిశ్శబ్ధంలోకి నువ్వెళ్ళి రావాలి
వచ్చేటప్పుడు నిన్నునువ్వు కాసింత వెతుక్కుని రావాలి
కొండ మీది గోగుపువ్వంత నిన్ను
వెన్నెలలోని చంద్రరేఖంత నిన్ను”
ఇలాంటి నువ్వు నీకు చిక్కాలంటే ఎలా ఉండాలో కూడా చెప్పకుండా ఉండడు.
”ఎవరినీ వంచించని నువ్వు
మరీ ముఖ్యంగా
నిన్ను నువ్వు వంచించుకోలేని – నువ్వు.”
”లోపలి ఆకాశాల్లోకి పయనించినా నువ్వు కనపడలేదనుకో నీకు అప్పుడు –
నీలి నీలి ఛాయలో మాయచేయని మబ్బుల్లో
నిటారుగా నిలబడి
ఆకాశంలోకి ఒక్కటంటే ఒక్కటేసారి బిగ్గరగా ఏడ్చుకొని
వచ్చెయ్
ఆ దారిలో నువ్వుంటావు.”
మాయ చేయని మబ్బులు అంటూ జాగ్రత్తలు చెప్తాడు.
2
ఇవన్నీ.. ఇవన్నీ.. ఎలా తెలిసాయి.
చదువుకుంటూ, వింటూ, జీవిస్తూనే కాక, ధ్యానిస్తూ కూడా..కాలం గడపడం చాతనయింది కనక.
ఏది విన్నా ఆ తడి ఆరని అడుగులు లోపలికే దారి తీయడం తెలిసింది కనక.
వినాలి…ఎలా వినాలి? ఏ సంగీతాన్నయినా ఏ కవిత్వాన్నయినా, ముఖ్యంగా ఎవరి అనుభవాన్నయినా –
ఇలా…
”నువ్వు వినాలి. వినాలి
ఎండుటాకులు మాత్రమే సందడి చేసే సాయంత్రాలు
ఒకటో రెండో చిగురాకుల్ని ఏరుకొచ్చి
వాటి పత్రహరితంలోకి నువు నిగ్రహంగా ఇంకిపోయేలా”
పత్రహరితమూ – నిగ్రహమూ దారి దీపాలు.
”వినేటప్పుడు నీ లోపలి శిలలోకి తడి కన్నయి ధ్యానించు
అప్పుడు చీకటి అంచు కూడా
తళుక్కున మెరుస్తుంది నీలో”
తడి కంటికి అతీంద్రియమైన చూపు కవిదే
”దయగా మళ్ళీ మళ్ళీ విడవకుండా వచ్చి వెళ్ళిపోయే దిగులును” వదలలేదు. దిగులూ అతన్ని వదలలేదు. క్రమంగా ఆ వదలకపోవడాన్ని దయగా అవగాహనకు తెచ్చుకోవడంలోనే ఇంటిదారి కనపడుతోందేమో!
దూరాలు, ఎడబాట్లు కవి భాషలో నిగ్రహంగా ఇంకుతాయి.
అందుకే
”ఆమె మళ్ళీ వెనక్కి వస్తుందని
నేనేమీ ఎదురు చూడడం లేదు
ఇట్టే వచ్చి వెళ్ళిపోయిందే అని కూడా అనుకోవడ లేదు
ఆమె వచ్చిన ఆ క్షణం ఒక్కటే
నాతో ఉంది
ఇంకా, నాలో”
ఒకటో రెండో చిగురుటాకుల్ని ఏరుకొచ్చి వాటి పత్రహరితంలోకి ఇంకిపోవడం అంటే ఇది కాదా!
”దూరంగా ఉన్నప్పుడే
నా ఒంటిని నేనే తాకి తాకి
కొలుస్తూ ఉంటాను, నీ జ్వరాన్ని”
నీ జ్వరం నా వంటిని కూడా కాల్చేటంత సహానుభవం, తాదాత్మ్యం.
దూరాలు దారంతా బెంగపడిన పక్షిలా మెలికలు తిరిగాక ఇలా వెనక్కి రావడం నేర్పుతాయి. వెనక్కి అంటే తన లోలోపలికే.
అందుకే ఆ బాల్య జీవన తరుచ్ఛాయలలోకే పయనం.
”అప్పుడప్పుడు
ఆ చిన్నప్పటి తలుపు తీసి
పద, వెళ్దాం బచ్ పన్, ఆ ప్రాచీన దేశంలోకి
పూర్వ దేహంలోకి”
కవికి బాల్యంలోకి తిరిగి వెళ్ళే అర్హత వచ్చింది.
 మరచిన మట్టి వాసనో, రాలిన రేగిపళ్ళ వాసనో తెలిసేలాగ బాలుడిగా మారే శక్తి వచ్చింది
”ఎంత కష్టమో పసితనం
తెలుస్తోంది నాకిప్పుడు”
అంటూ ”ఆకుపచ్చా పచ్చని నేనుగా” మిగిలిపోతాడు కవి.
3
కవిత్వాన్ని తూచొద్దు, పలవరించమని చలం గారన్నట్లు – అదే చేసాననుకుంటున్నాను.
అఫ్సర్ మననశీలత లోంచి మిస్టిక్ గా మారుతున్నాడంటే కొందరికి నచ్చదేమో! కానీ తన అనుభవాన్నే గాఢంగా స్వీకరించే దశ నుంచి అందరి అనుభవాలూ తనవిగా చేసుకోగలగడం వరకూ ప్రయాణిస్తున్నట్టుగా ఈ కవిత్వం చెప్తోంది. ఇక్కడ ఇల్లంటే ఇల్లేనా! ఆత్మలోకాల వైపు తిప్పిన చూపు కాదా!!
ఇక  పదాల అందాల భావాల అమరికల కవితాత్మకతల గురించి చెప్పడం నా పని కాదు. అఫ్సర్ కి కూడా బహుశా అవి అవసరం కాదేమో.ఇప్పటికే చాలామంది చెప్పేరు కూడా.
నేనూ నా ఇంటివేపు దారి వెతుక్కునే దశలోఉండగా ఈ సోదరుడూ నాకు తారసపడ్డాడు. అంతే.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

4 comments

Leave a Reply to Padmapadmapv Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అఫ్సర్ గారి పుస్తక పరిచయం చేస్తూ, ఎప్పటి లాగే ఆ పుస్తకాన్ని చదివించే లా రాసారు వీరలక్ష్మి గారు. నిజానికి వీరలక్ష్మి గారి శేఫాలికలు, మంచి సాహిత్యాన్ని చదువర్లకు పరిచయం చేస్తోంది.

  • వీరలక్ష్మీ దేవిగారు,
    ఇల్లు అంటే మన అంతరంగమే నని చక్కగా తెలియచేసారు మేమ్ … మనసు కుదురుగా ఉన్నప్పుడు నరకమైనా సహించగలం. స్వీయచరిత్ర లో శకలాలను పునః విశ్లేషించుకోగలం. అఫ్సర్ గారి తాదాత్మ్యాన్ని సుందరంగా వర్ణించారు. ‘ తడి ఆరని పాదాలు’ అని వ్రాసారు … ఎందుకో తెలియచేయండి… (మందమతిని కాస్త అర్ధం చెప్పమని కోరుకుంటూ…)

  • మీ స్టయిల్లో చెప్పారు. బాగుంది. మనన శీలత లోంచి మిస్టిక్ గా…. !!??

  • చలం గారు చేపినట్లే. afsar ji కవిత్వాన్ని పలవరిస్తున్నా నేనుకూడ.
    మేడం.. మీ విశ్లేషణ బాగుంది… ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు