ఇంకో దశాబ్దంలోకి సారంగ!

మార్చి మొదటివారంతో సారంగ మరో దశాబ్దంలోకి అడుగు పెడుతోంది!

ఈ ప్రయాణంలో అడుగులు కలిపిన రచయితలూ, పాఠకులందరికీ మీ ధన్యవాదాలు. వొక దశాబ్దం అంటే చిన్న మాటేమీ కాదు. ముఖ్యంగా ఎన్నో వెబ్ పత్రికలు వచ్చి వెళ్లిపోతున్న కాలంలో నిలకడగా మీ ముందు నిలబడింది సారంగ. ఇట్లా నిలబడడం ఇక్కడి ప్రతి అక్షరాన్నీ మనసుకి హత్తుకొని చదవడమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో విమర్శలూ సూచనలూ అందిస్తూ వచ్చిన మీ అందరికీ సారంగ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి.

మధ్యలో వొక ఏడాది విరామం తరవాత రెండో ఇన్నింగ్స్ లోకి అడుగు పెట్టినప్పుడు సారంగ పాఠకుల సంఖ్య రెండింతలు పెరిగింది. మొదట్లో వేలల్లో మాత్రమే వున్న ఈ సంఖ్య ఇప్పుడు లక్షల్లోకి వెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు మాట్లాడే ప్రతి దేశంలో ఇప్పుడు సారంగ ఇంటింటి పత్రికగా మారింది. అంతే కాకుండా, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీషు విభాగం కూడా తోడవడంతో అది ఇప్పుడు తెలుగు భాష సరిహద్దులు దాటుకుంటూ వెళ్తోంది. ఇంగ్లీషు విభాగం ఎంతగా విజయవంతమైందంటే, సారంగ ఇంగ్లీషు వేరే పత్రికగా రావాలని ఇప్పుడు మా మీద వొత్తిడి పెరుగుతోంది. మాకున్న పరిమితమైన వనరుల వల్ల అది ఎంతవరకు సాధ్యమా అని ఆలోచిస్తున్నాం.

రెండు మూడు తరాల పాఠకులనూ, రచయితలనూ వొక చోట కలపడంలో సారంగ చాలా మటుకు విజయం సాధించింది. ఇక కొత్త తరం రచయితలూ కవులూ విమర్శకులు ఇప్పటికీ తమ మొదటి మజిలీ సారంగ మాత్రమే అని సగర్వంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా అనేక సృజనాత్మక ప్రక్రియలకు సారంగ జన్మ భూమి. సారంగలో రచన అచ్చయిందీ అంటే అదొక గౌరవంగా భావించే స్థాయి దక్కింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.

వొక్కో రచనని పాఠకులకు అందించడంలో సారంగకి కొన్ని విధివిధానాలున్నాయి. ప్రతి రచననీ ముగ్గురు సమీక్షకులకు పంపించి, ఆ అభిప్రాయాలూ ఫీడ్ బ్యాక్ అందిన తరవాతనే ఆ రచన సారంగలో అచ్చవుతుంది. ఆ కారణంగా కొన్ని రచనలు అందించడంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నా, రచయితలకు అది గొప్ప తృప్తి. రచన గురించి పునరాలోచించుకునే వ్యవధి వాళ్ళకీ దొరుకుతోంది. అందుకే, కొంత ఆలస్యమవుతుందన్న వాస్తవం తెలిసినా, సారంగ కి మాత్రమే రచనలు అందించే రచయితలు ఈ పదేళ్ళల్లో పెద్ద సంఖ్యలో ఏర్పడ్డారు. మేలైన రచనల వేదికగా సారంగ ని తీర్చిదిద్దడంలో ఎందరో  రచయితలూ , రీడర్లూ, మాకు ఫీడ్ బ్యాక్ అందిస్తున్న సమీక్షకులూ వున్నారు. వాళ్లందరి సహకారమే మాకు కొండంత అండ.

ఈ తోడ్పాటు ఇక ముందు కూడా కొనసాగాలని, సారంగ మరో దశాబ్దంలోకి హాయిగా ప్రయాణించాలని కోరుకుంటూ

మీ

సారంగ

 

ఎడిటర్

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముందుగా సారంగ సంపాదక వర్గానికి అఫ్సర్ సార్ కు హృదయ పూర్వక అభినందనలు. పత్రికలో భిన్న ఆలోచనాధోరణులకు చోటివ్వడం ద్వారా రచనలపై విస్తృతమైన చర్చకు తలుపులు‌ తెరవడం వలన సారంగ పాఠక హృదయాలను గెలుచుకుంది. మధ్యలో ఇంక నడపలేమని ఆగిపోయినప్పుడు తెలుగు పాఠకుల నుండి తప్పక మరల రావాలని వచ్చిన డిమాండ్ పత్రిక వారికి ఎంతగా చేరువయిందో తెలిసింది. అది సంపాదక వర్గం విజయం. ఇలాగే నిత్య నూతనంగా తీర్చి దిద్దుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తూ మరొకసారి అభినందనలు.

  • ప్రత్యామ్నాయ వేదికగా సారంగ నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకo!
    అ’ప్రధాన స్రవంతి మీడియాకు ఉండే అభ్యంతరాలు లేని పత్రికగా దేశ దేశాల తెలుగు సాహిత్యకారులను కలిపే వేదికగా సారంగ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థిరం చేసుకుంది. రెండో దశబ్దంలోనూ ఈ సఫర్ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ సారంగ సారధులకు దిల్ సే ముబారక్💙🌿

  • జనాభ్ , You did it .

    నాకు అర్ధమయ్యి సారంగ Fandom చాలా వరకు అఫ్సర్ Sir Fan jam గానే. తక్కువ పదాల్లో “Rivers don’t go reverse ” లా, మీరో వెను తిరగని నది , మీతో ముందుకు పరుగుల్ తీసే సారంగ ప్రవాహం.

    వ్యక్తుల ఎంటైర్ వ్యక్తిత్వాలు తరచి తరచి చూసినా ,ఏదో ఒక ఆలోచన ,ఒక భావజాలం , ఒక క్షణపు భావోద్వేగాలలో చూపే అసలు సిసలు లోపలి మనిషి జలక్ పట్టుకొని not my genre of personalities to be friends with అని తెంపుకున్న తెంపరి తనం లో , He is there , he will be there, and most definitely he won’t change like other windy people భరోసా ఇచ్చినందుకు బోల్డు బోల్డు షుక్రియాలు 😘 .

    Thank you for being there and thanks for making all these saranga efforts . Nothing is complete without teamwork , so kudos to your team too.

    నిశీధి !

  • పద్దెనిమిదికి పైగా నా ” బర్మా కేంప్ ” కథలు ప్రచురించి నన్ను ప్రోత్సహించిన
    సారంగ కు వేనవేల అభినందన వందనాలు.

    హరి వెంకట రమణ

  • అంతర్జాల ప్రపంచంలో తెలుగ సాహిత్యం విస్తరించటం మొదలెట్టి వేళ్ళూనుకోవడం మొదలెట్టిన తర్వాత వాసిలో రాశిలో నాణ్యతలో ప్రజాభిప్రాయ విస్తలణలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన మాగజైన్స్ లో సారంగ అగ్రస్థానంలో వుంది. నాకు అంతర్జాల సాహిత్యప్రపంచంలో అడుగుపెట్టేందుకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన చెప్పుకోదగ్గ పత్రిక లలో ఒకటి. అఫ్సర్ గారికి కల్పనారెంటాలగారికి శతకోటి అభినందనలు. స్థిరోభవ వరధోభవ, మూడుపూవులు ఆరుకాయలుగా బహుధా విస్తరించాలని ఆశ, ఆకాంక్ష.

  • పది సంవత్సరాలు దాటి పదకొండులోకి అడుగుపెడుతున్న సారంగకి శుభాకాంక్షలు.నాకు సారంగ గురించి రెండేళ్లక్రిందటే తెలిసింది. మీ రేగులారిటీ – అంటే సరిగ్గా పదిహేను రోజులకి రచనల్ని పోస్ట్ చేయడం బాగా నచ్చింది. మీరందరు సమిష్టిగా చేసే సాహిత్య సేవకి జోహార్లు.

  • పదకొండవ యేట అడుగుపెట్టిన సారంగకు శుభాకాంక్షలు. తెలుగు భాషా సాహిత్యాలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠకులను పెంచుకుంటూ సారంగ ముందుకు వెళ్లడం శుభపరిణామం. ఇదొక విజయం. సారంగ నిబద్ధతతో చేస్తున్న సాహిత్య సేవ ఫలితంగా దక్కినదే ఈ విజయం. తెలుగు భాషను, సాహిత్యాన్ని రక్షించుకోవడానికి సారంగ నిరాటంకంగా కొనసాగాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది. 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు