ఇంకో సగం వెలుతురే కదా!

సమకాలీన కవిత్వ సందర్భంలోకి ఒక అర్థవంతమైన ప్రయాణం!

 “మానవత్వానికి విజయం సాధించి పెట్టె లోపు,  ఒకవేళ నీవు చనిపోయినా అది నీకే సిగ్గు చేటు 

_హోరాస్ మాన్

మంచి కవులందరూ సదా స్పందించే మనసున్న వారే. కవులు తమ  జీవితంతో పాటు సున్నితత్వాన్ని మోసుకువస్తారు. అది మనిషితనపు ఆనవాళ్ళు.  కవులకు జన్మతః అంది పుచ్చుకున్నది.  పీడిత పక్షాన నిలబడే  మార్క్స్సిజమ్ అంటేనే మానవత్వానికి పరాకాష్ట!

literature  is one of the most interesting and significant expressions of humanity _ P.T. Barnum

“మానవత్వాన్ని గురించి గొప్పగా చెప్పగలిగేది ఒక్క సాహిత్యం మాత్రమే !. ఇది అక్షరాలా నిజం. మనిషిని సాహిత్యం కదిలించినంతగా, ఇంకే ప్రక్రియకూ సాధ్యపడదు. ఈ విషయాన్నీ అక్షరాలా  నిజం చేసారు  మన తెలుగు కవయిత్రులు సుధా మురళి,  నస్రీన్ ఖాన్ లు.  నెల్లూరు జిల్లా, నేనకూరులో పుట్టిన సుధా మురళి ఆలోచనలూ, నల్గొండ జిల్లా , రేగుల గడ్డ ఊరిలో   పుట్టిన నస్రీన్ ఖాన్ –వీళ్ళిదరి ఆలోచనలూ సమాంతరంగా పయనిస్తున్నాయని అనిపించింది. వాళ్ళిద్దరిలో, – విశ్వవ్యాప్తంగా మనుషుల్లో  కొరవడుతున్న మానవత్వం కోసం, మనిషితనం కోసం పరితపించడం, ఆయా  సంఘటనల పట్ల స్పందించడం – ఒకే కామన్ ఫెనోమిన.

భాగవతుల సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక కవితలో కొన్ని లైన్స్ గుర్తు చేసుకోవాల్సిందే-

రొమాంటిక్ మూడ్ లోంచి ‘ రాక్షసం’ లో కెళ్ళి,

క్రయమ్ ఆఫ్ నై౦టీస్ ‘ గా నిలచిపోతుంది.

ఈ దౌర్భాగ్యపు ఉగ్రత నుంచి,

ఈ ఉగ్ర దౌర్భాగ్యం నుంచి

ఈ రాతని ఎ మార్టిన్ ఎప్లినో మర్సేట్ టోలినో

డౌసన్,జాన్ డనో/ తెలుగు నేర్చి ఓ

దులుపు దులిపితే బాగుండి పోను !

వాళ్ళెవరో  తెలుగు నేర్చి దుమ్ము దులపాల్సిన అవసరం లేదని, ఇదిగో ఈ ఇద్దరు రచయత్రులు  ఆ బాధ్యతను తమ భుజాన కెత్తుకున్నారు. తమ ఆలోచనలను నిశితంగ కవిత్వ గమ్యం వైపుకు తరలి, పెను తుఫాను లా మారుస్తున్నారు.

**

రెండు జీవితాలలోనైనా,  ఏ ఇద్దరి ఆలోచనలో నైన ఒక అంతరం ఉంటుంది కామన్ గా.  అందుకు భిన్నంగా  ఈ ఇద్దరు రచయత్రులు , పై రెండు కవితల్లో పొందు పరచిన ఒకే భావ సారూప్యం ఆశ్చర్య పరుస్తుంది. ఈ కవితల్లోని అంతరార్థం మనసు మూలల్లో  మెలి తిప్పుతుంది. ఓ మహాశూన్య మెదళ్లలో రియలిష్టిక్ వికృత దృశ్యాలను నింపుతాయి. రెండు కవితల్లోని ఆయా  సందర్భాలు  వేరు వేరైనా, ఆ ఇద్దరు కవియత్రులు చెప్పింది ఒక్కటే. మనిషి ఎందుకో మానవత్వాన్ని కోల్పోతున్నాడు. రాక్షసంగా మారి  మానవత్వపు మూలాల్నే ప్రశ్నార్థకం చేయడాన్ని  ఈ ఇద్దరు కవియత్రులు భరించలేక మనుషుల్లోని కరుణ రాహిత్యం గురించి, మచ్చుకైన కనబడని మానవత్వాన్ని గురించి అక్షరాలతో చెప్పుకొని శోకించారు.

**

“ప్రాక్స్ మిటి” (సామీప్యత) ఈ పదాన్ని ఇప్పుడు గుర్తు చేయాలి. తమ సమీపం లో జరిగే  అమానవీయ, దారుణ  సంఘటనల పట్ల మనిషి స్పందించే తీరుకూ, ఎక్కడో దూరంగా జరిగే సంఘటనల పట్ల స్పందించే తీరుకు చాల తేడా ఉంటుంది. సునామిలో పది లక్షల మంది  మృతి వార్త కన్నా , మన కళ్ళెదుటే ఓ పసిపాపను  సైకిలిస్టు తగిలించి గాయపరిచిన సంఘటన పట్ల మన స్పందించే తీరు చాల అధికంగా  ఉంటుంది. కార్ ఆక్సిడెంట్ లో  ముగ్గురి మృతి అన్న వార్త ను చదివినప్పుడు మనం స్పందించే తీరు కంటే, మన జర్నీలో ఒక ఆక్సిడెంట్ ను చూస్తే, మన మనసు స్పందించే తీరు చాల ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ, ఒక సాదారణ మనిషి స్పందించే తీరులు.

ఈ ఇద్దరు కవయిత్రులు మాత్రం, ఎక్కడో జరిగిన, జరుగుతున్న  సంఘటనల పట్ల  ఈ కవితల్లో స్పందించిన తీరు ఆశ్చర్యం.  సుధా మురళి కవితేమో,   ఆఫ్ఘనిస్తాన్ లో మానవత్వం మట్టిలో కలిసి పోయిన తీరుపై  చాల కన్సర్న్ గా ఫీల్ అయ్యి, ఒక ఆర్ద్రత గల కవితను  ప్రెజెంట్ చేస్తే,  నస్రీన్ ఖాన్ కవితేమో, ఆడవారి పట్ల మగాడు మృగం లాగా  వ్యవహరించడం, ఇంటా బయట, హింసాత్మక వాతావరణాన్ని  మగాడు ఎలా సృష్టిస్తున్నాడు? మగాళ్ళలో ఎక్కడిదీ పైశాచికానందపు జాలు?  మనిషి తనం ఎందుకు నశిస్తోంది?  అని మనసు లోతుల్లో మధన పడి, అద్బుతమైన ఓ కవితను ప్రెజెంట్ చేసారు.

పచ్చందమే తెలియని

కాఠిన్యుడతడు

 పూవులను

 మొగ్గలను నలిపే వికృతం

రేపును కనలేని అంధుడు…….

***

మృగాలు మృగ్యమయ్యేదెపుడో

నమ్మకపు చెర నిండి

ఆమె ప్రయత్నం ఫలించేదెపుడో !!

-అని నస్రీన్ ఖాన్ ఎందాక ?  అనే కవితలో తన వేదనను వెలిబుచ్చితే, సుధా మురళి ఏమో–

 

 శల్య పరీక్షలో ఓడిపోయిన బాటసారిలా అట్టడుకు వేలం వేయబడుతుంది

నిర్మాల్యపు దిశగా సాగుతున్న పెనుగులాటల్లో

గెలుపు బుర్ఖా తొడుక్కుని ముఖం చాటేస్తుంది

రక్షణ గోడల మీద శిథిలమౌతున్న రక్షక చిత్రాలు

వినిపించని అజాకై పరుగులెత్తుతూ ప్రేక్షకపాత్ర వహిస్తాయి

ఎవరు రాసిన ఫత్వానో ఇది

గుమ్మాలకు తోరణమై వాడిన నవ్వుల్ని అలంకరిస్తోంది

పోయే ప్రాణాలు పోతున్నా

మిగిలుంటే చాలంటూ చావు చీటీ చించేస్తున్న పిపీలికాలు

బారులు తీరి మానవత్వాకర్షణ దిశగా పరిభ్రమిస్తున్నాయి….

–  అని ఆమె  తన అంతరంగ బాధను ఎంతో అర్ధ్రతగా గుండె లోతుల్లలో చెలరేగిన  బాధను కవిత్వం చేసారు.

 కవి  మనసు – స్వయంగా చూసినప్పుడో, చదివినప్పుడో, లేక స్వీయానుభవం నుండో  కవిత రూపొందుతుంది. బాధల సందర్భాలు వేరు వేరైనా,  ఈ రెండు కవితల్లో,  మనిషి తనం కోల్పోయిన మనిషిని ప్రశ్నిస్తున్నారు. వాటి వెనక గల కారణాలను వెతికి పట్టే యోచన చేసారు. మనల్నీ చేయమన్నారు. మనసున్న మనషులు ఈ దిశగా ఆలోచంచండి అని ఒక ప్రకటన చేసారు ఈ ఇద్దరు కవయిత్రులు..

స్త్రీవాద, ముస్లీం మైనారిటీవాద, దళిత వాద ల్లాంటి , అస్తిత్వ కవిత్వ విప్లవాల్లాగా,  ఈ సంక్లిష్ట భీకర అరణ్యం లాంటి సమాజం లో ,  మానవత్వాన్ని నిలుపుకొనేందుకు,  మనిషితనాన్ని కాపాడుకొనేందుకు,  చిద్రమైన మనిషిని మళ్ళీ తెచ్చుకొనేందుకోసం సాహిత్యం లో  ఇంకో కొత్త  ‘ మానవత్వ వాద అస్తిత్వ ఉద్యమం’  అవసరమని పించే ఓ కల్చర్ ను ఈ రెండు కవితలు  సృష్టించాయి.  సమాజం లోకి కర్టన్ రైజర్ లాగ ఈ రెండు కవితలని ఈ  ఇద్దరు కవయిత్రులు పంపించారు.

లియో  టాల్స్టాయ్  చెప్పినట్లు,  జీవితం యొక్క ఏకైక పరమావధి మానవత్వాన్ని కాపాడు కొని దాన్ని సేవించడమే  అన్నది నిజం.  రాబోయే తరాలకు మనం ఏమి మిగిల్చామంటే,  ఓ రాక్షస అటవీ రాజ్యాన్ని మిగిల్చి  పోయారన్న ఒక అపవాదు మిగిల్చి పోకూడదన్నది వీరిద్దరి ఆలోచన.  ఈ మనిషి తనాన్ని కోల్పోవడం పై ఒక సాహిత్య చర్చ అవసరమని భావించారేమో కానీ, సుధా మురళి, నస్రీన్ లు ఒకే ఎజెండా తో కదిలినట్లే కనిపిస్తుంది.

నస్రీన్ తన కవితలో _  ఇలా చెప్పుకొచ్చారు.

‘నిత్యం ఆమెను వేటాడటం

 ఆట అతడికి

 పులి కంట పడని జింకలా

 అతడి చూపుల కత్తుల నుంచి

 తప్పించుకోవాలామె !!

..

ఆమె గాయం

అతడికి సరదా

 ఆమె ఆర్తనాదం

అతడికి ఆనందం

చెలగాటం అతడిది

ప్రాణసంకటం ఆమెది.

ఒక స్త్రీవాద రచయిత్రి గా నస్రీన్ _ మగాడు , మనిషి తనాన్ని కోల్పోతున్నాడన్న వేదన తో పాటు,  వారి హింసకు గురి అవుతున్న ఎందరో మహిళల ఆక్రందనకు ఆమె గొంతుక అయితే,  విశ్వం లో ఎక్కడైనా సరే,  మనిషి మృగమైతే, స్పందించి తీరుతాం అని  ఓ ధ్వని, ప్రతిధ్వనిని వినిపించారు.   సుధా మురళితన  చిక్కటి కవిత్వానికి ఓ మాట్లాడే గొంతు నిచ్చారు.

మనిషి తనం కోల్పోతున్న మగాడిని, వారి వారి ఇరుకు, కర్కశ ఆలోచనల నుండి తప్పించాలన్న  తపన వారి కవితల్లో కనిపించింది. అంతే కాదు, వారసత్వ సంపదగా భావిస్తున్న ఆ మృగ జాతి లక్షణాలను వొదిలి మనిషి బయటకు రావాలన్న  ఒక మెసేజ్ ను సమాజం లోకి ఈ కవిత ద్వారా అంతర్లీనంగా  జారవిడిచారు. ఈ మాటలు సభ్య సమాజాన్ని సూదంటు రాయిలా ఆకర్షిస్తాయి. ఒక చైతన్య దీపిక వైపుకు మనల్ని మళ్ళిస్తాయి.  ప్రముఖ కవయిత్రి, మాయా అంజేలో చేసిన ప్రయోగం  గుర్తొచ్చింది. “ How important it is for us to recognize and celebrate our heroes and she-roes!”

అవును…. సుధా మురళి , నస్రీన్ ఖాన్ లు ఇద్దరు మన తెలుగు సాహితీ షీరోస్!!

తమ ఎదుట పడిన దుర్మార్గాన్ని చూసో,  దుఖాన్ని చూసో,  కొందరు క్రుంగి పోతారు.  ఇంకొందరు   విప్లవ చేతనావస్థ ను కల్పిస్తారు.  ఈ రెండు  కవితల నిండా  _  సాటి మనిషి ఎదుర్కొంటున్న అగడ్తలను ప్రస్తావిస్తారు. సమాజం నిండా అలుముకున్న కృష్ణతమమైన చీకటి ని ప్రస్తావించారు. ఆ చీకటి ని, ఆ దుఖాన్ని, మనిషి తనాన్ని కోలోపవడాన్ని  కవితల్లో చెప్పడమంటే, ఒక  పోజిటివ్  చైతన్య వెలుగు ను మనలోకి నింపడమే. డిలాన్ థమస్ చెప్పినట్టు “A darkness in the weather of the eye Is half its light”  అక్కడ సగం చీకటి ఆవరించి ఉందంటే, ఇంకో సగం వెలుతురు ఉన్నట్లే అన్న సందేశంగా ఈ కవితల్ని తీసుకోవచ్చు.

***

వాళ్ళిద్దరి కవితలు  ఇవి:

పరిభ్రమణం…..సుధా మురళి

 

క్క తుపాకీ

ఇప్పుడు నేల నీది కాదు

గాలి నీది కాదు

నీ ఆరడుగుల స్థలాన్ని మోసుకు అజ్ఞాత యాత్రకు శ్రీకారం

పరిగెత్తే కాలు నాలుగు చోట్ల కూలబడి ఉంటుంది

తట్టుకుని కొట్టుకుని విరిగిన మనసు హింసను జీర్ణించుకు వుంటుంది

అయినా ఏ ధైర్యం కాయదు

మోడు వారిన వీరత్వం మొగ్గకూడా తొడగదు

నీదనుకున్న ఇన్నాళ్ల నీ నీడను ఎవరో దోచుకుంటున్నా

ఒట్టి దేహాన్ని గానుగెద్దును చేసి

ఒట్టి పోతున్న ప్రాణాన్ని

దున్నుకోవడం ఒక్కటే నీకు తెలిసిన విద్య

ఎక్కడో ఓ చోట మానం మౌన రోదనలతో నిష్క్రమిస్తూ ఉన్నా

గాయాలయ్యిన మనసుకు జోల పాడటం బాగా చేతనైన వ్యవహారం

కాలిడిన ప్రతీచోటా అభిమానం

ఏ చెప్పుల దండానికో వేలాడి ఉసురు కోల్పోతున్నా

కాలికింద పిడికెడు మట్టి మిగిలిందన్నదొక్కటే ఆనందం

ఇన్నింటి మధ్యా బతకాలని ఉవ్విళ్లూరే ప్రాణం మాత్రం

వేర్లు చచ్చిన చెట్టులా శరీరాన్ని చుట్టుకు వేలాడుతూ ఉంటుంది

 

ఎదిరింపుల నీళ్లు చల్లేవాళ్ళు లేక

ఎదుర్కొనే తెగువను ఎరువేసే నాధుడు కానరాక

శిలా విగ్రహంలా

కాదు కాదు

శల్య పరీక్షలో ఓడిపోయిన బాటసారిలా అట్టడుకు వేలం వేయబడుతుంది

నిర్మాల్యపు దిశగా సాగుతున్న పెనుగులాటల్లో

గెలుపు బుర్ఖా తొడుక్కుని ముఖం చాటేస్తుంది

రక్షణ గోడల మీద శిథిలమౌతున్న రక్షక చిత్రాలు

వినిపించని అజాకై పరుగులెత్తుతూ ప్రేక్షకపాత్ర వహిస్తాయి

 

ఎవరు రాసిన ఫత్వానో ఇది

గుమ్మాలకు తోరణమై వాడిన నవ్వుల్ని అలంకరిస్తోంది

పోయే ప్రాణాలు పోతున్నా

మిగిలుంటే చాలంటూ చావు చీటీ చించేస్తున్న పిపీలికాలు

బారులు తీరి మానవత్వాకర్షణ దిశగా పరిభ్రమిస్తున్నాయి….!!!

 

2

ఎందాక?  …నస్రీన్ ఖాన్

నేటి పునాదిపై …

నిలిచే రేపంటే ఆశ ఆమెకు

విశ్వాసపు కంచెను

మేయని చేను కోసం

యుగాల ఎదురుచూపు ఆమెది!

 

చీకటి కమ్మిన దారుల్లో

ఆశయం కాగడా వెలుతురులో

విజయం ముంగిట వాలే తొలి పొద్దు

ఆమె

కొమ్మా రెమ్మల్లో కలగలిసిన

ప్రకృతి పారిభాషిక

మమతానురాగాల జీవనది ఆమె!

 

ఆమెకు విరుద్ధం అతడు

క్రౌర్యం నిండిన దేహాన్ని

వినయం వస్త్రంలో దాచి

ఆమె చుట్టూ

తిరిగే దీపపు పురుగు

కామ కాంక్షా కాలుష్యంలో

రంగరించిన మెదడు అతడిది

అంగాలు మొలిచిన

అతడి కళ్ళు పడితే

మరునాటికి విగతం ఆ జీవి

విచక్షణ దారం

వదిలేసిన గాలిపటం అతడు

..

నిత్యం ఆమెను వేటాడటం

ఆట అతడికి

పులి కంట పడని జింకలా

అతడి చూపుల కత్తుల నుంచి

తప్పించుకోవాలామె !!

..

ఆమె గాయం

అతడికి సరదా

ఆమె ఆర్తనాదం

అతడికి ఆనందం

చెలగాటం అతడిది

ప్రాణసంకటం ఆమెది

మానవతా దాహార్తి ఆమెది

అతడి కంటి ఎడారిలో

ఒయాసిస్సులు వెతుకుతుంది

 

పచ్చందమే తెలియని

కాఠిన్యుడతడు

పూవులను

మొగ్గలను నలిపే వికృతం

రేపును కనలేని అంధుడు…

వైపరీత్య నిప్పుల గుండం

ఆమె పాదాలను మోసే యుద్ధక్షేత్రం

..

చిగురించే భావి చెట్టుపై

అడుగంటని ఆశ ఆమె

అలసట మరిచిన బాటసారి

రాళ్ళబాటల్లో గమ్యం ఎరుగని పయనం ఆమెది

 

మృగాలు మృగ్యమయ్యేదెపుడో !!

నమ్మకపు చెర నిండి

ఆమె ప్రయత్నం ఫలించేదెపుడో !!

*

సి.వి. సురేష్

12 comments

Leave a Reply to Shaikpeerla Mahamood Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా విశ్లేషణ చేసారు సురేష్ సర్.. మానవత్వాన్ని మరిచిన అనాగరిక సమాజంపై నిరసన గళాన్ని వినిపించిన కవితలు తీసుకున్నారు అభినందనలు ఇరువురు మిత్రులకి నస్రీన్ ఖాన్ 💝 సుధామురళి 💝

  • అమానవీయ సంఘటనలకు ఈ ఇరువురు స్పందించిన తీరు స్పష్టంగా ఉంది.మీ సమీక్ష వాటిని మా అందరికీ కొత్తగా పరిచయం చేసింది.మీ కలం బహుముఖంగా విస్తరిల్లడం ముదావహం అన్నయ్యా.

  • ఇద్దరి కవితలు బాగున్నాయి. కానీ మీరన్న ట్రెండ్ సెట్టింగ్ కనిపించలేదు. స్త్రీ వాదంలో మానవీయ కోణం కొత్తేమీ కాదు. స్త్రీ పురుష సమానతత్వ స్పృహ, అణచివేత మీద తిరుగుబాటు ధోరణి, ఆంక్షలు హింస వల్ల కలిగే నొప్పిని శక్తీవంతంగా వ్యక్తీకరించడం స్త్రీవాదంలో ఇప్పటికే ఉంది. ఆ ధోరణిలో ఇప్పుడు రాస్తున్న కవుల్లో వీరిద్దరూ వున్నారు. ఇంకా ముందుకు వెళతారని ఆశిస్తున్నాను.

    • ఈ తరహా రాయడం… క్రొత్తగా ఉందని భావించి, రాశానన్నా… స్త్రీ వాదం లో మానవీయ కోణం గురించి రాయడం సహజమే… అయితే, కవిత్వాన్ని విశ్లేషించకుండా, …ఆ కవయత్తుల అంతరంగ ఆలోచనలను సమకాలీన సమాజం అందిపుచ్చు కోవాలన్న తపన ఉందని చెపుతూనే, ఇతర అస్తిత్వ వాదాల్లాగా మానవత్వాన్ని రక్షించుకొనే ఒక కొత్త అస్తిత్వ వాద ఉద్యమం రావాలని కొత్త ట్రెండ్ ను ప్రవేశ పెట్టినానని భవించా నన్న..

      ఏ అస్తిత్వ వాదానికైనా…మానవీయ కోణమే ‘బేస్’ అన్నది సహజం. .మీరు చెప్పింది కూడా నిజం..!! ధన్యవాదాలు మీ స్పందనకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు